చేతిచలిమిడి
డా|| జి. వి. పూర్ణచందు
“కొయ్యన్న
కొఱ్ఱచేను దంచన్న పిండి
పొయ్యన్న నూనె వదిన వెయ్యన్న బెల్లం
చేట తడిగాకన్న చెయ్యంటకన్న
చేతి చలిమిడి చేసి నాకు బంపు వదిన”
ఓ జానపద గీతంలోని ఈ చరణం
చేతిచలిమిడి ఎలా చెయ్యాలో చెప్తోంది. కొర్రపిండి, బెల్లం,
కొద్దిగా నూనెతో చేటకి తడి కాకుండా చెయ్యంటకుండా ‘చేతిచలిమిడి’ చేసి పంపమని
మరిది వదినని కోరతాడీ పాటలో.
మర్దించిన కొద్దీ ఈ పిండి చేతికి
అంటుకోకుండా నున్నటి ముద్దగా చపాతీపిండిలా చేస్తే అదే చలిమిడి. మృదుత్వం కోసం ఈ పిండిని రోట్లోవేసి దంచేవారు కూడా!
“ఉలూఖల
శేష న్యాయం’ అంటే
రోట్లో దంచగా రోలుకు అంటుకుని ఉన్నదని సంస్కృత న్యాయం ఒకటుంది. దానికో సరదా కథ కూడా ఉంది. అత్తగారు చలిమిడి పెడితే
తింటానికి మొగమాటపడి ఓ కొత్తల్లుడు రోట్లో తలదూర్చి అందులో మిగిలిన చలిమిడి
నాకాడట!
బియ్యం లేదా చిరుధాన్యాలను వేటినైనా
నానబెట్టి దంచిన పిండితో చలిమిడి చేసుకోవచ్చు.
దంచిన ధాన్యాన్ని ‘చేరుళ్లు’, ‘దంగుళ్ళు’ అనీ, చెరిగి కడిగి
ఎసట్లో వెయ్యటానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని ‘ఎసటిపోతలు’,
‘సడింపులు’ అనీ
పిలుస్తారు. ధాన్యాన్ని కొద్దిసేపు ఉడకనిచ్చి ఎండించిన ధాన్యాన్ని ‘ఉప్పిళ్లు’ అంటారు.
ఈ పేర్లన్నీ ఒకప్పుడు వాడకంలో
ఉన్నవే! ఇప్పుడు వాడకంలోంచి తప్పుకోవటానికి బియ్యాన్ని దంచటమూ, ఎసట్లోబియ్యాన్ని
పొయ్యటమూ అన్నీ మనం చేస్తూనే ఉన్నాం కానీ వాటి పేర్లని మాత్రం మరిచిపోయాం.
“అలా మరిచిపోవటానికి తెలుగంటే
చిన్నచూపు, తెలుగులో మాట్లాడటం అంటే నామోషీలే కారణం. ఇదితాతల కాలంలో మొదలైంది.
తండ్రులకాలానికి సాంస్కృతిక వారసత్వం సగం
మాత్రమే అందింది. వారినుండి మా కాలానికి వచ్చేసరికి ఆ సగంలో సగం కూడా రాలేదు. మా
నుండి మా పిల్లలకు ఏమీఇవ్వలేకపోయాము, మా పిల్లలు వారి పిల్లలకు ఇచ్చేందుకు
సాంస్కృతిక వారసత్వం ఏదీ మిగలకుండా పోతోంది...” అని బాధపడ్తున్నారు ఈ తరంలో
పెద్దవాళ్లు.
“పిణ్డిర్నా
పిష్ఠధానాది చూర్ణే” వ్యుత్పత్తి
ననుసరించి ‘పిండి’ అనే పదం కూడా
సంస్కృత పదమే అవుతుంది. ఒకవేళ పిండి సంస్కృతపదం అయితే, తెలుగువారికి పిండికొట్టటం
తెలీదా? అది కూడా ఉత్తరాదివారి నుండి నేడ్ర్చుకోవల్సి వచ్చిందా? పిండికి సరైన
తెలుగుపదం లేదా??
ద్రావిడభాషల్లో iḍ అనే పదం
పగలకొట్టడం, దంచటం
అనే అర్థంలో ఉంది. తమిళంలో ‘ఇటి’
అంటారు. తెలుగులో ఇడియు, ఇడిసిపోవు
ప్రయోగాలు ఈ అర్థంలోనే ఏర్పడ్డాయి. ఇడి
అంటే దంచిన పిండి. పిండికి సమానమిన తెలుగుపదం ఇడి. ఇడితో వండిన భక్ష్యాల్లో
ఇడ్డెనలు, చలిమిడి ప్రముఖమైనవి.
కాశీఖండంలో శ్రీనాథుడు "బుడుకులు నడుకులు నిడియు జలిమిడియును."
అంటూ ఇడి, చలిమిడి
అనే రెండు భక్ష్యాల్ని ప్రస్తావించాడు.
ఇక్కడ ఇడి అంటే ఆవిరి మీద వండిన ఇడ్లీ లాంటివి కావచ్చు. వీటిని ఇడికుడకలు అనేవారు. చలిమిడిలో ఇడి అంటే దంచిన పిండి (సత్తు) అని!
మరి ‘చలి’
ఏమిటి? చలి
అనేది చలువని సూచించే పదం.
చలికూడు:
పొద్దున్నే తినే చలిది-పెరుగన్నం
చలి వెలుగు: చంద్రుడి వెలుగు,
చలివాలు: నీరంతా ఇగిరేలా చిక్కగా
కాచి చల్లార్చిన పాలు
చలిపందిరి: చల్లని చల్ల అందించే
చోటు,చలివేంద్రం
చల్మిరి: చల్లగా ఉండేది ఇలా చలి
శబ్దం చలవ నిచ్చే వాటికీ, చల్లగా ఉండేవాటికి వర్తిస్తోంది.
చలిమిడి కూడా ఈ రెండు అర్థాలలోనే
ఏర్పడింది కావచ్చు.
చలిమిడి, చలివిడి, చల్మిడి,చల్విడి
ఈ పదాలకు బెల్లం, బియ్యం కలిపిన పిండి అని అర్థం. జాగ్రత్తగా పరిశీలిస్తే దంచిన
లేదా విసిరిన బియ్యంపిండిలో బెల్లాన్ని మెత్తగా చేసి పాలుగానీ నీళ్లుగానీ కలిపి
బాగా మర్దిస్తే అది చలివిడి లేదా చలిమిడి. ఇక్కడ చలి అంటే బెల్లాన్నోపంచదారనో
పాకంపట్టి కలపలేదని అర్థం అవుతోంది.
పొయ్యిని ఉపయోగించకుండా తయారు
చేసినది చలిమిడి. దీన్నే చలిపిండి, సలిబిండి అనికూడా పిలుస్తారు.
నాగుల చవితి రోజున ఈ చలిమిడిని పాము
ఆకారంలో చేసి, పాలతో
అభిషేకం చేస్తారు. ఆ రోజు చలిమిడి, చిమ్మిరి, వడపప్పు తిని
ఉపవాసం ఉంటారు.
అయితే, పాకంపట్టి అరిసెలు, బూరెలు
వండుకోవటానికి కలిపిన పిండిని కూడా చలిమిడి అనే అంటున్నాం. ఈ రెండింటినీ
వేర్వేరుగా చెప్పటం కోసం పాకం పట్టిన అరిసెలపిండిని చలిమిడి అని, పాకం పట్టని
చలిమిడిని చేతిచలిమిడి అనీ పిలిచి ఉంటారని ఒక ఊహ చేయవచ్చు.
చేతిచలిమిడి లేదా చలిపిండిని,
వడపప్పుని (నానబెట్టిన పెసరపప్పుని) కొద్దిగా తిని నాయనమ్మలు పూర్వం ఉపవాసం
పాటించేవారు. తక్కువ కేలరీలతో ఎక్కువ కడుపునిండే సాధనం ఇది.
చలిమిడి, మండపప్పు తిని పస్తుండటం
అనేవారు ఈ విధానాన్ని ఆ రోజుల్లో!
పాలు, నెయ్యితో ముద్దగా చేసిన
చేతిచలిమిడి తక్షణం తయారు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది.
కానీ, అరిసెల చలిమిడి
లాగా నిలవుండదు.
చేతిచలిమిడితో గానీ, అరిసెల
చలిమిడితో గానీ చిన్న పుల్కాలు వత్తి నిప్పులమీద కాల్చి నెయ్యి రాసి పెడితే
పిల్లలు చాలా ఇష్టంగా తింటారు! శరీరానికి కాంతినిచ్చి పోషించే గొప్ప భక్ష్యం ఇది.
వీటినే ‘సుకియ’లని పిలిచేవారు. మనం ఆ వంటకాన్ని, దాని పేరును కూడా
మరిచిపోయాం.
స్వభావం రీత్యా చలిమిడి ఆలస్యంగా
అరిగేది కాబట్టి బలమైన జీర్ణశక్తి ఉన్నవారిని ఇబ్బంది పెట్టదు. ఉపవాసంలోనో,
ప్రయాణాల్లోనో తింటానికి వీలుగా ఉంటుంది. ఆకలి, దప్పికలు తీర్తాయి.
చలిమిడి తిన్నాక వేణ్ణీళ్లు గానీ
అల్లం కలిపిన మజ్జిగ్గానీ తాగితే తేలికగా అరుగుతుంది.
ఏ ధాన్యంతో చేస్తే ఆ ధాన్యం గుణాలు
ఆ చలిమిడికి ఉంటాయి.
దంపుడు బియ్యంతో గానీ, చిరుధాన్యాలతో చేసిన చలిమిడి ఎక్కువ మేలు కలిగిస్తుంది. చలిమిడి మన
సంస్కృతిలో ముఖ్యమైంది కూడా! శుభానికి ఇది సంకేతం. పెళ్లిళ్లలో దీని ప్రాధాన్యత
ఎక్కువ.
అమ్మాయిని అత్తవారింటికి పంపే
సమయంలో చలిమిడిని, సారెసత్తుని (జంతికలు) వొళ్లో పెట్టి
పంపుతారు.
చలిమిడి తినదగిన భక్ష్యమే!
చలవనిస్తుంది. పాకం చలిమిడి కన్నా చేతిచలిమిడే ఒకింత మేలు, కానీ, మైమరచి తినాలంటే పర్వతాలు ఫలహారం చెయ్యగల
జీర్ణశక్తి కావాలి.
No comments:
Post a Comment