Sunday 22 November 2015

కక్కురితి వ్యామోహాలు :: డా. జి వి పూర్ణచందు


కక్కురితి వ్యామోహాలు
డా. జి వి పూర్ణచందు
“ప్రాము జఠరాగ్నిచే “గింకరోఫ్మి” యనుచు
నడరు వేదనచే “గ్వ యాస్యామి” యనుచు
విస్మయపు మూర్ఛచే “నాహతోzస్మి” యనుచు
బలువరింపగ సాగె నబ్బక్క నక్క”
ఇది కక్కుఱితిపడి చచ్చిన ఒక నక్క కథ. అయ్యలరాజు నారాయణామాత్యుడి హంసవింశతి కావ్యంలో ఓ శ్రోత్రియుడి భార్య రాజసంయోగం కోసం వెంపర్లాడుతున్నప్పుడు, అది తగదని హంస హితబోధ చేస్తూ చెప్పిన ఓ బక్క నక్క కథ ఇది!
తీక్షణమైన ఆకలి బుర్ర పనిచేయకుండా చేస్తుంది. ఆకళ్ళు చాలా ఉన్నాయి. మన కవులు “క్షుధాతురాణాం న తీపి ర్నపులుపు, కామాతురాణాం న ముసలి ర్నపడుచు, నిద్రాతురాణాం న మెట్ట ర్నపల్లం” అంటూ పేరడీ చెప్పే వాళ్ళు. కడుపు లో ఆకలితో అలమటించే ఒక నక్క, కామం ఆకలితో అలమటించే ఒక అమ్మాయి...ఈ ఇద్దరినీ కలిపి అల్లిన కథ ఇది.
పుట్టలు, దిట్టలు, చెట్లు, బొట్లు, గట్లు, వంకలు, డొంకలు బీళ్ళు, బాళ్ళ రాళ్ళ కుప్పలు, తిప్పలు, మళ్ళు, గుళ్ళు, ఊళ్ళు తిరిగీ తిరిగీ ఆహారం దొరక్క అలిసిపోయింది ఇక్కడ నక్క. కామం ఆకలితో గింజుకుంటోంది అక్కడ ఆ అమ్మాయి. ప్రాణాలు కంఠంలో పెట్టుకుని, నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ ఓ నూతి దగ్గరకు వచ్చింది నక్క. నూతి ఏతానికి బలంగా కట్టిన చర్మపు వారు (త్రాళ్ళు) కనిపించింది. ఆ పూటకు ఆ త్రాళ్లు తిని కడుపు నింపుకోవాలనుకుంది. గడప దాటటానికి సిద్ధమైన సుందరి కూడా అంతే! దాటేయాలనే ఆశలో ఇంకేం ఆలోచించలేదు.
ఆకలి మీదున్న బక్కనక్క ఏతాము దూలం (ముంగిసమ్రాను) పైకి చివుక్కున ఎక్కి, వెదురులకు కట్టిన చర్మపు తాడుని పుటుక్కున కొరికింది. అంతే! వంగి ఉన్న వెదురు బద్ద బలంగా తగిలి, తాటి చెట్టంత ఎగిరి నాలుక నడుముకు కరుచుకునేలా వెన్ను విరిగి ఆ నూతిలో పడి చచ్చింది.
గడపకు తెలీకుండా గడప దాటగలిగిన ఇంతి కూడా ముందు వెనుక చూసుకోక పోతే ఆమె గతీ అంతే అవుతుందనేది ఈ కథలో కనిపించే పోలిక. ‘‘కామం కూడా అలాంటిదే! అది కమ్మినప్పుడు వెనకాముందు చూడక పోతే నక్క గతే పడ్తుంది. ఆకలి కొద్దీ నక్క ఆహారాన్ని చూసిందే గానీ, తన చేటు తెలుసుకో లేకపోయింది. రాజసంయోగం కోరి, నువ్వుకూడా ఉపద్రవాలు ఆలోచించట్లేదు. చిత్తంబున తత్తరంబు లేక తెలిసి మెలగా” లని హంస నయోక్తులుపలికింది.
అమెరికా అంత గొప్ప అయిపోవాలి, దుబాయంత డబ్బు కావాలి, సింగపూరంత రాజధాని కావాలి... ఇలాంటి కోరికలు కూడా నక్క ఆకలి లాంటివే! వెనకా ముందు చూసుకోవటం అనేది అవసరం. అమెరికాలో పీజ్జాలు, బర్గర్లు తింటారు... మనమూ తినాలి! ఆష్ట్రేలియాలో చొక్కాలు విప్పుకు తిరుగుతారు. మనమూ తిరగాలి! పారిస్‘లో శృంగారం విచ్చలవిడి. మనమూ కానివ్వాలి…అనే ‘ఆకలి’ మనకూ పెరుగుతోందీ మధ్య.
‘దేశాభిమానం మాకు కద్ద’ని గట్టిగానే చెప్పుకునే పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ విదేశీ వ్యామోహం వీసమెత్తయినా తగ్గుతుందని ఆశించిన వాళ్లకు ఆశ్చర్యం మాత్రమే దక్కింది. అది గతంలోకన్నా మితిమీరుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
ఈ విధమైన పాశ్చాత్యుల దాడి ‘మతం’ మీద కాదు, అది మన సంస్కృతి మీద మోహరించి జరుగుతోంది. అందుకు మనలో నిబిడంగా ఉన్న కక్కురితే కారణం. దానికి ఆధునికీకరణం, నాగరీకరణం, సంస్కరణం లాంటి పేర్లు ఎన్ని పెట్టినా అది కక్కురితే! మనది కానిదాని కోసం, మనకు తగని దాని కోసం వెంపర్లాట…
విదేశీ మోహరింపు మొదట మన భాష మీద లగ్నం అయ్యింది. మనం విద్యావ్యవస్థను బలిచేసుకున్నాం. తర్వాత మన ఆహారం మీద దృష్టి పెట్టింది. మనం రంగు రసాయనాలు, పురుగుమందులు కలిసిన విషం నీళ్ళ కూల్ డ్రింకుల్ని ఆబగా తాగటం మొదలు పెట్టాం. రంగు బిస్కట్టులు, కొవ్వు రొట్టెలు, సీసం కలిసిన నూడిల్సూ గొప్పవంటూ తెచ్చి పిల్లలకు పెట్టి అమెరికా వాళ్ళమై పోయినంత సంబర పడ్డాం. ముప్పొద్దుల భోజన సంస్కృతినీ, ఆరు రుచుల ఆహార సంస్కృతినీ చెడగొట్టు కుని విదేశీకరణం కోసం ఆబగా ఎదురుచూస్తున్నాం. ఇంక వాడిదే ఆలశ్యం.
హంసవింశతి కావ్యంలో రాజుగారు విష్ణుదాసుడి ఇల్లాలిని కోరాడు. రాజంతటి వాడు కోరితే కాదనటమా అనుకున్న దా అమాయకపు అందగత్తె. అంతలో అదృష్టం కలిసొచ్చినట్టు విష్ణుదాసుడు విదేశాలకు వెళ్ళాడు. ఇల్లాలు గడప దాటేందుకు సిద్ధంగా ఉంది. చీకటి పడ్తోంది. చంద్రోదయం అవుతోంది… సరిగ్గా ఆ సమయంలో ఎక్కడినించి వచ్చిందో ఓ హంస. ఆ హంస పరమహంస లాంటిది. భర్త తిరిగి వచ్చే వరకూ రాత్రి పూట ఆ ఇల్లాలిని కూర్చోబెట్టి కక్కురితి మంచిది కాదంటూ ప్రతిరాత్రీ ఒక కథ చెప్పి రోజులు గడిపించింది.
మనల్ని కూడా ఇలా గడప దాటనీయని పరమహంసల కోసం ఎదురు చూద్దాం.
22-11-15 ఆదివారం విశాలాంధ్రలో నా శీర్షిక పద్యానుభవంలో ప్రచురితమైన నా వ్యాసం.