భోజన మర్యాదలు
డా. జి వి పూర్ణచందు
‘అతిథి దేవో భవ’ అనే సంస్కృతి మనది. అతిథికి వడ్డించి, తినటం పూర్తయ్యాకే
గృహస్థు భోజనం చేయటంలో ఒక భక్తి భావం ఉంది. ఇందుకు విరుద్ధంగా ఇంగ్లండులో మొదట గృహస్థు
(హోష్టు) ఆహారాన్ని నోట్లో పెట్టుకున్నాకే అతిథి తింటాడు. అది అక్కడి మర్యాద. ఈ మర్యాదలో
ఆక్షేపించవలసింది కూడా ఏమీ లేదు. అది శబరి భక్తి లాంటిది. తాను కొరికి తియ్యగా ఉన్న
పండునే రాముడికి పెట్టింది. ఇదికూడా ‘అతిథి దేవోభవ’ లాంటి మర్యాదే!
ముందు తీపి భక్ష్యాలు, గారెలు వడలాంటి కారపు
భక్ష్యాల్ని, తరువాత పరిమితంగా పప్పు, కూర పచ్చడి వగైరా మృదు పదార్థాల్నీ, పిదప పులుసు లేదా
చారునీ, పెరుగునీ వరుసగా తినటం మన ఆహార సంస్కృతి.
ముందుగా అన్నీ కొద్దికొద్దిగా వడ్డిస్తే విస్తరి మెనూకార్డులా ఉండి, ఏవి రుచిగా ఉన్నాయో
కూడా తెలుస్తుంది. వడ్డనంతా పూర్తయ్యాక, గృహస్థు వచ్చి
కలుపు కోండని కోరటం, భగవన్నామ స్మరణ చేసి, పెద్దలు, వృద్ధులూ తినటం మొదలు పెట్టాక అప్పుడు విస్తరిని
ముట్టుకోవటం మన ఆహార సంస్కృతి. వడ్డించింది వడ్డించినట్టు తినటం నేటి నాగరికత! మనం
ఎప్పుడు లేస్తామా అని చూస్తూ, మన వెనకే రెండో బంతి
అతిథులు నిలబడి ఉంటారు. అందువల మనమీద ఆహార వత్తిడి పెరుగుతుంది. అలా నిలబడటం మర్యాద
కాదు!
భోజనంలో మొదట అల్లం, శొంఠి లేదా మిరియాల కారప్పొడి
లాంటివి తిని, చివర్లో తీపి భక్ష్యంతో భోజనం ముగించాలి.
స్వీటుతో ప్రారంభించి ఐసుక్రీముతో ముగిస్తున్నారీ రోజుల్లో! పెరుగన్నం తిన్నాక పాలతో
తయారైన ఐసుక్రీము ఎలా తీంటారు? విరుద్ధ పదార్థాల్ని ఇలా
తినకూడదు.
చైనీయులు వడ్డనలో ఆఖర్న వేడి టీ కషాయాన్ని గ్లాసుల్లో తెచ్చి ఇస్తారు.
తినటానికి ఉపయోగించేపుల్లల్ని ( చోప్ స్టిక్స్) ఊపుతూ, కిందా పైనా పడేస్తూ ఆడుకోకూడదు. రెండు పుల్లల్నీ వేర్వేరు చేతుల్తో పుచ్చుకోకూడదు.
పళ్ళెం పైకి వంగి ఆహారాన్ని తినాలేగానీ, నోటి దగ్గరకు
పళ్ళేం తీసుకెళ్ళకూడదు. వాళ్లవి నూడుల్స్ తరహా వంటకాలు కాబట్టి, పుల్లల్తో తినటానికి అనువుగా ఉంటాయి. మన పప్పన్నం అలా తినటం కుదరదు.
ఫోర్కుని ఎడం చేత్తోనూ, కత్తిని కుడిచేత్తోనూ
పుచ్చుకుని మాంసాన్ని కోసి తినటం ఇంగ్లీషువాడి మర్యాద. ఫోర్కుతో ఆహారాన్ని నోట్లో పెట్టుకోవటాన్ని
థాయిల్యాండ్ వాళ్ళు తప్పుపడతారు. ఆహారాన్ని చెంచాతో అందుకోవాలి. చెంచాను నోట్లోకి తోసి, నాకి తినటాన్ని యూరోపియన్లు అమర్యాదగా భావిస్తారు. స్టారు హోటలుకెళ్ళి
ఇడ్లీ, అట్టుల్ని కూడా ఫోర్కుతో తినే వాళ్లని చూస్తే, నవ్వొస్తుంది.
గోరుతో పోయేదానికి గొడ్డలి వాడటం ఏం గొప్పా?
ఆహారాన్ని కుడిచేత్తో తుంచుకుని లేదా కలుపుకుని తినటమే మన మర్యాద. అలాగే
ఆహార పదార్థాలను రెండు చేతులూ ఉపయోగించి తినటాన్ని అన్ని దేశాలవారూ అసహ్యంగానే భావిస్తారు.
మనదేశంలోనే ఎడం చేత్తో రోటీని మడిచి పుచ్చుకుని కుడిచేత్తో తుంచుకుని తినే అలవాటున్న
వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా ఇది భోజన సభ్యత కాదనే చెప్పాలి.
వెనకాల పోలీసులు తరుముతున్నారన్నట్టు జల్దీభోజనం చేస్తుంటారు కొందరు. బంతిలో
మిగతా వాళ్ళు కూరలో ఉండగానే ఈ జల్దీ భోజనరాయుళ్ళు సాంబార్‘ని పిలుస్తుంటారు. వడ్డనలో ముందే సాంబారు వచ్చేస్తే, ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. హడావిడిగా గుటుకూగుటుకూ మని తినటం వలన భోజనాన్ని
ఆస్వాదించే అవకాశం కూడా ఉండదు. అలా ఆదరా బాదరాగా తిన వద్దంటుంది శాస్త్రం. అలాగని మరీ
నిదానంగానూ తినకూడదు. జీర్ణశక్తి మందగిస్తుంది.
చాలా హోటళ్ళలో భోజనబల్ల పైన పచ్చళ్ళు
పొడులూ, చారూ, సాంబారు లాంటి
ద్రవ్యాలను ఎవరికి వారే వడ్డించు కునేలా ఉంచుతారు. వాటిని కొందరు వడ్డించుకునే తీరు
పరమ అసహ్యంగా ఉంటుంది. తినే చేత్తోనే గరిటను పుచ్చుకోవటం, కంచానికి ఆన్చి వడ్డించుకోవటం చేస్తుంటారు. నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన
కారణం. బంతి భోజనాలలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా
వడ్డించుకోవటం కనీస మర్యాద. సుతారంగా వ్రేళ్ళతో అన్నాన్ని కలుపుకు తినటంలో నాజూకు
తనం ఉంది. పిండి పిసికినట్టు అన్నాన్ని పిసుక్కొని తినటం అమర్యాదకరం! అన్నాన్ని పిసికి
కాదు, నమిలి తినమని శాస్త్రం చెప్తోంది. అలాగే, ఆహారాన్ని నమిలేప్పుడు పెదాలు
మూత పడి ఉండాలి. లేకపోతే చప్పరింత శబ్దం భోజనమర్యాదల్ని దెబ్బతీస్తుంది. పందికి చప్పరం
అనే పేరుంది. అది చప్పుడు చేస్తూ తింటుంది కాబట్టి! మన భోజనతీరు అది కాదు కదా!
భోజనం చేశాక ఒక్క మెతుక్కూడా పళ్ళెంలో మిగలకుండా తినటం అన్నానికి మనం ఇచ్చే
గౌరవం. జపాను వాళ్ళు పళ్ళెంలో అలా తుడిచినట్టు తింటే, కడుపు నిండలేదేమో అనుకుంటారట.
కడుపు నిండిందని ప్రకటించటానికి గ్లాసు బోర్లించి, ఫోర్కులూ చెంచాల్నీ
పళ్ళెంలో పడుకోబెడ్తారట. వంట రుచి ఎలా ఉందో దాన్ని తిన్న తీరు చెప్తుందని ఆంగ్ల సామెత.
ఎక్కువ విస్తళ్లలో ఎక్కువగా వదిలేయబడి కనిపించేది రుచిగా లేదని అర్థం. తిన్న
విస్తరంతా క్లీనుగా ఉంటే వంట బ్రహ్మాండంగా ఉన్నట్టు!
ఆతిథ్యం ఇచ్చిన వారినుద్దేశించి అన్నదాతా సుఖీభవ...అంటాం మనం. కెనడాలో
వంట చేసిన వారిని సుఖీభవ అని దీవిస్తారు. ‘అన్నదాత’, ‘అన్నకర్త’ లిద్దరినీ సుఖీభవ అనటం
ఒక మంచి అలవాటు. వంటలు బాగున్నాయని చెప్పటం మర్యాద. రాయవాచకం’ గ్రంథంలో రాయల కాలంనాటి రాచభోజన పద్దతుల వర్ణనలున్నాయి. అవి పాశ్చాత్య
తరహాలో ఉండవు. విదేశాల్లో రాచమర్యాదలే నాగరికతగా భావించబడుతున్నాయి. ‘భోజనాల బల్లమీద వేసే బట్ట కనీసం 15 అంగుళాలు దిగి
ఉండటం, రాత్రిభోజనాలకు కొవ్వొత్తి వెలిగించటం ఇవి యూరోపియన్
రాచ సాంప్రదాయాలు. మనవాళ్ళు వెన్నెల రాత్రిని శృంగారానికే గానీ భొజనాలకు ఉపయోగించుకున్నట్టు
కనిపించదు. వెన్నెట్లో భోజనం కూడా ఒక రసఙ్ఞతే!
భోజన సమయంలో సెల్ ఫోన్లను నిశ్శబ్ద స్థితిలో ఉంచటం, భోజనాల గదిలో ఎంతమంది ఉన్నా ఎవ్వరూ లేనంత నిశ్శబ్దాన్ని పాటించటం, హడావిడి సమాచారం ఉంటే మౌనంగా బయటకు వెళ్ళి మాట్లాడటం, మాంసాహారాన్ని తినేప్పుడు నోట్లో వేళ్ళుపెట్టి ఎముక ముక్కల్ని బయటకు తీయటం, నోట్లో మిగిలిన వ్యర్థాన్ని పళ్ళెంలోకి ఉమ్ములు వేయటం ఇవన్నీ బంతి భోజనాలలో
తప్పనిసరిగా మానుకోవాల్సిన అలవాట్లు. భోజనాన్ని మనం మనకోసమే చేస్తున్నప్పటికీ, మర్యాదల్ని
మాత్రం ఇతరులకోసం పాటించాలి. అది పౌరబాధ్యతల్లో ఒకటి. నా ఇష్టం అనటానికి కాదు గదా స్వాతంత్ర్యం
వచ్చింది.