భాషకు ‘అయినవాళ్లు’:: డా. జి వి పూర్ణచందు
అమృతమహాంబురాసి తెలుగై మఱి భాగవతమ్మునై త్రిలిం
గమునకు డిగ్గెనేమొ యనఁగా హృదయమ్ముల నాడు నేడు నా
ట్యము లొనరించు పోతన మహాకవి ముద్దుల పద్యముల్ శతా
బ్దము లయిపోవుగాక మఱవన్ తరమే రసికప్రజాళికిన్. - దాశరథి
“స్వర్గంలో ఉండే అమృత మహాసముద్రం త్రిలింగదేశానికి దిగివచ్చిందా అన్నట్టు తెలుగుభాషగా, ఆ
పైన తెలుగు భాగవతంగా మారింది. బమ్మెర పోతనామాత్యుల ముద్దులొలికే మధుర పద్యాలు వందలయేళ్లు గడిచినా ఆనంద తాండవాలు చేస్తూనే ఉన్నాయి. రసహృదయులెవరైనా వాటిని మరచిపోవటం సాధ్యమా?” అంటాడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య!
తెలుగు భాషని స్వర్గంలోంచి దిగివచ్చిన అమృతంతో పోల్చాడు తెలుగువారి ఆస్థానకవి. ఆ
భాషని సుసంపన్నం చేసిన పోతనకవి ముద్దులొలికే పదాలను తన
పోలికకు సాక్ష్యంగా చెప్పుకున్నాడు. ముద్దులొలికే పదాలతో తనను తానే సాక్షిని చేసుకున్న మహాకవి ఆయన.
అంతటి ‘అమృతమహాంబురాసి’ అయిన తెలుగు భాషకి నేడు దిక్కులేని పరిస్థితి దాపురించింది. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహాలు అన్నట్టే ఉంది పరిస్థితి.... నానాటికీ తీసికట్టుగా!
2000 మిలీనియం సంవత్సరంలో తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణల కోసం రాజకీయ చైతన్యం కలిగించాలనే ప్రయత్నాలకు అంకురార్పణ జరిగింది. మొదటి దశాబ్దికాలంలో తెలుగు భాషోద్యమం రూపుకట్టుకుని ప్రజల గుండె తలుపులు తట్టడం ప్రారంభించింది. మా
పిల్లలకు తెలుగు రాదండీ...పుడుతూనే ఇంగ్లీషు మాట్లాడేశారు అని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు కొద్దికొద్దిగా మారుతూ వచ్చారు.
ఇప్పుడు తమ
పిల్లలకు తెలుగు పద్యాలు, తెలుగు వ్రాయటం, చదవటం కూడా నేర్పిస్తున్నామనీ అనటం మొదలు పెట్టారు. ఏ
అమెరికాలోనో ఉన్న తెలుగు తల్లిండ్రులు తమ పిల్లలకు ఉత్సాహంగా తెలుగు నేర్పించినంత సంబరంగా తెలుగు నేల మీద ‘అచ్చతెలుగు’ పిల్లలకు తెలుగు “కూడా నేర్పించటం” ఒక
గొప్ప అయ్యింది. నిజానికి ఇక్కడికి ఇదే గొప్ప. వీళ్లు అంతకు మునుపు తెలుగే అవసరం లేదన్న పేరెంట్లు కదా!
2004 ఎన్నికల్లో డియంకే సహాయంతో గద్దె నెక్కిన కాంగ్రెస్ గద్దలు నజరానాగా తమిళానికి 1000
సంవత్సరాల ప్రాచీనత కలిగిన భాష అని ముద్రవేసి క్లాసికల్ భాషా ప్రతిపత్తి ఇచ్చి సంవత్సరానికి 100
కోట్లు చొప్పున ముట్టజెప్పే ఏర్పాటు చేశారు. 2004 వరకూ తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర అనేవి నిరర్థకమైన సబ్జెక్టులుగా భావించే వ్యక్తుల ఏలుబడిలో ఉన్న కాలంలో భాషకు జరిగిన పరాభవాలతో రగిలిపోతున్న తెలుగు హృదయం మీద ఈ
కేంద్రప్రభుత్వ నిర్ణయం ఆజ్యంపోసి కారం పూసింది.
తెలుగు భాషకు కూడా ప్రాచీనతా హోదా ఇవ్వాలని ప్రతీ తెలుగువాడూ కోరటంతో ప్రాచీనతా ప్రమాణాలను పెంచి, 2000 సంవత్సరాలుగా ఈ
భాష ఉన్నట్టు నిరూపణలుంటేనే క్లాసికల్ భాషగా గుర్తిస్తామని కేంద్రం ప్రకటించింది. నిరూపించే ప్రయత్నంతో ఒక్క విశ్వవిద్యాలయమూ ముందుకు రాకపోవటమే కొసమెరుపు. ఈలోగా 1500
సంవత్సరాల ప్రాచీనతతో సంస్కృత భాషకు క్లాసికల్ హోదా ప్రకటించారు.
2008లో
నాటి ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి “ప్రాచీనతాహోదా సాధకసమితి” అనే ‘టాస్క్ ఫోర్స్’ ని
ఏర్పాటు చేయటం, 42 మంది తెలుగు ఎంపీలు రాష్ట్రపతిని కలిసేలా చేయటం ఆనాటి విజయాలు. బుద్ధప్రసాద్, లక్ష్మీప్రసాద్ ప్రభృతులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. చివరికి 2008
అక్టోబరు 31
సాయంత్రం మానవవనరుల మంత్రిణి అంబికా సోనీ తెలుగు కన్నడ భాషలకు క్లాసికల్ హోదా ప్రకటించింది.
ఇదంతా జరిగి పుష్కరకాలం అవుతోంది. మాతృభాషాభిమానం జనసామాన్యానికి లేకపోతే ప్రభుత్వాలకూ, ప్రభువు లకూ భాష గురించి ఏమీ పట్టకుండా పోతుందని తరువాతి ఏలికలు సగర్వంగా నిరూపించారు. క్లాసికల్ హోదా ఫలాలు పైసా కూడా అందుకోలేని స్థితిలోకి మనల్ని నెట్టేశారు. పాఠ్యాంశాలలో తెలుగు ఉంటే ఒప్పని విద్యాసంస్థల పెత్తందారీ విధానాలు తెలుగు భాషకు తీరని అన్యాయం చేశాయి.
ప్రభుత్వాలే వివిధ పథకాలకు ఇంగ్లీషు పేర్లు పెట్టటం, ఆఖరికి దేవుడి గుళ్లలో కూడా విఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనా లంటూ ఆంగ్లమయం చేయటం, మీడియాలో తెలుగు ఖూనీ కావటం, మాతృభాషని అభిమానించేవారిని ‘మదర్ టంగ్ మానియాక్స్’ అంటూ ఈసడించటం ఇవన్నీ ఆనవాయితీగా మారాయి.
క్లాసికల్ హోదా
పొందిన తెలుగు భాషకి ఏడాదికి 100 కోట్లు చొప్పున
ఇప్పటికి 1200
కోట్లు
రావాలి.
పరిశోధనలు, భాషాప్రాభవాన్ని, ప్రాచీనతను
నిరూపించేందుకు,
ఆధునీకరించేందుకు, ప్రపంచ
తెలుగుగా విశ్వవ్యాప్తి చేసేందుకు వివిధ విశ్వవిద్యాలయాలకు, పరిశోధనా
సంస్థలకు,
పరిశోధకులకు
ఉద్ధేశించిన ఫండింగ్ ఇది. సంబంధిత వ్యవస్థలుగానీ, వ్యక్తుల్లో
స్పందన లేకపోవటాన కోట్లాది నిధులు భాషకు దక్కకుండా పోయాయి.
డబ్బు సంగతి సరే, కనీసం
తెలుగు క్లాసికల్ పీఠాన్నయినా తెలుగు నేలమీదకు
తరలించుకు రాలేకపోయారు. పాలకుల నాలుకలమీద తప్ప మనసులో మాతృభాష
లేకపోవటమే ఇందుకు కారణంగా ప్రజలు భావించే పరిస్థితి. .
దేశంలో హిందీ తరువాత పెద్దభాష గా
ఉన్న తెలుగు భాష మూడవ స్థానానికి పడిపోతున్నా గతపాలకులు ఎరగనట్టు వదిలేశారు. భాష కోసం వచ్చే నిధుల్ని నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వంతోపాటు విశ్వవిద్యాలయాలూ, సంబంధిత సంస్థలూ కూడా ఈ
నిర్లక్ష్యానికి బాధ్యులే! మాతృభాషకు, తెలుగుజాతికీ జరుగుతున్న నష్టంగా దీన్ని గుర్తించటం లేదెవరూ!
గడిచి...పోయింది కాబట్టి గతం అన్నారు. వర్తమానంలో కొత్త ప్రభుత్వం వచ్చింది.
అన్ని స్కూళ్లనూ ఇంగ్లీషుమీడియం స్కూళ్లుగా మార్చేసి తెలుగు పాఠ్యాంశాన్ని మాత్రం కొనసాగిస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ప్రాధమిక విద్యను మాతృభాషలో నేర్వటం విద్యార్థి హక్కు అని యనెస్కో ప్రకటించిన అంతర్జాతీయ సూత్రం బహుశా ఈ విద్యారంగ వ్యూహకర్తల దృష్టిలో లేకపోయి ఉండాలి. లేదా వీళ్లూ కావాలనే నిర్లక్ష్యం చేస్తూ ఉండాలి.
విస్తృతమైన జాతి ప్రయోజనాల రీత్యా ఈ విఙ్ఞప్తిని పట్టించుకోవాలని, ఆగిపోయిన భాషాభివృద్ధి కార్యాచరణకు పదును పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తిస్తుందని ఎదురు చూస్తోంది భాషోద్యమం.
యునెస్కో వారు 2019ని అంతర్జాతీయ మాతృభాషల సంవత్సరం (International year of
Indigenous Languages) గా
ప్రకటించారు. తెలుగు నేలమీద రెండు రాష్ట్రాల్లోనూ కొండ, కోయ, కుయి, గడబ, గోండి, సవర లాంటి మాతృభాష లనేకం ఉన్నాయి. బంజారా ప్రజలు, ఉర్దూ మాట్లాడే ప్రజలు కూడా తెలుగు నేలమీద తెలుగు ప్రజలుగానే జీవిస్తున్నారు. ాఅయా మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణల బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీదా ఉమ్మడిగా ఉంది.
అన్ని సంక్షేమాలతో పాటు భాషా సంక్షేమాన్ని కూడా పట్టించుకునే పాలకులే భాషకు ‘అయినవాళ్లు’. చరిత్రలో సుస్థిరంగా ఉండేది వీళ్లే! ‘కానివారి’ గురించి పలికేందుకు ఏమీ ఉండదు.
మారిన ప్రభుత్వం భాష స్థితిని కూడా మారుస్తుందని నమ్ముతున్నాను.
(నా పద్యానుభవం శీర్షిక విశాలాంధ్ర ఆదివారం సంచిక)