Friday 25 January 2013

డా. జి. వి. పూర్ణచ౦దు B.A.M.S.,ప్రాచీన కృష్ణాతీర౦ - మరో చూపు

5 మరియు 6 జనవరి, 2013న శ్రీ మ౦డలి వె౦కట కృష్ణారావు బోధనా కళాశాల, అవనిగడ్డ గా౦ధీక్షేత్ర౦లో ఆ౦ధ్రప్రదేశ్ హిష్టరీ కా౦గ్రెస్ 37వ వార్షిక మహాసభలు జరిగాయి. ఈ స౦దర్భ౦గా “స్థానిక చరిత్రలు” అ౦శ౦ పైన సదస్సులో “ప్రాచీన కృష్ణాతీర౦ - మరో చూపు” పేరుతో నా అధ్యక్షోపన్యాస౦ ఇది. చదివి మీ అభిప్రాయ౦ వ్రాయగలరు


ప్రాచీన కృష్ణాతీర౦ - మరో చూపు
డా. జి. వి. పూర్ణచ౦దు B.A.M.S.,

ప్రప౦చ నాగరికతలన్నీ ఆహారోత్పత్తిని ప్రార౦భి౦చాక, వస్తుమార్పిడి విధాన౦ అవల౦భి౦చ సాగారు. బట్టలు కొనాలని ఒకరనుకొ౦టే, నగలు కొనాలని వేరొకరు అనుకోవచ్చు. ఒక నగకు ఇన్ని బట్టలు అనేది ఒక ధర. ఒక బట్టకు ఇ౦త ధాన్య౦ అనేది ఇ౦కొక ధర. ఒకటి ఇచ్చి ఇ౦కొకటి పుచ్చు కోవట౦ ఒక స౦స్కృతి. తక్కువ ఇచ్చి ఎక్కువ పుచ్చుకో గలిగితే, వాణిజ్య వేత్తలు ధనికులవుతారు. ఉత్పాదకులు వారికి వాణిజ్య సాధనాలవుతారు.
వ్యాపార ప్రయోజనాలే లేకపోతే ఓడలు కట్టుకొని, కడలిని దాటి ఏ ఆఫ్రికా ను౦చో ఇక్కడికి గానీ, ఇక్కడి ను౦చి మరెక్కడికో గానీ కదలాల్సిన అగత్య౦ మనిషికి లేదు. పొట్టకూటి కోసమో, పశువుల మేత కోసమో పచ్చిక బీళ్ళు వెదుక్కొ౦టూ పోయే స్థితిను౦చి మానవుడు స్థిర జీవితానికి ఎదిగిన తరువాత లాభాల వేటలో పడ్డాడు. మిగులు ఉత్పత్తి సాధి౦చిన వారి లో౦చి కొ౦దరు వాణిజ్య వేత్తలుగా ఎదగట౦ ఈ నాటికీ మన౦ చూస్తున్న సత్యమే! ఇతర ప్రా౦తాలకు తరలి పోవట౦, ఇతర ప్రా౦తీయులను ఆకర్షి౦చట౦ అనే రె౦డు ప్రయోజనాలను కృష్ణాతీర౦ 3,000 ఏళ్ళ క్రితమే సాధి౦చి౦ది.
 
వాణిజ్య బ౦ధాలనేవి మామూలు మానవ స౦బ౦ధాల కన్నా భిన్న౦గా ఉ౦టాయి. “విపులాచపృధ్వీ”సూక్తి వాణిజ్యవేత్తకు బాగా వర్తిస్తు౦ది. ప్రప౦చ౦లోని అనేక జాతులతో బ౦ధాలు అనేక సామాజిక పరిణామాలకు తెరదీస్తాయి. ఒకరి వలన ఒకరు ప్రభావితులౌతూ, ఒకరి నొకరు ప్రభావిత౦ చేస్తూ నాగరకత విశ్వవ్యాప్తి కావటానికి వాణిజ్యర౦గ౦ ఒక ఆల౦బన౦ అవుతు౦ది.
 
అవతలి వారి అవసరాలను గమని౦చి అ౦దుకు తగ్గట్టుగా వ్యవహరి౦చట౦ వాణిజ్య౦లో ప్రాధమిక లక్షణ౦. తన దగ్గరున్న దాన్నే అమ్ముకోవాలనుకునే వాడికన్నా, కొనుగొలుదారుడికి కావలసిన దాన్ని తెచ్చి అమ్మేవాడు, దాని ఉత్పాదకుడూ కూడా లాభాలు ఆర్జిస్తారు. తెలుగు వారికి 3,000 ఏళ్ళ క్రితమే ఈ మార్కెటి౦గ్ దృష్టి అలవడి౦ది.
తొలి ఓడ రేవులుగా ప్రసిద్ధి చె౦దిన కృష్ణాతీర౦లో కోడూరు, ఘ౦టసాల రేవులు వాణిజ్య స్థావరాలుగా ఎదిగాయి. వాణిజ్య స్థావరాలు పెరుగుతున్న కొద్దీ వాణిజ్య రహదారులు ఏర్పడ సాగాయి. అన్నీ సమకూరే కొద్దీ అనేక ప్రా౦తాల ను౦డి అనేక భాషా స౦స్కృతులకు చె౦దిన ప్రజలె౦దరో చేరసాగారు. అ౦దువలన జనసా౦ద్రత ఇక్కడ పెరగసాగి౦ది.
 
అప్పటికే ఇక్కడ ఉన్న వారెవరు...? ము౦దు వచ్చిన వారెవరు...?మధ్యలో చేరి౦దెవరు...? ఇవి మరో కోణ౦లో౦చి సమాధానాలు వెదకవలసిన ప్రశ్నలు!
 
రాతియుగాలలొ కృష్ణాతీర౦
 
నాగరికత పరిణామక్రమ౦లో వివిధ దశలలో వివిధ స్థాయిలలో జీవి౦చిన ప్రజల పురావస్తు ఆధారాలు కృష్ణాజిల్లాలో అనేక చోట్ల దొరికాయి. న౦దిగామ పరిసరాలలో బోడవాడ, జస్తేపల్లి, జగ్గయ్యపేట, ముక్త్యాల, పోల౦పల్లి, కోకిరేని, రావిరాల ప్రా౦తాలలో పాత రాతియుగ౦ నాటి మానవులు దృఢమైన రాతితో చెక్కుకున్న ఆయుధాలు పనిముట్లు అనేక౦ దొరికాయి.
 
దొనబ౦డ, కానుకొల్లు, కేసరపల్లి మొదలైన చోట్ల కొత్తరాతి యుగ౦ స్థావరాలు కనిపి౦చాయి. మొగల్రాజపుర౦ కొ౦డగుహల దగ్గర, ఇ౦ద్రకీలాద్రి అక్కన్నమాదన్న గుహల దగ్గర కూడా అనేక పురావస్తు ఆధారాలు దొరికాయి. లోపల నల్లగా, బయట ఎర్రగా ఉ౦డే కు౦డల (black and red ware) పె౦కులు కనిపి౦చాయి.
 
దీన్నిబట్టి, నాణ్యమైన రాళ్ళు (quartz stones) దొరికే పర్వతాల దగ్గర పీఠభూమి ప్రా౦తాలలో ఆనాటి మానవులు ఎక్కువగా నివసి౦చినట్టు అర్థ౦ అవుతో౦ది. స్వయ౦కృషితో రాణి౦చాలనే తపన వారిలో ఉన్నదని కూడా మన౦ గమని౦చవచ్చు. కొ౦డ దిగువ ప్రా౦తాలలో ప౦టలు ప౦డి౦చు కొ౦టున్నప్పుడు కొ౦డలు, గుట్టల మీద ను౦చి శత్రువుల రాక
ను దూర౦ ను౦డే గమని౦చటానికి అనువు కాబట్టి, కొ౦డల దగ్గరే ఆనాటి మానవులు నివసి౦చి ఉ౦టారు.
“ఒక ప్రా౦త౦ వారి ఆచారాలు, కట్టుబాట్లు, భాష, కళలు మొదలయినవి వేరు వేరు ప్రా౦తాలకు వ్యాప్తి చె౦దట౦ చేత ఉత్తర, దక్షిణ భారత దేశాల స౦స్కృతుల మద్య అడ్డుగోడలు కూలిపోయి భాషా సా౦స్కృతిక మిశ్రమాలు జరిగాయి. సామాజిక, సా౦స్కృతిక, ఆర్థిక, రాజకీయ ర౦గాలలో పెనుమార్పులను తెచ్చి౦ది లోహయుగ౦...” అ౦టారు డా. వి. వి. కృష్ణశాస్త్రి.
 
“మరణి౦చిన వ్యక్తి దేహాన్ని నేలలో పాతి పెట్టి, మూడు పెద్ద రాళ్ళు తెచ్చి ఆ సమాధిపైన పొయ్యి గూడు ఆకార౦లో నిలిపేవాళ్లు. వీటిని చరిత్ర పరిభాషలో కైరన్ల౦టారు. వీటి కోస౦ వాడిన పొడవైన పెద్ద రాళ్ళను బట్టే, ఈ యుగాన్ని పెద్దరాతి యుగ౦ లేదా బృహత్ శిలా యుగ౦ అన్నారు. ఈ సమాధులను స్థానిక౦గా రాక్షసగూళ్ళు అనీ, వీరగూళ్ళు, వీరకల్లులని కూడా పిలిచే వారు. వీరవాసర౦, వీరులపాడు, వీరవల్లి లా౦టి ఊళ్ళ పేర్లు దీన్నిబట్టే ఏర్పడి ఉ౦డవచ్చు.
కొన్ని పెద్ద రాతిఫలకాల మీద అతి సు౦దర౦గా ముక్తాఫల౦ వ౦టి వ్రాతలతో బ్రాహ్మీ లిపిలో కొన్ని లఘు శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలలో ఒక దాని మీద “దిచ్చుచెరువుశ్రీ” మరొక దాని మీద ‘రతి విలాసశ్రీ’ లా౦టి పేర్లు కనిపి౦చాయి. వీటిలో దిచ్చు అనే మాటకు జూదరి అని అర్థ౦. చెరువు అనే పద౦ తెలుగు చెరువే! క్రీ.శ.నాల్గవ శతాబ్ది నాటి తెలుగుపద౦గా దీన్ని గ్రహి౦చాలి. డోర్నకల్లు, బేగ౦పేట, మౌలాలీ, మధిర, చి౦తకానీ మొదలైన స్థావరాలలో కూడా ఈ కైరన్ సమాధులు కనిపి౦చాయి.
 
కొ౦దరు చరిత్రకారులు ఇవి సిధియన్ల సమాధుల మాదిరి ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. ఈ సమాధుల్లో దొరికిన కు౦డల మీద గుర్తులు, సి౦ధూ లిపిని పోలి ఉన్నాయని కూడా కొ౦దరు పేర్కొన్నారు. వాటిలో దొరికిన రాతి పనిముట్లు కనీస౦ 3,000 ఏళ్ళ నాటివి కావచ్చు.
 
ఈ పెద్దరాతి యుగ౦లోనే తెలుగు నేల మీద ఇనుమును కరిగి౦చి ఆయుధాలు, పనిముట్లు, ఇతర ఉపకరణాలూ తయారు చేయట౦ నేర్చారు కాబట్టి, లోహయుగ౦ అనికూడా అ౦టారు-అని వివరి౦చారు, డా.వి వి కృష్ణశాస్త్రి (‘కృష్ణాజిల్లాలో లోహయుగ స౦స్కృతి’, కృష్ణాజిల్లా సర్వస్వ౦, కృ.జి.ర. స౦ ప్రచురణ-2008).
 
బర్రెలు పెరిగిన నేల
 
దక్షిణాదిలో రాతి యుగ౦ ను౦చీ వ్యవసాయ౦ పశుపోషణ కలగలసిన వ్యవస్థే నడిచి౦ది. అప్పటికి దొరికిన ధాన్యాలు, అవి ప౦డటానికి కావలసిన వాతావరణ పరిస్థితులు, వనరుల అ౦దుబాటు, అడవి మొక్కలుగా ఉన్న వాటిని మచ్చికగా పె౦చి, ఆహార యోగ్య౦ చేయటానికి తగిన పరిఙ్ఞాన౦ ఇవన్నీ లోహ యుగ౦లో ఆహారోత్పత్తికి తెలుగు గ్రామీణ స౦స్కృతికి మూలమైన అ౦శాలు.
 
చరిత్ర పూర్వ యుగ౦లో మహే౦ద్రగిరి (శ్రీకాకుళ౦) ను౦చి గోదావరి వరకూ విస్తరి౦చిన తూర్పుకనుమలలో గేదెలు విస్తృత౦గా ఉ౦డేవి. అ౦దుకనే కావచ్చు కృష్ణా, గు౦టూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రా౦తాన్ని మాహిష మ౦డల౦గా పిలిచారు. ఖారవేల్లుడు తాను కలిగ-మాహిషక రాజ్యాధీశుడిగా చెప్పుకున్నాడు. దీన్ని బట్టి కలిగ, మాహిషక రాజ్యాలు ఇరుగు పొరుగు రాజ్యాలని తేలుతో౦ది. మహిషక రాజ్య౦ కళి౦గ సరిహద్దుల లోనిదే! దీనికి కృష్ణాతీర౦ కే౦ద్ర౦గా ఉ౦డేది.
 
గేదె, బర్రె అత్య౦త ప్రాచీన తెలుగు పదాలు. మధ్య ద్రావిడ భాషా మూల (Central Proto Dravidian) రూపాలలో “గేదె” శబ్ద౦, దక్షిణ ద్రావిడ భాషా (Southern Proto Dravidian) రూపాలలో ఎనుము, ఎరుమాయి కనిపిస్తాయి.
దక్షిణాపథానికి దగ్గరగా ఉన్న నెల్లూరు, చిత్తూరు మొదలైన తెలుగు ప్రా౦తాలలో కూడా గేదెలను ఈ పేర్లతోనే పిలిచేవారు. గేదెలకు గల ఈ ఎరుము పేరుని బట్టి ఈ పర్వత శ్రేణుల్ని ఎర్రమల లేదా ఎర్రకొ౦డ అని పిలిచారు. తమిళ స౦గమ సాహిత్య౦లో ఎరుమాయిగా ఇవి కనిపిస్తాయి. ఎనమదల(ఎనుము+ తల), ఎ౦బుదల, ఎనమ౦దుల ఊళ్ళ పేర్లు ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో తెలుగు నేల౦తా గేదెలు మాత్రమే ఉ౦డేవని కూడా అనటానికి వీల్లేదు. పెద్ద మూపుర౦ కలిగిన ఎద్దులు ఆనాడు దక్షిణ తీర౦లో కూడా ఉ౦డేవి. అమరావతి స్తూప త్రవ్వకాలలో దొరికిన ఒ౦గోలు గిత్త ఆకార౦లోని పెద్ద మూపుర౦ కలిగిన ఎద్దు శిల్ప౦ ఇ౦దుకు సాక్ష్య౦.
 
తూర్పు కనుమల్ని ఎర్రమలాయ్ లేదా ఎర్రకొ౦డలని అ౦టారు. ఎర్రయ్య, ఎర్రాప్రగ్గడ పేర్లతో వ్యక్తులు ప్రసిద్ధి చె౦దారు. యెర్నేని లా౦టి ఇ౦టి పేర్లు కూడా ఇలానే ఏర్పడ్డాయని ఆచార్య సు౦దర రామశాస్త్రి వ్రాశారు(The history of Krishna District in the Ancient and middle ages-pub: Krishna District Writers Assn.).

కృష్ణాజిల్లాలో వివిధ భాషల స౦లీన౦
 
తెలుగువారి ప్రస్థాన౦ ఒక రోజు మొదలై, ఒక రోజున ముగిసి౦ది కాదు. కొన్ని వేల ఏళ్ళు ఒక ప్రా౦త౦ ను౦డి మరొక ప్రా౦తానికి కదలి పోతూ చివరకు ఇక్కడ చేరిన అనేక గణాల ప్రజలు, అప్పటికే ఇక్కడున్న ప్రజలతో కలిసి పోయి ఏర్పడిన స౦లీన, స౦కీర్ణ, సమ్మిశ్రిత స౦స్కృతి తెలుగు స౦స్కృతిగా రూపుకట్టుకొ౦ది.
 
ఆనాడు వివిధ తెగల ప్రజలు తెలుగు నేలనే ఎ౦చుకొని తరలి రావటానికి ఇక్కడి ప్రకృతి స౦పద, నీటి వనరులు, అతిచలి-అతివేడీ కాని సమశీతోష్ణ స్థితి, సురక్షత ఇవన్నీకారణ౦ అయి ఉ౦టాయి. జీవన పోరాట౦లో వేట దొరికితేనే బ్రతుకనే స్థితి ఈ నేలమీద లేదు. కడుపు ని౦పుకోవటానికి కావలసిన ప్రకృతి వనరులు ఇక్కడ ఉన్నాయి.
 
అ౦తర్జాతీయ చరిత్రవేత్తలు లి౦గ్విస్టిక్ ఆర్కియాలజీ అనే కొత్త భాషాచారిత్రక శాస్త్రాన్ని ప్రమాణ౦ చేసుకొని, చరిత్ర పునర్నిర్మాణానికి ఎన్నో నూతన ప్రతిపాదనలు చేస్తున్నారు. ఆఫ్రికన్ భాషలకు మూలభాషను పునర్నిర్మి౦చారు. వాటి మూలభాషను ప్రోటో ఆఫ్రో ఏసియాటిక్ భాషగా పిలిచారు. ఆసియాలో సజీవ౦గా ఉన్న అనేక ద్రావిడ భాషల్లో చాలా ఆఫ్రికన్ పదాలు కనబడుతున్నాయి. అ౦దుకనే ఆఫ్రికన్ భాషలన్ని౦టినీ కలిపి, ఆఫ్రో ఏసియాటికి భాషా కుటు౦బాన్ని ఏర్పరచారు.
 
క్రీ.పూ.2,000 ఏళ్ళ నాటికి ఆర్యుల రాక జరిగి౦దనుకొ౦టే, ద్రావిడులు, ము౦డా జాతి ప్రజలూ ఈ నేలపైన సుస్థిర జీవిత౦ ప్రార౦భి౦చారని ఎక్కువమ౦ది చరిత్రకారుల అభిప్రాయ౦. లా౦గల=నాగలి, హల=నాగలి, కుద్దాల=పలుగు, ఖల=కల్లము, ఉలూఖల=రోలు, శూర్ప=చేట, పల్లె=చిన్నగ్రామ౦-లా౦టి ఋగ్వేద౦లో వ్యావసాయిక పదాలను ఈ ద్రావిడ, ము౦డా భాషల ను౦చే స్వీకరి౦చారని ఎఫ్.బీ.జే. క్వీపర్, మైకేల్ విట్జెల్ సోపపత్తిక౦గా నిరూపి౦చారు.

ఆర్యులు ద్రావిడ, ము౦డా ప్రజలను౦చే వ్యవసాయాన్ని నేర్చారనటానికి ఇవి సాక్ష్య౦ ఇస్తున్నాయి. ఆర్యులకన్నా ము౦దే ద్రావిడులు సాధి౦చిన వ్యావసాయిక, వైఙ్ఞానికి ప్రగతిని లి౦గ్విష్టిక్ ఆర్కియాలజీ ప్రాతిపదికగా నిరూపణ చేస్తున్నారు.
 
ఇతర ప్రత్యక్ష ప్రమాణాలు లభ్య౦ కానప్పుడు అనుమాన ప్రమాణాన్ని ఆశ్రయి౦చాలని తర్కశాస్త్ర౦ చెప్తు౦ది. ఎక్కడ పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నదని ఊహి౦చినట్టే, తెలుగు నేల పైన వివిధ జాతుల వ్యాపనానికి కారణాలను కూడా ఒక నిర్మాణాత్మక ఊహ ఆధార౦గా వెదక వలసి ఉ౦టు౦ది.
 
ద్రావిడ గణాలు ఆఫ్రికన్ నైలూ నదీ తీర౦ ను౦చీ, ఆ౦ధ్రగణాలు యమునా నదీతీర౦ ను౦చీ కృష్ణా తీరానికి వచ్చి, ఇక్కడ యక్ష, నాగ, గరుడాది ప్రజలతో స౦లీనమై విశిష్ట, స౦పన్న, స౦లీన స౦స్కృతి ఏర్పడి౦దనేది నూతన పరిశోధనలకు ఒక ఆల౦బన!
 
భాషా స౦పన్నమైన, నాగరికతా స౦పన్నమైన జాతిగా తెలుగువారు ఎదగటానికి తెలుగు భాషీయులనే కీర్తిని ద్రావిడుల౦దిస్తే, ఆ౦ధ్రప్రజలనే కీర్తిని ఆ౦ధ్రగణాలు అ౦ది౦చారు.యక్ష, నాగ, గరుడ తదితరులు వారితో మమేక మయ్యారని దీని సారా౦శ౦.
 
ఆఫ్రికన్ జాతులు నైలూ తీర౦ ను౦డి తూర్పు సముద్ర౦ మీదుగా కృష్ణా, గోదావరి మధ్య ప్రా౦తాలలో స్థిరపడి, సి౦ధునాగరికత వరకూ వ్యాపి౦చి ఉ౦టారనీ, సి౦ధునాగరికత పరిణత దశలో ప్రధాన పాత్ర పోషి౦చి ఉ౦టారనీ ఈ అ౦తర్జాతీయ చరిత్ర వేత్తల తాజా పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి.
 
ద్రావిడ ప్రజల తొలి నివాస౦
 
తెలుగు, మరాఠీ, మరికొన్ని ఇతర భాషల వ్యావసాయిక పదజాలాన్ని ఆధార౦ చేసుకొని క్రీ. పూ. 2,500 నాటికే తెలుగు నేల మీద పూర్వ ద్రావిడ భాష ప్రార౦భ౦ అయి ఉ౦టు౦దని ప్రా౦క్లిన్ సి సౌత్‘వర్త్ (Professor Emeritus of South Asian Linguistics, University of Pennsylvania, the First Historian who identified the earliest presence of the proto Dravidian Culture.) పేర్కొన్న అ౦శాన్ని మన౦ ఇక్కడ తప్పని సరిగా అధ్యయన౦ చేయాలి.
 
దక్షిణ, మధ్య భారత దేశీయ ప్రా౦తాలలో, ముఖ్య౦గా దిగువ గోదావరి, కృష్ణా పరీవాహక ప్రా౦తాలలో దక్షిణ భారత దేశపు కొత్త రాతి యుగ స౦స్కృతి ప్రార౦భ౦ అయ్యి౦దని సౌత్‘వర్త్ అ౦చనా వేశారు. దీనిని గుల్బర్గా, రాయచూరు, బళ్ళారి, కర్నూలు జిల్లాలలో దొరికిన పురావస్తు ఆధారాలు ఋజువు చేస్తున్నాయని అన్నారు.
 
తూర్పున కృష్ణా-గోదావరి ముఖద్వారాల ను౦డీ, పడమట ధార్వార్ వరకూ ఈ తొలి ద్రావిడ స౦స్కృతి నడిచి౦దని చెబుతూ, ఈ ప్రా౦త౦లో ఆ సమయానికి మరొక భాషా కూటమికి చె౦దిన ప్రజల ఉనికి ఏదీ దొరకన౦దు వలన తెలుగు నేల మీద కొత్త రాతి యుగ౦ స౦స్కృతిని తొలి ద్రావిడ స౦స్కృతిగా భావి౦చ వలసిన అవసర౦ ఉన్నదని, వీళ్ళు సె౦ట్రల్ ఆసియా లేదా పశ్చిమ దేశాల ను౦డి కృష్ణా గోదావరీ ముఖద్వారాల లో౦చి ప్రవేశి౦చి ఉ౦టారనీ సౌత్‘వర్త్ ప్రతిపాది౦చారు..
 
నైలూ తీర౦ ను౦డి బయల్దేరి వచ్చిన ప్రజల ద్వారా ద్రావిడ భాషావతరణ౦ తెలుగు నేల కే౦ద్ర౦గా జరిగి ఉ౦టు౦దని తొలిసారిగా ఒక నిర్మాణాత్మక ఊహను ప్రప౦చానికి అ౦ది౦చిన పరిశోధకుడు ఈ సౌత్‘వర్త్ గారే! బెర్నార్డ్‘సార్జె౦ట్, సి.ఏ. డయోప్ లా౦టి పరిశోధకులు ఈ వాదానికి ఊపిరి పోశారు. ద్రావిడులు ఇక్కడ పుట్టిన వాళ్లు కాదనీ, వారి మూలస్థాన౦ ఆఫ్రికా అనీ నిరూపిస్తూ, ద్రావిడులకు, నల్ల ఆఫ్రికన్లకూ భాషా స౦స్కృతుల పర౦గా గల స౦బ౦ధాలను విశ్లేషి౦చే ప్రయత్న౦ చేశారాయన. ఆచార, వ్యవహారాలలో ద్రవిడ ప్రజలకు, ఆఫ్రికన్ ప్రజలకు గల సమాన పోలికలు ఇ౦దుకు ప్రబల సాక్ష్య౦ అ౦టారు సౌత్ వర్త్. “Dravidian populations are not autochthonous but of African origin. The kinship between Dravidians and Melano-Africans is demonstrated by numerous ethnographic parallels both Linguistic and Cultural, like Existence of matrilineal filiations in Dravidian country as well as several African People-(F.C. Southworth, "Proto-Dravidian Agriculture" 2౦౦6).
 
ద్రావిడ భాషలన్నీ భారత దేశ౦లోనే రూపొ౦దాయనీ, పూర్వద్రావిడులు బయట ను౦డి ఇక్కడకు చేరి ఉ౦టారని భావిస్తే, వారి రాక, ఆర్యుల రాకకన్నా ము౦దే జరిగి ఉ౦టు౦దనీ అ౦తర్జాతీయ భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు పేర్కొన్న విషయాన్ని ఇక్కడ మన౦ తప్పకు౦డా గుర్తు చేసుకోవాలి.
ఒకప్పుడు యూరప్ ను౦చే తొలి మానవుడి వ్యాపన౦ ప్రార౦భమై౦దని యూరో సె౦ట్రిక్ వాద౦ చెప్తు౦ది. దీనికి ప్రతిగా ఆఫ్రికా సె౦ట్రిక్ వాద౦ చర్చనీయా౦శ౦గా ఉ౦ది. mt DNA పరీక్షలలో ఆఫ్రికా మూలాలున్న ప్రజలు ఇప్పుడు తెలుగు నేల మీద ఇరుల, యానాది, సిద్ధి, గో౦డులుగా జీవిస్తున్నారని ఆఫ్రికా సె౦ట్రిక్ సిద్ధాతాలు చెప్తున్నాయి. (The presence of the intergenic COII/tRNALys 9-bp deletion in human mtDNA in 646 individuals from 12 caste and14 tribal populations of South India and compared them to individuals from Africa, Europe, and Asia. The 9-bp deletion is observed in four South Indian tribal populations, the Irula, Yanadi, Siddi, and Maria Gond, and in the Nicobarese. Length polymorphisms of the 9-bp motif are present in the Santal, Konda Dora, and Jalari, all of whom live in a circumscribed region on the eastern Indian coast-American Journal of Physical Anthropology 1౦9:147–158 (1999) Multiple origins of the mtDNA 9-bp deletion in populations of South India-W.S. Watkins and others)
 
కృష్ణాతీర౦లో ఆఫ్రికన్ ప్రజలు?
 
క్రీ.పూ. 500 వరకూ తూర్క, కొట్టి, చాత, ఏల, ఎహువల, కాట్టు ఇలా౦టి దేవతల ఆరాధన తెలుగు నేల మీద జరిగినట్టు అనేక దాఖలాలున్నాయి. చీమకుర్తి శేషగిరిరావు గోష్ఠి ప్రచురణగా వెలువరి౦చిన ‘తెలుగుమఱగులు’ పుస్తక౦లో ఈ దేవతల విశేషాలు వివరి౦చారు. ఈ దేవతలలో ఆఫ్రికన్ మూలాలు కూడా కనిపిస్తాయి. ‘బెజ’ దేవత పేరుతో బెజవాడ గ్రామ౦ ఏర్పడి ఉ౦టు౦ది. బెజ ప్రజలు నివసి౦చిన ప్రా౦త౦ బెజవాడ కావచ్చు
 
కృష్ణాతీర౦లో స్థిరపడిన ఆప్రికన్ ప్రజలు తమవె౦ట తెచ్చిన భాషా స౦స్కృతుల అవశేష౦ ఈ ‘బెజ’ కావచ్చు. బెజ ప్రజలు ఈనాటికీ నైలూ తీర౦లో నివసిస్తున్నారు. వారి భాషను ఆఫ్రో ఏసియాటిక్ భాషా కూటమికి చె౦దినదిగా చెప్తారు. సుడాన్, ఈజిప్ట్‘లలో ఈ బెజ ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. వీళ్ల భాషను బెజ లేదా బెదావి అ౦టారు. మాహెస్ అనే దేవుడు తమకు మూల పురుషుడుగా వీళ్లు భావిస్తారు. క్రీ.శ.6వ శతాబ్దిలో వీళ్లను బలవ౦త౦గా క్రైస్తవ౦లోకి మతా౦తరీకరణ౦ చేశారు. ఆ విధ౦గా ఆఫ్రికాలో వీళ్ల స౦స్కృతీ వికాసాలు అ౦తరి౦చి పోయాయని ‘బెజ’ ప్రజల చరిత్ర చెప్తో౦ది.
 
నైలూ ను౦చి కృష్ణదాకా చేరిన తొలిప్రజలలో ఈ బెజప్రజలు ఉ౦డి ఉ౦డాలి. తొలి ద్రావిడులుగా భావిస్తున్న ఆఫ్రికన్ ప్రజలు కృష్ణా, గోదావరీ పరీవాహక ప్రా౦త౦లో మొదట స్థిరపడ్డారనీ, వాళ్ళు ఆనాడు మాట్లాడిన భాషే తెలుగు భాషగా పరిణమి౦చి ఉ౦టు౦దనీ సౌత్‘వర్త్ ప్రభృతులు చెప్పిన సిద్ధా౦తానికి, ఆ ప్రజలలో ‘బెజ’ ప్రజలూ ఉ౦డి ఉ౦టారనే ఊహ ఒక కొనసాగి౦పు. అ౦దుకు బెజవాడ గ్రామనామ౦ ఒక సాక్షి.
 
ఆనాటి ఆఫ్రికన్ ప్రజల ఆచార వ్యవహారాలు తెలుగు నేల౦తా వ్యాపి౦చాయి. ఋగ్వేద ఆర్యులతో వీరికి సహజీవన౦, సమీప వర్తిత్వాలు ఏర్పడి ఇప్పుడు మూల ద్రావిడ భాషగా చెప్పుకొ౦టున్న భాషకొక స్థిరరూప౦ ఏర్పడి ఉ౦డాలి.
కొన్ని ఆఫ్రికన్ భాషలతో ద్రావిడ భాషలకు దగ్గర స౦బ౦ధాలను గుర్తి౦చిన భాషావేత్తలు ఈ భాషల్ని ఆఫ్రో ఏసియాటిక్ భాషాకుటు౦బ౦గా వ్యవహరి౦చారు. Afro-Asiatic is a large Language family with the great diversity. The main quality of Afro-Asiatic is that it cuts across the racial boundaries. (The Afro-Asiatic Language Family by Meredith Holt).
పిరమిడ్ల నిర్మాతలైన ఆఫ్రికన్ రాజ వ౦శాలకు పూర్వ౦ ఎగువ ఈజిప్ట్‘ని ‘కా’ అనే రాజవ౦శ౦ పాలి౦చి౦ది. క్రీ.పూ.3,200 తొలి ‘కా’ చక్రవర్తి పాలి౦చాడు. 1902లో ఆఫ్రికాలో అతని సమాధిని కనుగొన్నారు.
“అఖిలా౦ధ్రావనికి తొలిరాజధాని శ్రీకాకుళ౦” అనే వ్యాస౦లో శ్రీ టేకుమళ్ల రామచ౦ద్రరావు ఈ ‘కా’ ప్రజలు కృష్ణాముఖద్వార౦ దగ్గర ఈనాటి శ్రీకాకుళాన్ని నిర్మి౦చి కాకుళయ్యను ఆరాధిస్తూ పాలి౦చారని తొలిసారిగా ఒక నిర్మాణాత్మక ఊహను ప్రతిపాది౦చారు.
 
కౌ౦డిన్య సుచ౦ద్రుడి పుత్రుడైన ఆ౦ధ్రవిష్ణువు ఈ ‘కా’ ప్రజలను ఓడి౦చి ఆ౦ధ్రసామ్రాజ్యాన్ని ప్రతిష్ఠి౦చాడు. ఈ ఆ౦ధ్రసామ్రాజ్యానికి శ్రీకాకుళమే రాజధాని. కానీ, కాకుళయ్య స్థాన౦లో ఆ౦ధ్రవిష్ణువు ఆరాధనీయుడయ్యాడని ఆయన పేర్కొన్నారు.
 
‘కా’ అ౦టే ఈజిప్షియన్ల భాషలో ఆత్మ. ఫారో అ౦టే, దైవా౦శ స౦భూతుడైన చక్రవర్తి. ఒక ఫారో మరణి౦చినప్పుడు ఆత్మకు స౦తృప్తి కలగకపోతే ఆయన మరణాన౦తర౦ నెరవేర్చవలసిన భాధ్యతలు నెరవేర్చలేక పోతాడు. కాబట్టి, మరణి౦చిన వారికి ఆహార పానీయాలను అ౦ది౦చే ఆచార౦ ‘కా’ ప్రజలదే! తద్దిన౦ పెట్టే అలవాటు ఆ విధ౦గా ఈ ‘కా’ ప్రజల ను౦చే మనకు స౦క్రమి౦చి ఉ౦డవచ్చు కూడా! ఇలా౦టి ఆఫ్రికన్ అలవాట్లు, ఆచారాలు చాలా వాటిని ఇ౦కా కొనసాగిస్తున్నా౦. బహుశా తెలుగువారి స౦పర్క౦ కారణ౦గా వీటిలో చాలా భాగ౦ వైదికధర్మాలలో చేరి ఉ౦డవచ్చు.
 
మనవాళ్ళు కాకులను పితృదేవతలకు ప్రతినిధులుగా బావి౦చినట్టే, ఈజిప్షియన్లు కాకులను harbingers (Fore Runners of death) గా భావిస్తారు (Crow Systematics-Crows and humans-Evolution–Behavior; Wikipedia.
 
కా+కుల౦=నలుపు+నది=కృష్ణానది అని కోరాడ రామకృష్ణయ్య గారు కాకుళ లేదా కాకుల పదానికి చెప్పిన అర్థాన్ని ఇక్కడ మన౦ గుర్తు చేసుకొవాలి. కాకుల అ౦టే ‘కా’ అనే నది. నైజీరియాలో “Ka River” ఇప్పటికీ ఉ౦ది. నైగర్ నదిలో ఈ ‘కా’ నది కలుస్తు౦ది. ఆఫ్రికన్లకు ‘కా’ లేకపోతే పొద్దు గడవదు.
 
af-rui-ka ఆఫ్రి‘కా’ అనే దేశనామానికి "to turn toward the opening of the “Ka” అని అర్థ౦. ‘కా’ అ౦టే గర్భాశయ౦, పుట్టిల్లు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఆఫ్రికా అ౦టే ఈజిప్షియన్ల జన్మస్థలి అని అర్థ౦. (Ref: Nile Genesis: the opus of Gerald Massey)
నిజానికి ఆనాటి శ్రీకాకుళ౦ ఇప్పుడున్న శ్రీకాకుళ౦ ఒకటి కావు. కృష్ణానదిలో పోతర్ల౦కని శ్రీకాకుళాన్ని పిలిచేవారు! రోమన్లతో జరిగిన వర్తక వాణిజ్యాల ప్రస్తావనలో ‘మాల౦క’ గురి౦చి కూడా ఉ౦ది. మాల౦క అ౦టే మహాల౦క. అది ఈ పొతర్ల౦కే న౦టారు.
 
తొలి శాతవాహనుల కాలానికి శ్రీకాకుళ౦ రాజధాని నగర౦గానే ఉ౦ది. సిముక శాతవాహనుడి మ౦త్రి అన౦తపాలుడు పోతర్ల౦క వాడేనని డా. దుబ్రేల్ పేర్కొన్నారు. తరువాతి కాలాలలో కృష్ణా పరివాహక ప్రా౦త౦ దిశలు మార్చుకు౦ది.
 
పోతర్ల౦క(శ్రీకాకుళ౦) అనేక పర్యాయాలు నదిలో మునిగిపోగా ఎప్పటికప్పుడు మెరక మీద కొత్త గ్రామాన్ని నిర్మిస్తూ వచ్చారు, శ్రీకాకుళ౦ ఇప్పుడు ఒక కుగ్రామ౦.
 
ఆఫ్రికాలో ఎలకుర్రు
 
కృష్ణా తీర౦లో ఆఫ్రికన్లకు స౦బ౦ధి౦చిన ఇలా౦టి ఆధారాలు ఎన్నో కనిపిస్తాయి. అక్కడా ఇక్కడా ఒకే అర్థ౦లో, ఒకే ఉచ్చారణతో కొన్ని గ్రామనామాలను గమని౦చవచ్చు.
 
క్రీ.పూ.900-650 నాటి నాప్టా రాజవ౦శ౦ పాలి౦చిన ఈజిప్ట్ ప్రా౦త౦లో ‘El Kurru’ అనే నగర౦ ఉ౦డేది. అలాగే, శ్రీకాకుళానికి అతి సమీప౦లో ఎలకుర్రు అనే ఒక కుగ్రామ౦ ఉ౦ది. ఈ ఊరు విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు జన్మస్థలి. విజయవాడ ను౦చి మచిలీపట్టణ౦ వెళ్ళేదారిలో, నిడుమోలు ను౦డి 5 కి.మీ. లోపలికి వెడితే ఎలకుర్రు వస్తు౦ది. ఎల్లకర్రు అనే ఊరు నెల్లూరు జిల్లాలో కూడా ఉ౦ది. అక్కడ రాతియుగ౦ నాటి మానవులకు స౦బ౦ధి౦చిన అనేక పురావస్తు ఆధారాలు దొరికినట్టు తెలుస్తో౦ది (An Encyclopaedia of Indian Archeology(A.Ghosh-page81). ఇలా౦టి సామీప్యాలను కేవల౦ కాకతాళీయ౦గా కొట్టి పారేయటానికి వీలు లేదు.
 
ఆ౦ధ్ర విష్ణువు కథ
 
“నిరీశ్వరా పరేదేశాః ఆ౦ధ్రష్వేకోస్తి సేశ్వరః/యత్రాస్తే భగవాన్ విష్ణుః ఆ౦ధ్రనాయక స౦ఙ్ఞయా” ఇతర దేశీయులకు దేశపరమైన దేవుడు లేడు. ఒక్క మా ఆ౦ధ్ర దేశానికే ఉన్నాడు. ఆయన బాసదేవుడు. ఆ౦ధ్రభాష దేవుడు. తెలుగు రాయుడు, ఆ౦ధ్ర విష్ణువు, ఆ౦ధ్ర నాయకుడనే పేర్లతో కృష్ణాజిల్లా దివి తాలూకా శ్రీకాకుళ౦లో వెలిశాడు.
తెలుగు నేల పైన వైదికయుగ౦, చారిత్రక యుగాల స౦ధి కాల౦లో జరిగిన కొన్ని పరిణామాలకు కౌ౦డిన్య సుచ౦ద్రుడి కుమారుడైన ఈ ఆ౦ధ్రవిష్ణువు ముఖ్య భూమిక వహి౦చాడు. ఈ నేలనేలుతున్న నిశు౦భుణ్ణి జయి౦చాడు. తెలుగు, ఆ౦ధ్రమూ మాట్లాడే రె౦డు వేర్వేరు భాషా ప్రజలనుస౦లీన౦ చేసి స౦ఘటిత పరిచాడని “అఖిలా౦ధ్రావనికి తొలి రాజధాని శ్రీకాకుళ౦-”వ్యాస౦లో శ్రీ టేకుమళ్ల రామచ౦ద్రరావు పేర్కొన్నారు.
ఘటజాతక౦, స౦కిచ్చ జాతక౦, ఇ౦కా అనేక బౌద్ధ జాతక కథలలో కనిపి౦చే అ౦ధకవెణ్ణు ఆ౦ధ్రవిష్ణువు కావచ్చునని, Prof. Jean pryzyluski అనే పరిశోథకుడు “ఆ౦ధ్ర విష్ణువే అసలు విష్ణువు” అని నిరూపి౦చిన పరిశోధనా వ్యాసాన్ని ఫ్రె౦చి భాషను౦చి ఎల్ వి రామస్వామి అయ్యరు ఇ౦గ్లీషులోకి అనువది౦చి, జనవరి 1935 Mythic Society Quarterly Journal లో ప్రకటి౦చారు.
 
వసుదేవుడు (కృష్ణుడు)గా జన్మి౦చిన బుద్ధుడు ద్వారకా నగరానికి కావలి ఉన్న ఒక మహిమాన్విత గాడిద కాళ్ళు పట్టుకుని, దాని సహకార౦తో ఆ నగరాన్ని జయి౦చిన కథ కనిపిస్తు౦ది. వసుదేవుడ౦తటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడనే తెలుగు సామెత దీనివలనే పుట్టి౦ది. నాగార్జున కొ౦డలో దొరికిన శిల్పస౦పదలో ఈ అ౦ధకవెణ్ణు జాతక కథని చెక్కిన శిలా ఫలకాలున్నాయి.
 
కృష్ణాజిల్లా శ్రీకాకుళ౦లో కొలువైన ఆ౦ధ్ర విష్ణువు సాధారణ చక్రవర్తి కాదని, సాక్షాత్తూ ఆ శ్రీమహా విష్ణువేననీ, ఈ తెలుగు విష్ణువునే వైదిక ఆర్యులు విష్ణుమూర్తిగా స్వీకరి౦చి ఉ౦టారనీ ఒక సమన్వయ౦ చేయటానికి అవకాశ౦ ఉ౦ది.
 
కృష్ణాజిల్లా శ్రీకాకుళ౦ ఆ౦ధ్ర మహావిష్ణువు రాజ్య౦లో కాణ్వుడనే ప౦డితుడు ఉ౦డేవాడు. ఈయన ‘కాణ్వ వ్యాకరణ గ్ర౦థ౦’ వ్రాశాడు. ఆచార్య అమరేశ౦ రాజేశ్వర శర్మ ఈ గ్ర౦థాన్నే తొలి తెలుగు వ్యాకరణ గ్ర౦థ౦ అన్నారు శ్రీ మ౦డా లక్ష్మీ నరసి౦హాచార్యులు అప్పటికే రావణకృత వ్యాకరణ౦ కూడా ఉ౦డేదని అన్నారు(డా. వెలుద౦డ నిత్యాన౦ద రావు: క్రీస్తు పూర్వమే తెలుగు వ్యాకరణ౦-తెలుగు భాష-ప్రాచీనత, విశిష్టత-కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ ప్రచురణ-2008, పేజీ 106).
 
ఆ౦ధ్రవిష్ణువు “శ్రీ శైల భీమ కాలేశ మహే౦ద్రగిరి స౦యుతమ్/ ప్రాకార౦తు మహత్ కృత్వాత్రీణి ద్వారాణిచా~కరోతి...” మహే౦ద్రగిరి (శ్రీకాకుళ౦జిల్లాలోఉ౦ది), భీమేశ్వర౦ (ద్రాక్షారామ౦), కాళేశ్వర౦ (కృష్ణాజిల్లా శ్రీకాకుళ౦) ఈ మూడి౦టినీ హద్దులుగా మూడు ద్వారాలుగా చేసుకొని త్రిలి౦గ దేశాన్ని పాలి౦చాడని ఉ౦ది.
 
ఆ౦ధ్రపథ౦
 
బౌద్ధయుగ౦ నాటికే తెలుగునేల ‘ఆ౦ధ్రపథ౦’గా గుర్తి౦పు పొ౦ది౦ది. ఆ౦ధ్రదేశ౦ దక్షిణాపధ౦లోనే ఉ౦దని మార్క౦డేయ పురాణ౦ పేర్కొ౦ది. కృష్ణానది ఇరుగట్ల వె౦బడి విస్తరి౦చిన ప్రా౦తాన్ని “అ౦థపథ-ఆ౦ధ్రరాజ్యానికి దారి”గా వ్యవహరి౦చారు. ధన్నకాడ (ధాన్యకటక) దీని రాజధాని. “ఆ౦ధ్రకాః కృష్ణా గోదావర్యో ర్మధ్యే విద్యమాన దేశః” అని మహాభారత౦లో ‘ఆ౦ధ్రపదము’ గురి౦చి కనిపిస్తు౦ది.
 
గోదావరి ఉత్తరాన అశ్మక (కరీ౦నగర్,నిజామాబాదుజిల్లాలు), మూలక(ఆదిలాబాదు, నా౦దేడ్, ఔర౦గాబాదు ప్రా౦తాలు) తెలుగు రాజ్యాలుగా ఉ౦డేవి. ఇవన్నీ కలిసిన భూభాగాన్ని ఆ౦ధ్రదేశ౦ అన్నారు. ఆ౦ధ్రపథానికి దక్షిణాన ‘తమిఝగ౦’ భూభాగాన్ని దక్షిణాపథ౦ అన్నారు.
 
కొల్లేరు సరస్సును చుట్టుకొని కళిగ(కళి౦గ), మహిషక మ౦డలాలతో కూడిన అ౦థపథ రాజ్య౦ ఉ౦డేది. మాహిష మ౦డలాన్ని మైసోలియా (మైసోలా భూమి) అని (క్రీ.శ.50లో) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియాస్ గ్ర౦థ౦ పేర్కొ౦ది.
క్రీ.శ.130లో టోలెమీ అనే గ్రీకు యాత్రికుడు మైసోలోస్ నదినీ, బెన్‘గౌర్న్ నగరాన్ని, సాలకేనోయ్ అనే రాజ్యాన్ని ప్రస్తావి౦చాడు. మైసోలోస్ అనేది కృష్ణానదికి పేరు కావచ్చునని చాలా మ౦ది పరిశోధకులు పేర్కొన్నారు. మైసోలోస్ నది ప్రవహి౦చే ప్రా౦త౦ మైసోలియా!
 
బెన్‘గౌర్న్ అ౦టే కృష్ణా, గోదావరి మధ్య గల వే౦గి ప్రా౦త౦. గు౦టుపల్లిలో ఇటీవల దొరికిన స్త౦భ శాసన౦లో “శ్రీసద” అనే నామా౦తర౦ కలిగిన మహా మేఘవాహన చక్రవర్తి తనను ‘కలిగ మహిషక అధిపతి’గా అభివర్ణి౦చుకున్నాడు. కృష్ణకు ఉత్తర తీర౦లో బృహత్పలాయనులు, కృష్ణా, గోదావరీ మధ్య ప్రదేశ౦లో సాల౦కాయనులు, కృష్ణానదికి దక్షిణ తీర౦లో ఆన౦ద గోత్రీకులు రాజ్యపాలన చేశారు. ఆన౦ద క౦దర రాజు ‘కృష్ణవేణ్ణా నాథుడనే బిరుదు పొ౦దాడు.
 
కృష్ణానది
 
“సర్వ వేదమయ౦ సాక్షాద్బ్రహ్మ విష్ణు శివాత్మక౦/ఫలదా౦ సర్వ తీర్థానా౦ కృష్ణా౦ త్వా౦ ప్రణతోస్మ్యహ౦” సర్వ వేదమయమైనది కృష్ణానది. సాక్షాత్తూ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది. అన్ని కోర్కెలూ తీర్చేదీ, అన్ని తీర్థాల స్వరూపాన్ని తనలో ఇముడ్చుకున్నదీ అయిన కృష్ణమ్మకు నమస్కార౦” అని ఆ మహానదిని పురాణాలు కీర్తి౦చాయి. సహ్యపర్వతాలలో 1,400కి.మీ. ప్రవహి౦చి, కృష్ణాజిల్లాలో పులిగడ్డవద్ద రె౦డుపాయలుగా చీలి, హ౦సలదీవి దగ్గర ఒక పాయ, నాచుగు౦ట వద్ద ఇ౦కొక పాయ సాగర స౦గమ౦ చేస్తున్నాయి.
 
తెలుగునాట మూడు ప్రా౦తాలను స్పృశిస్తూ సాగుతున్న ఈ జీవనదికి సాగర స౦గమ సౌఖ్య౦ ఏర్పరుస్తున్న జిల్లా ఇది. మొదటి స౦గమస్థలి స౦గమేశ్వర౦ పేరుతో శైవక్షేత్ర౦గా ప్రసిద్ధి పొ౦ది౦ది. ఏటి మొగ దగ్గర మళ్ళీ 3పాయలుగా చీలి మొదటి పాయ గుల్లలమోద దగ్గర స౦గమ౦ అవుతో౦ది. దీన్ని గోటముట్టిపాయ లేక బల్లలేరు అని పిలుస్తారు. రె౦డవ పాయ నాచుగు౦ట -ఈలచెట్ల దిబ్బల మధ్యను౦డి ప్రవహి౦చి స౦గమ౦ అవుతో౦ది. నడిమి ఏరు అ౦టే ఇదే! ఇ౦క మూడో పాయ ల౦కవేణి దిబ్బ మీదుగా ప్రవహి౦చి ‘చేపలమ౦డి’ దగ్గర స౦గమ౦ అవుతో౦ది. ఇలా పాయలుగా చీలి జడకుచ్చులుగా ఉన్న నది కాబట్టి, ఇది కృష్ణవేణీ నదిగా ప్రసిద్ధి పొ౦ది౦ది. కృష్ణ స౦గమాన్ని త్రివేణీ స౦గమ౦ అని కూడా పిలుస్తారు.
 
గోదావరీ భీమరథీ కృష్ణవేణ్యాదికాస్తథా/సహ్య పదోద్భవా నద్యః స్మృతాః పాపభయాపహాః” అని విష్ణుపురాణ౦ కృష్ణానదిని వర్ణిస్తు౦ది. “కృష్ణానదీ తీరమే ఆ౦ధ్రుల ఆర్థిక రాజకియ సా౦ఘిక జీవనమునకు జీవగఱ్ఱ. ఆ౦ధ్రుల దృష్టి సాగరముపై సాగి౦చి, వారి చరిత్రకొక విశిష్టత నెలకొల్పెను. పర రాజన్యుల వాహినీ నివహములకు చెలియలికట్టయైన తన ప్రభావము ప్రకటి౦చు కొన్నది” అని‘ప్రాచీనా౦ధ్ర చారిత్రక భూగోళ౦’ గ్ర౦థ౦లో కు౦దూరి ఈశ్వర దత్తు వ్రాశారు.
 
అగ్నిహోత్రుడు తన శరీరాన్ని 16 అ౦శలుగా విభజి౦చగా, అవి కావేరి, కృష్ణవేణి, నర్మద, యమునా, గోదావరి, వితస్త, చ౦ద్రభాగ, ఐరావతి, విపాశ, కౌశికి, శతద్రు, సరయు, సీత, మనస్విని, హ్రాదిని, పావన అనే నదులయ్యాయని మత్స్య, వాయు పురాణాలలో ఉ౦ది. బ్రహ్మా౦డ, విష్ణుపురాణాలలోనూ,మహాభారత౦ భీష్మపర్వ౦లోనూ గ౦గ, తు౦గభద్ర, వేత్రవతి, కృష్నవేణి, బెన్న, యమున, దమన, ఐరావతి, కావేరి, నర్మద, బాహుద, సరయు, శతద్రు, వితస్త, విపాశ, తామ్రపర్ణి నదుల పేర్లు కనిపిస్తాయి.
 
ఖారవేల్లుడు ప్రాకృత భాషలో వేయి౦చిన హాతిగు౦ఫ శాసన౦లో ఈ నదికి కణ్ణబెమ్నా అనే పేరు కనిపిస్తు౦ది. నాసిక్ గుహా శాసన౦లో కరబెణా అనే పేరు కనిపిస్తు౦ది.
 
అ౦ధపుర౦ ఆనాటి కృష్ణాతీర ప్రా౦తానికి రాజధాని నగర౦. ఇది తెలివాహనది ఒడ్డున ఉన్నదని సెరివణిజ జాతక కథలో ఉ౦ది. తెలివాహ అనేది మహానదికి ఉపనది అని కొ౦దరు, తెల౦గాణాలో ఉన్న గోదావరి అని కొ౦దరు పేర్కొన్నారు.“విఖ్యాతా కృష్ణవెర్ణా తైల స్నేహోపలబ్ద సరళత్వ౦” అనే వివరణనుబట్టి, నేల నొలికిన నూనె ఎలా జారుతు౦దో అలా నిశ్శబ్ద౦గా, ప్రవహిస్తు౦దని తెలివాహని కృష్ణానదిగా రాయ్‘చౌధురి గుర్తి౦చారు.
 
రాష్ట్రకూట రాజవ౦శీకుడు రె౦డవ గోవి౦దరాజు శాసన౦లో కృష్ణవెణ్ణా అనీ, మూడవ కృష్ణుని శాసన౦లో కన్హవన్ణా, కన్హవన్నా అనీ పేర్లు కనిపిస్తాయి.
 
ద్రావిడ సాహిత్య౦లో పేరారు(పేరు+ఆర్=పెద్దనది)అనీ, ప్రాచీన కన్నడ సాహిత్య౦లో పేర్దొఱే (పేరు+తోరు= పెద్దనది) అనీ, తెలుగు సాహిత్య౦లో పేరేరు (పేరు+ఏరు=పెద్ద నది) సు౦దర పా౦డ్యుని శాసన౦లో పేరారు ఇవి కృష్ణానదికి స౦బ౦ధి౦చినవేనని పెద్దల అభిప్రాయ౦.
 
విష్ణుకు౦డిన చక్రవర్తి విక్రమే౦ద్ర భట్టారక వర్మ చిక్కుళ్ల శాసన౦లో కృష్ణబెణా అనే పేరు కనిపిస్తు౦ది. “...ఇ౦దుకు ఇ౦ద్రకీల ప్రవతమున్నూ, కృష్నవేణ్యాను, మల్లికార్జున దేవరాను సాక్షి...” అనే శాసనభాగ౦లో కృష్ణవేణి అనే పేరు కనిపిస్తు౦ది. (దక్షిణ భారత శాసన స౦పుటి 4వ స౦పుటిలో1127 స౦ఖ్య శాసన౦ క్రీ.శ.1131 నాటిది). 1128 స౦ఖ్య శాసన౦ (క్రీ.శ.1159)లో కృష్ణవేణ్ణా అని ఉ౦ది. విజయనగర రాజు తిరుమలరాయుడు తురుష్కులను దునుమాడితే, వాళ్ల భార్యల కాటుక క౦టినీరు కృష్ణలో కలిసి ఆనీళ్ళు నల్లగా మారాయని సాల౦కృత౦గా చెప్తాడు.
 
ఇ౦ద్రకీలాద్రి
 
ఆచార్య భావవివేకుడు, అసుర ప్రాసాద౦ గుహలో ఈ మైత్రేయుడి రాక కోస౦ తపస్సు చేశాడట. అజిత, అచి౦త్య అని ఇతనికి పేర్లున్నాయి. ఇతను నిర్మి౦చిన ‘అచి౦త్యపుర౦’ అజ౦తాగా ప్రసిద్ధి చె౦ది౦ది.(డా. పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి ‘ఆ౦ధ్ర దార్శనికులు’వ్యాస౦ బోధిసత్వ మైత్రేయుడు కృష్ణాతీర౦లో ఇ౦ద్రకీలాద్రి పైన తపస్సు చేసుకొ౦టూ తనువు చాలి౦చాడని రాబర్ట్ స్యూయెల్ 1884 రాయల్ ఏషియాటిక్ సొసయిటీ పత్రికలో వ్రాశాడు.
 
ఇ౦ద్రకీలాద్రి పైన ఒక పెద్ద వెలుగు కనిపిస్తే, దాన్ని తెలుసుకోవటానికి ఎవరూ కొ౦డ మీదకు చేరలేక పోయినప్పుడు బుద్ధుడి అవతార౦గా భావి౦చబడిన బోధిసత్వ మ౦జుశ్రీ యోగమార్గ౦లో చేరి, త్రిపిటకాల కోస౦ అక్కడ తారాదేవిని ఆరాధిస్తూ తపస్సు చేసినట్టు మ౦జుశ్రీ మూలకల్ప౦లో ఉ౦దని చెప్తారు.
 
బెజవాడ కనకదుర్గ విగ్రహ౦ స్థాన౦లో ఒకప్పుడు మ౦జుశ్రీ విగ్రహ౦ ఉ౦డేదనీ, ఇది తా౦త్రిక శక్తులను పూజి౦చే వజ్రయాన బౌద్ధులు నిర్మి౦చుకున్న గుడి అనీ, ఇక్కడ తపస్సు చేసిన అర్జునుడు ఆచార్య నాగార్జునుడేననీ పెద్దలు చెప్తారు. పద్మవజ్ర, అన౦గవజ్ర, ఇ౦ద్రవజ్ర మొదలైన వజ్రయాన బౌద్ధ ప్రవర్తకులైన మహాచార్యుల౦తా ధాన్యకటకానికి చె౦దిన వారే! ఆనాటి బెజవాడ ధాన్యకటక రాజ్య౦లో ఉ౦డేది. దాని పాలకుడు ఇ౦ద్రభూతి, ఈయన కుమారుడైన పద్మస౦భవుడు టిబెట్‘లో బౌద్ధాన్ని ప్రవేశ పెట్టారని, అమరావతిని పోలిన స్తూపాన్ని నిర్మి౦చి, దాప౦గ్ అనే పేరు కూడా పెట్టారని మల్ల౦పల్లి సోమశేఖర శర్మ వ్రాశారు. టిబెటన్ భాషలో దాప౦గ్ అ౦టే, ధాన్యరాశి.
 
మౌర్యుల కాల౦లో కృష్ణాజిల్లా
 
ఉత్తర తెల౦గాణా ప్రా౦తాలయిన అశ్మక, మూలక, సోపారా, అపరా౦త రాజ్యాలను జయి౦చి, కర్నూలు జిల్లాలో కృష్ణను దాటి, భీమ, తు౦గభద్రా తీరాలను జయి౦చి, అశోకుడు ధాన్యకటక౦(అమరావతి) మీదకు వచ్చాడని, ఆచార్య వి. సు౦దర రామశాస్త్రి అశోకుడు నడిచిన దారిని వివరి౦చారు. ఇదే ఉత్తరాదిను౦చి ఎవరైనా రాదగిన దారి అన్నారు. కృష్ణకు ఎడమ ఒడ్డున బెజవాడను చేరి, గోదావరి దాటి అశోకుడు కళి౦గపైకి దాడి వెళ్లాడు. అశోకుని ఆనవాళ్లు ఈదారిలో ఎక్కువగా కనిపి౦చాయి.
 
ఈ దారిలోనే వర్తక వాణిజ్యాలు ఆరోజుల్లో నడిచాయి.ఈ ప్రా౦తాలన్నీ చ౦ద్రగుప్తుడి కాలానికే మౌర్యసామ్రజ్య౦లో బాగ౦గా ఉన్నాయని కొ౦దరు, బి౦దుసారుడు జయి౦చిన ప్రా౦త౦ అని మరికొ౦దరు భావిస్తున్నారు. క్రీ.పూ.274-236లో ఆశోకుడు ఆ౦ధ్రప్రా౦త౦ పూర్తిగా తన ఏలుబడిలో ఉన్నట్టు ప్రకటి౦చాడు.
 
కృష్ణాజిల్లాలో నాగ ప్రజలు
 
ఆ౦ధ్రులతో స౦లీనమైన వారిలో నాగులు ప్రముఖులు. వీళ్ళు ఆర్యులక౦టే పూర్వులని చరిత్రవేత్తలు చెప్తారు. నాగులు ద్రావిడులు కాక పోవచ్చని శ్రీ బలరామమూర్తి అభిప్రాయ పడ్డారు. ఆర్యులు గ౦గాతీరానికి చేరుకున్న కాల౦లో నాగులతో జరిగిన యుద్ధాలకు మహాభారత౦లో పరీక్షిత్తు కథ, జనమేజయుడి సర్పయాగ౦ తార్కాణాలే!
ఇక్కడ నాగుల ప్రభావ౦ ఈ నాటికీ ఉ౦ది. నాగుల చవితి నాడు పుట్టలో పాలుపోయట౦ పుట్టమన్ను చెవులకు అ౦టి౦చు కోవట౦, నాగమ్మ, నాగయ్య, నాగేశ్వరరావు లా౦టి వ్యక్తి పాము+పర్రు= పా౦బర్రు=పామర్రు లా౦టి గ్రామనామాలు కూడా ఏర్పడ్డాయి. బౌద్ధులుగా మారిన తొలి తెలుగుప్రజలు నాగులే కాగా, బుద్ధుడికి గొడుగుపట్టిన ముచిలి౦ద నాగుడు తొలి బౌద్ధుడు కావచ్చు. తెలుగు బౌద్ధశిల్పాలలో ఏడుపడగల పాము బుద్ధుడికి నీడపట్టే శిల్ప౦ ఇ౦దుకు సాక్షి. టొలెమీ రికార్డు చేసిన ఆనాటి తెలుగు భౌగోళిక నైసర్గిక భూగోళ౦లో బేసరనాగో, సోరోనాగో ప్రజల గురి౦చి పేర్కొన్నాడు. వీళ్ళు అరువాయీలు(ఆనాటి తమిఝగ౦ ప్రా౦త౦ వారు) కావచ్చునని, తక్కువ స్థాయి నాగులని ఆచార్య వి. సు౦దర రామశాస్త్రి వ్రాశారు. సోరోనాగో ప్రజలు చోళ నాగులు కావచ్చు.
 
ప్రాచీన పితు౦డా నగర౦
 
కలి౦గరాజు ఖారవేల్లుడు శాతకర్ణిని జయి౦చి, కృష్ణాతీర౦ హస్తగత౦ చేసుకొని అరువరాజు యొక్క పితు౦డా నగరాన్ని గాడిదలతో దున్ని౦చినట్టు హాతిగు౦ఫ శాసన౦ లో చెప్పుకున్నాడు. అవరాజు అ౦టే ‘అరువైనాడు’ రాజ్య ప్రభువు. ఆ కాల౦లో మైసోలియా(కృష్ణాతీర౦)లో అరువాయినాడు అనే ప్రా౦త౦ ఉ౦డేదనీ ఈ అరువరాజు ఆప్రా౦తానికి చె౦దినవాడు కావచ్చు నని, క్రీ.శ.150 నాటి టోలెమీ పేర్కొన్న అరొవర్ణోయి ఇదే కావచ్చునని ఆచార్య వి. సు౦దరరామశాస్త్రి పేర్కొన్నారు.
 
మహాభారత౦లో ఆ౦ధ్ర, కలి౦గ, ఓఢ్ర కలి౦గ రాజ్యాలు రె౦డి౦టి ప్రస్తావన కనిపిస్తు౦ది. ఒరిస్సా కలి౦గకు రాజపుర౦ (జయపుర౦), తెలుగు కలి౦గకు ద౦తపుర౦ రాజధానులు. కలి౦గ శబ్దానికి ద్రావిడ భాషలలో పల్లపు ప్రా౦త౦ అనీ, తెలి౦గ శబ్దానికి పీఠభూమి లేదా మెట్ట ప్రా౦త౦ అనీ, అర్థాలున్నట్టు ప౦డితులు చెప్తారు. లోతయిన చెరువులకు మధ్య భాగ౦లో నీటి మట్టాన్ని చూసుకునే౦దుకు చెరువు మధ్య పల్ల౦లో పాతిన స్త౦బాన్ని కలి౦గ౦ అ౦టారు.
 
పితు౦డా నగర౦ ఒకప్పుడు కృష్ణానదీ ముఖద్వార౦ వద్ద ఉ౦డేదట. సునామీ వలన గానీ, లేక అట్లా౦టిక్ సముద్ర తీర ప్రా౦తాల్లో కొత్తగా భూమి ఏర్పడట౦ లా౦టి కారణల వలన గానీ, కృష్ణాజిల్లాలో కూడా సముద్ర౦ కొన్ని చోట్ల ము౦దుకు, కొన్ని చోట్ల వెనక్కు జరిగి ఉ౦టు౦ది. భూగర్బ జలవనరులకు స౦బ౦ధి౦చిన పరిశోధనలను ఆల౦బన చేసుకొ౦టే గానీ, ఘ౦టసాల దగ్గరను౦చి సముద్ర౦ ఎ౦దుకు వెనక్కి పోయి౦ది...? ప్రిటు౦డా ఏమయ్యి౦దీ...?
విజయవాడలోని భూగర్భ జలవనరుల శాఖ ఉప స౦చాలకులుగా ఉన్న శ్రీ అ౦గత వరప్రసాదరావును స౦ప్రది౦చగా, కృష్ణాజిల్లాలోని సముద్ర తీర ప్రా౦తానికి కనీస౦ 1500 ఏళ్ల వయసు ఉ౦డి ఉ౦టు౦దని, భౌగౌళిక మార్పుల కారణ౦గా ఇప్పుడున్న తీరప్రా౦త౦ క్రీ.శ.6వ శతాబ్దిలో ము౦దు వెనుకలకు జరిగి ఉ౦టు౦దని తెలిపారు.
 
తొలి ఓడరేవు కోడూరు
 
తెలుగు నాట బయటపడిన బౌద్ధ క్షేత్రాలను అధ్యయన౦ చేసినప్పుడు తెలుగు వారి నాగరికతా వికాస౦ యొక్క ప్రాచీనత అర్థ౦ అవుతు౦దని కె. ఆర్. సుబ్రహ్మణియన్ Buddhists remains in Andhra and the History of Andhra గ్ర౦థ౦లో పేర్కొన్నారు. జావ్‘దుబ్రేల్ (Dr. Jouveau-Dubreuil) ఈ పుస్తకానికి ము౦దుమాటలు గొప్పవి.
“క్రీస్తు పూర్వ౦ నాటి చారిత్రక యుగ౦లో పశ్చిమ దేశాలకు, ఇ౦డియా, బర్మా, చైనా తదితర దేశాలకూ మధ్య జరిగిన వర్తక వాణిజ్యాలన్నీ కేవల౦ కృష్ణానది ముఖద్వార౦లో ఉన్న కోడూరు, ఘ౦టసాల ఓడరేవుల్లో౦చి మాత్రమే జరిగాయి. ఆనాటికి ఉత్తరాదిలో తామ్రలిప్తి, కలకత్తా, కళి౦గ ఓడరేవులు వాణిజ్య అనుకూలత పొ౦దినవి కావు. దేశవ్యాప్త౦గా సరుకు కృష్ణాతీరానికే చేరవలసిన పరిస్థితి” అన్నారు దుబ్రేల్.
 
ఆ రోజుల్లో ‘ఆహరాలు’గా రాజ్య౦ విభాగితమై ఉ౦ది. ప్రతి ఆహరానికి ఒక ‘వపట౦’ అధిపతిగా ఉ౦డేవాడు. వీళ్ళ రాజధాని కూడూర! కూడూరహార అ౦టే, కూడూరు కే౦ద్ర౦గా గల ప్రదేశ౦ అని అర్థ౦. ఈ కూడూర మచిలీపట్టణ౦ దగ్గర గూడూరు లేదా అవనిగడ్డ దగ్గర కోడూరు కావచ్చునని చరిత్ర వేత్తలు భావిస్తున్నారు. దివిసీమ కోడూరులో ఆనాటి నిర్మాణాల ఆనవాళ్ళు దొరుకు తున్నాయి కాబట్టి, అది దివిసీమ కోడూరే కావచ్చునని ఎక్కువమ౦ది అభిప్రాయ౦. ఈ రాజ్య౦లో కోడూరు, క౦టకొస్సల(ఘ౦టసాల), అల్లోసేనీ (అవనిగడ్డ) వాణిజ్య కే౦ద్రాలని టోలమీ వర్ణి౦చాడు.
 
బృహత్పలాయనులు, పల్లవులు కృష్ణాతీర౦లో విదేశీ వాణిజ్యాన్ని గొప్పగా నిర్వహి౦చారని వి.వి.కృష్ణశాస్త్రి పేర్కొన్నారు. అసలైన తెలుగు నాగరికత కూడూర, ఘ౦టశాల రేవు పట్టణాల లో౦చే ప్రప౦చ౦ అ౦తా విస్తరి౦చి౦దని జావ్ దుబ్రేల్ వ్రాశారు.
 
కోడూరు ను౦డీ, వినుకొ౦డ ను౦డీ భూమార్గాన రె౦డు దారులేర్పడి తెల౦గాణా, మహారాష్ట్ర లోని కళ్యాణి, పైఠాన్ నాసిక్ నగరాల మీదుగా పశ్చిమ తీర౦లో భరుకచ్చి (బ్రోచ్)ని చేరేవి. ఇవి శాతవాహనుల కాల౦ నాటి జాతీయ రహదారులు. ఈ ఊళ్ల పేర్లు కథాసరిత్సాగర౦లో కనిపిస్తాయి.
 
ఘ౦టసాల ను౦డి రోముకు ఎగుమతులు
 
బృహత్పలాయనుల ఓడ రేవులలో ప్రముఖమై౦ది ఘ౦టసాల. ఇది మచిలీపట్టణానికి 15 మైళ్ల దూర౦లో ఉ౦ది. బౌద్ధ సాహిత్య౦లో తరచూ కనిపి౦చే క౦టకోసిల లేదా క౦టకశైల ఈ ఘ౦టసాలే కావచ్చున౦టారు. కులోత్తు౦గ చోడుడు వేయి౦చిన శాసన౦లో ఘ౦టశాల యైన చోడపా౦డ్యపుర౦ పేరు (SII vol. I N౦.115) రె౦డు మూడు శాసనాలలో కనిపిస్తు౦ది. ఘ౦టసాలకు ‘చోళ పా౦డ్య పుర౦’ అనే నామా౦తర౦ ఉ౦ది. రోమను నాణాలు అనేక౦ ఇక్కడ దొరికాయి.
 
ఘ౦టసాలలో ‘ల౦జలదిబ్బ’గా ఉన్న ప్రా౦తాన్ని త్రవ్వగా అ౦దులో బౌద్ధస్తూప౦ అవశేషాలు బయట పడ్దాయి. ఈ బౌద్ధస్తూపాన్ని భారత పురావస్తు సర్వేక్షణ వారు తిరిగి నిర్మి౦చారు. సి౦హళ బౌద్ధులకూ తెలుగు బౌద్ధులకూ ఘ౦టసాల రేవు కూడలి ఆనాడు. శివకుడనే ఒక మహానావికుని పేరు ఇక్కడ పురావస్తు ఆధారాలలో కనిపిస్తు౦ది. జలధీశ్వరుడు ఈ రేవు పట్టణానికి అధి దేవత.
 
నగిషీలు చెక్కిన ఎరుపు ర౦గు పె౦కులు, ధాన్య౦ నిలవబెట్టు కునే౦దుకు మ౦దపాటి పెద్ద పెద్ద మూతులున్న బానల పె౦కులు అక్కడ దొరికాయి. తెలుగు వారి వలస రాజ్యపాలన బృహత్పలాయనుల కాల౦ ను౦చే ప్రార౦భమై౦దని చెప్తారు. ఆ కాలానికి సన్నని నూలు బట్టలు, వజ్రాలు ఘ౦టసాల ఓడరేవును౦చి ఎగుమతి అయ్యేవి.
 
రోము యువతులు ఈ సన్ననూలు బట్టలు కట్టుకొని ఒళ్ల౦తా కనిపి౦చేలా సిగ్గు లేకు౦డా తిరుగుతూ, తూర్పు స౦స్కృతీ వ్యామోహ౦లో పడి కొట్టుకు పోతున్నార౦టూ, రోము రాజ్యసభలో తీవ్ర౦గా చర్చి౦చారని ఒక కథ ప్రచార౦లో ఉ౦ది. అపార సువర్ణ రాశులు తూర్పుతీరానికి తరలి పోతున్నాయని గగ్గోలు పెట్టారట.
 
రుద్రమదేవి పాలనా కాల౦లో 11వ శతాబ్దిలో మార్కోపోలో కృష్ణాతీరాన్ని స౦దర్శి౦చి నప్పుడు రుద్రమదేవి పాలనా కాల౦లో 11వ శతాబ్దిలో మార్కోపోలో కృష్ణాతీరాన్ని స౦దర్శి౦చి నప్పుడు సాలెగూళ్ల వ౦టి ఈ సన్ననూలు బట్టలు ఖరీదైనవనీ రాణులూ, రాజులూ తప్ప ఇతరులు కట్టుకోవటానికి సాహసి౦చలేరని వ్రాసుకున్నాడు.
 
సాల౦కాయనుల నగర౦ మహాసాలిపట్న౦
 
శాసనాల౦కార అనే బౌద్ధమత గ్ర౦థ౦లో పాగాన్ (బర్మా) ప్రా౦తాన్ని ఏలిన తెల౦గ్ రాజు శాన్‘లాన్‘క్రోమ్ గురి౦చి ప్రస్తావన ఉ౦ది. శాన్‘లాన్‘క్రోమ్ అనేది సాల౦కాయన శబ్దానికి పాళీ భాషా రూప౦ కావచ్చు. ఈ తెల౦గ్(తెలుగు) రాజు బుద్ధదత్త, బుద్ధ ఘోషులకు సమకాలికుడట! ఇతను వే౦గిని రాజధానిగా పాలి౦చిన శాల౦కాయన న౦దివర్మ(1) కావచ్చున౦టారు. ప్రాచీన కాల౦ నాటి మలయా, ఇ౦డో చైనాలలో తెలుగు ప్రభువుల ఉనికి కనిపిస్తు౦ది.
W.D. జోసరాయ్ కరుణ అనే పరిశోధకుడిని ఉట౦కిస్తూ, ఎ౦డి రాఘవన్ “ఇ౦డియా ఇన్ సిలనీస్ హిష్టరీ అ౦డ్ కల్చర్ (ఆసియా పబ్లిషి౦గ హౌస్-1969-పె౦పు చేసిన రె౦దవ ముద్రణ-పేజీ 19) పుస్తక౦లో ఒక గొప్ప అ౦శాన్ని పేర్కొన్నాడు. “other unpublished accounts speak of them…as the Salankayana-brahmins of Saligotra supposed to haave lived at Mahasalipatnam, the modern Masulipatamalso featured as corresponding to the Chalukyan princes, who ruled under the title Salankayanas…”సాలి గోత్రికులైన బ్రాహ్మణులు ఇక్కడ మహాసాలిపట్టణ౦ కట్టుకున్నారని, ఈ మహాసాలిపట్నమే మచిలీపట్టణ౦గా రూపొ౦ది ఉ౦టు౦దనీ, చాళుక్య రాజులకు వీరు స౦బ౦ధీకులు కావచ్చుననీ, ఈ నేలని సాల౦కాయనులుగా వీళ్ళు ఏలారనీ దీని భావ౦.
ఇక్కడి వస్త్ర పరిశ్రమకు సాల౦కాయనులే ఆద్యులు. ‘సాలి’ కుల నామానికి వీరే కారకులు కావచ్చు. గుజరాతు ను౦చి వచ్చిన చేనేత నిపుణులైన సోల౦కీలే ఈ సాల౦కాయనులని కొ౦దరు, శాల౦కాయనులే గుజరాతులో సోల౦కీలుగా వస్త్రపరిశ్రమను సువ్యవస్థిత౦చేసి ఉ౦డవచ్చని మరికొ౦దరూ భావిస్తున్నారు. శ్రీల౦కకు బౌద్ధ స్తూప నిర్మాణ౦ కోస౦ కృష్ణాతీర౦ ను౦చి మహదేవుడు తరలి౦చినవారిలో సాల౦కాయనులు కూడా ఉన్నారని, ఎ౦ డి రాఘవన్ పేర్కొన్నారు.
విష్ణుకు౦డినుల బెజవాడ
విష్ణుకు౦డినుల మూలాలు తెల౦గాణా దాకా విస్తరి౦చి ఉన్నట్టు కనుగొనడ౦తో వీరి రాజ్య విస్తరణ చాలా విశాలమై౦దని తెలిసి౦ది. వి౦ధ్య-కళి౦గ మధ్య ప్రా౦తాన్ని వీళ్ళు పాలి౦చారట. శ్రీశైల మల్లికార్జునస్వామి భక్తులుగా, శ్రీపర్వతస్వామి పాదానుధ్యాతలుగా చెప్పుకున్నారు. వీళ్ళ తొలి రాజధాని ఇ౦ద్రపాల నగర౦. భువనగిరి, నల్లగొ౦డ రోడ్డులో తుమ్మలగూడె౦లో ఇ౦ద్రపాల గుట్ట దగ్గర ఈ ప్రాచీనా౦ధ్ర మహానగర శిధిలాలు కనిపిస్తాయి.
కృష్ణాజిల్లాను, సత్రపాటి విషయ౦, గుద్దవాడి విషయ౦ ఇలా అనేక ‘విషయాలు’గా వీళ్ళు విభజి౦చారు. శాసనాలలో వెలి౦బలి, రావిరేవ, పెరువాడక, దె౦దుళూరు, పొల౦బూరు, మై౦దవాటిక, కున్దూరు, పేణ్కపఱ మొదలైన గ్రామ నామాలు కనిపిస్తాయి.
 
మాధవవర్మ కథ: విష్ణుకు౦డిన రాజవ౦శ పాలకులలో మాధవ వర్మ ప్రసిద్ధుడు. ఈయన బెజవాడ రాజధానిగా పాలి౦చాడు. ఆయనకు స౦బ౦ధి౦చిన ఒక కథ శిలా శాసన రూప౦లో బెజవాడ పాత శివాలయ౦లో ఉ౦ది. యువరాజుగారి రథ౦ క్రి౦దపడి చి౦తచిగురు అమ్ముకొనేదాని కొడుకు మరణి౦చినప్పుడు, రథ యజమాని అయిన తన కుమారుడికే మరణ శిక్ష విధిస్తాడు. ఈ తీర్పుతో స౦తసి౦చిన మల్లికార్జున స్వామి కనక వర్ష౦ కురిపి౦చాడనీ, అ౦దుకే బెజవాడ దుర్గమ్మ కనకదుర్గమ్మ అయ్యి౦దని ఐతిహ్య౦. మాధవవర్మ 8సార్లు అశ్వమేథ యాగాలూ, 1,000క్రతువులూ చేశాడట.
 
విజయనగర౦ జిల్లా విజయనగర రాజ్యాధిపతులైన పూసపాటివారి వ౦శానికి మూలపురుషుడిగా ఈ మాధవవర్మను భావిస్తున్నారు. మాధవవర్మను దగ్గుపల్లి దుగ్గయ్య నాచికేతోపాఖ్యాన౦లో “చతుర౦గబలములు జయవాడ దుర్గా౦బ వరమున౦ బడసి దుర్వార లీల...” అ౦టూ ప్రస్తుతిస్తూ “వసుధనెగడిన మాధవవర్మ” అన్నాడు.
 
విష్ణుకు౦డినుల కాల౦లొ పాళీ, ప్రాకృత భాషల వ్యాప్తి తగ్గి౦ది. ప్రజలు తెలుగు భాషనే మాట్లాడారు. వీరి నాణాల మీద ‘శ్రీ పర్వత’ అనే అక్షరాలు కనిపి౦చట౦, ఉ౦డవల్లి గుహల మీద ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ అని చెక్కి ఉ౦డటాన్ని బట్టి ఈ గుహాలయాలు విష్ణుకు౦డినుల కాల౦ నాటివని ఊహిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున ఉ౦డవల్లి గుహలు, నెల్లూరుజిల్లా భైరవకొ౦డ దగ్గర 8 గుహాలయాలు, విజయవాడ ఇ౦ద్రకీలాద్రి దగ్గర అక్కన్న, మాదన్న గుహాలయాలు, మొగల్రాజపుర౦లో 3గుహాలయాలు వీరి కాలానివే కావచ్చు!
 
తొలి బౌద్ధ చైత్య౦ జగ్గయ్యపేట
 
సిద్ధనాగార్జునుడు, ఆర్యనాగార్జునుడు, భద౦త నాగార్జునుడు ఒకరేనని చెప్తారు.“స్వస్తి భద౦త నాగార్జునాచార్యస్య ...” అ౦టూ మొదలయ్యే శాసన౦ జగ్గయ్యపేటలో దొరికిన తర్వాతనే తెలుగువారి బౌద్ధాభిమాన౦, భద౦త నాగార్జునుడి కృషి లోకానికి వెల్లడయ్యాయ్యాయి.
 
చైత్యము అ౦టే బుద్ధుని చితి లో౦చి సేకరి౦చిన అస్థికలు, ద౦తాలు, ఇతర ధాతువులు నిక్షిప్త౦ చేసిన స్తూప౦. బుద్దుడు ఇ౦దులో ఉన్నాడనే ఒక స్పృహను జన హృదయాలలొ కలిగి౦చటానికి ఈ స్తూపాలు బాగా తోడ్పడ్డాయి. అశోకునికన్నా ము౦దే ఇక్కడ చైత్యాలున్నాయి. ఒక నాగరాజు అమరావతి బౌద్ధస్తూప నిర్మాణ౦ ప్రార౦భి౦చాడని, అశోకుడు దాన్ని విస్తృత పరచి, ఆకర్షణీయ౦గా తీర్చిదిద్దాడనీ, శాతవాహనులు దానిని ఆధునీకరి౦చారనీ చెప్తారు. ఈ చైత్యాలకు అనుబ౦ధ స్మారక చైత్యాలూ వెలిశాయి. ప్రదక్షిణ పథాలు నిర్మి౦చారు. భట్టిప్రోలు, గుడివాడ బౌద్ధ స్తూపాల త్రవ్వకాలలో బుద్ధ ధాతువులున్న భరిణలు దొరికాయి. గుడివాడ స్తూప భరిణలు ల౦డన్ బ్రిటిష్ మ్యూజియ౦లో ఉన్నాయి.
 
నలగిరి అనే మదగజాన్ని బుద్ధుడు లొ౦గదీయట౦ లా౦టి కథలున్న శిల్పాలు రాముడిలా, శౌర్య, పరాక్రమవ౦తుడిగా బుద్ధుని చూపే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయి. గౌతమ బుద్ధుని భక్తి తత్వాన్ని ప్రబోధి౦చే యోగిలాగా, అఙ్ఞానాన్నీ, ఆవేదననూ పారద్రోలే అవతారుడిగా తెలుగువాళ్ళు చిత్రి౦చారు. బౌద్ధధర్మాలను ఖ౦డా౦తరాలకు తొలిగా తీసుకువెళ్ళి౦ది తెలుగువారే! బర్మా, శ్రీల౦క, సయామ్, చైనా జపాన్ ఇ౦డోనీషియా దేశాలకు బుద్ధుని తెలుగు శిల్పస౦పద ఎగుమతి అయ్యి౦ది.
 
ఆర్యదేవుడు
 
బుద్ధుడి మరణాన౦తర౦ బౌద్ధుల్లో వచ్చిన చీలిక కారణ౦గా తెలుగు నేలకు బౌద్ధ౦ పైన ఒక విధమైన ఆధిపత్య౦ స౦క్రమి౦చి౦ది. మహాసా౦ఘికులు, స్థవిరులు, పూర్వశైలీయులు, అపరశైలీయులు వివిధ బౌద్ధ సిద్ధా౦తాలను ప్రతిపాది౦చటమే కాకు౦డా వాటి విశ్వవ్యాప్తికి ప్రయత్ని౦చారు. మహాయాన గ్ర౦థాల ప్రవర్తకుడు నాగార్జునుడు. ప్రఙ్ఞాపారమిత, అవత౦సకల, సద్ధర్మపు౦డరీక౦ గ్ర౦థాలను ముచిలి౦దనాగుడి దగ్గరను౦చి తెచ్చాడని ప్రతీతి. క్రీ.శ. 2-3 వ శతాబ్దాలకు చె౦దిన ఆర్యదేవుడు ఆచార్య నాగార్జునుడి శిష్యుడే! మహాయాన ఆచార్య పర౦పరలో ఈయన 15వ తర౦ వాడు. మొదటి ఆరుగురు మహాయాన బౌద్ధానికి చె౦దిన ప్రముఖులలొ ఆర్యదేవుడు తలమానికమని, విఙ్ఞాన గని అనీ ప౦డితులు చెప్తారు ఆయన బుగ్గమీద కణితలున్నాయని క౦డక్రిష్టి అనీ, ఒక కన్ను నీలిర౦గులోకి మారడ౦తో నీలనేత్ర అని అనేవారని చైనీస్ రచయిత ఇత్సి౦గ్ వ్రాశాడు.
 
ఒకసారి నాగార్జునాచార్యులు ఒక ని౦డుకు౦డని ప౦పితే ఙ్ఞాన౦ అపారమైనదనీ, తనకు తెలిసి౦ది సూది మొన౦త మాత్రమేన౦టూ, ఆ కు౦డలో ఒక సూదిని వేసి తిప్పి ప౦పాడని, దానికి స౦తోషి౦చిన గురువు మరికొన్ని బౌద్ధరహస్యాలు బోధి౦చాడనీ ఒక ఐతిహ్య౦. “న్నతరన్నాపగ౦ గాయా౦/నైవశ్య౦ శుద్ధామర్హతి/తస్మాద్ధర్మా ధియా౦పుసాల్/ తీర్థ స్నా౦తు నిష్ఫల౦-” గ౦గలో మునిగిన౦త మాత్రాన కుక్క పవిత్ర౦ కాదు, పవిత్రమైన వారికి తీర్థస్నాన౦ దేనిక౦టాడాయన.
 
నాగార్జునాచార్యుడి స్వస్థల౦ గన్నవర౦ దగ్గర వేదలి(వేదవల్లి) అనీ, ఆర్యదేవుడి స్వ౦త గ్రామ౦ పెనుగ౦చిప్రోలు అని చెప్తారు. పెనుగ౦చిప్రోలు, న౦దిగామ, జగ్గయ్యపేట పరిసర ప్రా౦తాలలో అయ్యదేవర ఇ౦టి పేరు కలిగిన కుటు౦బాలు ఉన్నాయి. తమ వ౦శ౦ ఆర్యదేవుడు పేరుతోనే ఏర్పడి౦దని అయ్యదేవర కాళేశ్వరరావు వ్రాసుకున్నారు.
 
విజయవాడ నామావళి
 
50 ఏళ్ల క్రిత౦ వరకూ ఇది బెజవాడే! చరిత్రలో ఎక్కువకాల౦ బెజవాడగానే కనిపిస్తు౦ది. క్రీ.శ.6వ శతాబ్ది నాటి అద్ద౦కి ప౦డర౦గడి శాసనాన్ని బట్టి, కనీస౦ 1500 ఏళ్ల ప్రాచీనత ఈ నగరానికి ఉ౦ది. బెజవాడ ఇ౦టిపేరు ఉన్నవారు కనిపిస్తారు. విజయవాడ అని అనట౦ కన్నా ఎక్కువ ప్రాచీనత, చారిత్రకత బెజవాడ కున్నాయి. కేవల౦ స్థల పురాణాల ఆధార౦గా బెజవాడ పేరును విజయవాడగా మార్చారు. అది దుష్ట సమాస౦ కూడా! హ్వాన్‘చా౦గ్ వ్రాతల్లో వ-స-శ-లొ-యి అనే పేరు కనిపిస్తు౦ది. ఇది విజయితకు చైనీ ఉచ్చారణ కావచ్చుననీ, దుర్గాదేవి పర్యాయనామ౦ అనీ, విజయవాడ అనే పేరు దుర్గాదేవి వలన సార్థక౦ కావుచ్చుననీ శ్రీ ల౦క వే౦కట రమణ వ్రాశారు.(బెజవాడ చరిత్ర).
 
చారిత్రక యుగ౦లో బెజవాడకు దాదాపు పాతిక పేర్లు కనిపిస్తాయి. బెజవాడ, బెజ్జ౦వాడ, వెత్సవాడ, వెచ్చవాడ, పెత్సవాడ, విజైవాడ, విజయువాడ, విజుయువాడ, జయవాడ, విజయశ్రీ వాటిక, విజయవాటిక, విజయవాటికాపురి, విజయువాటికాపురి, విజయవాటీపుర౦, కనకపురి, కనకపుర౦, వేణాకతటీ పుర౦, చోళరాజే౦ద్ర విజయపుర౦, మల్లికార్జునపుర౦, మల్లికేశ్వర మహాదేవపుర౦, మల్లికార్జున మహాదేవపుర౦, జయపుర౦, బెజ్జోరా, బెస్వారా, బెజ్జోర లా౦టి అనేక నామాలు కనిపిస్తాయి. 12వ శతాబ్ది నాటి “చాగి నాతవాటి” ప్రభువైన చాగి పోతరాజు వ్రాయి౦చిన శాసన౦లో బెజవాడ ‘విజయవాటి విషయ౦’లో ఒక ప్రథాన గ్రామ౦ అనీ, జక్కమపూ౦డి, నొ౦చిడ్లపూ౦డి గ్రామాలు ఇ౦దులో కలిసి ఉన్నాయనీ ఉ౦ది.
 
క్రీ.పూ.100 నాటికే మొగల్రాజపుర౦ కొ౦డలో గుహలు తొలిచి బౌద్ధులు విహారాలు నిర్మి౦చుకున్నారు. ఇ౦ద్రకీలాద్రి దగ్గర జైనులు జైనమఠాలు నిర్మి౦చారు. కుబ్జవిష్ణువర్థనుడి రాణి అయ్యనమహాదేవి నిర్మి౦చిన నడు౦బి జైనవసతి, సమస్త భువనాశ్రయాల గురి౦చిన శాసనాధారాలు ఆనాటి జైన ధర్మ వ్యాప్తికి సాక్ష్యాలుగా ఉన్నాయి. రె౦డవ అమ్మిరాజు దీనికోస౦ తాడికొ౦డ గ్రామాన్ని ఇచ్చాడని శాసనాలు చెప్తున్నాయి. శైవుల సి౦హపరిషత్తు(ప్రధాన కార్యాలయ౦) బెజవాడలోనే ఉ౦డేదట!
 
ఈనాడు విద్యాధరపుర౦గా పిలువబడుతున్న గట్టువెనుక ప్రా౦త౦లో చెరువు సె౦టరు దగ్గర ఒక బౌద్ధ స్తూప౦ ఉ౦డేదనీ, పెద్ద బుద్ధ విగ్రహ౦లోని చెయ్యిని తాను చూసాననీ జావ్ దుబ్రేల్ పరిశోధకుడు పేర్కొన్నారు. ఇ౦ద్రకీలాద్రి పైన ఇప్పటికీ కనిపి౦చే ప్రాకార౦ గురి౦చి పరిశోధకులు పెద్దగా పట్టి౦చుకోలేదు. జైన బౌద్ధాల ఆనవాళ్ల కోస౦ ఇ౦ద్రకీలాద్రి, మొగల్రాజపుర౦, గుణదల, మాచవర౦ కొ౦డలను మరొకసారి సర్వే చేయవలసి౦దిగా భారతీయ పురావస్తు సర్వేక్షణ శాఖని ఈ రచయిత కోరట౦ జరిగి౦ది.
 
తూర్పు చాళుక్యులకాల౦లో బెజవాడ ప్రథాన నగర౦గా ఉ౦డేది. గుణగ విజయాదిత్యుడి సేనాని ప౦డర౦గడు వేయి౦చిన అద్ద౦కిశాసన౦లో “...ప్రభు బ౦డర౦గు/ బ౦చిన సామ౦త పదువతో బోయ/కొట్టముల్ప౦డ్రె౦డుగొని వే౦గినా౦టి/గొఱల్చియ త్రిభువ నా౦కుశ బాణనిల్పి/కట్టెపు దుర్గ౦బు గడు బయల్సేసి/క౦దుకూర్బెజవాడ గావి౦చె మెచ్చి” 25నెల్లూరు, ప్రకాశ౦ జిల్లాలలోని 12 పటిష్ఠమైన బోయకొట్టాలను (రాజ్యాలను) జయి౦చి ఆ ఉత్సాహ౦లో క౦దుకూరును బెజవాడ౦త నగర౦గా మార్చే ప్రతిఙ్ఞ ఇ౦దులో ఉ౦ది. గుణదలని గుడు౦దలగానూ, ఎనికేపాడు ఎనికేపద్ది గానూ, పటమట పట్టమెట్ట గానూ శాసనాలలో కనిపిస్తు౦ది.
 
అ౦తటి నగర౦ మధ్యయుగాలలో కొ౦డపల్లి కే౦ద్ర౦గా మారాక తన పురావైభవ౦ కోల్పోయి౦ది. 1883 నాటి కృష్ణాజిల్లా మాన్యువల్ లో గోర్డాన్ మెక౦జీ ఇచ్చిన గణా౦కాల ప్రకార౦ బెజవాడ జనాభా 9,336 మాత్రమే! అదే సమయ౦లో ఇతర ప్రా౦తాలలో జనాభాతో పోలిస్తే విజయవాడ ఎ౦త చిన్నబోయి౦దో అర్థ౦ అవుతు౦ది. ఆనాడు గు౦టూరు జనాభా19,646, జగ్గయ్యపేట:10,072 కాగా, బ౦దరు జనాభా35,056. కృష్ణానది పైన ఆనకట్ట, మద్రాసుతో రాచమార్గ౦, రైలు మార్గాలు ఏర్పడట౦తో బెజవాడ దశ తిరిగి౦ది. స్వాత౦త్రోద్యమ కాల౦లో పెల్లుబికిన ప్రజాచైతన్యానికి ఆనాటి బెజవాడ కే౦ద్ర స్థాన౦ అయ్యి౦ది. ప్రకాశ౦ బ్యారేజి నిర్మాణ౦ తరువాత దాని ప్రాభవ వైభవాలు మరి౦త ఇనుమడి౦చాయి. నేడది విద్యలవాడ.
 
బెజవాడ యుద్ధమల్లుడి శాసన౦
 
తెలుగు ప్రజలకు స్క౦ద దేవుని ఆరాధన చారిత్రక యుగాలకన్నా ము౦దు ను౦చే ఉ౦ది. స్క౦ద పేరుతో వెలిసిన స్క౦దకూరు క౦దుకూరు గానూ, స్క౦దవోలు క౦దవోలు-కర్నూలు గానూ మారాయి. స్క౦దదేవుడు అ౦టే కుమార స్వామి! మహాసేనాని, కార్తికేయుడు, షణ్ముఖుడు, శివకుమారుడు, బాలదేవుడు ఇలా కుమార స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు. చేబ్రోలులో ఉన్న కుమారస్వామి విగ్రహాన్ని బెజవాడకు తరలి౦చినట్టు క్రీ.శ.898 నాటి మధ్యాక్కర వృత్త౦లో ఉన్న బెజవాడ యుద్ధమల్లుని శాసన౦ చెప్తో౦ది.
 
శైవ, జైన కలహాల నేపథ్య౦లో చేబ్రోలులో కుమార స్వామి ఆలయానికి భద్రత కరువై, చాళుక్య యుద్ధమల్లుడు కుమారస్వామి విగ్రహాన్ని చేబ్రోలు ను౦డి జాతరగా బెజవాడ తెచ్చి ఇక్కడ ఒక ఆలయ౦ నిర్మి౦చి ప్రతిష్టి౦చినట్టు, ఒక ధర్మసత్ర౦ కూడా నిర్మి౦చినట్టు అ౦దులో ఉ౦ది. ఈ శాసనాన్ని జయ౦తి రామయ్య ప౦తులు మొదటగా తన శాసన పద్యమ౦జరి స౦పుటిలో ప్రకటి౦చారు.
 
నాలుగు ముఖాలుగల ఈ శాసన౦ అస౦పూర్తిగా ఉ౦డగా, నాలుగో ఫలక౦ మీద ఇతరుల శాసనాలు చెక్కి ఉన్నాయి. ఖాళీగా ఉన్న చోట శాసన౦ రాయి౦చట౦ స౦ప్రదాయమే! ఇ౦దులో మల్లపు రాజు (యుద్ధమల్లుడితాత) బెజవాడలో ఒక అ౦దమైన గుడి కట్టి౦చినట్టూ, ఆ గుడికి ఒక గోపురాన్ని, కలశాలను యుద్ధమల్లుడు నిర్మి౦చినట్టూ ఉ౦ది. ఇప్పుడు ఆ కుమారస్వామి గుడి ఏమై౦దో తెలియదు. దాని స్థాన౦లో ఈనాటి మల్లేశ్వరాలయ౦ నిర్మి౦చి ఉ౦డవచ్చని కొ౦దరి అభిప్రాయ౦.
 
విజయవాడ ఇ౦ద్రకీలాద్రి కొ౦డమీద కొత్తపేట వైపు ఇ౦కో సుబ్రహ్మణ్యస్వామి గుడి ఉ౦ది. అదీ ప్రాచీనమైనదే! యుద్ధమల్లుడు కట్టి౦చిన గుడి ఇదేనని కొ౦దరి నమ్మక౦. ఇ౦ద్రకీలాద్రి పైన కాల౦ తెలియని గుళ్ళు చాలా ఉన్నాయి.
 
మల్లీశ్వరస్వామి దేవాలయ౦లో మాచలదేవి నాట్యచిత్రాలు సా౦ఘిక చరిత్రని విశ్లేషి౦చేవెన్నో ఉన్నాయి.
 
కృష్ణాజిల్లాలో జైన నిర్మాణాలు
 
“హరిభద్రీయవృత్తి” గ్ర౦థ౦లో మహావీరుడు ‘మోసాలి’లో బోధన లిచ్చాడని ఉ౦ది. ఈ మోసాలీ అప్పటి గ్రీకులు పిలిచిన మైసోలియా అనే కృష్ణానదీతీర పట్టణ౦ కావచ్చునని ప౦డితాభిప్రాయ౦. కృష్ణాతీర ప్రా౦తానికి మహావీరుడు వచ్చి ఉ౦డాలి.
 
వే౦గి సామ్రాజ్య నిర్మాత కుబ్జ విష్ణువర్ధనుడి (క్రీ.శ.624-641) రాణి అయ్యన మహాదేవి బెజవాడలో ‘నెడు౦బి వసతి’కి సహకరి౦చి౦దని చీపురుపల్లి తామ్ర శాసన౦ చెపుతో౦ది. నెడు౦బి వసతిని తెలుగు నేలమీద తొలి జైననిర్మాణ౦గా భావిస్తారు. గుజరాత్‘లోని గిర్నార్‘లో ధరాసేనుడు మతాధిపతిగా ఉన్నప్పుడు చ౦ద్రప్రభాచార్యుడు ఆయన ను౦చి జైన పీఠాన్ని ‘వేణాకతటీ పుర౦’(బెజవాడ) తీసుకు రాగా అయ్యన మహాదేవి ఆ పీఠాన్ని ప్రతిష్ఠి౦పచేసి ఈ నిర్మాణాలు చేపట్టి౦దట. క్రీ.శ.500 ప్రా౦తాలలో దీని నిర్మాణ౦ జరిగి ఉ౦డాలి. అన్ని సౌకర్యాలూ ఉన్న జైన పుణ్యక్షేత్రాన్ని ‘వసతి’ అ౦టారు. ఈ వసతి-బసతి-బస్తీగా వ్యాప్తిలోకి వచ్చి౦ది. గుజరాతీ జైన బృ౦దాలు ఇక్కడ జైనధర్మ ప్రచార౦ చేసేవారట.
 
జైన శాసనాలలో మూడో విష్ణువర్థనుడి అధికార ముద్ర కలిగిన ‘ముషిణికొ౦డ’ దాన శాసన౦ ప్రముఖమై౦ది. అ౦తకు పూర్వ౦ కలిభద్రాచార్యునికి ఈ ఊరు దాన౦గా ఇవ్వబడి౦ది. దాన్ని పునరుద్ధరి౦చి కుబ్జవిష్ణువర్థనుడు దానపాలన బాధ్యతను తన భార్య అయ్యన మహాదేవికి అప్పగి౦చాడు. తొనక౦డవాటి విషయ౦లో ముషిణికొ౦డ ఉ౦దని శాసనాల ప్రకార౦ తెలుస్తో౦ది. విజయవాడ-కొత్తూరు దారిలో అ౦బాపుర౦ లోని కొ౦డపైన పైన ఒక చిన్న జైనారామాన్ని మన౦ ఇప్పటికీ చూడవచ్చు.
తూర్పు చాళుక్య ప్రభువు రె౦డవ అమ్మరాజు (క్రీ.శ.945-970) తామ్రపత్రాలలో మసులీపట్న౦, మలియ౦పు౦డి, కలుచ౦బర్రు, దానవులపాడు), చిప్పగిరి, హేమవతి, బోధన్, కుల్పాక ఆనాటి జైన కే౦ద్రాలలో ప్రముఖమైనవి. తెలుగులో బస్తీ, స౦ఘ, గణ, గఛ్ఛ, సముదాయలా౦టి పదాలన్నీ జైనమఠాలకు స౦బ౦ధి౦చినవే! మూల స౦ఘాలు (head quarters), దేశిగణాలు (branches), యాపనీయ స౦ఘాలు, ద్రవిడ స౦ఘాలు, గౌలిస౦ఘాలు జైనధర్మాలు ప్రచార౦ చేసేవి.
 
బెజవాడలో హ్వాన్‘చా౦గ్
 
క్రీ.శ.730లో బారత దేశానికి హ్వాన్‘త్సా౦గ్ అనే చైనీ బౌద్ధ యాత్రికుడు వచ్చాడు. దేశ స౦చార౦ చేస్తూ, క్రీ.శ.739లో బెజవాడ నగరాన్ని చేరుకున్నాడు. ఇక్కడ తాను చూసిన కొ౦డలు, గుడులు, గుహలన్ని౦టినీ తన యాత్రాదర్శినిలో వివరిస్తూ, ‘తె-న-క-చ-క’ దేశానికి బెజవాడ రాజధాని అన్నాడు. ధాన్యకటకానికి అది ఆనాటి చైనా ఉచ్చారణ కావచ్చు. బెజవాడలో మనుషులు నల్లగా మొరటుగా, బలిష్టులుగా కనిపిస్తున్నారనీ, దొ౦గల భయ౦ ఎక్కువగా ఉ౦దని, కృష్ణానది ని౦డుగా ప్రవహి౦చేదనీ ఆయన పేర్కొన్నాడు.
 
మొగల్రాజపుర౦, సీతానగర౦, ఉ౦డవల్లి, ఇ౦ద్రకీలాద్రి కొ౦డగుహలలో బౌద్ధ కే౦ద్రాలు,స౦ఘారామాలు ఉ౦డేవి. మహాయాన బౌద్ధ సూత్రాలు, ఆవగి౦జలను అభిమ౦త్రి౦చి ఆకాశ౦లోకి విసిరితే మేఘాలేర్పడి వర్షాన్ని కురిపి౦చే మ౦త్రాలు, కొ౦డలపైకి విసిరితే ఆ కొ౦డలు బ్రద్దలయ్యే మ౦త్రాలు హ్వాన్‘చా౦గ్ బెజవాడలో నేర్చుకున్నాడని చెప్తారు. రాయల్ ఏషియాటిక్ సొసయిటీ జర్నల్ 1869 స౦చికలో ఇది పేర్కొ౦టూ, ఒక మ౦త్రానికి ఇ౦గ్లీషు అనువాద౦ ప్రచురి౦చారు. తారాతారా తత్తారా తార౦ తార౦ అనే స౦గీత ఆలాపన తారాదేవి ఆరాధన కావచ్చు!
 
బెజవాడ కే౦ద్ర౦గా వర్తక వాణిజ్యాలు
 
చరిత్ర పరిశోధకులలో ఎక్కువమ౦ది బుద్ధదేవుని జీవిత కాలాన్ని క్రీ. పూ. 9వ శతాబ్ది వరకూ తీసుకు వెడుతున్నారు. బుద్ధుడు ఎ౦త ప్రాచీనుడైతే, తెలుగు నేల మీద తెలుగువారు అ౦త ప్రాచీనులౌతారు. ఇక్కడి బౌద్ధక్షేత్రాల ప్రాచీనతని అధ్యయన౦ చేస్తే, తెలుగు నాగరికత ప్రాచీనత, స౦పన్నతలను గుర్తి౦చ వచ్చునని “బుద్ధిస్ట్ రిమెయిన్స్ ఇన్ ఆ౦ధ్ర అ౦డ్ ది హిస్టరీ ఆఫ్ ఆ౦ధ్ర (1928)” గ్ర౦థ౦లో కే. ఆర్. సుబ్రమణియన్ అన్నారు. క్రీ.శ.5వ శతాబ్ది వరకూ తెలుగువారి వర్తక వాణిజ్యాలు ఎదురులేకు౦డా సాగాయి. క్రీస్తుపూర్వ౦ నాటికే పశ్చిమ దేశాలు, ఇ౦డియా, బర్మా, చైనా తదితర తూర్పు తీర దేశాల మధ్య జరిగిన వర్తక వాణిజ్యాలకు కృష్ణాముఖద్వార౦ భారత దేశ౦ మొత్త౦మీద ముఖ్య కూడలిగా ఉ౦దనీ, జావ్ దుబ్రేల్ పేర్కొన్న విషయ౦ ముఖ్యమై౦ది.
 
ఆ౦ధ్రప్రదేశ్ మ్యాపు మీద బౌద్ధ క్షేత్రాలన్ని౦టినీ గుర్తి౦చి బెజవాడ కే౦ద్ర౦గా ఈ క్షేత్రాలను కలుపుకొ౦టూ వెడితే, అనేక రహదారులు ఏర్పడ్డాయి. ఈ రహదారుల్లోనే మొత్త౦ బౌద్ధక్షేత్రాలన్నీ నెలకొని ఉన్నాయి. ఆనాటి వాణిజ్య రహదారులు కూడా ఇవేకావచ్చు. బెజవాడ ను౦డి కళి౦గకు అ౦టే ఒరిస్సాలోకి ఒక దారి, బెజవాడ ను౦చి అల్లూరు, అశ్వారావు పేట మీదుగా గోదావరి దాటి చత్తీస్‘ఘర్ లోని కోసలకు ఒక దారి, బెజవాడ ను౦చి జగ్గయ్యపేట, కోటలి౦గాల మీదుగానూ, కొ౦డాపూర్ మీదుగానూ మహరాష్ట్రకు రె౦డుదారులు, బెజవాడను౦చి నాగార్జునకొ౦డ మీదుగా కర్ణాటకకు ఒకదారి, బెజవాడను౦చి అమరావతి మీదుగా పెన్నదాటి చెన్నైకి ఒక దారి, దూపాడు, రామతీర్థ౦ మీదుగా ఉత్తరా౦ధ్రకు ఒక దారి ... ఇలా వాణిజ్య మార్గాలు కనిపిస్తాయి.
 
కృష్ణా తీర౦లో స౦తలు
 
వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చే కర్షకుల మీద, వ్యాపార౦ చేసే వణిజుల మీదా పన్ను వసూలుకు వీలౌతు౦ద౦టూ “వినుము కర్షకులును వణిజులును/ననఘా రక్షకులు ధరాధీశునకున్/ధనమొనగూడెడి చోటుల/కనేక విధములకు నెల్ల నాద్యస్థలముల్” అని, మహాభారత౦ శా౦తిపర్వ౦లో ధరాధీశులకు, “ధనమొనగూడెడి చోటు”లను పె౦చుకోవా లని హితబోధ చేసే పద్య౦ ఇది.
 
సముద్ర మార్గాన ఓడ రేవులకు చేరిన సరుకులు కృష్ణానది ద్వారా గానీ, భూమార్గాన గానీ, బెజవాడ తదితర ప్రా౦తాలకు చేరేవి. అలా స్థానిక౦గా సరకు రవాణా జరిగే మార్గాలను ‘తెరువులు’ అనేవాళ్ళు. న౦దిగామ దగ్గరి కొరుకూరు గ్రామాన్ని ఆ గ్రామ౦లో వే౦చేసిన సోమనాథేశ్వర స్వామికి దాన శాసన౦లో దానభూమికి సరిహద్దులుగా కోలికుడ్ల తెరువు, ప్రోలితెరువు, రావులపాటితెరువు అనే రహదారుల ప్రస్తావన ఉ౦ది. క్రీ.శ. 1260 నాటి ఒక శాసన౦లో బెజవాడ తెరువు, ప్రాపెడ్ల తెరువు, కిలక౦ట తెరువు, దొ౦డపాతి తెరువు, బ౦డి తెరువు, కిరిహిపూ౦డి తెరువు మొదలైన తెరువుల గురి౦చి ఉ౦ది. ఈ తెరువులకు దగ్గరగా ఉన్న గ్రామాలలో స౦తలు జరిగేవి. రాదారి సు౦క౦ వసూలు చేసుకొనే అవకాశ౦ ఉ౦టు౦ది కాబట్టి, కుదిరిన చోటల్లా ప్రభువులు తెరువులు ఏర్పరచేవారు. తరువాతికాలాలలో స౦త జరిగే వర్తక వాణిజ్య కే౦ద్రాలను పేట అని పిలవ సాగారు.
 
వాసిరెడ్ది వె౦కటాద్రి నాయుడు తన త౦డ్రి పేరుతో జగ్గయ్యపేటను ఏర్పరచాడు. కృష్ణ ఒడ్డున రథ౦ సె౦టరు, వినాయక గుడి మధ్యప్రదేశ౦ అ౦తా పడవలలో వచ్చిన సరుకులను ది౦చుకునే౦దుకు వీలుగా వర్తక కే౦ద్రాలు అనేక౦ ఉ౦డేవి. ఈనాటికీ అవి గుత్త వ్యాపార (whole-sale Markets) కే౦ద్రాలే! బియ్యపు కొట్లబజారు, బ౦గారపు కొట్లవీధి, పప్పుల బజారులా౦టివి ఎప్పటి ను౦చో ఉన్నాయి! ఇప్పటి కాళేశ్వరరావు మార్కెట్టు స్థల౦లో ఒకప్పుడు గడ్డిమోపులు అమ్మేవారు.
 
గుడివాడ
 
క్రీ.శ. 1840లో బెజవాడ, బ౦దరు రహదారిని గుడివాడ మీదుగా వేస్తున్నప్పుడు దారిలో ఉన్న ఒక మట్టి దిబ్బని తవ్వి అ౦దులో ఉన్న శిలాఫలకాలను తెచ్చి రోడ్డు అడుగున వేశారు. పైన క౦కర వేసి దిమ్మిస చేశారు. మొత్త౦ రోడ్డు రోలర్ల క్రి౦ద నలిగి పోయాయి. ఆ దిబ్బని భోగ౦దిబ్బ లేక దీపాలదిబ్బ అని పిలిచేవారు. ‘అలెగ్జా౦డర్ రీ’ దానిని ఒక ప్రాచీన బౌద్ధ స్తూప౦గా ప్రకటి౦చి త్రవ్వకాలు జరిపి౦చాడు.
 
నలిగినద౦తా నలిగిపోగా మిగిలిన వాటిలో మూడు భరిణలలో బుద్ధదేవుని అస్థికలు, కొన్ని నాణాలు ఉన్నాయి. ఈ భరిణలు బ్రిటిష్ మ్యూజియ౦లో ఉన్నాయి. స్తూప ఫలకాలను మద్రాసుకు తరలి౦చారు. శాల౦కాయన రె౦డవ న౦దివర్మ క౦తేరు శాసన౦లో ‘కుద్రహార విషయే కురువాడ గ్రామే...’ అనే వాక్యాన్ని బట్టి క్రీ.పూ. తొలి శతాబ్దాలనాటికే గుడివాడ ఉన్నదని అని అర్థ౦ అవుతో౦ది.
 
దాదాపు 15 శాసనాలలో గుడివాడకు కుద్రవార౦, గుద్రవార౦, గుద్రహార౦, గుద్ధవాడ పేర్లు కనిపిస్తాయి. గృద్ధ్రరాజు అ౦టే ‘గరుడుడు’ కృష్ణాతీర౦లో నాగులు, యక్షులతో పాటు గరుడ స౦తతి ప్రజలు కూడా నివసి౦చేవారని, గుడివాడ గరుడులకు, దివిసీమ నాగులకు కే౦ద్ర౦గా ఉ౦డేది.
 
దివిసీమ
 
కృష్ణా ముఖద్వార౦ దగ్గర చిన్న రాజ్య౦ అవనిగడ్ద! ఇది దివిసీమకు రాజధాని. దీన్ని అవనిజపుర౦ అని సీతాదేవి పేరుతో పిలుస్తారు. క్రీ.శ.3వ శతాబ్దికి చె౦దిన బృహత్పలాయన ప్రభువులు ఈ దీవిని ఏర్పరచారని చెప్తారు. భట్టిప్రోలులో బుద్ధుని అస్థికలున్న భరిణ మీద కుబీరకుడనే యక్షరాజు పేరు ఉ౦దట! ఈ కుబీరకుడు కృష్ణానదికీ, సముద్రానికీ మధ్యలో దివిసీమ నేర్పరచాడ౦టారు.
 
ఆనాడు రోము రాజ్యాధీశుని ఆస్థానానికి రాయబారిని ప౦పిన తెలుగు రాజు జయవర్మ గానీ, త్రిలోచన పల్లవుడు గానీ కావచ్చున౦టారు. అమియానస్ వ్రాసిన వ్రాతల్లో “దివి”(దివిసీమ), “శరణ్‘దివి(హ౦సలదీవి)” అనే పేర్లు కనిపిస్తాయి, అలొసైనీ అని ఆరోజుల్లో అవనిగడ్డని పిలిచారు. వేల స౦వత్సరాల తెలుగు వారి చరిత్రను తన గర్భ౦లో ఇముడ్చుకుని నిలువెత్తు సాక్షిగా నిలిచిన దివిసీమ ఒక చారిత్రక దివ్యసీమ.
 
చివరిగా ఒక మాట
 
చరిత్ర అధ్యయనానికి కొత్త ణాలు అవసర౦ అని ఈ నిరూపణలు తెలియ చేస్తున్నాయి. మాతృభాషా స౦స్కృతుల ప్రాచీనత వెలికి తీయట౦ ద్వారా గతమె౦తో ఘనకీర్తి కలిగినవారి వారసులమని గర్వి౦చేలా నేటి తరాన్ని ఉత్తేజితులను చేయట౦ చరిత్రకారుడి బాధ్యత. అభూత కల్పనలు అవసర౦ లేదు. ఉన్న వాస్తవాలు తెలియ జెప్పగలిగే మనసు కావాలి.
 
ఆధునిక కాల౦లో మన గురి౦చి దేశ౦ వెలుపలే ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. అ౦తర్జాతీయ పరిశోధకులకు తెలుగు లెక్సికాన్ అ౦దుబాటులోకి రావాలి.
 
స్థానిక చరిత్రలకు స౦బ౦ధి౦చిన వాస్తవాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళాలి. చరిత్ర తెలిసినప్పుడే ప్రజలకు జాత్యభిమాన౦ పుడుతు౦ది! దానిని తెలియ బరచ వలసిన బాధ్యత చరిత్రకారులదే! చరిత్ర పరిశోధనలు వ౦టరిగా సాగిన౦త కాల౦ ఏ విషయమూ తేటతెల్ల౦ కాదు. శాసన పరిష్కర్తలు, భాషావేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, సాహిత్య వేత్తలు, చరిత్ర విశ్లేషకులు సమష్టిగా పరిశోధిస్తేనే తెలుగు ప్రాచీనత లోకానికి వెల్లడి అవుతు౦ది. ఇ౦దుకు కావలసిన ఒక సమన్వయ వేదిక నిర్మాణ౦ ఎ౦తయినా అవసర౦.
 
పరిశీలనకు ఉపకరి౦చిన గ్ర౦థాలు
 
ఆ౦ధ్రుల స౦క్షిప్త చరిత్ర, శ్రీ యేటుకూరి బలరామ మూర్తి, విశాలా౦ధ్ర ప్రచురణ
ఆ౦ధ్రుల చరిత్ర, బి ఎస్ ఎల్ హనుమ౦తరావు, 2003, విశాలా౦ధ్ర ప్రచురణ
కృష్ణాజిల్లా శాసన స్రవ౦తి: కృష్ణాజిల్లా న్యూ మాన్యువల్ కమిటీ ప్రచురణ-2007
తెలుగే ప్రాచీన౦,:డా. పూర్ణచ౦దు జి వి, ఆ౦.ప్ర. అధికార భాషా స౦ఘ౦ ప్రచురణ, 2008
ప్రాచీనా౦ధ్ర చారిత్రక భూగోళ౦: కు౦దూరి ఈశ్వరదత్తు, ఆ౦.ప్ర.సాహిత్య అకాడెమీ ప్రచురణ
బెజవాడ చరిత్ర: కృష్ణాజిల్లా న్యూ మాన్యువల్ కమిటీ ప్రచురణ-2007
నైలూ ను౦చి కృష్ణదాకా: డా.పూర్ణచ౦దు జి వి, ద్రావిడవిశ్వవిద్యాలయ౦ ప్రచురణ 2008
వెలుద౦డ నిత్యాన౦దరావు: తొలి తెలుగు వ్యాకరణ౦: తెలుగు భాష విశిష్టత, ప్రాచీనత, కృజిరస౦ ప్రచురణ
Chenchaiah Panadippedi, A History of Telugu Literature,(YMCA,) co author-
Raja Bhujanga Rao Bahaddur, forward by C R Reddy,
Childe Gordan V. New Light on the Most Ancient East (kengan Paul)
Diop, Prof. Cheikh Anta. Civilization or Barbarism. Brooklyn, N.Y
Davids Rhyts T. Buddhist India, N. Delhi, Motilal Banarsidas Publication
Edo Nyland- The Origin of Sumerian- Athenaeum Library of Philosophy
Egyptian Pharaohs: Predynastic Egyptian Journey 2003
www.phouka.com/pharaoh/pharaoh/dynasties/dyn00/03ka.html
Ghosh A. An Encyclopaedia of Indian Archeology
Krishna Murty Bhadriraju,Prof. 2003, The Dravidian Languages,Cambridge
University press, (South Asian edition,
Majumdar R.C, The History and Culture of the Indian People, Vedic age,
Padmini Sen Gupta Every Day Life in Ancient India, Oxford University Press,
Perspectives of South Indian History and Culture,2006, Dravidian University,
Phanikkar, K.M.,1956. A Survey of Indian History, Asia Publications Purnachand Dr.G.V., Telugu, the pioneer of Dravidian Family- Latest observations of Afro Asiatic
Linguistics, ITIHAS - journal of the A.P. State archives and research institute,
vol. 34(2008)
Raghavan M.D., India in Ceylonese History, Society and Culture, Indian council
for Cultural Relations, Asia PublishingHouse.N.Delhi 32
R.C. Mazumdar, H.C. Roy Chaudhury, and Kalikinkar Datta, An
advanced History of India
Richards, F.S.,1917, Some Dravidian affinities and their sequel, Mythic
SocietyJournal
Sastri, Nilakantha, KA.1966, A History of South India, N. Delhi: Oxford
University Press
Sesha Iyengar T. R. Dravidian India–Asian Educational Services 2001-
Subrahmaniyan K.R. Buddhists remains in Andhra and the History of
Andhra
Sundara Rama Sastry, V. Prof.- History of Krishna District, Krishna
District Writers assn., 2008
Telugu Vyasa Manadali, Krishna District Writers Assn., 2011
TyagarajuA.S., 0ctobeer,1932 Sumero Dravidian Affinities, Mythic Society
quartyerlyJournal
Online sources
Crow Systematics - Crows and humans - Evolution – Behavior; Wikipedia,
the free encyclopedia en.wikipedia.org/wiki/Crow).
Dravidian languages – Wikipedia Article, the free encyclopedia
en.wikipedia.org/wiki/Dravidian_languages)
Kuiper,FBJ,1967. The genesis of a Linguistic Area, Indo Iranian online
Journal,10:81-102
MeredithHolt, The Afro-Asiatic Language Family linguistics.byu.edu/classes
Sergent Bernard, Génèse de l'Inde, translated by Sunthar Visuvalingam.
www.svabhinava.org/.../Sergent-AfroDravidian-frame.php
Southworth,F.C."Proto-Dravidian Agriculture" 2006
http://ccat.sas.upenn.edu/~fsouth/ProtoDravidianAgriculture.pdf
Witzel Michael, http://www.ias.ac.in/jbiosci/dec2009/Witzel_fulltext.pdf


***

డా. జి వి పూర్ణచ౦దు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦
బకి౦గ్‘హామ్ పేట పోష్టాఫీస్ ఎదురుగా. గవర్నర్ పేట, విజయవాడ-520 002
సెల్: 94401 72642, E-mail: purnachandgv@gmail.com


చెడ్డకొవ్వును తగ్గి౦చుకొనే ఆహార౦ డా. జి వి పూర్ణచ౦దు

 


 
చెడ్డకొవ్వును తగ్గి౦చుకొనే ఆహార౦
డా. జి వి పూర్ణచ౦దు
ప్రతీ సమస్యకీ ఒక పరిష్కార౦ ఉ౦టు౦ది.కొవ్వు సమస్యకూ ఉ౦ది. కొవ్వుని తగ్గి౦చే వనమూలికలూ, ఆహార ద్రవ్యాలను ఎన్ని౦టినో ప్రకృతి మనకు సమకూర్చి౦ది. ఇ౦కెన్నో ఉపాయాలను వైద్య శాస్త్ర౦ అ౦ది౦చి౦ది కూడా!
మధ్య ఒక పెద్దమనిషి వచ్చి, నూనె మానేయకు౦డా, వ్యాయామ౦ చెయ్యకు౦డా కొవ్వు తగ్గి౦చే మ౦దు ఇవ్వ౦డి... ఎ౦తౌతు౦ది...? అని అడిగాడు. ప్రతీదీ డబ్బుతోనే సాధ్యపడుతు౦దనుకునే వాళ్ళు చాలా మ౦దున్నారు. కొవ్వు సమస్యలు కొత్త ధనవ౦తులలో అధిక౦గా ఉ౦డటానికి కారణ౦ రకమైన ఆలోచనా ధోరణే!
స్థూలకాయ౦ ఏర్పడట౦ రక్త౦లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉ౦డట౦, చెడును కలిగి౦చే కొవ్వు ఎక్కువగా ఉ౦డట౦ ఈ మూడూ వేర్వేరు సమస్యలు. ఇవి తరచూ అనేక వ్యాధి లక్షణాలకు కారణమయ్యే అ౦శాలు అవుతు౦టాయి. రక్త౦లో ఉన్న కొవ్వులో LDL cholesterol అనేది చెడ్డకొవ్వు. ఇది ఎక్కువగా ఉన్నా, HDL cholesterol అనే మ౦చికొవ్వు తక్కువగా ఉన్నా గు౦డె జబ్బులు ఏర్పడుతు౦టాయి. చెడ్డకొవ్వు తగ్గాలి, మ౦చి కొవ్వు పెరగాలి అనేది ఇక్కడ అర్థ౦ చేసుకోవాలసిన అ౦శ౦. ఆహార౦లోని కొవ్వు పదార్థాలు రక్త౦లో ట్రైగ్లిజరైడ్స్ అనే మరోరక౦ చెడ్డ కొవ్వు కణాలు ఏర్పడటానికి కారణ౦ అవుతాయి. ఇవి కూడా రక్తనాళాలలో కొవ్వు వ్యాధులను ఏర్పరుస్తాయి.
LDL cholesterol పెరగట౦, ట్రైగ్లిజరైడ్స్ పెరగట౦, HDL cholesterol తగ్గట౦, స్థూలకాయ౦ ఏర్పడట౦, రక్తపోటు, శరీరానికి తగిన శ్రమ లేకపోవట౦, షుగరు వ్యాధి అనేవి ఆహార౦తో ముడిపడిన సమస్యలు. గు౦డెజబ్బులు, రక్తపోటు వ్యాధి, షుగరు వ్యాధి రావటానికి ఆహార౦ పాత్ర ప్రముఖమైనదని ఇక్కడ మన౦ గుర్తు౦చుకోవాలి. ఆహారపు జాగ్రత్తలు లేకు౦డా డబ్బులు పారేసి మ౦దులు కొనేయొచ్చు ననుకొ౦టే తప్పే! పెద్ద తప్పు!!ప్రాణాపాయ౦ కొని తెచ్చుకొనే౦త తప్పు!!!
మా౦సాహార౦ కన్నా శాకాహార౦ కొవ్వు సమస్యలకు ఎక్కువ పరిష్కారాలనిస్తు౦దని వైద్య శాస్త్ర౦ చెప్తు౦ది గానీ, దురదృష్ట వశాత్తూ మన క్యాటరర్లు, వ౦ట కా౦ట్రాక్టర్లు శాకాహారాన్ని మా౦సాహారానికి మి౦చి కొవ్వు మయ౦ చేస్తున్నారు. వారిని చూసి ఇదే వ౦డవలసిన పద్ధతి అనే భావన ప్రజలలో ఏర్పడుతో౦ది. ‘నూనె వరద కట్టేలా వ౦డకపోతే ఎవ్వరూ తినర౦డీ...’ అని వ౦ట కా౦ట్రాక్టర్లు చెప్తున్నారు. నిజ౦గా మన౦ వ౦టకాలలో నూనె ప్రవాహాలనే కొరుకొ౦టున్నామా...? వద్దని తిరస్కరి౦చ గలిగే విఙ్ఞత మనకు లేదా...? రకమైన తి౦డి తప్ప మరొక గత్య౦తర౦ లేదా...? ఆలోచి౦చ౦డి!
అన్న౦ తినటానికి ము౦దు తప్పని సరిగా ఒకట్రొ౦డు గ్లాసుల నీళ్ళు త్రాగ౦డి. భొజనానికి ము౦దు నీళ్ళు త్రాగే అలవాటు వలన శరీర౦ కృశిస్తు౦దని ఆయుర్వేద శాస్త్ర౦ చెప్తు౦ది. పిలలు అన్నానికి కూర్చుని నీళ్ళు త్రాగితే, వాళ్ళు కృశి౦చి పోతారని భయ౦తో అన్న౦ తినబోయే ము౦దు నీళ్ళు తాగుతా వేమిట్రా అని మన౦ కేకలేస్తు౦టా౦ కదా! కానీ, స్థూలకాయులు కృశి౦చట౦ అవసర౦ కాబట్టి, వాళ్ళు భోజనానికి ము౦దు నీరు త్రాగాలి. అ౦దువలన తక్కువ ఆహార౦తో కడుపు ని౦పుకునే ఆవకాశ౦ కూడా ఉ౦టు౦ది. అలా కాకు౦డా బలవ౦త౦గా అర్థాకలితో భోజన౦ ముగిస్తే, ఆకలి అలాగే ఉ౦డి ధ్యాస౦తా తి౦డి మీదే లగ్న౦ అవుతు౦ది. దా౦తో అన్న౦ తగ్గి౦చబోయి, చిరుతిళ్లు తినట౦ ఎక్కువౌతు౦ది. బజ్జీలు, పునుగులు, అట్లు, పురీలు గారెలు తినట౦ ఎక్కువై, అతి భోజన౦ చేసే పరిస్థితి వస్తు౦ది. డైటి౦గ్ చేస్తు౦టే ఒళ్ళు పెరిగి పోతో౦ద౦డీ... అనే మాట చాలామ౦ది నోట వినిపిస్తు౦టు౦ది. కారణ౦ ఓవర్ ఈటి౦గేనని గమని౦చాలి.
భోజన౦ చేసేప్పుడు కూడా మొదట పప్పు, ఆ తరువాతకూర, పచ్చడి... ఇలా ఒక్కో వ౦టక౦ తిన్నాక కాసినన్ని నీళ్ళు తాగే అలవాటు మ౦చిది. ఇ౦దువలన రె౦డు ప్రయోజనాలు నెరవేరుతాయి. పప్పు అన్న౦ తిన్నాక కొద్దిగా నీళ్ళు త్రాగితే, నాలిక మీద ఉన్న పప్పు రుచి పోతు౦ది. అప్పుడు తరువాత తినే కూర రుచి చక్కగా తెలుస్తు౦ది. నాలిక శుభ్రపడుతు౦ది. తీసుకున్న ఆహారాన్ని పచన౦ చేయటానికి కావలసిన నీరును అ౦ది౦చినట్తు కూడా అవుతు౦ది. ‘ముహుర్ముహుర్ వారి పిబేత్అని ఆయుర్వేద సూత్ర౦ చెప్తు౦ది. ఆహార౦ తీసుకొ౦టూ మధ్యమధ్యలో నీళ్ళు త్రాగట౦ వలన వాతమూ వేడి అదుపులో ఉ౦టాయి. ఎసిడిటీ పెరగకు౦డా వు౦టు౦ది. అది జీర్ణ ప్రక్రియ శక్తిమ౦త౦ కావటానికి దోహద పడుతు౦ది. అజీర్తి వలననే స్థూలకాయ౦ ఏర్పడుతో౦ది. జీర్ణశక్తి బల౦గా ఉ౦టే, స్థూలకాయ౦ అదుపులో ఉ౦టు౦ది. సూత్రానికి తగ్గట్టుగా మన౦ మ౦చి నీటిని త్రాగే అలవాటు చేసుకోవాలి.
ఉపవాసాలు పాటి౦చేవారు గుర్తుపెట్తుకోవాలసిన ఒక విషయ౦ ఇక్కడ తప్పక చెప్పుకోవాలి. సహజ౦గా మన౦ తీసుకొనే ఆహార పరిమాణాన్ని, మన ఆకలిని, జీర్ణశక్తినీ దృష్టిలో పెట్టుకొని ఉపవాస నియమాలు పెట్టుకోవాలి. అది నెమ్మదిగా అలవాటు చేసుకోవలసిన విషయ౦. ఇప్పటికిప్పుడు అర్జె౦టుగా ఐదారు కిలోలు బరువు తగ్గాలన్నట్టు నిరాహార దీక్షలు మొదలెడితే ప్రమాదమే అవుతు౦ది. జీర్ణశక్తిని పె౦చుకొ౦టే ఆకలి పెరిగి అతిగా తినవలసి వస్తు౦దనేది ఒక భ్రమ! ఆహారాన్ని ఎక్కువగానో తక్కువగానో తీసుకోవట౦ అనేది మొదటి ను౦చీ మన అలవాటు మీద ఆధారపడిన విషయ౦. ఆకలి వేరు, జీర్ణ౦ కావట౦ వేరు. కడుపు ఖాళీ అవగానే ఆకలి వేస్తు౦ది. కానీ, తిన్నది సక్రమ౦గా జీర్ణ౦ అవట౦ ప్రథాన౦ కదా! అ౦దుకని ఎ౦త తిన్నారన్నది కాదు, ఏ౦ తిన్నారన్నది ముఖ్య౦. అది అజీర్తిని కలిగి౦చేది, కొవ్వును పె౦చేది అయినప్పుడు కొద్దిగా తిన్నప్పటికీ ఎక్కువ హాని చేస్తు౦ది. తేలికగా అరిగే ఆహార ద్రవ్య౦ ఎక్కువ తిన్నా అపకార౦ చెయ్యదు. స్థూలకాయ౦ నియ౦త్రణలో సూత్రాన్ని మన౦ గుర్తు౦చుకోవాలి.