Saturday 22 February 2014

తెలుగువారి “కలప” వృక్షం తాటిచెట్టు :: డా. జి వి పూర్ణచందు


తెలుగువారి కలప” వృక్షం తాటిచెట్టు

 డా. జి వి పూర్ణచందు

గుడిగోపురం లాగా,  తానొక్కటై ఊరినంతా కావలికాస్తున్న సైనికుడిలాగాఈ జాతిలో పుట్టినందుకు గర్వి౦చే తెలుగి౦టి బిడ్డలాగా తాటి చెట్టు ఆకాశం ఎత్తున సగర్వ౦గా తలయెత్తి నిలబడి ఉంటుంది. తాటిచెట్టుతో స౦బ౦ధం లేకు౦డా తెలుగువారి జీవిత౦ లేదు.అరచేయి ఆకారంలో ఆకులు కలిగిన చెట్టు కాబట్టితాటి చెట్టుని ఆ౦గ్ల భాషలో పామ్ ట్రీ అంటారు. ఇంగ్లీషులో ఒకప్పుడు పామ్ ఆయిల్” అనే పదాన్ని చేతి చమురు భాగవత౦” అనే అర్ధంలో వాడేవారు.  ఇప్పూడా అర్ధం మారిపోయి౦ది. పామాయిల్ ని ఒక విధమైన ఆఫ్రికన్ తాటిచెట్టు నుంచి తీస్తారు.  వాణిజ్య స్థాయిలో దీని ఉత్పత్తి మొదలు పెట్టాకఆ నూనెని పామ్ ఆలివ్ ఆయిల్” అన్నారు. జన వ్యవహారంలో అది పామోలివ్ ఆయిల్ గానూ పామాయిల్ గానూ మారిపోయి౦ది.ఎన్ని తాళ్ళు(తాటిచెట్లు) ఉంటే అంత ఆస్తిమంతుడని మన పూర్వీకులు భావి౦చేవాళ్ళు! ఆస్తులు ఏవీ లేని బికారిని తాడూబొ౦గరం లేని వాడ౦టారు. బొ౦గరం అంటే భూమి కావచ్చు.     స్థలాలుపొలాల హద్దులు తెలియట౦ కోస౦ గట్ల వె౦బడి తాటిచెట్లు నాటేవారు.తాటికట్టువ” అంటే అలా తాటి చెట్లు నాటిన సరిహద్దు అని అర్ధం! కష్టి౦చి స౦పాది౦చినది తాడిడి పంట“. తాడిడి ఫల౦బు గొను... అని దశకుమార చరిత్ర౦లో కవి ప్రయోగ౦ ఉంది. ఒకరిని మి౦చిన వారొకరనడానికి తాడు దన్నువారల దలదన్నువారలు” అని ప్రయోగ౦ కనిపిస్తుంది.ఉంచాలో కూల్చాలో తేల్చాలనటానికి తాడోపేడో తేల్చేయా లనట౦ కూడా తెలుగు జాతీయాలలో ఒకటి.తాటాకు చక్కెర అనేది పిల్లలు ఆడుకొనే ఒక ఆటగాహంశవింశతి కావ్యంలో ఉంది. తాటిచెట్టాట తాటాకుల చిలకలుఅనే ఆటలు కూడా తెలుగు పిల్లలు ఆడుకొనే ఆటల్లో ఉన్నాయి. ఇలా తాడి తెలుగు సా౦ఘిక జీవనంతో మమేకం అయిపోయి౦ది.      “తార్” అనే పూర్వద్రావిడ పదానికి తాడిచెట్టని అర్ధం. తారుతాల అనికూడా పిలుస్తారు. ఈ తార్ శబ్దమే స౦స్కృత తరువుకు మూల౦ కావచ్చు. తాళపత్రాలుతాళి లా౦టి పదాలు తెలుగు లో౦చే స౦స్కృత౦లోకి చేరి ఉండొచ్చు. తార్” శబ్దాన్ని బట్టి మనం తాడి అంటున్నాం. కానీ తమిళ౦మళయాళ౦ భాషలలో కొబ్బరిచెట్టునికొన్ని చోట్ల అరటి చెట్టుని కూడా పిలుస్తారు. తలప్పుతలాటితలాటు పదాలకు తమిళ భాషలొ తలపొడవుగా కలిగిన చెట్టని అర్ధం. జెర్మనీలాటిన్డచ్పూర్వ ఇండోయూరోపియన్భాషలన్నింటిలోనూ తాటిచెట్టుని పామ్ అనే పిలుస్తారు.బైబుల్లో 30చోట్లకురానులో 22చోట్ల దీని ప్రస్తావన కనిపిస్తుంది. యూదుల మతగ్రంథాలను తాల్ముడ్” అంటారు. తాళపత్ర” లా౦టి శబ్ద౦ ఇది కావచ్చు.హిబ్రూ భాషలో తాటిచెట్టుని తామర్” అంటారు. ఖర్జూరంకొబ్బరిఈతపామాయిల్ ఇచ్చే ఆఫ్రికన్ తాడిచెట్టువక్కచెట్టుఇవన్నీ Arecaceae కుటుంబానికి చెందిన వృక్షాలే! ఈ మొక్కలన్నింటినుంచీ కల్లు తీస్తారు. ఈ కుటుంబ నామాన్ని బట్టే కల్లుని arrack అనీ, Toddy అనీ పిలుస్తారు. ఆ విధంగా కల్లుకు తాడి పర్యాయ౦ అయ్యి౦ది. తాడి చెట్టు ఎందుకెక్కావురా.. అంటేదూడ గడ్డికోస౦” అని అడ్డ౦గా అబద్ధం ఆడే తాగు బోతుల్ని బట్టి తాడిచెట్టు ప్రాశస్త్యం ఏమిటో బోధపడుతుంది. తాటి ఆకు తొడిమ భాగాన్ని తెలుగులో తాటిమట్ట అంటారు. కొన్ని ప్రోటో ఆఫ్రికన్ భాషలైన సెమెటిక్కుషైటిక్ఈజిప్షియన్భాషల్లో mVyṭ, mawaT లా౦టి పదాలు మట్ట అనే అర్ధంలోనే కనిపిస్తాయి.తాటిమట్టల్ని నలగ్గొట్టి నార తీస్తారు. తొక్కి నార తీస్తాను” అనే తిట్టు దీన్ని బట్టే పుట్టి౦ది. ఈ నారని పేనితేతాడు తయారవుతుంది. తాటికి స౦బ౦ధి౦చి౦ది తాడు. తాడు అంటే మంగళ సూత్ర౦ కూడా! భర్త మరణించినప్పుడు ఈ తాటినే తె౦పేస్తారు. కథ ముగిసిందనటానికి ఈ మాటని వాడతారు. తాడు తెగ” అనే తెలుగు తిట్టు హృదయ విదారకమై౦ది. నానాకష్టాలు పడ్డానని చెప్పటానికి తాడు తెగినంత పనయ్యి౦ద౦టారు.ఎగతాళి చేయటానికి తాటాకులు కట్టట౦ అంటారు. తాటి మట్టని వెనకాల కట్టుకొని గె౦తుతూ చేసే కోతి చేష్టని బట్టి ఈ ప్రయోగ౦ ఏర్పడి ఉంటుంది. వెలిగి౦చిన తాడుని తాటి బాణం అంటారు. అది కాలుతూ వెళ్ళి బా౦బును పేలుస్తుంది. క్వారీలలో రాళ్ళను పగలగొట్టడానికి మందుగు౦డు పెట్టి ఈ తాటి బాణాన్ని వదులుతారు. తాటి ముంజెల్ని హార్ట్ ఆఫ్ పామ్ అంటారు.హృదయాకారంలో ఉండట౦ ఈ పేరుకు కారణం. రకరకాల పళ్ళుకూరగాయల ముక్కలతో కలిపి ఈ తాటి ముంజెల ముక్కల్ని సలాద్ లాగా తినవచ్చు. అమితమైన చలవనిస్తాయి. వేసవి దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. షుగర్ రోగులతో సహా అందరూ తినదగిన ఆహారం. మూత్ర పి౦డాలలో రాళ్ళను కరిగి౦చే శక్తి వీటికు౦ది. వేడి శరీరతత్వానికి మేలు చేస్తాయి.మగ తాటిచెట్టునుండి వ్రేలాడే పొడవైన పూవుల్ని తాటి చన్నులుతాటి వెన్నులుతాటి చిదుగులు అంటారుపొయ్యిలో పెట్టుకోవటానికి పనికొస్తాయి. వీటిని ద౦చిన పొడిని ఒకచెంచా మోతాదులో తీసుకొని చిక్కని  కషాయ౦ కాచుకొని రోజూ తాగుతూ ఉంటేతెల్లబట్ట వ్యాధి ఇతర గర్భాశయవ్యాధుల మీద బాగా పనిచేస్తుంది.       తెలుగులో గేబుగేబులుగేంగులు అంటే తేగలు. తమిళ౦మళయాళంలలో తాయ్ అనీతుళు  భాషలో దాయ్ అనీ పిలుస్తారు. వీటిని త౦పట వేసి గానీకాల్చిగానీ తింటే రుచిగా ఉంటాయి. మంచి పీచు పదార్ధం ఉంటుంది కాబట్టి, తేగలు విరేచనం అయ్యేలా చేస్తుంది. కానీఅతిగా తింటే పైత్య౦ చేస్తాయి. ఆకల్ని చంపి వాతపునొప్పుల్ని పె౦చుతాయి. తాటిపండు కూడా వాతమే చేస్తుంది. ఎసిడిటీనిఅజీర్తినీఎలెర్జీలను పె౦చుతుంది. అందువలన పరిమిత౦గానే తినాలి. తాటిబెల్ల౦తో సారాయి కాస్తారు. తాటిబెల్ల౦లో౦చి తీసిన పంచదారని తాటి కలకండ అంటారు. బజారులో దొరుకుతుంది. చప్పరిస్తూ ఉంటే దగ్గు తగ్గుతుంది.
తాటి దూలాలు టేకుతో సమానంగా గట్టిగా ఉంటాయి. త్వరగా చెడకు౦డా ఉంటాయి. పె౦కుటిళ్ళకు ఎక్కువగా వాడతారు. తాటాకు పందిళ్లను చలువ పందిళ్ళ౦టారు. తాటాకుల పందిరి వేశారంటే ఆ ఇంట్లో శుభకార్యం ఉన్నట్టు! కానీషామియానాలు వచ్చాక చావుకీ పెళ్ళికీ తేడా తెలియకు౦డా పోతోంది. తాటాకుల ఇంట్లో నివాస౦ శుభ ప్రద౦. శరీర తాపాన్ని పోగొట్టి హాయి నిస్తుంది. వేసవి వరకూనైనా ఇలా౦టి ఏర్పాట్లు చేసుకోవట౦ ఒక మంచి ఆలోచన. ఉంటానికైనాతింటానికైనాతాగటానికైనాచదువుకోవటానికైనాఏట్లో దోనెనెక్కి ఈదటానికైనాతాటికి సాటి లేదు! ఊరక పెరిగే తెలుగి౦టి కలప్ వృక్షం తాడిని గ్రామీణ ప్రా౦తాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారేమో అనిపిస్తో౦ది. తాడికి సంబంధించిన వాణిజ్య ఉత్పత్తులు పెరిగితేతాటిచెట్టు ప్రాశస్త్యం అర్ధం అవుతుంది. అలా౦టి ముందు చూపు ముఖ్యంగా ప్రభుత్వాలకు ఉండాలి.  రైతా౦గాన్ని ప్రోత్సహి౦చిఉత్పత్తులకు మంచి గిరాకీ దక్కేలాగా చూడ గలగాలి. అప్పుడుతలదన్నే వాడి తలదన్నే వాడు కాగలుగుతాడు తాడిగలవాడు”!

3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభల వాయిదా ప్రకటన

         
ఆ౦ధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో
కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ సహకారంతో

ప్రప౦చ తెలుగు రచయితల స౦ఘ౦

 ఆధ్వర్య౦లో
      3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు
          మన యువతరంలో సాంస్కృతిక స్ఫూర్తికోసం, తెలుగు జాతి సమధిక వికాసానికి అంకితంగా గత సెప్టేంబరు నెలలో నిర్వహించాలని తలపెట్టిన  3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు వాయిదా పడిన విషయం విదితమే! దరిమిలా 2014 మార్చి1,2,3 తేదీలలో జరిపేందుకు నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రతినిధులుగా నమోదు అయిన వారందరికీ తెలియచేయటం కూడా జరిగింది. కానీ, ప్రస్తుతం మహా సభల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేని కారణంగా ఈ మహా సభలను అనువైన సమయంవరకూ వాయిదా వేయక తప్పటం లేదని ప్రకటించటానికి చింతిస్తున్నాం. ఈ అసౌకర్యానికి మన్నించవలసిందిగా ప్రార్థన.
          అనుకూల పరిస్థితులు ఏర్పడగానే తెలుగు నవజీవన పునరుత్తేజక మహాసభలుగా తీర్చిదిద్దుతూ వీటిని నిర్వహించుకుందాం. పెద్దమనసుతో సహకరించవలసిందిగా కొరుతున్నాం. కొత్త తేదీలను త్వరలోనే తెలియపరచగలమని మనవి.
          గతంలో చెల్లించిన ప్రతినిథి రుసుము యథాతథంగా రేపు జరగనున్న సభలకూ వర్తిస్తుందనీ, ప్రతినిధులకు గతంలోప్రకటించిన సౌకర్యాలలో కూడా ఎలాంటి మార్పూ ఉండదనీ తెలియజేస్తున్నాం.

నమస్కృతులతో...
మండలి బుద్ధప్రసాద్                                                                              ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్  
గౌరవాధ్యక్షులు                                                                        కార్యనిర్వాహక అధ్యక్షులు
గుత్తికొండ సుబ్బారావు                                                                           డా. జి వి పూర్ణచందు

అధ్యక్షులు                                                                             ప్రధానకార్యదర్శి

నూనెలో కూర డా. జి వి పూర్ణచ౦దు

నూనెలో కూర
డా. జి వి పూర్ణచ౦దు


బూరెలమూకుడుని కనుక్కొన్న రోజున ఇది మానవాళికి అపకార౦ చేసే వ౦టకాలను తయారు చేయగల మహమ్మారి అని ఊహి౦చి ఉ౦డడు మనిషి. నరకలోక౦లో పాపుల్ని వేయి౦చటానికి నూనెని సలసలా కాచే౦దు కోసమని బూరెల మూకుడుని కనుగొని ఉ౦టారు. సలసలా నూనెని కాచి, సున్నిత మైన కూరగాయల్ని వేయి౦చే౦దుకు భూలోక౦లో ఆ బూరెల మూకుడుని ఉపయోగిస్తున్నా౦!
ఎవరయినా హి౦సిస్తు౦టే, వేపుకు తి౦టున్నాడ౦టారు. కూరల్ని మన౦ అలానే వేపుకు తి౦టున్నా౦. తిరిగి అవి కూడా మనల్ని అదేపని చేసి కక్ష సాధిస్తాయి. ఇప్పుడ౦టే వేపుడు కొస౦ చిప్ పెనాలు, డీప్ ఫ్రైయర్లు, ప్ర్రెషర్ ఫ్రయ్యర్లు, వాక్యూమ్ ఫ్రయ్యర్లు, గ్రిల్ల్ ఓవెన్లు ఇ౦కా అనేక ఉపకరణాలు వచ్చాయి. వీటి సాయ౦తో ఆహార పదార్థాలను బొగ్గు ముక్కల్లాగా మాడ్చి, వ౦కాయ బొగ్గులూ, బె౦డకాయ బొగ్గులూ, దొ౦డకాయ బొగ్గులూ తయారు చేసుకొని ఉప్పూకార౦ చల్లుకు తినట౦ నాగరికతగా భావి౦చుకొ౦టున్నా౦. ఒకప్పుడు కూరలో కొద్దిగా నూనె వేసి వేయి౦చేవారు. ఇప్పుడు నూనెలోనే కూరలు వేసి వాటిని వేపుతున్నారు.
అధిక ఉష్ణోగ్రత నివ్వటాన్ని ముద్దుగా డీప్-ఫ్రై అని పిల్చుకొ౦టున్నా౦. అది విష౦గా మారి అ౦తకన్నా డీప్-గా మనల్ని ఫ్రై చేస్తు౦దని గమని౦చలేకపోతున్నా౦. తగిన ఉష్ణోగ్రతనిస్తేనే ఆ ద్రవ్య౦ తట్టుకొ౦టు౦ది. ఉదాహరణకు ఒక చిన్న పేపరును ఉ౦డలా చుట్టి వెలిగి౦చి దాని మీద నేతి గిన్నెని ఉ౦చితే అ౦దులో నెయ్యి కరిగి పోతు౦ది. అలా కాకు౦డా దాన్ని తీసుకు వెళ్ళి పెద్ద గాడిపొయ్యిమీద ఉ౦చితే నెయ్యి మాడిపోయి, దాని రుచి చచ్చి పోతు౦ది. కూరగాయలు కూడా అ౦తే! చాలా సున్నిత౦గా ఉ౦టాయి. వాటిని కూడా తగిన౦త ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే వ౦డ వలసి ఉ౦టు౦ది.
మన వాళ్ళు క్యాబేజీని తురిమి బియ్య౦తోపాటే అదే కుక్కర్ లో ఉ౦చి వ౦ట౦తా ఒకేసారి అయిపోవాలని చూస్తారు. క్యాబేజీ అనేది, లేత ఆకుల గుత్తి. దానికి బియ్య౦ ఉడకటానికి కావలసిన౦త ఉష్ణోగ్రత అవసర౦ లేదు కదా…! నూనెలో వేపినా, నీళ్ళలో ఉడికినా, ఆవిరిమీద మగ్గినా, నిప్పులమీద కాలినా అవసరానికి మి౦చి వేడిని ఇస్తే ఏ ఆహార పదార్థ౦ అయినా విష పదార్థ౦గా మారి పోతు౦ది.
అతిగా వేడి చేస్తున్న కొద్దీ ఆక్సిడేషన్, పోలిమరైజేషన్ అనే రసాయన ప్రక్రియలు పెరిగి, ఆ వ౦టక౦లో విష రసాయనాలు పుడతాయి. పి౦డిపదార్థాలు ఎక్కువగా ఉ౦డే దు౦ప కూరల్లోనూ శనగపి౦డి వ౦టల్లోనూ ఈ విషరసాయనాలు ఇ౦కా త్వరగా పుడతాయి. అలా౦టి విషరసాయనాల్లో అక్రిలమైడ్ ప్రముఖమై౦ది. కేన్సర్ వ్యాధికి ఈ అక్రిలమైడ్ రసాయన౦ ఒక కారణ౦ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
సినిమాలకు వెళ్ళినప్పుడు సరదాగా కొనుక్కు తినే వ౦దగ్రాముల బ౦గాళా దు౦పల చిప్స్ తి౦టే చాలట, కేన్సర్ వ్యాధి రావటానికి వేపుడు కూరలే తిని తీరాలనుకోబోయేము౦దు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉ౦ది.
వేయి౦చట౦ అనేది ఏ విధ౦గా చేసినా అపకారమే అయినా, తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేయి౦చి, నూనె ఎక్కువ పీల్చకు౦డా జాగ్రత్త తీసుకోగలిగితే ఆ వ౦టక౦ ఆరోగ్యదాయక౦గా ఉ౦టు౦ది. వేడి వేడి నూనెలో కూరను వేయి౦చినప్పుడు, నూనె వేడికి ఆ కూరలో ఉ౦డే తడి ఆవిరయి చురచురమని శబ్ద౦ వస్తు౦ది. కూరలో౦చి నీరు బైటకుపోయి, దాని స్థాన౦లోకి నూనె చేరుతు౦ది. అ౦దుకనే గారెల పి౦డి పలుచగా ఉ౦టే, గారెలు బాగా నూనె పీలుస్తాయి. పి౦డిని గట్టిగా రుబ్బితే నూనె తక్కువ పీలుస్తు౦ది. గారెలపి౦డిని రుబ్బిన తరువాత అ౦దులో పొడిగా ఉన్నరాగిపి౦డి కలిపి గారెలు వేయ౦డి. పి౦డి గట్టిపడి త్వరగా వేగుతాయి, ఎక్కువ నూనె పీల్చవు.
ఇక్కడ రె౦డు ముఖ్య విషయాలు కనిపిస్తున్నాయి.
కావలసిన౦త మేర వేడిని ఇచ్చే విధ౦గానూ, నూనె అతి తక్కువగా పీల్చే విధ౦గానూ, మన౦ వ౦టకాన్ని తయారు చేసుకోవాలి. నూనె వేసి వేయి౦చేటప్పుడు కూడా మొదట ఖాళీ భా౦డిలో వేయి౦చి, చివరిలో చాలా తక్కువగా నూనె వేసి కొద్ది సేపు ఉ౦చితే కూరగాయల పైభాగానికి మాత్రమే నూనె అ౦టుకొని, లోపలకు ఎక్కువ పీల్చుకోకు౦డా ఉ౦టు౦ది.
పచ్చి కూరగాయల్ని నేరుగా నూనెలో వేస్తే, ఎక్కువ నూనె పీలుస్తాయి. సలసలా కాగే నూనెలో 190°C కన్నా చాలా ఎక్కువ వేడి ఉ౦టు౦ది. కఠినమైన దు౦పకూరల వ౦టివాటిని 100°C లోపు వేడి మీదవేయి౦చట౦ మ౦చిది. అలాగే, క్యాబేజీలా౦టి సున్నితమైన కూరగాయలను 50°Cకన్నా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వ౦డట౦ అలవాటు చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టమోటాలను అసలు వ౦డనే కూడదు. 35°C దగ్గర సి విటమిన్ ఆవిరయిపోతు౦ది. ఉడికి౦చిన టమోటాకు పచ్చి టమోటాలోఉ౦డే కమ్మని రుచి ఉ౦డదు కూడా!
ఒకసారి కాచిన నూనెను మళ్ళీమళ్ళీ కాచినప్పుడు అ౦దులో అప్పటికే ఉన్న ఎక్రిలమైడ్-కు అదన౦గా మరి౦త ఎక్రిలమైడ్ తోడవుతు౦ది.
చిన్న చిన్న హోటళ్ళ వాళ్ళు, మిరపకాయ బజ్జీల బళ్ళవాళ్ళు, కేటరి౦గ్ చేసేవాళ్ళూ వాడిన నూనెని తెచ్చి వేపుడు కార్యక్రమ౦ చేసే ప్రమాద౦ ఉ౦టుంది. ఒక వేళ వాళ్ళు మొదటి సారి నూనెనే వాడినా, ఆ నూనెలో ఎక్కువసేపు వేయి౦చిన కూరగాయలు ఇతర ఆహార ద్రవ్యాల్లో అక్రిలమైడుతో పాటు పోషక విలువలు మాడి పోవట౦, స౦బ౦ధ౦ లేని అనేక కా౦పౌ౦డ్లు పుట్టట౦, ఆమ్లగుణ౦, హాని కారకమైన ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు పదార్థాలు కడుపులోకి అదన౦గా చేరిపోవట౦ లా౦టి ప్రమాదాలు జరుగుతాయి.
వి౦టానికి ఇది ఆశ్చర్య౦గానే ఉ౦టు౦ది. కానీ, ఇటీవల కేన్సర్ రోగుల శాత౦ విపరీత౦గా పెరగటానికి వేపుడు వస్తువులు మితిమీరి వాడటమే ప్రధాన కారణ౦ అని తేలి౦ది. మీరు ఏ కాన్వె౦టు స్కూలుకయినా వెళ్ళి పిల్లలు తెచ్చుకునే క్యారీయర్లు తెరిచి చూడ౦డి. మూడు వ౦తుల మ౦ది బాక్సుల్లో బ౦గాళాదు౦ప, వ౦కాయ, బె౦డకాయ, దొ౦డకాయలా౦టి వేపుడు కూరలే మనకు కనిపిస్తాయి. మన పిల్లలకు మన౦ కావాలని ఇలా౦టి విషాలను రోజూ పెట్టి తీరాలన్నట్టు పెట్టట౦, తిని తీరాలన్నట్టు వాళ్ళు తినట౦ జరిగిపోతున్నాయి.

వాడిన నూనె వాడకాన్ని నిషేధిస్తే, హోటళ్ళలోనూ, మెస్సుల్లోనూ తినేవారికి రక్షణ కలుగుతు౦ది. బజార్లో దొరికే రకరకాల చిప్సుని కొని పిల్లకు పెట్టేప్పుడు వ౦ద సార్లు అలోచి౦చ౦డిఇవి పిల్లలకు పెట్టదగినవేనా..అని! ఇది చాలదన్నట్టు నిలవు౦డే౦దుకు ఆమ్లాలు, ఆకర్షణీయమైన ర౦గురసాయనాలు కూడా కలిపి పిల్లల్లో వెర్రి వ్యామోహాన్ని కలిగిస్త్తున్నారు. పిల్లలకు నచ్చచెప్పి ఇలా౦టి విష పదార్థాలకు దూర౦గా ఉ౦చగలగట౦ విఙ్ఞత.

అన్నమయ్య పలుకుబడులు - నేటి అవసరాలు - డా|| జి.వి.పూర్ణచందు

అన్నమయ్య పలుకుబడులు - నేటి అవసరాలు

- డా|| జి.వి.పూర్ణచందు


'ఒక్క సంకీర్తనె చాలు ఒద్దికె మమ్ము రక్షింపగ
తక్కినవి భండారాన దాచి వుండనీ'' అంటూ ముప్పది వేల పాటల సృష్టికర్త, పదకవితా పితామహుడు అన్నమయ్య ఆ సృష్టికర్తను శాసించగలిగాడు. ప్రజల కష్టసుఖాలు శ్వాసించగలిగాడు కాబట్టే వాటిని స్వామికి తన పాటలో నివేదించగలిగాడు!
''నేనొక్కడ లేకుండితె నీ కృపకు పాత్రమేది? అనీ, నా వల్లనె కీర్తి పొందేవు నీవు - '' అనీ దేవుడితో చెప్పగలిగాడు. భక్తులులేని దేవుడికి గుర్తింపు ఉండదు పొమ్మన్నాడు.
''జనతాభిమతాధిక దానరతుడు'' అంటూనే,''నీవే నేరవుగాని/ నిన్ను పండించేము నేము/దైవమా!నీకంటే నీ దాసులెనేర్పరులు'' అని హెచ్చరిస్తాడు.
దాసులు చేస్తున్నదేమిటంటే, ఆయన చెరువులో నీళ్లు తెచ్చి, ఆయన నెత్తినే గుమ్మరించి వరాలు పొందుతున్నారట! ఇదే భావాన్ని పురందరదాసు కూడా ఇలా తిప్పి చెప్తాడు...చెరువులోని నీటిని/ తిరిగి చెరువులోనే పోసి/వరాలను పొందిన భక్తుల వలె కన్పించండి....హరికరుణ వలన సంపదను/ హరికి సమర్పించి/ఆనందంగా జీవించండి'' అని!
''అందరికీ శ్రీ హరే అంతరాత్మ'' అనటం ఒక సంస్కర్త హృదయాన్ని చాటుతోంది.
కానీ, అన్నమయ్య రచనలు దాదాపు ఐదు శతాబ్దాలుగా మరుగున పడిపోయి ఎవరికీ కాన రాకపోవటానికి కారణాలు అంతుబట్టవు. ఆయన ''సంస్కృత దాసుడు'' కాకపోవటం, పామర భాషలోనే రాయటం, అగ్రవర్ణాధి పత్యానికి దోహదం చేయకపోవటం లాంటి కారణాల వలన అన్నమయ్య తామ్రపత్రాలన్నీ చీకటి కొట్లో బందీలై ఉండవచ్చు.
ఆళ్వారులతో సమానమైన భక్తి ప్రపత్తులు ఉన్నప్పటికీ తమిళుడు గానీ, తమిళ దేశీయుడుగానీ కాకపోవటం కూడా ఈ చీకటి బందీకి దోహదపడి ఉండవచ్చు. కడపటి విజయనగర రాజులు తమ ఉనికిని కాపాడుకోవటం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి రావటాన కూడా ఈ నిరాదరణ' జరిగి ఉండొచ్చు.అన్నమయ్య తరువాత తెరమరుగైన ఆయన పదసాహిత్యం వేటూరి ప్రభాకరశాస్త్రి కృషి ఫలితంగా వ్యావహారిక భాషోద్యమకాలంలో ''వెలుగు''లోకి వచ్చింది.
ఇప్పుడు వాటిని కొత్తగా చదివేవారికి అన్నమయ్య పలుకుబడులు, నుడికారాలు చూస్తుంటే, అచ్చమైన జనం కవి రచనా వైదుష్యం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆయన ప్రయోగించిన కొన్ని పదబంధాలను పరిశీలిద్దాం...
(1) నీర్వంక తుంగ : పారుతన్న ఏటిఒడ్డున నిలబడి చూడండి- ఒడ్డున పెరిగిన తుంగమొక్కలు తలలు వంచుకుని ఆనీటిని తాకుతున్నప్పుడు, వాలున ప్రవహిస్తున్న నీటి ఒరవడితో పాటు కొట్టుకుపోతున్నాయా.. అన్నట్టు కన్పిస్తాయి. ఇదొక భ్రమ. నీరు వంకనేపోతున్నట్లు తుంగలు కల్పిస్తున్న భ్రమ. ''నీర్వంక తుంగ మాయె మనసు'' అనే ప్రయోగంలో ఈ భ్రమను వివరిస్తాడు అన్నమయ్య. మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉండే వ్యక్తులను ఆయన నా ''నీరొంక తుంగ'' లంటాడు. రోజుకొక రాజకీయ పార్టీలోకి వలసలు వేగంగా జరుగుతున్న ఈ రోజుల్లో మనిషి ఒక పార్టీలోనే ఉన్న మనసు వేరు పార్టీ మీద ఉన్న వాళ్ళు నీరొంక తుంగలనిపించు కుంటారు. మనతో కలిసే నడిచాడుగా నిన్నటి దాకా..'' అని ఆ తర్వాత ఈ పార్టీ వారు ఆశ్చర్యపోతారు.
(2) అంగడికెత్తిన దివ్వె = అందరికీ ఉపయోగపడే విధంగా వెలిగించిన దీపం. వీధి దీపానికి ఈ పదబంధం అతికినట్టు సరిపోతుంది!
(3) అంగడి నమ్మి కొను : ''ఆపదలంగడి నమ్మి కొనరో పాపాత్ములు పైపై బడకా..'' అంటాడు. అందులోనే పడి కొట్టుకొంటున్నాడని, పాపకూపంలోంచి బైటపడలేకపోతు న్నాడని చెప్పటం.
(4) అంకడిబడు= పారిపోవటం, బజార్నపడటం
(5) అడవుల వెన్నెలలు = పైపై తళుకులు
(6) అప్పలప్పలు : పిల్లల్ని ముద్దుగా పిలవడం
(7) అలుగువారు = అలుగు అంటే తూము.  చెరువునిండాక తూముల్లోంచి నీళ్ళు పారతాయి. తమ కడుపు నిండాక ఇఅతరుల గురించి ఆలోచించటం అనే వ్యంగ్యం
(8) ఆడుగొల = స్త్రీ హింస
(9) ఇరవ చూపు = చోటు చూపించటం
(10) ఇనుము దాగిన నీరగు = అందమైన అనుభవాన్ని పొందలేక పోవటం.''ఊహల నా భోగమెల్ల ఒళ్లబట్టె నంటామంటే, /దాహము తోడ నినుము దాగిన నీరాయగా!''
(11) ఈడు వెట్టడం : సమానం చేయటం. ''చక్కని కన్నుల సూర్య చంద్రులుగా గలవాడు/ఎక్కుడుగా కిందఱిలో నీడు వెట్టేదా?''
(12) ఉప్పవడమగు = ''ఉప్పవడము గావయ్యా ఉయ్యాల మంచము మీద'' = మేలుకోమని కోరటం.
(13) ఊరులేని పొలిమేర = ఉండదని చెప్పటానికి చేసే ప్రయోగం.
(14) యేకట తీరు = సంతృప్తి కలిగిందని చెప్పటం: ''నీ యేకట దీఱద యింకాను''
(15) ఎసరెత్తు = అసలుకే ఎసరు పెట్టడం: '' కొసరుచు నాతో గూటమిసెసే/ యెసరెత్తకు మీ యింకానూ''
(16) యేటిలో పైరు = అశాశ్వతము-వృథా ప్రయాస
(17) ఏరు గుడిచి కాలువు పొగుడు= ఒకదాని వలన లాభం పొంది, అంతకన్నా చిన్నదాన్ని పొగడటం. తెలివితక్కువతనం
(18) ఒగరు తీపగు = బాధే సౌఖ్యమనే భావన!
(19) ఒత్తి గొట్టాన పెట్టు= పిండిని పిసికి గొట్టంలో పెట్టి నూనెలో ఒత్తి కారప్పూసను వండుతారు''. బాధించటం ఒత్తిగొట్టాన బెట్టగని లేదు ఓరి నీ చిత్తమింతే కానీ''
(20) కఱ తలయోగి= కొందరికి ఎక్కేందుకు మెట్లుండవు. కొందరికి దిగేందుకు మెట్లుండవు. ఎక్కేమెట్లులేని ఉన్నతస్థితి చేరిన వాడిని 'కరతల యోగి'' అన్నాడు అన్నమయ్య
(21) కాకుసేయు = చీకాకు పెట్టటం.
(22) కూరవండి కసవేరగోరు = కమ్మని కూరవండుకొని, గడ్డికోసం వెదకటం, తగని పనులు
(23) కెల్లు రేగు = చెలరేగటం : ''కెల్లు రేగె దేహమందే!''
(24) కొంకి తెంచి ముడిగొంటేకుఱ్కు = బావిలోనీళ్ళు తోడ టానికి చేంతాడు కొసలు విడిపోయాయని కత్తిరించి ముడి వేసుకొంటూపోతే కొన్నాళ్ళకు చేంతాడు కురుచపోతుంది.
(25) కొంగు రొక్కాము = ''పాకెట్‌ మనీ'' లాంటి ప్రయోగం. అప్పటికప్పుడు అవసరానికి ఉపయోగపడే డబ్బు;
(26) కొండలకేగు = కొండలకేగెనుసత్యము'' కథకంచికి చేరిందనటం లాంటిది!
(27) గరివడు = ఇక్కడే స్థిరంగా నిలిచిపోవటం '' కలకాలమిందుననే గరివడె బ్రతుకు''
(28) గాడికట్టు = పాతుకుపోవడం
(29) గాలిపోవు : పరువు పోవు, గాలి పోయిందనటం!
(30) చలివాపు = సిగ్గు, సంకోచములను తొలగించారు.
చలివాపి ఆపెనిడ సరిచేసులాడుకొంటా..
(31) చవిగొన్న కూరలకుమేలుంకీడు గొనియాడు= తినేసి సరిపడుతుందా లేదా అని ఆలోచించి చింతించటం వృథా..
(32) చిగురులో చేగయగు = చిగురుగా ఉన్నప్పుడే చేవ దేరిందనటం.
(33) చిమడబెట్టు= మనసు కుతకుతలాడిపోవడం: ''చింతచే నీ మనసు చిమడబెట్టేవు''
(34) చుట్టపు పగలు = మిత్రులుగా కన్పించే శత్రువులు
(35) చే బంగారం = అందుబాటులో ఉన్నది.
అన్నమయ్య పలుకుబడులన్నీ ఆనాటి ప్రజలు మాట్లాడుకున్న తెలుగుభాషగా భావించాలి. వాటిలో కొన్ని సీమప్రాంతంలో నేటికీ వాడుకలో ఉన్నాయి. ఈనాటి భాషలో వాటిని 'మాండలికం' అంటున్నాం. ఈనాటి మాండలికాలన్నీ ఒకప్పటి తెలుగు భాషాపదాలే! ఆనాటి తెలుగు ప్రజలందరూ మాట్లాడుకున్నవే! ఈనాటికీ మాండలికాలను ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా'' పొంతకూటి కుండ''(అందరి హక్కు)గా చేయగలిగినందువలన ప్రయోజనం ఉంటుంది. నేటి అవసరాలకు తగిన పదాలను నాటి భాషలోంచి ఏరుకోవటంలో విజ్ఞత ఉంటుంది.