Tuesday 23 February 2016

దారపు పగ్గాలు:: జి. వి. పూర్ణచందు

దారపు పగ్గాలు

 జి. వి. పూర్ణచందు

ఆలు నిర్వాహకురాలు భూదేవియై/ యఖిలభారకుడన్న యాఖ్య దెచ్చె
నిష్టసంపన్నురా లిందిర భార్యయై/ కామితార్థము డన్న ఘనత దెచ్చె
గమలగర్భుడు సృష్టికర్త తనూజుడై/ బహుకుటుంబికు డన్న బలిమి దెచ్చె
గలుషవిద్వంసిని గంగ కుమారియై/ పతితపావనుడన్న ప్రతిభ దెచ్చె
ఆండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతి గానీ/మొదటి నుండియు నీవు దామోదరుడవె
చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్య భావ/హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!
కాసుల పురుషోత్తమ కవి చేసిన వ్యాజస్తుతి ఇది.
అయ్యగారి ఘనత అంతా అమ్మగారిదే నంటూ ఆంధ్రవిష్ణువును ఎత్తిపొడుస్తూనే స్తుతించిన ఒక చక్కని పద్యం ఇది. “ఈ భూలోకాన్ని మొత్తాన్నీనిర్వహించే భూదేవి ఆయన భార్య కాబట్టి, అఖిల భారకుడనేప్రతిష్ట దక్కింది. ధనవంతురాలైన ఇందిర(లక్ష్మి) ఇష్టసఖి కాబట్టి, అయ్యగారికి కామితార్ధాలు తీర్చేవాడన్న ఘనత వచ్చింది. సాక్షాత్తూ సృష్టికర్త కమలగర్భుడైన బ్రహ్మగారి కొడుకు కాబట్టి బహు కుటుంబీకుడనే బలిమి వచ్చింది. కాలుష్యాలన్నీ కడిగేసే గంగ ఆయన కూతురు కాబట్టి, పతితపావను డన్న ప్రతిభ దక్కింది. నీ ప్రఖ్యాతి అంతా ఆడవాళ్ళ వలనో, మరెవరి వలనో దక్కుతున్నదే నంటాడు కవి. అయినా మొదటి నుండీ నువ్వు దామోదరుడివే నంటాడు.
“దామాని ఉదరే యశ్యాశాః దామోదరః” పొట్టకు తాడుతో కట్టబడ్డవాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు. దామం అంటే తాడు, యశోదమ్మ బాలకృష్ణుడి పొట్టకి ఒకతాడు కట్టి, దాని రెండో కొసని రోలుకు కట్టింది కదా! మొత్తం మీద, కలెక్టరమ్మ మొగుడు, బ్యాంకు మేనేజరమ్మ మొగుడు, పొల్యూషన్ కంట్రోలరమ్మ తండ్రి ఇలా టైటిల్స్ పెట్టి తీసే సినిమాల్లో హీరోలాగా విష్ణుమూర్తి ప్రసిద్ధు డయ్యాడన్నమాట.
మనుషులకే ఇంత లౌక్యం ఉంటే వాళ్లని సృష్టించిన వాడికి ఇంకెంత ఉండాలి…! తాడుతో కట్టించుకుని మరీ, దామోదరుడు అని పేరు పెట్టుకున్నాడంటే గొప్ప లౌక్యుడనే అనాలి. తన మెడలో తాడు కట్టిన వాడి పొట్టకు ఆమె తాడు కట్టగలగా లంటే ఆమెకు స్వంతంగా భూదేవిలా భూములుండాలి. లేదా లచ్చిందేవిలా డబ్బుండాలి. పేరుకి దామోదరుడైనా పురుషుడు గానీ, పురుషోత్తముడు గానీ, సాదాసీదా భార్యలకు కట్టుబడతారా అనేది కాసుల పురుషోత్తమకవికి వచ్చిన సందేహం.
మగాడు మగువకు కట్టినా, మగువ మగాడికి కట్టినా ఆ దారపు పగ్గాల్లోనే ఉంది బంధమైనా, బాంధవ్యమైనా! కానీ, మెడలో కట్టిన దారపు పగ్గాలతో భార్యను కట్టుకొనే భర్తని తనకు కట్టుబడేలా చెయ్యాలంటే సౌందర్యాదులు కూడా కొంత తోడ్పడ వచ్చేమో గానీ, వాటికి నికరం లేదు. డబ్బొక్కటే శాశ్వతం అనుకుంటాం కదా!
భార్యను కట్టుకొని, అంటే వెంటబెట్టుకుని వెడితే అదనపు గౌరవం దక్కుతుంది. పెళ్ళికి మగా డొక్కడే వెళ్ళాడనుకోండి, బయట గేట్లోనే, వచ్చిన వీణ్ణి పక్కన బెట్టి రాని ఆవిడ రాలేదేమండీ అనడుగుతారు. కలిసి వెడితే ఆతిధ్యం ఇచ్చే వాళ్ళు దంపతీ సమేతంగా వచ్చి పలకరించి సాదరంగా ఆహ్వానిస్తారు. సినిమా హాల్లోనో, బష్టాండులోనో, రైల్వే స్టేషన్లోనో పక్కన లేడీ ఉంటే టిక్కెట్టు తేలిగ్గా దొరుకుతుంది. వెనకాల భార్యను ఎక్కింఛుకుని స్కూటరు మీద వెడితే సాధారణంగా మనసున్న పోలీసులు ఆపి, లైసెన్సు అడగరు. ప్రమోషన్లో కాంట్రాక్టులో అడగ టానికి ఆఫీసరు గారి దగ్గరకు భార్యతో కలిసి వెడితే వచ్చే సమాధానం సానుకూలంగా ఉంటుంది.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,రూపేషు లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మయుక్తా కులధర్మపత్నీ అన్నాడు ఓ మగరచయిత. “పర్త్యమ్ వ్రాతే తిష్టతి ఇతి పత్ని” అంటే మగాడి పక్కన నిలబడి అతని పనుల్లో సహకరించేది పత్ని అనే మగాడి నిర్వచనం కూడా ఉంది. ఆ సహకరించటం కూడా దాసిగానూ, మంత్రిగానూ, పెట్టే కష్టాలను భరించే భూదేవిగానూ, వండి వడ్డించేప్పుడు తల్లిగానూ, పడగ్గదిలో రంభగానూ ఉండాలనటమే “మగాడిద” మనస్తత్వం.
‘మా ఇంటికి నేనే యజమానిని అని మా ఆవిడ అంగీకరించింది’ లాంటి సరదా ఇంగ్లీషు వాక్యాలు ఆడవాళ్లని సంతోష పెట్టడానికే గానీ, మన సామాజిక వ్యవస్థలో ఇమిడేవి కావు. ఇక్కడ ఏ మగాడూ తానే యజమానినని ప్రత్యేకంగా చాటుకోవాల్సిన అవసరం లేదు. కలెక్టరు గారి మొగుడు కూడా తన భార్య కలెక్టరని చెప్పుకోడు. దారపు పగ్గాల దామోదరత్వం అనేది ఒక బూటకం. అదొక వశీకరణ నాటకం.