Tuesday 17 June 2014

సుఖ సంసారంలో చిచ్చు ‘స్ట్రెస్సు’ డా. జి వి పూర్ణచందు


సుఖ సంసారంలో చిచ్చు ‘స్ట్రెస్సు’

డా. జి వి పూర్ణచందు


లైంగిక సుఖాన్ని పొందాలనే కోరిక ఎంత బలంగా ఉంటే లైంగిక కార్యం అంత బలంగా జరుగుతుంది. జీవితంలో అన్ని విషయాలకూ వర్తించే వ్యక్తిత్వవికాస సూత్రాలన్నీ లైంగిక శక్తిని పెంచుకునేందుకూ వర్తిస్తాయి.

ఏకాగ్రత (సి = కాన్‘సన్‘ట్రేషన్), ఇష్టత ( ఐ = ఇంట్రెష్ట్), దీక్ష, పట్టుదల ( డి = డెడికేషన్), ఈ సి ఐ డీలు సక్రమంగా ఉంటే, పరీక్షల్లో డిష్టింక్షన్ సాధించ గలిగినట్టు, సెక్సు కార్యంలో కూడా స్త్రీ పురుషులు డిష్టింక్షన్ పొందటానికి ఈ సి. ఐ. డీ.ల అవసరం ఉంటుంది. నిజానికి సెక్సులో విజయం అనేది ఒక పరీక్షే! ఇందులో ఉత్తీర్ణత పొందితే, అన్నింటా జయమే!

ఎలాంటి ఆందోళనలూ లేకుండా అనుకూల భావావేశంతో (పోజిటివ్ యాటిట్యూడ్) మనసు నిండి ఉన్నప్పుడు సుఖ సంసారం సాధ్యమౌతుంది. చింతా శోక భయ దుఃఖాదులన్నీ లైంగిక శక్తిని చంపేస్తాయి. ఆత్మవిశ్వాసం కోల్పోతే, లైంగిక శక్తీ, ఆసక్తీ అంతరించి పోతాయి. ఆత్మవిశ్వాసంతో రతిక్రీడకు తలపడినప్పుడు జీవిత బాగస్వామితో అనేక రెట్లు సుఖానుభవాన్ని పంచుకోవచ్చు!  

వేలల్లో జీతాలు తీసుకునే చాలామంది స్త్రీ పురుషులు వృత్తి పరమైన మానసికవత్తిడికి (స్ట్రెస్స్) లోనవటం వలన నిజమైన లైంగిక సుఖానుభవానికి దూరం అయిపోతున్నారు. వాళ్ళలో వివాహ బంధాల విఛ్ఛిన్నతా శాతం ఎక్కువగా ఉంటోంది. ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిపోయి, ధనమదాంధతతో వాళ్ళు సంసారాలను నాశనం చేసుకుంటూ న్నారని అనుకోవటం పూర్తి వాస్తవం కాదు. దీర్ఘకాలం పాటు వృత్తిపరమైన, సామాజిక పరమైన, కుటుంబ పరమైన ‘స్త్రెస్సు’ లో నిరంతరంగా జీవించటం వలన మనుషులు లైంగిక అసమర్ధతకు లోనౌతుంటారు. సంసారాలు విఛ్ఛిన్నం కావటానికి ఇది ప్రధాన కారణం. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చుగానీ, సెక్సు సమర్ధతని కొనలేరు కదా!  

నిజానికి లైంగిక కార్యం వలన మనసులోంచి వత్తిడి అనే దయ్యం పారిపోవాలి. ప్రియురాలి ఒడిలో ఒక్క క్షణం సేద తీరితే ఎంతవత్తిడి నుంచైనా బయట పడగలుగుతారు మనుషులు. కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. స్ట్రెస్సు లేని సమయాన్ని చూసుకుని సుఖంగా గడుపుదాం అనుకునేంతలో ఆఫీసునుండి సెల్లు పిలుపు వస్తుంది. అంతే! వెంటనే ల్యాప్‘టాప్ తెరిచి దానికి అంకితం కావతం ఎక్కువసార్లు జరిగిపోతుంది. తనను ఒడిలోకి తీసు కోవాల్సిన తన జీవిత భాగస్వామి ఆ ల్యాప్‘టాప్‘ని ఒడిలోకి తీసుకోవటాన్ని ఎవరికైనా భరించలేని విషయమే! అది మానసిక వత్తిడికి దారి తీస్తుంది. ఫలితంగా విసుగులూ, కోప తాపాలు, చీదరింపులూ, మూతి విరుపులూ సహజంగా పెరిగి పోయి భార్యా భర్తలు తమ విధ్యుక్త ధర్మాలను నెరవేర్చుకో గలిగే సమయం చిక్కక, సతమతమౌతూ ఉంటారు. చివరికి మనసు విప్పి మాట్లాడుకునే సావకాశం కూడా వారికి చిక్కదు.  సంసారాల్లో స్ట్రెస్స్ వలన సుఖజీవనం నాశనం అవుతోంది. క్రమేణా అది దాంపత్యాన్ని చీల్చే దాకా దారి తీస్తోంది.

ఇలాంటి పరిస్థితిని నివారించు కోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. దీన్ని సరి చేసుకోకుండా, లైంగిక శక్తిని పెంచే మందులను ఆశ్రయించటం వలన ధన మాన ప్రాణాల దోపిడీ తప్ప ఒరిగేదేమీ ఉండదు. చిట్కా చికిత్సలు మన ప్రయత్నానికి ఉడత సాయం చేస్తాయే గానీ, అవే ప్రధానం ఎంతమాత్రం కాదని గ్రహించాలి. మనో బలం లేనివాడి దగ్గర వజ్రాయుధం ఉంటే మాత్రం ఒరిగేదేం ఉంటుంది...? సెక్సు విషయంలో ఈ సూక్తి ముఖ్యంగా వర్తిస్తుంది.

మొదట మనసుని చక్కగా అలంకరించుకోవాలి. అందులో స్ట్రెస్సు లాంటి అడ్డుభావనలేవీ లేకుండా చూసుకోవాలి.

తరువాత శరీరాన్ని అలంకరించుకోవాలి. అందులో ఎలాంటి వికారాలూ కలగకుండా జాగ్రత్త పడాలి. ఉదాహరణకు మీ జీవిత భాగస్వామికి వెల్లుల్లి సరిపడదనుకోండి, మీ శరీరంలోంచి వెల్లుల్లి గవులు కంపు కొడుతుంటే అవతలి వ్యక్తి పూర్తిగా సెక్సు విముఖతకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది! తాగి ఇంటికి వచ్చి సారాకంపుకొట్టే మొగుడితో భార్య పొందేది లైంగిక సుఖం కాబోదు కదా! యాంత్రికంగా ఆ తాగుబోతుకు ఒళ్ళప్పగించి అయిందన్నాక అటు తిరిగి పడుకునే భార్యలే ఎక్కువ మంది ఉన్నారని ఒక సర్వే చెప్తోంది.

ఇద్దరికీ లైంగికోత్తేజ కరంగా ఉండేలా పడక గది అలంకారం ఉండాలి. అందులో మంచం కింద ఆరబోసిన ఉల్లిపాయలూ, మంచం పక్కన మురికి గుడ్డలూ, చుట్టూ వ్యాపించిన బూజు, ఎక్కడో ఎలిక చచ్చిన వాసన...ఇలాంటి పడక గదిలో జరిగేది కక్కుర్తి వ్యవహారమే గానీ, అది నిజమైన దాంపత్య సుఖ ప్రేరకం ఎంతమాత్రమూ కాదు.

సెక్సనేది ఇచ్చి పుచ్చుకునే ఒక భావావేశం. అది, గది నాలుగు గోడలమధ్య ఇద్దరికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. గెలుపోటములు నిర్ణయించే అంపైర్లెవరూ ఉండని ఒక రహస్య క్రీడ. దానికి నియమ నిబంధనలేవీ ఉండవు. ఇద్దరి అంగీకారంతో జరిగే ఒక ‘రాగుంజు పోగుంజు’లాట. ఇందులో చేయటం చేయబడటం అనే రెండు వ్యవహారాలు అసలే ఉండవు. ఆడది సుఖపెట్టేది, మగాడు సుఖపడేవాడు అనే అభిప్రాయం తప్పు. సుఖ సంతోషాలను ఇచ్చి పుచ్చుకునే సమస్థితి ఉన్నప్పుడే అది ఆరోగ్యదాయక మైన దాంపత్య సుఖానుభూతి నిస్తుంది.

ఏవి ఎలా ఉన్నా మనసు అనేది సెక్సు విజయాన్ని ప్రసాదించే గొప్ప ఔషధం. అది నిర్మలంగా ఉండాలి. అన్నింటికన్నా ముందు మనిషికి సెక్సు పరమైన నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేని వ్యక్తి సెక్సుకు తలపడినప్పుడు గిల్టీ కాన్షస్ అంటామే... . అపరాధ భావన... అది ఆ సమయంలో ప్రభావం చూపిస్తే ఆ వ్యక్తి సెక్సు పరమైన అపజయాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇవన్నీ స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా వర్తించే విషయాలే! మానసిక వత్తిడి (స్త్రెస్సు)ని తెచ్చే వాటిలో అపరాధ బావన కూడా ముఖ్యమైందే!  పవిత్రమైన దాంపత్య సుఖానికి స్ట్రెస్సు అనేది చిచ్చు పెట్టేదేనని గుర్తించాలి.


అజీర్తిని జయించే ఆహారం డా. జి వి పూర్ణచందు

అజీర్తిని జయించే ఆహారం
డా. జి వి పూర్ణచందు
అజీర్తి కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గటానికి ఒకటీ లేదా రెండు వెల్లుల్లి గర్భాల్ని నమలకుండా మింగేయండి. ఫలితం కనిపిస్తుంది.
అజీర్తి నివారణకు ఒక ఫార్ములాని చెప్తాను. దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకుని ఎప్పుడు అజీర్తి  అనిపించినా తీసుకుంటూ ఉండటం మంచిది. కరక్కాయలు బాగా ఎండినవి మనకు బజార్లో దొరుకుతాయి. ఈ కాయని పగలగొడెతే లోపల గింజ ఉంటుంది. ఆ గింజను తీసేసి, కరక్కాయ బెరడు మాత్రమే మనకు కావాలి. వంద గ్రాముల కరక్కాయల్లో గింజతీసేస్తే షుమారు యాబై గ్రాముల బెరడు మిగుల్తుందిఈ బెరడుకు సమానంగా పిప్పళ్ళను, సౌవర్చలవణాన్ని తీసుకుని (ఇది దొరక్కపోతే సైంధవ లవణం)మూడింటినీ మెత్తగా దంచిన పొడి అరచెంచా మోతాదులో మ్తీసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే అజీర్తి బాధలు తగ్గతయ. మంచ జీర్ణశక్తి కలుగతుంది. దీన్ని అజీర్ణహర చూర్ణం అని పిలుస్తారు.
ఇలాంటిదే ఇంకో ఫార్ములా కూడా ఉంది. సైంధవలవణం కరక్కాయ బెరడు, పిప్పళ్ళు, వాము, శొంఠి ఈ ఐదూ పచారీ షాపుల్లో దొరికేవే! వీటన్నింటినీ మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. కడుపులో బాగో లేదనిపించినప్పుడు, అజీర్తికర మైనవి తిన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడూ ఈ పొడిని అరచెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి తాగండి. పొట్ట బాగౌతుంది.
అజీర్తి వలన వచ్చే కడుపులో నొప్పి తగ్గటానికి, ఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి కాయండి. బోజనం చేసిన తరువాత కడుపులో నొప్పి వస్తున్నవారికి ఈ ఉప్పు వేసిన నేతిని మొదటి ముద్దగా కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది.
అజీర్తి, జీర్ణకోశానికి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా సరే, వసకొమ్ముని దంచిన పొడి చిటికెడు తీసుకుని చిక్కని బ్లాక్ టీ లాగా కాచుకుని తాగితేమేలు చేస్తుంది. కఫం తగ్గుతుంది. జ్వర తీవ్రత తగ్గుతుంది. విషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. మొలలున్న వారికి ఉపశాంతినిస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. మలబద్ధకాన్ని హరిస్తుంది. ఉబ్బసంలో వచ్చే దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. అతిగా తాగితే వికారం కలిగిస్తుంది. స్వల్ప ప్రమాణంలో తీసుకోవాలి.
అజీర్తిని జయించే వాటిలో బిరియానీ ఆకు గొప్పది. ఆకుపత్రి అంటారు దీన్ని. బిరియానీలోనో పలావులోనో కలుపు తుంటారు. మషాలా ద్రవ్యాలలో ఇది నిరపాయకరమైంది. ఆరోగ్యాన్నిచ్చేది. ఈ ఆకులు కూడా కలిపి మషాలా ద్రవ్యాలను తయారు చేసుకుంటే, అజీర్తిని జయించినట్టే!మలబద్ధతని సరి చేస్తుంది. కడుపులో నొప్పిని హరిస్తుంది. పైత్యాన్ని పోగొడుతుంది. బాలింతలకు తల్లిపాలు పెరిగేలా చేస్తుంది. కడుపులో వాతం, గ్యాసూ, ఉబ్బరం, దుర్గంధతో కూడిన అపాన వాయువులు, దుర్గంధంతో కూడిన విరేచనం ఆగుతాయి. నోటి దుర్వాసన పోతుంది. అల్లం వెల్లుల్లి తగ్గించి, ఆకుపత్రినీ, దాల్చిన చెక్కనూ వాడుకుంటూ ఉంటే మంచిది. బియ్యపు నూకను దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

జీర్ణశక్తి మందంగా ఉన్నవాళ్ళు దంపుడు బియ్యాన్నో లేక పట్టు తక్కువ బియ్యాన్నో తినటం వలన జీర్ణాశయవ్యవస్థ మరింత దెబ్బతింటుంది. గోధుమలూ రాగులూ, సజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండుకుంటాం. వీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూ, తవుడూ వగైరా తీసేయటం ఉండదు. కాబట్టి, దంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూ, రాగులూ సజ్జలూ  వగైరా తృణ ధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిది. జీర్ణాశయం బలగా లేదనుకున్నప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను వండుకుని తింటే పేగులు చెడకుండా ఉంటాయి.
బార్లీ జావ, సగ్గుబియ్యం జావ, పేలాలు, మరమరాలు(బొరుగులు) ఇలాంటివి జీర్ణశక్తిని కాపాడతాయి. అజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవటం మంచిది. షుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలు, జొన్న అటుకులు చాలా మేలు చస్తాయి.
పెసర పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి కాచిన కట్టులో మిరప కారానికి బదులుగా మిరియాల పొడిని కలుపుకుని అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది.
లేత ముల్లంగి దుంపల జ్యూసు రోజూ ఉదయం పూట తాగుతూ ఉంటే పేగులకు ప్రశాంతత నిచ్చి జీర్ణశక్తిని పెంచుతుంది.
అజీర్తిని తగ్గించే ఒక ఆహార పదార్ధం అష్టగుణమండం: ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియానీ ఆకు ముక్కలు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు... వీటన్నింటినీ సమభాగం తీసుకుని మెత్తగా దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. బియ్యంలో సగం చాయపెసర పప్పు తీసుకుని నీరు ఎక్కువగా కలిపి జావలాగా కాయండి. ఒక మనిషికి సరిపడిన జావలో  ఈ పొడిని ఒకచెంచా లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి మరికాసేపు కాచి దింపండి. దీన్నే అష్టగుణమండం అంటారు. ఇది అజీర్తిని తగ్గించే గొప్ప ఔషధం. రోజూ తాగినా మంచిదే!
అజీర్తిని పోగొట్టటానికి సూక్ష్మంలో మోక్షంగా పనిచేసే ఇంకో ఉపాయం ఉంది. కొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని అందులో ఉప్పు, మిరియాలపొడి తగినంత కలిపి, రోజూ ప్రొద్దున పూట తాగుతూ ఉంటే అజీర్తి పటాపంచ లౌతుంది. పైత్యం, కడుపులో యాసిడ్, పేగుపత వ్యాధుల్లో మంచిది. కొత్తిమీర మిరియాలపొడి మిశ్రమాన్ని మెత్తగా నూరి తగినంత ఉప్పు కలిపి భద్రపరచుకోండి. అన్నంలో మొదటి ముద్దగా దీన్ని తింటే అజీర్తి కలగదు.
అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచటంలో ఉప్పుని మించిన ఔషధం లేదు. అయితే ఉప్పుని పరిమితంగా ఒక ఔషధంలాగే వాడుకోవాలి. ఎందుకంటే ఉప్పు తగ్గినందు వల్ల ఏర్పడే జబ్బుల్లాగే ఉప్పు పెరిగి నందువలన ఏర్పడే జబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి!  ఉప్పుని ముట్టుకో కూడదన్నట్టు చెప్పటమూ తప్పే! అదే పనిగా తినటమూ తప్పే!
అన్నం తినబుద్ధి కాకపోతున్నప్పుడు బిరియానీ ఆకుని మెత్తగా దంచి మిరియాల పొడి ఉప్పు తగినంత కలిపి  కారప్పొడి చేసుకుని తింటే అన్నహితవు కలుగుతుంది. అన్నహితవు కలగటానికి ప్రతిరోజూ అల్లాన్ని తగినంత ఉప్పు వేసి దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే భోజనంలో ఉండే దోషాలన్నీ పోతాయి. అన్నం తినాలనే కోరిక కలుగుతుంది. అల్లం ఉప్పు కలిపి మెత్తగా నూరి  అన్నంలో ఒక చెంచా మోతాదులో కలుపుకుని నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే అజీర్తి తగ్గుతుంది. అన్నహితవు కలుగుతుంది. భోజనం చేసిన తరువాత భుక్తాయాసం కలగకుండా ఉంటుంది.సిరిక్జాయ తొక్కుడు పచ్చడి(నల్లపచ్చడిఅల్లం మిశ్రమం కలిపి నెయ్యి వేసుకుని ఒకటీ లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. అజీర్తి లేని వాళ్ళు కూడా ఇది తింటూ ఉంటే జీర్ణ శక్తి పదిలంగా ఉంటుంది.
ఆవపిండి చిటికెడంత కలిపిన వంటకాలను తరచూ తింటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది
ఆహార సమయంలో నీటిని మధ్యమధ్య తాగుతూ ఉంటే అజీర్తి తగ్గి, జీర్ణశక్తి పదిలంగా ఉంటూంది. అతిగా నీరు తాగితే జీర్ణశక్తి మందగిస్తుంది.
ఎండిన కిస్మిస్ పళ్ళూ పంచదార, తేనె ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచామోతాదులో రెండు పూటలా రోజూ తీసుకుంటే  కడుపులో బాధలు తగ్గి జీర్ణకోశ వ్యవస్థ ఎంతో పదిలంగా ఉంటుంది.
పిప్పళ్లను దోరగా వేయించి మెత్తగా దంచండి పిప్పళ్ళు మీకు పచారీ కొట్లలో దొరుకుతాయి. లేదా మూలికలమ్మే వారి దగ్గర దొరుకుతాయి. తేలికగా దొరికేవే! ఈ పిప్పలీ చూర్ణానికి ఆరురెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరచుకోండి. జీర్ణ వ్యవస్థ బలంగా లేనివారు దీన్ని ఉదయం రాత్రి ఒక్కక్క మాత్ర చొప్పున తీసుకుంటూ ఉంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది. శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.
పెరట్లో బొప్పాయి చెట్టు ఉన్నవారు చేసుకోగలిగిన ఫార్ములా ఇది: బొప్పాయి చెట్టుకు గాటు పెడితే పాలు వస్తాయి. కొద్దిసేపు కష్టపడితే ఒక చెంచా లేదా రెండు చెంచాల పాలు సేకరించవచ్చు. ఈ బొప్పాయి పాలుంచిన గ్లాసుని వేడి ఇసుకమీద గానీ, సన్న సెగ మీద గానీ ఉంచితే, ఆ వేడికి బొప్పాయి పాలు గడ్డకట్టి పొడిగా అవుతాయి. ఈ పొడిని చిటికెడంత తీసుకుని గ్లాసు పాలలో గానీ, మజ్జిగలో గానీ కలుపుకుని తాగితే ఆకలి పరిగెత్తు కొస్తుంది. ‘పెపైన్ అనే ఎంజైమును ప్రకృతి సిద్ధంగా పొందేందుకు ఇది మంచి ఉపాయం.
 పైత్యం, అజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడుపెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది.
లేత అరటికాయల కూరని మిరియాలపొడితో గానీ, కాల్చి పెరుగుపచ్చడిగా గానీ చేసుకుని తింటే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.