Saturday 25 April 2015

కా… కా… కవులు :: డా. జి వి పూర్ణచందు

కాకాకవులు :: డా. జి వి పూర్ణచందు
నింబ వృక్షమునందు నెగడు కాకములట్లు…, పల్లెలయందూర బందులట్లు…, అవివేకులగు నరపతుల చెంత బందలగు పండితులు గొందఱుందురట్టి వారికిని జేయుదును గొన్ని వందనములు

పూర్వ కవులు తమ కావ్యాలలో ఉపోద్ఘాతాలు వ్రాసేప్పుడు మంచి కవుల్ని పొగుడుతూ (సుకవి స్తుతి), చెడ్డకవుల్ని తిడుతూ (కుకవినింద) వ్రాయటం ఒక ఆచారంగా పాటించేవారు. తాను మంచి కవుల కోవలోకి వస్తానని చెప్పుకోవటం కూడా కొందరి ఉద్ధేశం కావచ్చు. అడగందే అమ్మైనా పెట్టనట్టు చెప్పుకోనిదే తెలియదనే భావన కూడా ఉండవచ్చు.

19వ శతాబ్దినాటి భరతాభ్యుదయంకావ్యంలో మాడభూషి వేంకటాచార్యకవి చేసిన కుకవినిందపద్యం ఇది. ఆనాటి బ్రిటిష్యుగంలో తెలుగు కవుల పరిస్థితికి, ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో తెలుగు కవుల పరిస్థితికి ఏమీ తేడా లేదని ఈ పద్యం చదివితే అర్థం అవుతుంది.
నింబవృక్షమునందు నెగడు కాకములట్లు: వేపచెట్టు మీద చేరిన కాకుల్లాగా కొందరు కవులు ఉంటారు

పల్లెలందూరబందులట్లు: పల్లెల్లో మురుగ్గుంటల్లో దొర్లే ఊరపందుల్లాగా ఇంకొందరుంటారు
అవివేకులగు నరపతులచెంత బందలగు పండితులు గొందఱుందురు: జమీందార్లు, వ్యాపార్లు, డబ్బున్నఆసాములు, వీళ్ళకి సాహిత్యం గురించి ఏమీ తెలియక పోయినప్పటికీ కాకా ఘనులైన కొందరు వాళ్లని ఆశ్రయించి బతుకుతుంటారు.
అట్టి వారికిని జేయుదును గొన్ని వందనములు: అలాంటి కాకాకవులకు వందనం చేస్తున్నానుఅంటాడు కవి.
కవులకూ, కళాకారులకు సంబంధించిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఆ కాలంలో అయినా, ఈ కాలంలో అయినా ఇలా వేపచెట్టు మీద కాకులూ, బురదలో పొర్లే ఊరపందులూ, కాకారాయుళ్ళతో నిండి ఉండటం, వాళ్ళవలన అవి భ్రష్టు పట్టటం అనాదిగా ఉన్నదే! తెనాలి రామకృష్ణ సినిమాలో రాజదర్శనం కోరిన కవికి ఎవరు ఎలా అడ్డుపడతారో చక్కగా చూపిస్తాడు. బ్రిటీష్ యుగంలో ఇది మితిమీరింది. జమీందార్లు, భూస్వాములూ, రాజా బిరుదు కోసం తాపత్రయపడే వాళ్ళూ చాలా మంది అపర భోజుడనిపించుకోవాలనే తపనతో కవులకు, కళాకారులకూ ఎంగిలి చెయ్యి విదిల్చి, కన్నీటి తుడుపు సాయం చేసిన వాళ్ళే ఎక్కువ! ఆ రోజుల్లో కూడా కవులలో పూట గడవని వాళ్ళూ, రాజాదరణని ఒక యోగ్యతగా భావించిన వాళ్ళూ ఇద్దరూ ఉండేవాళ్ళు. కానీ, నాలుగు పొగడుబోతు పద్యాలుఆశువుగా దట్టించి, ఇచ్చింది పుచ్చుకు పోయే వసూలు కవిరాజుల్ని ముఖ్యంగా వేపచెట్టు మీద కాకులతో పోల్చాడు కవి!

స్వాతంత్ర్యం వచ్చాక ఈ పరిస్థితి ఘోరంగా మారింది. వేపచెట్లూ, వాటి మీద కాకులూబురదలూ, వాటిలో పొర్లే పందులూపేర్ల మార్పుతో మరింత అసహ్యంగా కొనసాగాయి. రాజాలూ, జమీందార్లు పోయి కవుల్నీ కళాకారుల్ని పోషించే బాధ్యతని అకాడెమీలూ, సాంస్కృతిక శాఖలు, వ్యాపారం చేసుకునే ఇతర సాహితీ సాంస్కృతిక సంస్థలూ స్వీకరించాక వాటికి విలువ కూడా తగ్గి పోయింది.

నార్లవారితో వేసిన కమిటీ అకాడెమీల రద్దును సూచించింది. కానీ, ఆ తరువాత కాకా బాకాల ప్రాధాన్యత పెరిగిందే గానీ తగ్గలేదు. పైగా వీళ్ళ వలన జరిగే నష్టం పావలా అయితే, అకాడెమీలను రద్దు చేసినందు వలన కలిగిన నష్టం రూపాయి అయ్యింది. అది ఇప్పుడు పూడ్చ లేనిది కూడా!

చిన్న చిన్న సంస్థలనుండి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సంస్థల వరకూ ఇచ్చే పురస్కారాలు, పుస్తక ప్రచురణ సహకారాలు అర్హులకు చేరటంలో దారుణమైన అన్యాయం జరుగుతోంది. బాపూ గారికి పద్మశ్రీ ఇవ్వకపోతే అవమానం పద్మశ్రీలు ఇచ్చే వ్యవస్థకు గానీ, బాపూ గారికి కాదు కదా!

ఓ కవిగారు ఇలా అన్నాడు: నిష్కారుణ్య మాత్సర్య భావమె కాకా ఘను లుండకున్న నల దేవానాం ప్రియశ్రేణి కెట్లమరుం గీర్తి?” నిష్కారుణ్య మాత్సర్య బావాలున్న కాకా ఘనులే ఉండక పోతే దేవానాం ప్రియులకు కీర్తి ఎలా అమరు తుందని ప్రశ్నిస్తాడు.

తంజావూరు నాయకరాజు అచ్యుతప్ప నాయకుడు 16వ శతాబ్దిలో తెలుగు యక్షగాన మేళా కోసం కళాకారులకు జీవనభృతిని కల్పిస్తూ మేలట్టూరుఅనే ఊరు ఏర్పరిచాడు. అలాగే శాహాజీ అనే తంజావూరు మరాఠారాజు తన రాజ్యం లోని తెలుగు కవులందరి కోసం తిరువశ వల్లూరులేదా శాహాజీ పురం గ్రామాన్ని ఇచ్చాడు. భాగవతులైన నాట్య కళా కారులకు తానీషా ప్రభువు కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చాడు. అందుకే, వాళ్ళు జనం నాలుకలమీద బతికున్నారు. ఇవ్వని వాణ్ణి తలచుకునేదేం ఉంటుందీ…?

తిరుపతి వెంకటకవులకు బహుమానం ఇద్దామని ఆత్మకూరు జమీందారు అనుకున్నాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక అధికారి(అధిక+అరి)అడ్డుపడి, వాళ్ళు సొల్లు కవిత్వం చెప్తారనీ, పండితులు కాదనీ, ఇలాంటి కానుకలు పండితుల కిస్తే పుణ్యం వస్తుందనీ అన్నాడట. దాంతో జమీందారుగారు తన ప్రయత్నం విరమించుకున్నాడు. అది తెలిసి తిరుపతి కవులు శనిగ్రహంఅనే పేరుతో ఆ అధికారి మీద 27 పద్యాల చిన్న పుస్తకం వ్రాశారు. కుంకా! పాపమటంచు నెంచక వృథా కొండెమ్ములన్ రాజుతో బింక మొప్పగ జెప్పి యాతని మదిన్ ద్వేషమ్ము పుట్టించి తీవింకం జేసెడిదేమి లేదు కద? నిన్నేమందుము? ఈ పైన మా చంకన్నాకు చండాల! శనిగ్రహంబ…” ఇలా ఉంటాయా తిట్లు.


చంకన్నాకు చండాలాఅని తిట్టినంత మాత్రాన, పదవిని అడ్డం పెట్టుకునే అలాంటి శనిగ్రహాలకు ఊడేదేం ఉండక పోవచ్చు. కానీ, మహా కవుల తిట్లు తగలవా? ముఖ్యంగా కవులూ, కళాకారుల దగ్గరా, అవేవీ కాని వాళ్ళ దగ్గరా డబ్బులు తీసుకుని పురస్కారాలిచ్చే వాణిజ్య సాంస్కృతిక సంస్థల వాళ్ళకి మాడభూషి వారు తిట్టిన పందులు దొర్లే బురద”, “కాకులు చేరే వేపచెట్టుతిట్లు తప్పక తగులుతాయి.

నాంచారమ్మ కథ :: డా. జి వి పూర్ణచందు

“అలరుల నందనంబున
అలరారుచు నొక్క కన్య యావిర్భవమై
అలసీత మున్ను భూమిని
చెలువుగ నుదయించినట్లు శ్రీయొప్పారెన్”
శ్రీ విల్లిపుత్తూరులో కొలువై ఉన్న గోదాదేవిని మోక్ష సంపదలిచ్చేది కాబట్టి చూడికొడుత్తవళ్ అని పిలుస్తారు తమిళులు. ‘చూడికొడుత్త నా(చ్చారు’ ఆమె పేరు. నాచ్చియార్ అని ‘య’కారంతో పలకాలి. ఈమెనే నాంచారు అంటారు తెలుగువాళ్ళు. తెలుగువాళ్లలో నాంచారయ్యలూ, నాంచారమ్మలూ చాలామంది ఉన్నారు. ఈమెకు ఆండాల్, కోడై, అనే పేర్లుకూడా ఉన్నాయి. కృష్ణదేవరాయలు ఈ ‘చూడికొడుత్తవళ్‘’ జీవిత చరిత్రని ఆముక్తమాల్యద కావ్యంగా మలిచాడు. ‘‘ముక్త ’పదాన్ని మోక్షం అనే అర్థంలో జాగ్రత్తగా ప్రయోగించాడు. అత్యున్నతమైందని ఆమె సంతృప్తి చెందాకనే స్వామికి సమర్పించే తత్త్వం ఆమెకి చిన్ననాటి నుండే అలవడినట్టు చిత్రిస్తాడీ కావ్యంలో రాయలవారు.
జనకుడికి తన పొలంలో సీతాదేవి దొరికినట్టు, విష్ణుచిత్తుడికి తన పూలతోటలో ఈ నాంచారు దొరికింది. జనకుని కుమార్తెగా, రాముని భార్యగా సీత పూజనీయం అయ్యింది. విష్ణుచిత్తుని కుమార్తెగా, ఆ శ్రీ మహావిష్ణువు భార్యగా, గోదాదేవిగా నాంచారు పూజ లందుకుంది. ఇది అతి సామాన్యుడిక్కూడా తట్టే పోలిక.
కానీ, కృష్ణదేవరాయలు ఆ పుష్పవనంలో “ఒక్కబాలంకనుగొనె” అని మాత్రమే ఆముక్తమాల్యద కావ్యంలో వ్రాశాడు. ఆయన కేదో మనసులో సందేహం ఉండిఉంటుంది… ‘అయోనిజ’ లాగా సీతాదేవి దొరికిందని వ్రాయలేదు. ఆ పూలతోటలో కాముకులు స్వేఛ్ఛగా తిరగటాన్ని కూడా అదే ఆశ్వాసంలో వర్ణించటం చేత, ఏ పెళ్ళికాని తల్లో, తండ్రో ఆ పసిగుడ్డుని ఈ పూలతోటలో వదిలి వెళ్ళినట్టు నర్మగర్భంగా సూచించి వదిలాడు.
దేవాతామూర్తిగా పూజలందుకున్న వ్యక్తి చరిత్ర కాబట్టి ఎన్ని మహత్తుల నైనా ఆపాదించి రాసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, రాయలు సామాజిక దృష్టి తోనే ఆముక్తమాల్యద కావ్య రచనచేశాడని దీన్ని బట్టి భావించాలి.
పైనపేర్కొన్నపద్యం 17వ శతాబ్దికి చెందిన “‘నందవర భాష్కర శేషాచలామాత్యుడు”’ తన “‘నా(చ్చారు పరిణయం”’ కావ్యంలో చెప్పిన పద్యం ఇది. “అలరులు నిండిన ఆ తోటలో అలరారె ఒక పాపాయి అలనాడు సీత భూమిలో దొరికినట్టు చెలువుగ ఉదయించింది వెలుగులు నిండగా!” అంటాడు ఈ పద్యంలో నందవర కవి. తాళ్ళపాక తిరువేంగళ నాథుడు కూడా ‘పరమయోగి విలాసం’లో ఇదే అర్థంలో వర్ణించాడు. ఎవరి భక్తి వాళ్ళది! కొందరికి దేవుడు ముఖ్యం. కొందరికి సమాజమే దేవుడు!
“నా(చ్చారుపరిణయం”కావ్యాన్ని‘రాజుపాళయం’లో తెలుగుని కాపాడాలనే ఏకైక నినాదంతో ఆవిర్భవించిన తెలుగు విద్యాలయం పక్షాన 1987లో ప్రచురించారు. యక్షగాన సాంప్రదాయంలో వెలువడిన కావ్యం ఇది.
ఈ తెలుగు విద్యాలయానికి వెన్నుదన్నుగా నిలిచిన ముదునూరి జగన్నాథ రాజుగారు తెలుగు వారందరికీ ప్రాతః స్మరణీయుడు. ఆయన బహుభాషా ప్రవీణ. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో కూడా అనేక రచనలు చేసిన వ్యక్తి. తమిళనాట నివసిస్తున్న తెలుగు వాళ్ళు తమ మనుగడను కాపాడుకుంటూ, తమ భాషను కాపాడుకుంటూ పడుతున్న శ్రమ వర్ణనా తీతం. కొద్ది నెలల క్రితం శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి రాజుపాళ్యం పరిసరాల్లో తెలుగువారి స్థితిగతులను అధ్యయనం చేయటానికి వెళ్ళే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంలో కీ.శే. ముదునూరి జగన్నాథరాజుగారి ఇంటిని సందర్శించాము. ఆయన కుమార్తె, అల్లుడురాధాకృష్ణరాజుగారు ఇద్దరూ అంకితభావంతో జగన్నాథరాజుగారి స్మృతుల్ని పదిలపరచిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండస్థులమేడలో జగన్నాథ రాజుగారి గ్రంథాలను తెలుగు గ్రంథాలయంగా నడుపు తున్నారు. పెద్దల ఆశయాలను కొనసాగించే సంతతి అపురూపం అయిన ఈ రోజుల్లో జగన్నాథరాజుగారిని చిరస్మరణీయుణ్ణి చేస్తున్నారు.