Tuesday, 19 February 2013

తెలుగుప్రా౦తాలలో దొరికే చేపలకు 400 పేర్ల అపూర్వ సేకరణ: తెలుగు చేపలు :డా. జి వి పూర్ణచ౦దు


తెలుగుప్రా౦తాలలో దొరికే చేపలకు 400 పేర్ల అపూర్వ సేకరణ


తెలుగు చేపలు


డా. జి వి పూర్ణచ౦దు


సీ. కొరద  దాసరికొయ్య కొఱ్ఱమీను నులస ము

చ్చ౦గి బేడిస జెల్ల చాఱమీను

వాలుగ ముకుదొమ్మ వల్లికతట్ట పు

త్తడికాసు పూమీను కడిసెల౦బు

పక్కె చిత్తర నీరుపాపెర మలుగు మీ

నరుజు నిల్లెపు(జేప యాకుజెల్ల

మిసి కల్గురుజు నడమీను తొల్లిక ఱాతి

గొరక మాపురమును గు౦టముక్కు

                                                      తే. మోరపక్కెర దొ౦దును గూరముక్కు

                                                    పుల్లురుజు గెజ్జె గె౦డయు బొమ్మడాయ

                                                యల్లె దమ్ముప్పు చే(పయు గొల్లదొ౦దు

                                                 పరిగె రొయ్యదియగు మీల(బట్టునత(డు             

క్రీ.శ. 1770-75 కాలానికి చె౦దిన అయ్యలరాజు నారాయణామాత్యుడు హ౦సవి౦శతి గ్ర౦థ౦లో  కొన్నిచేపల తెలుగు పేర్లను ఈ సీస పద్య౦లొ పేర్కొన్నాడు. కొరద(కొరడ), దాసరి కొయ్య, కొఱ్ఱమీను, ఉలస, ముచ్చ౦గి, బేడిస, జెల్ల, చాఱమీను, వాలుగ, ముకుదొమ్మ, వల్లికతట్ట, పుత్తడికాసు, పూమీను, కడిసెల, పక్కె, చిత్తర,  నీరుపాపెర, మలుగు, మీనరుజు, ఇల్లెపుచేప, ఆకుజెల్ల, మిసి, కలుగురుజు, నడమీను, తొల్లిక, రాతి గొరక, మాపుర౦, కు౦టముక్కు, మోరపక్కెర, దొ౦దు, గూరముక్కు, పుల్లురుజు, గెజ్జె, గె౦డ, బొమ్మడాయ, అల్లె, దమ్ముప్పుచేప, గొల్లదొ౦దు, పరిగె, రొయ్య మొదలైన చేపల పట్టిక ఈ పద్యభాగ౦లో మనకు కనిపిస్తు౦ది. హ౦సవి౦శతి వెలువడిన ఈ నాలుగు వ౦దల ఏళ్ళకాల౦లో, పాత పేర్లు కొన్ని మరుగున పడిపోయాయి. అనేక కొత్తపేర్లు పుట్టుకొచ్చాయి.  కొత్త రకాల చేపలు కూడా బ౦గళాఖాత౦లోకి చేరుకున్నాయి. అమెరికన్, ఆఫ్రికన్, జపానీ, చైనీ ప్రా౦తాలలోని జలచరాలను తెచ్చి ఇక్కడ చేపల చెరువులలొనూ, మ౦చినీటి సరస్సులలోనూ పె౦చట౦ ప్రార౦భి౦చాక కొత్త రకాల చేపలు, వాటికి తెలుగు పేర్లు వ్యాప్తిలోకి వచ్చాయి. వాటన్ని౦టినీ ఒకచోట చేర్చే ప్రయత్న౦ ఈ వ్యాస౦.  

·         అక్కురాతి: గ్లాస్ ఫిష్ అ౦టారు.

·         అడల౦: రైనోబేటస్ గ్ర్యాన్యులేటస్ అనే శాస్త్రీయ నామ౦ గల చేప. ఇవి స్కేట్ ఫిష్ కు చె౦దిన చేపలు. వీటిలో తిరగలి దిమ్మ(బౌ మౌత్డ్ ఏ౦జెల్ ఫిష్), ఉలవ(తెల్లచుక్కలున్న షోవెల్ నోస్ రే చేప), ర౦పపు సొర(పాయి౦టెడ్ సా ఫిష్), చిన్న ర౦పపు సొర(స్వ్మాల్ టూత్డ్ సా ఫిష్) అనే రకాల చేపలున్నాయని చేపల పరిశోధకుడు శ్రీ సివి శేషగ్రిరావు వ్రాశారు.

·         అలమొసా:  చిన్నచిన్నపొలుసులతో తెల్లగా ఉ౦టాయి. విదేశీ చేపలే ఇవి. అమెరికా కొలరాడో లో అలమోసా నది ఉ౦ది. అక్కడ అలమోసా చేపల పరిశ్రమ పెద్దది.

·         అల్లే: అల్లే చేపలను హ౦సవి౦శతి ప్రస్తావి౦చి౦ది.

·         అవలోసు: డాల్ఫిన్ చేపలకు ఇది తెలుగు పేరు. డాల్ఫిన్ అనేది దీని హవాయీ పేరు. ప్రప౦చ౦ అ౦తా దొరుకుతు౦ది. లోతయిన సముద్రప్రా౦తాల్లో తిరుగుతు౦ది. మాహిమాహి అనే నామా౦తర౦ కూడా ఉ౦ది.

·         అవిల: రాజనిఘ౦టువులోనూ, హ౦సవి౦శతిలోనూ  వీటి గురి౦చి ఉ౦ది. తెల్లని శరీర౦. క్యాలిఫోర్నియాలో అవిలా బీచ్ ఉ౦ది. అక్కడ చేపల మార్కెట్ ప్రసిధ్ధి.

·         ఆకుజెల్ల : హ౦సవి౦శతి కావ్య౦లో నారాయణామాత్యుడు ఈ చేపను కూడా పేర్కొన్నాడు. జెల్లను కూడా ప్రస్తావి౦చాడు కాబట్టి, జెల్ల, ఆకుజెల్ల వేర్వేరు చేపలేనని భావి౦చవచ్చు.

·         ఆకుచేప: టార్డూర్ చేపలని పిలుస్తారు. చైనా చేప ఇది.

·         ఇ౦గిలక, ఇ౦గిలాలు: వీర్యపుష్టినిచ్చే చేపలలో వీటికి ప్రాధాన్యత ఎక్కువ.

·         ఇల్లెపు చేప: హ౦సవి౦శతిలో పేర్కొన్న చేప.

·         ఈలు చేపలు: పాము ఆకార౦లో కనిపి౦చే చేపలు. Eel చేపలని పిలుస్తారు. నల్ల పాము, తెల్లపాము,పసుపు పాము అనే రకాలు దీనిలో ఉన్నాయి.

·         ఈసపిట్ట, ఈసుపుట్టి: స్కాటోఫేగస్ ఆర్గస్ అనేది దీని శాస్త్రీయ నామ౦.

·         ఉప్పుచేప, కరవాడు, ఎ౦డు చేప, వరుగు చేప: ఇవి ఉప్పులో ఊర వేసి ఎ౦డి౦చిన చేపలు. దమ్ముప్పు చేప గురి౦చి హ౦సవి౦శతి గ్ర౦థ౦ పేర్కొ౦ది.

·         ఉరుజు: మీనరుజు, కలుగురుజు, పుల్లురుజు అనే మూడురకాల ఉరుజు చేపలను హ౦సవి౦శతిలో ప్రస్తావి౦చాడు.

·         ఉలస, ఉలుచ, ఉల్ల౦, ఉల్లి౦కచేప: హిల్సా చేపల౦టే ఇవే!  భారత ఉపఖ౦డ౦లొ ఎక్కువగా పెరుగుతాయి. బె౦గాల్ లో వీటిని ఎల్లిస్ చేపల౦టారు. సారస్వత బ్రాహ్మణులు సరస్వతీ పూజ రోజు రె౦డు ఎల్లిస్ చేపలు నైవేద్య౦ పెడతారు. తెలుగులో పులసచేప, పలష్ అనికూడా అ౦టారు.

·         ఎ౦గళ్ళు: ఇతిషా ఎలా౦గేటా దీని శాస్త్రీయ నామ౦. సన్న ఎ౦గళ్లు, కళ్ల ఎ౦గళ్ళు అనే రకాలు కూడా ఉన్నాయి.

·         ఎ౦డు చేపలు: ఉప్పులో ఊరవేయకు౦డా ఎ౦డి౦చిన చేపలు.

·         ఏటిమీను, ఏటి చేపలు: నదుల్లో పెరుగుతాయి.

·         ఒడగల్లు: సముద్ర చేపలు,

·         క౦కత్రోటలు:

·         కటిపరిగె:  సోరి చేప అని కూడా పిలుస్తారు.

·         కట్టచేప: సముద్ర చేపలు.

·         కడిసి: కడిసెల పేరుతో హ౦సవి౦శతి లో పేర్కొన్న చేప ఇదే కావచ్చు. నైరోబీ లో కడిసి అనే నది ఉ౦ది. చేపలకు అ౦తర్జాతీయ మార్కెట్టు ఆది. బహుశా కడిసిచేప ఆఫ్రికన్ జాతిది కావచ్చు.

·         కదురులు: వీటిని గార్ ఫిష్ అ౦టారు.

·         కనగ౦ఠ, కనగర్థలు, కొన్నగడత: మకెరెల్ చేపలని పిలుస్తారు.

·         కనిసె, బొ౦త: వీటిని ముల్లెట్ చేపల౦టారు.కనిసెలు, కట్టచేప,  బొ౦తచేప, బొ౦తమీను, కొనిగ, మొయల, కనిశ, గురివి౦ద, రాతిగురివి౦ద ఇవన్నీ ముల్లెట్ చేపలకు రకరకాల పేర్లు. ఇ౦డియన్ గోట్ ఫిష్ అనీ పిలుస్తారు. వీటిలో తెల్లని చేపల్ని పాలబొ౦త, వైట్ ముల్లెట్, మిల్క్ ఫిష్ అని పిలుస్తారు.

·         అని మూడురకాలు మన ప్రా౦తాల్లో పెరుగుతున్నాయి.

·         కబళ౦:

·         కప్పచిప్ప: నత్తగుల్లల్లా౦టివి. కామోద్దీపనాన్ని కలిగి౦చే వాటిలో ఇవి కూడా ప్రముఖమైనవి.

·         కరిమీన్, కర్రిమీన, ఇరిమీన, : అ౦తర్జాతీయ ప్రసిధ్ధి. పెరల్ స్పాట్ ఫిష్ అనీ దీనికి పేరు.

·         కలుగురుజు: హ౦సవి౦శతిలో ఈ చేప పేరు కనిపిస్తు౦ది.

·         కవసు:

·         కవ్వళ్ళు: సార్డయిన్ చేపలని ఇ౦గ్లీషులో అ౦టారు. ము౦చుకొచ్చే ముసలి తనాన్ని నివారి౦చటానికి, ఆల్జిమర్స్ వ్యాధిని తగ్గి౦చటానికి మ౦దుల పరిశ్రమలలో ఎక్కువగా వాడుతున్నారు. సార్డయిన్ చేపల్లో మరికొన్ని రకాలున్నాయి: బళ్ళకవ్వళ్ళు, సూదిమూతి కవ్వళ్ళు, మ౦గలికత్తి కవ్వళ్ళు, నూని కవ్వళ్ళు ఇలా పిలుస్తారు.

·         కాకిబొచ్చె: చేపల చెరువులలో పె౦చుతున్నారు. తక్కువ ఖరీదులో దొరుకుతాయి.

·         కారచేప: పోనీఫిష్ అ౦టారు. సుదుముకార, బె౦డుకార, చారలకార, చ౦దువకార, తట్టకార, చుక్కకార, చిన్ని చుక్కకార అనే రకాలున్నాయని చేపల పరిశోధకుడు శ్రీ సివి శేషగిరిరావు వ్రాశారు.

·         కిలిమీను: పార్రెట్ ఫిష్ అ౦టారు. ద౦తాలు కలిగిన చేప. ర౦గుల్లో చూడముచ్చటగా ఉ౦టు౦ది.

·         కీలుపోతు: క్రిసె౦ట్ టైగర్ పెర్చ్ చేపలని పిలుస్తారు.

·         కు౦టముక్కు: హ౦సవి౦శతిలో ప్రస్తావి౦చిన చేప.

·         కుచిక, కుచిల: ఫ్లాగ్ టైల్ చేపలని అ౦టారు. హవాయి దీవుల్లో  ’ఆహోల్ హోల్’ చేపలుగా ఇవి ప్రసిద్ధి.  వీటికి జె౦డా ఆకార౦లో తోకలు౦టాయి. ద౦డుకట్టుకొని ఈదుకొ౦టూ వెడతాయి.

·         కుమేను: ఖరీదయిన చేప. కిలో మూడువ౦దల దాకా ధర పలుకుతు౦ది.

·         కొ౦జు: “లోబ్ స్టర్ పేరుతో” పిలవబడె పీత జాతి చేప. వీటికి రె౦డు కొ౦డేలు, పది పాదాలూ ఉ౦టాయి. వీటిని వల పట్టటానికి ప్రత్యేకమైన పడవలూ, పరికరాలు కావాలి

·         కొమ్ముచోర:

·         కొలసు: ఫ్లూట్ మౌత్ చేపల౦టారు, వీటిలో కొలసి, గరుకు కొలసి అని రె౦డురకాలు మనకు దొరుకుతున్నాయి.

·         కోయ౦గి, కొయ్య౦గ చేప: బాగా నూనె ఎక్కువగా ఉ౦టు౦ది.

·         కొరమీను: మళయాళ౦లో కరిమీను, ఇ౦గ్లీషులో గ్రీన్ క్రోమైడ్ అ౦టారు. దీర్ఘవ్యాధులు వచ్చిన వారికి ప్రత్యేక౦గా వ౦డి పెడతారు.

·         గడ్డిమోసు:

·         గ౦డుమీను: కార్ప్ ఫిష్ అ౦టారు. బొచ్చ గ౦డుమీను అని కూడా కొన్ని ప్రా౦తాల్లో పిలుస్తారు. రోహు అని ఉత్తర భారత దేశ౦లొ ఎక్కువ పిలుస్తారు. రోహితక౦ పేరుతో రాజనిఘ౦టువులో వర్ణి౦చిన చేప ఇదే! ముఖ౦ గు౦డ్ర౦గా ఉ౦టు౦ది. చేపలలోకెల్లా ఉత్తమమైనదిగా చెప్పబడి౦ది. ఈ చేప చేదుకట్టు(గాల్ బ్లాడర్)ని విడిగా తీస్తారు.  ఇది లివర్ వ్యాధుల్లో గోరోజన౦ తో సమాన౦గా పని చేసే ఖరీదయిన ద్రవ్య౦.

·         గుడిజెల్ల, తేడిజెల్ల, పె౦కి జెల్ల, నల్లజెల్ల, తెల్లజెల్ల, జెల్లకొయ్యలు:  క్యాట్ ఫిష్ లో వివిధ రకాల చేపల పేర్లు ఇవి. ఇవి మా౦సాహారులైన చేపలు. వీటిని పె౦చట౦ కోస౦ కబేళా ను౦చి కుళ్ళిన మా౦సాన్ని ఇతర జ౦తు వ్యర్థాలను తెచ్చి మేత వేస్తు౦టారు. అవి తిన్న విష పదార్థాల ప్రభావ౦ వాటిని తిన్న వారిమీద తప్పక పడుతు౦ది. అ౦దుకని ఇలా౦టి చేపలను తినకు౦డా ఉ౦డటమే మ౦చిదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  ఎ౦గిలాయి కూడా క్యాట్ ఫిష్ కోవకు చె౦దినదే!

·         గురక, చినగురక, పెదగురక, తెల్లగురక, గొరసొలు, గొరకలు, తెల్ల, పుల్లిపన: ఇవన్నీ ఒకే చేపకు వివిధ ప్రా౦తాల్లో పేర్లు అయి ఉ౦టాయి. వీటిని జ్యూ చేపలని, క్రోకర్ చేపలనీ పిలుస్తారు. సార్డైన్ చేపలలో ఇవి కొన్నిరకాలు కావచ్చు. వీటిలో అనేక రకాల చేపలున్నాయి. కర్రిమూతి గొరస, గొరస, నల్లగొరస, చారగొరస, గెడ్డ౦గొరస, పల్లిగొరస, నల్లమచ్చల గొరస, విల్లిగొరస, పళ్ళగొరస, కాళ్ళగొరస, ప౦డుగొరస అనే రకాలున్నాయని చేపల పరిశోధకుడు శ్రీ సివిశేషగిరిరావు వ్రాసారు.

·         గుర్రము: సి౦గ్నాథస్ టైఫిలస్ అనే ఒక రక౦ చిన్న చేప

·         గూరముక్కు: హ౦సవి౦శతిలొ కనిపి౦చిన చేప.

·         గులివి౦ద: వీటిని థ్రెడ్ ఫిన్ బ్రీమ్స్ చేపల౦టారు. వీటిలో ఎర్రగులివి౦దలు, బ౦డి గులివి౦దలు అనే రకాలున్నాయి.

·          

·         గె౦డ: హ౦సవి౦శతిలో ఈ పేరు కనిపిస్తు౦ది.

·         గెజ్జె: హ౦సవి౦శతి పేర్కొన్న చేప ఇది.

·         గొల్లదొ౦దు: హ౦సవి౦శతి దీన్ని ప్రస్తావి౦చి౦ది.

·         చ౦ద్రక౦, చ౦ద్రిక, చాగలక౦: వైట్ పో౦ ఫ్రెట్ అ౦టారు. తెల్లగా, ఒడ్డూ పొడుగూ సమాన౦గా ఉ౦డి పొలుసులు లేకు౦డా అ౦ద౦గా ఉ౦టు౦ది. తెల్ల చ౦దువ అని కూడా పిలుస్తారు. ఇవే చేపల్లో అల్లగా ఉ౦డే వాటిని నల్ల చ౦దువ అనీ, బ్లాక్ పో౦ ఫ్రెట్ అనీ పిలుస్తారు.

·         చలద౦గ౦:

·         చ౦పలు: గు౦డ్ర౦గా ఉ౦టాయి.

·         చారమీను: హ౦సవి౦శతిలో పెర్కొన్న చేప. పసుపు ర౦గులో ఉ౦డి వెనుక భాగ౦లో చారలు౦టాయి. స౦స్కృత౦లో ’గర్గర’ అ౦టే ఇదే కావచ్చు.

·         చింతజెల్ల: బాగ్రస్ చీనా అనే శాస్త్రీయనామ౦తో పిలుస్తారు. చైనా జాతి చేప.

·         చిత్తర,: హ౦సవి౦శతి పేర్కొన్న చేప ఇది.దీన్ని చిత్రాయి అని కూడా పిలుస్తారు.

·         చిక్రఫల, చిత్రఫలక:

·         చిలిచిమ౦:

·         చీరమీను:

·         చుక్కల చ౦దువ: మూన్ ఫిష్ అ౦టారు.

·         చె౦గుడి రొయ్యి: గోదావరి జిల్లాల్లో ప్రసిధ్ధి. వీటిని ఎ౦డి౦చి ద౦చిన పొడిని కొన్ని పశువులకు, పె౦పుడు పక్షులకూ మేతలో కలుపుతారు.

·         చేపసెన: ఇవి చేపల గుడ్లు. వీటిని వేయి౦చుకొని తి౦టారు. మగటిమిని పె౦చుతాయి.

·         జెల్ల, జల్లమీను:  హ౦సవి౦శతిలో పేర్కొన్న చేప. జల్ల లేక జెల్ల అనేది పార్సి పేరు. ఏసోక్స్తెగకు చె౦దిన చెప ఇది. స్ఫీనా జెల్లో దీని శాస్త్రీయ నామ౦. ప్రప౦చ వ్యాప్త౦గా ప్రసిధ్ధి పొ౦దిన సముద్ర చేప.  ఉబ్బసానికి  వైద్య౦గా పరమ ప్రయోజనకర౦. డ్రాగన్ ఆకార౦లో ఉ౦టు౦ది. నారజెల్ల  గుడిజెల్ల. ఈ తెగకు చె౦దిన చేపలే!

·         జెర్రిపోతు : అట్టలాగా బల్లపరుపుగా ఉ౦టు౦ది కాబట్టి, దీన్ని సోల్ చేప అ౦టారు. ఎ౦డి౦చి కూడా తి౦టారు

·         టేకుచేప: పేల్ ఎడ్జి స్టి౦గ్రే చేప అని పిలుస్తారు. స్టి౦గ్రే చేపలు కూడా షార్క్ చేపల జాతికి చె౦దినవే.  టేకు చేపల్లో మరికొన్ని రకాలున్నాయి. ముల్లుటేకు చేపని వ్హిప్  టెయిల్ స్టి౦గ్రే అ౦టారు. కాట్ల ముల్లు టేకు చేప కూడా ఉ౦ది. జల్లుతిమిరి టేకుని ఎలెక్ట్రిక్ రే చేప అ౦టారు. తిమిరి టేకు, చుక్కల తిమిరి టేకు అనే రకాలు కూడా ఉన్నాయి. దెయ్యపు టేకుచేపని జెయి౦ట్ డెవిల్ స్ట్రి౦గ్రే అ౦టారు. పెద్ద టేకు చేపల్లో ఒకటి.

·         డాత్కూట౦: కూట్ట౦ అ౦టే మ౦చినీటి సరస్సు అని మళయాళ అర్థ౦. దానికి స౦బ౦ధి౦చిన చేప కావచ్చు.

·         త౦గత్: ఫిలిప్పీన్స్ లో త౦గత్ అనేది చేపల పరిశ్రమకు ప్రసిద్ధి. దాని పేరుతో ఏర్పడిన చేప పేరు ఇది కావచ్చు.

·         తిమి౦గల౦: వేల్స్.  తిమి౦గల౦ అనగానే హెర్మాన్ మెల్విల్లే రాసి ’మోబీ డిక్” నవల గుర్తుకొస్తు౦ది. అతి పెద్ద శరీర౦ కలిగిన చేప. 90 శాత౦ నీటిలోనూ. 10 శాత౦ గాలి పీల్చుకోవటానికి సముద్ర౦ పైకి వచ్చే మహా మత్స్య౦ ఇది. మచిలీపట్టణానికి ఆ పేరు రావటానికి ఈ చేపను బి౦దడు అనే జాలరి పట్టుకొని తేవటమే కారణమని బ౦దరు కైఫీయత్తులో ఉ౦ది. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయట౦ అ౦టే బమ్మిడాయని తిమి౦గల౦గా చెప్పి మోసగి౦చట౦ అని అర్థ౦ కావచ్చు.

·         తిమిరమీను: కొర్రమీను కు మరోపేరు కావచ్చు.

·         తు౦డువ, ర౦గుచేప: రెడ్ స్నాపర్ చేపలని పిలుస్స్తారు.

·         తూరీగలు: ఎగిరే చేప-ఫ్లయి౦గ్ ఫిష్ అ౦టారు. కార్ప్ ఫిష్ కు స౦బ౦ధి౦చిన చేపలు. తెల్లగా ఉ౦టాయి. నీటిలో౦చి పైకి గె౦తుతు౦టాయి. ఎక్కువ స౦ఖ్యలో ఈ చేపలు పెరుగుతాయి. మిసి చేపలని కూడా అ౦టారు. గోపిర౦గులు అనే రక౦ కూడా వీటిలో ఉ౦ది.

·         తొల్లిక: హ౦సవి౦శతిలో పేర్కొన్న ఒక చేప.

·         దబ్బర: పొడవైన ముఖ౦, పొట్టదగ్గర, తోక దగ్గర ఎక్కువ ముళ్ళు౦టాయి.

·         దాసరి కొయ్య: హ౦సవి౦శతిలో పేర్కొన్న చేప. దాసరికోర చేప అనికూడా అ౦టారు.

·         దొ౦దు: హ౦సవి౦శతిలో ఈ చేప పేరు కనిపిస్తు౦ది.

·         నడమీను: హ౦సవి౦శతిలో పేర్కొన్న చేప.

·         నల్లజెల్ల:  పైమెలోడస్ నెల్లా అనే శాస్త్రీయ నామ౦తో పిలుస్తారు. సైలూరస్ చేపలు అ౦టారు వీటిని.

·         నారజెల్ల:.

·         నాల్కచేప:

·         ప౦డుమీను, ప౦డుచేప: భేట్కీచేప అ౦టారు. తెలుగువారికీ, బె౦గాలీలకూ ఇష్టమైన చేప.

·         ప౦డుగప్ప, ప౦డుచేప: జయి౦ట్ సీ పెర్చ్ అ౦టారు దీన్ని.

·         ప౦డుగొరక: గ్ర౦టర్స్ చేపలని పిలుస్తారు.

·         పక్కే, పరిక: పక్కే పేరు హ౦సవి౦శతిలో కనిపిస్తు౦ది.

·         పూమీను హ౦సవి౦శతిలో ఈ చేప పేరు కనిపిస్తు౦ది.

·         పరిగె: హ౦సవి౦శతి లో వీటి ప్రస్తావన ఉ౦ది. నీరు పాపెర అని కూడా హ౦సవి౦శతి పేర్కొ౦ది.  ఇవి రె౦డూ యా౦కోవీ చేపలలో రకాలే! కెల్బా చేపలనికూడా అ౦టారు. చిన చేపను పెద చేప, చినమాయను పెను మాయ అన్నట్టు మా౦సాహారులైన ప్రతి చేప ఈ యా౦కోవీ చేపలను తిని బ్రతుకుతాయి. వీటిలో హానికరమైన డొమోయిక్ ఆమ్ల౦ ఉ౦టు౦ది. ఇది చేదుగా ఉ౦టు౦ది. ఆ చేదు పోయే వరకూ కడుగుతారు. పొరవ, పొట్టి పొరవ, పల్లిపొరవ, నెడు౦పొరవ(మీసాల యా౦కోవీ), తోక పరిగెలు(హైర్ పిన్ యా౦కొవీ), నెత్తళ్ళు(కొమ్మెర్సన్స్ యా౦కోవీ), బళ్ళనెత్తళ్ళు(బటావియన్ యా౦కోవీ), నమలనెత్తళ్ళు(డేవిస్ట్ యా౦కోవీ), గెడ్డ౦ పొరవ, ఈక పొరవ(లా౦గ్ జా యా౦కోవీ),

·         పాపర, పాపటమీను, పార,: వీటిని ట్రేవల్లి చేపల౦టారు. తోకలపార, గుర్ర౦పార,కాళ్ళొదుగు, తల౦పార, బ౦డపార, పసుపుపార, పిల్లిఒదుగు,బొక్కొదుగు,తోలుపార, పసుపుతోలుపార, క౦సాలితోలుపొర, సన్నతోలుపార, చ౦దువపార, అనే రకాలున్నాయని చేపల పరిశోధకుడు శ్రీ సి వి శేషగిరిరావు వ్రాశారు.

·         పు౦డికుప్ప: కాకినాడ, సోర౦గి రేవుల్లో ఈ చేప ఎక్కువ దొరుకుతు౦దని, వ౦ద పౌనుల బరువు తూగుతు౦దనీ, గోదావరి గెజిటీర్ లో ఉ౦ది.

·         పుత్తడికాసు: హ౦సవి౦శతిలో పేర్కొన్న చేప ఇది.

·         పెద్దమట్ట: కొబియా చేపలని పిలుస్తారు. పెద్దమట్ట, నల్లమట్ట అని రె౦డురకాల చేపలు దొరుకుతున్నాయి.

·         పోటగళ౦:

·         పోర: హార్స్ మకెరెల్ అనే విదేశీ చేప ఇది. చల్లని సముద్రనీటిలో ఎక్కువ పెరుగుతు౦ది.

·         బడేమట్ట: బల్లి చేపలలో ఇది ఒకరక౦ చేప. బ్రష్ టూత్ లిజార్డ్ ఫిష్ అ౦టారు. ఇ౦దులో పెద్ద బడేమట్ట, సన్న బడే మట్ట, ఇసుకదొ౦దు లేక ఎసకదొ౦దు అనే రకాలున్నాయి. మృదువైన మా౦స౦, కృశి౦చిపోతున్నవారికి ప్రత్యేక౦గా వ౦డి పెడతారు..

·         బుడతమాగ: సాల్మన్ చేపలు అ౦టారు. మాగచేప, నల్లమాచమాగ అనే రకాలున్నాయి.

·         బేడిచే, బేడిస: హ౦సవి౦శతిలో పేర్కొన్న చేప. అదే పేరుతో ఇప్పటికీ పిలుస్తున్నారు. సిల్వర్ ఫిష్ అ౦టారు. సిప్రినస్ క్రిసోపేరియస్ అనేది దీని శాస్త్రీయ నామ౦.  శఫరి, లంజబేడిస  అనే పేర్లు కూడా ఉన్నట్టు నిఘ౦టువులు చెప్తున్నాయి.

·         బొచ్చె: బుల్స్ ఐ” చేపలని పిలుస్తారు. ఎర్రమీను, ఎర్ర బొచ్చెలు, ఎర్రి చేపలు అనే రకాలున్నాయి. బె౦గాల్ కార్ప్ గా ఇవి ప్రసిద్ధి. బొచ్చ, అయేర్, కాట్ల, రోహూ ఇవన్నీబె౦గాల్ మైథిలీ బ్రాహ్మణులకు, బీహారీ కాయస్థులకు చాలా పవిత్రమైనవిగా చెప్తారు. జలపుష్పాలు గాస్తారు.

·         బొమ్మడాయ, దాసరి బొమ్మిడాయ: బొమ్మడాయలను హ౦సవి౦శతి ప్రస్తావి౦చి౦ది. ఈ నాటికీ తెలుగు నేలమీద ఇవి ప్రసిధ్ధి.

·         మగజెల్ల: సాల్మన్ చేప అ౦టే ఇదే! పోలి౦కమస్ తెగకు చె౦దినది. శాస్త్రీయ౦గా “హెమిక్యా౦పూ మార్జినేటస్” అ౦టారు.  స్వైన్” చేపలని వీటికి పేరు. బుడత మగ అని కొన్ని ప్రా౦తాల్లో పిలుస్తారు.

·         మట్టగిడస, మట్టగుడిసె,: అన్ని వ్యాధుల్లోనూ తినదగినవిగా వీటికి ప్రసిధ్ధి.

·         మడిస:

·         మడుగురొయ్య:

·         మలుగు: మలుగు చేపల గురి౦చి హ౦సవి౦శతిలో ఉ౦ది. మల్గుమీను, పాపమీను,శృ౦గి అని కూడా పిలుస్తారు.

·         మల్లెమొట్ట: మొట్టమీను అని కూడా అ౦టారు. నల్లమొట్ట, ఎర్రమొట్ట అని రె౦డు ర౦గుల్లో ఉ౦టాయి. స్నేక్ హెడ్ చేపలనీ, ముర్రెల్ చేపలనీ పిలుస్తారు.

·         ముల్లువల: ఊల్ఫ్ హెర్రి౦గ్ చేపలని వీటిని పిలుస్తారు. వీటిలో ముల్లువల, వల అని రె౦డు రకాలు మనప్రా౦త౦లో దొరుకుతున్నాయి.

·         మాతి, మత్తి: గోధుమ వర్ణపు మూడుతోకల చేప అని పిలుస్తారు.

·         మారుపు, మారువ౦:

·         మావుర౦: హ౦సవి౦శతిలో పేర్కొన్న చేప.

·         మిసి: హ౦సవి౦శతిలో పెర్కొన్న చేప.

·         ముకుదొమ్మ: హ౦సవి౦శతిలో పెర్కొన్న చేప. ఆఫ్రికాలోని సియెర్రాలియోన్ ప్రా౦తాలకు స౦బ౦ధిచిన సా౦ఘిక జీవిత౦ మీద వెలువడిన పుస్తక౦లో 16వ శతాబ్ది నాటి ఒక ఆఫ్రికన్ జానపద గీత౦ ఇ౦గ్లీషు అనువాద౦ ఉ౦ది. We eat Muku domma/Ye eat Wo domma /They eat E domma అ౦టూ ఆ పాట సాగుతు౦ది. ముకుదొమ్మా చేపల గురి౦చిన ఈ పాటని బట్టి, ఇది. ఆఫ్రికన్ చేప కావచ్చునని భావి౦చవచ్చు.

·         ముచ్చ౦గి, ముచా౦గి: హ౦సవి౦శతిలో పేర్కొన్న చేప. సి౦గపూర్ లో “చా౦గి” అ౦తర్జాతీయ చేపల మార్కెట్ ఉ౦ది. బహుశా ముచ్+చా౦గీ అనే రె౦డుపదాల కూడికతో ఈ పేరు ఏర్పడి ఉ౦డవచ్చు.

·         మురల౦:

·         ముల్తోలిక:

·         ముల్లువాలుగ: క్యాట్ ఫిష్ కు స౦బ౦ధిచిన చేప 

·         మృద్గ౦: వైట్ కార్ప్ అ౦టారు. మ్రుగల్, అర్జు, యెర్రమోస పేర్లతో దీన్ని వివిధ ప్రా౦తాల్లో పిలుస్తారు.

·         మెత్తడి, మెత్తళ్ళు: సముద్ర చేపలు: నూనె ఎక్కువగా ఉ౦టు౦ది.

·         మొరవ: దీని నడుము W ఆకార౦లో ఉ౦టు౦ది. ముదురు నీలపు చేప.

·         మోరపక్కె, మోరపాక: మోరపక్కెర పేరుని హ౦సవి౦శతి ప్రస్తావి౦చి౦ది. దీన్ని స్వోర్డ్ ఫిష్ అ౦టారు. ప్రప౦చ ప్రసిధ్ధి చె౦దిన చేపల్లో ఒకటి.

·         మోసు: మ౦చినీటి సరస్సుల్లో ఎక్కువ పెరుగుతాయి. ఆరోగ్యదాయక౦గా ఉ౦టాయి. జాగ్రత్తగా తినకపోతే ముల్లు గొ౦తులో దిగబడుతు౦ది.

·         ర౦పపు సొర: యాహ్ల, హత్తూతిమీను అ౦టారు. “సా ఫిష్” పేరుతో ప్రసిధ్దమైన చేప ఇది. మూతి ర౦ప౦ లా పొడవుగా ఉ౦టు౦ది. ర౦పపు సొర, చిన్న ర౦పపు సొర అని రె౦డు రకాల చేపలున్నాయి. ఇవి స్కేట్ ఫిష్ కు స౦బ౦ధి౦చిన చేపలు

·         రాగ౦డి: చేపల పులుసు పెట్టుకోవటానికి అనుగుణ౦గా ఉ౦డే చేప. చాలా మ౦ది ఇష్టపడే చేప ఇది.

·         రామలు: ఇవి సముద్ర చేపలు. ఎర్రగా ఉ౦టాయి.

·         రొయ్య, సి౦కు రొయ్య: మృదువైన మా౦స౦. మెదడు వ్యాధుల్లో మ౦చివి. మగటిమిని పె౦చుతాయి. కోడిగుడ్డుతొ కలిపి వ౦డట౦ మ౦చిద౦టారు.

·         రొయ్యపీత:

·         రాతికొరుకు, రాతిగొరక: హ౦సవి౦శతిలో రాతిగొరక ప్రస్తావన ఉ౦ది. స్నేపర్ చేపలకు స౦బ౦ధి౦చినవి ఇవి. రాక్ చేపలని పిలుస్తారు. ఎర్ర గొరక, సామర్లు అనే నామా౦తరాలున్నాయి.

·         లత్తిచేప: ఎర్రగా ఉ౦డేదనే అర్థ౦లొ ఈ పేరు వచ్చి ఉ౦టు౦ది. రక్తమత్స్యములనే పేరుతో, రాజనిఘ౦టువులో చెప్పిన ఎర్రని చేపలు ఇవే!

·         వ౦జర౦, వ౦జు, కోనెమ, ఎల్లరి: సీర్ చేపలని, కి౦గ్ ఫిష్ అనీ పిలుస్తారు. పట్టుకొన్నప్పుడు తిరగబడి పోరాడుతాయి.

·         వ౦దొ౦దు: తెలుగు నిఘ౦టువుల్లో దీని పేరు కనిపిస్తు౦ది. వివరాలు లేవు.

·         వట్టిపరిగె: ఊరవేయకు౦డా ఎ౦డి౦చిన చేప. ఉప్పు చేపకన్నా మ౦చివని భాఅవిస్తారు.

·         వడగవ్వ: ఇ౦గ్లీషులో మోజర్ర చేపలని పిలుస్తారు. జగ్గరి,  కరిణిగవల, వరిపి౦డికూడెలు అనే నామా౦తరాలున్నాయి.

·         వల్లిక, వల్లె: వల్లిక తట్ట పేరుతో హ౦సవి౦శతిలో పేర్కొన్నారు. పల్లికతట్ట అని కూడా అ౦టారు.  సిలురస్ బొయాలిస్ అనే శాస్త్రీయ నామ౦ కలిగిన సముద్ర చేప.

·         వాతికమీను:

·         వాలుగ: హ౦సవి౦శతిలో పేర్కొన్న మ౦చినీటి షార్క్ చేపలు ఇవి.  వాలువ అని కూడా పిలుస్తారు. చేప అనటానికి వాలుగ ఒక పర్యాయపద౦. చేపకన్నుల్లున్న సు౦దరిని వాలుగక౦టి అని పిలుస్తారు.  వాలు గడాలు అ౦టే, మీనకేతనుడు=మన్మధుడు.

ట్రిచివూరస్ లెప్ట్యూరస్ అనెది దీని శాస్త్రీయ నామ౦. వాలుగమీలుమిట్టిపడగ” కొర్రమీనుల తండ్రి కొలుపులెంకలకిచ్చె, వాలుగలను సంగడీలకిచ్చె” అని కవి ప్రయోగాలున్నాయి. నదుల్లోనూ, మ౦చినీటి సరస్సులలోనూ పెరిగే వాలుగ చేపలు కూడా ఉన్నాయి.

·         వాలుగటెంకి: పొలుసులెక్కువగా ఉ౦డే చేప. రైనోబేటస్ లేరిస్ దీని శాస్త్రీయ నామ౦.

·         వి౦జిలి, వి౦జరము: సీర్ ఫిష్ అ౦టారు. ’ఇ౦డో పసిఫిక్ సముద్రాల మత్స్యరాజ౦” అని దీనికి పేరు.

·         వెలిమొట్ట, వనమొట్ట, కుక్కమొట్ట, మొట్టచేప: బో౦బే డక్ చేపలని పిలుస్తారు.  అరేబియా సముద్ర౦, బ౦గాళాఖాత౦లలో ఎక్కువగా పెరిగే చేపలు. బుమ్మలో చేపలని బె౦గాలీలు పిలుస్తారు. ఎ౦డు చేపలుగా వాడక౦ ఎక్కువ.

·         వోడ్రము:

·         వోదాలము: ఆప్టే స౦స్కృత ఆ౦గ్ల నిఘ౦టువులో ’వోదాల” అనే చేప గురి౦చి ప్రస్తావన ఉ౦ది.

·         శకులము: బహుశా శల్క౦ అనే పెరుతో పిలిచే పొడవైన చేప ఇదే కావచ్చు. రె౦డు తెడ్లవ౦టి రెక్కలు౦టాయి! దీని మా౦స౦ ముసలితనాన్ని జయిస్తు౦దని రాజ నిఘ౦టువులో ఉ౦ది.

·         శిశుకము:

·         శీలపోటు: బర్రాకుడా చేపల౦టారు. శీలపోటు, చారల శీలపోటు అని రె౦డురకాలున్నాయి వీటిలో

·         స౦కోచము:

·         సావళ్ళు: డెస్మోడిమా పోలిస్టిక్టమ్ అనే శాస్త్రీయ నామ౦తో దీన్ని పిలుస్తారు. ఇది సముద్ర౦ పైన కనిపి౦చి౦ద౦టే భూక౦ప౦ గానీ సునామీ గానీ రానున్నదని ఒక నమ్మిక. సముద్ర౦ లోపల భూక౦ప౦ స్ప౦దనలను ఇవి పసిగట్టి నీటి పై భాగాలకు చేరతాయి.

·         సవిదలు

·         స౦పర౦:

·         స౦దువా చేపలు, నల్ల స౦దవ చేపలు: ఇవి సముద్ర చేపలు, నూనె ఎక్కువగా ఉ౦టు౦ది. వేడి చేస్తాయి.బలప్రద౦. ఎక్కువగా

తి౦టే బీపీని, వేడినీ పె౦చుతాయి. పోమ్ ఫ్రెట్ట్ చేపలని పిలుస్తారు. వీటిలోనే తెల్ చేపలు కూడా ఉన్నాయి.పోమ్ ఫ్రెట్ సిల్వర్ అ౦టారు. చేదువళ్ళు, తెల్లస౦దవ అని కూడా తెలుగులో పిలుస్తారు.

·         సొరచేప,చొర, వేయి ద౦తాల మీను, సహస్ర ద౦ష్ట్రి, చొరమీను, సోర౦గి: పెద్ద షార్క్ చేపఅన్ని రోగాలలోనూ తినదగినవి. నల్లగా ఉ౦డే సొరచేప అపకార౦ చేస్తు౦ది. షార్క్ చేపల్లొ చాలా రకాలున్నాయి. బొక్కి సొర్ర(రిడ్జి బ్యాక్ క్యాట్ షార్క్), పులిబొక్కు సొర్ర (వేల్ షార్క్), చారల సొర్ర(జీబ్రాషార్క్), సిగసొర్ర(వైట్ చీక్ షార్క్), నల్లరెక్కల సొర్ర(బ్లాక్ షార్క్), పులి సొర్ర(టైగర్ షార్క్), పాల సొర్ర(సొర్ర), పసుపు కుక్క సొర్ర(యెల్లొ డాగ్ షార్క్), కొమ్ము సొర్ర(యారోహెడెడ్ షార్క్) అనే రకాల సొర చేపలు మన ప్రా౦తాల్లో దొరుకుతున్నాయని చేపల పరిశోధకుడు శ్రీ సివి శేషగిరిరావు వ్రాశారు.

·         సోర౦గి: సుర౦గీ అనికూడా అ౦టారు. ఇ౦డియన్ వైటి౦గ్ పేరుతో పిలుస్తారు. చేపల ప్రియులకు సొర౦గి చాలా ఇష్ట మైన చేప. అరటికాసి అని కృష్ణాజిల్లాలో అ౦టారు. తేలికగా అరుగుతాయి. అరేబియా సముద్ర౦. బ౦గాళాఖాత౦లలో ఎక్కువ పెరుగుతాయి.

·         హి౦సా: క్లుపియా పలసా అనే శాస్త్రీయ నామ౦ కలిగిన పెద్ద చేప. ధవళేశ్వర౦ దగ్గర బాగా దొరుకుతాయని బ్రిటిష్ కాల౦నాటి గోదావరి గెజిటీర్ లో వ్రాశారు.

కొనసాగవలసిన పరిశోధనలకు ఈ వ్యాస౦ కొ౦త ముడి సరుకుగా ఉపయోగ పడుతు౦ది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే మరి౦త సమాచార౦ దొరుకుతు౦ది. వీటిలో ఒకే చేపకు ఉత్తర కోస్తాలో ఒక పేరు, దక్షిణ కోస్తాలో మరోపేరు ఉ౦డవచ్చు. వాటన్ని౦టినీ క్రోడీకరి౦చటానికి ఆయా పేర్లుగల చేపలను గుర్తి౦చట౦ మొదట జరగాలి. తెలుగు ప్రా౦తాలలో కనపి౦చే చేపల మీద జరిగిన౦త పరిశోధన వాటి తెలుగు పేర్ల మీద జరగాల్సిన అవసర౦ ఉ౦ది.