Wednesday 13 May 2015

శ్రీ ఉపేంద్ర చివుకుల గారికి విజయవాడలో అభినందన




ఏ దేశమేగినా...ఎందు కాలిడినా...

న్యూజెర్సీ (అమెరికా) రాష్ట్ర మంత్రిగా ఎదిగినతొలి తెలుగు తేజం 

శ్రీ ఉపేంద్ర చివుకుల గారికి

విజయవాడలో అభినందన


అమెరికన్ సామాజిక వ్యవస్థలో ఉన్నత రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న తొలి తెలుగు బిడ్డ శ్రీ చివుకుల ఉపేంద్ర! న్యూజెర్సీ రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన మొదటి తెలుగువాడు, నాల్గవ భారతీయుడు కూడా! న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యుడిగా (అసెంబ్లీ మాన్) నాలుగు సార్లు ఎన్నికై, ఇటీవలే న్యూజెర్సీ రాష్ట్ర ప్రజావసరాల శాఖ మంత్రి గా(బి.పి.ఓ), న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీ బోర్డు కమీషనర్‘గా బాధ్యతలు స్వీకరించి ఆ దేశంలో తెలుగువారి ఉనికికి ఒక ఉన్నతిని తెచ్చారు!

నెల్లూరు నవాబుపేట అగ్రహారంలో 1950 అక్టోబర్ 8న జన్మించి,కటిక పేదరికంలోపెరిగారాయన. దాతల సహకారంతో మద్రాసు వివేకానందా కాలేజీలో పీ.యూ.సీ, గిండీ కాలేజీలో ఎలెక్ట్రికల్ ఉన్నత శ్రేణిమార్కులతో ఇంజనీరింగ్ చేశారు. గోపాల్ భాయ్ దేశాయి (గుజరాత్) అండతో న్యూయార్క్ సిటీ యూనివర్శిటీలో మాష్టర్ డిగ్రీ పొందారు.

క్యూబా అమ్మాయి ‘డేసీ’ని ప్రేమ వివాహంచేసుకున్నారు.డైసీ కూడా తెలుగు నేర్చుకుంది. చక్కగా మాట్లాడుతుంది. వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ సూరజ్, దమయంతి అని పేర్లు పెట్టుకున్నారు. సూరజ్ ‘వాషింగ్టన్ డిసీ’లో అటార్నీగా ఉన్నాడు. దమయంతి గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో శిక్షణపూర్తి చేసుకొంది.
2002-2014 మధ్య కాలంలో శ్రీ చివుకుల న్యూ జెర్సీ జెనరల్ అసెంబ్లీ సభ్యుడిగా, 17వ లెజిస్లేటివ్ డిస్ట్రిక్ట్ నుండి ఏడు సార్లు ఎన్నికయ్యారు. డెప్యూటీ స్పీకర్‘గా పనిచేశారు. 2014 సెప్టెంబరులో న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డుకి కమిషనర్‘గా అమెరికన్ సెనేట్ ఆయన్ని 35-1 ఓట్ల తేడాతో ఎంపిక చేసిందంటే ఆ పదవికి అక్కడున్న ప్రాధాన్యత అంతటిది. 

కార్మికులకు కనీసవేతనాలు, మధ్యతరగతి సంక్శ్హేమం సామాజిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ, వాళ్ళ పిల్లల చదువులు లాంటి అంశాల పైన శ్రీ ఉపేంద్ర చివుకుల మొదటి నుండీ పోరాటాలు చేయటం ద్వారా డెమొక్రటిక్ పార్టీలో ప్రముఖుడిగా ఎదిగా రాయన. 1994లో అప్పటి న్యూజెర్సీ గవర్నర్ శ్రీ చివుకులను న్యూజెర్సీ రాష్ట్ర సామాజిక సేవా పరిశీలకుల బోర్డులో పౌర (పబ్లిక్) సభ్యుడిగా నామినేట్ చేయటంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. ఫ్రాంక్లిన్ పట్టణ కౌన్సిల్ 5వ వార్డు నుండి 1997లోనూ 2001లోనూ రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1998లో డెప్యూటీ మేయర్ గానూ, 2000లో మేయరుగా కూడా పనిచేశారు. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర వహించే ఎలెక్టోరల్ కాలేజీ (ఎన్నికల కూటమి)లో ఆయనది కీలక పాత్ర. అమెరికన్ సెనేట్‘కు (అత్యుత్తమ పార్లమెంటరీ వ్యవస్థ) ఎన్నిక కావటానికి తన పార్టీ అభ్యర్ధిగా ఆయన విఫల యత్నం చేయాల్సి వచ్చింది. అయినా దీక్ష సడల లేదు. సెనెటర్ గా ఎన్నికవ్వాలన్నది ఆయన లక్ష్యం. 

ప్రభావ శీలత, స్ఫూర్తి దాయకమైన వ్యక్తిత్వం, వినమ్రత, కలబోసిన అసాధారణ ప్రతిభావంతుడు శ్రీ ఉపేంద్ర చివుకుల. అమెరికన్ సామాజిక వ్యవస్థలో రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఒక సామాన్యుడైన తెలుగువాడు ఎదగటం కష్టం కావచ్చు నేమో గానీ అసాధ్యం కాదు. శ్రీ ఉపేంద్ర చివుకుల లక్ష్య సాధకుడు కావాలని ఆశిద్దాం.

కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం

టిఫినీల కథ :: డా. జి వి పూర్ణచందు

టిఫినీల కథ


డా. జి వి పూర్ణచందు

ఇప్పుడంటే నిద్ర లేచాక టిఫిన్ తినకుండా ఉండలేక పోతున్నాం. మన పూర్వులు ఏం తిని బతికారో మరి!


కాఫీలు తిన్నారా, టిఫినీలు తాగారా? అని ఓ హాస్య పాత్ర అడుగుతుంది ఒక తెలుగు సినిమాలో! టిఫినుకూ, కాఫీకీ అంతట్ అవినాభావ సంబంధం ఏ జన్మనాటిదో!  


ముప్పొద్దుల భోజనం తెలుగువారి అసలు సాంప్రదాయం. ఆంగ్లేయ యుగం చివరి రోజుల్లో ఉదయంపూట టిఫిను తినే అలవాటు మనకు సంక్రమించింది. పొద్దున పూట ఇడ్లీ గాని, అట్టుగానీ, పూరీ గానీ, ఉప్మా గానీ తిని, కప్పు కాఫీ”, లేక టీ తాగే అలవాటు మనకి గత ఎనబై తొంబై ఏళ్ళ నుంచే మొదలయింది.  

1907లో బిపిన్ చంద్రపాల్ గారు బందరు వచ్చిన సందర్భంగా కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు ఆయన గౌరవార్ధం విందు చేసి, అందరికీ ఆవడ, కాఫీ వడ్డించాడట.  వాటిని సేవించిన బ్రాహ్మణులకు ఆ తరువాత కులవెలి శిక్ష పడినంత పని అయ్యింది. అయ్యదేవర కాళేశ్వరరావు గారు తన జీవిత చరిత్రలో దీని గురించి వ్రాశారు. అంటే ఇరవై శతాబ్ది ప్రారంభం దాకా టిఫిన్లు చేయటం, కాఫీ అనే మాదక ద్రవ్యం సేవించటం అలవాట్లు మనకు లేవనీ, ఆ తరువాతే క్రమేణా తెలుగు ప్రజలకు అవి అలవాటుకాసాగాయనీ అర్ధం అవుతోంది,..


1611లొ ఆంగ్లేయులు గ్లోబ్ అనే ఓడలో మొదటగా బందరు ఓడరేవులో దిగారు. క్రమేణా దేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు ఏలారు. ఈ నాలుగు వందల  ఏళ్ళ కాలంలో మనం తెలివి మీరింది తక్కువే గానీ నాగరికత మీరింది ఎక్కువ. అలా మనకు అలవడిన దొరల అలవాటులో టిఫినీలు చేసే అలవాటు ఒకటి!


ఇక్కడో. విచిత్రమైన కథ ఉంది. మద్రాసు కేంద్రంగా మనల్ని పరిపాలించటం మొదలైన తరువాత ఆంగ్లేయులు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలను కూడా ఇష్టపడటం మొదలు పెట్టారు. సాధారణంగా ఆంగ్లేయులు ఉదయంపూట చాలా తేలికగా ఆహారం తీసుకుంటారు. మధ్యాహ్నం అల్పాహారం, రాత్రికి ఘనమైన ఆహారం తీసుకోవటం వాళ్ళ అలవాటు. ఉదయం స్వల్పాహారానికీ  (బ్రేక్ ఫాస్ట్), రాత్రి ఘనాహారానికీ (సప్పర్) మధ్యలో తీసుకునే అల్పాహారాన్ని ఇంగ్లీషు పామరజనులు టిఫింగ్అనే వాళ్ళట. వాటిని మధ్యాహ్న భోజనంగా తీసుకొనేవాళ్లు. కాబట్టి ఇడ్లీ, అట్టు, వగైరాలకు ఈ టిఫింగ్ లేదా టిఫిన్ అనే మాట వర్తించటం మొదలయ్యింది. అది క్రమేణా ప్రధాన ఆహారానికన్నా భిన్నమైనదాన్ని తీసుకోవటం అనే అర్ధంలో వ్యాప్తిలోకి వచ్చింది. చివరికి అదే మన భారతీయ సాంప్రదాయం, తరతరాల సంస్కృతి అన్నంతగా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది.


భారత దేశంలో అలా కొత్త అర్థాన్ని సంతరించుకున్న ఈ ఆంగ్లపదం టిఫింగ్ పామరుల భాషలో టిఫిన్ గానూ  ప్రామాణిక ఆంగ్ల భాషలో ఆ రోజుల్లో లంచ్కి పర్యాయ పదంగానూ మారిపోయింది. ఆంగ్లేయుల దృష్టిలో లంచ్ అంటే స్వల్ప భోజనం అనే! మనకు పగలు పెద్ద భోజనం, రాత్రి పూట అల్పారం అలవాటు. యూరోపియన్లు రాత్రి భోజనాన్ని (సప్పర్) చాలా ఘనంగా తీసుకుంటారు. ఆ మోజుకొద్దీ మనం విందు భోజనాలను రాత్రి పూట (డిన్నర్) ఏర్పాటు చేసి, ఒక్కో విస్తట్లో యాబై నుండి అరవై వంటకాలను వడ్డించి అత్యంత ఘనమైన ఆహారం తినటాన్ని అలవాటు చేసుకున్నాం.
ఇదిలా ఉండగా, స్వాతంత్ర్యానంత్యరం టిఫిన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. బొంబాయి మహానగరంలో ఉద్యోగం ఒక చోట, నివాసం మరెక్కడో కావటంతో ఉదయాన్నే నిద్ర లేచి మధ్యాహ్న భోజనం క్యారియర్ కట్టుకు వెళ్లటానికి తగినంత సమయం  చాలక పోవటాన అక్కడ డబ్బావాలా లేదా టిఫిన్ వాలా అనే (కొరియర్) వ్యవస్థ మొదలయ్యింది. ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళకి మధ్యాహ్నానికి భోజనం క్యారియర్‌లు తెచ్చి ఆఫీసుల దగ్గర అందించే విధానం ఇది. మధ్యాహ్న భోజనాన్ని తెచ్చే డబ్బాని టిఫిన్ బాక్స్, టిఫిన్ క్యారియర్ అన్నారు. ఎటుతిరిగీ మహారాష్ట్రులకు భోజనం అంటే చపాతీలు, పుల్కాలే కాబట్టి, చపాతీ పూరీ లాంటి వాటిని టిఫిన్ అనటం ఒక ఆచారం అయ్యింది. అది చూసిన తెలుగు వాళ్ళు వరి అన్నం కన్నా భిన్నమైన ఆహారాన్ని టిపిన్ అనటం మొదలు పెట్టారు. బొంబాయిలో టిఫిన్ అంటే మధ్యాహ్న భోజనం అనీ, తెలుగులో టిపిన్ అంటే అల్పాహారంఅనీ ఆవిధంగా అర్థాలు అలా స్థిరపడ్డాయి.


క్రమేణా టిఫిన్ సెంటర్లు, టిఫిన్ (కాఫీ) హోటళ్ళు తెలుగు నేల మీద విస్తృతంగా ఏర్పడటం మొదలు పెట్టాయి. భోజన హోటళ్ళతో పాటు, ప్రత్యేకంగా టిఫిన్ హోటళ్ళు ఏర్పడసాగాయి.  ప్రొద్దుట పూట ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా వగైరా పదార్థాలను తిని తీరాలనే రూలు వేదోక్త0 అన్నంతగా మనం టిఫిన్లకు అలవాటు పడటం మొదలు పెట్టా0.


డైటింగు చేయాలనుకునే వాళ్ళు, శనివారం ఆదివారం రాత్రిపూట అన్నం తినకుండా ఉపవాసాలు ఉండాలనుకునేవాళ్ళు సిద్ధంతం ప్రకారం ఫలహారంఅంటే రెండో మూడో అరటిపళ్లు లేదా జామపళ్ళు తిని గ్లాసు మజ్జిగ తాగి పడుకోవాలి. కానీ, డజన్లకొద్దీ ఇడ్లీలు, అట్లు, వడలు లాగించి, తేలికపాటి ఆహారం లైటుగా తీసుకున్నామని భ్రమపడే ఒక కొత్త పద్ధతి మనకు బాగా అలవాటయ్యింది. ఉప్పిడి ఉపవాసం అని ఒక విధానం ఉంది. బియ్యపు రవ్వని ఉప్పు లేకుండా ఉడికించి, తాలింపు పెట్టుకొని తింటే, శరీరాన్ని శుష్కింప చేసుకోవటానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. . అలాంటివేమీ ఇప్పటి తరానికి తెలియవు. డైటింగు అంటే బట్టర్ నాను, నూనెలు కక్కే మషాలాలు మండే కర్రీలతో తినటం అనే సాంప్రదాయం వచ్చేసింది. మనకు నోరుతిరగని పేర్లు పెట్టి, చం చం, జంజం అనే సరికి మనం ఒళ్ళు మరిచి తినేస్తున్నాం. టిఫిన్లు ఇలా మనల్ని నానారకాలుగా భ్రష్టు పట్టించాయి. టిఫిన్లుగా మనం తినేవన్నీ మన పూర్వకాలం వంటలే...కానీ, వాటిని వండే తీరులోనూ, తినే తీరులోనూ ఈ భ్రష్టత్వం కనిపిస్తోంది. ఇదే ఆరోగ్య స్పృహ అని చాలా మంది నమ్మకం.


కొలిచి చూస్తే, అన్నం కన్నా టిఫిన్ల ద్వారా ఎక్కువ కేలరీలు, ఎక్కువ కొవ్వు, ఎక్కువ విషపదార్ధాలు, ఎక్కువ రంగులు, ఎక్కువ మషాలాలు మన కడుపులోకి వెడుతున్నాయి.  తాజాగా పీజాలు, బర్గర్లు కూడా ఈ టిఫిన్ల జాబితాలో చేరాయి. ఈ పరిస్థితి ఎలా ఉందంటే, టిఫిన్ ప్రధాన ఆహారం అయి,  డైటింగ్ చేయటం కోసం అన్నం తినాల్సి వచ్చేలా ఉంది! నా భయం ఏమంటే, భగవంతుడికి మహా నివేదన కూడా మన తరానికి పీజ్జాలు, బర్గర్లు, చైనా నూడిల్స్ మహానివేదన పెట్టడం మొదలెడితే, కొన్నాళ్ళకు దేవుడు కమ్మని తిండికి మొహవాచి పొతాడేమోనని!!