Sunday, 2 November 2014

నడివయసులో జననాంగ సమస్యలు-నివారణ :: డా. జి వి పూర్ణచందు

నడివయసులో జననాంగ సమస్యలు-నివారణ
డా. జి వి పూర్ణచందు
నడి వయసులో లైంగిక సుఖానుభవం గురించే ఎక్కువ చెప్పుకోవాల్సింది ఉంది. యవ్వనం గురించి చెప్పేదేం వుంటుంది అదనంగా! అన్నీ తెలిసిన వయసులో ఏమీ తెలియని ఒక విచిత్ర పరిస్థితి నడివయసు దాఅటుతున్న చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది.
ఆడకైనా, మగకైనా లైంగిక పరమైన యావ ఉన్నంతగా లైంగిక కార్యం కోసం ముందుకు దూకలేని స్థితి నడివయసు ప్రత్యేకతయవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో అవరోథాలు, అడ్డంకులు, పిల్లలు, అత్తమామలూ, కొత్త సంసారం, ఆర్థిక సమస్యలు ఇన్ని ఉన్నప్పటికీ, అప్పుడే ఎక్కువ సుఖానుభవాన్ని పొందగలుగుతారు కదా! కానీ, వాళ్ళకే  యాబైలు వచ్చేసరికి ఎంత ఏకాంతం దొరికినా, ఎంత స్థిరజీవితం ఉన్నా మునుపటి లైంగిక సమరోత్సాహం కనబరచ లేకపోతారు. మరీ ముసలితనం సంగతి సరే...యాబై-అరవైల మధ్యే ఈ పరిస్థితి వస్తే ఇబ్బంది కరంగానే ఉంటుంది.
       ఎంత వయసొచ్చినా గ్లామరు నిలబెట్టుకో గలిగిన వ్యక్తులుంటారు. అది వాళ్ళకి ప్రకృతి వరం అనే చెప్పాలికానీ, యాబైలోకి వచ్చిన చాలా మందిని గమనించి నప్పుడు, స్త్రీలలో ఎక్కువ వార్ధక్య  కవళికలు కనబడతాయి. ముఖంలో దైన్యం కొట్టుమిట్టాడుతుంది. ఒకావిడ అంటుంది: మా అమ్మ అరవైల్లో చేయగలిగిన పనులు నేను నలబైలక్కూడా చేయలేక పోతున్నాను అని! ఇది బాగా ఆలోచించవలసిన అంశమే!
పూర్వకాలపు మనుషులనీ, నాటు మనుషులనీ, నాగరికత తెలియని వాళ్ళనీ, జీవితాన్ని ఎంజాయ్ చేయటం వాళ్లకు తెలియదనీ చాలామంది యవ్వనం మీద ఉన్నవాళ్ళూ బహిరంగంగానే అంటూ ఉంటారు. మరి తమను తాము నాగరికులం అనుకునే వీళ్ళే నలబైలు దాటేసరికే ఎందుకు ఔటై పోతున్నారు. యాబైలో కొచ్చేసరికి ఏమీ లేని వాళ్ళై పోవటానికి కారణం ఏమిటీ? ఆడవాళ్లలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే! ప్రపంచ సగటు ఐదు ఉంటే భారతదేశ సగటు పది ఉన్నా ఆశ్చర్యం లేదునడివయసు లైంగిక నిరర్థకత అనేది ఎందుకు ఏర్పడుతుందో గట్టిగానే ఆలోచించాలి!
నడి వయసు అంటాం గానీ, నూరేళ్ళలో మొదటి 20-25 యేళ్ళను లేప్రాయంగా వదిలేయాలి కదా! యండి. ఇంక నిండు జీవితంలో నిజమైన లైంగికతని మనిషి అనుభవించేది కేవలం ఇరవై లేదా పాతికేళ్ళే! అంతేనా? ఈ ఇరవై లేదా పాతికేళ్ళ సెక్సు సుఖాన్ని మరో పదేళ్ళయినా పొడిగించగలమా...? అనే ప్రశ్నని నలబైలోకి వస్తున్న వాళ్ళే మొదట ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఈ మాట బాగా వర్తిస్తుంది.
ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరోన్ హార్మోన్ల స్థాయి శరీరంలో తగ్గి పోవటమే లైంగిక నిరర్థకత ఏర్పడటానికి కారణం అని వైద్య నిపుణులు చెప్తున్నారు.
నిజానికి సెక్సు భావావేశం లైంగికావయవాలలో పుట్టదు. లైంగికోద్రేకానికి పుట్టిల్లు మెదడే!
మెదడులో ఉన్న హైపోథాలమస్ భాగం స్త్రీ పురుషుల్లో మూడ్ అని మనం చెప్పుకునే మానసిక స్థితిని కలిగిస్తాయి, జననాంగం లోపలి భాగాలు, వాటి చుట్టూ ఉండే కండరాలు, లోపలి మృదువైన భాగాలన్నింటి మీదా స్త్రీ పురుష హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఆ కారణంగా మనసులో కోరిక పుట్టినా జననాంగంలో కదలిక కనిపించని స్థితి ఏర్పడుతుంది.
ఆడవాళ్లలో జననాంగ శుష్కత్వంకరకుదనం, నొప్పి ఉద్రేకం (dryness, irritation and pain) ఇలాంటివి కలుగుతుంటాయి. అందువలన లైంగిక విముఖత కూడా కలుగు తుంటుందిదీన్ని సుశ్రుతుడు కర్కశాం శీతలాం స్తబ్ధమల్ప స్పర్శాంచ మైథునే అంటూ వివరించాడు. స్త్రీల జనాంగం లోపల కర్కశత్వం (కరకుగా ఉండటం), వేడి తగ్గి[పోయి చల్లగా ఉండటం, మొద్దుబారినట్టు, స్పర్శఙ్ఞానం లేకుండా ఉండటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని సుశ్రుతుడి వివరణ.
మోయిశ్చరైజర్లు, జనాంగం లోపల సూక్ష్మ జీవుల దోషాలు తగ్గటానికి క్రీములూ చెప్పినట్టే ఆయుర్వేదంలో అనేక తైలాలు, లేపనాలను చెప్పటం జరిగింది. సూక్ష్మజీవుల తాకిడి (infection) వలన జనాంగంలోపల మంట, దుర్గంథం, జిగటగా ఉండటం లాంటి బాధలు కలగవచ్చు. అందుకని లైంగికత కోసం మాత్రమే కాదు, జనాంగ వ్యాధి, దానివలన కలిగే బాధలు కూడా తగ్గాలి. కాబట్టి, కొన్ని ముందు జాగ్రత్తలు తప్పనిసరి అవుతాయి.
నడి వయసులోకి వస్తున్న స్త్రీ పురుషులందరూ ఆహారంలో వేడి చేసే పదార్థాలను బాగా తగ్గించేయటం మంచిది. వ్యాధి రాకమునుపే జాగ్రత్త తీసుకోవటం అవసరం కదా! అతి పులుపు పదార్థాలు, అతి కారం, మషాలా గ్రేవీలు, వెల్లుల్లి అల్లాలను అతిగా వేసి వండిన పదార్థాలు నిస్సందేహంగా లైంగికతని చంపేస్తాయి. నూనెలో వేసి, లేదా అమితంగా నూనే పోసి వండిన పదార్థాలన్నీ లైంగికతని చంపేవే! అతిగా మద్యపానం, ధూమపానం నపుంసకతను కల్గించి తీరుతాయి. గుట్కాలు తింటే మగతనం గుటకాయ స్వాహా అవుతుంది.
చలవ చేసేవి ఎక్కువగా తీసుకోండి. పులుపు లేని కూరగాయలు అన్నీ చలవ చేసేవే! వాటిని చింతపండు, బఠాణీపిండి లేదా శనగపిండి వేసి, అతిగా మషాలాలు కలిపి పరమ వేడి చేసేవిగా మార్చి తింటున్నాం. అలా తినటం ఒక ఫ్యాషను అనుకుంటున్నాం. ఇది లైంగిక జీవితాన్ని తగ్గించేస్తుందని గమనించే లోపు జీవితకాలం లేటు అయిపోతుంది.
బూడిద గుమ్మడి ముదురు కాయ గుజ్జును తరచూ తినండి. సొరకాయతో వండుకునేవన్నీ బూడిద గుమ్మడితోనూ వండుకోవచ్చు. సొరగింజలు, గుమ్మడి గింజలు, బాదం పప్పు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, సబ్జా గింజలు, ఈ నడివయసు సమస్యలకు చక్కని పరిష్కారాలనిస్తాయి. అరటి కాయలు, పళ్ళు, ముల్లంగి, ఏలకులు, కర్బూజా పండు, మునగాకులు, మునగ పూలు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి! లైంగిక శక్తిని చంపే అంశాలు అదుపులో కొస్తాయి. హార్మోన్లు వాటికవే సరి అవుతాయి. వీటిని ఎలాగైనా తినవచు. మీకై మీరే యుక్తిననుసరించి తినే పదార్థాలుగా చేసుకోండి.
లేతగా ఉన్న  కొబ్బరిని మిక్సీ పట్టి, గుడ్డలో వేసి పిండితే చిక్కటి పాలొస్తాయి. మిగిలిన పిప్పిని పారేసి, పాలు మాత్రం ఒక గ్లాసు తీసుకోండి. మీకు నమ్మకం ఉన్న మంచి గంథం చెక్కను తీసుకుని, సానమీద అరగదీసి, ఒక చెంచాడు గంథాన్ని ఆ కొబ్బరి పాలలో కలిపి తాగండి! అవసరాన్ని బట్టి, రోజూ ఒకసారి లేదా రెండుసార్లు ఇలా తీసుకోండి. గంధం వాసన తాగటానికి అనువుగా లేదంటే, అందులో రెండు పచ్చకర్పూరం పలుకులు కలుపుకుని తాగండి. తీపి కూడా కలుపుకోవచ్చు. జనాంగాల సమస్యలకు మంచి నివారకంగా పని చేస్తుంది.