ఉగాది పచ్చడి
డా|| జి. వి. పూర్ణచందు,9440172642
“అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్” (ధర్మసింధు)
“సంవత్సరం మొదటి రోజు ప్రొద్దున్నే వేపపూవు, పంచదార, చింతపండు, నెయ్యి కలిపిన
ప్రసాదాన్ని తింటే ఆ ఏడాదంతా సౌఖ్యదాయకంగా
ఉంటుంది” అంటుంది ఈ ఆర్యోక్తి. ప్రొద్దున్నే తలంటుకుని, కొత్త సంవత్సరం అంతా శుభం
కలగాలని ప్రార్థించుకుని, పరగడుపున ఈ వేపపూల ప్రసాదాన్ని తిని, ధ్వజారోహణం, పంచాంగ
శ్రవణాలు చేయాలని ధర్మసింధు గ్రంథం చెప్తోంది. తెలుగు భాషా సంస్కృతుల ప్రాభవాన్ని
చాటే పండుగ ఇది. అందుకని ధ్వజారోహణం అనే పదానికి తెలుగు జెండా ఎగరేయటం అని భాష్యం
చెప్పుకోవాలి
తీపి
కోసం బెల్లం లేదా పంచదారని, పులుపు కోసం చింతపండు లేదా ఇంకేదైనా పుల్లని ద్రవ్యాన్ని,
ఉప్పదనం కోసం సైంధవ లవణాన్ని, కారం కోసం మిరియాల పొడిని, వగరు కోసం లేత మామిడి వడపిందెల్ని,
చేదు కోసం వేపపువ్వుని కలిపి ఈ పచ్చడిని తయారు చేసుకుంటున్నాం. నెయ్యి కూడా
కొద్దిగా కలపాలంటూన్నారీ శ్లోకంలో! నెయ్యి చేరిస్తే, ఏ ఆహార పదార్ధమైనా సౌమ్యంగా పనిచేస్తుంది. ‘అశోకకళికాప్రాశనం’
అంటే అశోక (నరమామిడి చెట్టు) పత్రాలతో కూడా ఒకప్పుడు ఉగాది పచ్చడి చేసేవారు
కాబోలు.
ఉత్తరాది వారి ‘హోలీ’, మహారాష్ట్రుల ‘గూడీపాడవా’, అస్సామీల
‘రొంగాలిబిహూ’, తమిళుల ‘పుత్థాండు’, మళయాళీల ‘విషు’, మణిపూరి వారి ‘చైరావోబా’,
కాశ్మీరీల ’నప్ రే’, గుజరాతీయుల ‘బేస్తువారాస్’, రాజస్థానీయుల థప్న, సింధ్రీల
’చేతి చాంద్’ హిమాచలప్రదేశ్ వారి ‘చైత్తి’, పంజాబీల వైశాఖి, నేపాలీల పహ్లీ వైశాఖి
ఇవన్నీ ఆయా భాషీయుల సంవత్సరాది పండుగలు. వాటిని వాళ్లు తీపి భక్ష్యాలతో
చేసుకుంటారు. తెలుగువారి ఉగాదికి వేపపూల ప్రసాదమే ప్రధానం. చేదు రుచి ప్రాధాన్యతని
గుర్తింపచేయటమే మనవారి ఆంతర్యం. తమిళులు మాత్రం మామిడికాయ పచ్చడి అంటారు. మనం
వేపపూల పచ్చడి అంటాం.
ఆరు రుచులూ తగు నిష్పత్తుల్లో ఉంటేనే అది షడ్రసోపేతమైన
భోజనం. పులిహోరనే తీసుకోండి. అందులో కేవలం పులుపు, ఉప్పు, కారం మాత్రమే కలిపితే
అది ఆరోగ్యానికి చెడు చేస్తుంది. వగరు, చేదు రుచుల కోసం కొద్దిగా ఆవపిండిని, మెంతిపిండిని,
తీపి కోసం కొంచెం బెల్లాన్ని కలిపితే ఆ పులిహోర రుచి పెరగటమే కాకుండా
ఆరోగ్యాన్నిచ్చేదిగా ఉంటుంది. ఆరు రుచులూ లేకుండా కేవలం పులుపు, కేవలం కారం, కేవలం
తీపి ఇలా తినవద్దని ఈ ఉగాది ప్రసాదం మనకు సూచిస్తోంది.
ఆధునిక వైద్య శాస్త్రం విటమిన్లు, ఖనిజాలు, లవణాల్లాంటి
పోషకాల తూకాన్ని బట్టి ఆహార ద్రవ్యాల పోషక విలువల్ని లెక్క గడుతుంది. ఇది ఒక
పద్ధతి. ఆరు రుచుల సిద్ధాంతాన్ని అనుసరించి ఆయుర్వేద శాస్త్రం తీపి, పులుపు,
ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ ఉంటేనే అది పోషక ఆహారం అవుతుందని చెప్తుంది.
ఈ వైద్యరహస్యాన్ని ఉగాది ప్రసాదం గుర్తు చేస్తోంది. ఆంగ్లేయ విధానంలో పోషకాల
కొలతలు, ఆయుర్వేదీయ విధానంలో ఆరు రుచుల కొలతల్ని పోల్చి చూస్తే, రెండూ సమానమే
అవుతాయి. శాకాహార పదార్ధాల్లో కార్బోహైడ్రేట్లే తీపి రుచిని అందిస్తాయి. అలాగే ఇతర
రుచులకు వాటిలోని విటమిన్లు ఖనిజాలు, లవణాలు వగైరా ఆయా ద్రవ్యాలకు ఆ రుచుల్ని
ఇస్తున్నాయి. మన భోజనంలోనూ, భోజన పదార్ధాలలోనూ ఆరు రుచులూ ఉండేలా చూసుకుంటేనే మనం
షడ్రసోపేతమైన ధనిక, పోషక భోజనం చేసినట్టవుతుంది.
ఏడాది పొడవునా వేపపూలను అన్నంలో తినటానికి ప్రభావంతమైన ఒక
ఫార్ములా చెప్తాను: 1 చెంచా ఇంగువ, 2 చెంచాల అల్లం
ముద్ద, 4 చెంచాల మిరియాల పొడి, 8
చెంచాల జీలకర్ర, 16 చెంచాల పసుపు, 32 చెంచాల ధనియాలపొడి, అంతే కొలతలో అంటే 32
చెంచాలు ఎండించిన వేపపూల పొడి, వీటికి తగినంత
ఉప్పు చేర్చిన కారప్పొడి రుచిగా ఉంటుంది. శరీరంలో విషదోషాలను పోగొడుతుంది. టానిక్కులా
శక్తిదాయకంగా ఉంటుంది. జీర్ణశక్తిని పదిలం చేస్తుంది. చేదురుచి ప్రాధాన్యతని
గుర్తించగలిగితే ఉగాదులన్నీ మనకు ఉషస్సులే! *