‘స్థితి’కి ‘దుస్థితి’
డా. జి వి పూర్ణచందు
పట్టంబుగట్టిన ప్రథమంబు నేణ్డు
బల గర్వంబొప్పంగ బైలేచి సేన
పట్టంబు గటిఞ్చి ప్రభుబణ్డరంగు
బఞ్చిన సమత్త పడువతో బోయ
కొట్టంబు ల్వణ్ఱెణ్డు గొఱి వేంగి నాణ్టిం
గొళల్చి యాత్రి భువనాంకుశ బణనిల్పి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కణ్డుకూ ర్బెజవాడ గావిఞ్చె మెచ్చి
ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామంలో ఒక పొలంలో రాతిమీద చెక్కిన ఈ శాసనంలో ఈ పద్యం ఉంది. ‘పండరంగని అద్దంకి శాసనం’ అంటారు దీన్ని. ఆదికవి నన్నయకు పూర్వం ఉన్న పద్యకవిత్వానికి ఈ శాసనం ఒక ప్రముఖ ఆధారం. బెజవాడ రాజధానిగా పాలించే గుణగ విజయాదిత్యుడి సేనాని పండరంగడు క్రీ.శ.848లో బోయవీరులకు చెందిన 12 కొట్టాలను (మండలాలు) జయించి, బోయరాజ్యపు ప్రధాన కొట్టమైన, కట్టెపుదుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడలాగా చేశాడనేది ఈ పద్యంలోని సారాంశం. ఈ పద్యశాసనానికి 300 యేళ్ళ తరువాతి వాడు నన్నయగారు.
తెలుగు భాషోద్యమానికి ఆద్యుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ఈ శాసనాన్ని పరిష్కరించి, బటర్వర్తు ముద్రించిన “నెల్లూరు శాసనములు” గ్రంథంలో దీన్ని ప్రకటించారు. మొత్తం శాసనంలో తరువోజ సీస ఛందస్సుకు చెందిన ఈ పద్యం మాత్రమే ధ్వంసం కాకుండా లభిస్తోంది. తెలుగు అక్షరాభిమానులైన ప్రజలు ఈ శిలాశాసనానికీ అద్దంకిలో గొడుగు పట్టి పూజిస్తున్నారు. సృజన అనే సాహితీ సంస్థ వారు, ప్రకాశంజిల్లా రచయితల సంఘం వారు నాగభైరవ కోటేశ్వరరావు ప్రభృతులు ఈ శానం కాపీని ఊరు ముఖద్వారం వద్ద ప్రతిష్ఠించి దానికి గౌరవం కలిగించారు.
తెలుగు భాషా సంస్కృతుల పట్ల ప్రజల్లో గౌరవం పెరగాలంటే ఇలాంటి కార్యాలు ఊరూరా జరగాలి. ఇలాంటివి ప్రభుత్వాలు గానీ, ప్రభుత్వ శాఖలు గానీ చేస్తాయని ఆశించకుండా ప్రజలే పూనుకోవాలి. ప్రజలక్కూడా బాధ్యత ఉంది కదా...! ప్రాచీన దేవాలయాలన్నింట్లోనూ ఏదో ఒక కాలానికి చెందిన శాసనాలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని సున్నం, సిమెంటు తాపడాలతో కప్పిపెట్టేస్తున్నారు. గుడి పూజారులకు గాని, రాజకీయాల నుండి వచ్చి గుడిపాలకవర్గంలో చేరే వ్యక్తులకు గానీ వీటి గురించి ఏమీ తెలియకపోవటాన విలువైన చారిత్రక సంపద అన్యాయంగా కరిగిపోయో, విరిగి పోయో, రోడ్డురోలర్ల కింద నలిగిపోయో, బట్టలుతుక్కునే రాళ్లుగా మారిపోయో నశించి పోతున్నాయి.
వాటిని ఎవరైనా మహానుభావుడు పరిరక్షిస్తే ఆయన గురించి చరిత్రకారులు ఇలా నాలుగు మంచిమాటలు చెప్పుకుంటారు. ఏమీ చేయని వాడి గురించి అదనంగా చెప్పేదేముందీ… ఏమీ చేయలేదు అనటం తప్ప.
ఆ మధ్య తిరుపతి దేవాలయ గోడలకు బంగారురేకుల తాపడం చేయాలని పాలకవర్గంవారు ప్రయత్నిస్తే, చరిత్ర వేత్తలు భాషాభిమానులు, “అయ్యా! ఈ దేవాలయం గోడల్లో ప్రతీ రాయి పైన ఏదో ఒక శాసనం ఉంది. అవి చరిత్రకు ఆధారాలు. దయచేసి వాటి నకళ్ళు తీసి పరిరక్షించి, అప్పుడు బంగారు తాపడం చేయించండని ప్రాధేయపడి అడిగారు. అవన్నీ దాన శాసనాలేననీ, వాటిలో చరిత్ర వుండదనీ పాలకులు వాదించారు. ఎందులో ఎంత చరిత్ర ఉంటుందో చరిత్రకారులకు గదా తెలిసేది...?
శతృరాజ్యాన్ని జయించిన తరువాత గొప్పగొప్ప రాజులంతా ఆ రాజ్యాల్ని తగలబెట్టేవాళ్లు. పరశురాముడు శతృ రాజ్యాల్ని సమూలంగా దహనం చేసి సంతృప్తి చెందాడు. అందుకే భారీగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ‘పరశురామ ప్రీతి’ అంటారు. కానీ, పండరంగడు తాను జయించిన కందుకూరుని అభివృద్ధి చేశాడు. ఎంత అభివృద్ధి చేశాడంటే తన రాజధాని అయిన బెజవాడ అంత అభివృద్ధి చేసినట్టు ఈ శాసనంలో చెప్పుకున్నాడు.
స్వయం సమృద్ధి సమకూర్చటం ద్వారా అభివృద్ధి జరగాలి. పండరంగడు అదే చేశాడు. అభివృద్ధి చెందిన మరొక రాజధానిని ఆదర్శంగా చూపించి, అలా చేశానన్నాడు. స్థితికి దుస్థితి తేకూడదు కదా! కందుకూరుని బెజవాడగా మార్చటం కోసం బెజవాడలో అభివృద్ధిని కందుకూరుకు తరలించకుండా కందుకూరునే అన్నిసౌకర్యాలతో అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకున్నాడు. సాధారణంగా జయశాసనంలో ‘గెలిచా’...అని మాత్రమే ఉంటుంది. కానీ, పండరంగడి శానంలో గెలిచాక ‘అభివృద్ధి చేశా’ అనే ప్రకటన కనిపిస్తుంది. 1200 ఏళ్ల క్రితం నాటి ఒక విజేత ఆదర్శం ఇది!
“దేశాలను ఏలారు ఎందరో రాజులు. చివరికి మిగిల్చిందెవరు కులసతులకు గాజులు?” అని గోపి అనే సినీకవి గొప్ప పాట వ్రాశాడు. కులసతులకు గాజులు మిగల్చటం అంటే దేశానికి సౌభాగ్యం సమకూర్చటం అని! చరిత్ర దండగ అని పలికిన పాలకులు, అసలు తెలుగే దండగ అని శాసించిన పాలకులు చరిత్రలో స్థానాన్ని ఆశించలేరు కదా!