Sunday 13 March 2016

మక్కజొన్న పొత్తులు డా. జి.వి.పూర్ణచందు

మక్కజొన్న పొత్తులు 


డా. జి.వి.పూర్ణచందు



కొలంబస్ అమెరికాని కనుగొన్నాకే, మిరప కాయలు, పొగాకు, బ౦గళాదు౦పలు, మక్కజొన్నల గురించి బైట ప్రపంచానికి తెలిసి౦ది. బ్రిటిషర్లు వీటీని 16, 17 శతాబ్దాలలో భారతదేశంలో పండింప చేశారు. వానాకాలంలో రోడ్డుప్రక్కన తాటాకుల గొడుకు క్రింద కూర్చుని ముసలమ్మలు కాల్చి ఇచ్చే మక్కజొన్న కండెలు మాత్రమే మనకు తెలుసు. సినిమాలకో షికార్లకో వెళ్ళినప్పుడు పాప్ కార్న్ కొనుక్కొని తినడమూ తెలుసు. అంతకు మించిన ఆహార ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనం పట్టించుకోము. ఈ రోజున మక్కజొన్నల్ని ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు ప్రధాన ఆహారద్రవ్య౦గా తీసుకొ౦టున్నారు.


మక్కజొన్న పొత్తుల్ని రెడ్ ఇండియన్లలో అరవక్ భాష మాట్లాడే ప్రజలు ‘మైజ్’ అని పిలుస్తారు. అదే పేరు ప్రపంచం అంతా వ్యాప్తిలోకి వచ్చింది. తెలుగువాళ్ళు చాలా ప్రాంతాల్లో వీటిని మొక్కజొన్న పొత్తులు అని పిలుస్తారు. ఇది సరైన పిలుపు కాదనుకుంటాను. మక్క అంటే, స్త్రీల పొత్తికడుపు. పొత్తిళ్ళలో పాపాయిలా అనేక రేకుల మధ్య దీని కండె భద్రంగా ఉంటుంది. అందుకని, తెలుగువాళ్ళు వీటిని మక్కజొన్న పొత్తులని పిలిచి ఉంటారనుకుంటాను. జొన్నకండెలకూ మక్కజొన్న కండెలకూ ప్రధానమైన తేడా ఈ పొత్తిళ్ళే (రేకులు). జొన్న కండెలకు పొత్తులుండవు. పొత్తులు (పొరలు, రేకులు) కలిగినది కాబట్టి, దాన్ని మక్కజొన్న పొత్తు అన్నారు. తెలంగాణా ప్రా౦తంలో మక్కజొన్న అనే అంటారు. అదే సరయిన పిలుపు. మొక్క జొన్న అనటం దానికి రూపా౦తరమే! హి౦దీలో దీన్ని ‘మక్క’, ‘భుంటే’ పేర్లతో పిలుస్తారు. కన్నడంలో ‘మెక్కేచోళా’, అరవంలో ‘మక్కాచోళ౦’ అని పేర్లు. మక్కాకీ ఈ కండెలకూ ఏ సంబంధం లేదు. అది మక్కజొన్న అనే అర్ధంలో ఏర్పడిన తమిళపదం.


అమెరికా ఖండంలో మక్కజొన్న అడవులే ఉన్నాయి. స్థానిక అమెరికన్ ఆటవిక జాతులకు ఇవి రక్షణ కవచంలా ఉపయోగ పడతాయి. ఒకసారి ఈ మక్కజొన్న అడవుల్లోకి ప్రవేశిస్తే బైటకు రాగలగట౦ అసాధ్య౦ అన్న౦త దట్ట౦గా ఉంటాయి. అందువలన తక్కిన ప్రపంచం మొత్త౦ ఎ౦త మక్కజొన్నని పండిస్తోందో అమెరికా ఖండం ఒక్కటీ అంత ఉత్పత్తి చేయగలుగుతోంది.


మనం జొన్నలతో చేసుకునేవన్నీ అమేజాన్ రెడ్డిండియన్లు మక్కజొన్నల్తో వండుకొ ౦టారు. మక్కజొన్నల తరవాణి వాళ్ళకి చాలా ఇష్టమైన వంటకం. పిండిగా విసిరి రొట్టెలు చేసుకొ౦టారు. ధర కాస్త అందుబాటులో ఉంటే మనం కూడా జొన్నపిండి లాగానే మక్కజొన్న పిండితో రొట్టెలు కాల్చుకోవచ్చు.


మక్కజొన్నగింజ లోపల 14 శాతం నీరు ఉంటుంది. 400 డిగ్రీల వరకూ వేడిని ఈ గింజలకు ఇచ్చినప్పుడు గింజ లోపలి నీరు ఆవిరయి, వత్తిడి కలిగించడంతో గింజలో ఉన్న పిండిపదార్ధం పేలి, దాని అసలు పరిమాణానికన్నా 40% ఎక్కువగా పువ్వులా విచ్చుకుంటుంది. వీటినే మక్కజొన్న పేలాలు (పాప్ కారన్) అంటారు. అమెరికన్ ఆటవిక జాతులవారు దేవతా విగ్రహాలను మక్కజొన్న పేలాల ద౦డలతో అలంకరిస్తారట. వాటిని ధరి౦చి నృత్యం చేస్తారట ఈ మక్కజొన్న పేలాలను బెల్ల౦ పాకం పట్టి ఉండలు చేసుకొని తి౦టారట కూడా!


మక్కజొన్న పేలాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఉప్పు, కొవ్వు కలవకుండా ఉంటే, స్థూలకాయులూ, షుగరు రోగులు కూడా తిన దగినవిగా ఉంటాయి. కూరలు ఇతర ఆహార పదార్థాల్లో ఈ గింజల పిండిని విసిరి, కలిపి వండితే పోషక విలువలు బాగా అందుతాయి.


శనగపిండి బదులు మక్కజొన్న మంచి ప్రత్యామ్నాయం. ఇప్పుడు కొత్తగా లేత మక్కజొన్న గింజల్ని ఉడికించి మషాల పొడి కలిపి పెళ్ళి విందుల్లో స్వాగతం ఆహార పదార్ధంగా ఇస్తున్నారు. కూరల్లో ఈ గింజల్ని బాగా వాడుతున్నారు. సమోసాలు కూడా చేస్తున్నారు.


ఇవి పుష్టి కలిగిన ధాన్యమే గానీ, వీటిని అరిగించు కోవటానికి బలమైన జీర్ణ శక్తి కావాలి. కాల్చిన గింజలు, పేలాలు అరిగినంత తేలికగా మక్కజొన్న పిండి అరగక పోవచ్చు. అరగని ఆహారపదార్ధం ఏదయినా వాతాన్ని పెంచుతు౦ది. అందువలన వాత వ్యాధులున్నవారు మక్కజొన్నల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. మక్కజొన్న పిండిని గానీ గింజల్ని గాని బాగా ఉడికించి తయారు చేసే కారన్ సూప్ అనే గంజి ఎక్కువ పోషకంగా ఉంటుంది. వెంటనే నీరసం తగ్గుతు౦ది. ఇంటికి రాగానే పిల్లలకు, శ్రీవారికీ ఇవ్వదగిన ఆహార పదార్ధం ఇది..


తక్కిన ధాన్యాలతో పోల్చినప్పుడు మక్కజొన్నల్లో బి విటమినూ, ఇతర ప్రొటీన్లూ అత్యధికంగా ఉన్నాయి. మాంసం, మక్కజొన్నపిండీ కలిపి వండితే అది తిరుగులేని ఆహార పదార్ధం అవుతు౦ది. జీర్ణశక్తి బలంగా ఉన్నవారికి పెట్టదగిన వంటకం.