Saturday 29 August 2015

తెలుగు భాషకు తిరుక్షౌరం డా. జి వి పూర్ణచందు

విశాలాంధ్ర ఆదివారం దినపత్రిక ఆదివారం పుస్తకంలో పద్యానుభవం శీర్షికని గత రెండేళ్ళుగా నిర్వహిస్తున్నాను. అప్పుడప్పుడూ వాటిలో కొన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఈ వారం వచ్చిన నా పద్యానుభవం ఇది:

తెలుగు భాషకు తిరుక్షౌరం

డా. జి వి పూర్ణచందు

“తిరుకట్టె సేవ జేసెద తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గుల్/తిరుపంజనంబు దీర్చెద తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద దినమున్”

తెలుగు వైష్ణవులకు తమిళం దైవభాష. వీళ్ళలో చాలా మంది తెలుగువారే, ఇప్పటి తమిళ ప్రాంతాల్లో నివసించి, తాతల కాలంలోనే తెలుగు నేలకు వలస వచ్చిన తెలుగువాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇళ్ళలో తమిళం మాట్లాడటం, తమిళుల్లాగే ప్రవర్తించటం, తెలుగు విషయాలను తమిళీక రించటానికి ఎక్కువ మొగ్గు చూపటం ఈ పద్య భాగంలో కనిపిస్తుంది.

ఇలగే, వీర శైవులున్నూ కన్నడం తమకు దైవభాషగా భావించిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. శివుడు కన్నడం వాడూ కాదు, విష్ణువు తమిళుడూ కాదు. కన్నడ బసవడూ, తమిళ రామానుజుడూ కలిగించిన ప్రభావాల పుణ్యం అది. తమిళ శైవుల కన్నా తమిళ వైష్ణవుల పలుకుబడి తెలుగు మీద ఎక్కువ. వీళ్ళు తెలుగు పదాలకు ముందు ‘తిరు’ చేర్చి విష్ణుత్వం ఆపాదించటం గొప్ప విషయమే కానీ, తమిళీకరించే పనిగా అది పరిణమించటమే బాధాకరం.

తిరుకట్టె సేవ జేసెద: కట్ట అంటే చీపురు కట్ట. దాన్ని తిరుకట్ట - గుడి ఊడ్చే చీపురు కట్ట అనడం వలన దానికి పవిత్రత వచ్చింది. కానీ అందులోంచి తెలుగుదనం ఊడ్చుకు పోయి, అది తమిళ పదంగా మారిపోయింది.

తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గులు: మాళిగ అంటే ఇంటిలో ఒక భాగం. తిరుమాళిగ/తిరుమాళ్ళ/ తిరుమాళిహ/ తిరుమాళిఘ అంటే గుడి పూజారి లేదా మతగురువు నివాసం. అంటే వైష్ణవ గురువు ఇంటిని అలికి ముగ్గులు పెట్టే సేవ ఇది. దాన్ని తెలుగు వైష్ణవులు తమిళంలోనే చెప్పాలా?

తిరుపంజనంబు దీర్చెద: మజ్జనం అంటే నీళ్ళలో మునిగి చేసే స్నానం. తిరుమంజనం అంటే పవిత్రమైన కోనేరులో స్నానం. కోనేటిని ‘తీర్థకూలం’ అన్నారు. సంస్కృతంలో తీర్థం అంటే దేవుడి నీళ్ళు అని. కూలం అన్నా దేవుడి నీళ్ళే! తీర్థకూలం అనటం ద్వారా తమిళీకరించే ప్రయత్నం స్పష్టమౌతోంది. కూలం/కొలం/కూలం/ కొలను ఈ పదాలన్నీ నీటికి సంబంధించినవే! ఆంధ్ర మహావిష్ణువు స్థావరమైన ‘శ్రీకాకుళం’లో కాకుళం అంటే ‘కా’=నల్లని, ‘కుళం’= నది... కృష్ణానది అని అర్ధం.. తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద: పుట్టము=బట్ట. తిరుపుట్టము= దేవుడికి కట్టిన వస్త్రం. తిరుపావడ. అంటారు.

ఇలా తెలుగులో వ్యవహారంలో ఉన్నమాటల్ని తమిళ పదాలుగా మార్చినవి చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
తిరువళ్ళిక: ‘తిల్లిక’ అంటే దీపం. తిరుతిల్లిక అంటే దేవుడి ముందు వెలిగించిన దీపం. తిరుపాట (భక్తి గీతం), తిరుబాస (దేవుడిమీద ఒట్టు), తిరు కాపు (గుడి తలుపులు) తిరుగిన్నె (దేవుడి గిన్నె),

తిరుతోమాలి: తోమాలియ అంటే తోట+మాలి అని! తోమాలె అంటే ఆకులూ పూలూ కూర్చికట్టిన మాల. తోమాలి అనికూడా అంటారు, తిరుతోమాలి అనేసరికి తమిళపదంగా మారిపోయింది.

తిరుపడితాము: పడిదెం అంటే జుర్రుకుంటూ తాగేదని! దీనికి తిరు చేర్చి తిరుపడిదెం -‘తిరుపడితాము’ అన్నారు.

తిరుచుట్టు (గుడి ప్రహరీ), తిరు బోనం (నైవేద్యం), తిరునగరు (ధనికుల నగరం, దేవుడి ఊరు. తిరునాడు (వైకుంఠం), ఇలా చాలా మారుడు పదాలు కనిపిస్తాయి.

సురవరం ప్రతాపరెడ్డిగారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో దీన్ని ప్రస్తావిస్తూ, “భోజనము చేసినప్పుడు ‘అన్నము’ అనక ‘సాదము’ అని, ‘పరమాన్న’మనక ‘తిరుకణామధు’ అని, ‘భక్ష్యాలు’ అనక ‘తిరుపణ్యారము’ అని, ఈ విధముగా అన్నియు అరవము తోనే అడుగవలెను. లేకున్న వైష్ణవుడు మైల పడిపోవును. ఇది వైష్ణవము తెచ్చి పెట్టిన అరవ దాస్యము” అన్నారు.

ఇందులో దేవుడి పాత్ర, భక్తుల పాత్రా ఏమీలేవు. ఎవ్వరినీ ఇప్పుడు తప్పు పట్టి ప్రయోజనమూ లేదు. కాకపోతే, తెలుగు భాష కొచ్చేసరికి కొప్పుకు ముందు తిరుచేరిస్తే, ‘తిరుకొప్పు’ అంటే బోడి తల అనీ, క్షవరానికి ముందు తిరు చేరిస్తే, ‘తిరుక్షౌరం’ (ఉన్నది కాస్తా ఊడటం) అవుతున్నాయి. భక్తికీ భాషకూ ముడిపెట్టి ప్రయోగాలు చేస్తే, భాషాభక్తులు ప్రశ్నించటం సహజమే!