Friday, 30 September 2016

ఆపరేషన్ రావణ: డా. జి వి పూర్ణచందు

ఆపరేషన్ రావణ:
డా. జి వి పూర్ణచందు
అలసట డస్సి నా కడకు నావహనమాడగ రాకు మెప్డు, మి
క్కుటముగ నింతవాడ ననుకొంచును యుద్ధము చేయబోకు, దోః
పటుతరశక్తి యస్త్రముల పట్టును ధారణచేసి రమ్ము, నెం
తటి రిపుశక్తి యెప్పుడునుఁ దక్కువ సేయగ రాదెరుంగకన్
రామరావణ యుద్ధం ముగింపు దశకు వస్తోంది. రోజుకో టెర్రరిష్టు బృందాన్ని రాముడి మీదకు పంపి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న రావణుడు యుద్ధరంగంలో అలిసిపోయాడు. రావణుడి దగ్గర దివ్యాస్త్రాలున్నాయి. అవి రామదండులో కొంతభాగం సేనను నాశనం చేయగల శక్తిమంతమైనవి. కానీ, రాముడి దగ్గరున్న దివ్యాస్త్రాలు రావణుడితో సహా మొత్తం లంకా రాజ్యాన్నే నాశనం చేయగలవని విభీషణాదులు హితబోధ చేశారు. అయినా రావణుడు టెర్రరిజాన్ని పోషించే విధానాన్ని వదల్లేదు.
ఇప్పుడు పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. యుద్ధం నిరాఘాటంగా సాగుతోంది. అక్కడ రావణుడి తలుతెగి పడ్తుంటే తిరిగి కొత్త తలలు పుట్టుకొస్తు న్నాయి. ఇక్కడ రాముడి దగ్గర సంజీవని ఉంది. చచ్చిన వానర సైన్యం తిరిగి బతికొస్తున్నారు. ఎవరికీ గాయాల బాధ లేదు. గాయం తగలగానే మాయమైపోతోంది. రావణుడిది వంటరి పోరాటం. శుద్ధ భారతీయ వ్యతిరేకత అతని విధానాలకు మూలం. రాముడిది సమూహ శక్తి. తీవ్రవాద వ్యతిరేకత అతని విధానం.
విభీషణుడు ఐక్యరాజ్య సమితి లాగా టెర్రరిజం మంచిది కాదని, అది లంకకే చివరికి చేటు తెస్తుందని చెవినిల్లు కట్టుకు పోరాడు. టెర్రరిజాన్ని ఆరంభించనే కూడదు. ఒకసారి అందులోకి దిగితే బయటకు రాలేరు, ‘ఈత నేర్చినవాడు ఏటిలోనే పోతా’ డనే సామెత మాఫియాలకు, డాన్లకు, టెర్రరిష్టు మూకను ప్రేరేపించే దేశాధి నేతలకు బాగా వర్తిస్తుంది. పాకిస్తాన్ పాలకులెవరికీ సహజ మరణం లేదందుకే! రావణుడి తత్త్వానికి వీళ్ళు ప్రతీకలు కాబట్టే!
యుద్ధం సాగుతున్న దశలో ఆ సాయంత్రం ఘడియల్లో రావణుడి చేతిలో ఆయుధాలన్నీ అయిపోయాయి. తెగిన అవయవాలను అతికించుకునే పనిలో పడ్డాడు. రాముడి బాణాలను తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయింది. తన సైన్యాన్ని, రాజ్యాన్ని కాకుండా తనను రక్షించుకునే పనిలో పడటం ఏ దేశాధినేతకైనా ఇబ్బందే! యుద్ధంలో ఎల్లకాలం గెలుపు మన వైపే ఉంటుందని హుంకరిస్తే ఫలితం ఇలానే ఉంటుంది.
రావణుడు నిస్సహాయంగా నిలబడి పోయాడు. అలసట అతని ముఖంలో కొట్టొస్తోంది. ఆ సమయంలో రావణాసురుణ్ణి అంతం చేయటం రాముడికి చాలా తేలిక. కానీ, ఆయన అలా చేయలేదు. “తెచ్చుకున్న ఆయుధాలన్నీ అయిపోయాయా...? బాగా అలిసి పోయినట్టున్నావు...నేడు పోయి రేపు రా” అన్నాడు. ఈ సందర్భంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన పద్యం ఇది.
“రావణా! అలిసి పోయాక కూడా నా ముందు నిలబడే సాహసం ఇంకెప్పుడూ చెయ్యకు. ఆయుధాలన్ని అయిపోయి దిక్కు తోచకపోయినా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని అహంకరించాలనుకోకు. ఇంటికి పోయి కాసేపు పడుకో...నీ చేతులకు కాస్త శక్తి వస్తుంది. అప్పుడు మళ్ళీ రా! వచ్చేప్పుడు నీ దివ్యాస్త్రాల మంత్రాలన్నీ ఒకసారి చదువుకురా! ఒక్క దెబ్బకు దిమ్మతిరిగి మంత్రం మర్చిపోతావు. అవతలి వాడి శక్తిని అంచనా వేయటం చేతకాని వాడివి...నువ్వేం వీరుడివి...? ఇవ్వాళ్టికి పోయి రేపు రా!” అన్నాడు.
ఇది యుద్ధ నీతి. రాముడు దాన్ని పాటించాడు. భారతదేశంతో నాలుగుసార్లు యుద్ధంచేసిన పాకిస్తాన్ ప్రతి యుద్ధం లోనూ ఓడిపోయింది. అయినా, దానికి దివ్యాస్త్రాలతో పాటు జవసత్వాలను సమకూరుస్తున్న దేశాలు దాన్ని టెర్రరిజ స్థావరంగా మార్చేశాయి. టెర్రరిజం తాకిడికి గాయపడిన దేశాలు కూడా తమ రాజకీయ ప్రయోజనం కోసం పాకిస్థాన్‘కి సాయపడ్తున్నాయి. తమ మీద కాకుండా తమ శత్రువు మీద ప్రయోగిస్తే టెర్రరిజం మంచిదేననే భావన ప్రపంచ దేశాధినేతల్లో బలంగా ఉంది. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించే అంశం.
“రిపుశక్తి యెప్పుడునుఁ దక్కువ సేయగ రాదెరుంగకన్” అనే పాఠాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ నేర్చుకోదని అనేక సార్లు ఋజువయ్యింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో నిన్న జరిగిన భారత ప్రతీకార దాడి- చూసి రమ్మంటే హనుమంతుడు కాల్చి రావటం లాంటిది. మచ్చుకి ఒకటిగా జరిగిన సంఘటన మాత్రమే! అసలు యుద్ధం ముందుముందుంది. పాకిస్తాన్ అలిసిపోయి నిస్సహాయంగా నిలిచే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ‘ఆపరేషన్ రావణ’ ఆఖరి టెర్రరిష్టు అంతమయ్యే దాకా ఆగకూడదు.