Wednesday 6 May 2020

కరోనా వ్యాధి నుండి కాపాడుకునే ఉపాయాలు "క్రిమి సంహారం

కరోనా వ్యాధి నుండి కాపాడుకునే ఉపాయాలు "క్రిమి సంహారం" 03 మే,2020 ఆదివారం సంచిక ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన
క్రిమి సంహారం వ్యాసం: డా. జి వి పూర్ణచందు,
రాజకోట భద్రంగా ఉంటే రాజ్యం సురక్షితంగా ఉంటుంది. దేహం కూడా అంతే! కోటలా శత్రుదుర్భేద్యంగా మారితే.. ఏ వైరస్సూ ఏమీ చేయలేదు. నిరంతరం సైనికుల్లా పహారా కాచే రోగనిరోధక వ్యవస్థ రోగాలను ఢీకొడుతుంది. వైరస్ను తుదముట్టిస్తుంది. అందుకే మన ప్రాచీన ఆయుర్వేదం 'రోగ బలం తగ్గాలంటే.. రోగి బలం పెరగాలి' అంటూ ఇమ్యూనిటి పెంచుకోమంటుంది. అందుకు మనం ఏం చేయాలి? ఎలాంటి తిండి తినాలి? ఎలాంటి ఔషధాలు వాడాలి? తెలుసుకుందాం...
శిష్యుడు: కుతో మూలం..?
(ఊరుమ్మడిగా ఒక వ్యాధి ప్రబలడానికి ఏది మూల కారణం?)
గురువు: తస్యమూల మధర్మః
(దానికి మూల కారణం అధర్మం)
రెండువేల ఏళ్ల కిందటి 'చరకసంహిత'లో గురుశిష్యుల మధ్య జరిగిన వైద్య సంభాషణ అది. ఆ మాటలకు నేటి కరోనాకు ఏమిటి సంబంధం? అనుకోవచ్చు. 'ప్రకృతిని సర్వనాశనం చేశాం. జీవవైవిధ్యాన్ని దెబ్బతీశాం. జంతుజాలం మనుగడకు ముప్పు తీసుకొచ్చాం. పంచభూతాలను కలుషితం చేశాం. సహజ ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. మనిషి తీరును భరించలేకే ప్రకృతి ప్రకోపించింది. కరోనా రూపంలో కళ్లు తెరవమని.. మనకీ శిక్ష వేసింది..' ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోందిప్పుడు. ఆ అధర్మం ప్రకృతికే కాదు.. మన దేహానికీ వర్తిస్తుంది.
సామాజిక అధర్మమే కరోనా లాంటి వ్యాధులు ప్రబలటానికి కారణం. మన నడవడినీ, ఆలోచనా విధానాన్ని, సమాజం పట్ల మనం అనుసరించే విధానాల్నీ మార్పు చేసుకోకపోతే, మనలో మార్పు రాకపోతే లాక్ డౌన్లు మనల్ని ఎక్కువకాలం కాపాడ లేవు
చరకుడు ఏమన్నారు?
వ్యక్తి తన దేహధర్మాన్ని నెరవేర్చకపోవడంవల్లే.. అనేక మహమ్మారులు వస్తున్నాయంటాడు చరకుడు. నేటి కరోనా వెనుక కూడా ఆ అధర్మ అవగుణాలన్నీ కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్యసూత్రాల పట్ల నిర్లక్ష్యం, ఆహార పానీయాల విషయంలో అపరిశుభ్రత వల్ల అధర్మం ప్రబలి.. జనపదులు భయంకరమైన వ్యాధులతో పీడించబడతారనేది చరకుడి భాష్యం. ఇలాంటి జబ్బులను 'జనపదోధ్వంసక' వ్యాధులు అన్నారాయన. వేల ఏళ్ల కిందటే నేటి మానవ విధ్వంసాన్ని ఊహించారు.
'నైవదేవా న గంధర్వ న పిశాచా న రాక్షసాః
న చాన్యే స్వయమక్లిష్టముపక్లిశ్నంతి మానవమ్'
సామాజిక ధర్మాన్ని పాటించే వ్యక్తులను దేవతలు కానీ, గంధర్వులు కానీ, పిశాచాలు కానీ, రాక్షసులు కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు. మానవ సహజ ధర్మాన్ని అంటే ఆరోగ్యసూత్రాల్ని సక్రమంగా పాటించని వ్యక్తి తన విధానాలకు తానే బాధ్యుడు. తానే బాధితుడు అవుతాడు. ఏ దేవతనో ఏ రాక్షసుడినో బాధ్యుణ్ణి చేయనవసరం లేదంటారు. నవ కరోనా వ్యాధి వ్యాప్తి చెందడానికి అసలు కారణాలను ఇలా ఈ సూత్రం ఎత్తి చూపుతోంది.
'ఆత్మానమేవ మన్యేత కర్తరం సుఖదుఃఖయోః
తస్మాచ్రేయస్కరం మార్గ ప్రతిపద్యేత నో త్రసేత్'
తమ సుఖదుఃఖాలకు ప్రతి ఒక్కరూ తమనే బాధ్యుల్ని చేసుకోవాలంటారు చరకుడు. సమాజ శ్రేయస్కర మార్గాన్ని అందరూ అనుసరించి తీరాలన్నారు. తెలిసే ఈ ధర్మాన్ని విస్మరిస్తున్నారు మనుషులు. తెలిసి చేసే తప్పుని 'ప్రజ్ఞాపరాధం' అని కూడా అన్నారు. మద్యం, పొగ తమకు తెలిసే తాగుతున్నారు. అది వాళ్ల స్వంత అధర్మం. ఒక వ్యక్తి పొగ తాగడం వల్ల.. ఇతరులకు చెడుసోకేలా చేస్తుండటం అతని సమాజ అధర్మం. ఇలా వ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే ప్రతిపనీ అధర్మమే! ప్రజ్ఞాపరాధమే. ప్రభుత్వాలు, ప్రజలకు వీటిపై అదుపు ఉండాలి. మానవ సహజత్వానికి వ్యతిరేకమైన అధర్మానికి ఎవరు పాల్పడినా.. అది ప్రపంచంలోని అందరికీ హానికరమే అవుతుంది. ఇప్పుడు జరిగింది అదే. చైనీయుల అధర్మ ఆహారపు అలవాట్ల వల్లే.. వుహాన్లో కరోనా పుట్టింది. అది ఆ దేశంతోనే సరిపెట్టుకోకుండా.. లోకమంతా వ్యాపించింది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఆచార వ్యవహారాలలో సమాజ హితం అవసరం. కరోనా నేర్పిన గుణపాఠమే అందుకు నిదర్శనం. ఔషధ చికిత్స లేని ఈ వ్యాధి మనకు సోకకుండా ఉండాలంటే.. మనం మన పట్ల, సమాజం పట్ల కూడా పవిత్రంగా ఉండాలన్నదే ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం కూడా. ఈ విలువల ఆరోగ్య సూత్రాలను భారతీయ ఆయుర్వేదం ఏళ్ల కిందటే చెప్పింది.
రోగి బలం పెరగాలి..
ప్రాచీన ఆయుర్వేదం 'రోగ బలం తగ్గాలంటే.. రోగి బలం పెరగాలి' అంటుంది. ఆ కోణం నుంచే వైద్యం చేస్తుంది. రోగిబలాన్నే ఆధునిక వైద్యం ఇమ్యూనిటి (రోగ నిరోధక శక్తి) అంటున్నది. అతి సూక్ష్మజీవుల వల్ల వచ్చే కరోనా, ఎబోలా, స్వైన్ఫ్లూ లాంటి వ్యాధుల్లోనే కాదు.. క్యాన్సరు, అలర్జీలు ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో కూడా రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. దాన్ని తిరిగి పుంజుకునేలా చేసి, ఆరోగ్యవంతుడి ఆరోగ్యాన్ని కాపాడటం, అనారోగ్యానికి ప్రశమనాన్ని కలిగించడమే ఆయుర్వేద లక్ష్యం. ఆ శాస్త్రం ప్రకారం - వ్యాధి క్షమత్వం (రోగి బలం) పెరిగితే 'వ్యాధి బల విరోధిత్వం' (రోగ బలం తగ్గించడం) సాధ్యం అవుతుంది. 'వ్యాధి ఉత్పాద ప్రతిబంధకత' (వ్యాధి ఏర్పడే కారణాలను నిలువరించడం) వల్లే అడ్డుకట్ట పడుతుంది.
శరీరం ఒక కంచుకోట. శత్రుదుర్భేద్యం. అందులోకి వైరస్ వంటి శత్రువులు ప్రవేశించిన వెంటనే వ్యాధి నిరోధక శక్తి దాడి చేస్తుంది. ఆ శక్తి బలహీనంగా ఉంటే శత్రువు చేతిలో దేహం ఓడిపోతుంది. అప్పుడు జబ్బులకు లొంగిపోతుంది. నేటి వైద్య పరిశోధనలు, ల్యాబ్లు, టెస్టులు లేని ఆ రోజుల్లోనే.. ఇదే విషయాన్ని చెప్పింది చరకసంహిత.
'దేహధాతు ప్రత్యానిక భూతాలు' అంటే - శరీర ధాతువులకు వ్యతిరేకమైన లక్షణాలు కలిగిన (మన భాషలో వైరస్లు) జీవులు శరీరంలోకి ప్రవేశిస్తే.. దేహధాతువులు వాటికి వ్యతిరేకంగా చేసే పోరాటం గురించి చరకుడు అనేక విలువైన వివరాలను అందించారు. అవి నేటికీ అంగీకారయోగ్యమే. ఆ దిశగా కూడా వైద్య ప్రపంచం ఆలోచించాల్సి వచ్చింది. దేహంలో జరిగే ఈ పోరాటంలో గెలుపు అనేది వ్యాధిక్షమత్వం (ఇమ్యూనిటి) మీద ఆధారపడి ఉంటుంది. జనపదోధ్వంసకంగా ఒక మహమ్మారి (పెండమిక్) ప్రబలినప్పుడు.. ప్రత్యేక ఔషధ చికిత్స అందుబాటులో లేనప్పుడు.. అటు ఆరోగ్యవంతుల్లోనూ, ఇటు అంటువ్యాధుల బాధితుల్లోనూ 'వ్యాధిక్షమత' పెరిగేలా చూడటమే శరణ్యం అని చరకసంహిత సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే తక్షణ కర్తవ్యంగా ప్రకటించింది. వైద్యులు కూడా మందులేని వైద్యానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గమని చెబుతున్నారు.
ఓజస్సు కీలకం.
.
ఒక రోగాన్ని ఆధునిక వైద్యం పరీక్షించే విధానానికీ, ఆయుర్వేదం చూసే తీరుకు కొంత వ్యత్యాసం ఉంటుంది. రసరక్తాది సప్తధాతువుల సారాన్ని 'ఓజస్సు' అంటుంది ఆయుర్వేదం. అది వ్యాధి క్షమత్వానికి సూచిక. శరీరాన్ని నడిపించే ధాతువులు, అవి ప్రసరించే మార్గాలు, జఠరాగ్ని.. ఈ మూడు సమస్థితిలో ఉంటే, ధాతువులు దోషాలుగా మారకుండా ఉంటాయి. వ్యాధి క్షమత్వం పెరుగుతుంది. ఇమ్యూనిటి అనేది రాత్రికి రాత్రే పెరిగేది కాదు.
వ్యాధి క్షమత్వాన్ని పెంచుకునేలా మన జీవన విధానంలో మార్పు రావాలి. హితకర (పోషక విలువలు కలిగిన) పదార్థాలు తినేవారికి, అహితకర (హానిచేసే) పదార్థాలు మానిన వారికి, నాలుకను అదుపులో పెట్టుకోగల వారికి వ్యాధి క్షమత్వం త్వరగా పెరుగుతుందని చరకసంహిత చెబుతోంది. 'అతి స్థూలురు (ఊబకాయం), కృశించిన వారు (బలహీనులు), రక్త, మాంస, అస్థి ధాతువులు సమస్థితిలో లేని వారు (అనవస్థితమాంసశోణిత అస్థీనీ), దుర్భలురు, అనారోగ్యకర (జంక్ఫుడ్) తిండి తినేవాళ్లు (అసాత్మ్య ఆహారసేవి), పోషకాహారం చాలినంత తీసుకోనివాళ్లు, జఠరాగ్ని చాలినంత లేనివాళ్లకు' ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది.
వీళ్లకు బలవర్థన ఔషధాలతోపాటు జఠరాగ్నిని పెంచే ఔషధాలు ఇవ్వాలని చెప్పింది చరకసంహిత. జీర్ణశక్తి బలం లేకపోతే ఎంత గొప్ప ఔషధం ఇచ్చినా వంట బట్టదు. అందుకని కరోనా హెల్త్ ఎమర్జెన్సీ నడిచినంత కాలం ప్రయత్నపూర్వకంగా అయినా సరే.. జీర్ణశక్తిని కాపాడుకోవాలనేది ఆయుర్వేద ప్రధాన సూత్రం.
షడ్రుచులు
షడ్రసోపేత భోజనం.. అంటుంటారు మన పెద్దలు. దాని వెనుక అద్భుత ఆరోగ్య రహస్యం దాగుంది. బ్యాలెన్స్డ్ డైట్ (సమతుల ఆహారం) అంటున్నామే అదే ఇది. మన జీవితం నవరసాలతో రసవత్తరంగా సాగాలంటే భోజనం షడ్రసాలతో రసమయంగా ఉండాలి. భోజనంలో తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు.. ఈ ఆరు రుచులు ప్రధానంగా ఉండాలి. తీపి, పులుపు, ఉప్పు, కారాలు బాగా తింటున్నాం కానీ.. వగరు, చేదు.. ఈ రెండు రుచులు కలిగిన ఆహార పదార్థాలను తక్కువగానే తింటున్నాం. వైరస్ వ్యాధులకు తీపి అనుకూలంగానూ, చేదు విరోధిగానూ పనిచేస్తుంది. అందుకని తీపి తక్కువగా, చేదు ఎక్కువగా తినాలి. ఆరు రుచులను ఆహార సంప్రదాయంగా కొనసాగించేందుకే మన పూర్వీకులు ఉగాదిపచ్చడి రూపొందించారు. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ప్రతి రోజూ ఉగాది పచ్చడి తింటే రానున్న వేసవికి శరీరం తట్టుకుంటుంది. వైరస్లు తీవ్రమైన కాలంలో కూడా ఈ ఉగాది పచ్చడి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
స్వర్ణప్రాశన
స్వచ్ఛమైన బంగారు రేకుని సాగకొడితే.. అది ఉల్లిపొరకన్నా పలుచగా సాగుతుంది. ఇలా సాగకొట్టిన అతి పలుచని బంగారు రేకు ముక్కలు అమ్ముతారు. అది ముట్టుకుంటే పొడుం అయ్యేంత పలుచగా ఉంటుంది. దీన్ని చాలా స్వల్పంగా తీసుకుని తేనె, నెయ్యి కలిపి చంటిబిడ్డలకు నాకించటాన్ని 'స్వర్ణప్రాశన' అంటారు. అన్నప్రాశనకు ముందు చంటి బిడ్డలకు ఈ స్వర్ణప్రాశన చేయించాలని, ఇది ఆరోగ్య రక్షణ కల్పింస్తుందని 'కాశ్యపసంహిత' అనే ఆయుర్వేద వైద్య గ్రంథం పేర్కొంది. అయితే నమ్మకమైన స్వర్ణపత్రం దొరికితేనే ఈ ప్రయత్నం చేయాలి. ఇమ్యూనిటి పెరగడానికి ఇదొక మార్గం.
స్వర్ణభస్మం
చెంగల్వకోష్టు, వసకొమ్ము పొడితో స్వర్ణభస్మాన్ని కలిపి తేనె, నెయ్యి చేర్చి.. పెద్దవాళ్లు సేవిస్తే.. వేగంగా ఇమ్యూనిటి పెరుగుతుందని 'సుశ్రుత సంహిత' చెబుతోంది. నాలుగు రకాల అనుపానాలతో ఈ స్వర్ణభస్మ ప్రయోగాన్ని పేర్కొన్నారు. వైరస్లు సోకిన వ్యక్తుల మీద బాగా పనిచేస్తుంది. ఏ ఔషధాన్ని అయినా స్వర్ణంతో కలిపి ఇస్తే.. అది అనేక రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది. స్వర్ణం తరువాత అంత శక్తివంతమైనది రజత భస్మం.
ఆచార రసాయనం
వైరస్వంటి అంటురోగాలు ప్రబలకుండా.. జీవనవిధానంలో మార్పు చేసుకోమంటుంది చరకసంహిత. అదే ఆచార రసాయనం. ఒక రకంగా ఇది మనోవైద్యం లాంటిది. సమాజం పట్ల అధర్మంగా వ్యవహరించకుండా జీవించాలంటాడు చరకుడు. శారీరకంగానే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం అన్నారు. 'చింత, శోకం, భయం, దుఃఖం' ఇవన్నీ వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే ప్రతికూల అంశాలు. వీటికి అతీతంగా మనం జీవించాలన్నది ఆయన ఆరోగ్య సూచన.
వేసవారం
ప్రాచీన ఆయుర్వేద గొప్పదనాన్ని స్వీయ అనుభవంతోనే తెలుసుకోవాలి. అలాంటి ఒక విశిష్ట ఔషధం 'వేసవారం'. కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయేవరకు.. ప్రతి ఒక్కరూ దీనిని తీసుకోవచ్చు.
ఏం చేయాలి? : ఒక స్పూను ఇంగువ, రెండు చెంచాలు (తడి తక్కువగా ఉండే) అల్లం ముద్ద, నాలుగు చెంచాల మిరియాల పొడి, ఎనిమిది చెంచాల జీలకర్ర, పదహారు చెంచాల పసుపుపొడి, ముప్పయి రెండు చెంచాల ధనియాలపొడి.. వీటికి సరిపడా ఉప్పు చేర్చి .. ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. పసుపు కొమ్ములను మరపట్టిన పసుపుపొడిని మాత్రమే వాడాలి. బయట దొరికే పసుపులో రంగు కలుపుతారు. ఈ వేసవారం పొడిని రకరకాలుగా వాడుకోవచ్చు. వంటల్లో కూరపొడిగా, సాంబారు పొడిగా, చారు పొడిగా, కారప్పొడిగా కలుపుకోవచ్చు. వంటలు కూడా ఎంతో రుచితో, సువాసనతో ఊరిస్తాయి. ఈ పొడిని మజ్జిగలో కూడా కలుపుకుని తాగవచ్చు.
విశేషం: వేసవారం పొడికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలో విషదోషాలను తరిమేస్తుంది. కఫం ఆగుతుంది. పేగులు, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉంటే తొలగుతాయి. తిరిగి మళ్లీ శక్తివంతం అవుతాయి.
అల్లం
అల్లం విశిష్టత ఈనాటిది కాదు. పూర్వం నుంచి మన ఆయుర్వేద పండితులు అల్లంలోని ఔషధగుణాలను చెబుతూనే వస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ఉపకరిస్తుంది. 'భోజనాగ్రే సదా పథ్యం లవణార్ద్రక భక్షణం పథ్యం' అంటే సైంధవ లవణం, అల్లం నూరి.. అందులోకి నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంది ఆయుర్వేదం. దీనివల్ల విషదోషాలు తొలగిపోతాయి. అన్నహితవు కలుగుతుంది. అజీర్తి తగ్గుతుంది. ఉసిరికాయ తొక్కుపచ్చడి (నల్లపచ్చడి)లో అల్లం ముద్ద కలిపి కూడా రోజూ తింటే వైరస్లను తట్టుకునే శక్తి వస్తుంది. అల్లాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి, వాములను కలిపి టీ కాచుకుని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు. ఇలాచేస్తే పేగులు శుభ్రపడతాయి. ఊపిరితిత్తులు మరింత దృఢమవుతాయి. వైరస్ బారిన పడిన బాధితులు, సాధారణ ఆరోగ్యవంతులు తీసుకోదగిన ఔషధం. వనమూలికలతో కాచే టీలో పంచదార బదులు బెల్లం (సహజమైన రంగులో ఉన్నది) కలుపుకోవాలి.
తులసి
రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసిని మించిన ఔషధ మొక్క మరొకటి లేదు. తులసి ఆకుల రసం, తులసి టీ సర్వరోగ నివారిణిలు. ఏదో ఒక రూపంలో తులసిని తరచూ తీసుకోవాలి. అలా చేస్తే మందులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ గుణాన్ని 'యోగవాహి' అంటుంది ఆయుర్వేదం.
ఏం చేయాలి? : నీడలో ఎండబెట్టిన తులసి ఆకులు, వెన్నులు, రెమ్మలు, శుభ్రం చేసిన వేళ్లతో సహా తులసి పంచాంగాలన్నీ ఒకే గుణం కలిగి ఉంటాయి. ఎండిన తులసిని దంచి, అందులోకి యాలకులపొడి, మిరియాలపొడి, పుదీనా ఆకుల పొడి తగుపాళ్లలో కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని గ్లాసు నీళ్లలోకి వేసి, మరగకాచి, అందులో నిమ్మరసం కలుపుకుని.. రోజుకు మూడు పూటలా టీలాగ సేవించాలి.
విశేషం : కొన్ని రకాల తులసి మొక్కల్లో యూజెనాల్, సిట్రాల్, కర్పూరం, థైమాల్ లాంటి శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి. అందుకే తులసిని సూక్ష్మజీవి నాశకం (యాంటిసెప్టిక్) అంటారు. రేడియేషన్ చికిత్సలో ఆరోగ్యకణాలు దెబ్బతినకుండా తులసి కాపాడుతుంది. లవంగం వేసి వండే వంటకాల్లో తులసి ఆకుల్ని కూడా వేసి వండుకోవచ్చు.
వస
వైరస్లు అంటుకున్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం ముప్పేట దాడి చేస్తాయి. కఫం పేరుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. దాంతో ఆయాసం వస్తుంది. ఇలాంటి ఆయాసాన్ని తగ్గించేందుకు వస చక్కగా పనిచేస్తుంది.
ఏం చేయాలి? : వస కొమ్మును దంచిన పొడి పావు చెంచా తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో కలిపి టీ లాగా కాచుకుని తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కఫం తగ్గుతుంది. దగ్గు, జలుబు, తుమ్ములు రావు. విష దోషాలకు, వైరస్ దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది వస. రోజుకు రెండుమూడు సార్లు తాగితే ఊపిరితిత్తులు శక్తివంతమై, వైరస్ తాకిడిని తట్టుకోగలవు.
అష్టగుణమండం
వైరస్ బారిన పడినవాళ్లు నీరసించిపోతారు. ఊపిరితిత్తుల పనితీరు క్షీణిస్తుంది. తిరిగి మళ్లీ బలం పుంజుకునేందుకు ఆయుర్వేదం చెప్పే ఆహారం 'అష్టగుణమండం'.
ఏం చేయాలి? : ఇంగువ, సైంధవ లవణం, ధనియాలు, బిరియానీ ఆకు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు.. వీటన్నింటినీ సమభాగం తీసుకుని.. మెత్తగా దంచి పొడిని చేసుకోవాలి. బియ్యంలో సగం పెసరపప్పు తీసుకుని జావలాగా కాచుకోవాలి. ఒక గ్లాసు జావకు 1 - 2 చెంచాలపొడిని కలిపి వండిన ఈ సూపుని 'అష్టగుణమండం' అంటారు. ఇది గొప్ప పోషకాహార ఔషధం. అజీర్తిని తగ్గించి, పేగుల్ని శుభ్రపరిచి, ఊపిరితిత్తుల్ని సంరక్షిస్తుంది.
వాము
భారతీయుల ఆహారంలో వాము వాడుతున్నదే. ఇది కూడా ఔషధ లక్షణాలున్న వంట దినుసు. అజీర్తిని, కఫాన్ని తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. వాము నుంచి తీసిన సారాన్ని 'థైమాల్' అంటారు. దీనినే 'వాంపువ్వు' అని పిలుస్తారు. బయట కొన్ని అంగళ్లలో దొరుకుతుంది. పావు గ్లాసు నీళ్లలోకి కొద్దిగా వాంపువ్వు వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కఫం ఆరుతుంది. కళ్లె తగ్గుతుంది. దగ్గు, జలుబు, తుమ్ములు ఆగుతాయి. కడుపులో గ్యాసుతో కూడిన నులినొప్పి, అజీర్తి వల్ల వచ్చే విరేచనాలు, నీళ్ల విరేచనాలు పోతాయి. ఈ వేసవిలో వచ్చిన వైరస్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది వాము.
ఏం చేయాలి? : ధనియాల పొడి, వాము పొడి సమానంగా కలిపి అన్నంలో కారప్పొడిలాగా తినవచ్చు. మజ్జిగలో కూడా కలుపుకుని తాగవచ్చు.
కర్పూరం
ఈ తరానికి తెలుసో లేదో కానీ, పాతతరం వాళ్లకు గుర్తుంటుంది. అప్పటి పెళ్లిళ్లలో కర్పూరం పుల్లలు ఇచ్చేవాళ్లు. వాటి వాసన చూస్తే శుభకార్యం జరిగేప్పుడు ఎవరూ తుమ్మకుండా ఉంటారని చేసిన ఉపాయం అది. వైరస్లు వ్యాపించినప్పుడు తుమ్ములు, దగ్గు, జలుబు వంటివి వేధిస్తాయి. తుమ్ములు రాకుండా కర్పూరం అడ్డుకుంటుంది.
ఎలా చేయాలి?: ఒక చెంచాడు బియ్యం, పావు చెంచా ముద్ద కర్పూరం బాగా కలిపి ఒక పల్చని వస్త్రంలో ఉంచి మూటగట్టి, వాసన చూస్తుంటే.. శ్వాసమార్గంలో కఫం చేరుకోకుండా ఉంటుంది. వైరస్ ఊపిరితిత్తుల్లో తిష్ట వేయకుండా శ్వాసనాళాల్ని శుభ్రం చేస్తుంది. ఆరోగ్యవంతులకు ఇది అవసరమైన సూచనే. ఇన్హేలర్లు వాడటం కన్నా ఇది సహజమైన పద్ధతి. ఇందులో కొద్దిగా వాము పొడిని కూడా చేర్చవచ్చు. ఇమ్యూనిటి పెంచుకోవడాకి ఇదొక మార్గం.