Monday, 4 January 2016

‘ఆలి’ని వదిలితే ‘గాలి’ బతుకే! ::డా. జి వి పూర్ణచందు

‘ఆలి’ని వదిలితే ‘గాలి’ బతుకే!
డా. జి వి పూర్ణచందు

ఆ యమ యున్నరోజులహహా! అనురాగఝరీ మరందవా:
పేయము లంగజేక్షుశరపీఠగుణశ్రుతిబద్ధ స్త్కథా
గేయము లాత్మశోకవినికృంతననిర్వృతికృద్వివిక్తి సం
ధ్యేయము లావృతిన్ వెలుగు లేచెడు రవ్వల పూలపొట్లముల్

డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తాజాగా వెలువరించిన ‘ధర్మభిక్ష’ ప్రబంధ కావ్యంలో పద్యం ఇది! శ్యామలానంద తెలుగు సంస్కృత భాషలలో పరిశోధనా పట్టాలు పొందిన కవి పండితుడు. ఇంకా ఈ రోజుల్లో కూడా అంత పాండిత్యం సాధ్యమా అని ఆశ్చర్య పోయేంత వచో వైభవం ఉన్నవాడు. శతావధానాలు చేశాడు. తొలిసారిగా అచ్చతెలుగులో అష్టావధానం చేశాడు. లండన్ పార్లమెంటులో ఇంగ్లీషు వాళ్లకి ఆశువుగా పద్యాలు పాడి వినిపించాడు.

డా. శ్యామలానంద సామాజిక దృష్టి అధికంగా ఉన్న కవి. ఆయన నూనూగు మీసాల రోజుల్లో వ్రాసిన కావ్యం ఈ ధర్మభిక్ష. అప్పట్లో విశ్వనాథవారికి చదివి వినిపించి ఆయన చేత తప్పొప్పులు సరి చేయించు కున్నాడు. కవిసమ్రాట్ మరణం తరువాత ఆ కావ్యం పూర్తి కాకుండానే మూలపడింది. తరువాత పరిపూర్ణ యవ్వనంలో తన మిత్రుడు సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రేరణతో దాన్ని పూర్తి చేశాడు. అది ఇప్పటికి అచ్చులో వచ్చింది. దాన్ని రామలింగేశ్వర రావుకే అంకితం ఇచ్చాడు.

ఎర్రనగారి భారతానువాదంలో ధర్మవ్యాధో పాఖ్యానం ఘట్టాన్ని తీసుకుని తనదైన రీతిలో వ్యాఖ్యానిస్తూ ఈ ధర్మభిక్ష ప్రబంధాన్ని వ్రాశాడు శ్యామలానంద. చిన్న కావ్యం ఇది. కానీ ఇప్పటి తరానికి అవసరమైన సందేశం ఇస్తోంది.

భర్త ఎంత మొండివాడైనా భార్యతో ఉన్నంతసేపే అతని ఆటలు సాగుతాయి. ఆమె లేనప్పుడు ఆమె అవసరం ఏమిటో తెలిసొస్తుంది. భార్య లేకపోతే, ఆ భర్త జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో, భార్యలను వేధించే భర్తలకు తెలిసొచ్చే సరికి చాలా అపకారం జరిగి పోతుంది.

ఈ పద్యంలో ఒక భర్తగారు భార్యని పుట్టింటికి పంపించేసి, అంటే, ఇప్పటి భాషలో వొదిలేసి, దేశ ద్రిమ్మరిలా తిరుగుతూ మనసులో అనుకుంటున్న మాటలివి:

“ఆహహా...ఎంత గొప్పవీ... ఆవిడతో కలిసి ఉన్నరోజులు... అవి అనురాగ ఝరీ మరందవా: పేయాలు...అంటే ప్రేమ అనే తేనెల ప్రవాహాలు, అంగజేక్షుశరపీఠగుణశ్రుతిబద్ధ స్త్కథా గేయాలు: మన్మథుడి చెరకు వింటి నారిని శ్రుతి చేసి పాడుకున్న కథా గేయాలు, ఆత్మశోకవినికృంతననిర్వృతికృద్వివిక్తి సంధేయాలు: గుండ్రంగా శక్తికొలదీ తిప్పుతుంటే రాలిపడే మతాబాల పూలపొట్లాలు...” అని!. ఆ విషయాన్ని చాలా ఆల్స్యంగా గ్రహించాడా భర్త గారు.

అహంకారం అనేది ఉంది చూశారూ...అది తన తప్పుని ఒప్పుకోనివ్వదు.

"అవునండీ...ఆమె ఎంత మూర్ఖురాలు కాకపోతే అన్నం వడ్డించి నెయ్యి వెయ్యకుండా భోజనం పెడుతుందా? నేను మాత్రం ఏమన్నాను... నెయ్యి వెయ్యి లేదేవిటీ... అన్నాను... ఆవిడ వెంటనే, “మీకు చాలా సార్లు చెప్పాను...ఇంటికి వచ్చేప్పుడు నెయ్యి తెండీ...అని! మీరు తీసుకు రాకుండా వచ్చి నన్నడుగుతా రేవిటీ అని రెట్టించింది. నాకు చిర్రుమంది. ఆడది భర్తతో అలా మాట్లాడితే ఎవడికైనా కోపం రాదా...? అది నన్ను బైట పెట్టి నా శిష్యుల ముందు చులకన చేయటం కాదటండీ... నిజంగా అది తలుచుకుంటే, ఎన్నాళ్లనుండో ఆ ఊళ్ళోనే ఉంటున్నాం కదా...ఓ చిన్న గిన్నెడు నెయ్యి అప్పు దొరకదా...? నేను తేలేదని ఎత్తి చూపటానికి కాకపోతే, కమ్మగా మొగుడికి అన్నం వడ్డిద్దాం అనే ధ్యాసే లేకపోతే ఎట్లా...ఆడాళ్లకి మొగ్గుళ్ళని చులకన చేయటం అంటే మహా మోజు...” అనుకున్నాడా భర్త. ఆయనేమీ సీదా సాదా మొగుడు కాదు. కౌశికుడనే ఒక మహర్షి.

“మొగుడికి అన్నం వడ్డించాక నెయ్యి లేదని చెప్తుందా? కారణం చిన్నదే కావచ్చు...కానీ కార్యం (తప్పు) పెద్దది. అందుకే నాకు అంత కోపం వచ్చింది...”అనుకున్నాడు కౌశికుడు. ఏమైతేనేం, ఆ రోజునుండీ కౌశికుడు భార్య లేనివాడై పోయాడు. ఆ విధంగా మూర్ఖురాలైన భార్యని శిక్షించాడనే అనుకుందాం... కానీ, ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి, ఆ ఇళ్ళ ఇల్లాళ్ళని అమ్మా! తల్లీ! అని అడుక్కొంటున్నాడు కదా!...కౌశికా శిక్షించావా? శిక్షించబడ్డావా?

ఆఫీసులో ‘ఆడబాసు’తో తిట్లు తిని, ఇంటి కొచ్చి భార్యమీద ఆ కసినంత చూపించే అభినవ కౌశికులు చాలా మంది ఉన్నారు. భార్య అంటే తిట్లు పడాల్సిన ఒక వస్తువనే భావనలోంచి బయట పడకపోతే, ఉన్న ఇల్లాల్ని వదిలి, ఊరి ఇల్లాళ్ల దయమీద బతకాల్సివస్తుందని ఇందులో సారాంశం.

03-01-2016 విశాలాంధ్ర ఆదివారం సంచికలో నా పద్యానుభవం శీర్షికన ప్రచురణ