Wednesday, 6 August 2014

మేథావుల శిరోమర్దన :: డా. జి వి పూర్ణచందు

మేథావుల శిరోమర్దన :: డా. జి వి పూర్ణచందు
           ఓరి దురాత్మ! నీవార ముష్టింపచా/భాస యోజన గంధి ప్రథమ పుత్ర!
             దేవరన్యాయ దుర్భావనా పరతంత్ర!/ బహు సంహితా వృథాభ్యాస పఠన!
             భారత గ్రంథ గుంఫన పండితమ్మన్య!/నీవా మదీయ పత్నికి నశేష
            కైవల్య కళ్యాణ ఘంటా పథమునకు/ కాశికాపురికి నిష్కారణంబ
            శాపమిచ్చెదనని యనాచార సరణి/ హుంకరించినవాడ వహంకరించి
            పొమ్ము నిర్భాగ్య! మాయూరి పొలము వదలి/ ఎచటికే శిష్యుల్న్ నీవు నీ క్షణంబ!
మేథావులం అనుకునే వాళ్ళలో చాలామందిలో తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుని, తమకు చాలినంత  చేయలేదని ఆరోపిస్తూ ఇతరులను నిందించే ఒక లక్షణం ఉంటుంది. వాళ్లడిగింది ఇవ్వని వాళ్ళను నోటి కొచ్చినట్టు తిట్టి, చెడ్డ ప్రచారం చేయటం చదువుకున్నవాళ్ళలో కనిపించే ఒక లక్షణం. ఈ దేశం మీద ఆధారపడి చదువుకుని, ఈదేశాన్ని తిట్టి విదేశాలకు ఎగిరి పోవాలని తహతహలాడే గుణం చదువుకున్నవాళ్ళలోనే ఉంటుంది. ఇలాంటి వింత ప్రవృత్తుల్ని శ్రీనాథుడు ఖండించా లనుకున్నాడు. అందుకోసం వ్యాసుడు కాశీని శపించే కథని ఎంచుకున్నాడు.
బాగా చదువుకున్న వాడు, మేథావి, వేదాలను విభజించి, ఒక క్రమ పద్ధతిలో అమర్చినవాడు, మహాభారతాన్నీ, అష్టాదశ పురాణాల్నీ ఇంకా చాలా రచనల్ని చేసినవాడు, అంతటి వాడు మరొకడు లేడనిపించుకున్నవాడు వ్యాసుడు. ఆయన చదువుకీ ఆయన వ్యక్తిత్వానికీ పొంతన ఉన్నదా లేదా అని పరిక్షించాలని అనిపించింది పరమేశ్వరుడికి. వ్యాసుడు కాశీ నగరానికి వచ్చిన ఒక సమయం చూసుకుని, అక్కడ తిండి దొరక్కుండా చేశాడు. జనం ఆకలికి మాడుతో వెళ్ళి అన్నపూర్ణను వేడుకొని ఆమె పెట్టిన భిక్ష స్వీకరించి కడుపు నింపుకుంటున్నారు. వ్యాసుడికీ ఆయన వెయ్యిమంది శిష్యులకూ  ఎక్కడా తిండి దొరకలేదు. అన్నపూర్ణాదేవి భిక్ష కోసం పిలుస్తుందని ఎదురు చూశాడు. ఐదు రోజులు నిరాహార దీక్ష చేసినా భిక్షకు పిలుపు రాలేదు. దాంతో ఓపలేక కాశీపురాన్ని శపించటం మొదలు పెట్టాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ణీ, అతని శిష్యుల్నీ పిలిచి, కడుపునిండా అన్నం పెట్టింది. కానీ, అసలు కథ అప్పుడే మొదలయ్యింది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదనే విషయాన్ని గమనించలేకపోయడు వ్యాసుడు. చదువుకున్న అహంకారంతో జన్మభూమినే శపించబోయి నందుకు వ్యాసుణ్ణి పరమేశ్వరుడు ఛడామడా వాయించేశాడు. శ్రీనాథుడి శ్రీ భీమేశ్వర పురాణం (భీమఖండం)లో శివుడు వ్యాసుడి మేథస్సుని బాగా మర్దించి అహంకార హుంకారాలను అణచి వేయటం ఈ పద్యంలో కనిపిస్తుంది.
“ఓరి దురాత్ముడా! ‘నీవార ముష్టింపచా భాస’- నీవారాలంటే నివ్వరి వడ్లు. నూర్పుళ్ళు అయిపోయాక అక్కడ రాలి పడిన వరిగింజలు ఏరుకు తెచ్చుకుని వండుకుని తినే పూటకు ఠికాణా లేని... యోజన గంధి ప్రథమ పుత్ర- చేపల వాసన కొట్టే సత్యవతికి (పరాశరుడి ద్వారా) అక్రమంగా పుట్టినవాడా! దేవరన్యాయ దుర్భావనా పరతంత్ర- సోదరులు సంతానం లేకుండా చనిపోతే వాళ్ళ భార్యల ద్వారా సంతానాన్ని కనే ‘పరతంత్రం’ అంటే మనది కాని దురాచారం కలిగినవాడా...బహు సంహితా వృథాభ్యాస పఠన- వేదాలు అనాదిగా ఉన్నాయి. అలాంటి ఆదిమ గ్రంథాలను విభజించాలని వృథాభ్యాస పఠన శ్రమ పడిన వాడా... భారత గ్రంథ గుంఫన పండితమ్మన్య- భారతం అనే గ్రంథాన్ని వ్రాసి, గొప్ప పండితుడివేమీ కాకపోయినా అయినట్టు కనిపించే వాడా! ‘శాపమిచ్చెదనని యనాచార సరణి హుంకరించిన వాడ వహంకరించి’-ఆచారాన్నీ ధర్మాన్నీ పాటించకుండా అహంకారంతో శాపమిస్తానని హుంకరించావు. ‘మదీయ పత్నికి నశేష కైవల్య కళ్యాణ ఘంటా పథమునకు’ కాశికాపురం అంటే నా పత్ని. అశేష కైవల్యానికి కాశీ ఘంటాపథం. ఇక్కడ మరణిస్తే నేరుగా కైవల్యం పొందుతాడు. అటువంటి కాశీపురానికే శాపం ఇస్తానంటూ బయల్దేరిన అనాచారీ! ‘పొమ్మునిర్భాగ్య! మా యూరి పొలము వదలి ఎచటికే శిష్యుల్న్ నీవు నీ క్షణంబ!’ దరిద్రుడా! మా ఊరి పొలిమేరలు దాటి ఈ క్షణానే నీ శిష్యులతో సహా వెళ్ళిపో” అని తిట్టాడు పరమశివుడు. అన్నం పెట్టించి మరీ తిట్టాడు.
జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని, చదువు చెప్పించి ఇంతవాణ్ణి చేసిన దేశాన్నీ, ఈ దేశ సంస్కృతీ వికాసాలనూ ద్వేషించే పరభాషా వ్యామోహ పరులందరికీ ఈ తిట్లు తగులుతాయి. తగలాలి కూడా!
మన భాషా సంస్కృతుల పట్ల,‘ఆచార వ్యవహారాల పట్ల వైమనస్యం, విముఖత, తిరస్కారం ప్రదర్శించే వాళ్ళకు ఈ పద్యాన్ని చదివి వినిపించాలి. ‘అనాచార సరణి హుంకరించిన వాడ వహంకరించి’ అనటంలోనే ఇంత అర్థం ఉంది. దేశీయతని తక్కువ చేసి చూడటాన్ని అనాచారమే నంటాడు పరమ శివుడి ద్వారా శ్రీనాథుడు. దేశీయ సంస్కృతీ భాషాభిమానాలు లేని వాళ్ళందరినీ కలిపి తిట్టాడని మనం అన్వయించుకోవాలి. దేశానికి రాజునైనా నేలతల్లికి కన్నబిడ్డడినే నన్న సంగతి మరిచి విదేశీ మానస పుత్రులుగా భావించుకునే అపర వ్యాసరాయుళ్ళ తెలివైన బుర్ర మర్దించే పద్యం ఇది.