Language, Literature, Culture and Food heritage of Telugu People.-------- Susruta Ayurvedic Hospital, 1st Floor, Satnam Towers, opp. Buckinghampet Post Office Governorpeta, Vijayawada – 520002 9440172642, Email ID: purnachandgv@gmail.com,
Thursday, 9 January 2020
Dr. G. V. Purnachand, B.A.M.S.,: దొరతనం
Dr. G. V. Purnachand, B.A.M.S.,: దొరతనం: దొరతనం డా. జి వి పూర్ణచందు అందలం బెక్కుట నవనిఁ బ్రశస్తమా ! మ్రానెక్కి నిక్కదే మర్కటంబు తొడవులుఁ దొడుగుట దొడ్డ సౌభాగ్యమా !...

దొరతనం
దొరతనం
డా. జి వి పూర్ణచందు
అందలం బెక్కుట నవనిఁ బ్రశస్తమా!
మ్రానెక్కి నిక్కదే మర్కటంబు
తొడవులుఁ దొడుగుట దొడ్డ సౌభాగ్యమా!
కడు సొమ్ములూనదే గంగిరెద్దు
విత్తంబుఁ గూర్చుట విమల ప్రచారమా!
బహునిధుల్ గావఁడే భైరవుండు
ప్రజల దండించుట పరమ సంతోషమా!
ప్రాణుల నెల్ల నేపఁడె జముండు
దొరతనంబున కివిగావు వరుస లరయ
సాహసౌదార్య ఘన పౌరుషములుఁ గాని
భూనుత విలాస! పీఠికాపుర నివాస!
కుముద హితకోటి సంకాశ! కుక్కుటేశ!
(కుక్కుటేశ్వర శతకం:కూచిమంచి తిమ్మకవి)
భూనుత విలాస! పీఠికాపుర నివాస!కుముద హితకోటి సంకాశ! కుక్కుటేశ! అనే మకుటంతో కూచిమంచి తిమ్మకవి ఈ
శతకాన్ని వ్రాశాడు. 1715-1760 మధ్య కాలాలలో వీరి రచనలు అనేకం వెలువడ్డాయి. అచ్చ
తెలుగులో రామాయణం వ్రాశాడు. కుక్కుటేశ్వర శతక రచన వీరి జీవితంలో చివరి ఘట్టాలలో
చేసినది కావచ్చని పండితుల భావన.
గోల్కొండ సుల్తానుల
కాలంలో తెలుగు నేలమీద పాలనా యంత్రాంగానికి పట్టు లేకపోవటం, గోల్కొండ నుండి సనదులు
తెచ్చుకుని కొందరు వ్యక్తులు జమీందారులై తామే ప్రభువుల్లా వ్యవహరించటం, ప్రజలకు
సుఖజీవనం కరువైన రోజులవి. కళాసాహిత్య రంగాలకు చెందిన వ్యక్తులు అంతో ఇంతో తెలుగు
దనం మిగిలి ఉన్న తంజావూరు, మధుర రాజ్యాలకు తరలిపోయారు. తెలుగు నేలమీద ముఖ్యంగా
కోస్తా ప్రాంతంలో సాహితీ సారస్వత పోషణ అడుగంటి పోయిన కాలం అది.
పాలనా వ్యవస్థకు
సాంస్కృతిక విధానం లేకపోతే ఏ యుగంలోనయినా ఇదే జరుగుతుంది. రాయని భాస్కరులుగా కవులు
మిగిలిపోతారు. అందువలన జాతికి అపకారం జరుగుతుంది.
తిమ్మకవి పిఠాపురం జమీందారుల దగ్గర రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసినా తన రచనలను జమీందారులకు
కాకుండా పిఠాపుర కుక్కుటేశ్వరస్వామి మీద భక్తితో ఆ దేవదేవుడికే అంకితాలిచ్చుకున్నాడు. సన్యశించి, ఆ ఆలయంలోనే శేష జీవితం గడుపుతున్న సమయంలో ఈ శతక రచన జరిగింది. కానీ, శతకంలోని భావజాలాన్ని, పదజాలాన్నీ గమనిస్తే, ఒక స్వామీజీ వ్రాసినట్టుగా
కాకుండా, ఒక పోరాట యోధుడు వ్రాసినట్టు
కనిపిస్తుంది. సాధుజీవులక్కూడా కడుపు రగిలేలా
పాలనా వ్యవస్థ నడుస్తోన్న కాలం అదని, స్థానిక పరిస్థితులు ఆ విధంగా తగులడ్డాయనీ అర్థం అవుతుంది.
సారస్వత పోషణ చేసిన పాలకులు కృష్ణదేవరాయులై చిరకాలం వర్థిల్లారు. చేయని వాళ్ల గురించి చరిత్ర
ఇలానే తగలెట్టినవారని చెప్తుంది. చరిత్రలో ఎలా నిలిచిపోవాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. కొత్తగా ఏమీ చేయకపోయినా
ఫర్వాలేదు, ఉన్నదాన్ని తగలెట్టవద్దనే
ఎవరైనా కోరుకునేది.
అందలం అందరికీ అందేది కాదు. దానికోసం అర్రులు చాచేవారు కూడా కొందరే ఉంటారు. ఆ
కొందరిలో ఎవరో ఒకరికే అవకాశం దక్కుతుంది. ఏనుగొచ్చి మెడలో దండవేసి రాజుని
చేస్తుందనేది ఒక పగటి కల. ఇతరులకు సాధ్యం కాని అధికారాన్ని ఒక్కడే
దక్కించుకోగలగటానికి కఠోరమైన పరిశ్రమ కావాలి. అందలం ఎక్కి దానిని నిలబెట్టుకోవటానికి
అంతకు మించిన విఙ్ఞత కూడా అవసరం అవుతుంది. పదవి ద్వారా ప్రజల్ని దండించే అధికారం
దక్కి, దాన్ని చెలాయించాలని చూడటాన్ని మదం అంటారు. మైకం వలన కలిగేది మదం. ప్రభువైన వాడికి ఇవి ముఖ్యాలు కావని, సాహసం, ఔదార్యం, ఘనమైన పౌరుషం కావాలని
తిమ్మకవి భవిష్య పాలకులకూ వర్తించే విధంగా సూచించాడీ శతకంలో!
అందలం ఎక్కటమే గొప్ప. అన్ని గొప్పలకన్నా అదే గొప్ప అనుకోకూడదు. ఎత్తయిన చెట్టెక్కి కూర్చున్న కోతి కూడా తాను అందలం మీదే ఉన్నానని
అనుకుంటుంది.
ఒళ్లంతా నగలు దిగదుడుచుకోవటం సౌభాగ్యం అనుకోవద్దు.
గంగిరెద్దుక్కూడా అలంకారం చేస్తారు. డబ్బు దాచుకోవటమే గొప్ప అనుకోవటం కూడా
అలాంటిదే! కుక్కకూడా డబ్బుకి కాపలా కాస్తుంది. అందువలన దానికి ఒరిగేదేం ఉంది? అధికార మదంతో అర్థంలేని నిర్ణయాలు చేసి, ప్రజల్ని ఏడిపించటం పరమ సంతోషం
అనుకోవద్దు. ప్రాణుల్ని యముడు కూడా వేపుకు తింటూ ఉంటాడు. దొరతనానికి ఇవి కావు పేరు
తెచ్చిపెట్టే విషయాలు. చరిత్రలో నిలిచిపోవాలంటే సాహసం, ఔదార్యం, ఘన పౌరుషం
కావాలి... అన్నాడు కూచిమంచి తిమ్మకవి.
ఒక్క రోజు పాలించి దిగిపోయినా మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీప్రధాని అనే
అంటారు. ఆ ఒక్కరోజు చాలు చరిత్ర సృష్టించటానికి! కృష్ణదేవరాయలు పాలించింది
స్వల్పకాలమే అయినా త్రిసముద్రాధీశుడిగా నిలిచి, భాషా సారస్వత మూర్తిగా వెలిగాడు.
చరిత్ర సృష్టించేవాడికి కావలసిన లక్షణం అది!

Dr. G. V. Purnachand, B.A.M.S.,: భాషోద్యమ భవిష్య కార్యాచరణ
Dr. G. V. Purnachand, B.A.M.S.,: భాషోద్యమ భవిష్య కార్యాచరణ: 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు లక్ష్యప్రస్తావన: భాషోద్యమ భవిష్య కార్యాచరణ డా. జి వి పూర్ణచందు , కార్యదర్శి , ప్రపం...

భాషోద్యమ భవిష్య కార్యాచరణ
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
లక్ష్యప్రస్తావన:
భాషోద్యమ భవిష్య కార్యాచరణ
డా. జి వి పూర్ణచందు,
కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం
“మాతృభాషను కాపాడుకుందాం-స్వాభిమానం చాటుకుందాం” అని నినదిస్తూ, 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన భాషాభిమానులైన
ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నాం.
దాదాపు 1600 మంది జీవిత సభ్యులుగానో లేక ప్రతినిధులుగానో తమ
పేర్లు నమోదు చేసుకుని ఈ మహాసభలలో పాల్గొంటున్నారు. సభాస్థలిని మించి నమోదు జరగటం
వలన కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా నిర్దేశించిన గడువు తరువాత
ప్రతినిధుల నమోదు నిలిపివేయక తప్పలేదు. ఇంతకు ఇంతమంది ఇంకా నమోదును కోరి ఉన్నారు.
వారందరినీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అవకాశం ఉన్నంతమేర జీవిత సభ్యుల
నమోదు మాత్రం కొనసాగించ గలిగాము.
గతంలో మూడు పర్యాయాలు జరిగిన మహాసభలూ నిర్దేశిత
లక్ష్యసాధనతో విజయవంతం అయ్యాయి. 2007లో ప్రపంచ తెలుగు రచయితల తొలిమహాసభలు మాతృభాషోద్యమ నిర్మాణం లక్ష్యంగా
జరిగాయి. ‘మా పిల్లలకు తెలుగు చదవనూ, వ్రాయనూ నేర్పిస్తున్నాం’ అని తల్లిదండ్రులు ఘనంగా చెప్పగలుగుతున్నారంటే అది భాషోద్యమ విజయమే!
2011లో సాంకేతిక తెలుగు అంశం పైన జరిగిన 2వ మహాసభల పాత్ర గణనీయమైంది కూడా! ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాసభల్లో
యూనీకోడ్ కన్సార్టియంలో శాశ్వత సభ్యత్వం పొందే నిర్ణయాన్ని ప్రకటించింది.18 ఉచిత తెలుగు ఫాంటులు, ఒక ‘కీబోర్డు’ విడుదల లాంటి భాష ఆధునీకరణకు ఉపయోగించే అనేక సాంకేతిక
అంశాలను ప్రకటించింది. కృష్ణాజిల్లా రచయితల సంఘం పెద్దలు చేసిన కృషి ఫలితంగా
సిలికాన్ వ్యాలీలో తెలుగు అంతర్జాల ప్రధమ సదస్సు జరిగింది. ఆనాడు సెల్‘ఫోన్ తయారీదార్లతో జరిపిన సంప్రదింపుల ఫలితమే సెల్‘ఫోన్లలోనూ, అనేక కంప్యూటర్ యాపులలోనూ ఇంత విస్తారంగా తెలుగు వస్తోంది.
ప్రపంచ స్థాయి మహాసభలు భాష ఆధునీకరణకు చేయగలిగిన కృషి ఇది.
రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భాషపరంగా తెలుగు వారంతా
ఒక్కటేననే అంశాన్ని చాటుతూ 2015లో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. అంతకు
మునుపటి ఉద్విగ్నభరిత వాతావరణాన్ని కుదుట పరుస్తూ ఈ మహాసభలు తెలుగు రచయితల మధ్య
అనురాగ బంధాలను ప్రోది చేయగలిగాయి. 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల
పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా యునిసెఫ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ 4వ మహాసభలు
జరుగుతున్నాయి. తెలుగు భాషోద్యమాన్ని బలసంపన్నం చేసి, భాషానురక్తి కలిగిస్తూ ప్రజల గుండెతలుపులు తట్టే కార్యాచరణ
రూపొందించటం ఈ మహాసభల లక్ష్యం.
ఈ మహాసభలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరూ ‘తెలుగుతల్లి ప్రత్యేక దూతలు’గా భాషోద్యమ లక్ష్యసాధకులుగా మారాలని అభిలషిస్తున్నాం. గ్రామగ్రామాన శక్తిమంతమైన ‘తెలుగు వేదిక’లు ఏర్పాటు చేసి, తెలుగు భాషానురక్తిని కలిగించే కార్యక్రమాలు ఇతోధికంగా
జరిగేలా ఒక నిర్దిష్ట ప్రణాళికకు ఈ మహాసభలలో రూపకల్పన జరగాలని ఆశిస్తున్నాం. ‘అమ్మభాషను కాపాడుకుందాం’ అనే సందేశాన్ని ఒకరు నలుగురికి చేర్చే సిద్ధాంతం ఇప్పుడు
అమలు కావాలి.
ఈ మహాసభల ప్రాంగణాన్ని తెలుగు భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ
కొమర్రాజు లక్ష్మణరావుగారి పేరుతోనూ, ప్రధాన వేదికను గిడుగు రామమూర్తి సాహితీ సాంస్కృతిక
వేదికగాను, సదస్సులు జరిగే
వెబినార్ హాలును సురవరం ప్రతాపరెడ్డి భాషా సాంస్కృతిక వేదికగానూ వ్యవహరిస్తున్నాం.
రెండు వేదికలమీద నిర్దేశిత కార్యక్రమాలు సమాంతరంగా జరుగుతాయి.
తెలుగు పట్ల అనురక్తితో విదేశాలలోనూ, దేశంలోని ఇతర
రాష్ట్రాలలోనూ నివశిస్తున్న తెలుగు వారు భాషకోసం ఆయా ప్రభుత్వాలతో జరిపే పోరాటాలకు
సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఈ మహాసభలలో ప్రత్యేకంగా విదేశీ ప్రతినిధులకోసం అలాగే, రాష్ట్రేతర ప్రతినిధుల కోసం చర్చావేదికలు ఏర్పాటు
చేస్తున్నాం. భాషాభిమానంతో తెలుగులో పాలించిన, పాలిస్తున్న
అధికారులతోనూ, రాజకీయ ప్రతినిధులతోనూ చర్చావేదికలున్నాయి. భాష మరియు
చరిత్ర పరిశోధకులు, బోధనారంగ నిపుణులు, సాహితీ సాంస్కృతికరంగాల
ప్రతినిధులు, పత్రికా ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, ప్రచురణరంగ ప్రతినిధులు, సాహితీసంస్థల
ప్రతినిధులతో విస్తృత చర్చావేదికలు ఏర్పాటు చేశాము. సాంకేతికరంగ నిపుణులు
తెలుగును ఆధునీకరించే విషయంలో అనుసరించగలిగిన అంశాల గురించి, భాషోద్యమంలో చిరకాలంగా కృషిచేస్తున్న ప్రతినిధులు భవిష్య
కార్యాచరణ గురించి, మహిళా ప్రతినిధులు నిజమైన భాషాసంరక్షకులుగా మహిళలపాత్ర
గురించి చర్చిస్తారు.
సదస్సులలో ప్రసంగాలు కాకుండా చర్చలకు ప్రాధాన్యం ఇస్తూ, తీర్మానాలు చేస్తే, ముగింపు సభలో వాటి ఆమోదానికి ప్రతిపాదన చేయటం జరుగుతుంది.
తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ అంశాలపై ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యక్రమ
ప్రణాళిక రూపకల్పనకు ఈ తీర్మానాలు ఆదర్శంగా ఉంటాయి. అటు ప్రభుత్వాలకు, ఇటు తెలుగు ప్రజలకు ఇవి మేథావి వర్గాలు చేసే మార్గదర్శనాలు
కావాలని ఆశిస్తున్నాం.
ఈ బృహత్తర కార్యభారానికి సారధ్యం వహిస్తున్న ప్రపంచ తెలుగు
రచయితల సంఘంలో జీవిత సభ్యత్వం స్వీకరించ వలసిందిగా భాషాభిమానులందరినీ
ఆహ్వానిస్తున్నాం.

Subscribe to:
Posts (Atom)