Friday, 3 May 2019

షుగరు వ్యాధి-పసుపుతో గెలుపు:: డా. జి వి పూర్ణచందు


షుగరు వ్యాధి-పసుపుతో గెలుపు::
డా. జి వి పూర్ణచందు
పసుపు ఆహార ద్రవ్యం,ఔషధం మాత్రమే కాదు, హిందువులకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అది పవిత్రమైంది, శుభకరమైంది కూడా! ఇతర దేశీయులకు పసుపు ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే!  లేదా ఆహార ద్రవ్యానికి పచ్చని రంగునిచ్చేందుకు మాత్రమే వాడుకుంటూ ఉంటారు. భారతీయులు పసుపు ముద్దలో భగవంతుణ్ణి చూస్తారు. తెలుగిళ్ళలో పసుపు ముద్ద వినాయకుడు, పసుపు ముద్ద అమ్మవారు నిత్యపూజలందుకుంటున్నారు.
చిన్నగ్లాసు నీళ్ళలో చిటికెడు పసుపు కలిపి పవిత్ర జలాలుగా భావిస్తారు. ఇంటి నలుమూలలా పసుపు నీళ్ళు చల్లి పవిత్రతను పొందుతారు. మంగళ స్నానాలను పసుపు కలిసిన నీళ్ళతో ఆచరిస్తారు. మాంగల్య బంధానికి పసుపు తాడుని కట్టుకోవటం తెలుగు ప్రజలతో పసుపు ఎంత ముడిపడిందో సాక్ష్యం ఇస్తుంది.  పుస్తెలు లేకపోతే బదులుగా పసుపు కొమ్ము కట్టుకునే తెలుగు సాంప్రదాయం పసుపుని ఎంతో ఉన్నత స్థానంలో నిలిపింది. పసుపు కలిపిన అన్నం (పులిహోర), పసుపు కలిపిన నీళ్ళు, పసుపు కలిపిన కూరలు, పసుపు నీళ్ళలో తడిపిన బట్టలు...ఇలా పసుపుతో పవిత్రీకరించుకుంటారు తెలుగువాళ్ళు.
పసుపు పవిత్రమైనదనీ, శుభకరమైనదనీ భావించటం మతపరమైన అంశం కాదు. అది సంస్కృతి పరమైనదిగా భావించాలి!. పసుపులోని ఔషధ గుణాలే దానికా ప్రాముఖ్యతను కలిగించాయి.  
పసిమి, పసిమిడి, పసిడి, పైడి, పమిడి, భమిడి ఇవన్నీ బంగారానికి సంబంధించిన పదాలు. బంగారం రంగులో ఉంటుంది కాబట్టి పసు ఆ పేరుతో ప్రసిద్ధం అయ్యింది.  పసుపు పచ్చ అనడం కూడా ఉంది. పచ్చ, పచ్చన, పచ్చి, పసరు, పచ్చిక, ఇవన్నీ ఆకుపచ్చ అనే అర్థంలో వాడుతున్న పదాలు. పచ్చ అనే మాటని పసుపు రంగుక్కూడా వాడుతుంటారు. అలా పసుపుపచ్చ అనటం  అలవాటయ్యింది.
పసుపు రంగుని బట్టే కాదు, గుణాన్ని బట్టి కూడా అది బంగారమే! పసుపుని ఔషధంగా ఆహార ద్రవ్యాల్లో వాడుకుంటే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. పసుపుకొమ్ముల్ని ఎండించి, మరపట్టించిన పసుపుతో, బజార్లో దొరికే పసుపుని పోలిస్తే, నూరు శాతం గుణాలు అనుమానమే! అందుకే పసుపులో ప్రధాన ద్రవ్యం కర్కుమిన్ అనే రసాయనాన్ని కూరల్లో కలుపుకొని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కర్కుమిన్ కూడా బజార్లో దొరికేదే కాబట్టి,అక్కడా కల్తీలకు అవకాశం ఉంటుంది. అందుకని, పసుపు కొమ్ముల్ని మరాడించుకోవటమే సర్వ శ్రేష్ఠం. 
పసుపు యాంటీ బయటిక్ అనేది జనవ్యవహారంలో ఉన్న విషయం. అంతకు మించిన ఔషధ ప్రయోజనాలు పసుపు వలన మనకు సమకూరుతున్నాయి. పసుపు పని చేయని వ్యాధిలేదు. భయంకరమైన వ్యాధుల్లో కూడా పసుపు ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కేన్సర్, కీళ్లవాతం, సొరియాసిస్, ఇతర చర్మవ్యాధులు, లివర్, మూత్రపిండాల వ్యాధులు, షుగరు వ్యాధుల్లో పసుపు ప్రభావాన్ని ఆయుర్వేద శాస్త్రం బాగా విశ్లేషించింది. ఆయుర్వేద ప్రభావానే తెలుగు ప్రజలు పసుపును తమ సంస్కృతిపరమైన అంశంగా గౌరవించుకుంటూన్నారు.
పాశ్చాత్య వైద్యంలో పసుపు ఔషధ ద్రవ్యం కాదు. అల్లోపతి ఔషధాల్లో దేనికీ బదులుగా పసుపును వాడుకోవచ్చని చెప్పటానికి లేదు. అరిజోనా విశ్వవిద్యాలయంలో కీళ్లవాతం మీద జరిగిన పరిశోధనల్లో పసుపును రోజూ ఆహార ద్రవ్యంగా తీసుకుంటే కీళ్లవాతం మీద బాగా పనిచేస్తోందని ఆ మధ్య ఒక నివేదికను ఇచ్చారు.
పూర్వం ఆధునిక వైద్యంలో కూడా పసుపును కేన్సర్ నిరోధక ఔషధంగానే భావించేవారు. కానీ, పసుపుని ప్రధానమైన ఔషధంగా ప్రయోగించే ప్రయత్నాలు అంతగా సాగలేదు. అత్యంత తాజాగా 2017 జూన్ 1 మెడ్‘టుడే వెబ్ జర్నల్లో జాన్ జాన్సన్ అనే శాస్త్రవేత్త షుగరు వ్యాధిమీద పసుపు ప్రభావం అనే అద్భుతమైన వ్యాసం వ్రాశాడు. పసుపును ఆహార ద్రవ్యంగా తీసుకుంటే అనేక వ్యాధులమీద దాని సుగుణాలు కనిపిస్తున్నాయంటారాయన.
ఆయుర్వేద శాస్త్రంలో నిశామలకీ చూర్ణం అనే ఔషధం ఉంది. నిశ అంటే పసుపు. ఆమలకి అంటే పెద్ద ఉసిరికాయ. ఈ పెద్ద ఉసిరి కాయల లోపల గింజలు తీసేసి, బెరడునీ, దానికి సమానమైన తూకంలో పసుపుకొమ్ముల్నీ కలిపి మరాడిస్తే అదే నిశామలకీ చూర్ణం. ఇది ఆయుర్వేద వైద్యంలో షుగరు వ్యాధికి ఇచ్చే ప్రసిద్ధ ఔషధం.
నిశామలకి చూర్ణాన్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మిక్సీలు ఉన్నాయి కాబట్టి, ఈ చూర్ణాన్ని తయారు చేసుకోవటం తేలికే! దీన్ని కేవలం షుగరు వ్యాధి వచ్చిన వారి కోసం మాత్రమే అనుకోనవసరం లేదు. షుగరు వ్యాధి రాకుండాను, వచ్చిన వారిలో కీటోసిస్, కారబన్‘కుల్స్ ఏర్పడటం లాంటి ఉపద్రవాలను రాకుండా కూడా కాపాడుతుంది. దీర్ఘ వ్యాధులన్నింటిలోనూ ఒక చెంచా నిశామలకీ చూర్ణాన్ని పాలలో గానీ, మజ్జిగలోగానీ కలిపి రోజూ ఒకటి లేదా రెండుసార్లు త్రాగుతూ ఉంటే మనం ఊహించని మార్పులు కనిపిస్తాయి. పసుపుతో ఉసిరి కూడా తోడు కావటం అనేక వ్యాధుల్లో అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
మనం సంవత్సరం అంతా నిలవుండేలా ఉసిరి తొక్కుపచ్చడి (నల్లపచ్చడి) తయారు చేసుకుంటాం. ఈ తొక్కు పచ్చడిని కొద్దిగా ఇవతలకు తీసుకుని, దానికి సమానంగా పసుపు కలిపి ప్రతిరోజూ అన్నంలో మొదటి ముద్దగా ఒక చెంచాడు మోతాదులో కలుపుకుని తింటే ఎక్కువ గుణవత్తరంగా ఉంటుంది.   
శరీరంలో ఎముకపదార్ధం నష్టపోకుండా పసుపు అడ్డుకుంటుందని ఒక సిద్ధాంతం ఇటీవలే వెల్లడైంది. లివర్ పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రోబర్ట్ మూట్స్ కీళ్ళవాతం చికిత్సలో పసుపు ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించ బోతోందని తెలిపారు. ప్రకృతి సిద్ధంగా దొరికే కొన్ని రసాయనాలు ఔషధ విలువలు కలిగినవి కావడం విశేషమే!
పసుపుని ఆహారంగా వాడుకుంటే నొప్పులు, వాపుల్లో తగ్గుదలను శాస్త్రవేత్తలు గమనించారు. అప్పటినుండీ పసుపు గురించి పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. మాంచెష్టర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్త్రవేత్త డా. అన్న్ బర్టన్ పసుపు కలిసిన కూరలు రోజూ తింటే ఎముకలవ్యాధులు, ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ (ఎముకల్లో ఎముకపదార్థం తగ్గిపోవటం, ఎముకలు మెత్తపడటం) లాంటి బాధలు తగ్గుతాయని పేర్కొన్నారు. శరీరంలో వాపును పేరేపించి, జాయింట్ల మీద దాడి చేసే ప్రొటీన్లను పసుపు అదుపు చేస్తుందని వీరు భావిస్తున్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో 2013లో జరిగిన పరిశోధనలు కూడా పసుపు వలన నొప్పి-వాపు తగ్గుతాయని నిర్థారించాయి. 
పసుపు కేవలం సుగంధ ద్రవ్యం కాదు. ఆహార ద్రవ్యాల్లో పసుపును తగుపాళ్ళలో చేర్చటాన్ని అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తం మీద 2.5 నుండి 3 గ్రాములవరకూ  పసుపును వివిధ ఆహార పదార్ధాల్లో కలిపి తీసుకోగలిగితే పసుపు ఆరోగ్యానికి తలుపులు తెరుస్తుందనీ, వ్యాధులకు తలుపులు మూస్తుందని ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రం పసుపు ప్రాధాన్యతను గుర్తిస్తోంది. అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్, పేగుల్లో వాపు, పేగుపూత, కేన్సర్, కీళ్లవాతం,  బొల్లి, సొరియాసిస్, మతిమరుపు వ్యాధి, షుగరు వ్యాధుల్లో పసుపు ఏ విధంగా పనిచేస్తోందనే విషయం మీద ఇప్పుడు వైద్య శాస్త్ర పరిశోధనలు  దృష్టి సారించాయి. 
శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల పని తీరును పసుపులోని కర్కుమిన్ అనే రసాయనం మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో కీళ్లవాతం, సొరియాసిస్, షుగరు వ్యాధి, రకరకాల కేన్సర్ వ్యాధుల్లో పసుపు ఒక దివ్యౌషధంగా  పనిచేస్తుందనే భావనని చాలామంది శాస్త్రవేత్తలు వ్యక్తపరుస్తున్నారు.
ఒకచెంచా అల్లం ముద్ద, రెండు చెంచాలు మిరియాల పొడి, నాలుగు చెంచాల జీలకర్ర, ఎనిమిది చెంచాల పసుపు, పదహారు చెంచాల ధనియాలపొడి సరిగ్గా ఇదే మోతాదులో కలుపుకుంటే అద్భుతమైన కర్రీ పౌడర్ తయారౌతుంది. దీన్ని అన్ని వంటకాల్లోనూ కలుపుకోవచ్చు. మజ్జిగలో కలిపి తాగితే చాలా రుచిగా ఉంటాయి. ఇష్టమైనవాళ్ళు ఈ మొత్తం పొడిలో అరచెంచా ఇంగువ కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఆయుర్వేద గ్రంథాల్లో వేసవారం అని పిలుస్తారు. ఇది పసుపుని సద్వినియోగపరచుకో గల గొప్ప ఫార్ములా! వైద్య శాస్త్ర రహస్యం. వేసవారాన్ని రోజు మొత్తం మీద ఒకటి లేదా రెండు చెంచాలవరకూ మన కడుపులోకి వెళ్ళేలా తీసుకో గలిగితే తప్పకుండా ప్రయోజనాలు కలుగుతాయి.
పసుపు సమస్త ప్రపంచానికీ సన్మంగళకరమైనది! దాన్ని సద్వినియోగ పరచుకోవటంలో విఙ్ఞత చూపించాలి!