ఇంజనీరింగ్ తెలుగులోనే మేలు
డా|| జి. వి. పూర్ణచందు, 9440172642
‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’(AICTE) సంస్థ చైర్మన్ అనిల్ సహస్ర బూధే 2021 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్యను మాతృభాషలో చదవటానికి దేశవ్యాప్తంగా 44% విద్యార్థులు సంసిద్ధత వ్యక్తపరచినట్టు ఒక సర్వే నివేదికను ప్రకటించారు. వీళ్లంతా ఇంగ్లీషు మీడియంలో 12వ తరగతి వరకూ చదివిన వాళ్లే! ఇంజనీరింగ్ విద్య విషయంలో వీళ్లు మాతృభాషను కోరుకోవటానికి కారణం ఏమిటీ?
తెలుగు రాష్ట్రాల్లో యన్నారై ఇన్‘స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విజయవాడ) వారు 60మంది విద్యార్థులతో తెలుగు మాధ్యమంలో ఒక ఇంజనీరింగ్ కోర్సు నడపటానికి సంసిద్ధత ప్రకటించిన తాజావార్త తెలుగు భాషాభిమానులకు ఆనందం కలిగించింది. భవిష్యత్తులో అత్యున్నత చదువులు, ఉద్యోగాలకు సంబంధించిన పరిక్షలు మాతృభాషల్లోనే జరగనున్నాయి. తెలుగు ఇంజనీర్లకు ఇంగ్లీషు మాధ్యమంలో చదివిన వారికన్నా ఎక్కువ అవకాశాలు కలుగుతాయి కూడా! ఐఐటీ, ఎన్ఐటి విద్యాసంస్థలు కూడా మాతృభాషా మాధ్యమంలో ఇంజనీరింగ్ బోధించటానికి సంసిద్ధత వ్యక్తం చేయటం ఒక శుభపరిణామం. కాబట్టి, ఇంగ్లీషుమీడియంలో చదివే వారు అధికులనే భావనకు రోజులు చెల్లాయి.
తెలుగులోనే ఎక్కువ సైన్సు వస్తుంది!
ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడగలగటం, ఇంగ్లీషులో శాస్త్రసాంకేతిక విషయాలు చదవగలగటం రెండూ వేర్వేరు అంశాలు. ఆంగ్లం మాట్లాడటం వస్తే చాలు, ఙ్ఞానం వచ్చినట్టేనని కార్పోరేట్ విద్యాసంస్థలు ఒక భ్రమకల్పించాయి. సంస్కృతాన్ని కూడా ఆంగ్లంలో చదివించి మార్కులు ర్యాంకులు సాధించిన ఘనులు వీళ్లు. ఇంగ్లీషు బాగా రావాలంటే, ఆ భాషని ప్రత్యేకంగా చదవాలి. ప్రతీ సబ్జెక్టునీ ఇంగ్లీషులో రుద్దాల్సిన అవసరం లేదు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(NEET) నిర్వహించిన పోటీ పరిక్షల్లో మాతృభాషల్లో వ్రాసిన వారి సంఖ్య 20% కన్నా మించలేదని చెప్తున్నారు. డిగ్రీస్థాయిలో మాతృభాశా మాధ్యమంలో బోధన జరపకుండా ఉన్నతస్థాయి పరిక్షల్ని తక్కువమందే స్థానిక భాషల్లో వ్రాశారంటూ, మాతృభాషల్లో ఇంజనీరింగ్ చదువుని అడ్దుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారతీయ విద్యావిధానం (NEP-2020) ప్రకారం వైద్యవిద్య, సాంకేతిక విద్య, న్యాయవిద్య మొదలైన వాటిని మాతృభాషలో బోధించటం అనేది ఈ విద్యా సంవత్సరం నుండీ మొదలు కావాలి. ఇందుకు కావలసిన రోడ్ మ్యాపు రూపొందించేందుకు వేసిన సన్నద్ధక కమిటీ గత ఏడాది చివర్లో మాతృభాషలో సాంకేతిక విద్యల్ని బోధించటానికి చాలా కసరత్తులు చేసింది.
“మనిషి మనసు మాతృభాషలో రూపొంది ఉంటుంది కాబట్టి, ఎంత జటిలమైన శాస్త్ర విషయాన్నైనా మాతృభాషలో తేలికగా గ్రహించ గలుగుతుంది. అందువలన విద్యార్థి ఎక్కువ ఙ్ఞాన సంపన్నుడౌతాడనే” సూత్రం ఈ నిర్ణయానికి మూలకారణాలలో ఒకటిగా ఈ నివేదిక పేర్కొంది. ఇందుకు ఫ్రాన్స్, జెర్మనీ, రష్యా, చైనా ల్లాంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలను ఆవలంబనగా సూచించింది. మాతృభాషలో సైన్సునేర్చుకుంటే ఎక్కువ ఙ్ఞానం కలుగుతుందని ఈ దేశాల అనుభవం చెప్తోంది.
పారిభాషిక పదాలను మార్చకండి!
శాస్త్రపరంగా భాషకు సంబంధించి రెండు అంశాలుంటాయి. మొదటిది సాంకేతిక పదాలు. రెండవది ఈ సాంకేతిక పారిభాషిక పదాలను వివరించే అనుసంధాన భాష. పారిభాషిక పదాలనేవి విశ్వజనీనమైనవి. వాటిని ఎవరూ మార్చకూడదు. అనుసంధాన భాషను మాత్రమే మాతృభాషలో బోధిస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి, వివరణ వరకూ తెలుగులో బోధించటం, అర్థం చేసుకోవటం రెండూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకూ ఇద్దరికీ తేలికైన పని! దాన్ని మాతృభాషలో చదివితే ఎక్కువ ఙ్ఞాపకం పెట్టుకో గలుగుతాడు. ఆంగ్లంలో బోధిస్తే, వాళ్లు ఆ ఆంగ్ల పదాలకు అర్థాలు వెదుక్కోవటానికే ఎక్కువ శ్రమపడుతూ, సైన్సుని గ్రహించలేక పోతున్నారు. అదే మాతృభాషలో బోధిస్తే సైన్సు మీద దృష్టి పెట్టటానికి ఎక్కువ ఙ్ఞాన సంపన్నులు కావటానికి అవకాశం ఉంటుంది.
నిజానికి శాస్త్ర సాంకేతిక పారిభాషిక పదాల కమీషన్ (CSTT) గత సంవత్సరమే శాస్త్రగ్రంథాలను తెలుగులో రూపొందించటానికి నిధులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సహకరించే జాతీయ అనువాద సంస్థను (NTM)ను భారతీయ భాషల కేంద్రం (CIIL) ఏర్పాటు చేసింది. అలాగే, యూజీసీ పక్షాన కూడా నిధులు అనేకం ఇందుకోసం ఉన్నాయి. తెలుగు మేథావులు ఇందుకు ఎంతవరకూ సన్నద్ధులై ఉన్నారో తెలీదు.
‘ఒక ఙ్ఞానం-అనేక నైపుణ్యాలు’
సైన్సు తెలిసి ఉండటం ఙ్ఞానానికి సంబంధించిన విషయం కాగా, మాతృభాష, ఆంగ్లం, ఇతర దేశాల భాషలు తెలిసి ఉండటం నైపుణ్యానికి (skill) సంబంధించిన విషయం. ‘ఒక ఙ్ఞానం-అనేక నైపుణ్యాలు’ ఉన్నప్పుడే మెరుగైన భవిష్యత్తు కలిగే రోజులు ఇవి. ఇంగ్లీషు ఒక్కటి వస్తే ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందనేది అపోహే! ఏ దేశంలో నైనా ఆ దేశపు స్థానిక భాష వచ్చిన వారికి ఉన్నంత సౌలభ్యం ఇంగ్లీషు మాత్రమే వస్తే చాలనుకునేవారికి ఉండదు. చైనీ మాండారిన్, జెర్మనీ, పోర్చుగీసు, ఫ్రెంచి, జపనీస్, స్పానిష్, కొరియా, అరేబిక్, హిందీ, రష్యన్ భాషల్లో ఏదైనా భాషతో పరిచయం ఉన్నవారికి కేవలం ఇంగ్లీషు మాత్రమే వచ్చిన వారికన్నా ఎక్కువ అవకాశా లుంటాయి. ఈ రహస్యాన్ని మరుగుపరచి ఇంగ్లీషుతో కాలక్షేపం చేయిస్తున్నారు మన విద్యావేత్తలు. ఇంగ్లీషు రావటానికి మాతృభాష ఎప్పుడూ అడ్డం కాదు. ఇతర దేశాల భాషలు నేర్వటానికి మాతృభాష సహకరిస్తుంది కూడా!
కంప్యూటరుని తెలుగులో ఏమంటారు? మౌసుని తెలుగులో ఏమనాలి? ఇలాంటి ప్రశ్నలు అనవసరమైనవి. కంప్యూటర్ని తెలుగులో ఏదో అనాలని ప్రయత్నించి చివరికి సంస్కృతాన్ని ఆశ్రయించి గణకయంత్రం అని అనువదించే చదువుల వలన విద్యార్థికి ఒరిగేదేమీ ఉండదు. సాంకేతిక పారిభాషిక పదాలను అనువదించే అనవసర శ్రమ పడకుండా వాటిని యథాతథంగా నేర్చుకుంటూ, వాటి వివరణను మాత్రమే మాతృభాషలో నేర్చుకుంటే ఎక్కువ సైన్సు అర్థం అవుతుంది. తెలుగులో ఇంజనీరింగ్ బోధనను ఈ కోణంలోంచి చూస్తే ఎక్కువ లాభదాయంకంగా ఉంటుంది.
*
(30-07-2021 ఆంధ్ర ప్రభ దినపత్రిక మెయిన్లో ప్రచురితం)