నేటికాలపు
వేస్టు చదువులు
డా. జి వి పూర్ణచందు
బెంచీలక్కరలేదు, గేమ్సు మొదలౌ ఫీజుల్ వినన్ రావు, పొ
మ్మంచు
న్నిర్థను(దోసి
పుచ్చరు గురుల్, ప్యాసైననే
లాభ మిం
దంచున్నేమము
లేదు, మీ
చదువునందాలోక మీలోకమున్
గాంచన్
వచ్చెడి నార్యులార! మ్రొక్కంజెల్లు
నెక్కాలమున్.
తిరుపతి వేంకట కవుల కాలానికి, చాందసవాదం, భూస్వామ్య వాదం, బూర్జువాయిజం లాంటి పదాల వ్యాప్తి లేదు. వాటి గురించిన అవగాహన కూడా కవులకు లేదు. ఆనాటి మేథావులు మానవతా వాదానికి
పరిమితంగా ఉండేవాళ్ళు అలాగని అంటరాని తనాన్ని వ్యతిరేకించటం లాంటి విచక్షణాపూర్వక
అంశాలను పెద్ద స్థాయిలో ఖండించిన సందర్భాలు కూడా అరుదు. బ్రహ్మసమాజం లాంటి సంస్థలు సామాజిక
సంస్కరణలను కోరాయిగానీ, అస్పృశ్యత
లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించదు. వీరేశలింగంగారు కూడా విధవాపునర్వివాహం
లాంటి సంస్కరణలకే పరిమితం అయ్యారు.
1920 లలో గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా
ఎన్నుకున్న బెజవాడ కాంగ్రేస్ కార్యవర్గ సమావేశంలో అంటరాని తనం నిర్మూలనను ఒక
కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించారు. తనకన్నా
ముందే ఆంధ్రులు హరిజన సేవా కార్యక్రమాలు చేపట్టారని గాంధీగారు స్వరాజ్య పత్రికలో
రాసుకున్నాడు కూడా! ఇరవయ్యవ
శతాబ్ది తొలినాటి పరిస్థితి అది!
మొత్తం మీద జాతీయతా వాదం
బలపడ్తున్న ఆ రోజుల్లో ఆంగ్లేయులు తెచ్చిన ఆధునికతను సిద్ధాంత రీత్యా
వ్యతిరేకించిన సంస్కర్తలే ఎక్కువ. తిరుపతి
వెంకట కవులు తమ కాలంలో విస్తరించిన ఇంగ్లీషు చదువుల గురించి తమ వ్యతిరేకతను పై పద్యంలో చాటుకున్నారు. ఒక అడుగు ముందుకు వేసి గురుశిష్య పరంపర
పద్ధతిలో చదువు కొనసాగిస్తే క్లాసురూములూ వాటిలో బెంచీలూ అక్కరలేదనీ, గేమ్సు మొదలైన వాటికి ఫీజులు కట్టాలనే
మాటలే వినరావనీ, ఫీజు కట్టలేక
పోయిన నిర్ధనుణ్ణి క్లాసులోంచి వెళ్ళి పొమ్మనటం లాంటివి ఉండవనీ, ప్యాసైతేనే పైక్లాసులోకి వెళ్ళటం లాంటి
నియమాలేవీ ఉండవనీ అంటారు ఈ పద్యంలో తి. వేం. కవులు.
ఇంకో పద్యంలో చెప్పులకాళ్ళు, క్రాఫింగ్ చేయించిన తలకాయలు, ముఖాన విబూది రేఖల్లేని శూన్య లలాటం, గొప్ప బడాయి వేషాలు, కుచ్చుల పాగలు (చెప్పులు, బూట్లూ)కోట్లు,కంఠంమందొప్పెడి
పట్టముల్(టై), ఇలాంటివేషాలతో కనిపించే గురువులు, శిష్యులూ నీకు లేరుకదా...తండ్రీ చిరాయువై బ్రతుకు, అమ్మా! ఓ వేదమాతా నీకు మొక్కుతున్నాను... అంటాడు. ఇలా ఆధునిక విద్యలు గురుశిష్య సంబంధం
చెడగొట్టాయనే ఆవేదన వాళ్ళ పద్యాలలో కనిపిస్తుంది.
గురువు తనకొచ్చిందంతా
శిష్యుడికి నేర్పేవాడు. గురువు
దగ్గర సరుకున్నంత మేర
విద్యార్థి ఆయన దగ్గరే ఉండేవాడు. శిష్యుడికి
అన్నం పెట్టి చదువు చెప్పేవాడు
గురువు. ఈ రోజుల్లో
అలాంటి చదువులు అసాధ్యం అంటారు గానీ, సంగీత
నృత్యాది కళలు నేర్పించే వారి దగ్గర,
వేదాధ్యయనం చేయించే వేద పాఠశాలల్లోనూ, మోటారు
మెకానిక్కుల దగ్గర, వడ్రంగం
మేస్త్రీలదగ్గరా ఇతర వృత్తి విద్యలు నేర్పేవారి దగ్గరా ఇంకా ఈ నాటికీ గురు శిష్య
పరంపర కొనసాగుతూనే ఉంది. కంప్యూటర్‘కు
సంబంధించిన జావా, ఒరాకిల్, డీటీపి
లాంటి విద్యల్ని ప్రైవేట్ సంస్థల్లోనే నేర్చుకుంటున్నారు. నిజానికి ఇలా నేర్పే వాటిలో చాలాభాగం విద్యాసంస్థలు
కావు. మామూలు టైపు ఇన్‘స్టిట్యూట్
లాంటివే! కాబట్టి
గురుశిష్య సంబంధం అలాంటి చోట్ల కొనసాగుతూనే ఉంది.
తెల్లదొరల మెకాలే విద్యావ్యవస్థ
నుండి, నల్లదొరల కార్పోరేట్ విద్యావ్యవస్థ వరకూ సాగిన ఈ నూట యాబై
యేళ్ళ కాలంలో గురువును ఫీజులు కట్టే విద్యార్థికి బానిసను చేయటం, డబ్బు పారేస్తాం, ఎంత చెప్తావో చెప్పమనే ధోరణి రావటం
విద్యారంగానికి మేలు చేసేవని అభ్యుదయవాదులెవరూ అనుకోరు.
ఆనాడు, గురుకులం పద్ధతిలో చదువులు అగ్రవర్ణాల
వారికే పరిమితంగా ఉండటం వలన అందరికీ విద్య కోసం పాశ్చాతుల విద్యా పద్ధతుల్ని
అనుసరించక తప్పలేదు. కానీ, విద్య ఇలా వక్రమార్గాన పడటం కూడా
ఇబ్బందికరమైన విషయమే! గురుకుల
వ్యవస్థను ఆనాడు భూస్వామ్య అనుకూలవాదం, ఫ్యూడలిజం
అవశేషాలుగా భావించారు. కానీ, విద్యారంగ ఆధునీకరణ ఇంతగా
పాశ్చాత్యీకరణం చెందకుండా గట్టి పోరాటాలు జరిపి ఉంటే బావుండేదనిపిస్తుంది.
ఫీజుల్లేని చదువులూ, డిగ్రీలు లేని పాండిత్యంతో
ప్రసిద్ధులైన మల్లంపల్లివారిలాంటి మేథావులు వ్రాసిన గ్రంథాలను దాటి అదనంగా మన
విశ్వవిద్యాలయాల ఆచార్యులూ, ప్రాచార్యులూ
వ్రాసింది తక్కువ. మేథా
సంపత్తికి డిగ్రీలూ, ఉద్యోగ
హోదాల్ని కొలబద్దగా తీసుకునే దౌర్భాగ్యం
పోవాలి.