Monday 25 August 2014

లైంగికపరమైన అతి కుతి :: డా. జి వి పూర్ణచందు

లైంగికపరమైన అతి కుతి
డా. జి వి పూర్ణచందు

కాన్తా కటాక్ష దగ్ధానాం వద వైద్య కిమౌషధం
ధృఢమాలింగనం పథ్యం, క్వాథస్చ అధర చుంబనం
లోలంబ రాజీయం అనే వైద్యగ్రంథంలో గమ్మత్తయిన శ్లోకం ఉంది. కాంతా కటాక్ష దగ్ధుడు అంటే మదన (విరహం)జ్వరంతో బాధపడేవాడికి జ్వరం మందులు చెప్తావేంటి వైద్యుడా! ధృఢమైన ఆలింగనాన్ని పథ్యంగా పెట్టు, అధర చుంబనాన్ని కషాయంగా ఇవ్వు, జ్వరం దానికదే తగ్గుతుంది ..అంటాడు, లోలంబరాజు అనే కవిరాజు. కాంతాకటాక్షదగ్ధత అందరికీ అన్ని సందర్భాలలోనూ వచ్చేది కాదు. అతి తీవ్రమైన లైంగిక వాంఛ అది! విరహం అందరికీ కలుగుతుంది. అది నూటారు డిగ్రీల జ్వరంగా మారిపోతే తీవ్రమైన వాంఛ అవుతుంది. కానీ, అ పేరుతో సమస్త అనాచారాలూ చేస్తే అది వ్యాధి అవుతుంది. ఆ వ్యాధిని రిరంసు: అని పిలిచారు.
శరీరంలో టీబీ నుండి ఎయిడ్స్ వరకూ క్షీణింప చేసే వ్యాధులన్నింటినీ క్షయవ్యాధి ప్రకరణంలో వివరిస్తుంది ఆయుర్వేద శాస్త్రం. ఎయిడ్స్ లాంటి క్షీణింప చేసే వ్యాధిలక్షణాలు రావటానికి కారణాలలో అతివ్యవాయం(sexual extravagance) ఒక కారణం. దానివలన క్షీణింపచేసే వ్యాధి రాబోయేముందుగా కనిపించే కొన్ని వ్యాధిలక్షణాల్ని పూర్వరూపాలంటారు. పూర్వరూపాలలోరిరంసువు ఒకటి! రిరంసువంటే అదేపనిగా సెక్సు కావాలనే తీవ్రమైన యావ. సెక్సుపరమైన అతి కుతి. sex addiction (సెక్సుబానిసత్వం).. ఆల్కాహాలు తాగేవాడు అది లేకపోతే దానికోసం ఎలా వెంపర్లాడి పోతాడో అలాగే సెక్సు కోసం వెంపర్లాడే ఒక మానసిక దౌర్బల్య స్థితిని రిరంసువంటుంది మాధవనిదానం అనే ప్రసిద్ధ వైద్య గ్రంథం.
సెక్సు అనేది అదుపు చేయటానికి లొంగని గుర్రం లాంటిది. Sex is the most difficult to master అంటుందో ఆంగ్ల సామెత. నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, సంతోష రాహిత్యం, దిగులు, ఆందోళన లాంటివన్నీ అతి కుతిని మనుషుల్లో పెంచుతాయి. మనిషి మామూలు స్థితికి రావటానికి సెక్సులో పాల్గొనటమే సరైన ఔషధం అవుతుంది. లోలంబరాజు చెప్పినకాంతాకటాక్షదగ్ధతకు చికిత్స అదే! అది మనసుకు పట్టిన ఒక కండూతి. గోకినకొద్దీ మరింతగా గోకాలనిపించే ఒక దురద! సెక్సు కుతి ఏర్పడి, అతిగా గోకినందు వలన మనసుకు పుళ్ళు పడతాయి.
సెల్ఫోనుల్లో బూతు సంభాషణలు వినటం కోసం (ఫోన్ సెక్స్) ఇంటర్నేషనల్ కాల్స్ చేయటం, ఫేసుబుక్ లాంటి సోషల్ నెట్వర్కుల్ని దుర్వినియోగం చేయటం, వేశ్యల్ని తరచూ కలవటం, తనను ఆడవారిలాగా అలంకరించుకుని అద్దం ముందు నిలబడి, తన లోపల ఉన్న పురుషుడు స్త్రీతో రమిస్తున్నట్టు ఊహించుకోవటం(ఫెటిషిజం), ఆడవాళ్లతో కొట్టించు కుని, గిల్లించుకుని ఆనందించటం(masochistic encounters), స్వలింగకాముకత్వం, పసిపిల్లల్ని సంభోగించటం లాంటి సమస్త లైంగిక అనాచారాలూ ఈ అతికుతి వ్యాధిలో తరచూ కనిపిస్తుంటాయి. ఇలాంటి మనుషులకు అతికుతి ఉన్నట్టు గమనించి ఇతరులు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.

రిరంసు(లైంగికపరమైన అతికుతి) వ్యాధి వచ్చినవారు క్రమేణా క్షీణించి పోతుంటారు. వ్యక్తిత్వం చచ్చిపోతుంది. శక్తి వృధాగా ఖర్చయి పోతుంది. మనుషులు దూరం అయిపోతారు. మన్నన పోతుంది. మానవ సంబంధాలు నశిస్తాయి.
నిజానికి వ్యాధిలో కనిపించే సెక్సు వెంపర్లాట జననాంగాలకు సంబంధించిన సెక్సు కోసం పడే ఆరాటం ఎంత మాత్రమూ కాదు. అంత చక్కని అవకాశాన్ని వీళ్లు సద్వినియోగ పరచుకోలేరు కూడా! అందుకని, లైంగికతకీ దీనికీ సంబంధం లేదనీ, “perversions”  మనో వికారాల్ని నిజమైన లైంగికతగా పరిగణించటానికి వీల్లేదనీ చెప్తుంది ఆధునిక వైద్యశాస్త్రం. రసం అంటే ఆరోగ్యవంతమైన, నిర్మలమైన, ప్రేమనిండిన ఒక తత్వం! రసం ప్రధానంగా ఉన్నప్పుడే అది రసికత అవుతుంది కానిదంతా కాముకతే! కాముకత కూడా చాలా చిన్నమాట. అది ముదిరి ఒక వ్యాధిగా పరిణమించినప్పుడు దాన్ని sex addiction అనే వ్యాధిగా చెప్తారు. ఆయుర్వేదం దీన్నిరిరంసు అని పిలిచింది. రిరంసు వ్యాధిగ్రస్థుణ్ణి రిరంశువు అని పిలవొచ్చు. రిరంశు వ్యాధి క్రమేణా క్షీణింపచేసే వ్యాధులకు దారితీస్తుందని కూడా ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. వీర్యనష్టం వలన సమస్త శరీర ధాతువులూ నశించిపోయి మనిషి క్షీణించిపోతాడు.
సెక్సుయావ కలిగినప్పుడు నిగ్రహించుకో లేని స్థితి, ఉచితానుచితాలు వదిలేసి ప్రవర్తిచటం, ఎదుటి మనిషికి అపకారం చేసే పనులు తలపెట్టటం, మనసులో ఎక్కడో మూలన దాగున్న కోరికలు, భయాలూ, అనుమానాలు, విరోధా లన్నింటినీ తీర్చేసుకోవా లనుకోవటం...మాదక ద్రవ్యాలు వగైరాలకు బానిసైన వాళ్లలాగానే సెక్సు ఎడిక్టులు కూడా ప్రవర్తిస్తారు.
చాలామందిలో రిరంశువుల్లో రకమైనఅతికుతి ధోరణులు కనిపిస్తాయి. కొందరిలో ఎక్కువగా కొందరిలో తక్కువగా ఉండొచ్చు. ఎక్కువగా ఉన్నవాళ్ళు తెలిసిపోతారు కాబట్టి వాళ్లకు దూరంగా ఉండి ప్రమాదం లోంచి బయటపదే అవకాశం ఉంది. తక్కువగా ఉన్న వాళ్లతోనే ఎక్కువ ప్రమాదం. వాళ్ళు మామూలు మనుషుల్లాగానే మనతో కలిసి తిరుగుతుంటారు. కానీ అమావాశ్య, పౌర్ణమి సముద్ర పొంగులాగా అనుకూల పరిస్థితు లొచ్చినప్పుడు వాళ్ళ లోపలి రావణ రాక్షసుడు నిద్ర లేస్తుంటాడు. ప్రేమించలేదని యాసిడ్ పోయటం, పీకలు కోయటం, చిన్నపిల్లలమీద అత్యాచారం చేయటం లాంటి ఘటనలు ఇలాంటివే!రసికతకీ కాముకతకీ తేడా తెలియని వాళ్ళను ఎక్కువగా తయారు చేస్తున్న సినిమాలు ఇతర మాధ్యమాలు ఇందుకు కారణం కావచ్చు కూడా!
అంతకన్నా ముఖ్యమైంది మనం తప్పకుండా శీర్షికలో చర్చించ వలసిందీ ఇంకొకటి ఉంది... అది inadequate parenting...అంటే, చాలని తల్లిదండ్రిత్వం. కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకుని, పిల్లల మానసిక ఎదుగుదల గురించి ఆలోచించటం మానేసి, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదరణ, ఆప్యాయత, అభిమానాలు పంచలేక పోయినందు వలన ఆ పిల్లలు పెరిగి కౄరులై సమాజ వ్యతిరేకులుగా మారతారని మనోవిశ్లేషణ సిద్ధాంత కర్తలు చెప్తున్నారు.

నా మొగుడు, నాపెళ్ళాం, నా పిల్లలు నా యిష్టం అనే ధోరణి గది నాలుగు గోడలవరకే పరిమితమైన అంశం కాదు. పిల్లలు ఎదిగి సమాజం మీద పశువులుగా వచ్చి పడుతారు కాబట్టి ఇది సామాజిక సమస్య. దాని గురించి ప్రతి ఒక్కరూ స్పందించ వలసిన అవసరం ఉంది. మనదేశంలో కూడా క్రమేణా వ్రేళ్ళూనుకుంటున్న విషసంస్కృతి గురించి ముందుగానే హెచ్చరించ వలసిన బాధ్యత మనకుంది!