Friday, 24 June 2016

భాషా సాంస్కృతిక విధానం:: డా. జి వి పూర్ణచందు

భాషా సాంస్కృతిక విధానం

 డా. జి వి పూర్ణచందు

ఱేడు పరాపరోక్తుల నెఱింగి విచారణ సేయడేని, మా
రేడును ఱేఁడే. తన్ననుసరించిన శ్రీఫల మిచ్చుచుండు; నే
రేడును ఱేఁడే, యయ్యది భరించు ద్విజ ప్రకరమునెల్లఁ; బూ
రేడును ఱేఁడే, యయ్యది చరించెడి సత్పథమందుఁ బొందుగన్
(తిరుపతి వేంకట కవుల ‘గీరతం’ నుండి)

ప్రభుత్వానికి భాషా సాంస్కృతిక విధానం ఒకటి ఉండాలి. కృష్ణదేవ రాయలు ఒక చారిత్రక వ్యక్తిగా నిలిచి పోయి, వందలాది అనుకూల కథలు అతని చుట్టు అల్లుకోవటానికి ప్రధాన కారణం ఆయన కవులకు, కళాకారులకు, కళలకు, దేశభాషలకు ప్రోత్సాహం ఇవ్వటమే! ఈ సూక్మాం న్ని ఈ కాలపు ఱేడులు(ప్రభువులు) గుర్తించలేక పోవటం వలన మాజీ ముఖ్యమంత్రు లెందరో జనం స్మృతి పథంలోంచి క్రమేణా కనుమరుగై పోతున్నారు.
“కళల్ని నువ్వు బతికించు. కళ నిన్ను బతికిస్తుంది” అనే సూక్తి ప్రతి ముఖ్యమంత్రికీ వర్తిస్తుంది.కళ బతకాలి. కళాకారుడూ బతకాలి. బతికేందుకు దారులు వేయటమే సాంస్కృతిక విధానం. తెలుగు భాషాభివృద్ధి, పరిశోధనలు, సాహిత్యం, పుస్తక ప్రచురణ, గ్రంథాలయాలకు ప్రాణం పోయటం, తెలుగువారి సాంప్రదాయక కళలను విద్యార్ధు లందరికీ నేర్పించటం, మద్రాస్ అడయారులోని కళాక్షేత్రం, కేరళ త్రిస్సూరులోని ‘కళామండలం’ స్థాయిల్లో ఒక గొప్ప కళా విద్యా సంస్థను నెలకొల్పటం, లలిత కళలు శిల్పకళల పరిరక్షణ, అకాడెమీలను పునరుద్ధరించే వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం, శాస్త్ర సాంకేతిక సాహిత్యాన్ని ప్రచారంలోకి తేవటం, భాషాభివృద్ధికి, ఒక ‘సాధికార సంస్థ’ నెలకొల్పటం, కవులు కళాకారుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు వర్తింప చేయటం ఇవన్నీ జరగాలి. జరిపే సంకల్పం ఉండాలి. వాటి నిర్వహణ అర్హులు, సమర్ధుల చేతుల్లో ఉంచాలి. ఈ చివరిదే చాలా ముఖ్యమైన అంశం.
రాష్ట్రాభివృద్ధికి ఇరవై యేళ్ళ విజన్ డాక్యుమెంటు తయారు చేసుకున్న ప్రభుత్వం సాంస్కృతిక విధానానికి కూడా తయారు చేయకపోవటం కళాపోషణ లేకపోవటంతో సమానమే! “తెలుగదేల యన్న దేశంబు తెలుగు” అని కమ్మగా పాడతారు గాని, ఆ తెలుగు అతీగతీ పట్టించుకోరు. “నో పార్కింగ్ ఫర్ త్రీ వీలర్స్” అని రిక్షావాళ్ల కోసం కూడా ఇంగ్లీషులోనే బోర్డు పెట్టే అధికారుల్ని ఉద్యోగంలోంచి తీసేయకుండా పోషించే ప్రభుత్వం కళాపోషణ చేయగలదా?
భాషోద్యమం బలంగా తన వాణిని వినిపించిన ప్రతిసారీ ఇంటర్మీడియట్ వరకూ తప్పనిసరిగా తెలుగు నేర్పించాలనే జీవోని ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటి జీవోలు ఇచ్చాయి. కానీ, విచిత్రంగా ఆ జీవోలు అమలు కావు. అమలు చేయాలని ఇంకో జీవో ఇచ్చినా అదీ అమలు కాదు. రాష్ట్రంలో పరిస్థితి ఇది.
కవి గానీ, కళాకారుడు గానీ కన్నడంలోనో మళయాళంలోనో లేకపోతే అరవంలోనో పుట్టాలి. తెలుగులో పుట్టకూడదు. పుడితే జీవిత కాల అఙ్ఞాతవాసమే శిక్ష. అంతర్జాతీయ స్థాయి రచన తెలుగులో వ్రాస్తే, ఇలాంటివి పోవని ప్రచురణకర్త వేయడు. రచయితే స్వంతంగా వేసుకున్నా పుస్తక విక్రేతలు తమ షాపుల్లో పెట్టి అమ్మరు. అమ్మినా పాఠకులు, గ్రంథాలయాలు కొనరు. ఇలాంటి స్థితిలో వ్రాసినదానికి వెలుగు చూసే (out-let) అవకాశం లేకపోవటాన గొప్పగొప్ప సాహితీ వేత్తలు రాయని భాస్కరు లౌతున్నారు. తెలుగులో ఙ్ఞానపీఠాలు తక్కువని ఎద్దేవా చేస్తారు గానీ తేగల సత్తా ఉన్నవారికి ప్రోత్సాహం ఏదీ?
పైన పేర్కొన్న పద్యం సాంస్కృతిక విధానంకల ప్రభువు(ఱేఁడు) గురించి చెప్పిందే! పరాపరోక్తులు తెలిసి, యుక్తాయుక్తా లెరిగి కవులకు, కళాకారులకు, కళలకు మేలు చేసే వాడు కాకపోతే, అలాంటి ఱేఁడు పాలనలో మారేడు కూడా తానే ఱేఁడు నన్నట్టు వ్యవహరిస్తుంది. తనచుట్టూ భజంత్రీలను చేర్చుకుని వాళ్లచేతుల్లో శ్రీఫలాలు పెడుతుంది. శ్రీ ఫలం అంటే విబూది పండు కూడా! చివరికి బూడిద విదిలిస్తుందన్నమాట! నేరేడు చెట్టు కూడా ఱేఁడుగా చెలామణి అయి, గాలిపక్షులకు ఆశ్రయం ఇస్తుంది. పూరేడు (పుప్పొడి) కూడా తానూ ఱేఁడే నంటూ గాల్లో తిరుగుతుంది. “అసలు ఱేఁడు” తిన్నగా లేకపోతే ఇలాంటి నకిలీ ఱేఁడులు ముత్యాలముగ్గు కాంట్రాక్టరు లాగా ‘కళాపోసన’ చేస్తుంటారు.
తిరుపతి వేంకట కవులకీ, వేంకట రామకృష్ణ కవులకీ వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదాన్ని తేల్చగల ప్రభువు గట్టివాడై ఉండాలంటూ తిరుపతి వేంకట కవులు చెప్పిన పద్యం ఇది.