Sunday 20 December 2015

స్త్రీవాదంలో మరోకోణం::ఫెమెనిజం డా. జి వి పూర్ణచందు


స్త్రీవాదంలో మరోకోణం::ఫెమెనిజం
డా. జి వి పూర్ణచందు
మనది సెక్సిస్ట్ సమాజం! సెక్సిస్ట్ సమాజంలో స్త్రీ ఒక శారీరక వికలాంగి. Female is passive, అనీ, తనకు తానుగా ఏదీ చేయగలిగేది కాదని లోకం భావిస్తుంది. మానవ సంబంధాల పరిధిలో కాకుండా సెక్సుదృష్టితో స్త్రీ పురుష సంబంధాలను పితృస్వామ్య భావజాలం లెక్క కడుతుంది. తరతరాల సంస్కృతిలో భాగంగా సంక్రమిస్తూ వచ్చిన వారసత్వం ఇది మనకి!
స్త్రీకి ‘శరీర స్పృహ’ కలిగిన క్షణానే, తన శరీరాన్ని మగాడు స్వార్ధానికి దుర్వినియోగం చేస్తున్నాడనే ఎరుక కలిగింది. పురుష వ్యతిరేకత, పితృస్వామిక సంస్కృతీ ధిక్కారాలతో కూడిన సాహిత్యానికి అలా బీజాలు పడ్డాయి. స్త్రీవాద సాహిత్యం సమాజ జాగృతిని సాధించ గలిగింది. అది చాప కింద నీరులా కాదు, ఒక వెల్లువెత్తిన సముద్రంలా పురుషాధిక్యత పైన విరుచుకు పడింది. ఉద్యమ స్థాయిలో వ్యాప్తి కావటాన ‘స్త్రీవాద ఉద్యమం’ బలంగా వ్రేళ్ళునుకుని, మహావృక్షమై ఎదిగింది. ఫలాలు మహిళ లందరికీ దక్కాయి. అన్ని రంగాల్లోనూ స్త్రీలు ఆధిక్యత నిలుపుకో గలుగుతున్నారు. స్త్రీ పురుష వివాదాల్లో మగాడి పక్షాన, చట్టమూ, న్యాయమూ, ధర్మం కూడా నిలబడటం లేదు. ఇది గణనీయమైన మార్పు. తెలుగులో ఎన్నో సాహితీ విప్లవాలొచ్చాయి. కానీ, మహిళావాద సాహిత్యం తెచ్చిన మార్పుని తక్కిన సాహితీ విప్లవ రూపాలు తేలేక పోయాయి!
లైంగిక సమర్థతని పెంచే ఔషధాలను వాజీకరాలని(aphrodisiacs) పిలుస్తారు. ‘గుర్రంతో సమానమైన లైంగిక సమర్ధతని ఇచ్చేవి’ అని దీని అర్ధం. అన్నింటికన్నా ఎక్కువ ఉత్తమ ‘వాజీకరం’ ఏది? అని ఒక ప్రశ్న. మన శాస్త్రాలు ‘స్త్రీ’ అని ఠక్కున చెప్తున్నాయి. ‘ఆడది అంటే లైంగిక కార్యానికి ఉపకరణం...’ అనేది దీనిభావం. మగవాణ్ణి రెచ్చగొట్టేందుకూ, సంతృప్తి పరచేందుకు ‘ఆమె’ ఉపయోగ పడుతుంది. పుట్టిన నాటి నుండీ మగాడికి ఇదే చెప్తుంటారు... ఆడదంటే ‘అందుకే’ నని!
స్త్రీ వాదం పాశ్చాత్య ప్రభావం లోంచి తెచ్చిన అరువు భావజాలం కాదు. ఆడవాళ్ల కడుపు మంటల్లోంచి పుట్టింది. గదిలో బంధించి హింసిస్తే తిరగ బడేందుకు పిల్లికి పాశ్చాత్య అవగాహన అక్కర లేదు. స్త్రీవాదం అనేది మగదాష్టీకం పైన స్త్రీత్వం విసిరిన ఒక నిరసనాస్త్రం. అది సూటిగా ‘గురి’ని తగిలింది. కానీ, ఎంత సూటిగా తగిలినా, బలిసిన పురుషాహంకారం పైన అది చిన్నగోటి గీతే! పురుష ప్రపంచంలో ఆధిపత్య భావజాలాన్ని స్త్రీవాదం పూర్తిగా తగ్గించ లేకపోయినప్పటికీ, మగాడు వదిలేస్తే నుయ్యో గొయ్యో చూసుకునే రోజులకు కాలం చెల్లింది కదా...! అది స్త్రీవాద విజయమే! స్త్రీవాద రచయిత్రులకే ఈ విజయం అంకితం కావాలి! ఇందులో పురుష రచయితలు తలదూర్చి ఆ ఘనతలో వాటాదారులు కాకూడదు.
‘శరీర స్పృహ’ పెంచుకో గలిగిన స్త్రీ ‘తన దేహంపై తన హక్కు’ల గురించి ప్రారంభించిన పోరాటం ఇది. ఒక పునరుత్పత్తి కేంద్రంగా కాకుండా, అభివృద్ధికి నిలయంగా తనను తాను నిలుపు కోవాలనే చైతన్యాన్ని నేటి స్త్రీ గుండె నిండా నింపుకుంది. పురుషుణ్ణి ఆర్థిక వస్తువు గానూ, మాన ప్రాణ రక్షణకు కాచుకునే బాడీగార్డు గానూ, తాను అతని ఆధీనంలో జీవించే బానిస గానూ ఆధారపడి బతకాల్సిన అవసరం లేదని స్త్రీ గ్రహించింది. కలిసి రావాలో లేక అహంకరించి వేరై పోవాలో తేల్చుకో వలసిన స్థితిలో ఇప్పుడు మగాడు పడ్డాడు. ఈ సామాజిక వాస్తవాన్ని గ్రహించ గలిగిన వాడే నిజమైన మగాడు. కానివాడు కాకుండా పోతున్నాడు. మగ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటమే గగనంగా ఉందని ఇప్పటికే తల్లితండ్రులు గోలపెడుతున్నారు. భవిష్యత్తులో భార్య వదిలేసిన వాళ్లకూ, భార్యని వదిలేసిన వాళ్లకూ పెళ్ళిళ్ళు కావటం అంత తేలికైన విషయం ఏమీ కాదు. దాష్టీకం ఎల్లకాలం చెల్లదని ఋజువయ్యింది. సీతను వదిలేశాక రాముడు శ్రీరాముడని అనిపించుకునే నైతిక హక్కు కోల్పోయాడు. గృహస్థు బిరుదాలు వదులుకున్నాడు. రాముడి పరిస్థితే అలా అయితే, ఇంక మామూలు మనిషి బికారులూ బేవార్సుల సంఘంలో చేరటం తప్ప వేరే ఉండదు కదా!
రామాయణాన్ని సీత కోణంలోంచి ‘సీతాయణం’గా వ్రాస్తే, అందులో రాముణ్ణి కాపాడుకోవటానికి సీత చేసే సాహసాలు ప్రధానంగా ఉంటాయి. అంటే, స్త్రీ స్వామ్య వ్యవస్థని తిరిగి తేవటం కాదు, స్త్రీ పురుష సమాన వ్యవస్థకు శ్రీకారం చుట్టటం! మన సంస్కృతిని కాపాడుకోవటం అంటే స్త్రీ అణచివేతని కొనసాగించటంగా మతతత్వ వాదులు భావిస్తే అది తాలిబానిజం అవుతుంది. స్త్రీ వాదం ఒక మతానికి పరిమితమైన అంశం కాదు. స్త్రీకి స్వాతంత్ర్యం, పూజనీయ స్థానం ఇవ్వాలన్న ధర్మశాస్త్రాలే ఎక్కువ! అయితే, ‘పతికి మారాడక-పలుమరు లేడ్వక...’లాంటి నీతి పద్యాలతో సమాజ అభ్యున్నతి సాధ్యం కాదు.
ఆశ్చర్య రామాయణంలో జనకుడు సన్యాసం తీసుకుంటా నన్నప్పుడు “అతిథి దేవోభవ అనే అదృష్ట౦ కోల్పోతావు. పితృ దేవోభవ అని పితృ దేవతలకు తర్పణాలు విడిచి పుణ్యలోకాలు కల్పించే అవకాశాన్నీ, దేవతల్ని, మహర్షుల్ని అర్చి౦చే భాగ్యాలన్నింటినీ కోల్పోతావు. చివరికి నీ బతుకు కుక్కబతుకు అవుతుంది. సోమరి ఏనుగుని చీమలూ,ఈగలూ పురుగులే తినేస్తాయి. పురుషార్థాలేవీ లేని నిన్ను కూడా అంతే! అవే తినేస్తాయి” అని అతడి భార్య తిట్లదండకం ఎత్తుకుంటుంది. స్త్రీవాద సాహిత్యంలో ఈ మాత్రం పురుష నింద అవసరం, తిట్టి చెప్తేగానీ బుర్ర కెక్కించుకో లేని స్థితిలో మగాళ్ళు ఉన్నారు కాబట్టి.
“ఆడవాళ్ళు మంచిగా బట్టలు కట్టుకుంటే మగాళ్ళు రేప్ లెందుకు చేస్తారు?” అని ఒక స్వామీజీ కొలెస్టరాలెక్కువై ప్రకటిస్తే, ఒక కేంద్రమంత్రి దానికి వంతపాడితే తిట్టటం చాలదనీ, కొట్టి చెప్తేగానీ బుర్రలోకి వెళ్ళదనిపిస్తుంది. స్త్రీ వస్త్ర ధారణ పురురుషుల్ని ఆకర్షించటానికేనా? గుండు గీయించుకుని తెల్ల ముసుగు వేసుకుని కూర్చున్న స్త్రీ ఆకర్షణీయురాలు కాదా? ఆమెను ‘మగాడిదలు’ రేప్ చేయరా? స్త్రీని సెక్సు దృష్టితో తప్ప మరో దృష్టితో చూడలేని తనం మగవాళ్ళదే! మగదాష్టీకాలలో (male-centric notions) ఇదికూడా ఒకటి!
హంసవింశతిలో “వాని ఇల్లాలు దొమ్మరివాని డోలు” అంటాడు. డోలుని రెండువైపులా ఎడాపెడా వాయిస్తారు ఒక వైపు ఎలపట, ఇంకొకవైపు దాపట. ఒకవైపు ఇంట్లో పతి, ఇంకోవైపు బయట ఉపపతి... తన భార్య శీలవతిగా ఇంట్లో పడి ఉండగా, పరాయి వాడి భార్య వచ్చి తనను రకరకాల చేష్టలతో ఉర్రూగించి వెళ్ళాలనే మగాడి కోరికలకు ఇది ఒక మచ్చుతునక.
‘లేచిపోయింది’, ‘వాడితో వెళ్ళింది’, ‘కొంగు పరిచింది’ ఇలా అసభ్యంగా మాట్లాడుతూ జార, వేశ్య, సాని, తిరుగుబోతు అంటూ స్త్రీనింద చేసే మగాళ్ళని కొరత వేసే చట్టం రావాల్సిందే. అనేకమంది స్త్రీలతో సంబంధాలున్నవాణ్ణి రసిక రాజు, రతిరాజ శేఖరుడు అని కీర్తించటాన్ని కూడా ఈ కొరత వేసే నేరంలో చేర్చాలి. విజయరాఘవ నాయకుడు తన రాణులందరినీ ఒకే సారి అనుభవిస్తుంటే ఆయన కూతుళ్ళూ, మనవళ్ళు, మనవరాళ్ళు కూడా వచ్చి గ్యాలరీలో కూర్చుని సినిమా చూసినట్టు ఆ ఛండాలం అంతా చూశారని వెర్రి మొర్రిగా రాసిన రంగాజమ్మని మహాకవయిత్రి అనే వాళ్ళ సంస్కారాన్ని ప్రశ్నించటం అవసరం కూడా! ఏ కావ్యం చూసినా ఏమున్నది గర్వకారణం...? ఉన్నదంతా ఇదే! స్త్రీల గురించి మాట్లాడటం అంటే స్త్రీ సంభోగం గురించి మాట్లాడటం తప్ప ఇంకొకటి లేదా?
సెక్సు పరమైన ఆరోగ్యము, శరీరపరమైన ఆరోగ్యమూ రెండూ ఒకదాని వలన ఒకటి బలసంపన్నమౌతుంటాయి. ఒకటి బాగుండి రెండోది బాగోక పోవటం అనేది ఉండదు. కేవలం బాగుండటానికే (pleasure only) అయితే, సెక్సుకి ఇంత ప్రాధాన్యత అక్కర లేదు. కోరుకున్న ఒక వస్తువుని పొందటానికీ, కోరుకున్న ఒక వ్యక్తిని పొందటానికీ మధ్య తేడా ఉన్నట్టే నిగ్రహానికీ, దాంపత్యానికీ మధ్య తేడా ఉంది. స్త్రీల విషయంలో బలవంతపు నిగ్రహం కొనసాగుతూనే ఉంది. ఆమె వచ్చి తన ఒళ్ళో వాలాలని కోరుకునే యాసిడ్ ప్రేమికుడు కూడా, ఆమె తనతో మాత్రమే అలా వ్యవహరించాలనీ, ఇతరుల విషయంలో పరమ పతివ్రతగా ఉండాలనీ వాదిస్తాడు. ఇది మగ గుణం. పాశ్చాత్య సంస్కృతిలో ఇది మనకన్నాఎక్కువ. ఇది నూరు శాతం సెక్సు వివక్షతే! ఇలా అనగానే స్త్రీలకు వ్యభిచార హక్కు ఇవ్వాలంటారా...? అని కొందరు వ్యంగ్యం ఆడవచ్చు. పురుషుడికి ఇచ్చారు కదా మరి? ఇస్తే ఇద్దరికీ సమానంగానే ఇవ్వాలి. లేదా సమానంగానే నిరాకరించాలి.
దాంపత్యంలో అన్యోన్యత స్త్రీ పాతివ్రత్యం మీద మాత్రమే ఆధారపడి లేదు. అది పురుషుడి జోరు ఎంత తగ్గితే అంత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అన్యోన్య దాంపత్యాన్ని ‘పాజిటివ్ సెక్సు’ అంటారు. వివక్షత లేని లైంగిక వ్యవస్థ వలన సంసారం బలపడుతుంది. స్త్రీలు తమ లైంగికతని తమ అంగీకారం తోనూ, తమ సంతృప్తి కొద్దీ, తమ ఆరోగ్య భద్రత కొద్దీ పొందే హక్కు ఇది. స్త్రీ పురుషు లిద్దరూ పరస్పర అంగీకారంతో సుఖప్రదంగానూ, ఆరోగ్యదాయకంగానూ ఉండే లైంగిక కార్యానికి తలపడటాన్ని ‘పాజిటివ్ సెక్సు’ అని నిర్వచించుకోవచ్చు. మహిళావాదంలో కొన్ని కొత్త అడుగులు ఈ దిశలో నడుస్తున్నాయి.
పాజిటివ్ సెక్సు సిద్ధాంతంలో పురుష వ్యతిరేకత కన్నా, పురుషాధిక్య వ్యతిరేకతకు ప్రాధాన్యత కనిపిస్తుంది. ఉద్యమ కారణంగా పురుష వ్యతిరేక పదజాలం కొంత కనిపించి నప్పటికీ ‘పాజిటివ్ సెక్సు’ అనేది ‘మేల్ నెగెటివ్’ కాదు. అది జెండర్ సోషలైజేషన్‘ను కోరుకుంటుంది. ‘లైంగిక సానుకూలతా స్త్రీవాదం(పాజిటి సెక్సు ఫెమినిజం)’ ఈ దిశలో మరో ముందడుగు.
పాజిటివ్ సెక్సు అనేమాట సెక్సుని పొందటానికి మాత్రమే కాదు, సెక్సుని అతిగా నిగ్రహించు కోవటం గురించి కూడా ఆలోచిస్తుంది. సెక్సుని పొందటంలో ఆనందంతో పాటు, ప్రమాదాలు, ప్రాణాపాయాలు అనేకం పొంచి ఉన్నట్టే, నిగ్రహం పాటించే విషయంలోనూ ఉన్నాయి. సాధారణ స్థితిలో నిగ్రహించిన ఒక కోరిక మానసిక శక్తిగా “సబ్లిమేట్” అవుతుందంటాడు ఫ్రాయిడ్. కానీ, వివక్ష కారణంగా బలవంతపు నిగ్రహానికి గురికావటం వలన నిగ్రహించుకున్న ఆ కోరిక సబ్లిమేట్ కాకుడా మనోవ్యాధిగా మారుతుంది. హిష్టీరియా లాంటి మానసిక వ్యాధులకు కారణం అతి నిగ్రహమే! యోగశ్చిత్తవృత్తి నిరోధకః అన్నారు. బ్రహ్మచర్యం అనేది మనోబల సంపన్నతతో జరిగితే ‘యోగ’దాయకం! లేకపోతే ‘అయోగ్యం’ అయి మానసిక బలహీనతకు కారణమౌతుంది.
ముఖ్యంగా సెక్సు విషయంలో బలవంతపు నిగ్రహాలే నరాల బలహీనతకు కారణా లౌతున్నాయి.
సెక్సుని తుఛ్ఛమైన లౌకిక వ్యవస్థగా భావించి మనుషు లందరూ సెక్సు హీనులుగా మారాలని టీవీల్లో హోరెత్తించే ప్రవచనకారులే మానసిక బలహీనతకు మొదటి కారకులు. యుద్ధ సైనికుడికి ఆయుధా ఆయుధ ప్రయోగ విద్యలూ ఇస్తే చాలదు, తగినంత మనోబలం కూడా ఇచ్చి పంపాలి. స్త్రీలలో ఇలాంటి మనోబలాన్ని పెంపొందించాలని పాజిటివ్ సెక్సు సిద్ధాంతం కోరుతోంది.
దాంపత్య అసమానతను ప్రశ్నించటం ఈ యుగం లక్షణం. ద్వంద్వ విలువల్ని నిరసించాల్సిందే! ఆడది అణగిమణగి ఉండటం కాదు, ఆడా, మగా ఇద్దరూ సంసారానికి సమానంగా బద్ధులుగా ఉండే సామాజిక వ్యవస్థ కావాలి! సెక్సు అనేది ప్రకృతి ధర్మం కాబట్టి, దాన్ని స్త్రీ పురుషుల మధ్య సమానంగా పంపకం చేయాల్సిన ధర్మ శాస్త్రకారుడు పురుష పక్షపాతిగా వ్యవహరించటం వలన ఈ అసమానతలు వచ్చాయి. సుప్రీం కోర్టు తీర్పుక్కూడా అప్పీలు ఉంటుంది. కానీ, ఇక్కడ పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు.
ఆకలి వేయటం, దాహం వేయటం లాంటి నేచర్ కాల్స్ లాగానే లైంగికోత్తేజం (orgasm) కూడా! దానికి అంత ప్రాధాన్యత ఎందుకనేది సెక్స్ రాడికల్ ఫెమినిష్టుల ప్రశ్న. అసహజ సెక్సు (oral, anal sex) బారిన పడకుండా స్త్రీని కాపాడాలనేది సెక్సు పాజిటివ్ ఫెమినిష్టుల వాదన.
‘లెస్బియాన్లు’ ‘గే’ లు ఇంకా ఇలాంటి మనో వికారులు ఇదంతా మానవ సహజ ప్రవృత్తి అంటూ తమ అలవాట్లని అడ్దగించరాదని, తమ లైంగిక స్వేఛ్ఛను హరించ కూడదనీ పాశ్చాత్య లోకాలలో గట్టిగానే అడుగుతున్నారు. ఈ ధోరణిని బారతదేశంలో కూడా అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం.
లైంగిక స్వేఛ్ఛని ఇలాంటి అసహజ విధానాలకు వర్తింప చేయటం సబబేనా? ఇద్దరు ఆడవాళ్ళో లేక ఇద్దరు మగాళ్ళో సెక్సుని అసహజ పద్ధతిలో అనుభవించటం సహజ ప్రవృత్తి అనీ, చికిత్స అవసరం లేని ఒక మనస్తత్వం అనీ భావించి వదిలే యాలని ఒక మానసిక వైద్యుడు వ్యాఖ్యానిస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మనోవికారాలన్నీ ఒక పరిధి వరకూ మనుషు లందరికీ సహజ ప్రవృత్తులే! కానీ, ఆ వికారాల్లో జీవించటమే వ్యాధి. ‘గే’ అయినా, లెస్బియాన్ అయినా ఇందుకు మినహాయింపు కాదు. ఇలా మినహాయించి మన్నించేట్లయితే, హింసించి ఆనందించే ‘మగ’త్వం, యాసిడ్ పోసి లోగదీసుకోవా లనుకునే మృగత్వం, అసహజ రీతిలో సెక్సుని పొందాలనుకునే అమానుషత్వం ఇవన్నీ కూడా సహజ ప్రవృత్తుల ముసుగులో చెలామణిలోకొచ్చే ప్రమాదం ఉంటుంది. లోకం పోకడను గమనిస్తూ, ఇలాంటి అంశాలపైన స్త్రీవాదం ఇప్పుడు దృష్టిని సారించాల్సి ఉంది.
పిల్లల్లో యాసిడ్ సంస్కృతి, అసహజ లైంగిక ధోరణులు, సెక్సువెర్రి మితిమీరటానికి సినిమాలనూ టీవీలను తిట్టి ఊరుకుంటే ఉపయోగం లేదు. పిల్లలు బలమైన కుటుంబ వ్యవస్థలో పెరిగితేనే వారి మనో ప్రవృత్తుల్లోని వికారాల్ని అధిగమించ వచ్చని ‘నియో ఫ్రాయిడియన్లు’ చెఫ్పే విషయాల పైన కూడా అధ్యయనం జరగాలి.
Sex-positive feminism, pro-sex feminism, sex-radical feminism, sexually liberal feminism ఇలా స్త్రీవాదం చిలవలు పలవలుగా సాగుతోంది. అన్నీ మన సామాజిక పరిస్థితులకు వర్తించక పోవచ్చు. దేశీయ పరిస్థితులకు అవసరమైన, అనుగుణమైన రీతిలో స్త్రీవాదం తన రెండో దశని ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే కొందరు రచయిత్రుల రచనల్లో ఆ ధోరణి కనిపిస్తోంది కూడా! స్త్రీ పురుషుల సమానత్వం పిల్లల బాగోగులను కాపాడేదిగా ఉండాలి. ఫెమినిజం అంటే దాంపత్య వ్యతిరేకం కాదు. సంసారాల ధ్వంసరచన దాని లక్ష్యం అంతకన్నాకాదు.
స్త్రీ పురుష సమానత ద్వారా బలమైన కుటుంబ వ్యవస్థ ఏర్పడాలని కోరుతో, ఫెమెన్ (FEMEN) ఉద్యమం ఒకటి పనిచేస్తోంది. స్త్రీ (Female) పురుష (men)సమన్వయంగా బలమైన కుటుంబ వ్యవస్థను ఫెమెనిజం కోరుతోంది.
మగాడు ఇంక తన రంగు తుడుచుకుని నిజమైన అర్ధాంగి భావనని పెంచుకోవాలి. పెళ్ళాన్నిహింసిస్తూ పార్వతిని కొలిస్తే భక్తి ఫలించక పోగా రక్తి కూడా కోల్పోతాడు. మదగజంలా ‘మగిజం’తో అహంకరిస్తే, నష్టపోయేది తనే! అంకుశాలు,ముకుతాళ్ళూ ఈ మగిజాన్ని కట్టేయటానికి చాలవు. స్త్రీవాద ఉద్యమం గడ్డిపరకల్ని పేని గట్టి మోకులు తయారు చేయాలి! ఇంటి ఆరోగ్యం చక్కన కానప్పుడు ఇంట్లో పెరిగే సంతతి ఆరోగ్య వంతులు కాలేరని, బుద్ధిగా ఒదిగి ఉండి సంసారం చేసుకోవాలని మగాళ్ల బుర్రలో నాటగలిగే సాహిత్యం నేటి అవసరం. ఇది కూడా స్త్రీవాద రచయిత్రుల వలనే సాధ్యపడుతుంది. పురుషులు ఎంత రాసినా పొడిపొడిగానే ఉంటుంది. ఆనదు!
రేఫటి భారత దేశం పూర్తిగా యువతరంతో నిండిపోతుందని అంటున్నారు. ఆ యువత మనో బల సంపన్నులుగా మనో వికార రహితులుగా, సమాజ హితులుగా ఉన్నప్పుడు దేశం బాగు పడుతుంది. ఇందుకు తల్లిదండ్రు లిద్దరూ సమాన బాధ్యత వహించేలా చూడాలని ఫెమెనిజం కోరుతోంది. ‘ఫెమినిజం’ లోంచి ‘ఫెమెనిజం’ లోకి ప్రయాణం సాగాలి!