రాయల యుగం సీమ వంటలు
డా|| జి. వి. పూర్ణచందు
పాలు వెన్న బకాళబాతు దధ్యోదనంబు పుళియోరెము వెన్న బూరియలును
సరడాల పాశముల్(?) చక్కెర పులగముల్ నువ్వుమండిగలు మనోహరములు
అప్పము లిడ్డెన లతిరసాల్ హోళిగల్ వడలు దోసెలు గలవంటకములు
శాకముల్ సూపముల్ చాఱు లంబళ్లు శుద్ధోదనములును సద్యోఘృతమ్ము
పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులును/మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు మ్రింగుచుండఁ
బర్వసేయవు నీవంటి బ్రదుకుగాదె/ శత్రు సంహార వెంకటాచల విహార (వెంకటాచల విహార శతకం)
పాలు, వెన్న, బకాళబాతు, దధ్యోదనం, పులిహోర, వెన్నబూరెలు, సరడాలపాశం, చక్రపొంగలి, నువ్వు మండిగలు, మనోహరాలు, అప్పాలు, ఇడ్డెనలు, అతిరసాలు(అరిశెలు), హోళిగలు(బొబ్బట్లు) వడలు, దోసెలు, కలవంటకాలు(చిత్రాన్నాలు), శాకములు(కూరలు), సూపము(పప్పు), చారు(రసము), అంబళ్లు(అంబలి), శుద్ధోదనం(తెల్లన్నం), సద్యోఘృతం(తాజానెయ్యి), పండ్లు, తేనెలు, బొబ్బట్లు, పచ్చళ్లు ఇన్ని వంటకాల్ని నైవేద్యంగా పెట్టి “ఇవన్నీ మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు (గుగ్గిళ్లు) మ్రింగుచుండఁ బర్వసేయవు(పట్టించుకోవు) నీవంటి బ్రదుకు గాదె” అని నిలదీస్తౌన్నాడు కవి. సుల్తానులు చేస్తున్న ఆగడాలను భరించలేక వారిని నశింప చేయాలని కోరుతూ, 15-16 శతాబ్దాల నాటి ఓ అఙ్ఞాత కవి ఈ ‘వెంకటాచల విహారశతకం’ వ్రాశాడు. నిందాస్తుతితో రాసినపద్యాలివి. కొండపైన నువ్వు, కొండ దిగువన మీ అన్న గోవిందరాజస్వామి లేవనైనా లేవకుండా మొద్దు నిద్ర పోతున్నారంటాడీ కవి. ఈ పద్యంలో ఆనాటి రాయలసీమ వంటకాలు అనేకం కనిపిస్తాయి. వీటిలో చాలా భాగం మనం ఎరిగినవే! వీటిలో ఇప్పటి మన వాడకంలో లేని ఓ నాలుగు వంటకాలను పరిశీలిద్దాం:
1. బకాళబాతు: బిసిబేలీబాత్ లాంటిదే ఇది. కన్నడం వారికి బాత్ అంటే ద్రవంగా వండిన అన్నం అని! వారు ‘బగాళాబాత్’ పేరుతో
సేమియా పెరుగు కలిపిన వంటకంగా చేస్తున్నారు. తృణధాన్యాలతో చేసిన ‘కర్డ్ రైస్‘ని కూడా వారు ‘బగాళాబాత్’ అనే పిలుస్తున్నారు. అయితే, ఈ పద్యంలో దధ్యోదనం కూడా ఉంది కాబట్టి ఇది ఏదైనా ధాన్యవిశేషంతో పెరుగు కలిపి చేసిన బాత్ అయి ఉంటుంది.
2. సరడాల పాశము: ఈ గ్రంథాన్ని పరిష్కరించిన వేటూరి ప్రభాకర శాస్త్రిగారు సరడాలపాశం దగ్గర ఒక ప్రశ్నార్థకాన్ని ఉంచారు. ఈ
వంటకం ఏదైనదీ తెలీదు. పాశం అంటే పాయసం. అన్నమయ్య అక్కుళ్లుతో వండిన పాయసాన్ని అక్కాలపాశం అనీ, శ్రీనాథుడు సేమియాతో చేసిన పాయసాన్ని సేవెపాయసం అనీ అన్నారు. హంసవింశతి కావ్యంలో ‘సరడాలు’ అనే వంటకం పేరు కనిపిస్తుంది. సరడాలనే బియ్యంతో కాచిన పాయసం సరడాల పాశెం కావచ్చు. ఒకరకం వంకీల గొలుసుకు సరడాలనే(శరణ్డః) పేరుంది. బహుశా మరుగుతున్న పాలలో పిండిని వంకీలుగా వత్తి వండిన ‘పాలతారికలు’ లాంటి వంటకం ఇది కావచ్చు.
3. మనోహరాలు: బియ్యప్పిండి, మినప్పిండి, పెసరపిండి కలిపి, చిన్న బలపం ముక్కలుగా చేసి, బెల్లంపాకం పట్టినవి మనోహరాలు.
మెల్కోటే, మధురై, తిరునెల్వేలీలలో బలపాల్లాంటి మనోహరాల్నే ప్రసాదంగా పెడతారు. పాలక్కాడులో తీపిబూందీని మనోహరా లంటారు. వీటిని లడ్డూలుగా కూడా ఉండచుడతారు. ఈ లడ్డూల్ని తమిళులు “మనోహరం ఉరుండై” టారు. 16వ శతాబ్దిలో మనోహరపడి పేరుతో తిరుపతిలో ఈ లడ్డూల్ని ప్రసాదంగా పెట్టేవారని చెప్తారు.
4. నువ్వు మండిగలు: మండిగె (మండిగ) అంటే తప్పాలచెక్కల మాదిరి చేసిన బియ్యప్పిండి రోటీ. దీనికి నువ్వులద్ది కాల్చినవి
నువ్వు మండిగలు కావచ్చు. "కుడుముల్ గారెలు బెల్లపు మండిగెలు” అనే కవి ప్రయోగ్గాన్ని బట్టి తీపి మండిగలు ఉండేవని తెలుస్తోంది.
5. హోలిగ: బొబ్బట్టు, ఓలిగ అని తెలుగులోనూ, హోలిగె, ఒబ్బట్టు అని కన్నడంలోను, ‘పూరన్ పూరీ’ అని గుజరాతీలోనూ, పోలి అని తమిళంలోనూ, పూరణ్ పోలి అని మరాఠీలోనూ, ‘పోలె’లని తెలంగాణాలోనూ, ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఈ పద్యంలో హోళిగనీ హొబ్బట్టునీ రెండింటినీ ప్రస్తావించటాన్ని బట్టి, బహుశా దీన్ని పెనంపై కాల్చే విధానంలో తేడా ఉండొచ్చు. నెల్లూరు బొబ్బట్లు పెద్ద పరిమాణంలో పొడిపొడిగా ఉంటాయి. తినేప్పుడు నేతితో తడిపి తింటారు. ప్రాంతాల్నిబట్టి వేర్వేరు పేర్లు ఉండవచ్చు.