Monday 4 April 2022

తాంబూలం కథ-1

 తాంబూలం గురించి అచ్చులో ఒక వంద పేజీలు వచ్చే సమాచారంతో పుస్తకం వ్రాశాను. గతవారం నుండి జాగృతి వారపత్రికలో సీరియల్ గా ప్రారంభం అయ్యింది. మొదటి వారం ఇది. ప్రచురిస్తున్న సంపాదకులకు ధన్యవాదములు. మిత్రులు చదవటానికి వీలుగా pdf script కూడా పోస్ట్ చేస్తున్నాను:

ఆరోగ్యం::ఆనందం

తాంబూలం కథ

డా|| జి. వి. పూర్ణచందు

శ్రీలు పొంగిన జీవగడ్డకు రాగరంజిత సౌరభాలను అలదిన తాంబూలం భారతీయ సంస్కృతిలో శుభప్రదం, శోభస్కరం, ఆరోగ్యదాయకం కూడా!
“శిల వృక్ష లతల బుట్టిన చెలువలు తామువ్వురు గూడిన శుభలగ్నం తాంబూలం” శిల సంబంధిత సున్నం, వృక్ష సంబంధిత వక్క, లత సంబంధిత తమలపాకు మూడూ కలిసిన తాంబూలం శుభలగ్నమే!!
తాంబూలం వంటరిగా నడిచేవారికి తోడు. జంట కోరేవారికి ఆకర్షణ. కలిసి జీవించేవారికి అనుబంధం. చురుకైన వారికి ఉత్తేజం. ముఖానికి శోభ. ప్రతిభకు పట్టాభిషేకం. ఆదరణకు ఆర్ద్రతకు, సంఘీభావానికి, సానుభూతికి, నిజాయితీకి, ఒప్పందానికి, నిబద్ధతకు, శపథానికి ఒకటేమిటీ మనిషిలోని ఔన్నత్యాలన్నింటికీ తాంబూలం సంకేతం.
తాంబూలం అష్టభోగాల్లో ఒకటి. భోగం అంటే అధిక సుఖం. ఎనిమిది భోగాలు అంటే ఇల్లు, మెత్తటి పడక, చూడచక్కని బట్టలు, నగలు, మనసుకు నచ్చిన స్త్రీ, పూలు, గంధం, తాంబూలం ఇవీ అధిక సౌఖ్యాన్నిచ్చే సౌకర్యాలు. వీటిలో ఇల్లు, శయ్య, బట్టలు శరీరానికి సౌకర్యాలిస్తే, నగలు, స్త్రీ, పూలు, గంధం, తాంబూలం మనసుకు సుఖాన్నిస్తాయి. కానీ తాంబూలం ఉభయ సుఖప్రదాత. అంటే, శరీరం, మనసు రెండింటికీ సుఖానుభవాన్ని ఇస్తుంది.
మనసుతో అనుభవించే భోగం శాశ్వతమైనదిగా ఉంటే, అది యోగం. తాంబూలయోగం నిరతిశయానంద దాయకం. అది అశాశ్వత మైనదైతే అది భోగం. మరింత మితిమీరితే అదే రోగం. తాంబూలాన్ని యోగంగా మలచుకోవాలా? భోగంగా అనుభవించాలా? రోగంగా మార్చుకోవాలా? నిర్ణయం మనదే! యోగం వలన శరీరం, మనసు, ఆత్మ శక్తిమంత మౌతాయి. భోగం వలన శరీరం అలసి పోతుంది. రోగం వలన నశించిపోతుంది.
తాంబూలం అష్టమంగళాల్లో ఒకటి. పూలు, అక్షింతలు, పండ్లు, అద్దం, వస్త్రం, తమలపాకు, వక్క, దీపం, కుంకుమ ఈ ఎనిమిది హిందువులకు మంగళకరమైనవి. కలశపూజ, సంప్రోక్షణలు చేయటానికి తమలపాకునే వాడతారు. ఆకులు లేకుండా పూజ వ్యర్థమే!
పసుపు ముద్దని గణపతి లేదా గౌరీదేవిగా భావించి తమలపాకుపైనే ఉంచి పూజిస్తారు.
శివపార్వతులే స్వయంగా తమలపాకు తీగను హిమాలయాల్లో నాటారని పురాణాలు చెప్తున్నాయి. ఆ విధంగా తమలపాకులు అనురాగద్రవ్యంగా ప్రశస్తి పొందాయి! దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి మధ్య అనురాగం ఇనుమడిస్తుం దనేది అందుకే! తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు, మధ్యలో సరస్వతి, చివరలో మహాలక్ష్మీ ఉంటారట. తమలపాకు తొడిమ జ్యేష్టాదేవి నివాసం కాబట్టి తొడిమని తీసేస్తారు. వైష్ణవులు తమలపాకుని విష్ణునివాసం అంటారు, శైవులు తమలపాకు పైభాగాన శివుడు, ఎడమ వైపున పార్వతీమాత, కుడివైపున భూదేవీ ఉంటారనీ, సుబ్రహ్మణ్యస్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడనీ భావిస్తారు.
క్షీరసాగరమథనంలో వెలువడిన అద్భుత ద్రవ్యాలలో తమలపాకు ఒకటని స్కాందపురాణం చెప్తుంది. ఇది ఒక విధంగా సత్యమే! ‘శతారిత్రాం నావ’ (నూరుతెడ్లు కలిగిన నావ) గురించి ఋగ్వేదంలో ఉంది. సముద్రం గురించిన పరిఙ్ఞానం కలిగిన సముద్రీయుడని వరుణుణ్ణి కీర్తిస్తుంది ఋగ్వేదం. ప్రాచీనకాలంలో విదేశీ వర్తక వాణిజ్యాలన్నీ సముద్రమార్గానే (Maritime Trade) ఎక్కువగా జరిగాయి. ఓడలకు వుండే చక్రాలవంటి యంత్రాలు సముద్రాన్ని మధిస్తూ అలల్ని వెనక్కి నెట్టి నావను ముందుకు నడిపించేవి. సముద్రమథనం అంటే సముద్రయానమేనని చరిత్రకారులు భావిస్తారు. ఈ సముద్రయానం చేసినవారు ఎక్కువగా వాణిజ్య నిపుణులే! ఇక్కడి వస్తువుల్ని అక్కడకి, అక్కడి వస్తువుల్ని ఇక్కడికి తెచ్చేవారు. తమలపాకులు ఇలా ప్రాచీన జాతు లందరికీ తెలిశాయి. సముద్రమథన సమయంలో తమలపాకులు పుట్టాయనటం ఆంతర్యం ఇది కావచ్చు. దక్షిణాసియా దేశాలన్నీంటా అనాదిగా తమలపాకులు పెరిగాయి. కానీ, తమలపాకులతో తాంబూలాన్ని తయారుచేసి, దానికి సభాగౌరవం కల్పించిన ఘనత తెలుగువారిదే! కేవలం తమలపాకుల్ని తినటమే ధ్యేయం అయితే దాని గురించి చెప్పుకునే దేముందీ?
ఖండిత పూగీ నాగర/ఖండంబు ఘన శశాంక ఖండంబులచే/హిండితమగు తాంబూలము....గురించి ఆముక్తమాల్యద (5-93) లో రాయలవారు చక్కని వర్ణన చేశారు. వక్కపలుకులు, శొంఠిముక్క, పచ్చకర్పూలతో వ్యాప్తి నొందిన తాంబూలం అని దీని భావం. రాయల యుగానికి ‘తాంబూలయుగం” అనే ప్రశస్తి రావటానికి తాంబూలానికి వారిచ్చిన సభాగౌరవమే కారణం.
కాశ్మీరు నుండి కుంకుమపువ్వు, బెంగాల్ నుండి ఆకులు, హిమాలయాల నుండి సున్నం, ఈశాన్యరాష్ట్రాల నుండి వక్క, దక్షిణాది నుండి లవంగం, అజ్మీర్ నుండి గులకంద్, ఉత్తరప్రదేశ్ నుండి కాచు, కోనసీమ నుండి కొబ్బరి, ఇలా దేశవ్యాప్తంగా పండే అనేక సుగంధ ద్రవ్యాల సమాహారంగా తాంబూలం తయారౌతుంది. దేశ సమగ్రతకు తాంబూలం గౌరవప్రదమైన చిహ్నం.
“తెలివిచ్చు చాల ముత్తియపు సున్నంబు” ముత్యాల భస్మం వేసిన తాంబూలం మనిషికి మానసిక శక్తిని ఉత్తేజాన్నిస్తుంది. కర్పూరం లేకపోయినా తమలపాకులకు సహజమైన పరిమళం ఉంది. “ఒగరించుకయు లేక మిగులంగ తీపైన వక్కలు” దానికి తోడు. అందుకు “ఒర్రనై కమ్మవలచి దళమెక్కి పండిన తాంబూల దళములు” ఉండాలి. “కాలోపలంబులు కాల్చి వడియగట్టిన చూర్ణం” అంటే సున్నం ఉండాలి అని చారుచర్యలో భోజుడు చెపుతాడు. అల్లసాని పెద్దనగారు `కప్పుర విడెము’ లేకపోతే కవిత్వమే లేదన్నాడు.. విద్యుల్లతా విగ్రహం దగ్గరకు తీసుకు వెళ్లగలిగేది ‘వీటీగంథం’ మాత్రమే నన్నాడు. “కలిత ఘనసార ఘన సార గంధసార ఘుప్పణ మృగమదపంక సంకుమద ముఖ్య సముచిత వస్తుభాసుర” మైన తాంబూలం వేసుకుని శయనాగారం ప్రవేశించేవారు మగానుభావులు.
తాంబూలం-పుట్టుపూర్వోత్తరాలు
“తాంబూలం భారతీకథా ఇష్టాభార్యా, సుమిత్రాంచ అపూర్వాసు దినేదినే” అని పంచతంత్రంలో ఓ సూక్తి ఉంది! తాంబూలమూ, మహాభారతమూ, ఇష్టసఖి, మంచిమిత్రుడు ఈ నాలుగూ అపూర్వంగా అంటే, ఏరోజు కారోజు కొత్తవిగా అనిపిస్తాయి...అని! తాంబూలం పరిచితుల్ని సన్నిహితులుగా, సన్నిహితుల్ని ఆత్మీయ స్నేహితులుగా మారుస్తుంది. కలిపేదే కదా తాంబూలం!
శోభనం రాత్రి కార్యక్రమం జరిపించేప్పుడు “ఆరోహోరు ముపబర్హస్య బాహుం” మంత్రం చదివించి తాంబూలాన్ని నవదంపతులతో కొరికిస్తారు. చూసేవారికీ ఆనందమే! తాంబూలాన్నికలిపి, ఇద్దరూ కలిసి వేసుకోవాలి. అలాకాకుండా విడివిడిగా ఎవరాకులు వాళ్లు వేసుకుంటే అది విడి+ఆకుల కిందలెక్క.
కిళ్లీల కథ
మరుపూరి కోదందరామిరెడ్డిగారు “మాండలిక పదకోశము”లో ‘చిలక’ అనే పదానికి బీడా, కిళ్లీ అనే అర్ధాలిచ్చారు. చిలకలివ్వటం అంటే తాంబూలం చుట్టి ఇవ్వటం అని అన్వయార్థం! మిఠాయిపొట్లం ఆకారంలో తమలపాకులు చుట్టి వాటిని వేళ్లకు తొడుక్కొని ప్రియుడి నోటికి అందిస్తుంది ప్రియురాలు. దీన్ని చిలకలివ్వటం అంటారు. తమిళులకూ ఈ అలవాటుంది. సుగంధద్రవ్యాలూ, తీపి కలిపి మడత పెట్టిన చిలకని వాళ్లు తాంబూలం అంటారు. తమిళంలో చిలక (parrot)ని kiḷi (కిళి)లేదా kiḷḷai (కిళ్ళై) అంటారు అనేక ద్రావిడ భాషల్లో కూడా ‘కిళ్లై’ పదం చిలక అనే అర్థంలోనే ఉన్నట్టు DED(N)1318 చెప్తోంది. మద్రాసులో సినీపరిశ్రమ వ్రేళ్లూనుకోవటం, మద్రాసు అసెంబ్లీకి సామాన్యులక్కూడా ప్రాతినిధ్యం రావటం మొదలయ్యాక మద్రాసుకు జనం రాకపోకలు పెరిగి, 1920ల తరువాత ఈ ‘కిళ్లీ’ పదం తెలుగు నేలకు చేరి ఉండొచ్చు.
తాంబూల దుకాణాలు మనకి శ్రీనాథుడి కాలం నుంచే ఉన్నాయి. కిళ్లీకొట్టు అనే పేరు మాత్రం ఈ వందేళ్ల కాలంలోనే వ్యాప్తిలో కొచ్చింది. “బడ్డి” అనేది కూడా కిళ్లీకొట్టు అనే అర్ధంలోనే వాడకంలోకి వచ్చింది. అప్పటికప్పుడు నిర్మించగల చెక్కగది బడ్డి. ఇప్పటి రోజుల్లో కిళ్లీలు, సిగరెట్లు, ఫ్యాన్సీ, సెల్‘ఫోన్ సరంజామా సహా అన్నీ ఈ బడ్డీల్లో దొరుకుతున్నాయి.
May be an image of 1 person and text
నిమ్మనగోటి నరసింహ ప్రజాపతి, Madal Srinu and 3 others