Sunday, 5 October 2014

ఆకర్షించటం ఎలా? డా. జి వి పూర్ణచందు

ఆకర్షించటం ఎలా?
డా. జి వి పూర్ణచందు
ఇతరుల చేత తాను ఆకర్షించబడాలనే కోరిక మనుషులందరికీ ఉంటుంది. ఆకర్షించ గలిగిన వాణ్ణి జెంటిల్మాన్ అంటారు.
How to be charming and liked by everyone అనేది ఒకమంచి చర్చనీయాంశం.
లైక్ అనే పదానికి ఒకప్పుడు ఎంత విసృతమైన అర్థం ఉండేదో గానీ, ఇప్పటి రోజుల్లో లైక్ చేయటం అనేది చాలా స్వల్ప విషయం. ఐ లైక్ యూ, ఐ లౌ యూ అనే పదాలకు ఇప్పుడు కొంపలంటుకుపోయే అర్థాలేమీ లేవు. ఫేస్బుక్లో ఒక ఐటం పెట్టగానే ఎక్కువమంది లైకులు కొట్టాలని కోరుకోవటం లాంటిదే ఇది. మనం పోష్టు చేసిన లేదా మనం షేర్ చేసిన అంశానికి ఎక్కువ లైకులొస్తే గొప్పగా భావించుకుంటారు ముఖేషులు అంటే ముఖపుస్తక ప్రియులు అనగా ఫేసుబుక్ లవర్లు.
ఐ లైక్యూ, ఐ లౌ యూ అనే మాటలకు ఈ రోజుల్లో పెద్ద అర్థాలు వెదికి అనవసరమైన గాభరా పడాల్సిన పనిలేదు. లైక్ అన్నా, లౌ అన్నా బావుందని చెప్పటమే ఇక్కడ ప్రధానాంశం. ఐ లౌ యూ అనకపోతే యాసిడ్ పోస్తాననే వాడికి ఆ మాటలో వాడనుకున్న అర్థం ఇప్పుడు లేదు. పక్కింట్లో కుక్కపిల్లను చూసి ఇంటి పక్కన ఓ అమ్మాయి “ఓహ్! బాబీ... ఐ లౌ యూ...” అంది.  అంచేత ఆకర్షణ అనేదానికి నిర్వచనాన్ని కుదించి చెప్పటం కష్టమే!
పెళ్ళి చూపుల్లో పెళ్ళికొడుకు బావుందని చెప్పటం ఫేస్బుక్‘లో లైక్ కొట్టటం కన్నా గొప్పదేం కాదు. ఎందుకంటే పెళ్ళికూతురు కూడా లైక్ కొట్టాలి కదా! అది ఈ రోజుల్లో అబ్బాయిలకు అంత తేలిగ్గా దొరకటం లేదు.
లైక్ అంటే దేనికైనా లైకేనా? దేనికైనా ఇష్టపడాలనే మనుషులు ఆకర్షణీయంగా తయారౌతారా? ఆకర్షణీయత అనటంలో లైంగిక సాధకత, సెక్సు ప్రయోజనం, కుతి తీరటం అనే అంశాలు ఇమిడి ఉన్నాయా? అసలు ఆకర్షణీయత అంటే ఏవిటీ...? ఆకర్షించబడటం దేనికీ? ఆడయినా మగయినా, ఆకర్షించబడే గుణం అనండి. లక్షణం అనండి. తీరు అనండీ, అది సహజ సిద్ధంగా ఉంటుంది. ఉన్నదాన్ని పెంపొందింప చేసుకోవటానికే మనిషి పడే ఈ పాట్లన్నీ!
కొందరి ముఖ కవళికలు, కొందరి నడక, కొందరి నడత, కొందరి మాట, కొందరి మంచి ఈ ఆకర్షణలకు కారణం అవుతాయి. కొందరిని చూస్తే పెట్టబుద్ధి, కొందరిని చూస్తే మొట్టబుద్ధీ అవుతాయనే తెలుగు సామెత ఇక్కడ చక్కగా వర్తిస్తుంది. ముఖ సౌందర్యం, తల పైన కప్పుకు మేకప్పు, రంగురంగుల వస్త్రధారణలే ఆకర్షణకు హేతువు అనే నమ్మకంతో వాటికి ప్రాధాన్యత ఇస్తుంటారు ఎక్కువమంది.
ఆకర్షణీయంగా ఉన్నస్త్రీలంతా పురుష సౌఖ్యం పొందుతున్నారా...? ఆకర్షణీయ పురుషులు స్త్రీ సుఖాన్ని ఆస్వాదించ గలుగు తున్నారా...? ఆకర్షణకూ సెక్సుసుఖానికీ సంబంధం ఉన్నదా...? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదకటం కూడా అవసరమే!
అత్యాధునిక సమాజంలో పెళ్ళిళ్ళనేవి కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతున్నవే ఎక్కువ. కానీ, పెళ్ళయిన ఏడాది తిరక్కుండానే విడాకులకు పోతున్న వారి సంఖ్య వాటిలో సగానికి పైగా ఉంటోన్నదంటే ఆకర్షణ సిద్ధాంతం ఎక్కడో దెబ్బతిందనే అర్థం.
ఆకర్షణ అశాశ్వతం అయిపోతోంది. ఆకర్షణీయమైన విషయాల సంఖ్య తగ్గిపోవటం వలన ఆకర్షణ కొనసాగ లేక పోతోంది. స్త్రీ పురుషులు ఆకర్షణీయతని కలకాలం తమ మధ్య నిలుపుకునే లాగా కొనసాగింప చేసుకోవాల్సిన ఒక నిరంతర ప్రక్రియ. కంప్యూటర్లో ఒక యాప్ని అప్డేట్ చేసుకున్నట్టే ఆకర్షణని ప్రతిమనిషీ నిలుపుకుంటూ, నిలబెట్టుకుంటూ సాగి పోగలగాలి.
రింగులు ఒదులుతూ సిగరెట్టు త్రాగటం, మద్యం సీసా జేబులో పెట్టుకుని కనిపించటం, నడుము దగ్గర్నించీ పిర్రలదాకా వెనకవైపు కనిపించేలా టక్ చెసుకుని తిరగటం, గుండీలు ఊడదీసిన బంటులాగా కనిపించటం ఇలాంటి వాటిని అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారని కొంతమంది కుర్రాళ్లలో బలమైన నమ్మకం ఉంది. హీరోల చేత ఇలాంటి పనులు చేయించి ఆ సందేశాన్ని ఆడపిల్లల్లో ఎక్కించటానికి కొందరు సినిమాల వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కుర్రాళ్ళు మాత్రం వాటిని నమ్ముతున్నారు.
నిజానికి ఆకర్షించబడటం  “Attracting attention” అనేది కుర్రాళ్లకే కాదు, నడివయసు వాళ్ళకీ, ఆమాట కొస్తే వృద్ధులక్కూడా అవసరమే! ఆకర్షణీయతని సెక్సు పరిథి నుండి ఇవతలకు తీసుకొస్తే, అది వ్యక్తిత్వ వికాస పరిధిలోకి వస్తుంది. సెక్సులో విజయం కూడా వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమే  కదా! ఆకర్షణీయతను కోల్పోకుండా కాపాడుకో గలగాలనేదే చెప్పవలసింది.
స్వంత డబ్బా కొట్టుకునేవాళ్ళు త్వరగా ఆకర్షణను కోల్పోతారు. ఇతరులు ఇష్టపడే విషయాలను గమనించుకోకుండా ఏకథాటిగా మాట్లాడుతూ పోయేవాడు కూడా త్వరగా ఆకర్షణను కోల్పోతాడు. ఎదుటివారికి ఇష్టమైన విషయాలే మాట్లాడటం ఆకర్షణను నిలుపుకునే ఒక మంచి ఉపాయం. మన ఆలోచనలు పాజిటివ్ గా ఉన్నంతకాలం మన ముఖంలో కళలన్నీ పాజిటివ్ గా ఉంటాయి. చిరునవ్వు చిందే ముఖానికి ఆకర్షణ ఎక్కువ నిలుస్తుంది. ముఖంలో సంతోషం మనసులో సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది.
incessant flirt అంటే, అదేపనిగా సరసా లాడటం వలన లోకువ అవటమే తప్ప ఫలితం ఉండదంటాడు ఒక ఆంగ్ల రచయిత. సరసానికి లోను కాకుండా సరసాలాడే టెక్నిక్కులు తెలుసుకోవాలని ఆడవాళ్లకు ఉద్బోధిస్తాడు. How to flirt with a guy without really flirting అనే పుస్తకంలో ఈ విషయాలు లోతుగా చర్చించాడు. వల వెయ్యటం, వలపించటం, వదిలించుకోవటం అనే మూడు విద్యల్లోనూ ఆరితేరిన వాళ్ళకు ఆకర్షణీయత సహజ శోభనిస్తుందని ఈ రచయిత అభిప్రాయం.
పురుషుడు ఆకర్షణీయంగా ఉన్నాడని స్త్రీలు చూడంగానే అనుకుంటారని, అమాంతం పడిపోతారనీ, ఫ్లాట్ అయిపోతారనీ చాలా మంది మగాళ్లకు ఒక దురాశ సహజంగా ఉంటుంది. ఎక్కువమంది స్త్రీలునీ, వెర్రిమొర్రి విచిత్ర క్రాఫింగుల్నీ, చెవి రింగుల్నీ, ముక్కు పుడకల్నీ చూసి సినిమాల్లో హీరోయిన్లు ఫ్లాట్ అవుతారేమో గానీ, నిజజీవితంలో అలా ఉండదు.
ఒక పెద్ద గుంపులో ప్రత్యేకంగా అనిపించిన, ప్రత్యేకంగా కనిపించిన, ప్రత్యేకంగా వినిపించిన వ్యక్తి స్త్రీల దృష్టిలో ఆకర్షణీయుడు. ఒక్కోసారి ఆడవాళ్ళ అంచనా తప్ప వచ్చు. అందుకనే, ఆకర్షించబడిన వ్యక్తి సహృదయుడౌతే, అది అతనికి ఒక అవకాశం. హృదయం లేని వాడైతే అది అతని అదృష్టం. అవకాశాన్ని దక్కించుకోవాలో, అదృష్టాన్ని చేజిక్కించుకోవాలో ఆ మగాడే నిర్ణయించుకోవాలి! ఇతరులకన్నా తమని తాము తక్కువ చేసుకుని ఆలోచించే గుణం ఆడవాళ్ళలో అరుదు. అందుకని ఆకర్షణీయత విషయంలో ఆడవాళ్ల అంచనాలు ఇతరులకు అందనంతగా ఉంటాయి. అది తెలియక మగాళ్లు ఆకర్షించబడ్దామనుకుని బోల్తాపడుతుంటారు.
ఒక పురుషుడు స్త్రీని పరిచయం చేసుకున్నప్పుడు గానీ, ఒక స్త్రీ ఒక పురుషుడితో పరిచయం అయినప్పుడు గానీ పొందే ఒక విధమైన ఆదుర్దా (ఏంగ్జైటీ) మానసిక శాస్త్ర రీత్యా చాలా ముఖ్యమైన అంశం. స్త్రీని చూసినప్పుడు ఆదుర్దా కలిగే పురుషుడు గానీ, పురుషుణ్ణి చూసినప్పుడు ఆదుర్దా కలిగే స్త్రీగానీ మానసికమైన నిగ్రహాన్ని పాటించటానికి ప్రయత్నించినట్టే లెక్క.
          కేవలం ఆకర్షించబడటానికి మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన  సహజ సౌందర్యాన్ని పెంపొందింప చేసుకోగలిగేలా తమని తాము తీర్చిదిద్దుకోవాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తారు.