Sunday 17 April 2016

భాషా గీర్వాణం:: డా. జి వి పూర్ణచందు

భాషా గీర్వాణం:: డా. జి వి పూర్ణచందు
"యతియుంబ్రాసయు లేని సంస్కృత కవిత్వారణ్య మందున్న భా
రత వేదాన( బదేను పర్వముల కాంధ్రత్వంబు నేర్పించి శా
శాశ్వతుడై పోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్
నతు లర్పింపుము; స్నానమాడు మతిగణ్యంబైన పెన్నానదిన్"
మహాకవి జాషువా...తనకు పాండిత్యం ఎంత ఉన్నా కులంచేత సామాజిక గౌరవాన్ని పొందలేక, పేదరికం చేత సుఖ జీవనాన్ని అందుకోలేక, తన దీన స్థితిని ఈశ్వరుడికి చెప్పవలసిందిగా గబ్బిళాన్ని ప్రార్థిస్తాడు.
ఇంటి చూరుకో, పైకప్పుకో పట్టుకు వ్రేలాడుతుంది గబ్బిళం . అది పట్టుకున్న చోట ఒక పెన్సిలుతో చుక్కపెడితే ఎక్కడెక్కడో తిరిగి, తిరిగి ఆ చుక్కమీదే వాలగల సమర్ధత కలిగింది. ‘గురి’ని అవలీలగా చేరగలది కాబట్టే, దాన్ని వేడుకున్నాడు కవి, తన పక్షాన దేవుడితో రాయబారం నడపమని!
గబ్బిళం అందరిలాగా మామూలు కళ్లతో చూడదు, ఙ్ఞాననేత్రంతో చూస్తుంది. దాని చూపుని అర్ధం చేసుకునే గదా రాడార్ వ్యవస్థని కనిపెట్టారు...
గబ్బిళం స్తన్య జీవి. అయినా దానికి పిల్లల్ని కని పాలిచ్చి పెంచే ఆవులాంటి జంతు జీవాలతో సమాన గౌరవం లేదు. పక్షిలా ఎగరగలదు. తూనీగలాగా దూసుకుపోగలదు. దానికన్నా వేగంగా దిశను మార్చుకోగలదు. అయినా చిలుకలాగా పరువు లేదు. గ్రద్దలాగా ప్రతిష్టలేదు. ఏ దేవుడూ పట్టించుకోని మేధావి గబ్బిళం. దానికి మొర పెట్టు కున్నాడు కవి. అణచివేతకు గురైన వ్యక్తులు అణచి వేసే వారికి చెప్పుకోలేరు కదా!
గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971) అందరూ భావ కవిత్వం వ్రాస్తున్న కాలంలో సామాజిక ప్రయోజనం కోసం రచనలు ప్రారంభించిన కవి. కవితాయుధంతో కులవాదుల మీద తిరగబడ్డాడు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.
“యతిప్రాశలు లేని సంస్కృత కవిత్వ దుర్గమారణ్యంలో ఐదోవేదం బందీగా ఉంది. దాని బంధనాలు వదిలించి, పదిహేను పర్వాలను తేట తెలుగులోకి తెచ్చి, శాశ్వత కీర్తిని పొదాడు తిక్కన మహాకవి. ఆయన ఊరు నెల్లూరు. దాని మీదుగా వెళ్ళేప్పుడు ఆ నగరికి నమస్కారం పెట్టు. గొప్పదైన పెనానదిలో స్నానం చెయ్యి...” అని గబ్బిళానికి సూచిస్తాడు ఈ పద్యంలో. తంజావూరు సరస్వతీ మహలుని సందర్శించ మంటాడు. ఇంకా ఇలాంటి ముఖ్య దర్శనీయ స్థలాలకు మొక్కమంటాడు. సామాజిక కవితకు కొత్త ఊపిరి పోసిన పద్యకవి జాషువా!
మేథావుల్లోనూ పండితుల్లోనూ సంస్కృతాభిమానం జాస్తిగా ఉండి, అది మాతృభాషాభిమానాన్ని కప్పిపుచ్చుతోంది. తెలుగుభాషపై మక్కువని ఆంగ్ల భాషాభిమానులతో పాటు సంస్కృతభాషాభిమానులు కూడా ఈసడించటాన్ని చాలా మందిలో గమనించాను. ఒక సంస్కృతాభిమాని తన ఇంట్లో పనిమనిషితో కూడా గీర్వాణంలోనే మాట్లాడతానన్నాడు. అందువలన అమ్మభాషకు ఒరిగిందేమిటని అడిగాను. సంస్కృతం బతికితే అన్ని భాషలూ బతికినట్టే నని ఆయన సమాధానం. పూర్వం జయంతి రామయ్య, కొక్కొండవెంకట రత్నం లాంటి గ్రాంథిక భాషావాదులూ ఇలాగే ఇంట్లో కూడా గ్రాంథికమే మాట్లాడే వాళ్ళని ప్రతీతి. వీళ్ళు కారడవుల్లో బతకవలసిన వాళ్ళనేది జాషువా గారి అభిప్రాయం అందుకే “యతియుంబ్రాసయు లేని సంస్కృత కవిత్వారణ్యం” అన్నాడాయన.
మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారి సంస్కృత వాఙ్ఞ్మయ చరిత్ర ప్రధమ భాగం చదివితే, సంస్కృతభాష ఎలా రూపొందిందో బాగా అర్ధం అవుతుంది. అది అన్ని అమ్మభాషల్లాగా ఏర్పడింది కాదు. మానవ నిర్మితం. ఏ భాషా రాత్రికి రాత్రే పుట్టదు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన కారణాలతో భాష ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలు పొందుతూ ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. సంస్కృతం నేర్చుకోవటానికి దైవభక్తికీ ముడి పెట్టినందువలన కొత్త సమస్య లొచ్చాయి.
దేవుడికి సంస్కృతం మాత్రమే తెలుసని, తెలుగులో “అయ్యా నా సమస్య తీర్చు” అని వేడుకుంటే దేవుడికి అర్ధం కాదనీ జనంలో భ్రమలు కల్పించ నవసరం లేదు. వేదమంత్రాలను సంస్కృతం అని మన చేత నమ్మించాలని చూడటం అన్యాయం.
సంస్కృతం అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతిఒక్కరికీ గౌరవం ఉంటుంది. ప్రత్యేకంగా బోర్డు తగిలించుకుని ఆ అభిమానం చాటుకో వలసిన అవసరం లేదు. అలాగే మాతృభాషాభిమానానికీ బోర్డు అవసరం లేదు. కానీ, అమ్మభాష పట్ల చిన్నచూపునే ఆక్షేపించాల్సి వస్తుంది. వేరొక భాషాభిమానంతో అమ్మభాషని వాడకపోవటం మాతృభాషా ద్రోహమే!
పదిహేనుపర్వాల అచ్చతెలుగు ఆంధ్రమహాభారతాన్ని తిక్కనగారికి నమస్కరించుకుని, తెలుగు భాష కోసం చదవాలనేది జాషువా గారి అభిప్రాయం. సంస్కృత పదాలతో నింపి ఇదంతా తెలుగనటం పండితుల్లోని పాండిత్యప్రదర్శనా ధోరణికి అద్దంపట్టడమే అవుతుంది. భాషా గీర్వాణం వదిలి తెలుగులోనే మాట్లాడే వాడికి కోటి దండాలు