Saturday 8 November 2014

భోజన మర్యాదలు డా. జి వి పూర్ణచందు


భోజన మర్యాదలు
డా. జి వి పూర్ణచందు


           `అతిథి దేవో భవఅనే సంస్కృతి మనది. అతిథికి వడ్డించి, తినటం పూర్తయ్యాకే గృహస్థు భోజనం చేయటంలో ఒక  భక్తి భావం ఉంది. ఇందుకు విరుద్ధంగా ఇంగ్లండులో మొదట గృహస్థు ఆహారాన్ని నోట్లో పెట్టుకున్నాకే అతిథి  తింటాడు. అది అక్కడి మర్యాద. ఈ మర్యాదలో ఆక్షేపించవలసింది కూడా ఏమీ లేదు. అది  శబరి భక్తి లాంటిది.  తాను కొరికి తియ్యగా ఉన్న పండునే రాముడికి పెట్టింది. ఇదికూడా అతిథి దేవో భవలాంటి మర్యాదే!

           ముందు తీపి భక్ష్యాలు, గారెలు వడలాంటి కారపు భక్ష్యాల్ని, తరువాత పరిమితంగా పప్పు, కూర పచ్చడి వగైరాల్నీపులుసు లేదా చారునీ, పెరుగునీ కొద్దిగా వడ్డిస్తారు. వడ్డించిన ఈ విస్తరి మెనూకార్డు లాంటిది. ఏవి ఏ రుచుల్లో  ఉన్నాయో, తెలుసుకుని, కావలసినవి అడిగి వడ్డించుకునేందుకు అతిథికి అవకాశం ఉంటుంది.

             తినేప్పుడు ముందు పప్పు లాంటి కఠిన పదార్థాలు, తరువాత కూర పచ్చడి లాంటి మృదు పదార్థాలు, తరువాత పులుసు చారు లాంటి ద్రవ పదార్థాలు, ఆ పైన పెరుగు లేదా మజ్జిగ తిని, బోజనాంతంలో స్వీట్లు తినటం మన ఆహార సంస్కృతి. ఇప్పుడు మనం స్వీటుతో మొదలు పెట్టి, ఐసుక్రీముతో ముగిస్తున్నాం. పెరుగన్నం తిన్నాక పాల ఐసుక్రీము ఎలా తీంటారు? విరుద్ధ పదార్థాలు కావా?
             బంతిభోజనాల్లో వడ్దనంతా పూర్తయ్యాక, గృహస్థు వచ్చి కలుపుకోవాలని కోరటం, భగవన్నామ స్మరణ  చేసి, పెద్దలు, వృద్ధులూ తినటం మొదలు పెట్టాక అప్పుడు విస్తరిని ముట్టుకోవటం మన ఆహార సంస్కృతి! వడ్డించింది వడ్డించినట్టు తినటం నేటి koనాగరికత! మనం ఎప్పుడు లేస్తామా అని చూస్తూ, మన వెనకే రెండో బంతి అతిథులు నిలబడి ఉంటారు. అందువల మనమీద ఆహార వత్తిడి పెరుగుతుంది. అలా నిలబడటం మర్యాద కాదు!
             వెనకాల పోలీసులు తరుముతున్నా రన్నట్టు జల్దీభోజనం చేస్తుంటారు కొందరు. బంతిలో మిగతా వాళ్ళు  కూరలో ఉండగానే ఈ జల్దీ భోజనరాయుళ్ళు సాంబార్ని పిలుస్తుంటారు. వడ్డనలో ముందే సాంబారు వచ్చేస్తే,  ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. హడావిడిగా గుటుకూగుటుకూ మని తినటం వలన భొజనాన్ని ఆస్వాదించే  అవకాశం కూడా ఉండదు. అలా ఆదరా బాదరాగా తినవద్దంటుంది శాస్త్రం. అలాగని మరీ నిదానంగానూ తినకూడదు.  జీర్ణశక్తి మందగిస్తుంది.
              చైనీయులు వడ్డనలో ఆఖర్న వేడి టీ కషాయాన్ని గ్లాసుల్లో తెచ్చి ఇస్తారు. తినటానికి ఉపయోగించే పుల్లల్ని ( చోప్ స్టిక్స్) ఊపుతూ, కిందా పైనా పడేస్తూ ఆడుకోకూడదు. రెండు పుల్లల్నీ వేర్వేరు చేతుల్తో పుచ్చుకో కూడదు. పళ్ళెం పైకి వంగి ఆహారాన్ని తినాలే గానీ, నోటి దగ్గరకు పళ్ళేం తీసుకెళ్ళకూడదు. వాళ్లవి  నూడుల్స్ తరహా వంటకాలు కాబట్టి, పుల్లల్తో తినటానికి అనువుగా ఉంటాయి. మన పప్పన్నం అలా తినటం కుదరదు.
               ఫోర్కుని ఎడం చేత్తోనూ, కత్తిని కుడిచేత్తోనూ పుచ్చుకుని మాంసాన్ని కోసి తినటం ఇంగ్లీషువాడి మర్యాద. ఫోర్కుతో ఆహారాన్ని నోట్లో పెట్టుకోవటాన్ని థాయిల్యాండ్ వాళ్ళు తప్పుపడతారు. ఆహారాన్ని చెంచాతో అందుకోవాలి. చెంచాను నోట్లోకి తోసి, నాకి తినటాన్ని యూరోపియన్లు అమర్యాదగా భావిస్తారు. స్టారు హోటలుకెళ్ళి  ఇడ్లీ, అట్టుల్ని కూడా ఫోర్కుతో తినే వాళ్లని చూస్తే, నవ్వొస్తుంది. గోరుతో పోయేదానికి గొడ్డలి వాడటం ఏం గొప్పా?
               ఆహారాన్ని కుడిచేత్తో తుంచుకుని లేదా కలుపుకుని తినటమే మన మర్యాద. అలాగే ఆహార పదార్థాలను  రెండు చేతులూ ఉపయోగించి తినటాన్ని అన్ని దేశాలవారూ అసహ్యంగానే భావిస్తారు. మనదేశంలోనే ఎడం చేత్తో రోటీని మడిచి పుచ్చుకుని కుడిచేత్తో తుంచుకుని తినే అలవాటున్న వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా ఇది భోజన సభ్యత కాదనే చెప్పాలి.
           చాలా హోటళ్ళలో భోజనబల్ల పైన  పచ్చళ్ళు పొడులూ, చారూ, సాంబారు లాంటి ద్రవ్యాలను ఎవరికి వారే వడ్డించు కునేలా ఉంచుతారు. వాటిని కొందరు వడ్డించుకునే తీరు పరమ అసహ్యంగా ఉంటుంది. తినే చేత్తోనే గరిటను  పుచ్చుకోవటం, కంచానికి ఆన్చి వడ్డించుకోవటం చేస్తుంటారు. నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. బంతి భోజనాలలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా  వడ్డించుకోవటం తినటం అనేవి కనీస మర్యాద. దాన్ని తెలియ చెప్పటం కూడా అవసరమే! ఇంట్లో తినేప్పుడు కూడా అలాంటి మర్యాదల్నే అలవాటు చేసుకుంటే బయట కూడా పాటించ గలుగుతారు. సుతారంగా వ్రేళ్ళతో అన్నాన్ని కలుపుకు తినటంలో నాజూకు తనం ఉంది. గోదుమ పిండిని పిసికినట్టు అన్నాన్ని పిసుక్కొని తినటం చూసే వాళ్లకి ఇబ్బందే! అన్నాన్ని పిసికి కాదు, నమిలి తినమని శాస్త్రం చెప్తోంది. అలాగే, ఆహారాన్ని నమిలేప్పుడు  పెదాలు మూత పడి ఉండాలి. లేకపోతే చప్పరింత శబ్దం భోజనమర్యాదల్ని దెబ్బతీస్తుంది. పందికి చప్పరం అనే పేరుంది. అది చప్పుడు చేస్తూ తింటుంది కాబట్టి! మన భోజనతీరు అది కాదు కదా!
          భోజనం చేశాక ఒక్క మెతుక్కూడా పళ్ళెంలో మిగలకుండా తినటం అనేది అన్నానికి మనం ఇచ్చే గౌరవం. జపాను వాళ్ళు పళ్ళెంలో అలా పూర్తిగా తింటే కడుపు నిండలేదేమో అనుకుంటారట. కడుపునిండిందని ప్రకటించ టానికి చైనా వాళ్ళు గ్లాసు బోర్లించి, ఫోర్కులూ చెంచాల్నీ పళ్ళెంలో పడుకోబెడ్తారట. వంట రుచి ఎలా ఉందో దాన్ని తిన్న తీరు చెప్తుందని ఆంగ్ల సామెత. ఎక్కువ విస్తళ్లలో ఏది ఎక్కువగా వదిలేయబడి కనిపిస్తుందో అది రుచిగా లేదని అర్థం. తిన్న విస్తళ్ళు క్లీనుగా ఉంటే వంట బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క!
             ఆతిథ్యం ఇచ్చిన వారినుద్దేశించి అన్నదాతా సుఖీభవ...అంటాం మనం. కెనడాలో వంట చేసిన వారిని సుఖీభవ అని దీవిస్తారు. అన్నదాత’, ‘అన్నకర్తలిద్దరినీ సుఖీభవ అనటం ఒక మంచి అలవాటు. వంటలు బాగున్నాయని చెప్పటం మర్యాద. రాయవాచకంగ్రంథంలో రాయల కాలంనాటి రాచభోజన పద్దతుల వర్ణనలున్నాయి. అవి పాశ్చాత్య తరహాలో ఉండవు. విదేశాల్లో రాచమర్యాదలే నాగరికతగా భావించబడుతున్నాయి. భోజనాల బల్లమీద వేసే బట్ట కనీసం 15 అంగుళాలు దిగి ఉండటం, రాత్రిభోజనాలకు కొవ్వొత్తి వెలిగించటం ఇవి యూరోపియన్ సాంప్రదాయాలు. మనవాళ్ళు వెన్నెల రాత్రిని శృంగారానికే గానీ భొజనాలకు ఉపయోగించుకున్నట్టు కనిపించదు. వెన్నెట్లో భోజనం కూడా ఒక రసఙ్ఞతే!

              భోజన సమయంలో సెల్ ఫోన్లను నిశ్శబ్ద స్థితిలో ఉంచటం, భోజనాల గదిలో ఎంతమంది ఉన్నా ఎవ్వరూ లేనంత నిశ్శబ్దాన్ని పాటించటం, హడావిడి సమాచారం ఉంటే మౌనంగా బయటకు వెళ్ళి మాట్లాడటం, మాంసాహారాన్ని తినేప్పుడు నోట్లో వేళ్ళుపెట్టి ఎముక ముక్కల్ని బయటకు తీయటం, నోట్లో మిగిలిన వ్యర్థాన్ని పళ్ళెంలోకి  ఉమ్ములు వేయటం ఇవన్నీ బంతి భోజనాలలో తప్పనిసరిగా మానుకోవాల్సిన అలవాట్లు. భోజనాన్ని మనం మనకోసమే చేస్తున్నా మర్యాదల్ని ఇతరులకోసం పాటించాలి. అది పౌరబాద్యతల్లో ఒకటి. నా ఇష్టం అనుకోవటానికి కాదు గదా స్వాతంత్ర్యం వచ్చింది.

“వెయ్యి చంద్రుళ్ళను చూస్తారా?”::డా. జి వి పూర్ణచందు

వెయ్యి చంద్రుళ్ళను చూస్తారా?
డా. జి వి పూర్ణచందు


శరీర కారణాం పరమం మూలం గ్రామ్యాహారః శరీరాని కొచ్చే సమస్త వ్యాధులకూ గ్రామ్యాహారం పరమ మూలకారణం అని చరక సంహిత చికిత్సా స్థానంలో ఒక సూత్రం ఉంది.
చరకుడనే మహర్షి వ్రాసిన ఈ వైద్య గ్రంథం 2,500 యేళ్ళ క్రితం నాటి బౌద్ధ యుగానికి చెందిందని భావిస్తున్నారు.
అంతటి ప్రాచీన కాలంలోనే చరకమహర్షి చెప్పిన ప్రతి అక్షరం అత్యాధునికమైన నేటి కాలానికి వర్తించేదిగా ఉండటం ఆశ్చర్యకరం. సర్వే శరీర దోషా భవన్తి: సమస్త శరీర దోషాలు ఈ క్రింది కారణాలవలన కలుగుతాయంటాడాయన:
గ్రామ్యాహారాత్ అమ్ల, లవణ, కటుక, క్షార, శుష్క, శాక, మాంస, తిలపలల పిష్టాన్న భోజినాం: గ్రామ్యాహారం- గ్రామ శబ్దానికి పల్లెలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, మహా నగరాలు అని అర్థం. వీటిలో నివసించే ప్రజలు కృత్రిమ ఆహార విహారాలకు అలవాటు పడి ఉంటారు కాబట్టి, అలాంటి ఆహారాన్ని గ్రామ్యాహారం అన్నాడు.
 పుల్లని పదార్థాలు, అతిగా ఉప్పూ, కారాలు, రంగులు రసాయనాలూ కలిసిన క్షారాలు, తాజా దనం కోల్పోయిన శుష్కమైన ఆకుకూరలు, కూరగాయలు, వివిథ జంతుమాంసాలు, తిలపలలం అంటే నూనె తీసేసిన తెలికిపిండి లాంటి ద్రవ్యాలు, పిష్టాన్నం అంటే అతిగా పిండిపదార్థాలు వీటిని భోజనంగా స్వీకరించటం అనేది పట్టణ నాగరికతలో కనిపించే ఒక సొగసు-ఫ్యాషన్! అదే వ్యాధులు తెచ్చి కొంప ముంచుతోందంటాడు చరకుడు.
ఇక్కడ రెండు విషయాలు చర్చించవలసినవి ఉన్నాయి. శుష్క పదార్థాలను వద్దని చెప్పగానే మనం ఫ్రిజ్జులో పెట్టుకునే పదిల పరుస్తున్నాం అనీ, పాడైపోకుండా, ఎండి పోకుండా శీతలీకరణ పద్ధతుల్లో జాగ్రత్త చేస్తున్నాం అనీ, చరకుడు చెప్పింది ఆకాలానికే గానీ ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానం అందుబాటులో ఉన్న మనకు కాదనీ, వాదిస్తాం. కానీ ఫ్రిజ్జులోనూ, శీతలీకరణ ప్రక్రియలోనూ కూరగాయల్లోపల అంతర్గతంగా జరిగే శ్వాసప్రక్రియ ఆగదు. కాబట్టి, ఫ్రిజ్జులో బెండకాయలు, దొండకాయలూ వగైరా ముదిరి పోకుండానూ పండిపోకుండానూ ఉంటాయనుకోవటం భ్రమ. బాక్టీరియా ఫ్రిజ్జులో నిస్తేజంగా ఉంటుంది కాబట్టి, కుళ్ళిపోక పోవచ్చు గానీ, చరకుడు చెప్పిన శుష్కత్వాన్ని ఆపలేదు. నిజమైన తాజాదనాన్ని ఇవ్వలేదు.
ఇంక రెండో ప్రమాదకర మైంది పిండిమయంగా ఉన్న ఆహారపదార్థం. ఇది కష్టంగా అరుగుతుంది. అరుగుదల దెబ్బ తిన్నందువలన అనారోగ్యా లేర్పడతాయి. మనుషులందరి జీర్ణ శక్తీ ఒకే స్థాయిలో ఉండదు. కొందరు పర్వతాలు ఫలహారం చేయగలిగే వారుగా ఉంటారు. కొందరికి ఆ ఊళ్ళో నీళ్ళు పడలేదండి...అంటారే, అలా అత్యంత అల్ప జీర్ణశక్తి ఉంటుంది. నీళ్ళే అరక్కపోతే శాకమాంసాలేం అరుగుతాయీ...? జీర్ణశక్తి ననుసరించి అది అరిగించగల ఆహార పదార్ధాలను ఎంచుకుని తినాలని చరకుడు సూచించాడు.
 పిష్ఠాన్నం నైవ భుంజీత అని సుశ్రుతుడనే వైద్యుడు కూడా హెచ్చరించాడు. పొరబాటున కూడా పిండి పదార్ధాలను తినకండీ అని ఈ సూత్రానికి అర్థం. ఒకవేళ తినవలసి వచ్చినా, కొద్ది పరిమాణంలో తినండి తిన్న తరువాత రెండురెట్లు నీళ్ళు త్రాగండి అన్నాడు. చరక సుశ్రుతులిద్దరూ ఇంచుమించు ఒకే కాలానికి చెందిన ఆయుర్వేద శాస్త్ర ప్రవర్తకులు.
పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను పిష్టాన్నం అంటారు. వీటిని అతిగా తినటం వలన చాలా వ్యాధులు వస్తున్నాయి. ప్రొద్దున టిఫినుతో పిండిపదార్థాలు తినటం అనే ఒక ఉద్యమాన్ని మనం మొదలెడతాం. మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, బఠాణీ పప్పు, అలచందల్లాంటి పిండి ధాన్యాలతో చేసిన పిండివంటలు మనకు ప్రధాన ఆహారం అయ్యాయి. ప్రొద్దున్న పూట మెతుకు తగలకూడదనే ఒక భావన ఎలా ఏర్పడిందో గానీ అది జనాల్లో బాగా నాటుకు పోయింది. ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, గారె, మైసూరు బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న పిండి వంటలకు మనం దాసులమై పోయాం. ఏ వ్యాధికి మూలకారణం వెదికినా టిఫిన్ల విషయంలో మార్పు చేసుకోవాల్సిన అవసరాన్ని అది హెచ్చరిస్తుంది.
మనవాళ్ళు మొన్న మొన్నటి దాకా అంబలి, సంకటి లాంటి వాటిని ఉదయం అల్పాహారంగా తీసుకునే వాళ్ళు! మనం అనుకుంటాం... మన పూర్వులు తిండికి గతిలేని వాళ్ళు, డబ్బున్నా అనుభవించటం తెలీని వాళ్ళు, నాగరికత లేని పల్లెటూరు బైతులు... అని! కానీ, వాస్తవం ఏవంటే షష్టి పూర్తి, సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వాళ్ళ సంఖ్య ఇప్పటి మనకన్నా పెన్సిలిన్ కనుక్కోక పూర్వం జీవించిన వారిలోనే ఎక్కువ. ఎందుకంటే ఆనాటి ప్రజలకు ఇడ్లీ, అట్టు, గారె, పూరీ, ఉప్మా, మైసూరు బజ్జీల్ని ఉదయాన్నే మఠం వేసుకుని కూర్చుని తినటం తెలియదు కాబట్టి!
శ్రీనాథుడు దమయంతీ స్వయంవరాని కొచ్చిన అతిథులకు వడ్డించిన మధ్యాన్న భోజనంలో మెనూలిష్టు ఒకటి ఇచ్చాడు. వాటిలో ఇడ్డెనులూ, దోసియలూ ఉన్నాయి. అంతేగానీ, అతిథుల్ని ప్రొద్దున్నే టిఫినుకు పిలిచి వీటిని వడ్డించినట్టు వ్రాయ లేదు. టిఫిన్లు మనకు సరిపడే ఆహార అలవాటు కాదు!
మరి, ఆ రోజుల్లో ప్రొద్దున్నే బ్రేక్ఫస్ట్ ఏవిటీ అనేది మంచి ప్రశ్న: అంబటేళ అంటే ప్రొద్దున్నే అంబలి తాగే వేళ అని అర్థం. అదీ సంగతి! చిక్కటి గంజి, జావ, ముద్ద, వీటిని రాగి, జొన్న సజ్జ, ఉలవల్లాంటి ధాన్యాలతో తయారు చేసుకుంటే కడుపు నిండు తుంది కేలరీలు పెరగవు. జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది. కావాలంటే గంజీ, అంబలి అనకుండా సూపూ, పారిడ్జి, ఓట్మీల్ లాంటి ఇష్టమైన పేరు పెట్టుకుంటే భాషా ద్రోహం జరిగినా ఆరోగ్య క్షేమం దక్కుతుంది కదా!

కాబట్టి, పిండి పదార్ధాలను అనగా మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు వగైరా పిండి ధాన్యాలను సరదాగా జన్మానికో శివరాత్రి అన్నట్టు తీసుకో గలిగితే మనమూ సహస్ర చంద్ర దర్శనం చేసుకో గలుగుతాం. ఎవరు చూశారు మూడు యాబైలు? అనడిగాడు శ్రీశ్రీ. వెయ్యి చంద్రుళ్ళను చూశా ననిపించుకుంటే మూడు యాబైలు దాటినట్టే!  

ఆరొందల యేళ్ళనాటి తెలుగు రుచులు :: డా. జి వి పూర్ణచందు

ఆరొందల యేళ్ళనాటి తెలుగు రుచులు
డా. జి వి పూర్ణచందు

మరీచి ధూళీ పాళి పరిచితంబులు మాణి/బంధాశ్మ లవణ పాణింధమములు
బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు/పటురామఠామోద భావితములు
తింత్రిణీక రసోపదేశ దూర్ధురములు/జంబీర నీరాభి చుంబితములు
హైయంగవీన ధారాభిషిక్తంబులు-లలిత కస్తుంబరూల్లంఘితములు
శాకపాక రసావళీ సౌష్టవములు
భక్ష్యభోజ్య లేహ్యంబులు పానకములు
మున్నుగా గల యోగిరంబులు సమృద్ధి
వెలయగొని వచ్చె నొందొండ విధములను
గుణనిథి భ్రష్టుడయ్యాడు. ఉన్న ఊరు వదిలేసి పారిపోయాడు. దారిలో ఓ శివాలయం కనిపించింది. అక్కడో భక్తుడు తెల్లవారుఝామున నైవేద్యం పెట్టటానికి ఘుమఘుమల వంటకాలు సిద్ధంగా ఉంచాడు. నైవేద్యం పెట్టే సమయం అవుతోంది. ఒకవైపు శివభజన జరుగుతోంది. గుణనిథి కాసేపు భజనలో కూచున్నాడు. ఆకలి మీద ఉండటంతో, సందు చూసుకుని ఆ వండిన పదార్థాలు దొంగతనం చేద్దామని గర్భాలయంలో దూరాడు. అక్కడ దీపం వత్తి కొండెక్కుతోంది. తన బట్ట చింపి వత్తిని చేసి వెలిగించాడు. ఆ వెలుగులో కనిపించిన వంటకాలను ఈ పద్యంలో వర్ణించాడు శ్రీనాథుడు:
1.                  మరీచి ధూళి పాళి పరిచితాలు: మిరియాలపొడి చల్లి తయారు చేసిన ఆహార పదార్థపు పోగు. ఇది హాటు వంటకం
2.                  మాణిబంధాశ్మ లవణ పాణింధమములు: మాణిబంధం అంటే సైంధవలవణం అని అర్థం. దాన్ని ఇంకా నొక్కి చెప్పటానికి అశ్మలవణం అని కూడా అన్నాడు. అశ్మ అంటే రాయి. పాణింధమం అంటే చేతులతో నొక్కి చేసిన పిండివంట. బియ్యప్పిండి లేదా జొన్నపిండిలో తగినంత ఉప్పు వేసి ముద్దగా కలిపి, అందులో శనగపప్పు లేదా పెసరపప్పు నానబెట్టి కలిపి బోర్లించిన తప్పాల మీదగానీ, పెనం మీద గానీ చేతులతో వత్తి కాల్చిన అట్టుని తప్పాలచెక్క అంటారు. ఈ పాణింధమం అలాంటి వంటకమే కావచ్చు. ఇది సాల్ట్ వంటకం.
3.                  బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు: సిద్ధార్ధం అంటే ఆవాలు. జంబాలం అంటే అడుసు. ఈ పదాన్ని ఇక్కడ కూరల్లో గ్రేవీ అంటామే దానికి అన్వయించి ఉంటాడు శ్రీనాథుడు. బహుళ సిద్ధార్ధ జంబాల సారాలు అంటే ఆవపిండి గ్రేవీ ఎక్కువగా ఉండే ఆవడల్లాంటి అనేక వంటకాలు.
4.                  పటు రామఠామోద భావితములు: ఇంగువకు అనేక వందల రెట్లు పిండిని కలిపి అమ్ముతుంటారు. ఒరిజినల్ ఇంగువ ఆమడ దూరం నుండే ఆ వాసన తెలిసేంత ఘాటుగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఇంగువ చెట్లు పెరిగే దేశాల దేశాల  పేర్లతోనే రామఠం, బాహ్లీకం అంటూ ఇంగువను పిలుస్తారు. పటు రామఠా మోద భావితములు అంటే, బాగా నాణ్యమైన ఇంగువ ఘుమాయించే వంటకాలు అని!
5.                  తింత్రిణీక రసోపదేశ దూర్ధురములు: చింతపండు రసం బాగా కలిపి చేసిన మెండైన వంటకాలు
6.                  జంబీర నీరాభి చుంబితములు: నిమ్మరసం పిండిన వంటకాలు
7.                  హైయంగవీన ధారాభిషిక్తంబులు: హైయంగవీనం అంటే తొలినాటి ఆవుపాల వెన్నని కరిగించిన నెయ్యి అని కొందరు, ఏ
రోజు పెరుగు ఆరోజే చిలికి తీసిన వెన్నను కరిగించిన నెయ్యి అని మరికొందరూ చెప్తారు. సద్యోఘృతం లేదా తాజా నేతిని ధారగా పోస్తే, ఆ నేతిలో మునిగితేల్తున్న వంటకాలు
8.                   లలిత కస్తుంబరూల్లంఘితములు: లలిత కస్తుంబరు లేదా కొత్తింబరు అంటే లేత కొత్తిమీర. బాగా పరిమళించేలా   
           కలిపిన వంటకాలు.  
9.                   శాకపాక రసావళీ సౌష్టవములు: వండినతరువాత, వండకమునుపుకూడా సౌష్టవం కలిగిన కూరగాయలతో చేసిన రుచికరమైన కూరలు.
10.              భక్ష్యభోజ్య లేహ్యంబులు పానకములు: భక్ష్యాలు (కొరికి తినవలసిన పిండివంటలు), భోజ్యాలు (నమిలి మింగవలసిన అన్నమూ, కూరలు వగైరా), లేహ్యాలు (చప్పరిస్తూ తినవలసిన హల్వా, కేసరి లాంటివి), చోష్యాలు(చూష్యాలు-పీలుస్తూ సేవించే పులుసు చారు వగైరా), పానీయాలు(పాయసాలు, కీరు,సూపు వగైరా) ఇలా ఐదు రకాల ఆహార పదార్థాలు. మన భోజన విధానంలో కనిపిస్తాయి.
ఈ పద్యంలో తెలుగువారి రోజువారీ వంటకాలను ప్రస్తావించాడు శ్రీనాథుడు. ఉల్లంఘితములు, అభిచుంబితములు, దూర్ధురములు లాంటి పదాలను అవలీలగా ప్రయోగించేశాడాయన.  
తెలుగు భోజనంలో గొప్పతనం గురించి రకరకాల కొత్తవంటకాల గురించి శ్రీనాథుడు చాలా విషయాలు చెప్పాడు. వాటిని ఇప్పటికీ మనం పేర్లు మార్చుకుని వాడుకుంటున్నాం.
శ్రీనాథుడి కారణంగా తెలుగు వారి ఆహార సంస్కృతిలోని ప్రత్యేకత పదిలంగా కనిపిస్తోంది.