Friday 24 June 2016

భాషా సాంస్కృతిక విధానం:: డా. జి వి పూర్ణచందు

భాషా సాంస్కృతిక విధానం

 డా. జి వి పూర్ణచందు

ఱేడు పరాపరోక్తుల నెఱింగి విచారణ సేయడేని, మా
రేడును ఱేఁడే. తన్ననుసరించిన శ్రీఫల మిచ్చుచుండు; నే
రేడును ఱేఁడే, యయ్యది భరించు ద్విజ ప్రకరమునెల్లఁ; బూ
రేడును ఱేఁడే, యయ్యది చరించెడి సత్పథమందుఁ బొందుగన్
(తిరుపతి వేంకట కవుల ‘గీరతం’ నుండి)

ప్రభుత్వానికి భాషా సాంస్కృతిక విధానం ఒకటి ఉండాలి. కృష్ణదేవ రాయలు ఒక చారిత్రక వ్యక్తిగా నిలిచి పోయి, వందలాది అనుకూల కథలు అతని చుట్టు అల్లుకోవటానికి ప్రధాన కారణం ఆయన కవులకు, కళాకారులకు, కళలకు, దేశభాషలకు ప్రోత్సాహం ఇవ్వటమే! ఈ సూక్మాం న్ని ఈ కాలపు ఱేడులు(ప్రభువులు) గుర్తించలేక పోవటం వలన మాజీ ముఖ్యమంత్రు లెందరో జనం స్మృతి పథంలోంచి క్రమేణా కనుమరుగై పోతున్నారు.
“కళల్ని నువ్వు బతికించు. కళ నిన్ను బతికిస్తుంది” అనే సూక్తి ప్రతి ముఖ్యమంత్రికీ వర్తిస్తుంది.కళ బతకాలి. కళాకారుడూ బతకాలి. బతికేందుకు దారులు వేయటమే సాంస్కృతిక విధానం. తెలుగు భాషాభివృద్ధి, పరిశోధనలు, సాహిత్యం, పుస్తక ప్రచురణ, గ్రంథాలయాలకు ప్రాణం పోయటం, తెలుగువారి సాంప్రదాయక కళలను విద్యార్ధు లందరికీ నేర్పించటం, మద్రాస్ అడయారులోని కళాక్షేత్రం, కేరళ త్రిస్సూరులోని ‘కళామండలం’ స్థాయిల్లో ఒక గొప్ప కళా విద్యా సంస్థను నెలకొల్పటం, లలిత కళలు శిల్పకళల పరిరక్షణ, అకాడెమీలను పునరుద్ధరించే వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం, శాస్త్ర సాంకేతిక సాహిత్యాన్ని ప్రచారంలోకి తేవటం, భాషాభివృద్ధికి, ఒక ‘సాధికార సంస్థ’ నెలకొల్పటం, కవులు కళాకారుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు వర్తింప చేయటం ఇవన్నీ జరగాలి. జరిపే సంకల్పం ఉండాలి. వాటి నిర్వహణ అర్హులు, సమర్ధుల చేతుల్లో ఉంచాలి. ఈ చివరిదే చాలా ముఖ్యమైన అంశం.
రాష్ట్రాభివృద్ధికి ఇరవై యేళ్ళ విజన్ డాక్యుమెంటు తయారు చేసుకున్న ప్రభుత్వం సాంస్కృతిక విధానానికి కూడా తయారు చేయకపోవటం కళాపోషణ లేకపోవటంతో సమానమే! “తెలుగదేల యన్న దేశంబు తెలుగు” అని కమ్మగా పాడతారు గాని, ఆ తెలుగు అతీగతీ పట్టించుకోరు. “నో పార్కింగ్ ఫర్ త్రీ వీలర్స్” అని రిక్షావాళ్ల కోసం కూడా ఇంగ్లీషులోనే బోర్డు పెట్టే అధికారుల్ని ఉద్యోగంలోంచి తీసేయకుండా పోషించే ప్రభుత్వం కళాపోషణ చేయగలదా?
భాషోద్యమం బలంగా తన వాణిని వినిపించిన ప్రతిసారీ ఇంటర్మీడియట్ వరకూ తప్పనిసరిగా తెలుగు నేర్పించాలనే జీవోని ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటి జీవోలు ఇచ్చాయి. కానీ, విచిత్రంగా ఆ జీవోలు అమలు కావు. అమలు చేయాలని ఇంకో జీవో ఇచ్చినా అదీ అమలు కాదు. రాష్ట్రంలో పరిస్థితి ఇది.
కవి గానీ, కళాకారుడు గానీ కన్నడంలోనో మళయాళంలోనో లేకపోతే అరవంలోనో పుట్టాలి. తెలుగులో పుట్టకూడదు. పుడితే జీవిత కాల అఙ్ఞాతవాసమే శిక్ష. అంతర్జాతీయ స్థాయి రచన తెలుగులో వ్రాస్తే, ఇలాంటివి పోవని ప్రచురణకర్త వేయడు. రచయితే స్వంతంగా వేసుకున్నా పుస్తక విక్రేతలు తమ షాపుల్లో పెట్టి అమ్మరు. అమ్మినా పాఠకులు, గ్రంథాలయాలు కొనరు. ఇలాంటి స్థితిలో వ్రాసినదానికి వెలుగు చూసే (out-let) అవకాశం లేకపోవటాన గొప్పగొప్ప సాహితీ వేత్తలు రాయని భాస్కరు లౌతున్నారు. తెలుగులో ఙ్ఞానపీఠాలు తక్కువని ఎద్దేవా చేస్తారు గానీ తేగల సత్తా ఉన్నవారికి ప్రోత్సాహం ఏదీ?
పైన పేర్కొన్న పద్యం సాంస్కృతిక విధానంకల ప్రభువు(ఱేఁడు) గురించి చెప్పిందే! పరాపరోక్తులు తెలిసి, యుక్తాయుక్తా లెరిగి కవులకు, కళాకారులకు, కళలకు మేలు చేసే వాడు కాకపోతే, అలాంటి ఱేఁడు పాలనలో మారేడు కూడా తానే ఱేఁడు నన్నట్టు వ్యవహరిస్తుంది. తనచుట్టూ భజంత్రీలను చేర్చుకుని వాళ్లచేతుల్లో శ్రీఫలాలు పెడుతుంది. శ్రీ ఫలం అంటే విబూది పండు కూడా! చివరికి బూడిద విదిలిస్తుందన్నమాట! నేరేడు చెట్టు కూడా ఱేఁడుగా చెలామణి అయి, గాలిపక్షులకు ఆశ్రయం ఇస్తుంది. పూరేడు (పుప్పొడి) కూడా తానూ ఱేఁడే నంటూ గాల్లో తిరుగుతుంది. “అసలు ఱేఁడు” తిన్నగా లేకపోతే ఇలాంటి నకిలీ ఱేఁడులు ముత్యాలముగ్గు కాంట్రాక్టరు లాగా ‘కళాపోసన’ చేస్తుంటారు.
తిరుపతి వేంకట కవులకీ, వేంకట రామకృష్ణ కవులకీ వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదాన్ని తేల్చగల ప్రభువు గట్టివాడై ఉండాలంటూ తిరుపతి వేంకట కవులు చెప్పిన పద్యం ఇది.

Thursday 23 June 2016

కొండమీది కొక్కిరాళ్ళు::డా. జి వి పూర్ణచందు.

కొండమీది కొక్కిరాళ్ళు::డా. జి వి పూర్ణచందు.

పండితులైనవారు దిగువం దగనుండగ నల్పు డొక్క డు
ద్దండత బీఠమెక్కిన బుధ ప్రకరంబుల కేమి యొగ్గగున్?
గొండొక కోతి చెట్టు కొనకొమ్మల నుండగ గ్రింద గండ భే
రుండ మదేభ సింహ నికురుంబము లుండవె చేరి భాస్కరా!
బాపూగారి ఒక సినిమాలో పంచాయితీ ప్రెసిడెంటైన ఓ భూస్వామి తన పాలేళ్ళను టీచర్లుగా చూపించి, లేని స్కూలుి ఉన్నట్టు నడిపిస్తుంటాడు. స్కూళ్ళ ఇన్స్పెక్టరు వచ్చినప్పుడు ఓ పాలేరాయన "నాను నాలుగో కలాస్సు పంతుల్నండీ"అంటాడు. ఇనస్పెక్టర్ గారు అతగాణ్ణి "విశ్వక్సేనుడు" అని పలకమంటాడు. అతగాడు నోరెళ్లబెడతాడు
స్వతంత్రం వచ్చాక తెలుగు నేలని మొదట భూస్వాములే పాలించారు. ఆతరువాత సారా కాంత్రాక్టర్క్ల చేతుల్లోకి పాలన వెళ్ళింది. క్రమేణా రైసుమిల్లర్లు అధికారాన్ని హస్తగతం చేసుకుని కొన్నాళ్ళు రాజ్యం ఏలారు. మధ్యలో మాఫియాలు, కాంట్రాక్టర్లు, ఇండష్ట్రియలిష్టులు, విద్యారంగ ప్రముఖులు రాజకీయరంగ ప్త్రవేశం చేసినప్పటికీ స్వీయ ప్రయోజనాలు తప్ప పాలనా వ్యవస్థ బాగోగుల జోలికి వెళ్లలేదు. ఈ తతంగం వలన రాజనీతిఙ్ఞులు క్రమేణా కనుమరుగై పోయారు.
అధికారం చేజిక్కించుకొనే వరకూ ప్రజలకోసమే నిరంతరంగా జీవించిన పార్టీలు ఎన్నికైన మర్నాటి నుండీ స్వంత ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం ప్రారంభించే రోజులివి. “ఇంతకాలం ప్రతి పక్షంలో ఉన్నాం... మా కార్యకర్తల్ని సంతృప్తి పరచొద్దా...?” అని బహిరంగంగానే అంటూన్న కాలం ఇది.
లేని విశ్వవిద్యాలయాల పేరుతో కొందరు డాక్టరేట్లు పంచేస్తుంటే చాలామంది ‘లా’ ఒక్కింతయు లేని వాళ్ళు డబ్బులు కట్టి డాక్టరేటు పుచ్చేసుకుని సన్మాన సభలు పెట్టుకుంటుంటే మా బోంట్లు కూడా చచ్చినట్టు వెళ్ళి అభినందాల్సిన పరిస్థితి నడుస్తోందిప్పుడు. నిన్నటి దాకా మనతో భుజం మీద చెయ్యి వేసి తిరిగిన వ్యక్తి తెల్లవారేసరికి డాక్టర్ అయిపోతున్నాడు. ఇప్పుడు అలాంటి డాక్టరేట్లు పెట్టుకోవటానికి ఎవరూ సిగ్గు పడట్లేదు. చక్కగా సిగ్గులేకుండా పుచ్చేసుకుంటున్నారు. ప్రజలే ఇలా ఉంటే ప్రభుత్వం చేసే వాళ్ళు ఇంకెలా వుండాలి?
గుళ్ళో కొబరికాయలు అమ్మే ఆయన వెళ్ళి, "అయ్యా! మీ కార్యకర్తని" అంటే చాలు, ఆ గుడి ట్రస్టీగానో, చైర్మన్ గానో నామినేటై పోతాడు. గుడిపాలకులుగా ఫలానా రకం వాళ్ళుండాలనే రూలెక్కడా లేదు. కాబట్టి, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడని అంశాలు. రాను రానూ ఇవి ఇతర రంగాలకూ విస్తరించాయి. ‘మన వాళ్ళలో పదవులు ఇవ్వాల్సిన వాళ్ళెందరు? -ఉన్న పదవులు ఎన్నీ అనే అంచనా లిష్టు తయారు చేస్తారు. పూర్వం రోజుల్లో ఈ రెండు లిష్టుల్నీ క్రాస్ మాచింగ్ చేసే వారు. అంటే ఎవరికి ఏది ఇవ్వచ్చో జతపరచి చూసే వాళ్ళు. ఇప్పుడలాంటిదేమీ లేదు.
ఎన్నో నియమాలూ, ప్రమాణాలూ వ్రాసి ఉన్న వైస్ ఛాన్సర్ల లాంటి పోష్టులకే ‘మనాళ్ళు’ అనేది “స్వీయప్రమాణం” అవుతుంటే, ఇంక మామూలు పదవుల గురించి మాట్లాడేదేముంది...? న్యాయమూర్తుల నియామక విషయంలోనూ ఈ ‘మనోళ్ళు’ సిద్ధాంతం నడుస్తోందని, కొలీజియం అభాసు పాలౌతోందని అత్యున్నత న్యాయస్థానమే గగ్గోలు పెట్టే స్థితి నడుస్తోంది.
ఒక పార్టీ అని కాదు, ఒక ప్రభుత్వం అని కాదు, ఒక రాష్ట్రం ఒక సందర్భం అనీ కాదు, ఢిల్లీ నుండి జిల్లా దాకా అంతా ‘మనోళ్ళ’ని ‘వేనోళ్ళ’తో తిననిచ్చే ప్రక్రియ నడిచి పోతోంది. ప్రభుత్వ పదవులు కార్యకర్తల కోసమే ననేది తిరుగులేని సత్యం. వీటిలో కొన్ని ధనాదాయాన్ని సమకూర్చేవి కాగా, కొన్ని పలుకు బడి పెరగటానికి, మరికొన్ని విజిటింగ్ కార్డుల మీద వేసుకోవటానికి పనికొస్తాయి. వీళ్ళంతా వారి వారి స్థాయిల్లో సామాజిక పీఠాధిపతులు. అంటే ఎవరి పీట వాళ్ళు వేసుకుని కూర్చుని ఎవరికి వారే వడ్డించేసుకునే బాపతు. ప్రభుత్వం అనేది ఒక బఫే భోజన శాల. అంతా స్వయం సేవే! ఎవరికి వారే స్వయంగా వడ్డించుకుని తినే వ్యవస్థ!
వీళ్ళు పెట్టుబడీ దారీ మాఫియా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కాదు, ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థలో కూడా ఉన్నారు. మృఛ్ఛకటికం నాటకంలో రాజశ్యాలకుడు (రాజుగారి బామ్మర్ది) లాంటి వాళ్ళు ప్రతీ యుగంలోనూ ఉంటారు.
అలాంటి వాడి గురించి పై పద్యం గొప్పగా వ్యాఖ్యానిస్తుంది. ఇలాంటి వాడు ఓ సాహిత్య సభకో, సంఘానికో అధ్యక్షుడిగా కూర్చున్నాడనుకోండి, మహాకవి పండితులు కింద కూర్చోవాల్సి వచ్చిందని ఏమీ చింతించ కండి!. గండ భేరుండ మదేభ సింహ నికురుంబములు చెట్టు కింద కూర్చుంటే, ఒక కోతి చెట్టు చిటారుకొమ్మ మీద కూర్చుని ఉంటుంది. అంత మాత్రాన కింద కూర్చున్న కవి పండితులకు లోటు జరిగిందేమీ లేదని ఊరడిస్తాడు. ఈ పద్యం ఇంత అచ్చు గుద్దినంతగా నేటి కాలానికి అమరి ఉండటం విశేషం. దీనికి ఇంతకన్నా అర్ధ వివరణలు అక్కర లేదు
భాస్కర శతకం వ్రాసిన మారయ (మారవి) వెంకయ్య కవి 1550-1650 మధ్యకాలంలో వాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివశించిన కళింగ కవి. ఆ ప్రాతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ భాస్కర శతకము వ్రాశాడు. అందులోని నీతి బోధలవల్ల, కవిత్వ సౌందర్యము వల్లా ఈ శతకము బాగా ప్రాచుర్యం పొందింది.
కవి ఏ కాలానికి చెందిన వాడైనా రేపటి యుగానిక్కూడా వర్తించే విధానంలో సార్వకాలీనంగా వ్రాసిన వాడు చరితార్ధుడు. అందుకే 500 యేళ్ళ తరువాత కూడా ఈ వెంకయ్య కవిత గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది.
my feature in andhrabhoomi daily sanjeevani page every wednesday

Tuesday 14 June 2016

Dr. G. V. Purnachand, B.A.M.S.,: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస స...

Dr. G. V. Purnachand, B.A.M.S.,: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస స...: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం 2016 ఆగష్టు 11 నుండీ కృష్ణాపుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు చ...

కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం: డా. జి వి పూర్ణచందు

కృష్ణాపుష్కరాలు-2016
“కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం


2016 ఆగష్టు 11 నుండీ కృష్ణాపుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు చిరస్మరణీయంగా జరగనున్నాయి.
ఈ పుష్కరాల సందర్భంగా ‘కృష్ణాతీరం’ పేరుతో ఒక ఉద్గ్రంథాన్ని ప్రచురించేందుకు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేస్తోంది.
మన భాషా సంస్కృతులు, మన వైఙ్ఞానిక ప్రగతి, మన సామాజిక రాజకీయ పరిణామాల వైనం ఈ నాటి యువతకు, ఈ నాటి యువ పరిశోధకులకు అందించటం లక్ష్యంగా ఈ గ్రంథ ప్రచురణ జరుగుతోంది. పుష్కరాలు పుష్కలం కావడంతో పాటు ఆ ఙ్ఞాపకాలు పది కాలాలపాటు పదిలం అయ్యేలా ఈ ఉద్గ్రంథం రూపొందుతోంది.
సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. డి విజయభాస్కర్ ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రంథ ప్రచురణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, కర్నూలు, మెహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన వివిధ అంశాలపై అపురూప పరిశోధనా వ్యాసాలు ఈ గ్రంథంలో ఉంటాయి. ఆదిమ కాలం నుండీ, నేటి వరకూ కృష్ణాతీరంలో సాగిన జనచైతన్యానికి ఈ ఉద్గ్రంథం అద్దం పట్టేలా ఉండాలని మా ఆకాంక్ష.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలైన ఈ జిల్లాలలో చోటు చేసుకున్న చారిత్రక పరిణామాలు, భాషా సాహిత్యాల ప్రగతి, సాంస్కృతిక రంగ విశేషాలు, విద్య, వైద్య, వైఙ్ఞానిక, సాంకేతిక అంశాలు, వర్తక వాణిజ్యాలు, నీటి పారుదల, వ్యవసాయం, సామాజిక రాజకీయ పరిణామాలకు సంబంధించిన పరిశోధనా వ్యాసాలను ఈ
గ్రంథంలో ప్రచురణార్ధం పంపవలసిందిగా పరిశోధక రచయితలను సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆహ్వానిస్తున్నారు.
వ్యాసాలను ఈ నెల 30వ తేదీ లోగా హైదరాబాదు రవీద్ర భారతి కళాభవన్, సైఫాబాద్ లోని రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యాలయానికి (e.mail: apdirectorculture@gmail.com లేదా purnachandgv@gmail.com) పంపవలసిందిగా కోరుతున్నారు.
అచ్చులో A4 సైజు లో 6-7 పేజీలకు మించకుండా తెలుగులో వ్యాసాలు ఉండాలి. ప్రచురణ తుది నిర్ణయం సంపాదక మండలిదే!
మరిన్ని వివరాలకు 9440172642 లో సంపాదకుని సంప్రదించ వచ్చు.
డా. జి వి పూర్ణచందు
సంపాదకుడు,
కృష్ణాతీరం పరిశోధనా వ్యాస సంపుటి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రచురణ

Tuesday 7 June 2016

మగ ఏడుపులు డా. జి వి పూర్ణచందు


మగ ఏడుపులు
డా. జి వి పూర్ణచందు
ఱెక్కలు రావు పిల్లలకుఱేపట నుండియు మేతగానమిం
బొక్కుచు గూటిలో నెగసి పోవగ నేరవుమున్ను తల్లి యీ
దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులు జూచుచున్న వతి  దీనతనెట్లు భరింతు నక్కటా!
(శ్రీ మదాంధ్ర మహా భాగవతము- 7/63)

భార్యలు ఊరెడితే భర్తలు ఎంజాయి చేస్తారని చాలా మంది కథలుకార్టూన్లు సృష్టిస్తారు గానీపిల్లల్ని ఇంట్లో వదిలి వెడితే అప్పుడు తెలుస్తుంది అయ్యగార్ల సంగతి. ఈ దేశంలో భర్త లేకపోయినా స్త్రీ జీవించగలదు. కానీ భార్య లేకపోతే భర్తకు ఒక్క పూట కూడా గడవదు. భర్త పోతే తోడుమనిషి పోయాడని ఏడుస్తుంది భార్య. భార్య పోతే ఇల్లెలా నడుస్తుందని ఏడుస్తాడు భర్త. వంటెవరు చేస్తారు?ఇల్లెవరు ఊడుస్తారుఅంట్లెవరు కడుగుతారుబట్టలెవరు ఉతుకుతారుపిల్లల్నెవరు సాకుతారు?అందుకని భార్య లేదని మగాళ్ళు ఏడుస్తారు. భార్య ఉన్నంత సేపూ వేధించుకు తినటం‘నుయ్యో గొయ్యో చూసుకుంటా’నని ఆమె ఏడవటం‘చస్తే చావుఈడ్చి పారేస్తా’... అని అతను అరవటం...ఇవి చాలా ఇళ్ళలో నిత్య కృత్యాలే! కానీఒక్క రోజు భార్య ఇంట్లో లేకపోతే తలకిందులై పోతాడు మగాడు.

ఇదేదో మహిళా ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న ఈ నాటి సామాజిక పరిస్థితి కాదు. పోతనగారి నాటికే ఈ ధోరణి ఉంది. ఆయన తన భాగవతంలో ఇలాంటి కథే ఒకటి చెప్పాడు: ఉశీవర రాజ్యాన్ని పాలించే సుయుఙ్ఞుడనే రాజు యుద్ధంలో మరణించాడు. శవం చుట్టూ చేరి భార్యలుబంధువులూ ఏడుస్తున్నారు. అది చూసి సాక్షాత్తూ యముడు ఓ బ్రాహ్మణ బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ ఏడ్చే వాళ్ళందరినీ ఊరడించేందుకోసం వాళ్లకు ఈశ్వర తత్వాన్ని బోధిస్తాడు. ఆ క్రమంలో ఈ ‘కథ చెప్పాడు...

అడవిలో ఓ చెట్టు మీద అడవి పిచ్చుకల జంట సుఖంగా ఉన్నాయి. ఆ సమయంలో ఓ వేటగాడొచ్చి “భార్యపిచ్చుక”ని పట్టి రెక్కలు విరిచి సంచీలో వేసుకున్నాడు. అప్పుడు “భర్తపిచ్చుక” ఏడుస్తూ ఇలా అంది: “అయ్యయ్యో! మన పిల్లలకు ఇంకా రెక్కలు కూడా రాలేదు. అవి ఎగర లేవు. తెల్లవారిం దగ్గర్నుంచీ అవి ఆకలో మొర్రో అంటూ గోలచేస్తాయి, నువ్వెప్పుడొచ్చి అన్నం పెడతావా... అని నీకోసం నిక్కినిక్కి చూస్తాయి. వాటి ఏడుపు వినటానికే భరించ లేనంతగా ఉంటుంది. ఇంకనుండి చచ్చినట్టు వాటికి ఆహారం నేనే తెచ్చి పెట్టవలసి వస్తుంది కదా!” అని భర్త పిచ్చుక ఏడ్చినట్టు వ్రాశాడు పోతన గారు.  “మగఏడుపులు” ఎలా ఉంటాయో ఈ పద్యం మనకు వివరిస్తోంది

బతికున్నంత కాలం భర్తలు అన్యాయం చేసినా, తన భర్త చనిపోయి తనకు అన్యాయం చేశాడనే అంటుంది భార్య. అనుకుంటుంది కూడా! కానీ, భర్తలు మాత్రం అలా అనుకోరు. అదే తేడా!
ఉశీవర దేశ రాజు పోయాడని అతని రాణులు ఏడ్చినప్పుడు యముడు వచ్చి,  భార్య పోతే ఏడ్చినఈ భర్త కథ చెప్పినట్టు పోతనగారు వ్రాశాడు. ఇందులో విచిత్రం ఏమీ లేదు. లోకం తీరు చెప్పాడు యముడు. అదే ఈశ్వర తత్త్వం అంటే! లోకాన్ని నడిపించేది ఈశ్వరు డైనప్పుడు లోకం తీరు ఈశ్వర తీరే అవుతుంది కదా! దాన్నే చెప్తున్నాడు ఈ పద్యంలో పోతన.

అందరు మగాళ్ళు ఇలానూ, అందరు ఆడాళ్ళు అలానూ ఏడవాలనే రూలేమీ లేదు. ఏడవటానికి కారణాలు వేరుగా  ఉంటాయనేది మాత్రం నిజం. సామాజిక వ్యవస్థ తీరే అంత! మనుషులందరూ పరస్పరం ఆధారపడి బతికితేనే అది సమాజం అనిపించుకుంటుంది. కానీ, భార్యా భర్తల విషయానికి వచ్చే సరికి మాత్రం భార్యని తాను పోషిస్తున్నానని, అందుకు కృతఙ్ఞతగా భార్య ఆజన్మాంతం అణిగి ఉండాలనీ భర్తల్లో ఓ బలమైన భావం సర్వత్రా కనిపిస్తుంది. భార్య సంపాదన మీద ఆధారపడి బతికే వాడిక్కూడా ఇలాంటి ఆలోచనే ఉంటుంది...తన వలనే కదా ఆమె సుఖంగా వుందని! అసలు రహస్యం ఆమె పోయినప్పుడే తెలుస్తుంది... అందుకే మగజాతి అలా ఏడుస్తుంది!