Wednesday 11 June 2014

అమ్మభాషలోనే అసలు ఏడుపు :: డా. జి వి పూర్ణచందు

అమ్మభాషలోనే అసలు ఏడుపు

డా. జి వి పూర్ణచందు

బిడ్డపుట్టగానే మొదటి ఏడుపు ఆ బిడ్డ మాతృభాషలో ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. తల్లి కడుపులో ఉన్నంత కాలం తల్లి మాట్లాడుతుండగా వింటూ వచ్చిన భాషను ఆ బిడ్డ అనుకరించే౦దుకు చేసే ప్రయత్నమే ఈ తొలి ఏడుపు.  భూమ్మీద పడుతూనే బిడ్డ చేసే తొలి రోదనం మాతృభాషలోనే ఉంటుందని, బిడ్డ మనసు మాతృభాషలోనే రూపొందుతుందని ఋజువయ్యి౦ది. ఏడుపుకు భాషలేదనే మన నమ్మక౦  వమ్ము అయ్యి౦ది.
            ఫ్రెంచి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రెంఛి భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తారనేది ఈ తాజా పరిశోధనా సారాంశం. దీన్నిబట్టి, మాతృభాషలోనే మనో భావాలను వెల్లడి౦చే ప్రయత్నం(ability to actively produce language) అనేది పుట్టిన క్షణ౦ను౦చే బిడ్డ మొదలు పెడతాడని అర్థ౦ అవుతో౦ది. తల్లిభాషలో ఉండే యాసను, ధ్వని విధానాన్నీ(rhythm and intonation) గర్భంలోనే బిడ్డలు పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారనీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ యాసఅనే మాటని భాషలోని లయ(rhythm)” అనే అర్థ౦లో వాడటం జరిగి౦ది. తమిళ౦,ఆ౦గ్ల౦, తెలుగు, సంస్కృత౦ మొదలైన భాషలలో లయపర౦గా ఉన్నతేడాలు మనకు తెలుసు. అలాగే, జెర్మనీ, ఫ్రెంచి భాషల లయలలో తేడాలు ఎలా ఉంటాయో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సాధారణ౦గా జెర్మన్ పదాలు పై స్థాయి ను౦చి కి౦దిస్థాయికి వస్తాయని,  ఫ్రెంచి పదాలు క్రి౦దిస్థాయి ను౦చి పై స్థాయికి వెడతాయనీ గుర్తించారు. ఫ్రెంచి భాషలో త౦డ్రిని “papaa” అని ఆరోహణ౦లో పలికితే, జెర్మన్ భాషలో “paapa” అని అవరోహణ౦లో పలుకుతారట.  జెర్మన్, ఫ్రెంచి బిడ్డలు మొదటి ఐదు రోజులలో చేసిన రోదనల ధ్వని తర౦గాలు sound tracks ని ప్రయోగాత్మక౦గా విశ్లేషణ చేశారు. పాప ఏడ్చినప్పుడు మధ్యలో గాలి పీల్చుకోవటానికి ఇచ్చే కొన్ని క్షణాల విరామానికి ముందు ఏడుపు హెచ్చు స్థాయిలో ఉన్నదా లేక తక్కువస్థాయిలో ఉన్నదా అని పరిశీలించారు. ఆకలి వలన, అసౌకర్య౦ వలన, వ౦టరితనం వలన పసికూనలు చేసే రోదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని విశ్లేషి౦చారు. జెర్మన్ బిడ్డల రోదనం హెచ్చుస్థాయి ను౦చి తగ్గుస్థాయికి అవరోహణ క్రమంలో ఉండగా, ఫ్రెంచి బిడ్డల రోదనం దిగువస్థాయి ను౦చి పై స్థాయికి ఆరోహణ క్రమంలో ఉన్నట్టు తేలింది.వావ్హ్అని ఏడ్చే బిడ్డకీ హ్వోయీ…” అని ఏడ్చే బిడ్డకీ మాతృభాషలు వేర్వేరుగా ఉండటాన్ని ఈ విధ౦గా గమనించారు. పుడుతూనే “mam…mam” అని ఇ౦గ్లీషు బిడ్డ ఏడిస్తే, “అమ్అని తెలుగు బిడ్డ ఏడవటాన్ని మనం కూడా గమనించవచ్చు. ఏడుపుకు భాష ఉంది. అది మాతృభాషలో ఉంటుంది.
           జెర్మనీలోని ఉర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చె౦దిన శ్రీమతి Kathleen Wermke అనే మానవీయ శాస్త్రవేత్త ఈ పరిశోధనలకు నాయకత్వ౦ వహి౦చారు. తల్లి గర్భంలో ఉండగా తాను నేర్చుకున్న భాషలోనే కొత్త పాపాయి మాట్లాడుతుందనేది ఈ పరిశోధనల సారాంశం. ఎలా మాట్లాడుతుంది? తన ధ్వనులతో మాట్లాడుతుంది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ మనం మన ధ్వనులను నేర్పి౦చటం ప్రార౦భిస్తా౦. భాషలొ మెళకువలన్నీ తెలియ పరుస్తా౦. కానీ, మనం నేర్పి౦చటం మొదలు పెట్టకుండానే, ఇ౦కా పుట్టకుండానే, అమ్మ కడుపులోనే ఈ నేర్చుకోవటాలన్నీ స్వయ౦గా మొదలు పెడుతుతున్నాడు బిడ్డ.  దీన్ని మనో విశ్లేషణ శాస్త్ర పరిభాషలో  “pre-adaptation for learning language” అంటారు. మాతృభాష ప్రభావ౦తో బిడ్డ మనసు రూపొంది, మాతృభాషలోనే అది పరిణతి పొందుతుంది. మాతృభాషకు అతీత౦గా బిడ్డను పె౦చాలని చూస్తే అది మానసిక దౌర్బల్యాన్ని కలిగిస్తు౦దని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అమ్మ కడుపులో నేర్చిన భాషలోనే బడిలోకి వచ్చాక నేర్చుకొ౦టున్న భాషని అనువది౦చి అర్థ౦ చేసుకొనే ప్రయత్నం చేస్తారు. ప్రాథమిక పాఠశాలలలో అమ్మభాషని నిషేధిస్తే, భాషాపరమైన అవ్యవస్థ (language disorder) ఏర్పడుతుందని ఈ పరిశోధనకు నాయకత్వ౦ వహి౦చిన కథ్లీన్ వెర్క్ శాస్త్రవేత్త చాలా స్పష్ట౦గా పేర్కొన్నాడు.
            “నిఃశ్వాసోఛ్చ్వాస సంక్షోభస్వప్నాశాన్ గర్భో~ధిగఛ్చతి/మాతుర్నిశ్వసితోచ్వాస సంక్షోభ స్వప్న సంభవాన్అనే సుశ్రుతుని ఆయుర్వేద సిద్ధాంతాన్ని ఇక్కడ పరిశీలించాలి.  తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు పైన తల్లి ఉచ్చ్వాస, నిఃశ్వాసాలు, తల్లి మనోభావాలు ప్రభావ౦ చూపుతాయి. అలాగేబిడ్డ మనో భావాలు కూడా తల్లి పైన ప్రసరించటం వలనే గర్భవతులకు వేవిళ్ళు కలుగుతాయని ఈ సిద్ధాంత౦ చెప్తో౦ది. నాలుగవ నెల వచ్చేసరికే గర్భస్థ శిశువులో హృదయమూ, మనో వృత్తులు ఏర్పడటం మొదలౌతాయి.  కాబట్టి, నాలుగవనెల గర్భవతిని దౌహృదినిఅంటారు. తనదొకటీ-తన కడుపులో బిడ్డదొకటీ రెండు హృదయాలు కలిగినది దౌహృదిని! హృదయమూ, మనో వృత్తులూ, సుఖదుఃఖ భావనలన్నీ బిడ్డకు కలగటంలో మాతృభాష నిర్వహిస్తున్నపాత్ర ఎ౦తయినా ఉందని దీన్ని బట్టి అర్థం అవుతో౦ది.
మన శబ్దాలు, మావిపొరలమధ్య ఉమ్మనీటిలో పెరుగుతున్నశిశువులకు యథాతథంగా వినిపించవు. నీటిలో చేపలు వాటి శరీరాంగాలను౦చి, ఎముకలను౦చీ మెదడుకు చేరిన ధ్వని తర౦గాలను గ్రహి౦చినట్టు, బిడ్డ ఉమ్మనీటి లో౦చి తల్లి భాషను స్వీకరించటం ప్రార౦భిస్తాడని లీప్ జీగ్ కు చె౦దిన Max Planck Institute for Human Cognitive and Brain Sciences ప్రొఫెసర్ Angela D. Friederici  వెల్లడి౦చారు. అందుకే, వివిధ భాషలు వినిపించే గ౦దరగోళ వాతావరణ౦లో నెలలు నిండిన తల్లులు తిరగకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అర్జునుడు పద్మవ్యూహం గురించి కడుపులో బిడ్డకు చెప్పిన కథలో అసాధ్యంలేదన్నది వాస్తవ౦.  నెలలు నిండుతున్న తల్లులు మన టీవీ యా౦కర్ల సంకరభాష అదేపనిగా వింటే, దాని చెడు ప్రభావ౦ పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపైన తప్పకుండా పడుతుందన్నమాట! గర్భస్థ శిశువులు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మెదడు ధ్వని తర౦గాలను స్వీకరించ గలుగుతుందని కూడా ఈ ప్రొఫెసర్ గారి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
          మాతృభాషల మీద కార్పోరేట్ విద్యారంగం తీవ్రమైన అఘాయిత్యాలు జరుపుతున్న రోజుల్లో, 2009 నవ౦బర్ 5న కరె౦ట్ బయాలజీ అనే వైద్యపత్రికలో ఈ సైకో లింగ్విస్టిక్స్అంశంమీద తొలి పరిశోధన వెలువడి౦ది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 2009 మే, 16ప్రపంచంలోని అన్ని దేశాల, ప్రా౦తాల, ప్రజలు మాట్లాడుకొనే భాషలను సంరక్షి౦చే కార్యక్రమాలు చేపట్టాలని (A/RES/61/266) తీర్మానం చేసిన నేపధ్య౦లో ఈ పరిశోధనా౦శాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.  
భాషాసంస్కృతులకు జాతులు పునర౦కిత౦ కావాలని యునెస్కో సంస్థ 2010 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ౦ సందర్భంగా పిలుపునిచ్చి౦ది. అందుకు అనుగుణ౦గా మన విద్యావ్యవస్థ గానీ, మన ప్రభుత్వ య౦త్రాంగం గానీ గట్టిగా స్పంది౦చిన సందర్భాలు లేవనే చెప్పాలి. ప్రాధమిక విద్య వరకూనైనా తెలుగు చదివిస్తే తెలుగు పిల్లలకు గ్రహణ శక్తి బాగా పెరుగుతుంది. కానీ, ఎల్ కేజీ పిల్లలు కూడా  తెలుగే మాట్లాడ కూడదనే వెర్రి నిబంధనని  కార్పోరేట్ విద్యాసంస్థలు సృష్టిస్తే, “పులిని చూసి వాతఅన్నట్టు మధ్య తరగతి విద్యాలయాలూ ఈ వెర్రిని సొమ్ము చేసుకొవాలని ప్రయత్నించాయి. గత రె౦డు దశాబ్దాలుగా ఈ ధోరణి కొనసాగుతూ వస్తో౦ది. అందువలన తెలుగు రావటంఅనే తప్పు తమ విషయ౦లొ జరిగి పోయి౦దనే ఒక అపరాథ భావన పిల్లల్లో కలిగిఅది మనోదౌర్బల్యానికి దారితీస్తో౦ది. తెలుగు రాని తెలుగుబిడ్డ తెలుగు వచ్చినవాడితో పోలిస్తే, మానసిక౦గా బలహీనుడే అవుతాడు.
 “మాకు తెలుగు రాదండీఅని  గొప్ప చెప్పుకోవటం విద్యారంగం సృష్టి౦చిన వెర్రి ప్రభావమే!  పిల్లల కోసం తల్లిద౦డ్రులు కూడా విదేశీ భార్యా భార్తల్లా ఇ౦ట్లో ఇ౦గ్లీషులో మాట్లాడుకోవాలసిన దుస్థితిని కావాలని విద్యా వ్యవస్థ తెచ్చిపెట్టి౦ది. ఏవో కొన్ని పడిగట్టు పదాలే తప్ప, మనసు విప్పి మాట్లాడు కునేందుకు మనకు పరాయి భాషలో నేర్చిన మాటలు చాలవు. మాతృభాషను దెబ్బతీస్తే ఏ దేశంలో నయినా ఇలానే జరుగుతుంది. మనో దౌర్బల్యం పెరిగి, బలహీనమైన తరాలు తయారవుతాయి.
మాతృభాషలోనే పెరగటం అనేది పిల్లల హక్కుగా చట్టం తీసుకు రావలసిన సమయం ఇది.  జాతి సిగ్గు పడాల్సిన మైదుకూరు, విశాఖ, విజయవాడ లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ మన రాష్ట్ర౦లో జరగకుండా ఉండాలంటే, ప్రాధమిక విద్యలో మాతృభాషని తప్పని సరి చేయటం ఒక్కటే పరిష్కార మార్గ౦. మన పిల్లలకు రేపు ఇ౦గ్లీషు బాగా రావటం కోసమే ఇవ్వాళ తెలుగు నేర్పి౦చాలని మనం గుర్తించాలి.
ఆ౦గ్లాన్ని కాదు, ఆ౦గ్ల౦ మాత్రమే ఉండాలనే ఇ౦గ్లీషు మానస పుత్రుల మాతృ ద్రోహాన్నే ఇక్కడ ప్రశ్నిస్తున్నది! అవును! ఆ౦గ్ల౦ మాత్రమే ఉండాలనే విధానాన్ని మాతృభాషా ద్రోహమూ, మాతృద్రోహమూ గా పరిగణి౦చి తీరాలి!

పద్యంలో కరకరలు :: డా. జి వి పూర్ణచందు.

విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో  పద్యానుభవం పేరుతో  ధారావాహికగా వ్రాస్తున్నాను. 

ఈ వారం వచ్చిన పద్యం ఇది.


పద్యంలో కరకరలు
డా. జి వి పూర్ణచందు.
“నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి వెలసె, కరిభి ద్గిరిభి
త్కరి కరిభి, ద్గిరి గిరిభిత్
త్కరి భిద్గిరి భిత్తురంగ కమనీయంబై”
మన సినిమాల్లో హీరోలు రెండు మూడు దెబ్బలు తిన్నాక కిందపడి పెదవి చిట్లి ఆ నెత్తురు చూసుకున్నాక అప్పుడు పౌరుషం తన్ను కొచ్చి ఎగిరెగిరి తన్నినట్టు చూపిస్తారు. కవి వీరులు అలా చెయ్యరు. ఎవరి ఆయుధాలు వాళ్లకుంటాయి. తెనాలి రామలింగ కవికి పదాలే ఆయుధాలు. అవతలివాడు కళ్ళుతిరిగి కిందపడి గిలగిలాడేలా వాటిని ప్రయోగించటమే ఆయనకు తెలిసిన విద్య. నోరున్నవాడిదే రాజ్యం అని నిరూపించిన కవి తెనాలిరామలింగడు.
వంటొచ్చిన మొనగాడు మాత్రమే వండగలిగిన కరకర వంటకం ఈ పద్యం. ఇందులో ఆయన కరినీ గిరినీ ఎంచుకున్నాడు రెండో అక్షరం “ర” ఉండేలాగా పదాలు పేర్చుకోవాలి. కృష్ణరాయలుతో పద్యం మొదలు పెట్టాలి. ‘ర’కారం రెండో అక్షరం కావాలంటే కృష్ణరాయలి బంధు మిత్రువుల పేరుచెప్పి వారికి బంధువైన కృష్ణరాయా.. అని రాయాలి. లేదా శత్రువా అని సంబోధించాలి. బాగా వెదికాడు. కృష్ణరాయలు తండ్రిపేరు నరసరాయలు. తమిళులకు తండ్రి పేరు ముందు చెప్పుకునే సాంప్రదాయం ఉంది. రామస్వామి వెంకటరామన్ అంటే రామస్వామిగారి కొడుకు వెంకటరామన్ అని! మన తెలుగురాజులు కూడా గౌతమీ పుత్ర శాతకర్ణి... ఇలా తండ్రుల పేర్లో తల్లుల పేర్లో ముందు చెప్పుకునే సాంప్రదాయాన్ని పాటించారు. తెనాలి రామలింగడు నరసింహ కృష్ణరాయా!” అంటూ ఈ పద్యాన్ని మొదలుపెట్టాడు. ఆయన చేతికి అరుదైన కీర్తి దక్కిందంటాడు.
ఇంక అక్కణ్ణించీ ఈ పద్యంలో కేవలం పదాల కరకరలే తప్ప భావాల ఘుమాయింపు లేవీ ఉండవు. తను వండదల్చిన లడ్డూ తినడానిక్కాదు, ఎదుటివాడి పళ్ళూడగొట్టటానికి కదా...!
వర్ణించేది కృష్ణరాయలి కీర్తిని! అది అరుదైంది. ఆ కీర్తి తెల్లగా ఉందని చెప్పాలి. అందుకని తెల్లని అరుదైన విషయాల్ని ఎంచుకున్నాడు.
కరిభిత్= గజాసురుణ్ణి చంపినవాడు శివుడు. ఆయన తెల్లగా ఉంటాడు.
గిరిభిత్కరి= పర్వతాల రెక్కల్ని తన వజ్రాయుధంతో నరికిన ఇంద్రుడి ఏనుగు ‘ఐరావతం’ తెల్లనిది.
కరిభిద్గిరి= గజాసురుణ్ణి చంపిన శివుడి కొండ ‘కైలాసం’. అది  తెల్లగా ఉంటుంది.
కరిభిద్గిరి భిత్తురంగ కమనీయం= ఇలా కరిభిత్తు, గిరిభిత్కరిభిత్తు అయినశివుడి తురంగం అంటే వాహనం నంది. అది తెల్లగా ఉంటుంది. అది కమనీయం. కమనీయమైనవి ఉత్సవ శోభని కలిగి తెల్లగా ఉంటాయి.
కృష్ణరాయల కీర్తిని అరుదైన తెల్లని విశేషాలతో పోల్చి అంతటిది అని చెప్పటమే కవి ఆశించిన ప్రయోజనం.
ఆపాత మధురం అంటే వినంగానే గొప్పగా ఉందని అనిపించటం! వినంగానే బావుందని పిస్తుందిగానీ, బాగా వినగా వినగా అందులో గొప్పగా లేనివి చాలా కనిపిస్తున్నాయనే వ్యంగ్యం కూడా ఇందులో ఉంది. ఈ పద్యం కూడా ఆపాతమధురం. ఆపాతం అంటే, అప్పటికప్పుడు ముంచుకొచ్చినట్టు వెల్లువలా రావటం. అది మధురంగా ఉన్నదని పించటం. పకోడీలు కరకరమంటూ ఆపాతమధురంగా ఉంటాయి. ఆ తరువాత కదా వాటి అసలు సంగతి తెలిసేది! కరిభిత్, గిరిభిత్కరి గురించి తెలిశాక తెల్లబోవటమే మనవంతు అవుతుంది!ప్రేమస్వాతంత్ర్యం :: డా. జి వి పూర్ణచందు

ప్రేమస్వాతంత్ర్యం
డా. జి వి పూర్ణచందు
ప్రేమ స్వాతంత్ర్య సంఘం (ఫ్రీ లవ్ సొసైటీఅనే సంస్థ ఒకటి స్వాతంత్ర్యోద్యమం తొలినాళ్లలో బాగా విస్తృతంగా పనిచేసేదిచలంగారు బెజవాడలో ఉన్న రోజుల్లో అలాంటి సంస్థ ఒకటి ఇక్కడ పనిచేసేదని చెప్తారు.
పెళ్ళిళ్ళుకడుపులువ్యభిచారాల్లాంటి జంజాటాలకు అతీతమైన ప్రేమని  సంస్థ ప్రబోధించేదిఅదొక ప్రేమ ప్రపంచంవ్యక్తిగతమైన స్త్రీపురుష బంధాల్ని కట్టుబాట్ల చట్రంలో బిగించటాన్ని  ఉద్యమం వ్యతిరేకిస్తుంది. పరిణతి పొందిన స్త్రీ పురుషుల మధ్య భావోద్వేగాల పరమైన సంబంధాల్నిలైంగిక పరమైన సంబంధాల్ని గౌరవనీయమైనవి గానే  సంస్థ పరిగణిస్తుందిచర్చి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇంగ్లండు కార్యస్థానంగా ప్రారంభమైన ఉద్యమం ఇదిప్రపంచ వ్యాప్తంగా ఇతర మత దేశాలకూ ఇది విస్తరించింది.
ప్రేమించవలసిందిగా వేధించే యాసిడ్ ప్రేమికుడికి,సెక్సు కోసం భార్యని వేధించే భర్తకీ మధ్య మనస్తత్వ పరంగా ఎలాంటి తేడా లేదనీవివాహవ్యవస్థ అనేది రేప్ చేసే హక్కులిచ్చేది కాదని ఫ్రీ లవ్ ఉద్యమం’ వాదిస్తుందిప్రేమలేని పెళ్ళిళ్ళు రేప్ చేయటం కన్నా ప్రమాదకరమైనవే!
స్త్రీలకు ‘ప్రేమస్వాతంత్ర్యం ఉండాలనే లక్ష్యంతో పందొమ్మిదో శాబ్దిలో ఫ్రీ లవ్ఉద్యమం బాగా ఊపులోకొచ్చింది. ‘ భూమ్మీద సమస్త సుఖోపభోగాలూ అనుభవించటానికి పెళ్ళి ప్రధాన ఉపకరణం అనీ అస్థిర ప్రపంచంలో సుస్థిర మైంది వివాహబంధం ఒక్కటేననీ’ భావించటం వలన వివాహవ్యవస్థలో స్త్రీబానిసత్వం పెరిగి పోతోందనే భావన అందరిలోనూ కలిగింది. ఆ సమయానికి తెలుగు నేలమీద రాజా రామ్మోహనరాయి, రఘుపతి వేంకటరత్నం నాయుడు, కందుకూరు వీరేశలింగం ప్రభృతుల ప్రభావం ఎక్కువగా ఉంది. విధవా పునర్వివాహం, దేవదాసీ వృత్తి నిర్మూలన, స్త్రీ స్వేఛ్ఛ లాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. భావ ప్రకటనా స్వేఛ్ఛ కోసం మహిళలు, పురుష సంస్కర్తలూ పోరాటం సాగించారు. స్వాతంత్రోద్యమం కూడా తోడు కావటంతో మహిళలు స్వేఛ్ఛగా బయటకొచ్చి ఉద్యమ బాట పట్టటం కూడా స్త్రీ ఉద్యమానికి తోడయ్యింది.  ఆ విధంగా ‘ప్రేమ స్వాతంత్ర్యోద్య’మాన్ని తెలుగు వారు త్వరగానే అందుకో గలిగారు.  
18వ శతాబ్దిలో మహిళా ఉద్యమం (ఫెమినిజం), 19వ శతాబ్దిలో ప్రేమ స్వాతంత్ర్యోద్యమం మొదలయ్యాయి. పెళ్ళి అనేది మహిళా నిర్మూలనా(annihilation of woman)కార్యక్రమంగా మారిపోతోందని ఈ ఉద్యమం హెచ్చరించింది. తన కిష్టమైన వ్యక్తిని పెళ్ళాడే హక్కు, తన ఇష్టంతోనే భర్తైనా సరే సెక్సుని పొందే హక్కు, తనకు పిల్లలు కావాలో వద్దో నిర్ణయించుకునే హక్కు, ఇలాంటివి ఉన్నప్పుడే పెళ్ళి అనేది సౌఖ్యదాయకం అవుతుంది. కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం, పురుషుడు ఆమెని దానం స్వీకరించటం, స్త్రీని పురుషుడికి చట్టబద్ధంగా అప్పగించటాల వలన మాత్రమే వివాహ వ్యవస్థ పవిత్రమైందనటం సరికాదు. స్త్రీ పురుషు లిద్దరికీ స్వాతంత్ర్యం కావాలి. ఇష్టం అయిన వ్యక్తిని ప్రేమించటం, తను ప్రేమించే, తనను ప్రేమించే వ్యక్తితో కలిసి జీవించటం ప్రాథమిక హక్కు కావాలని ఈ ప్రేమ స్వాతంత్ర్యోద్యమం కోరింది.
కానీ, కాలక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం స్త్రీల చేతుల్లోంచి పురుషుల చేతుల్లోకి మారిపోయింది.  చివరికి అది గే-సెక్స్(స్వలింగ సంపర్కం)  మరియూ Gay rights కోసం పోరాడే ఉద్యమంగా మారిపోయింది.
కాల వైపరీత్యమే అనండి, లేక తప్పనిసరి పరిణామమే అనండి... వివాహ వ్యవస్థ విడాకుల వ్యవస్థగా మారింది. నచ్చిన వాడితో కలిసి జీవించటానికి సహజీవనం అనే ముద్దు పేరు స్థిరపడింది. దీన్ని domestic partnership అంటున్నారిప్పుడు. ఇంట్లోజరిగితే శృంగారం, బయట జరిగితే వ్యభిచారం అనే ధోరణి ప్రబలింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ప్రతి జంటా తమది సహజీవనం అంటే చట్టం కూడా నోరెళ్ళ బెట్టే రోజులు ముందున్నాయి.మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రేమ ఒక నిషిద్ధ పదార్ధంగా మారిపోయేంతగా ఇలా వెర్రి పోకడలు పోతోంది. ఆ దుష్ట ఫలాలు మనకూ బాగానే పండుతున్నాయి.
 ప్రేమ పెళ్ళిళ్ళు గానీ, పెద్దలు చేసిన పెళ్ళిళ్లు గానీ, చాలావరకూ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోవటానికి కారణాల గురించి ఆలోచించక  పోతే మేథావులు పెద్ద తప్పు చేసిన వారౌతారు. ముఖ్యంగా పెళ్ళికి సిద్ధంగా ఉన్న జంట తమను తాము మూల్యాంకనం చేసుకుని తమలో ఉన్న ప్రేమ గుణాలకు మార్కులు వేసుకోవాలి. కనీసం యాబై మార్కులు దాటిన వాళ్ళు తమ ప్రేమ గుణాలను పెంచుకుని అప్పుడు ప్రేమకు, ఆ తరువాత పెళ్ళికీ తలపడాలి. దంపతులు కాగోరేవారికి ఈ విషయాన్ని తప్పకుండా తెలియ జెప్పాలి.
నేటి కాలపు ప్రేమ ముసుగులో భావోద్వేగ పరమైన అవసరాలు (emotional needs) ఆవహించినప్పుడు అది ప్రేమ పరిథి దాటిపోతుంది. కేవలం అవసరం గడుపుకోవటంగా మారిపోతుంది. అవసరం లేదనిపించిన రోజు ప్రేమకు తాత్కాలికంగా తెరపడ్తుం దన్నమాట! పైన చెప్పుకున్న Emotional needs అనేవి ప్రేమకు ప్రాతిపదిక లైనప్పుడు మగాడు తన అవసరం తీర్చవలసిన బాధ్యత  తనను ప్రేమించే వ్యక్తిదే ననే భావన బలపడుతుంది. “నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టైతే నన్ను ఆపకు... నేను చెప్పినట్టు చెయ్యి... నా చెప్పుకింద తేలులా పడి ఉండు...” అనే మాటలు మొదలౌతాయి. చివరికి ‘ప్రేమ స్వాతంత్ర్యం’ అనేది ప్రేమ బానిసత్వం అవుతుంది.
మానసిక శాస్త్రవేత్తలు దీన్ని, ఆధునిక సమాజపు పోకడలలో ఒక రుగ్మతగా భావిస్తారు. ఇందుకు తెలుగు నేల మినహాయింపు కాకపోవటమే ఆందోళన చెందాల్సిన విషయం. భావోద్వేగాల సమతుల్యత (emotional equilibrium) ఉన్నప్పుడే ప్రేమ బలంగా, స్థిరంగా ఉంటుంది. ‘ఇది కావాలి’ అనే కోరిక బలంగా ఉన్నప్పుడు ‘ఇది ఇవ్వాలనే’ కోరిక కూడా అంతే బలంగా అవతలి వ్యక్తిలో కూడా ఉన్నప్పుడే సమతుల్యత నిలబడుతుంది. లేకపోతే ఏకపక్షంగా మారిపోయి చివరికి ‘ప్రేమబానిసత్వా’నికి లొంగి పోవటమో, విడాకులకు సిద్ధపడటమో జరుగుతుంది. ‘నా అవసరం ఒక్కటి కూడా తీరలేదు అనే అసంతృప్తి ఇద్దరిలో ఎవరికి వున్నా అందులో దాంపత్య శోభ కనిపించదు. ప్రేమికులం అని ఘనంగా చెప్పుకునేవారు ఈ సమతుల్యత గురించి ఆలోచించక పోతే దాంపత్యాలు మురిగి పోతాయి.
 “ప్రేమ ఋజుమార్గాన (positively motivated) ఉన్నప్పుడు, love అనేది మిమ్మల్ని lovable చేస్తుంది” అంటుంది మానస శాస్త్రం. అనేక నెలలుగా ప్రేమించుకుని, పెద్దల్ని ఎదిరించి పోరాడి పెళ్ళి చేసుకుని మూడో నెలకే విడాకులో, పెటాకులో తప్పని పరిస్థితి ఎక్కువమందిలో వస్తున్నదంటే నిజమైన ప్రేమ విలువ తెలిసే స్థాయిలో వాళ్ల ప్రేమ సాగలేదనే అర్థం.
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ నిజమైన ప్రేమ కాదనే భావిస్తారు. ప్రేమించే తత్వం ఉన్నవారు పిపీలకాది పర్యంతం సమస్తాన్ని ప్రేమించే గుణం కలిగి ఉండాలి. కేవలం ఫలానా అమ్మాయినో లేక ఫలానా అబ్బాయినో మాత్రమే ప్రేమించేట్టుగా ఉండరు. ప్రేమించే గుణం ఎంత ఉందనేది ప్రేమించటానికి అర్హతని నిర్ణయించే ఒక కొలబద్ద. ఎవరికి వారే ఆ కొలబద్దగా తమను తాము విశ్లేషణ చేసుకోవటం మొదట జరగాలి. అదే జరిగితే విడాకులదాకా వెళ్ళిన వాళ్ళు కూడా కలిసి పడగ్గదికి వెళ్ళగలుగుతారు.