Monday 18 April 2022

వీరేశలింగం జాతీయతావాదం డా|| జి. వి. పూర్ణచందు 9440172642

 

వీరేశలింగం జాతీయతావాదం

డా|| జి. వి. పూర్ణచందు

9440172642          

          కందుకూరి వీరేశలింగం (1848-1919) ఆధునిక తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవ శకానికి ఆద్యులు. 1907 బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు బెంగాళీల తరువాత మొదటగా స్వాతంత్రోద్యమంలో తెలుగువారు దూకటానికి కావలసిన రంగాన్ని సిద్ధం చేసిపెట్టి, జాతిని సన్నద్ధం చేసిన వాడాయన!

దిట్టమైన శిల్పాలు దేవళాలు

కట్టుకథల చిత్రాంగి కనకమేడలు

కొట్టుకొనిపోయి ఉన్న కోటిలింగాలు

వీరేశలింగము ఒకడు మిగిలెను చాలుఅని జాతి ఆయన్ని ఘనంగా సంస్మరించుకుంది.

          జాతీయతాభావం అంటే సంస్కరణతో కూడిన బలమైన జాతి పునర్నిర్మాణం. భారత సంస్కరణోద్యమాల ఫలసిద్ధి అంతా ఏకమై. జాతీయోద్యమంగా ఆవిర్భవించిందిఅని భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు కాంగ్రెస్ చరిత్రలో వ్రాశారు. తెలుగువారికి సంబంధించినంత వరకూ జాతీయోద్యమ సౌధానికి కందుకూరివారి సంస్కరణోద్యమమే మూలస్తంభం. అంతటి సన్నద్ధత లేకుండానే, బిపిన్ చంద్రపాల్ రాత్రికి రాత్రే తెలుగు వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా మార్చేశా రనటం అర్థసత్యం. బిపిన్ చంద్రపాల్ సభకు విశాఖపట్టణం కన్నా కాకినాడలో, కాకినాడకన్నా రాజమహేంద్రవరంలో ఎక్కువ ప్రజలు వచ్చారు. రాజమహేంద్రవరంలో కందుకూరి సిద్ధపరచిన సాంస్కృతిక చైతన్యం అక్కడ జాతీయోద్యమభానుడు ప్రకాశించేలా చేసింది.

          చరిత్ర ఎప్పుడూ గెలిచినవాడి పక్షానే ఉంటుంది. ఎవరు ఎక్కువగా వార్తల్లో కనిపిస్తారో వారే విజేతలు. వారి చుట్టూనే చరిత్ర తిరుగుతుంది. తెలుగునాట ఒకనాడు కందుకూరి ఆరాధ్యుడు. బిపిన్ చంద్రపాల్ రాకతో కందుకూరి ప్రభ మసకబారింది. బిపిన్ చంద్ర ప్రభ కూడా ఎక్కువకాలం నిలవలేదు. 1921 స్వాతంత్రోద్యమ రంగస్థలిపైన గాంధీ పాత్ర రాగానే బిపిన్ కనుమరుగయ్యాడు. ఇప్పుడు ఆధునిక గాంధీలు వచ్చాక గాంధీ మహాత్ముడే కనుమరుగై పోయాడు. చరిత్ర ఎప్పటికప్పుడు వెలుగులో ఉన్నవాళ్ల చుట్టూరా తిరుగుతుంది. దానికి వర్తమానమే ప్రముఖం.

          సూర్యరశ్మిని స్వీకరించి ఆకులు పత్రహరితాన్ని తయారుచేసుకున్నట్టే సాంస్కృతిక చైతన్యాన్ని గ్రహించి, జాతి పునర్వికాసం పొందుతుంది. సాంస్కృతిక చైతన్యం అనేది సూర్యుడిలా ఒక తరగని ఇంధనం. రాజకీయ సామాజిక రంగాల్లో ప్రభవించే ఉద్యమా లన్నింటికీ ఈ సాంస్కృతిక చైతన్యమే ఆలంబన. సాంస్కృతిక చైతన్యం కొరవడిన ఉద్యమాలు ప్రజాహితాన్ని కోరేవిగా నిలబడలేవు.

సాంస్కృతికంగా ఆధునిక యుగం యూరపులో ‘రోజర్ బేకన్’తోనూ, భారతదేశంలో రాజా రామమోహన్ రాయ్ తోనూ ప్రారంభం కాగా, కందుకూరి తెలుగువారికి యుగకర్త. రాజా రామమోహన్ రాయ్ఈశ్వరచ౦ద్ర విద్యాసాగర్, బ౦కించ౦ద్ర చటర్జీలను కలగలిపి ఒక విగ్రహంగా పోతపోస్తే ఆ విగ్రహం కందుకూరి ఆకారంలో ఉంటుంది.

          “ఒకటి రెండు పుస్తకములు వ్రాయుటలో తప్ప నేను తలపెట్టిన కార్యములన్నియు నీశ్వరానుగ్రహము వలన నెరవేరినవి. ఇక నేనీ లోకములో నుండవలసిన ప్రయోజనమంతగా నా బుద్ధికి పొడగట్టదు. అని ఒక నిర్ణయానికి వచ్చినా, వీరేశలింగంగారు ఆ చివరి రోజుల్లో సంఘసంస్కరణతోపాటు భాషా సంస్కరణను కూడా చేపట్టి, వాడుక భాషా ఉద్యమానికి అండగా నిలిచారు. 1919- ఫిబ్రవరి తే 28 దిని రాజమహేందవరమునందు కీ.శే.రా.బ. కందుకూరి వీరేశలింగం పంతులుగారు అధ్యక్షులుగా, “వర్తమానాంద్ర భాషా ప్రవర్తక సమాజముస్థాపించుటకు ఏర్పాట్లు జరిగినవి; గాని పంతులుగారు మరి మూడు మాసములలోగానే పరమపదము పొందుట చేత, సమాజము ఉద్దేశించిన కార్యములు నెరవేరలేదు.అని, గద్య చింతామణి [1933]లో శ్రీ గిడుగు రామమూర్తి వ్రాశారు. చివరి వరకూ ఆయన భాష సంస్కృతుల సంస్కరణ కోసమే పాటుబడ్డారనటానికి ఇది సాక్ష్యం.

          తెలుగు సాహిత్యానికి వీరేశలింగం లాగానే, బంకించంద్ చటర్జీ ఆధునిక వంగసాహిత్యానికి ఆద్యుడు. గొప్ప దేశభక్తుడు. ఆనందమఠం నవలలో ఆయన వ్రాసిన వందేమాతరం గేయం ఆనాటి స్వాతంత్రోద్యమానికి ప్రాణం పోసింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆరంభమైన ఉద్యమాన్ని వందేమాతరం ఉద్యమంగా పిలుచుకున్నారు ప్రజలు. కానీ, బంకించంద్ర చటర్జీ కోరింది పూర్వ సాంఘిక వ్యవస్థ పునరుద్ధరణని మాత్రమే! దాని పునర్నిర్మాణాన్ని కాదు. వీరేశలింగం ఆ వ్యవస్తలో లోపాల్ని సంస్కరించి పూర్వ సాంఘిక వ్యవస్థ పునరుజ్జీవనం కొసం పాటుపడ్డాడు. బంకించందు రచనల్లోని భావపటిమ, శిల్చచాతుర్యాలతో పోలిస్తే వీరేశలింగం తక్కువగా కనపడవచ్చు. కానీ, బంకించందు ఒక భావావేశం కలిగిన సాహితీపరుడు మాత్రమే! వీరేశలింగం బహుముఖీనమైన ప్రతిభతో జనజాగృతి కోసం పాటుబడిన వ్యక్తి. అనేక నూతన సాహితీ ప్రక్రియలకు ఆరంభం పలికిన సృజనశీలి. తన రచనా కౌశల్యాన్ని ఒక మహోద్యమ నిర్వహణకు వజ్రాయుధంగా వినియోగించుకొన్న సంఘనాయకుడు. సంస్కర్త.

          “దీర్ఘకాలము నిద్రాణమైయున్న ఆంధ్రజాతి మేధాసంపత్తి, పునరుజ్జీవనము పొందుచున్న సంధికాలములో వివిధ దృక్పథముల, సంస్కృతుల, సాహిత్యముల సమన్వయ దృష్టితో చూడగల ప్రజ్ఞతో వీరేశలింగం పంతులుగా రుద్భవించిరి’ అనీ, “కందుకూరి వీరేశలింగం పంతులుగారు రంగమున అడుగు పెట్టినంతనే; మన సాహిత్యము పరిణామదశ నుండి ఒక్కసారి వికాస దశకు వచ్చెను.” అనీ “తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావం” గ్రంథంలో ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు వ్రాశారు.

          జాతీయోద్యమం అంటే కేవలం ఆనాటి కాంగ్రేస్ రాజకీయాల్లొ చేరటమే ననుకుంటే, వీరేశలింగం అలాంటి జాతీయవాది కాదు. తన జీవిత చరమాంకంలో “అస్మద్దేశీయులైన యాంధ్ర మహాజనులారా! రాజమహేంద్రపుర వాస్తవ్యులగు భ్రాతృవరులారా! నా కడపటి దైన చిన్న విన్నపము నొకదానిని మీకు చేయుచున్నాను... ధార్మిక సాంఘికాభివృద్ధి ప్రయత్నము నుపేక్షించి యొక్క రాజ్యాంగ స్వాతంత్రాభివృద్ధిని గూర్చియే యుద్యమించుట సంపూర్ణ సుఖసాధకము కాజాలదు” అని నొక్కి చెప్పారు. రాజకీయ స్వాతంత్ర్యం ఒక్కటే ఉంటే ఇంట్లో ఆడపిల్లలు చదువు లేక వితంతువులుగా తిరగటం సుఖకరం కాదు కదా! అలాగని రాజకీయ స్వాతంత్ర్యం లేకుండా కట్టు బానిసల్లా జాతి పడి ఉండలేదు కదా... కాబట్టి, ఇంటాబయట కూడా సుఖశాంతులు సమానంగా ఉండేలా చూసుకోవా లన్నారు. “నిజమైన దేశక్షేమము నపేక్షించిన పక్షమున దేనిని నుపేక్షింపక సమస్త స్వాతంత్ర్యముల నిమిత్తమును సమస్తాభివృద్ధుల నిమిత్తమును సమానముగ కృషి జేయుడు. అప్పుడు మీరు మీ దేశమును సౌఖ్యవంతముగాను, సంతోషవంతముగాను నభ్యుదయవంతముగాను జేయగలుగుదురు” అని వేడుకున్నారు. ఒక విధంగా ఇది వీరేశలింగం గారి ఆఖరి కోరిక. బలమైన సామాజిక వ్యవస్థ ఉన్నప్పుడే జాతి స్వాతంత్ర్యానికి సార్థకత ఏర్పడుతుందనేది కందుకూరి జాతీయతావాదం.

          గాంధీజీ కూడా సంఘసంస్కరణ లేని స్వాతంత్ర్యం వ్యర్థం అనే భావించాడు. కానీ, మన రాజకీయనాయకులు, ఈనాడే కాదు, ఆనాడూ అత్యుత్సాహపరులే! చాలామంది రాజకీయవేత్తలకు తమ వలనే ఈ భూగోళం మనగడలో ఉందని మితిమీరిన నమ్మకం. వారి మాట చేత అలానే ఉంటాయి. 1935లో వివిధ ప్రావిన్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వా లేర్పడినప్పుడు సంస్కరణల మీద మొదట దృష్టి పెట్టవలసిందిగా గాంధీజీ సూచించాడు. కానీ, సంస్కరణలు, సత్యవాదాలు, అహింసా సూత్రాలు స్వాతంత్ర్యాన్ని తెస్తాయనే నమ్మకం ఆనాటి రాజకీయనాయకుల్లో మనస్ఫూర్తిగా ఉందనేది నిజంగా అనుమానమే! ఆయన మాటలు పెడచెవుల్లోక్కూడా దూరలేదు. చౌరీచౌరా అలజడుల తర్వాత గాంధీ, సత్యాగ్రహాన్ని ఆపుచేసి సంస్కరణలపైన దృష్టిపెట్టినప్పుడు ఆయన్ని కేవలం ఒక సంస్కర్తగానే బావించారు చాలామంది. భరతమాతకు దాశ్య శృంఖలాలు కేవలం బ్రిటిష్ వలసపాలకుల వలన మాత్రమే కాదని, జాతీయతని మరిచి, మనల్ని మనం సంస్కరించుకోకుండా జీవించటం కూడా దాస్యమే నన్నారు గాంధీ.        స్వతంత్రోద్యమానికి సంఘసంస్కరణ ఒక ప్రధాన ఆయుధం అనీ, రాజకీయాల పేరుతో సంస్కరణల్ని అలక్ష్యం చేయవద్దని దేశప్రజలకు ఇటు వీరేశలింగంగారు, అటు గాంధీజీ ఒకే విఙ్ఞాపన చేశారు.

          జాతీయోద్యమం వలన సామాజికంగా వచ్చిన మార్పుల్ని వీరేశలింగంగారు స్వాగతించారు. “నాటికీ నేటికీ ఎంతమార్పు?” అని ఆయన ఆశ్చర్యపడ్డారు. కన్నులు తెరిచి, మాంద్యము మాని చురుకుదనము పూని దేశాభివృద్ధికరములైన నానాక్షేత్రముల యందు మహోత్సాహముతో కృషి చేయుచున్నందుకు నేనెంతయు సంతోష మొందుచున్నాను” అన్నారు. “అయినను, సాంఘిక సంస్కారాదులయందు మనవారికి మాటల్లో గల శూరత్వము కార్యములలో నింకను నేనభిలషించినంత కనబడుచుండలేదు” అని హెచ్చరించారు. రాజ్యాంగ సంస్కారాలకి మాటలెక్కువ, చేతలు తక్కువ కావాలి. కాని, సంస్కరణల విషయంలో అలా కాదు చేతలు ఎక్కువ కావాలి. అది ప్రస్తుతం కనబడట్లేదని భావించారు.

          కొత్త కెరటంలాగా వచ్చిన ఆనాటి వందేమాతరం ఉద్యమంలోకి తొలిగా దూకిన వారంతా వీరేశలింగంగారి శిష్యులే! ఛాందస వాదులు, గ్రాంథికవాదు లెవరూ ముందుగా ఈ ఉద్యమంలోకి రాలేదు. కానీ, ఉద్యమస్ఫూర్తితో వందేమాతరం ఉద్యమాన్ని స్వాగతించ వలసిన ఈ ఉద్యమకారులు తాము వీరేశలింగాన్ని వదిలి బిపిన్ చంద్రపాల్ వెంట నడుస్తున్నామనే భావనకు ఎందుకు లోనయ్యారో తెలీదు. వారిలో కొందరు అపోహలు, అపార్థాలు, అభాండాలతో వీరేశలింగంగారి మనసుని గాయపరిచి వెళ్లారు కూడా!         

          దిగవల్లి శివరావుగారు “వీరేశలింగం వెలుగు నీడలు” పుస్తకంలో వేమనను పొగడటానికి వీరేశలింగాన్ని తిట్టటం, వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రి  ఓ జేబు సైజు పుస్తకంలో వీరేశలింగం గారిని బృహస్పతి అని ఎద్దేవాచేస్తూ ఆయన గ్రంథ చౌర్యం చేశాడనటం, “వీరేశలింగంతో మధురవాణి” అనే వ్యంగ్యంతో పరోక్షంగా చీమకుర్తి శేషగిరిరావు ఆయన శీలంపై నీలాపనిందలు వేయటం లాంటి విషయాల్ని సమర్థవంతంగా తిప్పికొట్టి మంజుశ్రీ అక్కిరాజు రమాపతిరావు అనేక వాస్తవాలను వెల్లడించారు. “స్వర్గంలో వీరేశలింగం” అని ఎవరైనా రచన చేస్తే అబ్బెబ్బె వీరేశలింగానికి స్వర్గం ఏమిటీ? అని తగువుపెట్టుకున్నట్టుంది శ్రీ చీమకుర్తి శేషగిరిరావు మిసిమి పత్రికలో వ్రాసిన లేఖ” అని ఆక్షేపించారాయన. ఒక వ్యక్తి మరణించిన వందేళ్ళ తరువాత కూడా పాత అబద్ధాల్నే ప్రచారం చేసే విచిత్ర మనస్తత్వం తెలుగువారికి ఎక్కడిదో అర్థం కాదు.

          కందుకూరి ఒక సంస్కర్తగా బాల్యవివాహాల్ని వ్యతిరేకించారు, వృద్ధవివాహాల్ని నిరసించారు, కన్యాశుల్కాన్ని ఖండించారు, వరకట్నాల్ని చీదరించారు, వితంతువివాహాల్ని ప్రోత్సహించారు. స్త్రీలకు విద్య చెప్పించటం దోషం కాదని నచ్చచెప్పపటాని క్కూడా ఆయన శ్రమించవలసి వచ్చింది. వేదం వెంకటరాయశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం లాంటి సనాతనధర్మపరాయణులు ఆయన్ని వ్యతిరేకించి కత్తికట్టారు. ఈయన బ్రహ్మసామాజికుడు. జంధ్యం తీసేశాడు. విగ్రహారాధనని నిరశించాడు. ఇలాంటివి టంగుటూరి శ్రీరాముల్లాంటి వాళ్లకి గిట్టకపోవచ్చు. ఆ కాలం అలాంటిది. కాని, వీళ్లు తమ వ్యతిరేకతను ప్రకటించటానికి స్వంత పత్రికల్లో నీలివార్తలు సృష్టించటం, శీలహననానికి పాల్పడటం క్షంతవ్యం కాదు.

          స్త్రీలకు చదవటం వ్రాయటం వస్తే విటులకు ప్రేమలేఖలు రాస్తారని, భారత నారి శీలానికే ప్రమాదం రాగలదంటూ వీరేశలింగం మీద దాడి చేసినవారిని ఒక్క మాట కూడా అనకుండా మనతరం పండితులు కొందరు యంగ్ వర్జిన్ విడోల కోసం వెంపర్లాడే గిరీశంతో కందుకూరిని పోలుస్తూ, తమ వ్యంగ్య వచో వైభవాన్ని చాటుకోవటం వారిలోని జాతీయతాభావ లేమికి నిదర్శనం.

          జాతీయత అంటే సంస్కరణతో కూడిన స్వాతంత్ర్యం. విధవా పునర్వివాహ సమస్య ఇప్పుడు మనకి అంత లేకపోవచ్చు. కానీ, ఆహారం నుండి విహారం దాకా మనల్ని మనం సంస్కరించుకోవలసిన రంగాలు ఇంకా చాలా ఉన్నాయి. మేథావులు వాటి మీద దృష్టి సారిస్తే జాతీయత బలపడ్తుంది. జాతీయతాభావం అంటే సంస్కరణతో కూడిన బలమైన జాతి పునర్నిర్మాణం!!!

19/4.2022 ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)



 


Monday 11 April 2022

భీమపాకాలు డా|| జి వి ఫూర్ణచందు

 భీమపాకాలు డా|| జి వి ఫూర్ణచందు

చింపి వల్కము లేమి చేసెడిదన, కావు\నెరవైన కండ మండెగలు గాని
తెగిన జందెములేల తెచ్చెదరన, కావు\వినుడివి సన్న సేవియలు గాని
ఔదుంబరము లనర్హము లొల్ల మన, కావు\నమలిచూడుడు మోదకములు గాని
ఫేన పుంజము లేల పెట్టెదరన, కావు\నీ పాదమాన ఫేనికలు గాని
అంచు వాచంయములు పల్క అబ్జముఖులు/నగుచు ఒడబడి చెప్ప అందరు యథేష్ట
రుచులు భుజియించి, వార్చి కర్పూర వీటి/కా సుగంధ ప్రసూన సౌఖ్యములు దనిసి...
పిల్లలమర్రి పినవీరభద్రుడు క్రీ శ. 1450 తరువాతి వాడు. "వాణి నా రాణి' అనగలిగిన గొప్ప కవి. "శృంగార శాకుంతలం" , "జైమినీ భారతం" గ్రంధాలు వ్రాశాడు. జైమినీ భారతంలో తన కాలపు తెలుగు వంటకాల రుచిని ఈ పద్యంలో చవిచూపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు ఏర్పాటు చేసిన షడ్రోసోపేతవిందుకు భీముడు వంట-వడ్డన ఏర్పాట్లు చూస్తున్నాడు. ఆ విందుకు కొందరు మునులూ వచ్చారు. కందమూలామాత్రమే తినే ఆ మునులకు ఈ విందులో వడ్డించిన కమ్మని వంటకాలు అవేమిటో తెలియక తికమక పడుతుంటే, భీముడు వాటి గురించి వివరించి చెప్పటం దీని సందర్భం.
ఇవి గుడ్డపీలికలా?’, ‘జందెపు తునకలా’, ‘మేడిపండ్లా?’ ‘పాల నురుగా? ఇలా అడుగుతుంటే భీముడి వివరణ ఇది:
1. చింపి వల్కము లేమి చేసెడిదన, కావు నెరవైన కండ మండెగలు గాని: చింపిన నారబట్టలనుకోకండి, చక్కెరతో చేసిన మండెగలు
ఇవి అన్నాడు భీముడు. పరోటాలను అనేక మడతలు వేసి కాల్చి రెండు చేతుల్తో నొక్కితే గుడ్డపీలికలుగా అవుతాయి. ఇంగ్లీషువాళ్లు పరోటాల్ని ‘బుషప్ షర్ట్’ చిరిగిన చొక్కా అని పిలుస్తారందుకే! గుడ్డపీలికల్లా కనిపించిన ఈ తీపి మండెగలు కూడా అలాంటివే.
2. తెగిన జందెములేల తెచ్చెదరన, కావు నుడివి సన్న సేవియలు గాని: తెగిన జందెపు పోగులనుకోకండి, ఇవి గోధుమపిండితో
చేసిన సన్న సేవియలు అంటే సేమ్యా నూడుల్స్.
3. ఔదుంబరము లనర్హము లొల్ల మన, కావు నమలిచూడుడు మోదకములు గాని: ఇవి మేడికాయలు కాదు, లోపల తీపి పూర్ణం
పెట్టి చేసిన మోదకాలు. తిని చూడండి, కమ్మగా ఉంటాయి.
4. ఫేన పుంజము లేల పెట్టెదరన, కావు నీ పాదమాన ఫేనికలు గాని: దూదిపింజల్లా నురుగులుగా కనిపించే తీపిపదార్థాలివి. వీటిని
ఫేనికలు (తెలుగులో నురుగులు) అంటారు. మెత్తగా విసిరిన పంచదార పొడిని కరకర పూరీల పైన పట్టిస్తే అవి నురుగుల్లా కనిపిస్తాయి. ఫేనము అంటే నురుగు కాబట్టి వీటిని ఫేనిక లన్నారు.
ఇలా ఆ మహనీయులైన మునులకు వివరంగా భీముడు చెప్పి ఒప్పించాడు. అందరూ వాటిని కమ్మగా ఆరగించారు. ఆ
తరువాత పచ్చకర్పూరం వేసిన తాంబూలం కూడా సేవించారట.
500 యేళ్లనాటి తెలుగు ప్రజలు తీపి పరోటాలు, సేమ్యా నూడుల్సు లాంటి వంటకాలను తిన్నారని ఈ పద్యం సాక్ష్యం ఇస్తోంది. అవేవో పాశ్చాత్య సంస్కృతిలోంచో, చైనా నుంఛో, మొగలాయీల నుంచో మనకు వచ్చాయనే అభిప్రాయంలో వాటిని ఇష్టంగా తింటున్నా రిప్పటి యువత. కానీ, అది అపోహే! వాటిని తరతరాలుగా మన పూర్వులు తింటూ వచ్చారని ఈ పద్యం చెప్తోంది. ‘నురుగులు’ అనే వంటకాన్ని మనకన్నా కన్నడిగులు బాగా వండుకుంటున్నారు. ఒకప్పుడు అవి తెలుగువారి స్పెషల్. ఆవుపాలలో పంచదార వేసి గుజ్జుగా కాచిన క్రీముతో జమిలి మండిగలు అంటే బర్గర్ల మాదిరిగా చేసిన అప్పచ్చుల మీద డిజైను వేస్తే, పెళ్ళికూతురు కట్టిన తెల్ల చీర జరీ అంచులా ఉన్నదంటాడు శ్రీనాథుడు. ఇప్పుడు మనవాళ్లు కేకుల మీద క్రీముతో డిజైన్లు వేస్తున్నారు కదా!
మనకన్నా ఆరోగ్యదాయకంగానే జీవితాన్ని మన పూర్వులు ఆనందించారని దీని భావం..
‘భీమపాకాలు’ 10/4/2022 ఆదివారం ఆంధ్రజ్యోతిలొ తినరా! మైమరచి!! శీర్షికలో ప్రచురితం:
May be an image of flower and text
Sreekantha Sarma Palaparthi
1 Share
Like
Comment
Share

Monday 4 April 2022

తాంబూలం కథ-1

 తాంబూలం గురించి అచ్చులో ఒక వంద పేజీలు వచ్చే సమాచారంతో పుస్తకం వ్రాశాను. గతవారం నుండి జాగృతి వారపత్రికలో సీరియల్ గా ప్రారంభం అయ్యింది. మొదటి వారం ఇది. ప్రచురిస్తున్న సంపాదకులకు ధన్యవాదములు. మిత్రులు చదవటానికి వీలుగా pdf script కూడా పోస్ట్ చేస్తున్నాను:

ఆరోగ్యం::ఆనందం

తాంబూలం కథ

డా|| జి. వి. పూర్ణచందు

శ్రీలు పొంగిన జీవగడ్డకు రాగరంజిత సౌరభాలను అలదిన తాంబూలం భారతీయ సంస్కృతిలో శుభప్రదం, శోభస్కరం, ఆరోగ్యదాయకం కూడా!
“శిల వృక్ష లతల బుట్టిన చెలువలు తామువ్వురు గూడిన శుభలగ్నం తాంబూలం” శిల సంబంధిత సున్నం, వృక్ష సంబంధిత వక్క, లత సంబంధిత తమలపాకు మూడూ కలిసిన తాంబూలం శుభలగ్నమే!!
తాంబూలం వంటరిగా నడిచేవారికి తోడు. జంట కోరేవారికి ఆకర్షణ. కలిసి జీవించేవారికి అనుబంధం. చురుకైన వారికి ఉత్తేజం. ముఖానికి శోభ. ప్రతిభకు పట్టాభిషేకం. ఆదరణకు ఆర్ద్రతకు, సంఘీభావానికి, సానుభూతికి, నిజాయితీకి, ఒప్పందానికి, నిబద్ధతకు, శపథానికి ఒకటేమిటీ మనిషిలోని ఔన్నత్యాలన్నింటికీ తాంబూలం సంకేతం.
తాంబూలం అష్టభోగాల్లో ఒకటి. భోగం అంటే అధిక సుఖం. ఎనిమిది భోగాలు అంటే ఇల్లు, మెత్తటి పడక, చూడచక్కని బట్టలు, నగలు, మనసుకు నచ్చిన స్త్రీ, పూలు, గంధం, తాంబూలం ఇవీ అధిక సౌఖ్యాన్నిచ్చే సౌకర్యాలు. వీటిలో ఇల్లు, శయ్య, బట్టలు శరీరానికి సౌకర్యాలిస్తే, నగలు, స్త్రీ, పూలు, గంధం, తాంబూలం మనసుకు సుఖాన్నిస్తాయి. కానీ తాంబూలం ఉభయ సుఖప్రదాత. అంటే, శరీరం, మనసు రెండింటికీ సుఖానుభవాన్ని ఇస్తుంది.
మనసుతో అనుభవించే భోగం శాశ్వతమైనదిగా ఉంటే, అది యోగం. తాంబూలయోగం నిరతిశయానంద దాయకం. అది అశాశ్వత మైనదైతే అది భోగం. మరింత మితిమీరితే అదే రోగం. తాంబూలాన్ని యోగంగా మలచుకోవాలా? భోగంగా అనుభవించాలా? రోగంగా మార్చుకోవాలా? నిర్ణయం మనదే! యోగం వలన శరీరం, మనసు, ఆత్మ శక్తిమంత మౌతాయి. భోగం వలన శరీరం అలసి పోతుంది. రోగం వలన నశించిపోతుంది.
తాంబూలం అష్టమంగళాల్లో ఒకటి. పూలు, అక్షింతలు, పండ్లు, అద్దం, వస్త్రం, తమలపాకు, వక్క, దీపం, కుంకుమ ఈ ఎనిమిది హిందువులకు మంగళకరమైనవి. కలశపూజ, సంప్రోక్షణలు చేయటానికి తమలపాకునే వాడతారు. ఆకులు లేకుండా పూజ వ్యర్థమే!
పసుపు ముద్దని గణపతి లేదా గౌరీదేవిగా భావించి తమలపాకుపైనే ఉంచి పూజిస్తారు.
శివపార్వతులే స్వయంగా తమలపాకు తీగను హిమాలయాల్లో నాటారని పురాణాలు చెప్తున్నాయి. ఆ విధంగా తమలపాకులు అనురాగద్రవ్యంగా ప్రశస్తి పొందాయి! దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి మధ్య అనురాగం ఇనుమడిస్తుం దనేది అందుకే! తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు, మధ్యలో సరస్వతి, చివరలో మహాలక్ష్మీ ఉంటారట. తమలపాకు తొడిమ జ్యేష్టాదేవి నివాసం కాబట్టి తొడిమని తీసేస్తారు. వైష్ణవులు తమలపాకుని విష్ణునివాసం అంటారు, శైవులు తమలపాకు పైభాగాన శివుడు, ఎడమ వైపున పార్వతీమాత, కుడివైపున భూదేవీ ఉంటారనీ, సుబ్రహ్మణ్యస్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడనీ భావిస్తారు.
క్షీరసాగరమథనంలో వెలువడిన అద్భుత ద్రవ్యాలలో తమలపాకు ఒకటని స్కాందపురాణం చెప్తుంది. ఇది ఒక విధంగా సత్యమే! ‘శతారిత్రాం నావ’ (నూరుతెడ్లు కలిగిన నావ) గురించి ఋగ్వేదంలో ఉంది. సముద్రం గురించిన పరిఙ్ఞానం కలిగిన సముద్రీయుడని వరుణుణ్ణి కీర్తిస్తుంది ఋగ్వేదం. ప్రాచీనకాలంలో విదేశీ వర్తక వాణిజ్యాలన్నీ సముద్రమార్గానే (Maritime Trade) ఎక్కువగా జరిగాయి. ఓడలకు వుండే చక్రాలవంటి యంత్రాలు సముద్రాన్ని మధిస్తూ అలల్ని వెనక్కి నెట్టి నావను ముందుకు నడిపించేవి. సముద్రమథనం అంటే సముద్రయానమేనని చరిత్రకారులు భావిస్తారు. ఈ సముద్రయానం చేసినవారు ఎక్కువగా వాణిజ్య నిపుణులే! ఇక్కడి వస్తువుల్ని అక్కడకి, అక్కడి వస్తువుల్ని ఇక్కడికి తెచ్చేవారు. తమలపాకులు ఇలా ప్రాచీన జాతు లందరికీ తెలిశాయి. సముద్రమథన సమయంలో తమలపాకులు పుట్టాయనటం ఆంతర్యం ఇది కావచ్చు. దక్షిణాసియా దేశాలన్నీంటా అనాదిగా తమలపాకులు పెరిగాయి. కానీ, తమలపాకులతో తాంబూలాన్ని తయారుచేసి, దానికి సభాగౌరవం కల్పించిన ఘనత తెలుగువారిదే! కేవలం తమలపాకుల్ని తినటమే ధ్యేయం అయితే దాని గురించి చెప్పుకునే దేముందీ?
ఖండిత పూగీ నాగర/ఖండంబు ఘన శశాంక ఖండంబులచే/హిండితమగు తాంబూలము....గురించి ఆముక్తమాల్యద (5-93) లో రాయలవారు చక్కని వర్ణన చేశారు. వక్కపలుకులు, శొంఠిముక్క, పచ్చకర్పూలతో వ్యాప్తి నొందిన తాంబూలం అని దీని భావం. రాయల యుగానికి ‘తాంబూలయుగం” అనే ప్రశస్తి రావటానికి తాంబూలానికి వారిచ్చిన సభాగౌరవమే కారణం.
కాశ్మీరు నుండి కుంకుమపువ్వు, బెంగాల్ నుండి ఆకులు, హిమాలయాల నుండి సున్నం, ఈశాన్యరాష్ట్రాల నుండి వక్క, దక్షిణాది నుండి లవంగం, అజ్మీర్ నుండి గులకంద్, ఉత్తరప్రదేశ్ నుండి కాచు, కోనసీమ నుండి కొబ్బరి, ఇలా దేశవ్యాప్తంగా పండే అనేక సుగంధ ద్రవ్యాల సమాహారంగా తాంబూలం తయారౌతుంది. దేశ సమగ్రతకు తాంబూలం గౌరవప్రదమైన చిహ్నం.
“తెలివిచ్చు చాల ముత్తియపు సున్నంబు” ముత్యాల భస్మం వేసిన తాంబూలం మనిషికి మానసిక శక్తిని ఉత్తేజాన్నిస్తుంది. కర్పూరం లేకపోయినా తమలపాకులకు సహజమైన పరిమళం ఉంది. “ఒగరించుకయు లేక మిగులంగ తీపైన వక్కలు” దానికి తోడు. అందుకు “ఒర్రనై కమ్మవలచి దళమెక్కి పండిన తాంబూల దళములు” ఉండాలి. “కాలోపలంబులు కాల్చి వడియగట్టిన చూర్ణం” అంటే సున్నం ఉండాలి అని చారుచర్యలో భోజుడు చెపుతాడు. అల్లసాని పెద్దనగారు `కప్పుర విడెము’ లేకపోతే కవిత్వమే లేదన్నాడు.. విద్యుల్లతా విగ్రహం దగ్గరకు తీసుకు వెళ్లగలిగేది ‘వీటీగంథం’ మాత్రమే నన్నాడు. “కలిత ఘనసార ఘన సార గంధసార ఘుప్పణ మృగమదపంక సంకుమద ముఖ్య సముచిత వస్తుభాసుర” మైన తాంబూలం వేసుకుని శయనాగారం ప్రవేశించేవారు మగానుభావులు.
తాంబూలం-పుట్టుపూర్వోత్తరాలు
“తాంబూలం భారతీకథా ఇష్టాభార్యా, సుమిత్రాంచ అపూర్వాసు దినేదినే” అని పంచతంత్రంలో ఓ సూక్తి ఉంది! తాంబూలమూ, మహాభారతమూ, ఇష్టసఖి, మంచిమిత్రుడు ఈ నాలుగూ అపూర్వంగా అంటే, ఏరోజు కారోజు కొత్తవిగా అనిపిస్తాయి...అని! తాంబూలం పరిచితుల్ని సన్నిహితులుగా, సన్నిహితుల్ని ఆత్మీయ స్నేహితులుగా మారుస్తుంది. కలిపేదే కదా తాంబూలం!
శోభనం రాత్రి కార్యక్రమం జరిపించేప్పుడు “ఆరోహోరు ముపబర్హస్య బాహుం” మంత్రం చదివించి తాంబూలాన్ని నవదంపతులతో కొరికిస్తారు. చూసేవారికీ ఆనందమే! తాంబూలాన్నికలిపి, ఇద్దరూ కలిసి వేసుకోవాలి. అలాకాకుండా విడివిడిగా ఎవరాకులు వాళ్లు వేసుకుంటే అది విడి+ఆకుల కిందలెక్క.
కిళ్లీల కథ
మరుపూరి కోదందరామిరెడ్డిగారు “మాండలిక పదకోశము”లో ‘చిలక’ అనే పదానికి బీడా, కిళ్లీ అనే అర్ధాలిచ్చారు. చిలకలివ్వటం అంటే తాంబూలం చుట్టి ఇవ్వటం అని అన్వయార్థం! మిఠాయిపొట్లం ఆకారంలో తమలపాకులు చుట్టి వాటిని వేళ్లకు తొడుక్కొని ప్రియుడి నోటికి అందిస్తుంది ప్రియురాలు. దీన్ని చిలకలివ్వటం అంటారు. తమిళులకూ ఈ అలవాటుంది. సుగంధద్రవ్యాలూ, తీపి కలిపి మడత పెట్టిన చిలకని వాళ్లు తాంబూలం అంటారు. తమిళంలో చిలక (parrot)ని kiḷi (కిళి)లేదా kiḷḷai (కిళ్ళై) అంటారు అనేక ద్రావిడ భాషల్లో కూడా ‘కిళ్లై’ పదం చిలక అనే అర్థంలోనే ఉన్నట్టు DED(N)1318 చెప్తోంది. మద్రాసులో సినీపరిశ్రమ వ్రేళ్లూనుకోవటం, మద్రాసు అసెంబ్లీకి సామాన్యులక్కూడా ప్రాతినిధ్యం రావటం మొదలయ్యాక మద్రాసుకు జనం రాకపోకలు పెరిగి, 1920ల తరువాత ఈ ‘కిళ్లీ’ పదం తెలుగు నేలకు చేరి ఉండొచ్చు.
తాంబూల దుకాణాలు మనకి శ్రీనాథుడి కాలం నుంచే ఉన్నాయి. కిళ్లీకొట్టు అనే పేరు మాత్రం ఈ వందేళ్ల కాలంలోనే వ్యాప్తిలో కొచ్చింది. “బడ్డి” అనేది కూడా కిళ్లీకొట్టు అనే అర్ధంలోనే వాడకంలోకి వచ్చింది. అప్పటికప్పుడు నిర్మించగల చెక్కగది బడ్డి. ఇప్పటి రోజుల్లో కిళ్లీలు, సిగరెట్లు, ఫ్యాన్సీ, సెల్‘ఫోన్ సరంజామా సహా అన్నీ ఈ బడ్డీల్లో దొరుకుతున్నాయి.
May be an image of 1 person and text
నిమ్మనగోటి నరసింహ ప్రజాపతి, Madal Srinu and 3 others