Friday, 31 October 2014

అజీర్తిని జయించే ఆహారం డా. జి వి పూర్ణచందు

అజీర్తిని జయించే ఆహారం

డా. జి వి పూర్ణచందు

అజీర్తి కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గటానికి ఒకటీ లేదా రెండు వెల్లుల్లి గర్భాల్ని నమలకుండా మింగేయండి. ఫలితం కనిపిస్తుంది.
అజీర్తి నివారణకు ఒక ఫార్ములాని చెప్తాను. దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకుని ఎప్పుడు అజీర్తి  అనిపించినా తీసుకుంటూ ఉండటం మంచిది. కరక్కాయలు బాగా ఎండినవి మనకు బజార్లో దొరుకుతాయి. ఈ కాయని పగలగొడెతే లోపల గింజ ఉంటుంది. ఆ గింజను తీసేసి, కరక్కాయ బెరడు మాత్రమే మనకు కావాలి. వంద గ్రాముల కరక్కాయల్లో గింజతీసేస్తే షుమారు యాబై గ్రాముల బెరడు మిగుల్తుంది.  ఈ బెరడుకు సమానంగా పిప్పళ్ళను, సౌవర్చలవణాన్ని తీసుకుని (ఇది దొరక్కపోతే సైంధవ లవణం)మూడింటినీ మెత్తగా దంచిన పొడి అరచెంచా మోతాదులో మ్తీసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే అజీర్తి బాధలు తగ్గతయ. మంచ జీర్ణశక్తి కలుగతుంది. దీన్ని అజీర్ణహర చూర్ణం అని పిలుస్తారు.
ఇలాంటిదే ఇంకో ఫార్ములా కూడా ఉంది. సైంధవలవణం కరక్కాయ బెరడు, పిప్పళ్ళు, వాము, శొంఠి ఈ ఐదూ పచారీ షాపుల్లో దొరికేవే! వీటన్నింటినీ మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. కడుపులో బాగో లేదనిపించినప్పుడు, అజీర్తికర మైనవి తిన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడూ ఈ పొడిని అరచెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి తాగండి. పొట్ట బాగౌతుంది.
అజీర్తి వలన వచ్చే కడుపులో నొప్పి తగ్గటానికి, ఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి కాయండి. బోజనం చేసిన తరువాత కడుపులో నొప్పి వస్తున్నవారికి ఈ ఉప్పు వేసిన నేతిని మొదటి ముద్దగా కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది.
అజీర్తి, జీర్ణకోశానికి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా సరే, వసకొమ్ముని దంచిన పొడి చిటికెడు తీసుకుని చిక్కని బ్లాక్ టీ లాగా కాచుకుని తాగితేమేలు చేస్తుంది. కఫం తగ్గుతుంది. జ్వర తీవ్రత తగ్గుతుంది. విషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. మొలలున్న వారికి ఉపశాంతినిస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. మలబద్ధకాన్ని హరిస్తుంది. ఉబ్బసంలో వచ్చే దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. అతిగా తాగితే వికారం కలిగిస్తుంది. స్వల్ప ప్రమాణంలో తీసుకోవాలి.
అజీర్తిని జయించే వాటిలో బిరియానీ ఆకు గొప్పది. ఆకుపత్రి అంటారు దీన్ని. బిరియానీలోనో పలావులోనో కలుపు తుంటారు. మషాలా ద్రవ్యాలలో ఇది నిరపాయకరమైంది. ఆరోగ్యాన్నిచ్చేది. ఈ ఆకులు కూడా కలిపి మషాలా ద్రవ్యాలను తయారు చేసుకుంటే, అజీర్తిని జయించినట్టే!మలబద్ధతని సరి చేస్తుంది. కడుపులో నొప్పిని హరిస్తుంది. పైత్యాన్ని పోగొడుతుంది. బాలింతలకు తల్లిపాలు పెరిగేలా చేస్తుంది. కడుపులో వాతం, గ్యాసూ, ఉబ్బరం, దుర్గంధతో కూడిన అపాన వాయువులు, దుర్గంధంతో కూడిన విరేచనం ఆగుతాయి. నోటి దుర్వాసన పోతుంది. అల్లం వెల్లుల్లి తగ్గించి, ఆకుపత్రినీ, దాల్చిన చెక్కనూ వాడుకుంటూ ఉంటే మంచిది. బియ్యపు నూకను దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

జీర్ణశక్తి మందంగా ఉన్నవాళ్ళు దంపుడు బియ్యాన్నో లేక ‘పట్టు తక్కువ’ బియ్యాన్నో తినటం వలన జీర్ణాశయవ్యవస్థ మరింత దెబ్బతింటుంది. గోధుమలూ రాగులూ, సజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండుకుంటాం. వీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూ, తవుడూ వగైరా తీసేయటం ఉండదు. కాబట్టి, దంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూ, రాగులూ సజ్జలూ  వగైరా తృణ ధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిది. జీర్ణాశయం బలగా లేదనుకున్నప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను వండుకుని తింటే పేగులు చెడకుండా ఉంటాయి.
బార్లీ జావ, సగ్గుబియ్యం జావ, పేలాలు, మరమరాలు(బొరుగులు) ఇలాంటివి జీర్ణశక్తిని కాపాడతాయి. అజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవటం మంచిది. షుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలు, జొన్న అటుకులు చాలా మేలు చస్తాయి.
పెసర పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి కాచిన కట్టులో మిరప కారానికి బదులుగా మిరియాల పొడిని కలుపుకుని అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది.
లేత ముల్లంగి దుంపల జ్యూసు రోజూ ఉదయం పూట తాగుతూ ఉంటే పేగులకు ప్రశాంతత నిచ్చి జీర్ణశక్తిని పెంచుతుంది.
అజీర్తిని తగ్గించే ఒక ఆహార పదార్ధం అష్టగుణమండం: ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియానీ ఆకు ముక్కలు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు... వీటన్నింటినీ సమభాగం తీసుకుని మెత్తగా దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. బియ్యంలో సగం చాయపెసర పప్పు తీసుకుని నీరు ఎక్కువగా కలిపి జావలాగా కాయండి. ఒక మనిషికి సరిపడిన జావలో  ఈ పొడిని ఒకచెంచా లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి మరికాసేపు కాచి దింపండి. దీన్నే అష్టగుణమండం అంటారు. ఇది అజీర్తిని తగ్గించే గొప్ప ఔషధం. రోజూ తాగినా మంచిదే!
అజీర్తిని పోగొట్టటానికి సూక్ష్మంలో మోక్షంగా పనిచేసే ఇంకో ఉపాయం ఉంది. కొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని అందులో ఉప్పు, మిరియాలపొడి తగినంత కలిపి, రోజూ ప్రొద్దున పూట తాగుతూ ఉంటే అజీర్తి పటాపంచ లౌతుంది. పైత్యం, కడుపులో యాసిడ్, పేగుపత వ్యాధుల్లో మంచిది. కొత్తిమీర మిరియాలపొడి మిశ్రమాన్ని మెత్తగా నూరి తగినంత ఉప్పు కలిపి భద్రపరచుకోండి. అన్నంలో మొదటి ముద్దగా దీన్ని తింటే అజీర్తి కలగదు.
అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచటంలో ఉప్పుని మించిన ఔషధం లేదు. అయితే ఉప్పుని పరిమితంగా ఒక ఔషధంలాగే వాడుకోవాలి. ఎందుకంటే ఉప్పు తగ్గినందు వల్ల ఏర్పడే జబ్బుల్లాగే ఉప్పు పెరిగి నందువలన ఏర్పడే జబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి!  ఉప్పుని ముట్టుకో కూడదన్నట్టు చెప్పటమూ తప్పే! అదే పనిగా తినటమూ తప్పే!
అన్నం తినబుద్ధి కాకపోతున్నప్పుడు బిరియానీ ఆకుని మెత్తగా దంచి మిరియాల పొడి ఉప్పు తగినంత కలిపి  కారప్పొడి చేసుకుని తింటే అన్నహితవు కలుగుతుంది. అన్నహితవు కలగటానికి ప్రతిరోజూ అల్లాన్ని తగినంత ఉప్పు వేసి దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే భోజనంలో ఉండే దోషాలన్నీ పోతాయి. అన్నం తినాలనే కోరిక కలుగుతుంది. అల్లం ఉప్పు కలిపి మెత్తగా నూరి  అన్నంలో ఒక చెంచా మోతాదులో కలుపుకుని నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే అజీర్తి తగ్గుతుంది. అన్నహితవు కలుగుతుంది. భోజనం చేసిన తరువాత భుక్తాయాసం కలగకుండా ఉంటుంది.సిరిక్జాయ తొక్కుడు పచ్చడి(నల్లపచ్చడి)  అల్లం మిశ్రమం కలిపి నెయ్యి వేసుకుని ఒకటీ లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. అజీర్తి లేని వాళ్ళు కూడా ఇది తింటూ ఉంటే జీర్ణ శక్తి పదిలంగా ఉంటుంది.
ఆవపిండి చిటికెడంత కలిపిన వంటకాలను తరచూ తింటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది. 
ఆహార సమయంలో నీటిని మధ్యమధ్య తాగుతూ ఉంటే అజీర్తి తగ్గి, జీర్ణశక్తి పదిలంగా ఉంటూంది. అతిగా నీరు తాగితే జీర్ణశక్తి మందగిస్తుంది.
ఎండిన కిస్మిస్ పళ్ళూ పంచదార, తేనె ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచామోతాదులో రెండు పూటలా రోజూ తీసుకుంటే  కడుపులో బాధలు తగ్గి జీర్ణకోశ వ్యవస్థ ఎంతో పదిలంగా ఉంటుంది.
పిప్పళ్లను దోరగా వేయించి మెత్తగా దంచండి పిప్పళ్ళు మీకు పచారీ కొట్లలో దొరుకుతాయి. లేదా మూలికలమ్మే వారి దగ్గర దొరుకుతాయి. తేలికగా దొరికేవే! ఈ పిప్పలీ చూర్ణానికి ఆరురెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరచుకోండి. జీర్ణ వ్యవస్థ బలంగా లేనివారు దీన్ని ఉదయం రాత్రి ఒక్కక్క మాత్ర చొప్పున తీసుకుంటూ ఉంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది. శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.
పెరట్లో బొప్పాయి చెట్టు ఉన్నవారు చేసుకోగలిగిన ఫార్ములా ఇది: బొప్పాయి చెట్టుకు గాటు పెడితే పాలు వస్తాయి. కొద్దిసేపు కష్టపడితే ఒక చెంచా లేదా రెండు చెంచాల పాలు సేకరించవచ్చు. ఈ బొప్పాయి పాలుంచిన గ్లాసుని వేడి ఇసుకమీద గానీ, సన్న సెగ మీద గానీ ఉంచితే, ఆ వేడికి బొప్పాయి పాలు గడ్డకట్టి పొడిగా అవుతాయి. ఈ పొడిని చిటికెడంత తీసుకుని గ్లాసు పాలలో గానీ, మజ్జిగలో గానీ కలుపుకుని తాగితే ఆకలి పరిగెత్తు కొస్తుంది. ‘పెపైన్’ అనే ఎంజైమును ప్రకృతి సిద్ధంగా పొందేందుకు ఇది మంచి ఉపాయం.
 పైత్యం, అజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడు,  పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది.


లేత అరటికాయల కూరని మిరియాలపొడితో గానీ, కాల్చి పెరుగుపచ్చడిగా గానీ చేసుకుని తింటే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.

భోజన మర్యాదలు డా. జి వి పూర్ణచందు

భోజన మర్యాదలు
డా. జి వి పూర్ణచందు


           `అతిథి దేవో భవ’ అనే సంస్కృతి మనది. అతిథికి వడ్డించి, తినటం పూర్తయ్యాకే గృహస్థు భోజనం 

చేయటంలో ఒక  భక్తి భావం ఉంది. ఇందుకు విరుద్ధంగా ఇంగ్లండులో మొదట గృహస్థు ఆహారాన్ని నోట్లో

పెట్టుకున్నాకే అతిథి  తింటాడు. అది అక్కడి మర్యాద. ఈ మర్యాదలో ఆక్షేపించవలసింది కూడా ఏమీ లేదు. అది 

శబరి భక్తి లాంటిది.  తాను కొరికి తియ్యగా ఉన్న పండునే రాముడికి పెట్టింది. ఇదికూడా ‘అతిథి దేవో భవ’ లాంటి

మర్యాదే!

            ముందు తీపి భక్ష్యాలు, గారెలు వడలాంటి కారపు భక్ష్యాల్ని, తరువాత పరిమితంగా పప్పు, కూర పచ్చడి 

వగైరాల్నీ,  పులుసు లేదా చారునీ, పెరుగునీ కొద్దిగా వడ్డిస్తారు. వడ్డించిన ఈ విస్తరి మెనూకార్డు లాంటిది. ఏవి ఏ

రుచుల్లో  ఉన్నాయో, తెలుసుకుని, కావలసినవి అడిగి వడ్డించుకునేందుకు అతిథికి అవకాశం ఉంటుంది.


             తినేప్పుడు ముందు పప్పు లాంటి కఠిన పదార్థాలు, తరువాత కూర పచ్చడి లాంటి మృదు పదార్థాలు, ఆ

తరువాత పులుసు చారు లాంటి ద్రవ పదార్థాలు, ఆ పైన పెరుగు లేదా మజ్జిగ తిని, బోజనాంతంలో స్వీట్లు తినటం

మన ఆహార సంస్కృతి. ఇప్పుడు మనం స్వీటుతో మొదలు పెట్టి, ఐసుక్రీముతో ముగిస్తున్నాం. పెరుగన్నం తిన్నాక

పాలతో తయారైన ఐసుక్రీము ఎలా తీంటారు? విరుద్ధ పదార్థాలు కావా?


             బంతిభోజనాల్లో వడ్దనంతా పూర్తయ్యాక, గృహస్థు వచ్చి కలుపుకోవాలని కోరటం, భగవన్నామ స్మరణ 

చేసి, పెద్దలు, వృద్ధులూ తినటం మొదలు పెట్టాక అప్పుడు విస్తరిని ముట్టుకోవటం మన ఆహార  సంస్కృతి! 

వడ్డించింది వడ్డించినట్టు తినటం నేటి నాగరికత! మనం ఎప్పుడు లేస్తామా అని చూస్తూ, మన వెనకే రెండో బంతి 

అతిథులు నిలబడి ఉంటారు. అందువల మనమీద ఆహార వత్తిడి పెరుగుతుంది. అలా నిలబడటం మర్యాద కాదు!


             వెనకాల పోలీసులు తరుముతున్నా రన్నట్టు జల్దీభోజనం చేస్తుంటారు కొందరు. బంతిలో మిగతా వాళ్ళు

 కూరలో ఉండగానే ఈ జల్దీ భోజనరాయుళ్ళు సాంబార్‘ని పిలుస్తుంటారు. వడ్డనలో ముందే సాంబారు వచ్చేస్తే, 

ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. హడావిడిగా గుటుకూగుటుకూ మని తినటం వలన భొజనాన్ని ఆస్వాదించే 

అవకాశం కూడా ఉండదు. అలా ఆదరా బాదరాగా తినవద్దంటుంది శాస్త్రం. అలాగని మరీ నిదానంగానూ తినకూడదు.

 జీర్ణశక్తి మందగిస్తుంది.


              చైనీయులు వడ్డనలో ఆఖర్న వేడి టీ కషాయాన్ని గ్లాసుల్లో తెచ్చి ఇస్తారు. తినటానికి ఉపయోగించే

పుల్లల్ని ( చోప్ స్టిక్స్) ఊపుతూ, కిందా పైనా పడేస్తూ ఆడుకోకూడదు. రెండు పుల్లల్నీ వేర్వేరు చేతుల్తో పుచ్చుకో

కూడదు. పళ్ళెం పైకి వంగి ఆహారాన్ని తినాలేగానీ, నోటి దగ్గరకు పళ్ళేం తీసుకెళ్ళకూడదు. వాళ్లవి  నూడుల్స్ తరహా

వంటకాలు కాబట్టి, పుల్లల్తో తినటానికి అనువుగా ఉంటాయి. మన పప్పన్నం అలా తినటం కుదరదు.


               ఫోర్కుని ఎడం చేత్తోనూ, కత్తిని కుడిచేత్తోనూ పుచ్చుకుని మాంసాన్ని కోసి తినటం ఇంగ్లీషువాడి మర్యాద.

ఫోర్కుతో ఆహారాన్ని నోట్లో పెట్టుకోవటాన్ని థాయిల్యాండ్ వాళ్ళు తప్పుపడతారు. ఆహారాన్ని చెంచాతో 

అందుకోవాలి. చెంచాను నోట్లోకి తోసి, నాకి తినటాన్ని యూరోపియన్లు అమర్యాదగా భావిస్తారు. స్టారు హోటలుకెళ్ళి

ఇడ్లీ, అట్టుల్ని కూడా ఫోర్కుతో తినే వాళ్లని చూస్తే, నవ్వొస్తుంది. గోరుతో పోయేదానికి గొడ్డలి వాడటం ఏం గొప్పా?


                ఆహారాన్ని కుడిచేత్తో తుంచుకుని లేదా కలుపుకుని తినటమే మన మర్యాద. అలాగే ఆహార పదార్థాలను 

రెండు చేతులూ ఉపయోగించి తినటాన్ని అన్ని దేశాలవారూ అసహ్యంగానే భావిస్తారు. మనదేశంలోనే ఎడం చేత్తో 

రోటీని మడిచి పుచ్చుకుని కుడిచేత్తో తుంచుకుని తినే అలవాటున్న వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా ఇది భోజన 

సభ్యత కాదనే చెప్పాలి.

          
               చాలా హోటళ్ళలో భోజనబల్ల పైన  పచ్చళ్ళు పొడులూ, చారూ, సాంబారు లాంటి ద్రవ్యాలను ఎవరికి వారే

వడ్డించు కునేలా ఉంచుతారు. వాటిని కొందరు వడ్డించుకునే తీరు పరమ అసహ్యంగా ఉంటుంది. తినే చేత్తోనే గరిటను

 పుచ్చుకోవటం, కంచానికి ఆన్చి వడ్డించుకోవటం చేస్తుంటారు. నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. బంతి

భోజనాలలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా  వడ్డించుకోవటం తినటం అనేవి కనీస మర్యాద. దాన్ని తెలియ

చెప్పటం కూడా అవసరమే! ఇంట్లో తినేప్పుడు కూడా అలాంటి మర్యాదల్నే అలవాటు చేసుకుంటే బయట కూడా

పాటించ గలుగుతారు. సుతారంగా వ్రేళ్ళతో అన్నాన్ని కలుపుకు తినటంలో నాజూకు తనం ఉంది. గోదుమ పిండిని

పిసికినట్టు అన్నాన్ని పిసుక్కొని తినటం చూసే వాళ్లకి ఇబ్బందే! అన్నాన్ని పిసికి కాదు, నమిలి తినమని శాస్త్రం

చెప్తోంది. అలాగే, ఆహారాన్ని నమిలేప్పుడు  పెదాలు మూత పడి ఉండాలి. లేకపోతే చప్పరింత శబ్దం

భోజనమర్యాదల్ని దెబ్బతీస్తుంది. పందికి చప్పరం అనే పేరుంది. అది చప్పుడు చేస్తూ తింటుంది కాబట్టి! మన

భోజనతీరు అది కాదు కదా!


          భోజనం చేశాక ఒక్క మెతుక్కూడా పళ్ళెంలో మిగలకుండా తినటం అనేది అన్నానికి మనం ఇచ్చే గౌరవం. 

జపాను వాళ్ళు పళ్ళెంలో అలా పూర్తిగా తింటే కడుపు నిండలేదేమో అనుకుంటారట. కడుపునిండిందని ప్రకటించ

టానికి చైనా వాళ్ళు గ్లాసు బోర్లించి, ఫోర్కులూ చెంచాల్నీ పళ్ళెంలో పడుకోబెడ్తారట. వంట రుచి ఎలా ఉందో

దాన్ని తిన్న తీరు చెప్తుందని ఆంగ్ల సామెత. ఎక్కువ విస్తళ్లలో ఏది ఎక్కువగా వదిలేయబడి కనిపిస్తుందో అది 

రుచిగా లేదని అర్థం. తిన్న విస్తళ్ళు క్లీనుగా ఉంటే వంట బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క!


             ఆతిథ్యం ఇచ్చిన వారినుద్దేశించి అన్నదాతా సుఖీభవ...అంటాం మనం. కెనడాలో వంట చేసిన వారిని 

సుఖీభవ అని దీవిస్తారు. ‘అన్నదాత’, ‘అన్నకర్త’ లిద్దరినీ సుఖీభవ అనటం ఒక మంచి అలవాటు. వంటలు 

బాగున్నాయని చెప్పటం మర్యాద. రాయవాచకం’ గ్రంథంలో రాయల కాలంనాటి రాచభోజన పద్దతుల 

వర్ణనలున్నాయి. అవి పాశ్చాత్య తరహాలో ఉండవు. విదేశాల్లో రాచమర్యాదలే నాగరికతగా భావించబడుతున్నాయి. 

‘భోజనాల బల్లమీద వేసే బట్ట కనీసం 15 అంగుళాలు దిగి ఉండటం, రాత్రిభోజనాలకు కొవ్వొత్తి వెలిగించటం ఇవి 

యూరోపియన్ సాంప్రదాయాలు. మనవాళ్ళు వెన్నెల రాత్రిని శృంగారానికే గానీ భొజనాలకు ఉపయోగించుకున్నట్టు 

కనిపించదు. వెన్నెట్లో భోజనం కూడా ఒక రసఙ్ఞతే!


              భోజన సమయంలో సెల్ ఫోన్లను నిశ్శబ్ద స్థితిలో ఉంచటం, భోజనాల గదిలో ఎంతమంది ఉన్నా ఎవ్వరూ 

లేనంత నిశ్శబ్దాన్ని పాటించటం, హడావిడి సమాచారం ఉంటే మౌనంగా బయటకు వెళ్ళి మాట్లాడటం, 

మాంసాహారాన్ని తినేప్పుడు నోట్లో వేళ్ళుపెట్టి ఎముక ముక్కల్ని బయటకు తీయటం, నోట్లో మిగిలిన వ్యర్థాన్ని 

పళ్ళెంలోకి ఉమ్ములు వేయటం ఇవన్నీ బంతి భోజనాలలో తప్పనిసరిగా మానుకోవాల్సిన అలవాట్లు. భోజనాన్ని

 మనం మనకోసమే చేస్తున్నా మర్యాదల్ని ఇతరులకోసం పాటించాలి. అది పౌరబాద్యతల్లో ఒకటి. నా ఇష్టం 

అనుకోవటానికి కాదు గదా స్వాతంత్ర్యం వచ్చింది.

Wednesday, 29 October 2014

ఆగమేగాలు :: డా. జి వి పూర్ణచందు

ఆగమేగాలు
డా. జి వి పూర్ణచందు

ఇది ఏమంత ఆగమేగాలమీద చర్చించి నిగ్గు తేల్చాల్సినంత విషయం కానప్పటికీ, వాడకంలో చాలాతరచూ వాడ్తున్న ఒక మంచి తెలుగు జాతీయం కాబట్టి, దీని గురించి కొన్ని ముచ్చట్లు అవసరమే!

మనం చాలా మాటల్ని వాటి అర్థాలు తెలియక పోయినా ఏదో ఒక రీతిగా  ప్రయోగిస్తుంటాం, వీలైతే కొత్త అర్థాల్ని కూడా సృష్టించే ప్రయత్నాలు చేస్తూంటాం. భాష పెరగాలంటే ఈ మాత్రం ప్రయత్నాలు జరగాలి. పండితులు సృష్టించే పదాల కన్నా పామరులు సృష్టించే పదాలకే వాడకం ఎక్కువగా ఉంటుంది. 

ఒక పదాన్ని ఒక అర్థంలో సృష్టించినప్పుడు అది ఆ భాషలోఇమిడిపోయి ఒదిగిపోయేదిగా ఉండాలి.ఒక ఉదాహరణ చెప్తాను- నేపాలీ నిఘంటువులో ‘మసాలా’ గురించి వెదుకుతుంటే కొన్ని కొత్త అర్థాలు కనిపించాయి. ఈ పరీక్షల్లో పాసవటానికి ఏదైనా మసాలా (దగ్గర దారి) ఉందా?” అనే ప్రయోగం వాటిల్లో ఒకటి! “reriyomaa masalaa siddiy - ఈ రేడియోలో మసాలా చచ్చిపోయింది” అంటే, రేడియోలో బ్యాటరీ అయిపోయిందని! కూరకు మసాలా లాగా, రేడియోకి బ్యాటరీ ప్రాణప్రద మైందని అనటం వలన ఒక కొత్త పదం కొత్త అర్థంలో నేపాలీ ‘జాతీయం’ అయ్యింది. ఆగమేగాలు కూడా ఇలా ఏర్పడిన తెలుగు జాతీయమే!

ఆఘమేఘాలు
కొంతమంది కవులు ఆఘ అని ఒత్తు ఘ తోనే ఆఘమేఘ పదాన్ని ఒక అలవాటుగా ప్రయోగించారు. ఆఘమేగాల మీద రావటం అంటే, చాలా వేగంగా రావటమేనని భావం. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ “రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ / రామరామ రాజేశ్వర” అనే కీర్తన అనుపల్లవి “ఆగమేఘ మారుత శ్రీకర/ఆసురేశ మృగేంద్ర వినుత శ్రీ” ఇలా సాగుతుంది.
ఆగమేఘాలు
ఆగమేఘాల్లో ‘ఆగ’ అని ఒత్తు లేని ‘గ’ ప్రయోగం కూడా ఉంది. సంస్కృతార్థంలో దీనికి ఇలా విశ్లేషణ చేయవచ్చు ‘ఆగంతుకం’ అంటే చెప్పాపెట్టకుండా రావటం. అలా వచ్చేది ఆగంతువు. వచ్చేవాడు ఆగంతుకుడు. వచ్చింది ఆగతం. ఆగమేఘాలమీద వచ్చిన మేఘం ఉపయోగపడేదే కాబట్టి, వేగంగా వచ్చే వానాకాలపు మేఘాల్ని ఆగమేఘా లంటారు. అలా వచ్చే వాళ్లని ఆగమేఘాలమీద వచ్చినట్టు భావిస్తారు. వేగంగా, శీఘ్రంగా, వెనువెంటనే రావటాన్ని ఆగమేఘాలమీద రావటం అంటారు. నిఘంటువు లన్నిట్లోనూ కనిపించే విశ్లేషణ కూడా ఇదే!

ఆగమేఘాలు - మరోవిశ్లేషణ
అంతకు మునుపు లేకుండా కొత్తగా వచ్చిన దాన్ని ‘ఆగం’ అంటారు. అందుకే శాస్త్రాన్ని innovative అనే అర్థంలో ‘ఆగమం’ అని పిలుస్తారు. పాతది పోయి కొత్తది రావటాన్ని ‘ఆపాయం’ అంటారు. ఆగమ ఆపాయాలు శాస్త్రాభివృద్ధికీ, శాస్త్ర ప్రమాణాలకూ కారణా లౌతాయి. ఆ వచ్చిన మేఘాలు చాలా ప్రామాణికమైనవనే అంతరార్థం కూడా ఇందులో ఉంది. అంటే, ఆగమేఘాలు ఆగడాలు చేసేవి కాదన్నమాట.

ఆగమేగాలు
సంస్కృతార్థంలో ఈ విశ్లేషణ బాగానే ఉన్నది గానీ, ఒక తెలుగు జాతీయానికి సంస్కృతార్థం ఎందుకు చెప్పుకోవాలి...? ఇతర భాషల్లో ఏర్పడేవి తెలుగు జాతీయాలు కాలేవు కదా! ఆగమేఘాలకు తెలుగు అర్థంలో కూడా ఒకవిశ్లేషణ చేయవచ్చు. పోతనగారు “....ఆగడపలం గడప వైచి వీచీ రేఖలం బో(ద్రోచి కుసుమనారాచు కేళాకూళిం గలజాళు వాసోపనంబుల( బ్రతిఘటించు...” అంటూ ఆగడపలను ప్రస్తావించాడు. ఆగడపలంటే మేఘాల దొంతరలు. ఆకాశంలో ఆగడపలు వచ్చాయంటే ఇవ్వాళో రేపో వానలు కురుస్తాయని రైతులు భావిస్తారు.

ఆగడప ఒక చక్కని తెలుగు మాట. బహుశా ఆగ+అడప= ఆగడప అయి ఉండొచ్చు. అడప అంటే దొంతరగా పేర్చినది. కిళ్ళీలు కట్టటానికి, తాంబూలం వేసుకోవటానికి ఆకుల్ని మధ్య ఈనెలు తీసి, దొంతరగా పేరుస్తారు కాబట్టి, అడప శబ్దం తాంబూలానికి స్థిరపడి ఉండవచ్చు. మేఘాలన్నీ అడపలు (దొంతరలు) తీరి ఉన్నప్పుడు వాటిని ‘ఆగడపలు’ అన్నారు.  ఇక్కడ ‘ఆగ’ శబ్దం మేఘం అనే అర్థంలో  కనిపిస్తుంది. నిఘంటువుల్లో ఎక్కడా ఈ అర్థం లేనప్పటికీ ఆగడపలు మాత్రం ఈ అర్థాన్నే ఇస్తున్నాయి. ఆగమేఘాలు అన్నప్పుడు ఆగ, మేఘ రెండూ ఒకే అర్థంలో పదాలు జంట పదాలుగా కనిపిస్తాయి. తట్టాబుట్టా, నగానట్రా లాంటి జంటపదాలు ఆగమేఘాలు కావచ్చు. ఇది ఒక విశ్లేషణ.దీని ప్రకారం ఆగమేఘాలు అనే పలకాల్సి వుంటుంది.
అడపం అంటే దొంతరలు పేర్చిన తాంబూలం అనే అర్థంలో ఆ తాంబూలం ఇచ్చే వ్యక్తి అడపం అయ్యాడు. వాణిజ ఒప్పందాలూ, కొనుగోళ్ళూ అమ్మకాలు, వివాహ సంబంధాలు  వగైరా ఖాయపరచు కునేందుకు ఇప్పటిలాగా రిజిష్టేషన్ విధానం లేదు కాబట్టి, తాంబూలా లిచ్చి పుచ్చుకునేవాళ్ళు. ఈ నాటికీ తాంబూలానికి ఆ గౌరవం ఉంది. వెయ్యేళ్ళకు పైగా మనకు ఈ సాంప్రదాయం ఉన్నట్టు ప్రాకృత సాహిత్య ఆధారాలను పుల్లెల శ్రీరామచంద్రుడుగారు చూపించారు.

ఒక రాజుగారి పక్షాన ఇతరులతో అటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అధికారం ఉన్నవాడు అడపం గారు. రాయల కాలంలో అడపంగారు ఒక ఉన్నతోద్యోగి. రాజు గారికి ఆంతరంగికుడు. అయన తాంబూలం అందించే వాడని చరిత్రకారులు చెప్తారు. కానీ, దీనికి మరింత ప్రాధాన్యత ఉంది. మరో కోణంలోంచి విశ్లేషణ చేద్దాం:

‘మేగు’ లేదా మ్రేగు శబ్దానికి to smear, be smear. పూయు, దళముగా పూయు, దట్టముగా చరుము, దళసరిగా మెత్తు అనే అర్ధాలు కనిపిస్తాయి. "పెన్నలుపు మించి కందెన మేగినట్టున్ననూనె మెగమున చీకట్లు ముడివడ’ అనే ప్రయోగంలో మేగ శబ్దానికి to surround, ఆవరించు అనే అర్థాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ‘ఆగం’ అంటే మేఘం. దట్టంగా ఆవరించటాన్ని మేగటం అంటారు. ఆగమేగాలంటే అప్పటికప్పుడు పెన్నల్లగా కమ్ముకున్న కారు మబ్బులు. వీటిని ‘క్యుములోనింబస్’ మేఘాలు అంటారు. మండు వేసవిలో శక్తివంతమైన వేగవంతమైన ఇలాంటి కారుమబ్బులు కనిపిస్తుంటాయి. తొలకరికి ఉరుములు మెరుపులతో హడావిడి చేస్తూ, ఆగడపలు వేసుకుంటూ వస్తాయి. సమృద్ధిగా వానలిచ్చి పోషిస్తాయి. ఆ సమయానికి ‘ఆగమేగం’లా వచ్చి ఆదుకున్నాడనేది ఈ జాతీయానికి భావార్థం.

ఇక్కడే మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 1930లో నైజీరియలో జరిగిన తిరుగుబాటులో అహేబీ అనే ఒక స్త్రీ, వలస వాదులపై చేసిన పోరాటానికి గుర్తుగా ఆ భాషలో ఆమెని “ఆగమేగ” అని పిలిచారట. ఆడపులి అని దీని అర్థం. 

నైలూ నుండి కృష్ణదాకా తెలుగు భాషామూలాలు వ్యాపించాయనే సిద్ధాంతానికి ఈ ‘ఆగమేగ జాతీయం’ ఒక సాక్ష్యం. ఆఫ్రికా భాషల్లో ఈ జాతీయాన్ని వేగంగా దూసుకొచ్చి గెలుపు సాధించటం అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు. తెలుగులో కూడా ఆగమేగాలు ఇలానే ఉపయోగిస్తున్నాయి.