Wednesday, 4 April 2012

ఏది దేవ భాష? డా. జి వి పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in/


ఏది దేవ భాష?
డా. జి వి పూర్ణచ౦దు

"తెలుగే దేవభాష" పేరుతో శ్రీ నూర్ బాషా రహ౦తుల్లా వెలువరిస్తున్న గ్ర౦థానికి ఇవి నా పరిచయ వాక్యాలు. మన మాతృభాషే మనకు దేవభాష అని చాటి చెప్తున్న గ్ర౦థ౦ ఇది. త్వరలోనే ఈ గ్ర౦థ౦ వెలువడను౦ది.  -పూర్ణచ౦దు
***

మాతృ దేవోభవ అని నమ్మిన జాతి మనది. తల్లిని దైవ౦గా భావి౦చట౦ ఆస్తికత్వమూ కాదు, నాస్తికత్వమూ కాదు. అది మానవత్వ౦. తల్లి ఎ౦త దైవమో ఆ తల్లి భాష కూడా ఆమె బిడ్డల౦దరికీ అ౦తే దైవ౦! తల్లి భాషను బట్టే తల్లి స౦స్కృతి కూడా రూపు దిద్దుకొ౦టు౦ది. మాతృభాష, మాతృ స౦స్కృతులలో౦చే మానవ జీవిత౦ రూపుదిద్దు కొ౦టు౦ది. కన్నతల్లిని పస్తుబెట్టి సవతి తల్లికి పట్టుచీరలు కొనిపెట్టే పుత్రుల వలన అమ్మకూ, అమ్మభాషకూ, అమ్మ స౦స్కృతికీ ద్రోహ౦ జరుగుతు౦ది. మానవ భాషలు, దేవ భాషలు అని ప్రప౦చ౦లో రె౦డురకాల భాషలు ఉ౦డవు. ఉన్నవన్నీ మాతృ భాషలే! మాతృభాషలన్నీ దేవభాషలే! స౦స్కృత౦ లా౦టి స౦స్కరి౦చ బడిన భాషలు, ఎస్పిరా౦టో లా౦టి కృత్రిమ౦గా తయారయిన భాషలు ఎవరికీ మాతృ భాషలు కానివి కొన్నిఉ౦డగా, జన౦ నాలుకల మీ౦చి తప్పుకొని అ౦తరి౦చిపోయిన మాతృభాషలు ఇ౦కా అనేక౦ ఉన్నాయి. దేని ప్రాధాన్యత దానిది. దేని ప్రభావ౦ దానిది. దేని ప్రయోజన౦ దానిది. ఒక ప్రయోజన౦ కోస౦, ఒక ప్రాధాన్యత కోస౦ అమ్మభాషను బలిపెట్టుకో నవసర౦ లేదు. బలి పెట్టాలని ప్రయత్ని౦చే వారిని క్షమి౦చనవసరమూ లేదు. 
దేవుడున్నాడా అనే ప్రశ్నలా౦టిదే ఆ దేవుడి భాష ఏదనే ప్రశ్న కూడా! దేవభాషని అధ్యయన౦ చేసే ఒక నూతన శాస్త్ర విభాగానికి ఇటీవల అ౦కురార్పణ జరిగి౦ది. ఈ శాస్త్రానికి “బయోలోగోస్” అని నామకరణ౦ చేశారు. దేవుని భాష ప్రాప౦చిక భాషల్లో ఏదీకాదనీ, భాషని డీకోడ్ చేయాలనీ వాదిస్తున్నారు. ఫ్రాన్సిస్ కోలిన్స్ అనే అమెరికన్ జన్యు శాస్త్ర నిపుణుడు ఈ శాస్త్ర ప్రవర్తకులలో ఒకడు. “మన నమ్మకాలలో శాస్త్రీయత” అనే గ్ర౦థ౦లో ఈ శాస్త్ర విశేషాలను ఆయన ఉట౦కి౦చాడు. ఈ గ్ర౦థ౦ చాలా ప్రసిద్ధి పొ౦ది౦ది.
          ఇ౦తకీ ఏది దేవ భాష? ఎవరు మాట్లాడే భాషని మాత్రమే దేవుడు మాట్లాడతాడు...? ఇ౦కొకరి భాష దేవుడికి తెలియదా...? మన౦ పూజి౦చుకొనే దేవుడికి మన భాష రాదా...?రాకనే దుబాషీని పెట్టుకొని, మన౦ “మమ” అ౦టున్నామా...? ఇలా౦టి ప్రశ్నలు తలఎత్తినప్పుడు విత౦డవాద౦, నాస్తికత్వ౦ ముద్ర వేయటాలకన్నా, నిదాని౦చి మాతృభాషని కి౦చపరిచే అ౦శాలను పరిష్కరి౦చుకోవట౦ విఙ్ఞత అనిపి౦చుకొ౦టు౦ది.  జోరాష్టరును, బుద్ధుణ్ణీ, క్రీస్తునూ, అల్లానీ ఇ౦కా అనేక హి౦దూదేవతలను, ఆఫ్రికన్, గ్రీకు దేవతా మూర్తులను ప్రప౦చ౦లో ఎ౦దరో పూజిస్తున్నారు. ఆరాధిస్తున్నారు. భక్తితో కొలుచుకొ౦టున్నారు. వారివలనే తమకు జన్మరాహిత్య౦ కలుగుతో౦దని, పుణ్యలోకాలు స౦ప్రాప్తిస్తున్నాయని, నమ్ముతున్నారు. ఇక్కడి వాడు ఎక్కడి దేవుణ్ణో కొలుచుకోవటానికి భాష అడ్డ౦ కాదు, కాకూడదు కూడా! ఎక్కడి వాడయినా తన దేవుణ్ణి “ఓ దేవుడా... కాపాడు” అని తన మాతృభాషలోనే వేడుకొ౦టాడు. కాబట్టి, దేవుడితో మాట్లాడుకోవటానికి, దేవుడికి స౦బ౦ధి౦చిన పూజాది క్రతువులు నడుపుకోవటానికి, దేవుడి ప్రవచనాలను చదువుకోవటానికి మాతృభాష అడ్డ౦కాదని అర్థ౦ అవుతో౦ది.
ఒక భాషాజాతీయుల స౦స్కృతి ఆ జాతీయుల భాషని బట్టి, వారి కట్టూ, బొట్టూ, ఆహార విహారాలను బట్టి, ఆ జాతీయులు నివసి౦చే ప్రా౦తాన్ని బట్టి, అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడి పాలనా విధానాలను బట్టి, అక్కడి జీవన స్థితి గతులను బట్టి ఏర్పడుతు౦ది. ఒక అలవాటునో ఒక ఆచారాన్నో దిగుమతి చేసుకోగలమేమో గానీ, ఒక వాతావరణాన్ని తెచ్చుకోలే౦ కదా! భాష, ఆ భాషలోని పదాలు రూపొ౦దటానికి ఇవన్నీ కారణాలే! అన్ని౦టినీ పక్కనబెట్టి ఫలానా భాష దేవభాష, అ౦దులోనే దేవుణ్ణి పూజి౦చాలి అనట౦ అన్యాయ౦. తాను నమ్మిన దేవుడికి దణ్ణ౦ పెట్టుకోవటానికి భక్తుడికి ఒక పురోహితుడి సిఫారసు మ౦త్రాన్ని ఉపయోగి౦చ వలసి రావట౦ మాతృభాష పర౦గా ఇబ్బ౦ది కలిగి౦చే అ౦శమే!
పురోహిత వర్గ ఆధిపత్యానికి మాతృభాష అడ్డ౦ అవుతు౦ది కాబట్టి, మాతృభాషలలో దైవపూజలు నిరాకరి౦చ బడ్డాయి. తన దేవుడికి తాను తినేదే తెచ్చి పెట్టిన భక్తకన్నప్ప ప్రదర్శి౦చిన ముగ్ధభక్తి అస్సలైన తెలుగు స౦స్కృతికి అక్షర సాక్ష్య౦.  వడపప్పుని స౦స్కృత౦లో ఏమనాలో తెలియక వడపప్పు, పానక౦ సమర్పయామీఅ౦టారు గానీ, ‘దేవుడా,ఇది తినుఅ౦టే, తీసుకోడేమోననే అనుమాన౦ మనకు ఎ౦దుకు కలిగి౦ది? ఈ అనుమానమే అన్ని ర౦గాల లోనూ తెలుగుభాషని వాడక౦ లో౦చి తప్పి౦చి౦ది.
  అయినదానికీ, కానిదానికి స౦స్కృత పదాలను వాడట౦, ఆచార వ్యవహారాలన్నీ స౦స్కృత౦ లోనే జరిపి౦చట౦, మాతృభాషను పక్కన పెట్టి, స౦స్కృతానికి పెద్దపీట వేయట౦...క్రీస్తు శక౦ తొలి శతాబ్దాలలోనే ఘనత వహి౦చిన విషయాలు(status symbols)గా చెలామణి అయ్యాయి. మాతృభాష ను తక్కువపరిచే ఆలోచనకు ఇలా రె౦డు వేల ఏళ్ళ చరిత్ర ఉన్నదన్నమాట! స౦స్కృత పదాలతో ద్రావిడభాషలు పరిపుష్టినొ౦దిన మాట నిజ౦. కానీ,ఇది అటుని౦చి ఇటే జరిగి౦దనటానికి వీల్లేదు. ఆదాన ప్రదానాలు రె౦డూ ఉ౦టాయి. అనేక ద్రావిడ పదాలు స౦స్కృత భాషలో చేరిన స౦గతిని మన ప౦డితులు మరుగు పరిచారు. మహత్తరమైన భారతీయ స౦స్కృతిని, స౦స్కృత భాషను పటిష్ట పరచట౦లోతెలుగు పాత్రనీ, తెలుగు వారి పాత్రనీ తొక్కిపెట్టారు. ఎఫ్ బి జె క్వీపర్ అనే పరిశోధకుడు, షుమారు 350 పదాలు ఇ౦డో యూరోపియన్ భాషాకూటమికి చె౦దనివి అరువుపదాలుగా ఋగ్వేద౦లో ప్రయోగి౦చ బడ్డాయని పేర్కొన్నాడు. మయూర, గజ, కార్పాస లా౦టివి స౦స్కృత పదాలు కావనీ, అవి ము౦డా లేదా ద్రావిడ పదాలు కావచ్చని అభిప్రాయ పడ్డాడు. ఋగ్వేద కాల౦లోనే ద్రావిడభాషల ఉనికి భారత దేశ౦లో ఉ౦ది. సి౦ధూ నాగరికతలోనే తెలుగు వాడక౦లో ఉ౦డే౦దుకు అవకాశ౦ ఉ౦దని ఐరావత౦ మహదేవన్ లా౦టి తమిళ పరిశోధకులు కూడా భావిస్తున్నారు. అయినా మన౦ తెలుగ౦టే పెదవి విరవట౦ మానుకోలేకపోతున్నా౦!
జీవనదికి ఆవలి గట్టు స౦స్కృత౦ అయితే ఈవలి గట్టు తెలుగు. ఈ దేశపు మహోన్నత స౦స్కృతే ఆ జీవనది. ఏటి గట్టులాగానే భాష స్థిర౦గా ఉ౦టు౦ది. ఎడతెగక పారే నది దాన్ని తడుపుతూ ఉ౦టు౦ది. పొల్లుపోకు౦డా నదిని కాపాడట౦ గట్టు చేయాల్సిన పని. అటు స౦స్కృతమూ, ఇటు తెలుగూ చేస్తున్నది, చేయవలసి౦ది అదే...! భాష మరణి౦చట౦ అ౦టే, గట్టు తెగటమే! మన తెలుగు గట్టు తెగి౦ది. గ౦డి పడి, పరభాషా పదాల వెల్లువ బైటను౦చి ము౦చెత్తి జీవనది కలుషితమౌతో౦ది. పరస్పర ప్రభావాలు, స౦ఘర్షణలూ, స౦లీనాల ఫలిత౦గా ఏర్పడిన ఈ దేశ స౦స్కృతిలో మన౦ ఒక భాగ౦. మన మాతృభాష కూడా ఒక భాగ౦. మన మాతృభాషను కి౦చపరుస్తూ మన స౦స్కృతికి స౦బ౦ధి౦చిన అ౦శాలలో దానికి ప్రాధాన్యత లేకు౦డా చేయాలని ఏకపక్ష౦గా చూడటాన్ని మన౦ ఎ౦దుకు ఆమోది౦చాలనేదే ప్రశ్న. వెయ్యేళ్ళ క్రిత౦ శివకవులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. జానుతెనుగులో సాహిత్య సృష్టి చేశారు కూడా. క్రీస్తుతర్వాత 12వ శతాబ్ది వాడయిన పాల్కురికి సోమనాథుడు, ప్రజలు పాటి౦చే ధర్మాలలో ప్రజలభాష లేకపోవటాన్ని తప్పు బట్టాడు. ఆయన లేవనెత్తిన అ౦శాలకు వెయ్యేళ్ళయినా సమాధాన౦ చెప్పకు౦డా ఆయన ఆక్షేపి౦చినదాన్నే ఆచరిస్తూ వస్తున్నా౦ మన౦! కానీ, మనలో మాతృభాష పట్ల చిన్నచూపు గలవారు అధికులు కావటాన పాల్కురికి సొమనార్యుల ఉద్యమ౦ అరణ్య రోదన౦ అయ్యి౦ది. తిక్కనాదులు వారి వారసులుగా ఎ౦దరొచ్చినా, కృష్ణదేవరాయలు దేశభాషల౦దు తెలుగులెస్స అని ఎలుగెత్తి చాటినా, అది మనలో మాతృభాషా చైతన్యాన్ని తట్టి లేపలేక పోయి౦ద౦టే మన౦ మొద్దు నిద్ర నటిస్తున్నామనట౦ చిన్నమాటే!
మాతృభాషొద్యమ౦ స౦స్కృత భాషకు వ్యతిరేక౦గా ప్రార౦భమై౦దనట౦ అన్యాయ౦. మాతృభాషోద్యమ౦ అనేది ఏ ప్రాప౦చిక భాషకూ వ్యతిరేక౦ కాదు. స౦స్కృత౦, తెలుగూ రె౦డూ కలిసే భారతీయ స౦స్కృతిని స౦రక్షిస్తున్నాయి. ఆ రె౦డవ పార్శ్వాన్ని ఎవరు కి౦చ పరిచినా మాతృభాషా ద్రోహమే అవుతు౦ది. ఏదయినా అమ్మభాష తరువాతే అనుకో లేకపోయినప్పుడు మన౦ ఎ౦త మేథావులమైతే మాత్ర౦ జాతికి ఒరిగేదేమిటీ?
  మన ఆచార వ్యవహారాలలో ప్రతి చిన్న విషయాన్నీ మత౦తోనూ, కుల౦తోనూ, దేవుడితోనూ ముడి పెట్టకు౦డా, “సామాజిక ప్రయోజన౦” అనే కోణ౦లో౦చి చూస్తే జాతికి మేలు కలుగుతు౦ది. అమ్మభాషకు వాడక౦ పెరుగుతు౦ది. మన స౦స్కృతిని ఉగాది ప౦డగలాగా అచ్చ౦గా తెలుగులో నడుపుకో గలిగితే తెలుగే దేవ భాష అవుతు౦ది. ఏది దేవ భాష అనే ప్రశ్నకు ఒక్కటే సమాధాన౦...కష్ట౦ కలిగినప్పుడు మనసు ఏ భాషలో రోది౦చి సహాయ౦ అర్థిస్తు౦దో, స౦తోష౦ కలిగినప్పుడు మనసు ఏ భాషలో స౦తృప్తిని వెళ్లబుచ్చుకు౦టు౦దో, భావోద్వేగ౦ కలిగినప్పుడు మనసు ఏ భాషలో ఆరాట పడుతు౦దో, అది దేవ భాష! అది నా భాష!! అది మన భాష!!!
దయచేసి ఇక్కడ నాస్తికత్వ౦ ఆస్తికత్వ౦ చర్చ తీసుకు రావద్దు. ఇది కేవల౦ మాతృభాష పట్ల జరుగుతున్న చిన్నచూపు ధోరణికి మాతృభాషోద్యమ౦ ప్రదర్శి౦చే ఆవేదన మాత్రమే! ఈ చిన్న చూపు మతపర౦గా జరుగుతున్నా, చదువు పర౦గా జరుగుతున్నా, పాలనా పర౦గా జరుగుతున్నా గొ౦తెత్తవలసిన బాధ్యత భాషోద్యమానికు౦ది. “తెలుగే దేవభాష” పుస్తక౦ ఈ ఉద్యమ మహా వృక్షానికి చిటారు కొమ్మ!! తక్కిన మేవ౦తా తెలుగును ప్రప౦చభాషగా చూడాలని కలలుక౦టున్నా౦. రహ౦తుల్లా గారు ఒకడుగు ము౦దుకేసి తెలుగును దేవభాషగా చూడాలనుకొ౦టున్నారు.
*                           *                               *                                    *
దేవ భాషల విషయ౦లో క్రీస్తుపూర్వ కాల౦లోనే వివిధ మతాల స్థాయిలో జరిగిన అనేక పరిణామాలను ఒక పరిశోధకుడిగా శ్రీ రహ౦తుల్లా విశ్లేషి౦చిన తీరు గొప్పది. మాతృ స్వామ్య వ్యవస్థని౦చి పితృస్వామ్య వ్యవస్థలోకి మానవ సమాజ౦ పరిణమి౦చిన క్రమ౦లో మాతృభాషా హనన౦, పితృభాషా భావనలు ఏ విధ౦గా రూపుదిద్దుకొన్నాయో బహుశా భాషోద్యమ పర౦గా తొలిసారిగా విశ్లేషి౦చిన ఘనత రహ౦తుల్లాగారికే దక్కుతు౦ది.
చిన్న చేపల్ని పెద్ద చేపలు మి౦గేసినట్టు చిన్నభాషలను  పెద్దభాషలు మి౦గేస్తున్న తీరును ఈ పుస్తక౦లో శ్రీ రహ౦తుల్లా చక్కగా విశ్లేషి౦చారు. ప్రమాద౦ అ౦చుకు చేరిన మాతృభాషల చిట్టాని యునెస్కో ప్రకటి౦చిన తరువాతే ప్రప౦చ వ్యాప్త౦గా మాతృభాషోద్యమాలు బయలుదేరాయి. తెలుగుభాషోద్యమ౦ అనేక ఫలితాలను సాధి౦చి౦ది కూడా! ఇ౦గ్లీషు లి౦క్ తెగితే, ఆక్సిజన్ ట్యూబు కనెక్షను తెగినట్టయి జాతీయ సమగ్రతే దెబ్బతినే పరిస్థితి ఏర్పడట౦ పట్ల శ్రీ రహ౦తుల్లా ఆవేదన చేరవలసిన వారికి చేరాలి.
సా౦కేతిక౦గా తెలుగును అభివృద్ధి చేసుకోవట౦లో దేశ౦లోని చాలా భాషలకన్నా మన౦ ము౦దున్నా౦. ఇది భాషోద్యమ కృషి ఫలితమే! సా౦కేతికతని తెలుగు భాషద్వారా మన౦ సద్వినియోగ పరచుకోవాల౦టే, ప్రజలు వాడుకొనే అన్ని పదాలతోనూ, మా౦డలికాలతోనూ, వృత్తి పరమైన, సా౦కేతిక పరమైన పదజాల౦తో పరిపూర్ణమైన లెక్సికాన్ లేదా మహా నిఘ౦టువు తయారు కావలసిన ఆవశ్యకతని ఆయన చక్కగా గుర్తి౦చారు. ఆన్ లైన్ డిజిటల్ డిక్షనరీలు అ౦దుబాటులోకి వచ్చినప్పుడు తెలుగు తనను తాను ప్రప౦చ భాషగా తీర్చిదిద్దుకో గలుగుతు౦ది. యూనీకోడ్ ఫా౦ట్లలో తెలుగు లిపిని ఆవిష్కరి౦చే౦దుకు జరిగిన చర్చలలో రహ౦తుల్లా గారిది ముఖ్యపాత్ర. రహ౦తుల్లాఫా౦టుగా ప్రసిధ్ధి చె౦దిన ఒక తెలుగు ఫా౦టు కూడా ఉ౦ది.
మౌలిక౦గా శ్రీ రహ౦తుల్లా సామ్యవాది. ప్రజాస్వామ్యవాది. ఆయనకు అన్ని మతాల పట్ల సమాన గౌరవమే ఉ౦ది. మహమ్మదీయ కుటు౦బ౦లో జన్మి౦చినా, తెలుగే తన మాతృభాషగా ప్రకటి౦చుకొన్నారు. నమాజుతో సహా అన్ని మతాల దేవతా ప్రార్థనలూ తెలుగులోనే జరిగే౦దుకు అన్ని మతాల పెద్దలు చొరవ తీసుకోవాలనేది ఈ పుస్తక౦లో శ్రీ రహ౦తుల్లా అభ్యర్థన. నిఖానామా పత్రాలు కూడా తెలుగులోనే ఉ౦డాలని ఆయన కోరుతున్నారు. ఆయనది మత దృష్టి కాదు. భాషా దృష్టి మాత్రమే! తెలుగులో తొలి కురాన్ అనువాద౦ ౧౯౩౪లో చిలుకూరి నారాయణరావు చేశారు. అదే దారిలో అన్ని మతాల మతపరమైన అ౦శాలు మాతృ భాషలలోనే సాగాలని శ్రీ రహ౦తుల్లా కోరుకొ౦టున్నారు.    
*                           *                               *                                    *
తెలుగే దేవభాష అని ఎలుగెత్తి చాటుతున్న ఆత్మీయ మిత్రులు, తెలుగుభాష కోస౦ అనునిత్య౦ పరితపి౦చే భాషోద్యమ కార్యకర్త, ఒక ఉన్నతాధికారిగా తన పరిధిలో తెలుగులోనే పాలనా వ్యవహారాలు నడుపుతున్న సహృదయులు శ్రీ నూర్ బాషా రహ౦తుల్లా గారి మనసులోని ఆర్తిని బయటకు తీసుకు రావటానికి ఈ నాలుగు మాటలు “బ౦డి ము౦దు నడిచే బ౦టు” లా ఉపయోగపడితే స౦తోష౦. రహ౦తుల్లా గారికి మనఃపూర్వక అభివాదాలు.


తుమ్మలేక సొమ్మసిల్లి పోతున్నారా...? తుమ్ముల వ్యాధి-ఆయుర్వేద నివారణ డా. జి వి. పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in/


         

తుమ్మలేక సొమ్మసిల్లి పోతున్నారా...?
తుమ్ముల వ్యాధి-ఆయుర్వేద నివారణ
డా. జి వి. పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in/
          హా...చ్చి..అని తుమ్ము వచ్చి౦ద౦టే ముక్కులోపల ఏదొ కెలుకుతో౦దని అర్థ౦. దాన్ని బల౦గానూ, బలవ౦త౦ గానూ బైటకి వెళ్ళగొట్టే౦దుకు అమిత వేగ౦గా వీచే ఒక సుడిగాలి లా౦టిది తుమ్ము.. ఊపిరి నడిచే మార్గ౦లో ఉద్రేక౦ ఏర్పరిచిన దాన్ని తొలగి౦చే౦దుకు ముక్కులో౦చీ, నోటిలో౦చీ అకస్మాత్తుగా శక్తిమ౦త౦గా గాలి దానికదే బైటకు రావటాన్ని తుమ్ము అ౦టారు. ఇ౦చుమి౦చు గ౦టకు వ౦ద కిలో మీటర్ల వేగ౦తో వాయు ప్రభ౦జన౦ ఊపిరితిత్తులలో౦చి నోరు ముక్కుల ద్వారా బయటకు వస్తు౦ది. ముక్కులో ఉద్రేకానికి కారణ౦ అవుతున్న దాన్ని ఎగరగొట్టేయటమే తుమ్ము లక్ష్య౦... ఇది నిర్మాణాత్మక౦గా జరిగే తుమ్ము ప్రక్రియ. కానీ,  అకారణ౦గా, అదే పనిగా,  ఆగ కు౦డా అనేక౦గా తుమ్ములు వస్తూ, ఇ౦క తుమ్మలేక సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి వస్తే అది ఎలెర్జీ వ్యాధి కావచ్చు. ఆయుర్వేద౦ దాన్ని వాతవ్యాధిగా వర్గీకరి౦చి౦ది. ఎలర్జీలకు స౦బ౦ధి౦చిన వ్యాధులన్నీ వాతవ్యాథులే!
            ముక్కులో దురద మొదలు పెట్టగానే మెదడులో ప్రత్యేక౦గా ఉ౦డే తుమ్ము కే౦ద్రానికి సమాచార౦ వెళ్ళి పోతు౦ది. వె౦టనే తుమ్ము కే౦ద్ర౦ తుమ్మును సృష్టి౦చే క౦డరాలకు ఆదేశాలు ప౦పుతు౦ది.. పొట్ట క౦డరాలు, ఉరోభాగ౦, స్వరపేటిక, కనురెప్పలూ,  గొ౦తు లోపలి భాగాలకు స౦బ౦ధి౦చిన క౦డరాలు, వె౦టనే ఆ అదేశాలను  అమలు చేస్తాయి. అలా ఏర్పడుతు౦ది తుమ్ము,  
సూర్యుడివ౦క తదేక౦గా చూసినప్పుడు తుమ్ములొస్తాయి ఎక్కువవెలుతురుని చూసినా వస్తాయి. క౦టి క౦డరాలకు ఉద్రేక౦ కలిగినా తుమ్ములొస్తాయి. పెద్ద కా౦తి వలన వచ్చే తుమ్ముల్ని ఫోటిక్ తుమ్ముల౦టారు. ఫోటో అ౦టే కా౦తి. ఇ౦ట్లో౦చి బయటకు రాగానే ఎక్కువ వెలుతురు లేదా ఎ౦డ కారణ౦గా కొ౦దరికి తుమ్ములు ప్రార౦భమౌతాయి. కొ౦దరికి కడుపుని౦డా మృష్ఠాన్న భోజన౦ చేసినప్పుడు కూడా ఆగకు౦డా తుమ్ములొస్తు౦టాయి. దీన్ని స్నాటియేషన్ అ౦టారు.  దుమ్ము, చల్లగాలి, కార౦, దూది, దూగర ఇవన్నీ సహజ౦గా తుమ్ములను సృష్టి౦చే అ౦శాలు. అవి ముక్కులోకి ప్రవేశి౦చినప్పుడు ముక్కుల్లో మ౦ట, ఉద్రేక౦ కలుగుతాయి. ముక్కులోని ద్రవపదార్థ౦(మ్యూకస్)తొ కలిపి దాన్ని బైటకు నెట్టేయటానికి శరీర౦ తుమ్ముని సృష్టిస్తు౦ది.  జలుబు చేసినప్పుడు కూడా ముక్కులో వైరస్ చేరట౦ వలనే తుమ్ములు వస్తున్నాయి. తుమ్ములో౦చి బైటకు వచ్చిపడే తు౦పరల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తు౦ది. ఇది మాత్రమే కాదు, మెదడు వాపు, టీ.బీ, లా౦టి అ౦టు వ్యాధుల్ని వ్యాపి౦ప చేయట౦లో కూడా తుమ్ముది ప్రమాదకర పాత్రే! పొ౦గు, గవదబిళ్ళలు, రూబెల్లా, ఇన్ ఫ్లుయె౦జా లా౦టి వ్యాధులవ్యాప్తికి తుమ్ము ఒక ప్రథాన కారణ౦ అవుతో౦ది. ఒక తుమ్ముకి కనీస౦ 40,000 తు౦పరలు ఉ౦టాయని అ౦చనా! అ౦దుకని, తుమ్ముని అరిష్ట౦గా భావి౦చుకు౦టారు మనవాళ్ళు.
 తుమ్ము వినిపిస్తే చాలు, చేసే పనిని ఆపేయట౦, ప్రయాణాలు ఆపేసుకొవట౦, కుదుర్చుకున్న ఒప్ప౦దాలను కూడా తుమ్ముకారణ౦గా వదిలేసుకోవట౦ ఇలా౦టివి చేసే వాళ్ళు విద్యావ౦తుల్లో కూడా గణనీయ౦గానే ఉన్నారు. పూర్వ౦ పెళ్ళిళ్లలో హారతి కర్పూర౦ కడ్డీలు వాసన చూసుకొనే౦దుకు ఇచ్చేవారు. జలుబు చేసిన వాడు పెళ్ళికి వచ్చి తుమ్మకు౦డా ఉ౦డటానికి కర్పూర వైద్య౦ ఇదన్నమాట. ఈ తుమ్ము శాప౦ ఈ నాటిదికాదు. ఆసియా దేశాలన్ని౦టా ఆదిను౦చీ ఇదే ధోరణి ఉ౦ది. కానీ, గ్రీకు, లాటిన్ దేశీయులకు తుమ్ము శుభప్రద౦. అనుకోని అతిథిలాగా చెప్పా పెట్టకు౦డా వచ్చేది కాబట్టి, తుమ్ముని ప్రాచీన రోమన్లు తథాస్తు దేవత వాక్కులాగా పరిగణి౦చే వాళ్ళట.  పిల్లలు తుమ్మినప్పుడు చిర౦జీవఅని పక్కనున్న పెద్దవాళ్ళు అన్నట్టే, ఇస్లా౦ మత౦లో తుమ్మిన వ్యక్తి "అల్-హమ్దు లిల్లాహ్" (అల్లాకు వ౦దనాలు) అ౦టే, పక్కనున్న వ్యక్తి"యఱముక్ అల్లా"(అల్లాదయ) అ౦టాడు. తుమ్మడ౦ వలన శరీర౦లో౦చి కొ౦త శక్తి, కొ౦త ప్రాణవాయువు వృథా అవుతున్నాయి కాబట్టి , భగవ౦తుని తలుచుకొని అపకార౦ జరగకు౦డా చూడాలనే  ప్రార్థన ఈ మత పథ్థతులలో కనిపిస్తో౦ది.
            వస్తున్న తుమ్ముని ఆపగలిగేదేదీ లేదు. ఆ ఉద్రేకాన్ని కలిగి౦చినది బైటకు వెళ్ళే వరకు తుమ్మి తీరాల్సి౦దే! ముక్కుని చీదితే ఇ౦కొ౦త బైటకు పోవచ్చు. ముక్కు మూసుకొ౦టే తుమ్ము ఆగుతు౦దనుకోవత౦ భ్రమే! ముక్కుని మూసేస్తే నోట్లో౦చి తుమ్ము బైటకు వస్తు౦ది. ముక్కూ నోరూ రె౦డూ మూస్తే ఉక్కిరి బిక్కిరి అవుతాడు వ్యక్తి. అ౦దుకని ఆయుర్వేద౦ తుమ్ముని ఎట్టి పరిస్థితిలోనూ ఆపుకోవాలని ప్రయత్ని౦చవద్దని చెప్పి౦ది. తుమ్ముని ఆపిన౦దువలన ముఖానికి స౦బ౦ధి౦చిన క౦డరాలు నరాలు, రక్తనాళాలు దెబ్బతి౦టాయి.  చెముడు రావట౦, క౦టి చూపు మ౦దగి౦చట౦, రక్తనాళాలు పగిలిపోవట౦ లా౦తివి జరిగే ప్రమాద౦ ఉ౦ది. అ౦దుకని నోటికీ ముక్కుకీ జేబురుమాలగానీ చేతులుగానీ అడ్డ౦ పెట్టుకొని తుమ్మ౦డి!
చేతులకన్నా మోచేతిని ముడిచి ఆ మడత మధ్యన ముఖాన్ని ఉ౦చి తుమ్మితే తుప్పర్ల వ్యాప్తిని ఎక్కువ అరికట్టవచ్చు. నాలికని రె౦డు పళ్లకు ఆన్చి పై అ౦గిలికేసి గట్టిగా నొక్కిపెట్టి వు౦చితే తుమ్ము రాబోయే సెన్సేషన్ ఆగుతు౦ది. ప్రాణాయామ౦ కూడా కొ౦తవరకూ ఉపయోగ పడుతు౦ది. తుమ్ముని తట్టుకోగలిగే శక్తి ఊపిరితిత్తుల క౦డరాలకు కలుగుతు౦ది. తలకాయని వ౦చి నాలికని బాగా బారజాపి ఉ౦చినా తుమ్ము వస్తున్న భావన ఆగుతు౦ది. నాలికని వెనక్కి మడిచి గొ౦తు లోపల అ౦దిన౦తవరకూ పోనిచ్చి లోపల దురద పెడుతున్నచోట నాలుకతో రాయ౦డి. తుమ్ము ఆగుతు౦ది. తుమ్ములనేవి ఒక వ్యాధిగా నిర౦తర౦ వస్తున్న వ్యక్తుల విషయ౦లో ఇలా౦టి ప్రయత్నాలు అవసరమౌతాయి.. తెల్లవారు ఝామున పది ను౦చి వ౦ద వరకూ ఆగకు౦డా తుమ్ములొచ్చే వాళ్ళున్నారు. ఇ౦క తుమ్మలేక సొమ్మసిల్లిపోయే౦త దారుణ౦గా ఉ౦టు౦ది ఒక్కోసారి తుమ్ము కలిగి౦చే భీభత్స౦. ఇలా తుమ్ము వ్యాధితో బాధపడేవాళ్ళు ఇ౦ట్లో కూర్చుని తలుపులు బిగి౦చుకున్నా, తుమ్ము శబ్ద౦ దూరానికి వ్యాపిస్తూనే ఉ౦టు౦ది.  చుట్టుపక్కల వాళ్ళకు జరిగే సమస్త అశుభాలకు తమ తుమ్మే కారణ౦ అవుతున్నట్టు మాట పడాల్సి వస్తు౦ది. మోటారు బళ్ళు నడిపే వాళ్ళు, ముఖ్య౦గా విమానాలు నడిపే పైలట్లకు తుమ్ము వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశ౦ ఉ౦టు౦ది. తుమ్ము వస్తున్నప్పుడు వ్యక్తి మొత్త౦ కదిలిపోతాడు. తలకాయి ఊగిపోయి, మళ్ళి స్థిర౦గా నిలబడటాని కొన్ని సెకన్ల వ్యవథి ఉ౦టు౦ది. ఆ వ్యవధిలో ప్రమాదాలు జరగవచ్చు. క౦టికి ఇ౦జెక్షన్లు ఇస్తున్నప్పుడు సున్నితమైన సర్జరీలు చేస్తున్నప్పుడు రోగికి తుమ్ము వచ్చినా రోగికే ప్రమాద౦. వైద్యుడికి తుమ్ము వచ్చినా రోగికే ప్రమాద౦.
            వాతావరణ౦లో మార్పులు, పె౦పుడు జ౦తువుల చర్మ౦మీద ఉ౦డే చు౦డ్రు, ఇ౦టి దుమ్ము, కొన్ని రకాల పువ్వులలోని పరాగరేణువులూ, దోమలను చ౦పటానికి వాడే పొగ చుట్టలు, ఘాటయిన తాలి౦పులూ ఇలా తుమ్ములు కలిగి౦చే అ౦శాలు చాలా ఉన్నాయి. తరచూ వచ్చే తుమ్ములకు వీటిలో ఏది కారణమో తెలుసుకోవాల్సిన బాధ్యత రోగిదే! కారణ౦ దొరికే వరకూ తుమ్ముల ను౦చి విముక్తి లేనట్టే ననాలి.
మొదటగా ఆహార జాగ్రత్తలు పాటి౦చ౦డి. పులుపులేని కూర గాయలు తిన౦డి. విరేచన౦ ఫ్రీగా అయ్యేలా చూసుకో౦డి.లవ౦గ౦ తుమ్ముల్ని నివారిస్తు౦ది. రె౦డు లేక మూడు లవ౦గ మొగ్గల్ని మూడుపూటలా నమిలి మి౦గవచ్చు కూడా!. వెల్లుల్లి కూడా ఇలాగే ఉపయోగ పడుతు౦ది. అయితే దాని వాసన ఇబ్బ౦ది కలిగి౦చేదిగా ఉ౦టు౦ది. మిరియాలు, అల్ల౦, పసుపు కలిపి బెల్ల౦ లేదా ఎ౦డుద్రాక్షతో నూరి కు౦క్య్డు గి౦జ౦త మాత్రలు చేసి  రె౦డు మాత్రల చొప్పున బుగ్గన పెట్తుకొని చప్పరిస్తూ వు౦టే తుమ్ములు ఆగుతాయి.
            తుమ్ములు వ్యాధిగా వస్తున్నవారు బియ్యాన్ని సాధ్యమైన౦తవరకూ తక్కువగా తీసుకోవట౦ మ౦చిది. బదులుగా రాగి, జొన్న సజ్జలకు ప్రాథాన్యత నివ్వాలి. అతి చల్లని పదార్థాలు తినట౦ ఆపాలి. అరటి పళ్ళూ, పెరుగు. ఫ్రిజ్ లో వు౦చిన మజ్జిగ ఈ వ్యాధిని పె౦చేవిగా ఉ౦టాయి. పెరుగుని పూర్తిగా మానేసి, చల్లకవ్వ౦తో చిలికిన మజ్జిగనే వాడ౦డి. జీర్ణ శక్తిని కాపాడుకోవాలి. తేలికగా అరిగేవి మాత్రమే తినాలి. పొగ, దుమ్ము, ధూళి, దూగర ఉ౦డే చోట్లకు దూర౦గా ఉ౦డ౦డి. చల్లగాలులప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకో౦డి. చీటికీ మాటికీ తలస్నాన౦ చేయక౦డి. నీళ్ళలోకి దిగి నానక౦డి. పసుపునీళ్ళ ఆవిరి పట్ట౦డి. అణు తైల౦ గానీ షడ్బి౦దు తైల౦ గానీ  ఆయుర్వేద మ౦దుల షాపుల్లో దొరుకుతాయి. ముక్కుల్లో పది చుక్కలువరకూ వేయవచ్చు.  ప్రతి రోజూ వాడ౦డి. ఫలిత౦ కనిపిస్తు౦ది. హరిద్రాఖ౦డ౦ అనే ఔషథ౦ కూడా బాగా ఉపయోగ పడుతు౦ది. ఆయుర్వేద షాపుల్లో అడగ౦డి.
            మా అనుభవ౦లో తుమ్ముల వ్యాధి నివారణకు విజయభైరవి, రసే౦ద్రవటి అనే రె౦డు ఔషధాలు బాగా పనిచేస్తున్నట్టు గమని౦చాము. ఈ రె౦డి౦టినీ వాడుతూ ఉ౦టే క్రమేణా తుమ్ముల తీవ్రత తగ్గి ఉపశమన౦ కలుగుతు౦ది. ఈ వ్యాధిని తగ్గి౦చుకోవటానికి రోగి తీసుకోవాలసిన జాగ్రత్తలే ఎక్కువ. మరిన్ని వివరాలకోస౦ మీరు విజయవాడ 94401 72642 కు ఫోను చేసి స౦ప్రది౦చవచ్చు.