తిరునాళ్ల పానీయాలు:: డా|| జి. వి. పూర్ణచందు
బడలినవారికి
వడపప్పు పానకా/లనఁటిపండ్లోపిన యన్ని గలవు
యెళనీరు
బిసనీరు లెందు హేరాళంబు/నీరుచల్లయుఁబెరు గపార మచటఁ
గప్పుర
గంధంబు కైరవాల్పట్టీలు/తట్టుపునుంగును జుట్టుపూవు
లెందువేడినవెల్ల
యే చప్పరంబున/విప్పైన గొడుగులు విసనకఱ్ఱ
లేలకులు
శొంఠియును లవంగాలు పనస
తొలలు
చెఱుకులు ఖర్జూరఫలము లెన్ని
వేడినను
గొండను జాటు వేంకటేశు
భక్త
జాలంబు తిరునాళ్ల ప్రజకు నపుడు
17వ
శతాబ్ది నాటి గణపవరపు వేంకట
కవి-ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము కావ్యంలో పెరుమాళ్ల తిరునాళ్లకు తరలి వచ్చిన భక్తజనానికి వడదెబ్బ తగలకుండా చేసిన ఏర్పాట్ల గురించి ఈ
పద్యంలో వివరిస్తున్నాడు.
1.
అలిసిపోయిన వారికి బడలిక కలగకుండా వడపప్పు,
పానకాలు కావలసినంత ఇస్తున్నారట. వడపప్పు అనటంలోనే ఇది వడదెబ్బకు విరుగుడుగా
పనిచేస్తుందని అర్ధం స్ఫురిస్తోంది.
2. యెళనీరు, బిసనీరు: ఎల నీరు అంటే లేత కొబ్బరి నీళ్లు. బిసము= తామరపూవు. బిసనీరు అంటే పుష్పోదకము. తామర పూలు, తూడులతో తయారైన చలవనిచ్చే ఒక పానీయం కావచ్చు. వచ్చిన జనానికి వడదెబ్బ తగలకుండా హేరాళంగా అంటే సమృద్ధిగా వీటిని అందుబాటులో ఉంచారట
3. నీరుచల్ల, పెరుగు: ఒక లీటరు పెరుగులో షుమారుగా 3 లీటర్ల నీరు కలిపి చిలికితే ఆ మజ్జిగకు వగరు రుచి కలుగుతుంది. వగరు రుచి పోషకంగా పనిచేస్తుంది. ఈ నీరుచల్లని, పెరుగును కూడా సిధ్ధంగాదుంచారట
4. గంథపట్టీలు, కైరవాల పట్టీలు: పచ్చకర్పూరం పలుకులు కొద్దిగా వేసి గంధం చెక్కతో సానమీద అరగదీస్తే అది కర్పూర గంథం. ఈ గంథాన్ని జేబురుమాలా లాంటి వస్త్రానికి పట్టించి నుదుటి మీదా పెట్టి తడుపుతుంటే అది గంథపట్టీ. తెల్లకలువ పూలను నూరి ఆ గుజ్జుతో వేసిన పట్టీని కైరవాల పట్టీ అంటారు. వేడి, జ్వరం కలగకుండా ఈ పట్టీలు చలవ నిస్తాయి.
5. తట్టుపునుగు: “అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో...” అంటాడు అన్నమాచార్య. స్వామికి చెల్లించుకునే ముడుపులను పునుగుతో కలిపి మూటగట్టి సమర్పించేవారు కాబోలు. పునుగు జవాది, కస్తూరి ఇవన్నీ మృగ సుగంధ ద్రవ్యాలు. పునుగుపిల్లి అనే జంతువు (civet cat) నుండి దీని సేకరిస్తారు. ‘సంకుమదము’ అనికూడా పిలుస్తారు. ఖరీదైనది. పునుగుతైలం (civet oilకూడా తయారు చేస్తారు. ఇది సుగంధభరితంగా ఉండి చలవనిస్తుంది.
6. జుట్టుపూవు: జుట్టుపుతీగ మొక్కని అజశృంగి, జుష్టపు తీగ, దుష్టపు తీగ అని పిలుస్తారు. అంటువ్యాధులు రాకుండా కాపాడే వాటిలో ఇది తేలికగా దొరికే తీగ. కంపల మీద పాకుతుంది. దీని ఆకులు హృదయాకారంలో ఉంటాయి pergularia daemia, Pergularia Extensa దీని వృక్షనామాలు. దీని కాయలు మేకకొమ్ము ఆకారంలో చిన్నవిగా ఉంటాయి. గొప్ప వనౌషధి ఇది.
7. చప్పరాలు (చలువపందిళ్లు), గొడుగులు విసనకఱ్ఱలు, ఏలకులు శొంఠి, లవంగాలు పనసతొలలు చెఱుకులు, ఖర్జూర ఫలాలు ఇలా భక్తులకు వేడి నుండి రక్షణ కల్పించే ఏర్పాట్లన్నీ చేశారట.
ప్రాధమిక ఆరోగ్య రక్షణకు ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలను ఆరోజుల్లో పాటించేవారు కాబట్టి, వేసవిలో ఇలాంటి ద్రవ్యాలను సిద్ధంగా ఉంచుకునే వారు. ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించటానికి నామోషీ పడి రంగు విషరసాయనాలు కలిసిన కూల్ డ్రింకులు త్రాగుతున్నాం ఇప్పుడు. తిరునాళ్లప్పుడు పాలకవర్గాలుగానీ, దాతలుగానీ తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ పద్యంలో కనిపిస్తాయి. శ్రీరామ నవమి వేసవి పండుగ. ఆ రోజున పందిళ్ల నిర్వాహకులు ఈ తిరునాళ్ల పానీయాలను భక్తులకు అందుబాటులో ఉంచటం మంచిది. *