Sunday 29 November 2015

ప్రాచీన విఙ్ఞాన ప్రగతి :: డా. జి వి పూర్ణచందు

ప్రాచీన విఙ్ఞాన ప్రగతి


డా. జి వి పూర్ణచందు


“మాననీయానంత మణికాంత ధామమై ఇది హిమానీ వేళనింపు నింపు
శోణ ప్రవాళ మంజులతా నిశాంతమై యలరించు నిది వసంతాగమమున
దరళ ముక్తాదీప్తి ధారాధి వాసమై వేసవి నిది మహోల్లాస మొసగు
బ్రబల వజ్రోపల ప్రాసాద భాసమై తొలకరి నిది కుతూహలము నిలుపు
జనవరోత్తమ! ఇది సర్వ సమయ సౌఖ్య జనక మిందలి యాలేఖ్య సాధ్య సిద్ధ
కిన్నరాంగన లవిగీత నృత్య వాద్యములు సూపి నిలుతురు వలయునెడల”
ఇది రామరాజ భూషణుడి ‘‘వసుచరిత్రం”లో పద్యం. ఇంద్రుడు వసురాజుకి ఓ విమానం బహూకరించి, దాని వివరాలు చెప్పే సందర్భంలోది. “ఓ జనవరోత్తమా! ఈ విమానం హిమానీ వేళ (శీతాకాలం, శిశిర ఋతువులో) సూర్యుడి మనోహరమైన కాంతిధామంలా నీకు వెచ్చని సుఖాన్నిస్తుంది. వసంతాగమ కాలంలో ఎర్రని చిగుళ్ళతో సొగసైన పొదరిల్లు లాగా మనోహరంగా నిన్ను సంతోష పెడుతుంది. గ్రీష్మంలో మంచి ముత్యాల కాంతి ధారల్లాంటి జల ధారల్లా నీకు ఉత్సాహాన్నిస్తుంది. వానాకాలంలో వజ్రం లాంటి దృఢమైన మేడలా అలరిస్తుంది. తక్కిన ఋతువుల్లో కూడా తగ్గట్టుగా నీకు సౌఖ్యాన్నిస్తుంది. ఈ విమానంలో బొమ్మల్లా కనిపించే సిద్ధ, సాధ్య కిన్నర స్త్రీలు నీక్కావలసిన సమయంలో ప్రత్యక్షమై నిన్ను అలరిస్తారు” ఇలా వివరిస్తాడు. వేడి, చలి, వాన తెలీకుండా సమశీతల ఎయిర్ కండీషనింగ్, ఎయిర్ హోష్టెస్సుల సౌకర్యం ఉండే విమాన వర్ణన ఇందులో కన్పిస్తుంది. ఇవి కవుల ఉబుసు పోని స్వకపోల కల్పనలే కావచ్చు. కానీ, ఈ కల్పనల క్కూడా కొంత ఆధారం ఉంది:
అశోకుడు తన కాలం నాటి 9 మంది ప్రసిద్ధ శాస్త్రవేత్తల బృందంతో ఒక సంఘాన్ని నియమించాడట. ప్రాచీన అద్భుత శాస్త్రీయ విషయాలు, అతీంద్రియ శక్తులు, ఇతర మహత్తులతో కూడుకున్న శక్తిమంతమైన విషయాలను సమీకరించటం, వాటిని రహస్యంగా పదిలపరచటం ఈ శాస్త్రవేత్తల బాధ్యత. అవి దుష్టుల చేతులకు చేరకూడదనే రహస్యం పాటించాడు. వాటిలో ఎక్కువ భాగం యుద్ధ విద్యలే ఉన్నాయి. అహింసాయుతంగా రాజ్యాన్ని రక్షించటం, శత్రువుల పైన విజయాలు సాధించటానికీ వీటిని వాడటం ఆయన ఉద్ధేశం. అందులో ‘భూమ్యాకర్షణ శక్తి రహస్యాలు’ అనే పుస్తకం కూడా ఉన్నదని, అది టిబెట్టు లేదా ఉత్తర అమెరికాలో ఎక్కడో భద్రంగా ఉండి ఉంటుందనీ ఒక కథ ప్రచారంలో ఉంది. అలాంటి శక్తిమంతమైన ఆయుధాలు నాజీ ల్లాంటి వాళ్ళ చేతుల్లో పడి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం జరక్కుండానే భూమండలం ధ్వంసం అయ్యుండేది. లెహసా‘(టిబెట్)లో ఇటీవల చైనా వాళ్లకి కొన్ని సంస్కృత గ్రంథాలు దొరికాయి. చండీఘర్ విశ్వవిద్యాలయంలో డా. రూత్ రేనా గారితో అనువదింప చేస్తున్నారు. అందులో అంతరిక్ష నౌకలు, విమానాలు రాకెట్ లాంచర్ల లాంటి అస్త్రాల సమాచారం ఉందని చెప్తున్నారు.
క్రీ.పూ. 4వ శతాబ్ది నాటి భరధ్వాజ మహర్షి రచించిన వైమానిక శాస్త్రం గ్రంథానికి జి ఆర్ జోశ్యర్ (మైసూరు) ఇంగ్లీషు అనువాదం కూడా వెలువడింది. కంబస్టన్ ఇంజిన్లు, పల్స్ జెట్ ఇంజిన్ల లాంటి యంత్రాల ప్రస్తావన కూడా వీటిలో ఉందిట. రామాయణం, భారతాల్లో అణుయుద్ధాలను మరిపించే యుద్ధ వర్ణనలు చదువుతుంటే డిటెక్టివ్ కథల్లో అద్భుత ఊహల్లా అనిపిస్తాయి. కానీ, సాహిత్యాధారాలు ఉన్నాయని అర్ధం అవుతోంది. మొహెంజోదారోలో ఒక చోట రాచవీధుల్లో కొన్ని అస్థిపంజరాలు పడి ఉండటాన్ని గుర్తించారు. ఇవి ఒకదాని చెయ్యి ఇంకొకటి పుచ్చుకున్నట్టుగా ఉన్నాయని, హీరోషిమా, నాగసాకీ లాంటి అణుప్రమాదం లాంటిది ఏదో సంభవించి నప్పుడు వీధుల్లో జనం పరుగులు తీసిన దృశ్యాన్ని తలపిస్తోం దన్నారు చరిత్రకారులు.
దక్షిణాదిలో డెక్కన్ పీఠభూమి పైన సింధు నాగరికతకు సమాంతరంగా వర్ధిల్లిన కృష్ణా గోదావరీ, కావేరీ నదుల నాగరికత గురించి చరిత్రకారులు అశ్రద్ధ చేయటం, సింధు నాగరకత నిర్మాతల గురించి, ఆ నగరాల పతనానికి గల కారణాల గురించీ విశ్లేషణ లేకపోవటం...మొత్తం మీద మనం అసమగ్రమైన చరిత్ర మీదే ఆధారపడ్తున్నాం అనేది నిజం.
దండకారణ్యంలో ఉక్కుతో చేసిన పరికరాలు, ఆయుధ కర్మాగారాలు ఉండేవి కనకనే రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడు వెంటబెట్టుకుని ఇక్కడకు వచ్చి, వాళ్ళ శరీరానికి తగ్గ కొలతల్లో ఆయుధాలు తయారు చేయించి ఇప్పించాడు. లోహయుగంగా పిలిచే ఆ కొత్త రాతియుగంలో తెలుగునేలపైన ఉక్కుశస్త్రాలతో పాటు అస్త్రాలు కూడా తయారు చేశారేమో పరిశోధకులు తేల్చాలి.
అన్నీ వేదాల్లోనే ఉన్నాయనే భావన ఎంత చాందసమో, ప్రాచీనకాలంలో వైఙ్ఞానిక ప్రగతి లేదనటమూ అంతే చాందసం. పరిశీశీలిస్తే కదా నిజనిజాలు బయట పడేది!