Tuesday, 3 March 2015

ధనలక్ష్మి లేని రాజధాని :: డా. జి వి పూర్ణచందు

ధనలక్ష్మి లేని రాజధాని
డా. జి వి పూర్ణచందు

వెలయు నఖిల భువనములలోన వారణ
నగరిపు రమ తల్లి నా దనర్చి
రాజ్యలక్ష్మి మిగుల బ్రబల నయోధ్య నా
రాజవినుతి గనిన రాజధాని
ఇంద్రుడి రాజధాని అమరావతి. అది సమస్త సృష్టిలోనూ వారింపరాని సంపద కలిగిందిట. అందుకని దాన్ని అవారణఅంటారు. నగం అంటే కొండ. కొండల్ని పిండికొట్టి మహానగరాలు నిర్మించినవాడు, కొండలకు వ్యతిరేకి-ఇంద్రుడు. పర్వతాల రెక్కల్ని ఇంద్రుడు తన వజ్రాయుధంతో విరగ కొట్టాడనే కథలోని ఆంతర్యం ఇదే! అందుకని పురందరుడైన ఇంద్రుడికి నగరిపుడని పేరు. నగరిపుడి రమఅంటే సంపదగా ఇంద్రుని రాజధాని అమరావతిని పిలుస్తారు. కానీ, అంతటి అమరావతికి తల్లిలాగా ఉన్నదట అయోధ్యానగరం! నానా దేశాల రాజన్యులు అక్కడ చేరారంటే పాలనావ్యవస్థ బలంగా ఉందనీ, విదేశీ వర్తక వాణిజ్యాలు బాగా సాగుతున్నాయని, దేశ సౌభాగ్యంలో ప్రజలు భాగస్వాములయ్యారనీ అర్థం. అందుకనిరాజ్యలక్ష్మి మిగుల ప్రబలన్” - అక్కడ రాజ్యలక్ష్మి తాండ విస్తోందట! అమరావతికి ఇలాంటి సౌభాగ్యాలు లేవు. అది ధనలక్ష్మితో కూడుకుని ఉంటే, అయోధ్య రాజ్యలక్ష్మితో నిండి అమరావతికి తల్లిలా ఉన్నదంటాడు పింగళి సూరనరాఘవ పాండవీయం ద్వ్యర్థి కావ్యంలో! ఒక్క మాటతో పాలనావ్యవస్థ అనేది ఎంత పటిష్టంగా ఉండాలో సూచించాడు సూరనకవి. కొత్తరాజధాని ఎలా ఉండాలో కూడా కవి వాక్యాన్నిబట్టి అర్థం అవుతోంది.
ప్రపంచానికి కొత్త రాజధాని నగరాలు కొత్తేమీ కాదు. మూడు విభిన్న ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని 1991లో నైజీరియా అబుజాపేరుతో కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకుని లాగోస్ నుండి మార్చుకుంది. బ్రిటీష్ హోండురాస్ దీవులు 1961 హరికేన్లో పూర్తిగా విధ్వంసమైన తమ రాజధాని స్థానే  బెల్మోపాన్ నగరాన్ని నిర్మించుకున్నాయి. బ్రెజిల్ తన రాజధాని జనంతో నిండి పోయిందని బ్రసీలియాని కొత్త రాజధానిగా నిర్మించుకుంది. సిడ్నీ, మెల్బోర్నె ప్రాంతాల మధ్య వైషమ్యాలు నివారించటానికి ఆస్ట్రేలియా కాన్బెర్రాఅనే రాజధాని నగరాన్ని కట్టుకుంది. 1964లో బోట్స్వానా స్వతంత్రదేశం అయినప్పుడు గబొరోన్ అనే రాజధాని నగరాన్ని కొత్తగా నిర్మించుకుంది.1974 బంగ్లాదేశ్ పరిణామాలతరువాత రావల్పిండి సైనిక స్థావరాలకు దగ్గరగా ఉన్న ఇస్లామాబాద్ ప్రాంతంలో నూతన నగరాన్ని నిర్మించి వాణిజ్య కేంద్రం అయిన కరాచీ నుండి రాజధాని నగరాన్ని తరలించుకుంది పాకిస్థాన్. మలేషియా కూడా కౌలాలంపూర్1లోనే రాజధాని ఉన్నప్పటికీ, 2002లో పుత్రజయ అనే నూతన రాజధానిని నిర్మించింది. అమెరికా(USA) కూడా వాషింగ్టన్ డిసి నగరాన్ని నిర్మించి ఫిలడెల్ఫియా నుండి రాజధాన్నితరలించింది.
జపాన్, బర్మా, ఇండియా ఇంకా చాలాదేశాలు కొత్త రాజధాని నగరాలు నిర్మించుకున్నాయి. అవి నిండిపోతే ఇంకో రాజధానిని కట్టుకుంటాయి. కొత్త రాజధాని అనేది స్థానిక పరిస్థితుల్ని బట్టి, అవసరాల్ని బట్టి, ప్రజల ఆకాంక్షల్నిబట్టి నిర్మితం అవుతుంది. కొత్త డిల్లీ నిర్మాత ఫలానా అనీ, గుజరాత్ రాజధాని గాంధీనగర్ నిర్మాత ఫలానా అనీ, చరిత్రలో మనం ఎక్కడా చదవం. చదివినా అది అబద్ధమే! ఇస్లామాబాద్కు రాజధానిని తరలించటానికి అయూబ్ఖాన్ ప్రేరకుడేగానీ అతన్ని నగర నిర్మాతఅని ఎవరూ అనరు. ఎవరి కాలంలో రాజ్యంలో రాజ్యలక్ష్మి ప్రబలంగా ఉంటుందో వారు చారిత్రాత్మక పాత్ర పోషించినట్టు! రాజ్యలక్ష్మి లేని రాజధాని వెలవెలపోతుంది. రాజధానులు రాత్రికి రాత్రి వెలిసేవి కావు. వాటి నిర్మాణానికి బలమైన పునాదులు కావాలి. అందుకోసం ఎంతకైనా తెగించాలి. ఎవరూ నిలబడకుండానే మహానగరాలు నిర్మాణం కాలేదు. ఎవరూ అలా నిలబడక పోవటం వలనే హైదరాబాదుకు ప్రత్యామ్నాయంగా మరో నగరాభివృద్ధి జరగకుండాపోయింది కూడా!
అలాగని, ఇల్లు కట్టే పనిలో పడి, వంటచేసుకోవటం మానేయరు కదా! ఇంట్లో బియ్యం, ఉప్పు, పప్పు సమకూర్చు కోవటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, తరువాతే ఇంటి నిర్మాణం సంగతి చూస్తాడు యజమాని! ధనలక్ష్మి లేకుండా రాజధాని ఏర్పడాలంటే, రాజ్యలక్ష్మిని బలంగా, ప్రబలంగా, అచలంగా ఉండేలా చూసుకోవాలి! మొదట ఇంటగెలవాలి! పాలకుడికి రాజ్యలక్ష్మే ప్రధానం!