Sunday 8 November 2015

నీటి దొంగలు :: డా. జి వి పూర్ణచందు

విశాలాంధ్ర నవంబరు 8 ఆదివారం సంచికలో నేను నిర్వహిస్తున్న పద్యానుభవం శీర్షికలో ప్రచురితమైన నా రచన.
నీటి దొంగలు
డా. జి వి పూర్ణచందు
“గంగా సంగమమిచ్చగించునె? మదిన్ గావేరి దేవేరిగా/నంగీకారమొనర్చునే? యమునతోనానందముం బొందునే?
రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు నీ/ యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ…!”
గంగ, యమున కలిసే ఒకేసారి సముద్రుడితో సంగమిస్తాయి. అదొక ఆనందం సాగరుడికి! తుంగభద్రానదికి సాగర సంగమం లేదు. ఆ నది కన్యగా ఉండి పోక తప్పలేదు. అందుకని తెనాలి రామకృష్ణుడు ఆ నదిని ఓదార్చటం ఈ పద్యంలో కనిపిస్తుంది. “గుణభద్రా… తుంగభద్రా… ఎగిరిపడే అలల హస్తాలతో ఆ రత్నాకరుడైన సముద్రుడు నిన్ను తాకి సుఖించి ఉంటే గంగా సంగమాన్ని ఇష్టపడే వాడా? కావేరిని దేవేరిగా అంగీకరించేవాడా? యమునతో ఆనందం పొందేవాడా? మిగతా నదుల జోలికి పోయేవాడా…?” అంటాడు. తెనాలివాడి అందమైన ఊహలో సముద్రం, నదీ సంగమాలు ఆ రెండింటికీ క్షేమ దాయకం అనే సందేశం ఉంది. నదులకు సాగరుడే గతి అని మనం నమ్ముతున్నాం. గట్టిగా ఆలోచిస్తే, సాగరుడిక్కూడా నదులే గతి అని అర్ధం అవుతుంది. తుంగభద్రకి ఒకటే బాధ... సాగరసంగమానికి నోచుకో లేకపోతినే... అని! తెలుగు సముద్రానికీ అలాంటి బాధే ఉంది… తుంగభద్రా సమేతంగా కృష్ణానదీ సంగమమే కరువై పోయిందని!
నిజానికి, సాగరసంగమ భాగ్యం లేని తుంగభద్రని కృష్ణానది హత్తుకుంది, ఓదార్చింది. ఆదరించింది. తనలోనే లీనం చేసుకుని తనతో కలుపుకు పోతానని మాట ఇచ్చింది! వేలాది యేళ్ళుగా కృష్ణా, తుంగభద్ర స్నేహం భద్రంగానే సాగుతోంది.
లోకం అంతా తుంగభద్రని కృష్ణకు ఉపనదిగానే భావిస్తున్నారు. ప్రయాగలో గంగా-యమునల్లాగా సంగమేశ్వరంలో కృష్ణ-తుంగభద్ర నదుల విలీన స్థలి పుణ్యక్షేత్రంగా భాసిల్లింది. ఒకప్పుడు ఆంధ్రలో నదుల్ని జీవనదులనే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక్కడ పంటలేకాదు, నదులు కూడా వర్షాధారాలై పోయాయి. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్న, నాగావళి, వంశధార... అన్నింటి పరిస్థితీ అదే! వేసవిలో అ నదుల్ని చూస్తే అవి మాజీ నదులా అనిపిస్తున్నాయిప్పుడు.
పూణే, సతారా, కోల్హాపూర్, హైదరాబాద్ నగరాల మురికినంతా మోసుకుని కృష్ణమ్మ కర్నూలుదాకా వస్తోంది. ఇక్కడ తుంగభద్ర తో కలిసినందువలన దాని లోని విషాలు కొంత పలచబడతాయి. నదులనేవి పైన వాళ్ళ మురికిని మోయటానికే గానీ, దిగువ భూముల దాహార్తి తీర్చటానికి కాదని పైన రాష్ట్రాలవారి నిశ్చితాభిప్రాయం. వరదలొచ్చినా, ఉప్పెన లొచ్చినా, కరువు లొచ్చినా అన్నీ దిగువ భూములకే అయినా నీటి దొంగలకేం జాలి?
ఋగ్వేదంలో వృత్రాసురుడి కథ ఉంది. వాడు కూడా పల్లపు భూములకు దక్కాల్సిన నీటిని ఇలానే బంధిస్తాడు. ఇది అంతర్జాతీయ నీటి సూత్రానికి విరుద్ధం అని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించి వృత్రాసురుడు కట్టిన ఆనకట్ట కూలగొట్టి నీటి బంధనాన్ని వదిలించాడు. వేదం మనకు సర్వప్రమాణం కదా! మరి, వృత్రాసురుడి కథ ఎందుకు కాదూ...?
క్రీ.శ. 1700 ప్రాంతాల్లో కావచ్చు. అప్పటి మైసూరు రాజు, బృందావన్ గార్డెన్స్ దగ్గర చామరాజ సాగర్ ప్రాజెక్టు ఉన్న చోట కావేరి మీద ఇలానే ఆనకట్ట కట్టి ఆ నదీజలాలను బంధించాలని చూశాడు. అందువలన తంజావూరు, మధిర రాజ్యాలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అప్పట్లో మధురా రాజ్యాన్ని తెలుగు రాణి మంగమ్మగారు పరిపాలిస్తూ ఉండేది. ఆవిడ తన సైన్యంతో మైసూరు రాజు కట్టిన ఆనకట్టను కూలగొట్టటానికి బయల్దేరింది. కానీ భయంకరమైన ఉప్పెన వచ్చి మంగమ్మ గారు పగలగొట్టకుండానే మైసూరు ఆనకట్ట పగిలిపోయింది. ఇంద్రుడి వజ్రాయుధ ప్రయోగం అంటే ఇదే! ఆలమట్టికీ ఏదో ఒక రోజు వజ్రాయుధ ఘాతం తప్పదు. అందాకా కృష్ణా తుంగభద్రలు ఒకరినొకరు ఓదార్చుకోవలసిందే!
ఒకరోజు తుంగభద్ర కృష్ణతో అంది... “అక్కా! నీలో లీనం అయిపోయి, నీ ద్వారా సాగర సంగమ భాగ్యం పొందుదా మనుకుంటే, ఇదేంటి ఇలా అయ్యిందీ... నీక్కూడా సముద్రంలోకి వెళ్ళే ప్రాప్తం లేకుండా పోతోంది కదా...” అని!
అప్పుడు కృష్ణా నది అంది... “చెల్లీ! నీకు లేకా, నాకు ఉండీ ఒకటే అయ్యింది! ఈ మనుషులు సముద్రంలోకి నదీ జలాలు వెళ్ళడం వృధా అనుకుంటున్నారు. నదులు కలవకపోతే సాగరుడు కూడా మరణిస్తాడు. చచ్చిన సముద్రాలెన్నో ఉన్నాయి. నదుల్ని ఎండగడితే సముద్రాలు ఎండిపోతాయి” అని.
“పూణే నుండి హైదరాబాద్ దాకా ఈ నగరాలన్నింటి మురికిని ఆంధ్రులు భరించాల్సిందేనా” అడిగింది తుంగభద్ర.
“హైదరాబాద్ మురుగు కలవకుండా మా స్వఛ్ఛ కృష్ణాజలాలు మాకు కావాలి...” అని ఆంధ్రులడగాలి కదా...” అంది కృష్ణ. తుంగభద్ర నవ్వి ఊరుకుంది.