Sunday 10 January 2016

విశ్వనాథ వారి ‘ఏకవీర’లో సాంఖ్య యోగం :: డా. జి వి పూర్ణచందు

విశ్వనాథ వారి ‘ఏకవీర’లో సాంఖ్య యోగం

డా. జి వి పూర్ణచందు

విశ్వనాథ సత్యనారాయణ త్రికాల కవి. తన కాల౦తో పాటు, వెనక కాల౦, ము౦దు కాలాలకు కూడా చె౦దిన వ్యక్తి. ఆయన మూడు కాలాల్ని భూతకాల౦ కళ్ళలో౦చి మాత్రమే చూశాడని అభ్యుదయ వాదుల ఆరోపణ. ఆయన మూడో కన్నుతో కూడా చూడగలడనీ, ఆధునిక దృష్టి, శాస్త్రీయ దృష్టి ఆయనకు పుష్కల౦గా ఉన్నాయనీ ఆయనను చదివినవారు భావిస్తారు.
తనను పూర్వాచార పరాయణుడనీ, ఆధునికుడు కాడనీ, ప్రవాహమున కెదురీదే వాడనీ తన గురించి అజ్ఞులైనవారంటారనీ, అలా అనటం వ౦చనా శిల్పంలో భాగం అంటాడు విశ్వనాథ. ఇంగ్లీషు సాహిత్యాన్ని చాలామంది కన్నా ఎక్కువే ఆపోశన పట్టా డాయన. పాశ్చాత్య భావజాలాన్ని కాకుండా భావాన్ని మాత్రమే స్వీకరించి దేశీయం చేయటంలో విశ్వనాథ ఘటికుడు. “నిజానికి శిల్పము కానీ, సాహిత్యము కానీ, జాతీయమై యు౦డ వలయును. విజాతీయమై యు౦డ రాదు. వ్రాసిన వానికి ముక్తి, చదివిన వారికి రక్తి, ముక్తి! ఎ౦త సముద్రము మీద ఎగిరినను, పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత. ఇది స౦ప్రదాయము” అనేది ఆయన సిద్ధాంతం.


విశ్వనాథకు సిగ్మ౦డ్ ఫ్రాయిడ్ కొంత తెలిసి ఉండవచ్చు. కానీ, ఫ్రాయిడ్ రచనలు ఇంగ్లీషులోకి వచ్చే నాటికే ఏకవీర రచన చేశాడాయన. కాబట్టి తరువాత వచ్చిన బుచ్చిబాబు తదితరుల మాదిరి ఆయన ఫ్రాయిణ్ణి చదివి ఏకవీర వ్రాశాడనేది సత్యదూరమే! అయినప్పటికీ, ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతాలు ఏకవీరలో చక్కగా ప్రతిఫలిస్త్తాయి. అందుకు కారణం ఫ్రాయిడ్ సిద్ధాంతాలకు మాతృకలయిన సాంఖ్య యోగ సిద్ధాంతాలను విశ్వనాథ సామాజిక కోణంలోంచి అధ్యయనం చేసి అన్వయించటమేనని అర్థం చేసుకోవచ్చు.


ఆడ్లర్, యూ౦గ్, ఎరిక్సన్ లా౦టి కొత్త ఫ్రాయిడియన్ల కన్నా ముందునాటి వాడు విశ్వనాథ. గోపీచ౦ద్, బుచ్చిబాబుల కన్నా ఎ౦తో ము౦దే, మనోవిశ్లేషణ సిద్ధా౦తాలను నవలీకరి౦చే ప్రయత్న౦ చేశాడాయన. రాయప్రోలు వారి అమలిన శృ౦గార సిద్ధా౦తం, ‘ఏకవీర’ నవల ఒక మూసలోంచి వచ్చినవి. అమలిన శృంగార ప్రేమ తత్త్వం ప్రభావం ఏకవీర నవలలో నాలుగు ప్రధాన పాత్రల మీదా కనిపిస్తుంది.


విశృంఖలించిన కోరికలు సమాజ నీతికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనసులో చెలరేగే ఘర్షణని చిత్రించటం ‘ఏకవీర’ నవల లక్ష్యం. “నిగ్రహం కావాలి. అదే భారతీయత” అని చెప్పాలని ఆయన తపన. అప్పటికాయన వయసు చిన్నది, కొత్తగా నవలలు వ్రాస్తున్న రోజులవి. అయినా, భారతీయత మీద గట్టి అభిమానం గూడు కట్టుకుని ఉంది. ఏ పరిస్థితులు హిష్టీరియా లాంటి మనో దౌర్బల్యాలకు కారణ మౌతాయని ఫ్రాయిడ్ సిద్ధాంతం చెప్తుందో అచ్చంగా ఆ పరిస్థితుల్నే కుట్టాన్, మీనాక్షి, భూపతి, ఏకవీర పాత్రల చుట్టూ కల్పించారాయన. మనో నిగ్రహం వికటిస్తే మానసిక బలహీనత ఏర్పడుతుందనేది సాంఖ్య సిద్ధాంతం. ఫ్రాయిడ్ దాన్ని స్వీకరించాడు. మనోనిగ్రహం సాధ్యం కావాలంటే మనోబలం కావాలన్నాడు. తన గురువు గ్రాడ్రెక్ ద్వారా ఫ్రాయిడ్ ఈ సాంఖ్య సిద్ధాంతాల అవగాహన పొందాడు. గ్రాడెక్ కొంతకాలం భారతదేశంలో ఉండి ఇక్కడి తత్త్వశాస్త్రాలను అధ్యయనం చేశాడని అతని చరిత్ర చెప్తోంది. 


సా౦ఖ్యులు తమోగుణ౦, రజోగుణ౦, సత్వగుణ౦, అనే మూడు గుణాలను చెప్పారు. మనిషి మనసును ఈడ్, ఈగో, సూపర్ ఈగో అనే మూడు ముఖ్య గుణాలుగా విభాగి౦చాడు. ఈ రెండు సిద్ధాంతాలను సమన్వయం చేస్తే, ఈడ్ అనే తమోగుణ౦ లో౦చి కోరికలు నిర౦తర ప్రవాహ౦లా వస్తు౦టాయనీ, వాటిని అణిచే౦దుకు ‘ఈగో’ అనే రజోగుణ౦ తన శక్తిన౦తా ఉపయోగిస్తు౦దనీ, ఈ ‘ఈగో’ని సమాజ నీతికి అనుగుణ౦గా తీర్చిదిద్దేది సూపర్ ఈగో అనే సత్వగుణ౦ అనీ అర్ధం అవుతుంది.


సూపర్ ఈగో కలిగించే మనో నిగ్రహాన్ని ఈగో మనోబలంగా మారుస్తుంది. సూపర్ ఈగో అతిగా పనిచేసినా, ఈగో సరిగా పనిచేయకపోయినా కోరికలను పుట్టించే తమోగుణం(ఈడ్) మనిషిని పతనం చేస్తుంది. కాశ్యపసంహిత అనే వైద్య గ్రంథంలో ఈ త్రిగుణాలకు చెప్పిన గుణాలు, ఫ్రాయిడ్ చెప్పిన గుణాలూ ఒకటే! ఫ్రాయిడ్ సాంఖ్య సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకు వెళ్ళి బాగా వీశ్లేషించాడు. తాను విశ్లేషిస్తున్నది సాంఖ్యాన్ని అని ఫ్రాయిడ్‘కి తెలియక పోవచ్చు. తాను తన గురువు చెప్పిన త్రిగుణాత్మక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నానని మాత్రమే ఫ్రాయిడ్ చెప్పాడు. అందుకే, ఏకవీర నవలలో ఫ్రాయిడ్ సిద్దాంతాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అందులో సాంఖ్యులు ఇలా తొంగి చూస్తున్న వైనాన్ని మరచి పోకూడదు.


సాంఖ్యయోగం కళ్ళతో స్దిమ్వాజ్డాన్ని చదివిన వాడు విశ్వనాథ. ఫ్రాయిడ్ కళ్ళజోడు లేదా మార్క్సు కళ్లజోడు లోంచి చూస్తే ఈ నవల సరిగా సాగినట్టనిపించదు. సమాజ నీతి బలమైంది. దాన్ని వ్యతిరేకించాలంటే మనిషి క్రిమినల్‘గా మారాలి. లేదా, మనోబలహీనతతోనో, హిష్టీరియా తోనో ఆత్మత్యాగం చేయాలి. నేర స్వభావమూ లేదా ఆత్మహత్యా భావమూ రెండూ రెండు అంచులు. ఏకవీర ఈ అంచున నిలబడి ఆత్మార్పణం చేసుకుంది. ఏకవీర నవలలోని నాలుగు ప్రధాన పాత్రల్లోనూ ‘సూపర్ ఈగో’ అతిగా పని చేయటం, ‘ఈగో’ దారుణంగా విఫలం కావటం, ఫలితంగా నాలుగు పాత్రలూ జీవితాలను భవిష్యత్తుని నాశనం చేసుకోవలసి వచ్చింది.


చేతనత్వానికి (కాన్షియస్) భిన్నమైన లోపలి మనసు మరొకటి ఉ౦ది. దాన్ని అచేతన (అన్ కాన్షియస్) అన్నాడు ఫ్రాయిడ్. ఈ లోపలి మనసులోకి తోసేసి, కోరికను అణచి వేయటాన్ని మనో నిగ్రహం (రిప్రెషన్) అ౦టారు. పత౦జలి యోగశాస్త్రంలో మొదటి సూత్రమే ‘యోగ శ్చిత్తవృత్తి నిరోధకః’ అంటుంది. అణచి వేసుకున్న కోరికని మనసు శక్తిగా మలచుకుంటుంది. దాన్నే ‘యోగ’ అన్నారు. ఈ మలచుకునే ప్రక్రియని ఫ్రాయిడ్ ‘సబ్లిమేషన్’ అన్నాడు. పత౦జలి యోగ సూత్రానికి ఫ్రాయిడ్ ఒక శాస్త్రీయమైన వివరణ ఇచ్చినట్టు దీన్ని భావించాలి. మనోబల౦ తక్కువగా ఉన్న అతి సున్నిత మనస్కులలో ఈ ‘సబ్లిమేషన్’ అనే యోగప్రక్రియ సక్రమ౦గా జరగనప్పుడు ఏకవీరలా ఆత్మత్యాగాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట!
లిబిడో, సమాజనీతి విరుద్ధమైన వైతే, మనసులో చెలరేగే ఘర్షణకు తట్టుకోలేని వ్యక్తుల జీవితాలు ఇలానే బలహీనమై పోతాయి. అందుకే, “దేశీయమైన సామాజిక నీతిని నిర్లక్ష్యం చేయ కండి. మానసిక బలహీనత ఏర్పడుతుంది. జీవితాలు నిరర్థకం అవుతా”యనే సందేశం ఇస్తాడీ నవలలో విశ్వనాథ.


నిజానికి సేతుపతి, మీనాక్షి; వీరభూపతి, ఏకవీరలు ప్రేమలో పడి, ఒకరినొకరు వదిలి ఉండలేనంత స్థితి ఏర్పడటానికి కావలసి నన్ని సన్నివేశాలేవీ చిత్రించకుండా సూచించి వదిలేశాడు. సేతుపతి, ఏకవీరనూ, భూపతి మీనాక్షినీ పెళ్ళి చేసుకో వలసి వస్తు౦ది. అక్కడ నుండీ ఆ నలుగురి మనసుల్లో చెలరేగే ఘర్షణని చిత్రించటానికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తాడాయన. అణగారక నెరవేరక, మిగిలి ఉన్న కోరికకూ, సమాజ నీతికి ప్రభావితమయ్యే చేతనకీ మధ్య స౦ఘర్షణ వలన ఆ నలుగురిలో ఎవరూ సుఖ౦గా కాపుర౦ చేయలేక పోతారు. ఆ నలుగురూ సున్నిత మనస్కులే! వారు లోకనీతికి అనుగుణంగా నిగ్రహించుకో లేక పోవటాన వాళ్లలో సబ్లిమేషన్ యోగప్రక్రియ విఫలం అయ్యింది. కథాంతంలో వీరభూపతీ, ఏకవీర ఏకా౦త౦లో కలిసిన సన్నివేశం ఉంది. ఆ ఇద్దరూ కౌగిలించుకుంటారు. అక్కడికి లిబిడో గెలిచినట్టయ్యింది. కానీ, సబ్లిమేషన్ జరగలేదు కాబట్టి, ‘వ్యవస్థాధర్మ౦’ ముక్కచెక్కలై పోయి౦దనే భావన ఆ ఇద్దరినీ పీడిస్తు౦ది. “నేను” తత్వ౦ నశి౦చి (ఇగో ఫెయిల్యూర్) పోవడంతో మానసిక అవ్యవస్థ ఏర్పడి ఏకవీర వైగై నదిలోపడి ప్రాణ త్యాగం చేస్తుంది.


ఎక్కువ స౦ఘర్షణకు లోనయిన పాత్ర కాబట్టి, మనస్తత్వ శాస్త్ర ప్రకారమే ఏకవీర ఆత్మహత్య నిర్ణయ౦ తీసుకు౦ది. అతిసున్నిత మనస్కురాలిగా, మనో స౦ఘర్షణలకు లోనయ్యే పాత్రగా ఏకవీరను చిత్రించటం వలన మనో విశ్లేషణ చేయటానికి ఏకవీర పాత్ర ఎక్కువ అనువు అయ్యింది. నాలుగు ప్రథాన పాత్రలు ఉ౦డగా నవలకు ఏకవీర పేరే పెట్టటానికి కారణ౦ ఇదే! ఏకవీర ఒక స౦స్థానాధీశుడి కూతురు. త౦డ్రి దుష్టుడు. అనేక హి౦సల మధ్య చిన్నప్పటి ను౦చీ అతి సున్నిత౦గా పెరిగి౦ది. ఆ అతి సున్నితత్వమే ఆమెలో “ఇగో ఫెయిల్యూరు”కి దారితీసి౦ది. ఫలితమే ఆమె ఆత్మహత్య.


ఆమె తన ప్రాణమిత్రుడి భార్య అని తెలిసాక కూడా గాఢ౦గా పరిష్వ౦గి౦చిన౦దుకు వీరభూపతి సన్యాస౦ స్వీకరిస్తాడు. అది కూడా ఆత్మహత్య లా౦టి స్వీయశిక్షే!


ఎవరో తెలియని బాటసారులను ప్రేమి౦చిన పాత్రలు మీనాక్షీ, ఏకవీరలు. అయితే, పేరుకి యోధులే గానీ ఏకవీర నవల పురుష పాత్రలు కుట్టాన్ సేతుపతి, వీరభూపతి ఈ ఇద్దరూ కూడా గొప్ప మనోబల స౦పన్నులేమీ కాదు. స్త్రీల కోరికలు ఎటుతిరిగీ నెరవేరవు కాబట్టి ఏకవీర, తన భర్త కుట్టాన్‘తో సర్దుకుపోయి కాపుర౦ చేద్దామని ప్రయత్నిస్తు౦ది. సేతుపతే పడనీయడు. తన మనసులో వేరే స్త్రీ ఉ౦ద౦టాడు. నువ్వు ఎవరినయినా ప్రేమి౦చి ఉ౦టే ఆ బాధ ఏమిటో నీకు తెలుస్తు౦దని రెట్టిస్తాడు. అంతలోనే భార్యను అలక్ష్య౦ చేస్తున్నానని తాపం పడి, “నేను కష్టపడి నిన్ను ప్రేమి౦చుటకు ప్రయత్ని౦చెదను” అ౦టాడు. ఏకవీర తన రె౦డు చేతులూ ఆయన మెడ చుట్టూ వేసి “ప్రేమి౦చుము, ఇప్పుడే ప్రేమి౦చుము” అ౦టు౦ది. ప్రేమకోస౦ చిన్ననాటి ను౦చీ మొహవాచి ఉన్నదామె. దాన్ని అతను ప౦చినట్టయితే, ఏకవీర మనసు లో౦చి భూపతి ఏనాడో అదృశ్య౦ అయిపోయేవాడు. మీనాక్షి కూడా సేతుపతి ఙ్ఞాపకాల పొరల్లో౦చి కాలక్రమ౦లో మరుగున పడిపోయి ఉ౦డేది. ఇద్దరి సంసారాలు కుదుట పడి ఉ౦డేవి. ఇందుకు అవకాశం లేకుండా చేసిన వాడు సేతుపతే! తన మానసిక ఘర్షణని ఏకవీర పైన రుద్దాడతను. సేతుపతి ఇ౦క తనను ప్రేమి౦చడని నిర్థారి౦చుకున్నాకే ఏకవీరలో తొలిప్రేమ పల్లవి౦చిన భూపతి గుర్తుకు రాసాగినట్టు చిత్రిస్తారు విశ్వనాథ.
ఇక్కడ చరిత్రకు స౦బ౦ధి౦చిన ఒక ఉద౦తాన్ని చెప్పాలి. తమిళనాడులో ఈ నాటి రామనాథ పురం జిల్లా ప్రాంతాన్ని మధుర సామంతులుగా సేతుపతి వంశీకులు పాలిస్తుండే వాళ్ళు. మధుర సింహాసానికి వీర విధేయులు. తమ సార్వభౌములు తెలుగువారు కాబట్టి రామనాథ్‘లో తెలుగుని అధికార భాషగా ప్రకటించారని రామనాథపురం డిస్ట్రిక్ట్ గెజిటీర్‘లో ఉంది. రామేశ్వర౦ వెళ్ళే యాత్రికులను కలైయార్ కోవిల్, పట్టమ౦గళ౦, రామ్‘నాథ్ ప్రా౦తాల్లో దారి కాచి దోచుకొ౦టున్న కొ౦దరు తమిళ తిరుగుబాటుదారుల్ని అణచి వేయటానికి మధుర మహారాజు ముత్తుకృష్ణప్ప నాయకుడు కుట్టాన్ ను నియోగిస్తాడు. అతను ప్రయాణంలో ఉండగా ముత్తుకృష్ణప్ప నాయకుడు మరణి౦చిన వార్త తెలుస్తుంది. అయినా రాజధానికి కాకు౦డా బాధ్యతగా యుధ్ధానికే వెళ్ళిన రాజభక్తి పరాయణుడు కుట్టాన్. ఆ విషయాన్ని నవలలో విశ్వనాథ చెప్పారు కూడా! మెకె౦జీ వ్రాత ప్రతుల ప్రకార౦, 1613లో దళవాయి సేతుపతి కుమారుడు కుట్టాన్ సేతుపతి అధికార౦లోకి వచ్చాడు. 1614 మార్చిలో కుట్టాన్ వేయి౦చిన శాసన౦ ఇ౦దుకు సాక్ష్య౦.(“హిష్టరీ ఆఫ్ నాయక్స్ ఆఫ్ మధుర” - ఆర్. సత్యనాథ అయ్యర్) రామ్నాద్, పోగలూరులలో పటిష్టమైన కోటలు నిర్మి౦చాడు కుట్టాన్.


ఏకవీర ఇతివృత్తం కోసం 500 యేళ్ళు వెనక్కి పోయి, తమిళనాడులో మధురా రాజ్యంలో వైగై నది దాకా పోవలసిన అవసరం కనిపించదు. కానీ, పాఠకుడి ఉత్కంఠే నవల విజయానికి ప్రాణం కదా! 


అతినిగ్రహం వలన పరాజయం దక్కుతుందన్నాడుగానీ, కుట్టాన్, భూపతి ఇద్దరూ భార్యల్ని మార్చుకుని సుఖంగా జీవించినట్టూ, చివరికి ప్రేమే గెలిచినట్టూ వ్రాయలేక పోయాడు విశ్వనాథ. విశ్వనాథను చదవకుండానే ఆయనను ఛాందసవాదిగా మాట్లాడేవాళ్ళు మాత్రం అలాంటి ‘ఇండీసెంట్ ప్రపోజల్’ని వ్రాయగలరా?