Tuesday 21 October 2014

రసము తాగితేనే రసికత! డా. జి వి పూర్ణచందు

రసము తాగితేనే రసికత!

డా. జి వి పూర్ణచందు


సారవంతమైనది కాబట్టి చారుని ‘సారం’ అన్నారు. దాన్నే తెలుగులో రసం అనికూడా పిలుస్తున్నాం. సారంగ పక్షులవంటి కన్నులు కలిగిన ప్రియురాలి అధరామృతం లాంటి సారవంతమైన ఈ చారుని మాటిమాటికీ తాగండి. లేకపోతే ఈ సంసారమే వృధా…అని “యోగరత్నాకరం” వైద్యగ్రంథంలో ఒక చమత్కార శ్లోకం ఉంది. రసము తాగితే రసికత పెరుగుతుందన్నమాట!

తమిళుల ‘రసం’, కన్నడం వారి ‘సారు’, తెలుగువారి ‘చారు’ ఇవి మూడూ ఒకే వంటకానికి చెందిన పేర్లు.  వండటంలో మాత్రం తేడా ఉంది. తమిళుల రసానికి చింతపండు రసం అని మాత్రమే అర్థం. కన్నడం వారు “సారు” అంటారు. ఈ సారులో పప్పుధాన్యాలు, కొబ్బరి ఎక్కువగా కలిసి ఉంటాయి. తెలుగువారు చారు కాచుకోవాలంటే చారు పొడికి ప్రాథాన్యత నిస్తారు. ఈ చారు పొడిలో ప్రధానంగా మిరియాలు జీలకర్ర లాంటి జీర్ణ శక్తిని పెంచే ద్రవ్యాలు౦టాయి. చారు అనేది “సారం” అనే సంస్కృత పదానికి భ్రష్ట రూపం. చారులో వేసే ద్రవ్యాల సారాన్ని చారు అంటున్నాం. కూర గాయల సారం, కందిపప్పు, పెసరపప్పు, ఉలవల వంటి పప్పుధాన్యాల సారం, లేదా ధనియాలు జీలకర్ర, మిరియాల వంటి సంబారాల సారాన్ని చారు అంటారని నిర్వచించుకోవాలి. ఈ మూడి౦టి సారాన్నీ కలగలిపిన ఒక్క చారన్నం చాలు, షడ్రసోపేతమైన భోజనంతో సమానం అవుతుంది. చారు కాచేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో “యొర్రచేరులు” గురించి ప్రస్తావి౦చాడు. ఒర్రగా అంటే ఘాటుగా ఉండే వేడివేడి చారు అని దాని భావం!

చారుకు మిరియాల ఘాటుతో పాటు కరివేపాకు వేసిన ఇంగువ తాలింపు అదనపు రుచిని ఇస్తుంది. ఇష్టమైన వారు వెల్లుల్లిని కూడా కలుపుతుంటారు. అయితే వెల్లుల్లి లాంటి తీక్షణమైన ద్రవ్యాన్ని పరిమితంగా వాడటం మంచిది. కూర, పప్పు, పులుసు, పచ్చడి, ఊరగాయ ఇలా ప్రతిరోజూ మనం తినే అన్ని ద్రవ్యాలలోనూ వెల్లుల్లిని అతిగా కలపటం వలన మోతాదు మి౦చి వెల్లుల్లిని వాడటం అవుతో౦ది. ఇది అపకారం చేసే అంశం. పైగా ఇంత ఎక్కువగా వెల్లుల్లిని తినటం వలన శరీరం లోంచి ఒక విధమైన “గవులు కంపు” వెలువడి పక్కనున్నవారిని ఇబ్బంది పెడుతుంటుంది. మన పౌర సంబంధాలు దాని వలన దెబ్బతింటాయని మరిచిపోకూడదు.

అతిగా మనం తింటున్న మరో ద్రవ్యం చింతపండు. దీని వాడకానికి పరిమితి అనేది ఉంటుందని చాలామంది తెలుగువాళ్ళు మరిచిపోయారు. రేపు తులం బంగారం ఇచ్చి కిలో చింతపండు కొనుక్కోవాలసినంతగా చింతపండు రేటు పెరిగినా దాన్ని కొనడం, తినడం ఆపలేనంత స్థితికి మనం చేరిపోయాం. ఇటీవలి కాలంలో దీని వాడకం మరీ పెరిగింది. కృష్ణ దేవరాయలు, శ్రీనాథుడు వగైరా కవులు చేసిన ఆహార వర్ణనల్లో చింతపండు వేసి వండినట్టు రాయలేదు. పులి చెంచలి కూర, చుక్కకూర లాంటి వాటిని పులుపు రుచి కోసం వాడినట్టు రాయల వారి ఆముక్తమాల్యదలో కనిపిస్తుంది. చింతపండు ఎంత యాసిడ్‘ని పెంచుతుందో అంత షుగరుని కూడా పెంచుతుందని గుర్తించాలి. బీరకాయ కూర, ఆనప (సొర) కాయ కూర, పొట్లకాయ కూర, తోట కూర, పాలకూర, మె౦తి కూర, బె౦డ, దొ౦డ, వంకాయ, చిక్కుడు కాయ, ఇతర దుంప కూరలు వీటిలో దేనిలోనూ చింతపండు కలపాల్సిన అవసరమే లేదు. అయినా కావాలని కలుపుతున్నాం. దోసకాయ సహజంగా పులుపు రుచి కలిగినదే అయినా, దోసకాయ పప్పులో చింతపండు  కలపాల్సిన అవసరం ఉందా…? పుల్లగోంగూర పచ్చడికి చింతపండు అవసరమా…? రాను రానూ పులుపు వాడకాన్ని ఇలా అన్యాయంగా పెంచుకొంటూ పోతున్నాం.

 ప్రస్తుతం మన చర్చనీయాంశం చారుకాబట్టి , చారు అంటే చింతపండు చారు అనే అభిప్రాయంలోంచి మొదట మనం బయట పడి కొన్ని ముఖ్యవిషయాలు పరిశీలిద్దాం.  ఆరోగ్యాన్నిచ్చే కమ్మని చారు వంటకాలు చాలా ఉన్నాయి.

1. బశ్శారు= బీర, పొట్ల సొర, గుమ్మడి, బూడిదగుమ్మడి లాంటి నీరు ఎక్కువ కలిగిన కూరగాయలు లేదా ఆకుకూరల్ని మిక్సీ పట్టి రసం తీసి, చారుపొడి వేసి కాచి, తాలింపు పెట్టిన చారుని కన్నడం వారు “బశ్శారు” అంటారు. కూర ఎక్కువ, అన్నం తక్కువ తినాలని డాక్టర్లు చేప్పే సూత్రానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితోనూ, స్థూలకాయంతోనూ బాధపడే వారికి ఇది చక్కని ఉపాయం.

2. మిరియాల చారు: ‘ముల్లీగాటనీ సూప్’ అని పశ్చిమదేశాలవాళ్ళు పిలిచే మిరియాల చారు తెలుగు కన్నడ ప్రజలకు ప్రీతిపాత్రమై౦ది. కంఠపర్యంతం భుజించినా ఈ మిరియాల చారన్నం తింటే, భుక్తాయాసం కలగకుండా ఉంటుంది.

3. టొమాటో చారు: చింతపండుకు బదులుగా టమోటాలు వేసిన చారు. చారుని కాచి పొయ్యి మీ౦చిదించినతరువాత ఆ వేడి మీద టమోటాలను చిదిపి రసం కలపాలి. టమోటాలను ముందే వేసి ఉడికిస్తే అందులోని సి విటమిన్ ఎగిరి పోతుంది. రుచి చచ్చిపోతుంది.

4. కట్టుచారు: చింతపండు లేకుండా కాచిన పప్పుచారుని “కట్టు” లేదా “కట్టుచారు” అంటారు. రాత్రిపూట ఒక కూరతోనూ, కొద్దిగా పెసరకట్టుతోనూ భోజనం ముగించ గలిగితే ఎలాంటి దోషాలూ కలగవు. స్థూలకాయులకూ, షుగరు రోగులకూ పెసరకట్టు చారు ఒక మంచి ఆహార పదార్థం.

5. పప్పుచారు: కందిపప్పు లేదా పెసరపప్పు, కూరగాయల ముక్కలు. సంబారాలు చేర్చి తాలింపు పెట్టి కాచిన పప్పుచారులో పులుపును పరిమితంగా వాడుకొంటే ఆరు రుచులూ ఇందులో ఉంటాయి. తమిళులు సాంబారు అన్నంతోనే కూర, పప్పు పచ్చడి తింటారు ఎందుకంటే ఇదొక్కటి అనేక వంటకాల పెట్టు కాబట్టి! ఇంట్లో కాచుకొంటే పప్పుచారు అనీ హోటల్లో తింటే సాంబారు అనీ అంటూ ఉంటాం గానీ, సాంబారుకీ, పప్పుచారుకీ సంబారాలు, కూరగాయలు కలపటంలో కొంత తేడా ఉంటుంది.

6. ధప్పళం: ఎక్కువ కూరగాయల ముక్కలు వేసి చిక్కగా కాచిన పులుసుని “ధప్పళం” అంటారు. కూరగాయల సారం అంతా దీనిలో ని౦డి ఉంటుంది. మన పూర్వులు దీన్ని ఇష్టంగా తినేవారు. తమిళులకు సాంబారు ఎంత ఇష్టమో, తెలుగువారికి ధప్పళం అంత ముఖ్యమై౦ది. అని రకాల కూరగాయల ముక్కలు వేసి, కందిపప్పుతో వండినది పప్పుచారు. కందిపప్పు లేకుండా చిక్కగా కాచినది ధప్పళం అనవచ్చు. కూర, పప్పు, పచ్చడి లాంటివి సాంబారుతో కలుపుకొని తినడం తమిళులకు అలవాటు. కానీ, తెలుగువారి ధప్పళానికి ఇవేవీ అక్కరలేదు. పులుపును పరిమితంగా వేసి వండిన ధప్పళం లేదా పప్పుచారు లాంటి వంటకం ఒక్కటుంటే చాలు, ఇన్ని రకాల వంటకాలు చేయని మేలు అదొక్కటే చేస్తుంది. ఆహార శాస్త్రం కూడా అనేక రకాల వంటకాలు ఒకే పూట తినటాన్ని అంగీకరించదు. వి౦దు భోజనం అనేది ఎప్పుడో సరదాగా తినవలసింది. వి౦దు భోజనంలో తిన్నట్టు ప్రతిరోజూ ఇంట్లో భోజనం కూడా ఉంటే, జీర్ణాశయ వ్యవస్థతో సహా శరీర వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. రోజులో ఒక పూట భోజనం అయినా ధప్పళం లాంటి వంటకంతో పరిమితంగా తినడం అవసరం అని మనవి.

7. మజ్జిగచారు: పులవని, చిక్కని మజ్జిగలో కొత్తిమీర, అల్లం, వాముపొడి వేసి గోరువెచ్చ చేసిన చారు ఆరోగ్యదాయకం. మామూలు మజ్జిగకన్నా ‘మజ్జిగచారు’ని తయారు చేసుకొని గ్లాసులో పోసుకొని తరచూ త్రాగటం మంచిది. దీన్నే చల్లచారు అనికూడా పిలుస్తారు.  చిక్కని మజ్జిగలో కొబ్బరి, అల్లం, మిర్చి, ధనియాలు, మిరియాలు, కొద్దిగా శనగ పప్పు వగైరా మిక్సీ పట్టి, కూరగాయల ముక్కలు కూడా కలిపి బాగా మరిగేలా కాచినది “మజ్జిగ పులుసు”. మోరు కొళంబు అని దీన్ని తమిళులు  పిలుస్తారు. తేమనం అని మన పూర్వీకులు దీన్నే పిలిచేవారు. పులిసి, మిగిలిపోయిన మజ్జిగ ఉన్నప్పుడే మజ్జిగపులుసు, మజ్జిగ చారు లాంటివి పెట్టుకోవాలను కుంటే, పుల్లమజ్జిగ ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని మనవి.

8. కొత్తిమీర చారు: కొత్తిమీరని వేళ్లతో సహా శుభ్రం చేసి ముక్కలుగా తరిగి కాచిన చారు. ఆరోగ్యానికి  మేలు చేస్తుంది

9. బెల్లంచారు: కన్నడంలో ‘కట్టి౦ చారు’ అంటారు. కొద్దిగా చింతపండు బెల్లమూ కలిపిన ఘాటయిన మిరియాల చారు.

10. జీలకర్ర చారు: జీలకర్ర, ధనియాలు, కొద్దిగా అల్లం వేసి కాచిన చారు. రుచికరం. జీర్ణశక్తిని పెంచుతుంది.

11. నిమ్మచారు: చారుకాచి దించి చల్లారిన తరువాత నిమ్మరసం పి౦డాలి. నిమ్మరసాన్ని కాయకూడదు. రుచి చెడిపోతుంది. సి విటమిన్ ఎగిరిపోతుంది.

12. మైసూరు రసం: కంది, పెసర, మినుము, శనగ పప్పులు తీసుకొని,  దోరగా వేయి౦చి పైపైన దంచి,కొత్తిమీర, కరివేపాకు వేసి చారుపొడి బాగా దట్టించి కాచిన కట్టుచారు. పొయ్యి మీంచి దించిన తరువాతే నిమ్మరసం కలపాలి.

14. శనగల చారు: కన్నడంలో “కడలే సారు” అంటారు. శనగ పప్పు, కొబ్బరి అల్లం వేసి కాచిన కట్టుచారు.

15. అలచందల చారు: అలచందలు, బంగాళాదుంపలు, కొబ్బరి, అల్లం వేసి కాచిన కట్టుచారు.

16. వంకాయ చారు: లేత వంకాయని నిప్పులమీద కాల్చి చింతపండు రసం పోసి కాచిన చారు. పచ్చి పులుసు అని కూడా పిలుస్తారు.

17. మామిడికాయ చారు: చారుపొడి వేసి చింతపండుకు బదులు మామిడి టెంకెలు వేసి మామిడిచారు కాస్తారు.

18. గంజిచారు: తరవాణి అంటాం మనం. లక్ష్మీచారు అనే ముద్దుపేరుకూడా ఉంది. గంజిని పులవబెట్టి తయారు చేస్తారు. ఇది బీరుతో సమాన మైన గుణాలు కలిగింది. మన పూర్వీకులు బాగా ఇష్టంగా తీసుకొనేవారు గానీ, ఈ నాటి సామాజిక పరిస్థితుల్లో దీన్ని ప్రచారం చేయటం అనవసరం.

19. మె౦తిమజ్జిగ చారు: మజ్జిగలో కొద్దిగా మె౦తులు, జీలకర్ర, వాము వేసి ఇంగువ తాలింపు పెడతారు.

20. ఉలవచారు: బజార్లో వాణిజ్య పరంగా తయారయ్యే ఉలవచారులో నిలవ ఉంచే ద్రవ్యాలే ఎక్కువ ఉంటాయి. ఉలవల్ని ఉడికి౦చి, మిక్సీ పట్టి చిక్కని రసం తీసి, కొద్దిగా చింతపండు కలిపి చారు కాచుకొని తరచూ వాడుకొంటూ ఉంటే, వాతవ్యాధుల్లో ఔషధంగా పని చేస్తుంది.

చింతపండును పరిమితంగా వాడుకొంటే  మనకిష్టమైన ఏద్రవ్యాన్నయినా చారుగా కాచుకోవచ్చు. దాని సారాన్ని పూర్తిగా పొ౦దటానికి చారు ఒక చక్కని అవకాశం. భోజనం చివర మజ్జిగ అన్నానికి ముందు చారు అన్నం తినడం దక్షిణ భారతీయుల సంప్రదాయం. చక్కగా కాచిన చారుని రోజూ ఒక గ్లాసు తాగితే మంచిది. అతిగా చింతపండు కలపటం వలనే విరేచనాలు అవుతాయి. కూరగాయల ముక్కల వలన మలం మెత్తబడి విరేచనం ఫ్రీగా అవుతుంది. అదీ తేడా! 


చారు తాగితే ఏమవుతుందో, ఏమి కలుగుతుందో, ఏది తగ్గుతుందో, ఏది పెరుగుతుందో ఇన్ని రకాల చారులు రుచి చూశాక మీకు తేలికగానే అర్థం అయి ఉంటుంది. చారు పొడి శరీరానికి తేలిక దనాన్ని ఇచ్చి, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అందుకనే యోగరత్నాకరం వైద్యగ్రంథంలో చారు తాగక పోతే ఈ సంసారమే వృథా అన్నాడు. రసము తాగితే లైంగిక శక్తి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది ఇదీ కొసమెరుపు. రసము తాగినవాడు రసికుడు.

అరచేతిలో వైకుంఠాన్ని చూపిన పద్యం :: డా. జి వి పూర్ణచందు



అరచేతిలో వైకుంఠాన్ని చూపిన పద్యం
డా. జి వి పూర్ణచందు

ఇంతింతై, వటుడింతయై, మఱియు దానింతై, నభో వీధిపై
నంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రునికంతయై, ధృవునిపై నంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుం డగుచు, బ్రహ్మాండాంత సంవర్థియై
కన్యాశుల్కం నాటకంలో శిష్యుడు తన గురువైన గిరీశం తక్కువవాడు కాదని చెప్పటం కోసం ఆయన సురేంద్రనాథ బెనర్జీ అంతటివాడని చెప్తాడు. అది విన్న ఆ శిష్యుడి అక్కగారు అమాయకంగా అతగాడెవర్రా?అనడుగుతుంది. దానికి ఏం చెప్పాలో తెలియక, వాడు బుర్రగోక్కుని, అందరికన్నా గొప్పవాడు లెమ్మని సర్ది చెప్పేస్తాడు.
ఈ పద్యంకూడా అలాంటి ప్రయత్నమే చేస్తుంది.  బలి చక్రవర్తిని వామనుడు తను వేయగలిగిన మూడడుగుల భూమి దారాదత్తం పొందుతాడు, అక్కణ్ణించీ శరీరాన్ని పెంచటం మొదలెడతాడు. మొదట ఇంతయ్యాడు. ఇంతింతయ్యాడు. మళ్ళా తానింతయ్యాడు. ఆకాశం అంత అయ్యాడు. అ తరువాత దాని పైనంత అయ్యాడు. అక్కణ్ణించి తోయద మండలాగ్రానికి అంటే, మేఘమండలానికి అల్లంత దూరం అంత అయ్యాడు, మరింత పెరిగి, ప్రభామండలం అంటే, కాంతి లోకాల పైనంత అయ్యాడు. చంద్రుడి దాకా పెరిగాడు. దాటి ధృవమండలం పైనంత అయ్యాడు. ఇంకా పెరిగి మహర్లోకం పైదాకా పెరిగాడు ఇలా సత్య పదోన్నతుడయ్యాడు. అంటే సత్యలోకం దాకా పెరిగాడన్నమాట.
ఆ విధంగా బ్రహ్మాండం అంత పెరిగి, ఒక కాలు భూమ్మీదా రెండో కాలుని ఆ సత్యలోకం పైదాకా లేపాడు. అక్కడ, ఆ పాదాన్ని బ్రహ్మదేవుడు కడిగాడు. బ్రహ్మ కడిగిన పాదం అనే అన్నమయ్య పాట ఈ కథ ఆధారంగానే వచ్చింది. ఇంక మూడో అడుగు ఎక్కడ వెయ్యాలని అడిగి బల చక్రవర్తి నెత్తిన వేసి, అతన్ని పాతాళానికి తొక్కేశాడన్నది మనకు తెలిసిన కథే!
పెరిగీ పెరిగీ అంతరిక్షంలోకి భ్రహ్మాండ లోకాల దాకా పెరిగాడనీ, మధ్యలో మేఘమండలం, చంద్రమండలం వగైరా అన్నీంటినీ దాటుకుంటూ బ్రహ్మాండం అంతా పెరిగాడంటాడు పోతనామాత్యుడు. ఈ మొత్తం కలిపి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం...? ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణానికి ఎంత కాలం పడుతుంది...? ఇ.లాంటి ప్రశ్నలు  కాలమూ-దూరమూపద్దతిలో లెక్కలు కట్టి చెప్పవలసి ఉంటుంది. ఒక గ్రహం నుండి బయలు దేరిన కాంతికిరణం ఒక సంవత్సరం పాటు అంతరిక్షంలో ప్రయాణిస్తే ఎంతదూరం వెడుతుందో దాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఆకాశంలో మనం చూసే ఒక నక్షత్రం భూమికి ఎన్ని కాంతిసంవత్సరాల దూరాన ఉన్నదో, ఆ నక్షత్రం అన్ని సంవత్సరాల నాటిదన్నమాట. ఉదాహరణకు ఆర్ద్రా నక్షత్రం మనకు 250 కాంతి సంవత్సరాల దూరాన ఉన్నదనుకుంటే, ఆ నక్షత్రం నుండీ బయల్దేరిన కాంతికిరణం భూమ్మీదకొచ్చి మనకు కనిపించేసరికి ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ పోయి మోడీ ప్రభుత్వం వచ్చేసిందన్నమాట.  ఇప్పుడు వామనుడు ఎన్ని కాంతి సంవత్సరాల ఎత్తున పెరిగాడు...? సామాన్య మానవుడికి ఈ గణాంకాల వివరాలు బుర్రకెక్కవు. గిరీశంగారి శిష్యుడిలా చాలా ఎత్తుకి పెరిగాడని మాత్రమే చెప్పవలసి ఉంటుంది.
చాలా అనే మాట అనేక కాంతి సంవత్సరాల దూరాన ఉందన్న విషయం సామాన్యుడు గ్రహించటానికి, ఇంతింత పెరిగాడని చెప్పటం ఈ పద్యంలో ఒక గమ్మత్తు. ఇలా చెప్పటాన్నే అరిచేతిలో వైకుంఠం చూపించటం అంటారు. ఈ మాటని ఇప్పుడు మనం లేనిపోని ఆశలు కల్పించటం అనే అర్థంలో వాడుతున్నాం గానీ, అసలు భావార్థం అది కాదు. అరచేతిలో వేలుపెట్టి చూపిస్తూ, ఇది మేఘమండలం, ఇది కాంతిమండలం, ఆ తర్వాత అదిగో అదే వైకుంఠం... ఇలా చెప్పటమే అరచేతిలో వైకుంఠం చూపించటం!