Sunday 15 June 2014

వ్యర్థ ప్రయోగ నిష్ఫలాలు :: డా. జి వి పూర్ణచందు

విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నేను నిర్వహిస్తున్న శీర్షికలో జూన్ 15 న ప్రచురితమైన పద్యం ఇది:

వ్యర్థ ప్రయోగ నిష్ఫలాలు

డా. జి వి పూర్ణచందు

“తేజము, సాధు వృత్తమును, తేకువ గల్గిన మర్త్యుడెప్పుడున్
అజికి నిట్లనున్ పరుని యాలికిట్లనున్, నర్థి కిట్లనున్
తేజము సాధువృత్తమును తేకువ లేని నరూండు నెప్పుడున్
అజికి నిట్లనున్, పరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్...”
ఇది తెనాలి రామకృష్ణుడిదిగా భావిస్తున్న చాటు పద్యం. ఇందులో అర్థం కానిదేమీ లేదు. అర్థం అయ్యేది కూడా ఏమీ లేదు. నిజానికి అర్థం కూడా ఏమీ లేదు. అలాగని వ్యర్ధ పద్యం కాదు. గొప్ప పద్యమూ కాదు. ప్రతిభావంతుడైన ఒక కొంటెకవి చేసిన సరదా ప్రయోగం ఈ పద్యం.
రాయల ఆస్థానానికి ఎవరో మహా పండితుడు వాదించటానికి వస్తున్నాడని తెలిసి, ఆయన్ని అర్థం కాని పదాలతో బెదర కొట్టటానికి వేసిన ఎత్తుగడ ఈ పద్యం.
‘ఇట్లనున్’ తప్ప ఈ పద్యంలో ఇంకొకటి లేదు. దీనికి అర్థం ఎలా చెప్పాలో తెలియక ఆ పండితుడు ఓటమి అంగీకరించాడు. కానీ, రాయలు రామకృష్ణుణ్ణి వదల్లేదు. “ఆయన చెప్పలేక పోయినా అర్థం నువ్వు చెప్పగలిగి ఉండాలి కదా?” అనడిగాడు.
“చెప్తాను ప్రభూ!” అంటూ భుజం మీది ఉత్తరీయం తీసి నడుముకు కట్టి నాట్యాచార్యుడిలా అబినయిస్తూ అదే పద్యాన్ని తెనాలి రామకృష్ణుడు ఇలా చెప్పాడు:
“తేజము, సాధు వృత్తమును, తేకువ గల్గిన మర్త్యుడెప్పుడున్” పరాక్రమం, మంచితనం, దాన గుణం కలిగిన ఒక మంచివాడు...
“అజికి నిట్లనున్” శత్రువు దాడికి వచ్చినప్పుడు ‘ఇట్లనున్’ అంటూ జాగ్రత్త అని హెచ్చరిస్తాడన్నట్టు అభినయించి చూపించాడు. నిజానికి ఈ పద్యంలో ‘ఇట్లనున్’ అన్నాడే గానీ ఎట్లా అన్నాడో రాయలేదు. దాన్ని పాఠకుడు ఊహించుకోవాలన్నమాట! ఇప్పుడు రాయలవారే అడిగే సరికి ఇట్లా అన్నాడని నటించి చూపించాడు.
“పరుని యాలికిట్లనున్” మంచి తనం ఉన్నవాడు కాబట్టి పరాయివాడి భార్య ఒక వేళ కోరరాని కోరిక కోరితే ‘ఇట్లనున్’ అని, చెయ్యి అడ్డంగా ఊపుతూ అభినయించి చూపించాడు,
“అర్థికిట్లనున్” పేదవాడు యాచనకొచ్చినప్పుడు దాన గుణం కలిగిన వాడు కాబట్టి ‘ఇట్లనున్’ అంటూ ‘ఇంద తీసుకో ’ అన్నట్టుగా అభినయించాడుట! ఈ అభినయాలేవీ లేకుండా ఊరికే ఇట్లనున్ అంటూ పద్యాన్ని పద్యంలాగా చదివితే ఎంతటి పండితుడికైనా ఠారెత్తటం సహజం.
ఇక్కడికి రెండు పాదాలు పూర్తయ్యాయి. మూడో పాదంలో పరాక్రమం, మంచితనం, దాన గుణం లేని వాడైతే ఇదేసందర్భాలలో ‘ఇట్లనున్’ అంటూ సరిగ్గా వ్యతిరేక చర్యలను అభినయించిచూపించ సాగాడు
శత్రువు వచ్చినప్పుడు వీడు తేజం లేనివాడు కాబట్టి, భయపడి దణ్ణంపెట్టి కాళ్ళమీద పడినట్టు, శీలం లేని వాడు కాబట్టి, పరాయి వాడి భార్య పిలిస్తే పళ్ళికిలిస్తూ కులికినట్టు, పిసినారి కాబట్టి, దానం కోరి వచ్చిన వాణ్ణి చీదరించుకున్నట్టూ అభినయించి చూపించాడు.
నాటక రచనలో నటుడు ఒక సంభాషణను ఎలా నటించాలో స్పష్టంగా రాస్తారు. ఈ పద్యంలో కేవలం ‘ఇట్లనున్’ అంటూ చదివే వాడి ఊహకు వదిలేశాడు. నిజానికిది అసంపూర్ణ ప్రఙ్ఞా దురహంకార రచన!
పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఈ పద్యాన్ని ఉటంకిస్తూ, “రామకృష్ణుడు తార్కికుడు. ఈ వాసన వాని గ్రంథాల్లో ప్రతి చోటా కనిపిస్తుంది” అని మెచ్చుకున్నారు గానీ, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు, “రామకృష్ణ కవికి చాలనిది నేర్పు కాదు, మరి యోర్పు” అంటారు.
కవికి నేర్పుతోపాటు ఓర్పు తోడైతే ఆ సాహిత్యానికి మరింత ప్రయోజనాత్మకత సిద్ధిస్తుందని దీని భావం. నేర్పొక్కటే ఉంటే ప్రయోగాలు తమాషాలు చేస్తాయి కానీ, ప్రయోజనాలు మాత్రం సశేషాలౌతాయి.
పద్యాన్నో, కవితనో, లేదా ఒక సంభాషణనో వ్రాసేప్పుడు అందులో చమత్కారాన్ని పేల్చ గలిగే నేర్పుతో పాటు కొంత సందేశమూ, ఆలోచనా లోచనమూ చొప్పించ గలిగిన ఓర్పు కవికి ఉంటే అది గొప్ప కవిత అవుతుంది లేకపోతే వికట కవితగా మిగిలిపోతుంది.
చార్లీ చాప్లిన్ సినిమాలు కేవలం నవ్వుకోసం కాదు, జీవితాన్ని సజీవంగా ప్రదర్శించటానికి పుట్టిన సంగతి మనం మరిచిపోకూడదు.