Sunday, 21 September 2014

రకరకాల రోగాలూ - సెక్సు బలహీనతలూ :: డా. జి వి పూర్ణచందు




రకరకాల రోగాలూ - సెక్సు బలహీనతలూ
డా. జి వి పూర్ణచందు
లైంగిక పరమైన ఇబ్బందుల్ని చాలామంది నరాల బలహీనతగా భావిస్తారు. శరీర శక్తికి, మానసిక శక్తికీ సంబంధం లేని శారీరక బాధల్ని రోగులు నరాల బలహీనతగా డాక్టర్లదగ్గర చెప్పుకుంటారు. ఒక్క మాటకి వైద్యులు చాలా విషయాలు అర్థం చేసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా లైంగిక విషయాలను సూటిగా చెప్పుకునేందుకు తగిన భాష మనకు లేదు. ఇంగ్లీషులోనూ సమస్య ఉన్నప్పటికీ కొన్ని పదాలను స్వేఛ్ఛగా వాళ్ళు వాడినట్టు మన వాళ్ళు వాడలేరు. వైద్యుడికి ఎలా చెప్పాలో తెలియక వ్యాధిని లోపలే దాచుకునే వాళ్ళే ఎక్కువమంది.
ఇంగ్లీషులో న్యూరోలాజికల్వ్యాధి అంటే  నాడులు(nerves) దెబ్బతిన్నందుకు వచ్చే వ్యాధి అని స్పష్టమైన అర్థం కనిపిస్తుంది. మెదడు సంకేతాలు శరీరానికీ అలాగే, శరీరం చెప్పే విషయాలు మెదడుకీ చేర్చే సమాచార వ్యవస్థ దెబ్బతినటాన్ని న్యూరోలాజికల్ వ్యాధిగా చెప్తారు. పక్శవాతం, పార్కిన్సోనిజం, వెన్నుపాములోపల నరాలు నలిగి వచ్చే వ్యాధులు, మెదడుకు బలమైన దెబ్బతగలటం వలన వచ్చే వ్యాధులూ ఇవన్నీ నరాల వ్యాధులే. వ్యాధుల్ని వ్యాధులుగానే చూస్తాం గానీ, అవి లైంగిక జీవితాన్ని విధంగా ప్రభావితం చేస్తాయో గమనించటానికి మనకు సభ్యతా పరమైన సమస్యలు అడ్దం వస్తాయి. సెల్సు అనేది ఉచ్చరించటానికి వీల్లేని పదంగా ఇంకా భావించబడుతోనే ఉంది. శరీరంలో విధమైన అనారోగ్యం కలిగినా దాని ప్రభావం అంతో ఇంతో సెక్సు మీద ఉంటుంది.  ఆఖరికి అజీర్తి చేసినా లైంగిక సమర్థత తగ్గిపోతుంది. అలాంటప్పుడు సెక్సుని కేవలం జననాంగపరమైన సౌఖ్యం అనే అర్థం లోనే చూడాలనుకోవటం సబబు కాదు.
శరీరం సహకరించని వ్యాధులతో బాధపడే వాళ్ళకోసం విదేశాల్లో వైబ్రేటర్లవంటి సౌకర్యాల వాడకం ఎక్కువగా ఉంటుంది. మన సమాజంలో ఇంకా అటువంటి వాడకాలకు అలవాటు పడలేదు. చాలావ్యాధులు మానసిక కారణాలవలన పెరుగుతున్నాయి. చాలా వ్యాధులకు మానసిక కారణాలే అసలు ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. వాటిలో లైంగికపరమైన అంశాలు ముఖ్యమైనవి కూడా అయినా మనం వ్యాధులకూ, సెక్సు పరమైన అసంతృప్తికీ  గల సంబంధాన్ని పట్టించుకోవటం లేదు. రోగానికి మందులిచ్చే విధానమే గానీ, రోగకారణాన్ని వెదికే తీరిక వైద్యుకు గానీ. ఆ ఆసక్తి రోగులగ్గానీ లేకుండా పోవటం కూడా ఇందుకు ముఖ్య కారణాలే!
లైంగిక ఆసక్తి తగ్గిపోవటం, అంగ స్తంభనాదులు బలహీనంగా ఉండటం, రతి సమయం మరీ కుదించుకు పోవటం, సంతృప్తి కలగక పోవటం అనేవి కొన్ని శరీర వ్యాధుల్లో జరిగే అవకాశం ఉన్నవి కాగా, ఇలాంటి అంశాలు అనేక శరీర వ్యాధులు పెరగటానికి కారణం అవుతుంటాయి కూడా!
Viagra (sildenafil), Cialis (tadalafil), Levitra (vardenafil). లాంటి ఔషధాలు అంగ స్తంభనాన్ని త్వరగా జరిగేలాగా ఎక్కువ సేపు నిలబడి ఉండేలాగా సహకరోచేందుకు ప్రపంచ వ్యాప్తంగా వాడిస్తున్న ఔషధాలు. కానీ, అవి వాడిన సమయానికి మాత్రమే ఉపయోగ పడేవి గానీ, లైంగిక సమతుల్యతని కలిగించేవి, సంతృప్తినీ, సమర్థతనీ పెంపొందించేవీ కావు. రాజూ పేద సినిమాలో జేబులో బొమ్మ పాట గుర్తుందికదా! జ్బులో బొమ్మ ఉన్నంత సేపూ వాడు చెలరేగిపోయే వీరుడు. ఆ బొమ్మ లేకపోతే ఎందుకూ కొరగాడు. ఇలాంటి ఔషధ సేవన కూడా జేబులో బొమ్మ లాంటివే! మర్నాడు ఈ బొమ్మ లేకపోతే కథ వెనక్కే నడుస్తుంది. కాబట్టి, లైంగిక అసమర్థత అనేది పైకి చెప్పుకోలేని ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. చికిత్స కూడా అరచేతిలో వైకుంఠం చూపించగలైగే సెక్సు స్పెషలిష్టులకు సొమ్ము సంతృప్తినిచ్చేవే గాని, లైంగిక సంతృప్తిని తెచ్చి ఇచ్చేవి తక్కువ!
పార్కిన్సన్ వ్యాధిలో లైంగిక అసమర్థత ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద మార్గాన ఈ వ్యాధికి ఇచ్చే ఔషధాలు ముఖ్యంగా దూలగొండి(దురదగొండి)విత్తులు లైంగిక సమర్థతని పెంచే వాటిలో ముఖ్యమైనవిగా గుర్తించబడ్డాయి. నాడీ వ్యవస్థను బలసంపన్నం చేయటానికి ఆయుర్వేదీయ పద్ధతిలో ఉపయోగించే వనమూలికలన్నీ లైంగిక శక్తిని పెంచేవిగానే ఉంశ్డటాన్ని గమనించవచ్చు. అందుకే రోగి నరాల నిస్సత్తువ వచ్చిందంటున్నాడంటే కాళ్ళూ చేతులూ చచ్చుబడిపోయాయని మాత్రమే అనుకోకూడదు. లైంగిక వ్యవస్థ చచ్చుబడి పోయిందని చెప్పటం ఆ రోగి ఉద్దేశం కావచ్చు. అది వైద్యులు అర్థం చేసుకోవాల్సిన విషయం.
సెక్సనేది భార్యాభర్తలిద్దరికీ సంబంధించిన విషయం కాబట్టి ఒకరికొకరు సహకరించుకునే విధానాన్ని ఉపదేశించి. లైంగిక తృప్తిని పెంపొందించుకునేలాగా ప్రోత్సహిస్తే, చాలా వ్యాధుల్లో చికిత్స త్వరగా ఫలించే అవకాశం ఉంటుంది.
లోలంబ రాజీయం అనే వైద్య గ్రంథంలో విరహజ్వరంతో బాధపడేవాడికి  మందులు వెదుకుతావెందుకు వైద్యుడా...? కోరిన స్త్రీతో దృఢమైన ఆలింగనం, అధరచుంబనాలను పథ్యంగా చెప్పు అంటాడు. ఇది చాలా సందర్భాల్లో, విరహ జ్వరాలకేకాదు, ఇంకా చాలా వ్యాధులకు వర్తించే విషయం.
మానసిక కారణాలవలన వచ్చే మైగ్రేన్ తలనొప్పి, సొరియాసిస్, అకారణ నడుం నొప్పి లాంటి వ్యాధుల్లో లైంగిక అసంతృప్తిని ప్రధాన సమస్యగా చాలా మందిలో గుర్తించటం జరిగింది. ఈ అసంతృప్తి స్థానంలో సంతృప్తిని చేర్పించటమే అసలు మందు. ఈ మందుని రోగి స్వయంగా కల్పించుకోవాల్సి ఉంటుంది. మరింత యుక్తిమంతంగా లైంగిక విషయాల్లో వ్యవహరించాలని రోగికి తప్పకుండా చెప్పాలి.
లైంగిక కార్యాన్ని సృష్టి కార్యం అనేది ఇందుకే! పిల్లల్ని సృష్టించే కార్యం అనే అర్థానికి పరిమితం చేసే మాట కాదిది. ప్రాపంచిక జీవనంతో పాటుగా వ్యక్తి వ్యక్తిగత జీవితం కూడా ఈ సృష్టికార్యం చుట్టునే తిరుగుతుంది. వ్యక్తి చుట్టూ ఉన్న ప్రపంచం, వ్యక్తి లోపల ఆవరించి ఉన్న ప్రపంచాలు రెండిండిటి మధ్యా సమన్వయం, సమతుల్యతలు దెబ్బతింటే వ్యక్తి శారీరక బాధలు తెచ్చుకుంటాడు. లైంగిక అసంతృప్తులు ఈ బాధల్ని మరింత పెంచుతాయి.