Monday 11 April 2022

భీమపాకాలు డా|| జి వి ఫూర్ణచందు

 భీమపాకాలు డా|| జి వి ఫూర్ణచందు

చింపి వల్కము లేమి చేసెడిదన, కావు\నెరవైన కండ మండెగలు గాని
తెగిన జందెములేల తెచ్చెదరన, కావు\వినుడివి సన్న సేవియలు గాని
ఔదుంబరము లనర్హము లొల్ల మన, కావు\నమలిచూడుడు మోదకములు గాని
ఫేన పుంజము లేల పెట్టెదరన, కావు\నీ పాదమాన ఫేనికలు గాని
అంచు వాచంయములు పల్క అబ్జముఖులు/నగుచు ఒడబడి చెప్ప అందరు యథేష్ట
రుచులు భుజియించి, వార్చి కర్పూర వీటి/కా సుగంధ ప్రసూన సౌఖ్యములు దనిసి...
పిల్లలమర్రి పినవీరభద్రుడు క్రీ శ. 1450 తరువాతి వాడు. "వాణి నా రాణి' అనగలిగిన గొప్ప కవి. "శృంగార శాకుంతలం" , "జైమినీ భారతం" గ్రంధాలు వ్రాశాడు. జైమినీ భారతంలో తన కాలపు తెలుగు వంటకాల రుచిని ఈ పద్యంలో చవిచూపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు ఏర్పాటు చేసిన షడ్రోసోపేతవిందుకు భీముడు వంట-వడ్డన ఏర్పాట్లు చూస్తున్నాడు. ఆ విందుకు కొందరు మునులూ వచ్చారు. కందమూలామాత్రమే తినే ఆ మునులకు ఈ విందులో వడ్డించిన కమ్మని వంటకాలు అవేమిటో తెలియక తికమక పడుతుంటే, భీముడు వాటి గురించి వివరించి చెప్పటం దీని సందర్భం.
ఇవి గుడ్డపీలికలా?’, ‘జందెపు తునకలా’, ‘మేడిపండ్లా?’ ‘పాల నురుగా? ఇలా అడుగుతుంటే భీముడి వివరణ ఇది:
1. చింపి వల్కము లేమి చేసెడిదన, కావు నెరవైన కండ మండెగలు గాని: చింపిన నారబట్టలనుకోకండి, చక్కెరతో చేసిన మండెగలు
ఇవి అన్నాడు భీముడు. పరోటాలను అనేక మడతలు వేసి కాల్చి రెండు చేతుల్తో నొక్కితే గుడ్డపీలికలుగా అవుతాయి. ఇంగ్లీషువాళ్లు పరోటాల్ని ‘బుషప్ షర్ట్’ చిరిగిన చొక్కా అని పిలుస్తారందుకే! గుడ్డపీలికల్లా కనిపించిన ఈ తీపి మండెగలు కూడా అలాంటివే.
2. తెగిన జందెములేల తెచ్చెదరన, కావు నుడివి సన్న సేవియలు గాని: తెగిన జందెపు పోగులనుకోకండి, ఇవి గోధుమపిండితో
చేసిన సన్న సేవియలు అంటే సేమ్యా నూడుల్స్.
3. ఔదుంబరము లనర్హము లొల్ల మన, కావు నమలిచూడుడు మోదకములు గాని: ఇవి మేడికాయలు కాదు, లోపల తీపి పూర్ణం
పెట్టి చేసిన మోదకాలు. తిని చూడండి, కమ్మగా ఉంటాయి.
4. ఫేన పుంజము లేల పెట్టెదరన, కావు నీ పాదమాన ఫేనికలు గాని: దూదిపింజల్లా నురుగులుగా కనిపించే తీపిపదార్థాలివి. వీటిని
ఫేనికలు (తెలుగులో నురుగులు) అంటారు. మెత్తగా విసిరిన పంచదార పొడిని కరకర పూరీల పైన పట్టిస్తే అవి నురుగుల్లా కనిపిస్తాయి. ఫేనము అంటే నురుగు కాబట్టి వీటిని ఫేనిక లన్నారు.
ఇలా ఆ మహనీయులైన మునులకు వివరంగా భీముడు చెప్పి ఒప్పించాడు. అందరూ వాటిని కమ్మగా ఆరగించారు. ఆ
తరువాత పచ్చకర్పూరం వేసిన తాంబూలం కూడా సేవించారట.
500 యేళ్లనాటి తెలుగు ప్రజలు తీపి పరోటాలు, సేమ్యా నూడుల్సు లాంటి వంటకాలను తిన్నారని ఈ పద్యం సాక్ష్యం ఇస్తోంది. అవేవో పాశ్చాత్య సంస్కృతిలోంచో, చైనా నుంఛో, మొగలాయీల నుంచో మనకు వచ్చాయనే అభిప్రాయంలో వాటిని ఇష్టంగా తింటున్నా రిప్పటి యువత. కానీ, అది అపోహే! వాటిని తరతరాలుగా మన పూర్వులు తింటూ వచ్చారని ఈ పద్యం చెప్తోంది. ‘నురుగులు’ అనే వంటకాన్ని మనకన్నా కన్నడిగులు బాగా వండుకుంటున్నారు. ఒకప్పుడు అవి తెలుగువారి స్పెషల్. ఆవుపాలలో పంచదార వేసి గుజ్జుగా కాచిన క్రీముతో జమిలి మండిగలు అంటే బర్గర్ల మాదిరిగా చేసిన అప్పచ్చుల మీద డిజైను వేస్తే, పెళ్ళికూతురు కట్టిన తెల్ల చీర జరీ అంచులా ఉన్నదంటాడు శ్రీనాథుడు. ఇప్పుడు మనవాళ్లు కేకుల మీద క్రీముతో డిజైన్లు వేస్తున్నారు కదా!
మనకన్నా ఆరోగ్యదాయకంగానే జీవితాన్ని మన పూర్వులు ఆనందించారని దీని భావం..
‘భీమపాకాలు’ 10/4/2022 ఆదివారం ఆంధ్రజ్యోతిలొ తినరా! మైమరచి!! శీర్షికలో ప్రచురితం:
May be an image of flower and text
Sreekantha Sarma Palaparthi
1 Share
Like
Comment
Share