Sunday, 8 June 2014

ఓ విచారఫలం కథ :: డా. జి వి పూర్ణచందు

ఓ విచారఫలం కథ
డా. జి వి పూర్ణచందు

చింతపండుని విచారఫలం అని ఒక కవి చమత్కరించాడు. మనకి ఈ చింత ఎక్కడిది...?
ప్రపంచం అంతా దీన్ని టామరిండ్ అని పిలుస్తారు. టామర్ ఎ హింద్అంటే, భారతదేశపు పుల్ల ఖర్జూరం అని! ఉత్తర భారత దేశంలో ఇమ్లీ, అమ్లీ పేర్లు ఎక్కువగా ప్రసిధ్ధి. సంస్కృతంలో చించాఫలం లేక తింత్రిణీ అంటారు. వివిధ ద్రావిడ భాషల్లో చింత, చింతం, ఇంతం, సింత, హిత్త, ఇత్త, ఈత లాంటి పేర్లున్నాయని డిఇడిఆర్2529” చెప్తోంది. ద్రవిడియన్ ఎటిమాలజీ అనే మరో నిఘంటువు మూల దక్షిణ ద్రావిడ భాషలో సింత్”, అలాగే మూల తెలుగు భాషలో చింత్తెలుగు వ్యావహారికంలో చింతపదాలు ఏర్పడ్డాయని పేర్కొ౦ది. గోండీ భాషలో సిత్-అ, సిత్త, హిత్త, ఈత లాంటి పదాలు ఏర్పడ్డాయి. దీన్నిబట్టి, ఇంగ్లీషులో టామరిండ్, తెలుగులో చింత ఈ రె౦డు పేర్లకు ఈత” Indian date-palm tree అనే పేరు మూలం అని భావి౦చవచ్చు.
16వ శతాబ్ది తరువాతే అమెరికన్ ఖండానికి చింత చెట్టు తెలిసింది. ఇప్పుడక్కడ అది విస్తారంగా పండుతోంది. మెక్సికోలో దీన్ని పల్పరిండో అంటారు. ఆహార పదార్థాలలోకన్నా ఔషధ తయారీ ప్రరిశ్రమలలో దీని వాడకం ఎక్కువ.
చింతచిగురు, చింతపూలు, చింతపండు ఈ మూడింటికీ నొప్పులనూ, వాపులనూ తగ్గి౦చే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్ర౦ పేర్కొ౦ది. బెణికిన చోట చింతపండు పట్టు వేయట౦ మనకు తెలుసు. నొప్పి, వాపులను తగ్గి౦చే ఆయింట్మె౦ట్ల తయారీలో వీటిని ఇప్పుడు విస్తారంగా వాడుతున్నారు.
గోంగూర పచ్చడి, పెసర పప్పు, చింతపండు పులుసు...ఇవి తెలుగు వారి ఇష్ట దైవాలు. ఈ మూడింటికీ ఆఫ్రికా ఖండమే మూలం. ఆఫ్రికన్లకూ మనకూ సమానంగా దొరికే ఇలాంటి ఆహార ద్రవ్యాలు వండే తీరులో కూడా వారికీ మనకీ పోలిక ఉంది..
చింతచిగురు చవకగా దొరుకుతుంది. చింతపండుకు బదులుగా చింత చిగురు వాడకం ఆరోగ్య దాయకం. శరీరానికి ఇనుము వంటబట్టేలా చేయటానికీ, రక్తధాతు వృద్ధికీ, కాలేయాన్ని శక్తిమంతం చేయటానికీ చింతచిగురును మించిన ఔషధం లేదు.
చిన్నకుండ లేదా ముంతలో రె౦డు గ్లాసుల నీళ్ళు పోసి, అందులో చింత చిగురు ఎండించి దంచిన పొడిని ఒక చె౦చాడు కలిపి, తుప్పు పట్టని కొత్త ఇనుప మేకు అందులో వేసి నీళ్ళు సగం మరిగేంతవరకూ కాచి, వడగట్టి తాగితే రక్తహీనత, లివర్ వ్యాధులూ, కామెర్లూ త్వరగా తగ్గుతాయి. ఎదిగే పిల్లలకు, యుక్తవయసు ఆడపిల్లలకు, మెనోపాజ్ వచ్చిన స్త్రీలకూ, వృధ్ధులకూ ఇది గొప్ప ఔషధం. మేకును జాగ్రత్త చేసుకొని రోజూ ఈ చింతచిగురు టీతాగవచ్చు. ఫిల్లిప్పైన్స్ లో దీన్ని మలేరియా జ్వరం తగ్గటానికి తాగిస్తారు. ఈజిప్ట్ లో చల్లని వేసవి పానీయంగా తాగుతారు. పోషక విలువలను లెక్కించి చూస్తే, చింతపండు, చింతకాయలకన్నా చింత చిగురు ఎక్కువ ప్రయోజనకారి. చింతపండులో ప్రొటీన్లు 3.10 గ్రాములుంటే, చింతచిగురులో 5.8 గ్రాములు ఉన్నాయి. అపకారం చేసే తార్తారిక్ యాసిడ్ చింతపండులో ఉన్న౦తగా చింతచిగురులో ఉండదు.
గ్లూకోజు, ఫ్రక్టోజు లాంటి పంచదార పదార్థాలు చింతపండులో 30-40%ఉన్నాయి. రకరకాల పళ్ళు షుగర్ వ్యాధిని ఎలా పెంచుతాయో చింతపండుకూడా అలానే పెంచుతుంది.రక్త౦లొ కొలెస్ట్రాల్ మీద చింతపండు ప్రభావం గురించి 2౦౦5లో కెనడా విశ్వ విద్యాలయం పరిశోధకులు పరిశీలన చేసి, పరిమితంగా తినే వారిలో 2% కొలెస్ట్రాల్ తగ్గగా, అతిగా తినే వారిలో 8% పెరిగిందని కనుగొన్నారు. అంటే, చింతపండు ఒక ఔషధం లాంటిదనీ, దాన్ని పరిమితంగా తీసుకోవాలనీ అర్ధం. అల్సర్లు, కీళ్ళవాతం, ఎలెర్జీ వ్యాధుల్లో కూడా చింతపండు అపకారమే చేస్తుంది.
వామన కాయలుఅంటే, లేత చింతకాయలు పైత్యం చేస్తాయి. వాత, కఫ వ్యాధుల్ని ఉబ్బసాన్నీ పెంచుతాయి.అన్నమయ్య ఒక కీర్తనలో చింతకాయ కజ్జ౦అనే పదం ప్రయోగించాడు. తీపిబూందీని పూసకజ్జెంఅంటారు. ఈ కజ్జెం చింతపండుతో చేస్తే తినడానికి పనికిరాదు కదా... అలా వాడకానికి పనికిరానిదాన్ని చింతకాయకజ్జెం అన్నాడు అన్నమయ్య. చింతపువ్వ౦త, చింతాకంత అంటూ చిన్నవాటిని పోలుస్తుంటాం. చింతాకు ముడుగు తరి”, “చింతెలుగుఅనే పదాలకు చీకటి పడబోయేముందు సన్నని సందె వెలుగు అని అర్ధం.చింతకాయల్ని దంచి ఊరగాయ పెట్టేప్పుడు, గింజలు ఏరేస్తారు. వాటిని నీళ్ళలో వేసి మరిగిస్తే, చిక్కని పుల్లని చింతంబలి”, “చింతగంజిలేదా చింతసరితయారవుతుంది. తగినంత ఉప్పూ కారం తాలింపు పెట్టుకొని తాగితే రుచికరం, జీర్ణశక్తిని పెంచుతుంది.
పండిన చింతకాయ పెంకుని చింతగుల్లఅంటారు. చింతపండుని అంటుకొన్న ఈనెల్ని చింతనరాలులేక చింత ఉట్టిఅంటారు. చింతపండు లోపల గింజల్ని చింతపిక్కలంటారు. సీలింగ్ ఫ్యాను తగిలించటానికి పైన శ్లాబుకు గానీ దూలానికి గానీ తగిలించే కొక్కేన్ని చింతకాయ అంటారు. చింతకుండిఅంటే ఇనప ఊచ. ఆగ్రహ౦ ప్రదర్శి౦చాడు అనటానికి కళ్ళలో చింతనిప్పులు కురిపించాడంటాం. చింత కర్రని పొయ్యిలో పెడితే ఎర్రని నిప్పులు వస్తాయి. చాలా సేపు ఆ వేడి నిలబడి ఉంటుంది. ఆబూడిదను నీళ్ళలో కలిపి వడకట్టి ఆ నీటిని ఒకరాత్రంతా నిలవ బెడతారు. తెల్లవారేసరికి అడుగున తెల్లటి ముద్ద పేరుకుంటుంది. దాన్ని చించాక్షారంఅని పిలుస్తారు. ఇది పేగుపూతను, జీర్ణకోశ వ్యాధుల్నీ తగ్గి౦చట౦లో గొప్పఔషధంగా పనిచేస్తుంది.
ఇప్పటి పిల్లలకు చింతబరికెఅంటే తెలియదు. ఒకప్పుడు స్కూలు మాష్టర్ల దగ్గర చింతకొమ్మే బెత్త౦! అదే పాఠాలు చెప్పేది. కాబట్టి, నాణ్యమైన చదువులు వచ్చేవి.

చింతచెట్టుమీద బ్రహ్మరాక్షసి ఉంటుందనే నమ్మకం మనకే కాదు, ఆఫ్రికన్లకూ ఉన్నదట! అతిగా తింటే చింతపండే పెద్ద బ్రహ్మరాక్షసి.

సుఖ సంసారంలో చిచ్చు ‘స్ట్రెస్సు’ :: డా. జి వి పూర్ణచందు

సుఖ సంసారంలో చిచ్చు స్ట్రెస్సు
డా. జి వి పూర్ణచందు
లైంగిక సుఖాన్ని పొందాలనే కోరిక ఎంత బలంగా ఉంటే లైంగిక కార్యం అంత బలంగా జరుగుతుంది. జీవితంలో అన్ని విషయాలకూ వర్తించే వ్యక్తిత్వవికాస సూత్రాలన్నీ లైంగిక శక్తిని పెంచుకునేందుకూ వర్తిస్తాయి.
ఏకాగ్రత (సి = కాన్సన్ట్రేషన్), ఇష్టత ( = ఇంట్రెష్ట్), దీక్ష, పట్టుదల ( డి = డెడికేషన్), సి డీలు సక్రమంగా ఉంటే, పరీక్షల్లో డిష్టింక్షన్ సాధించ గలిగినట్టు, సెక్సు కార్యంలో కూడా స్త్రీ పురుషులు డిష్టింక్షన్ పొందటానికి ఈ సి. ఐ. డీ.ల అవసరం ఉంటుంది. నిజానికి సెక్సులో విజయం అనేది ఒక పరీక్షే! ఇందులో ఉత్తీర్ణత పొందితే, అన్నింటా జయమే!
ఎలాంటి ఆందోళనలూ లేకుండా అనుకూల భావావేశంతో (పోజిటివ్ యాటిట్యూడ్) మనసు నిండి ఉన్నప్పుడు సుఖ సంసారం సాధ్యమౌతుంది. చింతా శోక భయ దుఃఖాదులన్నీ లైంగిక శక్తిని చంపేస్తాయి. ఆత్మవిశ్వాసం కోల్పోతే, లైంగిక శక్తీ, ఆసక్తీ అంతరించి పోతాయి. ఆత్మవిశ్వాసంతో రతిక్రీడకు తలపడినప్పుడు జీవిత బాగస్వామితో అనేక రెట్లు సుఖానుభవాన్ని పంచుకోవచ్చు!    
వేలల్లో జీతాలు తీసుకునే చాలామంది స్త్రీ పురుషులు వృత్తి పరమైన మానసికవత్తిడికి (స్ట్రెస్స్) లోనవటం వలన నిజమైన లైంగిక సుఖానుభవానికి దూరం అయిపోతున్నారు. వాళ్ళలో వివాహ బంధాల విఛ్ఛిన్నతా శాతం ఎక్కువగా ఉంటోంది. ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిపోయి, ధనమదాంధతతో వాళ్ళు సంసారాలను నాశనం చేసుకుంటూ న్నారని అనుకోవటం పూర్తి వాస్తవం కాదు. దీర్ఘకాలం పాటు వృత్తిపరమైన, సామాజిక పరమైన, కుటుంబ పరమైన స్త్రెస్సు లో నిరంతరంగా జీవించటం వలన మనుషులు లైంగిక అసమర్ధతకు లోనౌతుంటారు. సంసారాలు విఛ్ఛిన్నం కావటానికి ఇది ప్రధాన కారణం. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చుగానీ, సెక్సు సమర్ధతని కొనలేరు కదా!    
నిజానికి లైంగిక కార్యం వలన మనసులోంచి వత్తిడి అనే దయ్యం పారిపోవాలి. ప్రియురాలి ఒడిలో ఒక్క క్షణం సేద తీరితే ఎంతవత్తిడి నుంచైనా బయట పడగలుగుతారు మనుషులు. కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. స్ట్రెస్సు లేని సమయాన్ని చూసుకుని సుఖంగా గడుపుదాం అనుకునేంతలో ఆఫీసునుండి సెల్లు పిలుపు వస్తుంది. అంతే! వెంటనే ల్యాప్టాప్ తెరిచి దానికి అంకితం కావతం ఎక్కువసార్లు జరిగిపోతుంది. తనను ఒడిలోకి తీసు కోవాల్సిన తన జీవిత భాగస్వామి ల్యాప్టాప్ని ఒడిలోకి తీసుకోవటాన్ని ఎవరికైనా భరించలేని విషయమే! అది మానసిక వత్తిడికి దారి తీస్తుంది. ఫలితంగా విసుగులూ, కోప తాపాలు, చీదరింపులూ, మూతి విరుపులూ సహజంగా పెరిగి పోయి భార్యా భర్తలు తమ విధ్యుక్త ధర్మాలను నెరవేర్చుకో గలిగే సమయం చిక్కక, సతమతమౌతూ ఉంటారు. చివరికి మనసు విప్పి మాట్లాడుకునే సావకాశం కూడా వారికి చిక్కదు.  సంసారాల్లో స్ట్రెస్స్ వలన సుఖజీవనం నాశనం అవుతోంది. క్రమేణా అది దాంపత్యాన్ని చీల్చే దాకా దారి తీస్తోంది.
ఇలాంటి పరిస్థితిని నివారించు కోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. దీన్ని సరి చేసుకోకుండా, లైంగిక శక్తిని పెంచే మందులను ఆశ్రయించటం వలన ధన మాన ప్రాణాల దోపిడీ తప్ప ఒరిగేదేమీ ఉండదు. చిట్కా చికిత్సలు మన ప్రయత్నానికి ఉడత సాయం చేస్తాయే గానీ, అవే ప్రధానం ఎంతమాత్రం కాదని గ్రహించాలి. మనో బలం లేనివాడి దగ్గర వజ్రాయుధం ఉంటే మాత్రం ఒరిగేదేం ఉంటుంది...? సెక్సు విషయంలో సూక్తి ముఖ్యంగా వర్తిస్తుంది.
మొదట మనసుని చక్కగా అలంకరించుకోవాలి. అందులో స్ట్రెస్సు లాంటి అడ్డుభావనలేవీ లేకుండా చూసుకోవాలి.
తరువాత శరీరాన్ని అలంకరించుకోవాలి. అందులో ఎలాంటి వికారాలూ కలగకుండా జాగ్రత్త పడాలి. ఉదాహరణకు మీ జీవిత భాగస్వామికి వెల్లుల్లి సరిపడదనుకోండి, మీ శరీరంలోంచి వెల్లుల్లి గవులు కంపు కొడుతుంటే అవతలి వ్యక్తి పూర్తిగా సెక్సు విముఖతకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది! తాగి ఇంటికి వచ్చి సారాకంపుకొట్టే మొగుడితో భార్య పొందేది లైంగిక సుఖం కాబోదు కదా! యాంత్రికంగా తాగుబోతుకు ఒళ్ళప్పగించి అయిందన్నాక అటు తిరిగి పడుకునే భార్యలే ఎక్కువ మంది ఉన్నారని ఒక సర్వే చెప్తోంది.
ఇద్దరికీ లైంగికోత్తేజ కరంగా ఉండేలా పడక గది అలంకారం ఉండాలి. అందులో మంచం కింద ఆరబోసిన ఉల్లిపాయలూ, మంచం పక్కన మురికి గుడ్డలూ, చుట్టూ వ్యాపించిన బూజు, ఎక్కడో ఎలిక చచ్చిన వాసన...ఇలాంటి పడక గదిలో జరిగేది కక్కుర్తి వ్యవహారమే గానీ, అది నిజమైన దాంపత్య సుఖ ప్రేరకం ఎంతమాత్రమూ కాదు.  
సెక్సనేది ఇచ్చి పుచ్చుకునే ఒక భావావేశం. అది, గది నాలుగు గోడలమధ్య ఇద్దరికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. గెలుపోటములు నిర్ణయించే అంపైర్లెవరూ ఉండని ఒక రహస్య క్రీడ. దానికి నియమ నిబంధనలేవీ ఉండవు. ఇద్దరి అంగీకారంతో జరిగే ఒక రాగుంజు పోగుంజులాట. ఇందులో చేయటం చేయబడటం అనే రెండు వ్యవహారాలు అసలే ఉండవు. ఆడది సుఖపెట్టేది, మగాడు సుఖపడేవాడు అనే అభిప్రాయం తప్పు. సుఖ సంతోషాలను ఇచ్చి పుచ్చుకునే సమస్థితి ఉన్నప్పుడే అది ఆరోగ్యదాయక మైన దాంపత్య సుఖానుభూతి నిస్తుంది.
ఏవి ఎలా ఉన్నా మనసు అనేది సెక్సు విజయాన్ని ప్రసాదించే గొప్ప ఔషధం. అది నిర్మలంగా ఉండాలి. అన్నింటికన్నా ముందు మనిషికి సెక్సు పరమైన నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేని వ్యక్తి సెక్సుకు తలపడినప్పుడు గిల్టీ కాన్షస్ అంటామే... . అపరాధ భావన... అది ఆ సమయంలో ప్రభావం చూపిస్తే ఆ వ్యక్తి సెక్సు పరమైన అపజయాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇవన్నీ స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా వర్తించే విషయాలే! మానసిక వత్తిడి (స్త్రెస్సు)ని తెచ్చే వాటిలో అపరాధ బావన కూడా ముఖ్యమైందే!  పవిత్రమైన దాంపత్య సుఖానికి స్ట్రెస్సు అనేది చిచ్చు పెట్టేదేనని గుర్తించాలి.