Language, Literature, Culture and Food heritage of Telugu People.-------- Susruta Ayurvedic Hospital, 1st Floor, Satnam Towers, opp. Buckinghampet Post Office Governorpeta, Vijayawada – 520002 9440172642, Email ID: purnachandgv@gmail.com,
Monday, 3 April 2023
ఉట్రవడియం ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి తినరామైమరచిలో: డా||జి వి పూర్ణచందు

Thursday, 26 January 2023
దేవుడి భోజనం డా|| జి వి పూర్ణచందు
దేవుడి భోజనం
డా|| జి వి పూర్ణచందు
ఇందిర వడ్డించ నింపుగను/చిందక
యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు
వడలు/పెక్కైన సయిదంపు పేణులును
సక్కెర రాసులు
సద్యోఘృతములు/కిక్కిరియ నారగించవో స్వామి
మీరిన కెళంగు మిరియపు
దాళింపు/గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ
నిట్టే/కూరిమితో జేకొనవో స్వామీ
పిండివంటలును పెరుగులు/మెండైన
పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు/వెండియు మెచ్చవే
వేంకటస్వామీ" (అన్నమయ్య
కీర్తన)
వేంకటేశ్వరుడి దివ్యాన్నాల వివరాలతో
అన్నమయ్య ఇచ్చిన మెనూకార్డ్ ఈ కీర్తన.
వీటిని లక్ష్మీదేవి ఇంపుగా వడ్డించి తినిపిస్తోందట. వాటిని ఒక్క మెతుక్కూడా
వదలకుండా భుజించవో స్వామీ…అంటున్నాడు అన్నమయ్య. ఆ
వంటకాలను చూద్దాం:
అక్కాళ
పాశాలు, అప్పాలు,వడలు:: అక్కుళ్లు అనే బియ్యంతో చేసిన
నేతి పాయసాలు,
బూరెలు, గారెలు
పెక్కైన
సయిదంపు పేణులు:
అనేక రకాల గోధుమ సేమ్యా వంటకాలు
చక్కెర
రాసులు,
సద్యోఘృతములు: పంచదారతో చేసిన తాజా నేతి
వంటకాలు
మీరిన కెళంగు మిరియపు దాళింపు గూరలు: కెళంగు అనేది ముల్లంగి లాంటి ఒక దుంపకావచ్చు. మిరియాల పొడి చల్లి వండిన తాళింపు కూరలు
కమ్మని
కూరలును సారంపుబచ్చళ్ళు:
కమ్మని కూరలు,
చక్కని సుగంధ
ద్రవ్యాలు వేసి చేసిన పచ్చళ్ళు
చవులుగ
నిట్టే కూరిమితో జేకొనవో స్వామీ: ఇట్టే నోరూరే ఈ రుచుల్ని ఇష్టంగా తినవయ్యా స్వామీ
పిండివంటలును
పెరుగులు:
ఇంకా అనేక పిండివంటలు,
పెరుగుతో చేసిన
వంటకాలు
కిక్కిరియ
నారగించవో స్వామి:
దగ్గరగా పెట్టుకుని ఆరగించవయ్యా స్వామీ!
తమ దేవుడికి ఏ ఆహారం నైవేద్యంగా
పెట్టుకున్నారో అది ఆ ప్రజల నాణ్యమైన ఆహారంగా చరిత్రవేత్తలు భావిస్తారు. బూరెలు
గారెలు, నేతి స్వీట్లు, తాలింపు కూరలు, సుగంధభరితమైన పచ్చళ్ళు, పెరుగు వంటకాలు, పాలవంటకాలూ వీటిలో ఉన్నాయి.
ఇవే గదా ఇప్పుడు మనం తింటున్నవీ...అని
అడగొచ్చు. కానీ,
ఇప్పటికీ
అప్పటికీ చాలా తేడా ఉంది...! చింతపండు రసం కలిపినవీ, అల్లం-వెల్లుల్లి దట్టించిన మసాలా
కూరలు, నూనె వరదలు కట్టేలా వండిన
వేపుడుకూరలు,
ఎర్రగా మంటెత్తే
ఊరుగాయలూ ఇంకా అనేక భయంకర వంటకాలేవీ ఈ పట్టికలో లేకపోవటం గమనార్హం. అన్నమయ్య తరువాత ఈ 500 యేళ్ళలో చింతపండు, మిరప కారం, నల్లగా వేయించిన కూరబొగ్గులు ఇవే
చివరికి మనకు తినేందుకు మిగిలాయని ఈ వంటకాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి. యాంటీ
బయటిక్సు లేకుండానే మన పూర్వులు జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందించారంటే కారణం అర్ధం
చేసుకోగలగాలి.
మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి.
ఉదయాన్నే పెరుగు/చల్లన్నం తినటం మన ఆచారం. అది ఇప్పుడు నామోషీ అయ్యింది. దాని
స్థానంలో ఇడ్లీ,
అట్టు, పూరీ బజ్జీ, పునుగులు తినటం నాగరికం అయ్యింది.
అన్నమయ్య కాలానికి మిరప కాయలు మనకింకా పరిచయం కాలేదు. ఇప్పటి ఆవకాయ లాంటి ఊరగాయలు
అప్పటి ప్రజలకు తెలీవు. వాళ్లకు తెలిసిన ఊరుగాయల్లో మిరపకారం ఉండదు. అల్లం, శొంఠి మిరియాలనే కారపు రుచికి
వాడుకునే వాళ్ళు. అదే వాళ్ళ ఆరోగ్య రహస్యం.
విదేశీ వ్యామోహం పెరిగి, ఇప్పుడు మనకు పీజ్జాల్లాంటి
నిరర్థకాలే పవిత్ర వంటకా లయ్యాయి. ఏడుకొండలవాడి దగ్గరికి సూటూ బూటూ వేసుకు వెళ్ళి హాయ్/బాయ్
చెప్పి, ఐదు నక్షత్రాల చాక్లేట్లు
నైవేద్యం పెట్టటమే గొప్ప అనుకునే రోజుల్లోకి మనం ప్రయాణం చేసేముందు దేవుడి భోజనం
అంటే ఆరోగ్యదాయకమైన వంటకాలు ఎలా ఉండాలో గుర్తు చేసుకోవటానికే ఈ పద్యం!
