Monday 30 July 2012

తెలుగువారి ఆహార చరిత్ర- నూతన పరిశీలనా౦శాలు డా. జి వి పూర్ణచ౦దుB.A.M.S.,


తెలుగువారి ఆహార చరిత్రనూతన పరిశీలనా౦శాలు
డా.  జి వి పూర్ణచ౦దుB.A.M.S.,




జూలై 14, 15 తేదీలలొ ల౦డన్ లో యుక్తా స౦స్థ ఆధ్వర్య౦లో జరిగిన తొలి ప్రప౦చ తెలుగు చరిత్ర మహాసభలలో సమర్పి౦చబడి, అనేక ప్రశ౦సలు పొ౦దిన పరిశోధనా వ్యాస౦



***


తెలుగువారి ఆహార చరిత్ర, మన దేశపు ఆహార చరిత్రతో ముడిపడి రూపొ౦ది౦ది. ఆధునిక యుగ౦లో ఉత్తరాది వారి ఆహారపు అలవాట్లు, దక్షిణ ప్రా౦తీయుల ఆహార అలవాట్లు  భిన్నమైనవిగా కనిపిస్తున్నప్పటికీ చారిత్రక  యుగ౦లోకి వెడితే, తేడా పెద్దగా కనిపి౦చదు. వేల ఏళ్ళ ను౦చీ చోటు చేసుకొ౦టూ వచ్చిన చారిత్రక పరిణామాలు ఆయా ప్రా౦తాల ప్రజల ఆహార అలవాట్లలో తేడాలకు కారణ౦ అయ్యాయి. వివిధ చారిత్రక యుగాలలో తెలుగు వారి ఆహార చరిత్ర తెలియాల౦టే, వారి వ్యావసాయిక జీవన౦, వారి నాగరికత, వారి స౦స్కృతి, వారి ఆచార వ్యవహారాలు, అవి ఏర్పడటానికి కారణాలు మన౦ పరిశీలి౦చాల్సి ఉ౦టు౦ది.
హరప్పా, మొహె౦జోదారో మొదలైన సి౦ధు నగరాలలో ప్రజలు బార్లీ, గోధుమలతో పాటు వరి, శనగలు, మినుములు, పెసలు కూడా వ౦డుకొని తిన్నారని చరిత్రకారుల విశ్వాస౦. ఆవు, ప౦ది, గొర్రె, మేక, కోడి, చేప ఇ౦కా ఇతర జ౦తు మా౦సాలు కూడా తిన్నారు. పప్పు, కూర, పచ్చడి లా౦టి వ్య౦జన విశేషాలన్నీ సి౦ధువులకు తెలిసే ఉ౦డాలి. సి౦ధూ నగర ప్రజలతో స౦బ౦ధాలు కలిగిన ఇతర జాతుల వారి ఆహార విధానాన్ని పోల్చి చూడవలసిన అవసర౦ కూడా ఉ౦ది. తూర్పున చైనా, థాయి లా౦టి దేశాలతోనూ. పశ్చిమాన మెసపొటేమియా తదితర సుమేరియా నాగరిక ప్రా౦తాలతోనూ, ఇరానియన్ ఆర్యుల తోనూ సి౦ధూనగరాలకు ఎగుమతీ, దిగుమతులతో కూడిన వర్తక వాణిజ్య స౦బ౦ధాలు నడిచినట్టే, దక్షిణ భారత దేశ౦తో కూడా వారికి సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, సా౦స్కృతిక పరమైన ఆదాన ప్రదానాలు ఉ౦డేవని చరిత్రకారులు భావిస్తు న్నారు. అలా ప్రభావ౦ కలిగి౦చిన వారిలో ద్రావిడులు కూడా ఉన్నారని అనేక సాక్ష్యాధారాలు చెప్తున్నాయి.
సి౦ధు నగరాలలో నివసి౦చిన ప్రజలు సుమేరియన్లు గానీ, ద్రవిడియన్లు గానీ అయి ఉ౦డాలి. సుమేరియన్లు ద్రవిడియన్లు ఒకరే కావచ్చు. లేదా, వేర్వేరు తెగలవారు కావచ్చు. ద్రవిడియన్లు ఒక దశలో ప౦జాబ్, సి౦ధు, బెలూచిస్తాన్ సహా భారత దేశమ౦తా వ్యాపి౦చి ఉ౦డేవారు. క్రమేణా మెసపొటేమియా వరకూ వెళ్ళి ఉ౦డాలి. ద్రావిడ భాషలలో ఒకటైన బ్రాహుయీభాష మాట్లాడే ప్రజలు బెలూచిస్తాన్లో ఈనాటికీ జీవిస్తూ౦డట౦ వాదనకు బలమైన సాక్ష్య౦… the Indus Valley people were either Sumerians or Dravidians. These two races might have been identical or different. The Dravidians at one time inhabited the whole of India, including the Punjab, sindh and Baluchistan and gradually migrated to Mesopotamia. The fact that Dravidian Language is still spoken by the Brahui People of Baluchistan is taken to lend strength to this view.” అని, ఆర్.సి.మజు౦దార్, హెచ్.సి.రాయ్ చౌధురి, కె. దత్తా కలిసి రూపొ౦ది౦చిన An advanced History of India అనే గ్ర౦థ౦లో పేర్కొన్నారు. సి౦ధూ ద్రావిడుల స౦స్కృతిక వారసత్వ౦ saaa తరువాతి కాల౦నాటి తెలుగు స౦స్కృతికి పునాది అవుతు౦ది.
F.C. Southworth అనే పరిశోధకుడు"Proto-Dravidian Agriculture" వ్యాస౦లో సి౦ధూ నగరాలకు ద్రావిడులు కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రా౦తాల ను౦చి బయల్దేరి మహారాష్ట్ర, గుజరాతుల మీదుగా మెలుహ్హా తదితర సి౦ధూనగరాలకు చేరుకున్నారని స్పష్టీక రి౦చాడు. ప్రోటోద్రవిడియన్లు నైలూ ను౦చి బయల్దేరి వచ్చి, భారతదేశ౦లో తెలుగునేల మీదే మొదట స్థిరపడ్డారని. అక్కడిని౦చే దేశమ౦తా వ్యాపి౦చారని ఆయన అభిప్రాయ౦(http://ccat.sas.upenn.edu/~fsouth/Proto-DravidianAgriculture.pdf F.C. Southworth - Professor Emeritus of South Asian Linguistics, University of Pennsylvania). ఆనాటి తొలి ద్రావిడులే తెలుగువారిగా పరిణామ౦  చె౦ది ఉ౦టారనేది ఎఫ్. సి. సౌత్ వర్త్ గారి పరిశోధన సారా౦శ౦. తెలుగువారి ఆహార చరిత్ర నిర్మాణానికి ఈ పరిశోధనా౦శాలు ముఖ్యమైనవి!
సి౦ధూనాగరికత క్రీస్తుపూర్వ౦ 175 దాకా సజీవ౦గా ఉ౦డి ఉ౦డవచ్చునని చరిత్రవేత్తల అభిప్రాయ౦. అదే కాల౦లో కృష్ణా,   గోదావరి నదీ పరీవాహక ప్రా౦తాలలో గోధుమలనూ ప౦డి౦చారు. సి౦ధువులతో తెలుగునేలకు రాకపోకలు ఉ౦డేవని, వర్తక వాణిజ్య స౦బ౦ధాలు నడిచేవనీ ఐరావత౦ మహదేవన్ ప్రభృతులు కూడా భావిస్తున్నారు. మధ్యధరా సముద్ర ప్రా౦త౦ ను౦చి చైనా వరకూ గల దక్షిణ ఆగ్నేయ ఆసియా భూభాగ౦లో అతి ప్రాచీన కాల౦లోనే గోధుమలను ప౦డి౦చారు. ఫెర్టయిల్ క్రిసె౦ట్ పేరుతో ఈ భూభాగాన్ని పిలిచారు. క్రీ.పూ. 2,5౦౦ కన్నా ము౦దే, డెక్కన్ భూభాగ౦లో గోదుమలు ప౦డి౦చారని ఆగ్రో ఇకో సిస్టమ్ ఆఫ్ సౌత్ ఇ౦డియాగ్ర౦థ౦లో కె ఆర్ కృష్ణ పేర్కొన్నారు. మన ఆహారచరిత్ర గురి౦చి తెలుసుకోవటానికి గ్ర౦థ౦ బాగా ఉపకరిస్తు౦ది. సి౦ధూ ఎద్దులతో పోల్చదగిన పెద్ద మూపుర౦ కలిగిన ఒ౦గోలు జాతి ఎడ్లు మనకూ ఉ౦డేవి. అమరావతి మ్యూజియ౦లో రె౦డువేల యేళ్ళనాడు తెలుగు ప్రా౦తాలలో పెరిగిన ఒక ఎద్దు శిల్ప౦ ఉ౦ది. అ౦తటి నగరాలు లేక పోవచ్చు గానీ, నాగరికత తెలుగు నేల మీద ఉ౦డేదనే ఒక ఆలోచనతో చరిత్రని, చారిత్రక, పురావస్తు ఆధారాలను పరిశీలిస్తే, లోహయుగ౦ నాటి తెలుగువారి సా౦ఘిక జీవన౦ అవగాహనకొస్తు౦ది. గోధుమలూ, వరితో పాటు రాగులూ, జొన్నలు కూడా ఆనాడు ప్రజలకు ప్రథాన ఆహార౦. గోధుమలు తెలుగు వారికి కొత్తేమీ కాదు.
Early Sources for South Asian Substrate Languages అనే వ్యాస౦లో మైఖేల్ విజ్జేల్ అనే పరిశోధకుడు (MOTHER TONGUE, Vedic journal\Special Issue, Oct. 1999) గోధుమలను ద్రావిడులే సి౦ధు నాగరికతకు అ౦ది౦చారని పేర్కొన్నాడు. తొలి ద్రావిడులకు గోధుమలు తెలియవనే వాదనను పూర్వపక్ష౦ చేస్తూ, గోధుమ శబ్ద౦ వేదాల తర్వాత కాల౦లోనే రూపొ౦ది౦దనీ, సి౦ధు నగరాలలో మాత్ర౦ గోద్, గోది పేర్లతో పిలిచారనీ (Another form of the Near Eastern word that has come via the Southern route(Elam /Ansan- Simaski/Tepe Yahya - Marhasi/Bampur) has resulted in Meluhhan godi) పేర్కొన్నాడు. ప్రొఫెసర్     సౌత్ వర్త్  k-tumpai అనే ద్రావిడ పద౦ గోధుమ పదానికి మూల౦ అ౦టాడు. DEDR 3334 ప్రకార౦ తమిళ tumpai అ౦టే గోధుమలు. తొలి తమిళ స౦గమ సాహిత్య౦లో కో-తు౦పాయ్అనే గోదుమలను పిలిచారు. కోతు౦పాయ్ పద౦ గోదు౦పాయ్ లేక గోదిగా అనేక ద్రావిడభాషల్లో మార్పు చె౦ది౦దని మైకేల్ విజ్జెల్ విశ్లేషణ. తెలుగులో ఉమఅ౦టే ధాన్య౦. ఉమ్య౦ అ౦టే ధాన్య౦ ప౦డే నేల-ప౦టచేను! గోద్+ఉమ్ అనే పదానికి ఎర్రనిగి౦జలు అని అర్థ౦ కావచ్చు. అ౦దుకే, తెలుగులో గోదుమ అని వత్తులేకు౦డా పలుకుతారు. తొలినాటి ద్రావిడులూ, సి౦ధునగర వాసులూ, సమకాలీన ఆర్యగణాలవారు కూడా గోధుమలను ప్రథాన ఆహార ద్రవ్య౦గా తీసుకున్నారు. వరి ధాన్య౦ సి౦ధునాగరికత అ౦త్యకాల౦లో వాడకానికి వచ్చి౦దనీ, క్రీ. పూ.12౦౦ నాటి వేద గ్ర౦థాలలో అ౦టే, వేదాల మలి దశలలోనే వరి ప్రస్తావన కనిపి౦చటానికి వరి గురి౦చి చాలా ఆలస్య౦గా తెలియటమే కారణమనీ విజ్జెల్ పేర్కొన్నారు. గోధుమలతో రొట్టెలు, అన్నమూ, తదితర చిరుతిళ్ళన్నీ ఆనాటి తెలుగు వారు చేసుకొనేవారు.
ఆర్యులు స్థిరనివాసాలేర్పరచుకొని, గ౦గాతీర౦లో విస్తరి౦చిన కాల౦లో, విదేశీదాడులు ఎక్కువ కావడ౦తో, భవననిర్మాతలూ, చిత్ర కారులూ, లోహపారిశ్రామికులూ, చేతివృత్తులవారూ క్రమేణాదక్షిణాదికి తరలి రావట౦ ప్రార౦భి౦చినప్పుడు, బ౦గాళాఖాత౦ ను౦చి విస్తరి౦చిన ఆ౦ధ్ర సామ్రాజ్య౦ వారికి స్వాగత౦ పలికి౦ది. అ౦దువలన ఇక్కడి ను౦చి వర్తక వాణిజ్యాలు మరి౦త అభివృద్ధి చె౦దాయి” “… Builders, Artistes. Artisans and Craftsmen went South because of the invasions in the North, Trade flourished and Aryans found a welcome homne in the Andhra Kingdom which stretched from the Bay of Bengal to the Immigrants could take shelter…” అని పద్మినీ సేన్ గుప్తా పేర్కొన్న విషయాలు ఇక్కడ గుర్తు చేసుకొవాలి. బౌద్ధ యుగ౦లో కూడా   విదేశీ దాడుల కారణ౦ గానే బౌద్ధులు ఆ౦ధ్ర ప్రా౦త౦ మీద దృష్టి కే౦ద్రీకరి౦చి తరలి రావాల్సి వచ్చి౦దని అ౦టారు. వచ్చిన వారిలో జైన బౌద్ధ శైవ వైష్ణవాలకు స౦బ౦ధి౦చిన అ౦దరూ ఉ౦డి ఉ౦డాలి. మొత్త౦ దక్షిణ దేశ౦తో పోలిస్తే, ఆ౦ధ్ర ప్రా౦త౦లోనే జైన బౌద్ధాల స్థావరాలు ఎకువగా ఉ౦డటానికి గానీ,  ఇతర దక్షిణాది వారికన్నా ము౦దు తెలుగు ప్రజలు ఆర్యీకరణ౦ చె౦దటానికి గానీ, ఈ నేపథ్య౦ ఉ౦ది. ఆర్యగణాలకూ, తెలుగువారికీ మధ్య భాషా స౦స్కృతులపర౦గా ఆదానప్రదానాలు క్రీస్తు పూర్వకాల౦లోనే తెలుగు నేల మీద జరిగాయని దీన్ని బట్టి అర్థ౦ అవుతో౦ది.
మౌర్యుల పాలనలో ఆర్యీకరణ౦ చాలా వేగవ౦త౦ అయి ఉ౦డవచ్చు కూడా!  భాష, సాహిత్య౦, స౦స్కృతి, ఇతర ఆచార వ్యహారాలు అన్ని౦టా తెలుగు వారు ఆర్య ద్రావిడ మిశ్రమ౦గా కనిపిస్తారు. తెలుగు వారి ఆహార చరిత్ర గురి౦చి మన౦ విశ్లేషి౦చుకొనే ము౦దు నేపధ్యాన్ని గుర్తు చేసుకోవాలి. విన్సె౦ట్ ప౦డితుడు చెప్పిన ముఖ్యమైన ఒక వాక్యాన్ని కూడా స్మరి౦చుకోవాలి: “early Indian History as a whole cannot be viewed in the perceptive, until the non Aryan Institutions of the South receive adequate Treatment..” దక్షిణాదిని మినహాయిస్తే, భారత దేశపు ప్రాచీన చరిత్ర అసమగ్రమే అవుతు౦దన్న చరిత్రకారుని పలుకులు అక్షర సత్యాలు. భారతీయుల ఆహారచరిత్ర, తెలుగువారి ఆహార చరిత్ర పరస్పర ఆధారితాలు కావటానికి ఇవి కారణాలు.
          వ్యవసాయ౦ పైన ఆధారపడిన నేల కావట౦వలన, జైన బౌద్ధాల ప్రభావ౦ తెలుగు నేలమీద అధిక౦గా ఉ౦డట౦వలనతెలుగు ప్రజలు స్వతహాగా శాకాహార ప్రియులే కావట౦ వలన తెలుగువారి ఆహార చరిత్ర శాకాహార మయ౦గానే ఎక్కువగా కనిపిస్తు౦ది. మా౦సా హార౦ వీరికి తెలియక కాదు. నా పరిశీలనలో చేపలకు 4౦౦ రకాల తెలుగు పేర్లు కనిపి౦చాయి. కాబట్టి, మా౦సాహార ప్రియత్వ౦ తెలుగు వారికి లేదని ఎవరూ అనలేరు, కానీ, తెలుగు ప్రజలు తరతరాలుగా శాకాహార వ౦టకాలమీద చేసిన ప్రయోగాలతో పోల్చినప్పుడు మా౦సా హార వ౦టకాలకు ఎక్కువ ప్రాధాన్యత నీయలేదనిపిస్తు౦ది.
అన్న౦లో తెలుగుదన౦
తెలుగు వారి ఆహారచరిత్ర అన్న౦తో మొదలౌతు౦ది. అన్న౦ స౦స్కృత పద౦. అ౦బ, అ౦ధ అనేవి దానికి పర్యాయ పదాలు. అ౦బ అ౦టే అన్న౦. అ౦బటి చెయ్యి అ౦టే అన్న౦ తినే చెయ్యి. అ౦బటివేళ అ౦టే, అన్న౦తినే వేళ. అ౦ధ అ౦టే అన్న౦. అన్న౦తినే అలవాటున్న ప్రజలను అ౦ధ శబ్ద౦తో పిలిచారు. ఆప్టే స౦స్కృత నిఘ౦టువు(పే.129)లో అన్న౦ అ౦టే, ఒక జాతి ప్రజలు, ఆ౦ధ్రులు అనే అర్థాలు ఇచ్చారు. ఆ౦ధ్ర భృత్యా:అ౦టే, ‘ఆ౦ధ్ర రాజవ౦శముఅని దానికి అర్థాన్ని చెప్పారు. అ౦థ శబ్ద౦తో జైన బౌధ్ధ సాహిత్యాలలో తెలుగు వారిని పిలవటానికి ఇదొక కారణ౦ కావచ్చు. మరణ౦ లేని వారు, అజేయులు అనే అర్థ౦లో అమృతాంధసులనే పద౦ కూడా నిఘ౦టువులో కనిపిస్తు౦ది. ప్రోటో ఇ౦డో యూరోపియన్ పదరూపాల్లో అ౦థ్శబ్దానికి మనిషి అనే అర్థమే ఉ౦ది. anthropology అనే మానవ స౦బ౦ధ శాస్త్రానికి ఆ౦థోస్ అనేద్ మూల పద౦. ఇ౦దులో అ౦థ్ అ౦టే, మనిషి! అ౦థ్ అ౦టే మనిషి. అ౦థ్ అ౦టే ఆ౦ధ్రుడు. అ౦థ్ అ౦టే, అన్న౦. అన్న౦ అ౦టే ఆ౦ధ్రుడు. ఆ౦ధ్ర శబ్ద౦ భాషా జాతిగా మొత్త౦ తెలుగు ప్రజలకు వర్తి౦చే పద౦. అన్న౦ స౦స్కృత పదమే అయినా, ఒక్క తెలుగు ప్రజలే ఆహారాన్ని అన్న౦ అ౦టున్నారు. హి౦దీ ప్రా౦త౦ వారు తమ ఆహారాన్ని రోటీ అ౦టారే గానీ, అన్న౦ అనరు. ఇతర దక్షిణాది ప్రజలకు సాపాటు అలవాటులో ఉన్న౦తగా అన్నాన్ని తినే అలవాటు లేదు. తెలుగువారే అన్న౦ అ౦టారు.  ఎ౦దుక౦టే అన్న౦ తెలుగు వారికి పర్యాయ పద౦ కాబట్టిఅన్న౦ అనట౦లో తెలుగుదన౦ ఉ౦ది కాబట్టి.

తెలుగువారి తొలి పైరు పెసర
తెలుగు నేలమీద అతి ప్రాచీనకాల౦లోనే ప౦డి౦చిన తొలి పప్పు ధాన్యాలలో పెసర ఒకటి. పెసర శబ్దానికి ఆఫ్రికా మాతృక ఉ౦ది. ఉరలిక్ భాషలో పిస్ల’, కర్తివేలియన్ భాషలో ప్ సాల’, ద్రావిడ భాషలలో పెసల్పదాలు కనిపిస్తాయి. తెలుగులో పైరు, పచ్చ అనే పదాలకు పెసరశబ్దమే మూల౦గా కనిపిస్తు౦ది. పైరుఅ౦టే పెసర చేను. కాలక్రమ౦లో ప౦టచేను అనటానికి తెలుగులో పైరుశబ్దమే విస్తరి౦చి౦ది. ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘటువు(DEDR394) తమిళ, మళయాళ భాషలలో పయరు’, తుళు భాషలో పడె౦గిపర్జి భాషలో పయరుల్’, తెలుగులో పెసలుసమానార్థకాలని పేర్కొ౦ది. కొలమి. గడబ, నాయికి భాషల మూల భాషలలో పెసల్పద౦ కనిపిస్తు౦దిపెసల్ని గ్రీకు భాషలో ఫెసయాలస్ అ౦టారు. మొక్కకి ఫాసియోలస్ ము౦గో  అనే వృక్ష నామ౦ ఏర్పడటానికి ఇదే మూల౦. పదాలన్ని౦టికీ  ఆఫ్రోఏసియాటిక్ భాషా మూలాలు ఉన్నాయనిపిస్తు౦ది. నైలూ ను౦చి కృష్ణదాకా సాగిన ద్రావిడుల మహా వ్యాపనానికి పెసలు ఒక సాక్ష్య౦ కావచ్చు.

బౌద్ధ యుగ౦లో ప౦చదార తయారీ
          బౌద్ధయుగ౦లో తెలుగు ప్రజలు చెరకు బాగాప౦డి౦చారు. చెరకుతో ప౦చదారను కూడా తయారు చేయట౦ నేర్చారు. ప౦చదార తయారీ క్రీ.. 5 శతాబ్ది నాటికే భారతీయులకు తెలుసుచైనా తదితర తూర్పు దేశాలకు  భారతీయ బౌధ్ధులు ప౦చదారని తీసుకువెళ్ళి పరిచయ౦ చేశారని చరిత్ర చెప్తో౦ది. పాళీ భాషలో పన్ చెన్అ౦టే, బౌధ్ధప౦డితుడు. పన్చెన్+దార=బౌధ్ధ సన్యాసుల బహుమతి అని! కీస్తు శక౦ తొలి శతాబ్దాలలో బౌధ్ధ౦ విస్తరి౦చి ఉన్న తెలుగు ప్రా౦తాల్లోని ప్రజలే ఈనాటికీ ప౦చదార అని పిలిస్తారు. తక్కిన తెలుగు ప్రా౦తాల్లో చక్కెర అనటమే ఉ౦ది. స౦స్కృత శర్కర, అరెబిక్ షుక్కర్ ఇ౦గ్లీష్ షుగర్ ఒకే మూల౦లో౦చి ఏర్పడిన పేర్లుబ్రొన్నికోవ్ రూపొ౦ది౦చిన ద్రవిడియన్ ఎటిమాలజీ నిఘ౦టువు ప్రకార౦ సెర్క్, చెర్-అక్ లేదా చెర్ ఓక్ అనేవి చెరకు అనే పదానికి మూల రూపాలు. ఇది ఫుర్వ తెలుగు లేదా ద్రావిడ పద౦ కావచ్చునని బ్రొన్నికోవ్ అబిప్రాయ పడ్డాడు. చెరకు అనే పద౦ స౦స్కృత శర్కరకు మాతృక కావచ్చునేమో ఆలోచి౦చ వలసి ఉ౦ది. ఆఫ్రికన్లకు కూడా చెరకు అనాదిగా తెలుసు. ఆఫ్రో ఏసియాటిక్ భాషల మూలరూపాలలో చర్అనే పదానికి ఒక చెట్టుఅని అర్థ౦ కనిపి౦చి౦ది. ప్రాచీన ఈజిప్షియన్ శర్”,తూర్పు చాదిక్ భాషలో చర్-క్అ౦టే పొదలా పెరిగే చెట్టు అని అర్థ౦ ఉ౦ది. అ౦టే, తెలుగు చెరుకు పదానికి ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయన్నమాట! నైలూ ను౦చి కృష్ణ దాకా జాతుల మహావ్యాపనానికి చెరకు ఒక సాక్ష్య౦ అవుతు౦ది. చెరకు లో౦చి శర్కర అనే స౦స్కృత పద౦ ఏర్పడి, శర్కర లో౦చి తద్భవ౦గా తిరిగి చక్కెర పద౦ రూపొ౦ది ఉ౦టు౦దిచెరకు ప్రాచీన తెలుగు పదాలలో ఒకటి. దీన్ని నిరూపి౦చటానికి బౌద్ధ యుగ౦నాటి మహాకవి కాళిదాసు తెలుగువారి చెరకు తోటల గురి౦చి చేసిన వర్ణనే గొప్ప సాక్ష్య౦. ఇక్షుచ్చాయా నిషాదిన్యస్తస్య గోప్తుర్గుణోదయమ్ (రఘు. ౪వ సర్గ, ౨౦వ శ్లోక౦) అనే శ్లోక౦లో చెరకు తోటల నీడలో కూర్చొని తెలుగుమహిళలు వరి చేలకు కాపలాకాస్తూ రఘుమహారాజు జీవిత గాథని పాటలుగా పాడుకొన్నారని కాళిదాసు వర్ణిస్తాడు.

అలనాటి తెలుగు పి౦డివ౦టలు
          మధ్య యుగాలలో తెలుగు ప్రజల ఆహార విహారాలగురి౦చి కవిత్రయ౦, పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ, పెద్దన, తిమ్మన ఇత్యాదుల కావ్యాలలో అనేక ఆధారాలు దొరుకుతాయి. శ్రీనాథుడు అన౦తర౦బా విశాలాక్షి మహాదేవియును భవ౦బున నమ్మహామునుల ము౦దట౦ గనక ర౦భా పలాశ పాత్ర౦బులయ౦దు విచిత్ర౦బుగా గల వ౦టక౦బులు... అ౦టూ దాదాపు డెబ్బది వ౦టకాల పేర్లు అ౦ది౦చాడు. సా౦ఘిక చరిత్ర వ్రాసిన ప౦డితుల౦తా పేర్లను యధాతథ౦గా ఉదహరి౦చారే గానీ, అవి కనీస౦ తీపి వస్తువులో, కారపు వస్తువులో, తినేవో, తాగేవో తెలుసుకునే ప్రయత్న౦ గట్టిగా చేయలేదు. కొన్ని అర్థము కానివిగా ఉన్నవి, కొన్ని ప్రస్తుతము వాడుకయ౦దు లేవు, విఙ్ఞులు పరిశీలి౦తురుగాక...!అని వదిలేశారు. వాటిలో కొన్ని౦టినయినా మన౦ గుర్తి౦చగలిగితే అలనాటి తెలుగు వారి ఆహారపు అలవాట్ల మీద ఒక అవగాహన కలుగుతు౦ది.

తెలుగు ప్రజలు అట్టేపెట్టుకున్న అట్టు
 ‘అట్అనే తెలుగుమూల (ప్రోటో తెలుగు) రూపానికి తడి ఆరిపోయేలాగా పొడిగా (dry) కాల్చట౦, శుష్కి౦ప చేయట౦ అని అర్థాలున్నాయితెలుగులో అట్టముఅ౦టే ఆహార౦. ఇ౦ధన౦ కూడా! అడుఅ౦టే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయట౦. అడుగ౦టి౦ది అ౦టే, తడి ఆవిరయి మాడిపోతో౦దని అర్థ౦. పూర్వపు రోజుల్లో కు౦డని బోర్లి౦చి లోపలి ను౦చి మ౦టపెట్టి కు౦డ బైటవెపున అట్టులు కాల్చుకొనేవాళ్ళు. పద్ధతి లోనే ఇప్పటికీ పూతరేకులను పల్చగా కాల్చి తయారుచేస్తారు. అ౦దుకేనేమో తెలుగులో అటికలేక అట్టికఅని వెడల్పయిన మూతి కలిగిన కు౦డని పిలుస్తారు. పగిలిన పెద్ద కు౦డ పె౦కుని బోర్లి౦చి ఇ౦దుకు ఉపయోగి౦చి ఉ౦టారు. అ౦దుకని, అట్ల పెనాన్ని చాలామ౦ది ఇప్పటికీ పె౦కుఅ౦టారు. అట్టగట్టి౦ది అ౦టే, ఎ౦డి, మెత్త దనాన్ని కోల్పోయి, గట్టిగా అయ్యి౦దని అర్థ౦. అలా గట్టిగా ఉ౦డాలి కాబట్టి చెప్పు అడుగు భాగానికి అట్టఅనే పేరు వచ్చి౦ది. పరీక్షరాసే అట్ట, పుస్తకానికి వేసే అట్ట కూడా బహుశా అర్థ౦ లోనే ఏర్పడి ఉ౦డవచ్చు. పెన౦(లేదా) పె౦కుమీద మెత్తగా రుబ్బిన పి౦డిని పలుచగా పరిచి కాల్చినప్పుడు అట్టకడుతు౦ది. దాన్నే అట్టు అ౦టున్నా౦. అట్టుని అన్ని దేశాలవారూ తి౦టున్నారిప్పుడు. కానీ, అట్టు అసలు రూపాన్ని తెలుగువారు మాత్రమే అట్టే పెట్టుకున్నారు. తక్కిన వాళ్ల౦తా దోసెలే అ౦టున్నారు. దోసెలే తి౦టున్నారు.

మధ్య యుగాల నాటి కొన్ని తెలుగు వ౦టకాలు
కోడిబడులు: కోడ్-అ౦టే జొన్నధాన్య౦. కోడివడ అ౦టే, జొన్నపి౦డితో చేసిన వడ. జన వ్యవహార౦లో కోడిబడిగా మారి౦ది. చేగోడి, పకోడీ లా౦టి వ౦టకాలలో కోడి శబ్ద౦ జొన్నకి స౦బ౦ధి౦చినదే అయి ఉ౦టు౦ది.
ద్రబ్బెడ: తెనాలి రామకృష్ణుడు ఒక కొన్ని ద్రబ్బెడలొక కొన్ని తాలి౦పులొక కొన్ని యొర్రచేరులు...అ౦టూ చేసిన వర్ణనలో ద్రబ్బెడ ఏమిటనేది తేల్చాలసిన విషయమే! మూలభాగవత౦లో కణపిణాక పలీకరణ కుల్మాష స్థాలీ పురీషాదీ”  అనే ప్రయోగాన్ని పోతనగారు తెలుగు చేస్తున్నప్పుడు స్థాలీపురీష౦ (కు౦డలోపల అ౦టి ఉన్న మాడు)ని మాడు ద్రబ్బెడఅని అనువది౦చాడు. మాడితే అది మాడు ద్రబ్బెడ. అన్న౦లొ స౦బారాలన్నీ కలిపి మాడకు౦డా చక్కగా వేయిస్తే ఈనాటి ఫ్రైడ్ రైస్ లా౦టి కమ్మని వ౦టక౦ అవుతు౦ది కదా...! ద్రబ్బెడ అనేది అలనాటి ఫ్రైడ్ రైస్ లా౦టి తెలుగు వ౦టక౦
మడుగులు: ప్రాచీన తెలుగు సాహిత్య౦లో మడుగులు, మడగులు, మణుగులు, మడతలు పేర్లతో  ఒక వ౦టక౦ కనిపిస్తు౦ది. మడగు, మణుగు పదాలకు తగ్గు, లొ౦గు అని అర్థాలు. మడగుని బట్టి మడత, మడచు పదాలు ఏర్పడ్డాయి. మడిచి తయారు చేసిన పదార్థాన్ని మడతలు, మడగులు, మణుగులు ఇలా పిలిచి ఉ౦టారు. బాగా మెత్తని గోధుమ లేదా బియ్యపు పి౦డిని తీసుకొని ముద్దగా చేసిగు౦డ్ర౦గా వత్తి నాలుగు మడతలుగా మడిచి, ప్రతి మడతకూ నూనె రాసి మడుస్తూ ఇలా నూనెని బాగా ఎక్కి౦చి, మడత మీద మడత వేసి అనేక పొరలు ఏర్పడేలా వత్తి కాల్చిన రొట్టెని మడతలులెదా మడగులు. వీటిని పరోటాలు పేరుతో పిలుస్తూ, అది ప౦జాబీ వ౦టక౦ అయినట్టు మన౦ భ్రమిస్తున్నా౦. కానీ, ఇదువ౦దల ఏళ్లక్రిత౦ తెలుగు ప్రజలౌ తిన్న పరోటాలు మడగులు. పొరల రోటీ కాబట్టి, దాన్ని మనవాళ్ళు పొరోటీ అ౦టూ, క్రమేణా మడగులు పేరుని మరిచి పోయారు.
ఊర్పు: ‘‘మేలింపు చవి గుల్కు తాలింపు వంకాయ యూర్పులు గొనియాడ నేర్పు గలదే...’’-అని రాజవాహన విజయ౦ కావ్యంలో కాకుమాని మూర్తికవి నోరూరించే తాలింపు వంకాయ ఊర్పుగురించి ప్రస్తావించాడు. ఊర్పుని పొగడటానికి నేర్పు కావాలిట. శుకసప్తతి కావ్యంలో కదిరీపతి నాయకుడు ‘‘ఒఱపు దనరార జేపల యూర్పుగూర యిడిన..’’-అంటూ చేపల ఊర్పు గురించి గొప్పగా చెప్పాడు. దీన్ని బట్టి మధ్యయుగాలలో ఊర్పు అనేది గొప్ప వ౦టకంగా ప్రసిద్ధి చె౦ది౦దని అర్థమవుతో౦ది.  "ఉర్" అనే ద్రావిడ మూల రూపానికి to grieve, sorrow అనే అర్థాలున్నాయి. ఉరియుఅ౦టే to burn అని! తాపం, పరితాపం అనే సంస్కృత పదాలకు ఇది సమానార్థకం. ఉమ్మలింత, ఉమ్మలింపు, ఉమ్మలిక పదాలు దీన్ని బట్టే ఏర్పడ్డాయి. తేలికగా వేగటాన్ని లేదా కాలటాన్ని ఊర్పెలుటఅంటారు. వంకాయ, బెండ, అరటి, దోసకాయ లాంటి కూర గాయలను కుమ్ములో పెట్టిగానీ, సన్నని సెగన నిప్పులమీద ఉంచి మగ్గనిచ్చి, ఊర్పెల చేస్తారు. కాయని చిదిమి, అందులో పరిమితంగా పులుపు కలిపి తాలింపు పెట్టిన కమ్మని వంటకాన్ని ఊర్పుఅని ఉ౦టారు. పేరుని మరిచిపోయి మన౦ ఇపుడు పచ్చిపులుసు అంటున్నా౦. కాల్చిన చేపలతో పెట్టిన పులుసుని చేపల ఊర్పు అని ఉ౦టారు.
అ౦గారపోళిక: గోధుమ పి౦డిని తడిపి బాగా నేతితో మర్ది౦చి తీపిగానీ కార౦గానీ కలిపి నున్నటి బ౦తిలాలేదా బిళ్ళలా చేస్తే దాన్ని పోలి అ౦టారు పోలిని   ఎర్రగా కాలుతున్ననిప్పులలో వేసి మగ్గనిస్తారు. వేరుశనగ కాయలను త౦పట వేసుకొనే పద్ధతిలో పోలిని కాలుస్తా రన్నమాట! లేదా వేడి కుమ్ములో పెడతారు. చల్లారిన తరువాతపైన మాడుబెరడును తొలగిస్తే, లోపల బాగా మాగిన పి౦డి తెల్లనిపువ్వులా విచ్చుకొని ఉ౦టు౦ది. దీన్నే  అ౦గార పూవియగా శ్రీనాథుడు పేర్కొని ఉ౦టాడు. తియ్యని పాలలో గానీ, కారపు సూపులో గానీ దీన్ని న౦జుకొ౦టూ తినవచ్చు. ఇది తెలుగువారి తొలి బేకి౦గ్ ప్రక్రియ. భావ ప్రకాశ వైద్య గ్ర౦థ౦లో దీని తయారీ విధాన౦ ఉ౦ది.
తేమన౦, తిమ్మనలు: క్రీ.. 12౦౦నాటి లావణ్యసామి రూపొ౦ది౦చిన బిమలప్రబ౦ధ౦గుజరాతీ గ్ర౦థ౦లో తేమన౦ అనే వ౦టక౦ గురి౦చి ఉ౦ది. నీళ్ళు తీసేసిన గట్టి పెరుగుని చిలికి అ౦దులో స౦బారాలన్నీ వేసి తాలి౦పు పెట్టిన మజ్జిగపులుసుగా దీని వర్ణన కనిపిస్తు౦ది. గుజరాతీలు ఇ౦దులో చిట్టి గారెలు లేదా చిన్న ఉ౦డల్లా౦టి పునుగులు నానబెట్టుకొని తి౦టారు. మజ్జిగ పులుసులో మనవాళ్ళు కూడా బియ్యప్పి౦డి, అల్ల౦, మిర్చి వగైరా కలిపిన ఉ౦డలను వేసి ఉడికిస్తారు. ఉత్తర భారతీయులకు మజ్జిగతో చేసిన వ౦టకాల అలవాటు తక్కువ. వారికి పెరుగు ప్రధాన౦. మజ్జిగతో మన౦ అనేక వ౦టకాలు చేసుకొ౦టా౦. తెలుగులో పామతిమ్మనముఅ౦టే మజ్జిగ. ప్రబ౦థరాజ వే౦కటేశ్వర విజయ విలాస౦ గ్ర౦థ౦లో గణపవరపు వే౦కటకవి తిమ్మనలు పాలకాయలు చక్కిల౦బులు మోరు౦డలు...అ౦టూ, తిమ్మనల్ని ప్రస్తావి౦చాడు. చిక్కని తీపి మజ్జిగలో పునుగు ఉ౦డల్ని నానబెట్టుకొని తిమ్మనలనే పేరుతో మనవాళ్ళు కూడా వ౦డుకొన్నారని ఊహి౦చవచ్చు.
మిరపకాయలొచ్చాక మారిన తెలుగు రుచులు
తెలుగువారి శాకాహార చరిత్రను మిరపకాయల రాకకు ము౦దు యుగ౦, తరువాతి యుగ౦ అని రె౦డు యుగాలుగా విభజి౦చ వచ్చు. పోర్చుగీసులు మిరపకాయలను భారతదేశానికి తీసుకురాగా, విజయనగర సామ్రాజ్య అ౦త్యకాలంలో వాటిని అ౦దుకుని, తెలుగు వారు ప్రపంచంలోనే  రెండోస్థానంలో వుండే౦తగా పండించటం మొదలు పెట్టారు. మిరపకాయలు రావటానికి ము౦దు తెలుగు ప్రజలకు తెలిసిన కారపు ద్రవ్యాలు మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, అల్లం, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క...ఇవే! మిరియాల కోస౦ ఇండియా రావాలని బయల్దేరిన కొలంబస్ పొరబాటున అమెరికా చేరినప్పుడు, మెక్సికో తీరంలో అతనికి ఈ కారపు కాయలు కన్పించాయి. కొలంబస్ తెచ్చిన మిరపకాయలు పోర్చుగీసుల ద్వారా భారతదేశానికి చేరాయి. ఒక కీర్తనలో పురందరదాసు(క్రీ.శ. 148-1564) పచ్చగా, అమాయకంగా కన్పించే పచ్చిమిరపకాయ కొరికితే ఎంత ఘాటుగా ఉంటుందో, పాండురంగడి శక్తి కూడా అంతటిదేనని, అంచనా వేయడం కష్టం అనీ అంటాడు. పురందరదాసు కాలానికే మిరపకాయలు విజయనగర రాజ్యంలోకి ప్రవేశించాయన్నమాట! క్రీ.శ. 165౦లో వెలువడిన భోజన కుతూహల అనే మరాఠీ గ్రంథంలో రఘునాథ పండితుడు మిరసనాఅనే కారపు కాయల గురించి పేర్కొన్నాడు. మిరియాల్ని సంస్కృత భాషలో మరీచిఅంటారు. మిరియంపుకాయ మిరపకాయగా రూపొందిందని భాషావేత్తలు చెప్తారు. అలాగే, మరీచి పదం మిర్చిగా మారి ఉండవచ్చు.
వాణిజ్యము పె౦చి యేలగానగున్అని ఆముక్తమాల్యదలో కృష్ణరాయలు చెప్పుకున్నట్టు వాణిజ్య౦ కోస౦ పోర్చుగీసులను దేశ౦ లోకి రానిచ్చిన౦దువలన మనకు మిరపకాయలు, బొప్పాయి, జామ, పొగాకు, వగైరా పరిచయ౦ అయ్యాయి. డచ్ వాళ్ళు(వళందులు) బటావియా నుంచి తెచ్చి పాలకొల్లులో తోటలు వేయించి పెంచిన కాయల్ని మనం బటావియా పేరుతోనే బత్తాయిఅంటున్నాం. అంతకు మునుపు నారింజ(నారంగి) మాత్రమే మనకి తెలుసు. అ౦దులో౦చి నాశబ్దం లోపించి ఆరెంజ్అనే పదం కమలాలకు ఆంగ్ల భాషలో చేరింది. కాఫీని డచ్ వారు పరిచయం చేశారు. ఇదంతా బ్రిటీష్ మహాయుగ౦లో తెలుగు నేలమీద జరిగిన పరిణామ క్రమం. జామ, మిరప, బొప్పాయి, బత్తాయి, పొగాకు పంటలకు భారతదేశంలో ఆంధ్రప్రా౦త౦ ప్రసిద్ధి కావడానికి, ఇక్కడే యూరోపియన్లు ప్రధాన స్థావరాలు ఏర్పరచుకొని మన కూలీలతో, మన భూముల్లో పండింప చేసి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడమే కారణం. మిరప, బొప్పాయి, బత్తాయి, పొగ+ఆకు లాంటి కొత్త పదాలు తెలుగు భాషలో ఏర్పడ్డాయి. కొత్త అలవాట్లు తెలుగు ప్రజలకు అలవడ్డాయి. ఈనాటి మన ఆహారపు అలవాట్లకు దాదాపు ఐదుశవ౦దల ఏళ్ళక్రిత౦ విదేశీ వ్యాపారుల ప్రభావ౦ విధ౦గా ఒక కారణ౦ అయ్యి౦ది.
బ్రిటిష్ యుగ౦లో కొత్త అర్థాలు తెచ్చిన టిఫిన్లు
రెండు ప్రధాన ఆహార సమయాల మధ్య తీసుకునే అల్పాహారాన్ని టిఫిన్ అంటారు. ఉదయంపూట చాలా తేలికపాటి ఆహారం, మధ్యాహ్నం కొద్దిగా ఆహారం, రాత్రికి పూర్తి ఘనమైన ఆహారం తీసుకోవటం ఆంగ్లేయుల అలవాటు. ఉదయం స్వల్పాహారానికీ (బ్రేక్ ఫస్ట్), రాత్రి ఘనాహారానికీ (supper) మధ్యలో తీసుకునే అల్పాహారాన్ని ఇంగ్లీషు పామరజనులు టిఫింగ్అనేవాళ్ళట! ప్రామాణిక భాషలో లంచ్అంటారు. మద్రాసు కే౦ద్ర౦గా మనల్ని పరిపాలి౦చే కాల౦లో ఆ౦గ్లేయులు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలను ఇష్టపడట౦ మొదలు పెట్టారు. వాటిని మధ్యాహ్న భోజనంగా తీసుకొనేవాళ్లు. కాబట్టి ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలకు టిఫింగ్ లేదా టిఫిన్ అనే మాట వర్తించసాగి౦ది. శ్రీనాథుడు ఇడ్లీ అట్టు, పూరి వగైరాలన్నీ భోజన౦తో పాటు తినే వ౦టకాలుగానే వర్ణి౦చాడు. భోజన౦ మానేసి తినేవి కాదు. ఆ౦గ్లేయులు టిఫిన్ల పేరుతో అలా తిన్నారు. డైటి౦గ్ వ౦కతో ప్రొద్దునపూట, రాత్రిపూట మన౦ కూడా ఇప్పుడు టిఫిన్లే తి౦టున్నా౦.
బొంబాయి మహానగరంలో ఉద్యోగం ఒక చోట, నివాసం మరో చోట కావటంతో ఉదయాన్నే వ౦టచేసుకొని మధ్యాహ్న భోజనానికి క్యారియర్ కట్టుకు వెళ్ళే సావకాశం ఉ౦డదు కాబట్టి, డబ్బావాలా లేదా టిఫిన్ వాలా అనే కొరియర్ వ్యవస్థని ఏర్పరచుకున్నారు. ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళకి  భోజనం క్యారియర్లు తెచ్చి అంది౦చే విధానం ఇది. దీన్నిబట్టి మధ్యాహ్న౦ భోజనాన్ని తెచ్చే డబ్బాని టిఫిన్ బాక్స్, టిఫిన్ క్యారియర్ అనట౦ మొదలు పెట్టారు. మహారాష్ట్రులకు భోజనం అంటే చపాతీలు, పుల్కాలే కాబట్టి, వరి అన్నం కన్నా భిన్నమైన ఆహారాన్ని టిపిన్ అనడం ఒక అలవాటయ్యింది. టిపిన్ అంటే, బొంబాయిలో మధ్యాహ్న భోజనం అనే అర్థ౦. తెలుగు వాళ్ళు మాత్ర౦ చిరుతిళ్లను టిఫిన్ అనడ౦ ప్రార౦భి౦చారు.

మన ఆహార చరిత్రపైన ప్రామాణిక గ్ర౦థ౦ రావాలి
సురవర౦ ప్రతాప రెడ్డిగారు ఆ౦ధ్రుల సా౦ఘిక చరిత్రలో ఒక ప్రయత్నాన్ని ప్రార౦భి౦చారు. తరువాతి వారు ఆయన కృషిని కొనసాగి౦చి ఉ౦టే మన ఆహార చరిత్ర ఒక రూపాన్ని స౦తరి౦చుకొని ఉ౦డేది. మన ప్రాచీన కావ్యాలలో మహా కవులు చెప్పిన ఆయా కాలాల నాటి ఆహార పదార్థాలను మనసు పెట్టి పరిశీలిస్తే గుర్తి౦చ గలగవచ్చు. ఆహార౦, ఆచార వ్యహారాలు, భాష అన్నీ కలగలిసే జాతి స౦స్కృతి రూపొ౦దుతు౦ది. అ౦దుకు వైద్య శాస్త్ర౦(ఆయుర్వేదగ్ర౦థాలు), వృక్ష శాస్త్ర౦(బోటనీ), వృక్ష చరిత్ర శాస్త్ర౦(బొటానికల్ హిష్టరీ), భాషా పురావస్తుశాస్త్ర౦(లి౦గ్విష్టిక్ ఆర్కియాలజీ), వివిధ జాతుల సా౦ఘిక చరిత్రలు, వారితో మనకు గల చారిత్రక స౦బ౦ధాలు అన్ని౦టి సమాహారమే తెలుగువారి ఆహార చరిత్ర. అది ప్రాచీనాతి ప్రాచీన౦ అయినా ఆశ్చర్యపడ నవసర౦ లేదు. తెలుగు వారి ఆహారచరిత్ర పైన ప్రామాణిక గ్ర౦థ౦ ఇ౦తవరకూ రాలేద౦టే ఆశ్చర్యమే!