Monday 14 July 2014

ప్రేమస్వాతంత్ర్యం :: డా. జి వి పూర్ణచందు

ప్రేమస్వాతంత్ర్యం
డా. జి వి పూర్ణచందు
ప్రేమ స్వాతంత్ర్య సంఘం (ఫ్రీ లవ్ సొసైటీ) అనే సంస్థ ఒకటి స్వాతంత్ర్యోద్యమం తొలినాళ్లలో బాగా విస్తృతంగా పనిచేసేది. చలంగారు బెజవాడలో ఉన్న రోజుల్లో అలాంటి సంస్థ ఒకటి ఇక్కడ పనిచేసేదని చెప్తారు.
పెళ్ళిళ్ళు, కడుపులు, వ్యభిచారాల్లాంటి జంజాటాలకు అతీతమైన ప్రేమని సంస్థ ప్రబోధించేది. అదొక ప్రేమ ప్రపంచం. వ్యక్తిగతమైన స్త్రీపురుష బంధాల్ని కట్టుబాట్ల చట్రంలో బిగించటాన్ని ఉద్యమం వ్యతిరేకించేది. పరిణతి పొందిన స్త్రీ పురుషుల మధ్య భావోద్వేగాల పరమైన సంబంధాల్ని, లైంగిక పరమైన సంబంధాల్ని గౌరవనీయమైనవి గానే సంస్థ పరిగణిస్తుంది. చర్చి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇంగ్లండు కార్యస్థానంగా ప్రారంభమైన ప్రేమ స్వామ్య ఉద్యమం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర మత దేశాలకూ ఇది విస్తరించింది.
ప్రేమించవలసిందిగా వేధించే యాసిడ్ ప్రేమికుడికి, సెక్సు కోసం భార్యని వేధించే భర్తకీ మధ్య మనస్తత్వ పరంగా ఎలాంటి తేడా లేదనీ, వివాహవ్యవస్థ అనేది రేప్ చేసే హక్కులిచ్చేది కాదని ఫ్రీ లవ్ ఉద్యమం’ వాదిస్తుంది. ప్రేమలేని పెళ్ళిళ్ళు రేప్ చేయటం కన్నా ప్రమాదకరమైనవే!
స్త్రీలకుప్రేమస్వాతంత్ర్యం ఉండాలనే లక్ష్యంతో పందొమ్మిదో శాబ్దిలో ఫ్రీ లవ్ఉద్యమం బాగా ఊపులోకొచ్చింది. భూమ్మీద సమస్త సుఖోపభోగాలూ అనుభవించటానికి పెళ్ళి ప్రధాన ఉపకరణం అనీ, అస్థిర ప్రపంచంలో సుస్థిర మైంది వివాహబంధం ఒక్కటేననీభావించటం వలన వివాహవ్యవస్థలో స్త్రీబానిసత్వం పెరిగి పోతోందనే భావన అందరిలోనూ కలిగింది. ఆ సమయానికి తెలుగు నేలమీద రాజా రామ్మోహనరాయి, రఘుపతి వేంకటరత్నం నాయుడు, కందుకూరు వీరేశలింగం ప్రభృతుల ప్రభావం ఎక్కువగా ఉంది. విధవా పునర్వివాహం, దేవదాసీ వృత్తి నిర్మూలన, స్త్రీ స్వేఛ్ఛ లాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. భావ ప్రకటనా స్వేఛ్ఛ కోసం మహిళలు, పురుష సంస్కర్తలూ పోరాటం సాగించారు. స్వాతంత్రోద్యమం కూడా తోడు కావటంతో మహిళలు స్వేఛ్ఛగా బయటకొచ్చి ఉద్యమ బాట పట్టటం కూడా స్త్రీ ఉద్యమానికి తోడయ్యింది.  ఆ విధంగా ‘ప్రేమ స్వాతంత్ర్యోద్య’మాన్ని తెలుగు వారు త్వరగానే అందుకో గలిగారు.  
18వ శతాబ్దిలో మహిళా ఉద్యమం (ఫెమినిజం), 19వ శతాబ్దిలో ప్రేమ స్వాతంత్ర్యోద్యమం మొదలయ్యాయి. పెళ్ళి అనేది మహిళా నిర్మూలనా(annihilation of woman)కార్యక్రమంగా మారిపోతోందని ఈ ఉద్యమం హెచ్చరించింది. తన కిష్టమైన వ్యక్తిని పెళ్ళాడే హక్కు, తన ఇష్టంతోనే భర్తైనా సరే సెక్సుని పొందే హక్కు, తనకు పిల్లలు కావాలో వద్దో నిర్ణయించుకునే హక్కు, ఇలాంటివి ఉన్నప్పుడే పెళ్ళి అనేది సౌఖ్యదాయకం అవుతుంది. కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం, పురుషుడు ఆమెని దానం స్వీకరించటం, స్త్రీని పురుషుడికి చట్టబద్ధంగా అప్పగించటాల వలన మాత్రమే వివాహ వ్యవస్థ పవిత్రమైందనటం సరికాదు. స్త్రీ పురుషు లిద్దరికీ స్వాతంత్ర్యం కావాలి. ఇష్టం అయిన వ్యక్తిని ప్రేమించటం, తను ప్రేమించే, తనను ప్రేమించే వ్యక్తితో కలిసి జీవించటం ప్రాథమిక హక్కు కావాలని ఈ ప్రేమ స్వాతంత్ర్యోద్యమం కోరింది.
కానీ, కాలక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం స్త్రీల చేతుల్లోంచి పురుషుల చేతుల్లోకి మారిపోయింది.  చివరికి అది గే-సెక్స్(స్వలింగ సంపర్కం)  మరియూ Gay rights కోసం పోరాడే ఉద్యమంగా మారిపోయింది.
కాల వైపరీత్యమే అనండి, లేక తప్పనిసరి పరిణామమే అనండి... వివాహ వ్యవస్థ విడాకుల వ్యవస్థగా మారింది. నచ్చిన వాడితో కలిసి జీవించటానికి సహజీవనం అనే ముద్దు పేరు స్థిరపడింది. దీన్ని domestic partnership అంటున్నారిప్పుడు. ఇంట్లోజరిగితే శృంగారం, బయట జరిగితే వ్యభిచారం అనే ధోరణి ప్రబలింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ప్రతి జంటా తమది సహజీవనం అంటే చట్టం కూడా నోరెళ్ళ బెట్టే రోజులు ముందున్నాయి.మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రేమ ఒక నిషిద్ధ పదార్ధంగా మారిపోయేంతగా ఇలా వెర్రి పోకడలు పోతోంది. ఆ దుష్ట ఫలాలు మనకూ బాగానే పండుతున్నాయి.
 ప్రేమ పెళ్ళిళ్ళు గానీ, పెద్దలు చేసిన పెళ్ళిళ్లు గానీ, చాలావరకూ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోవటానికి కారణాల గురించి ఆలోచించక పోతే మేథావులు పెద్ద తప్పు చేసిన వారౌతారు. ముఖ్యంగా పెళ్ళికి సిద్ధంగా ఉన్న జంట తమను తాము మూల్యాంకనం చేసుకుని తమలో ఉన్న ప్రేమ గుణాలకు మార్కులు వేసుకోవాలి. కనీసం యాబై మార్కులు దాటిన వాళ్ళు తమ ప్రేమ గుణాలను పెంచుకుని అప్పుడు ప్రేమకు, ఆ తరువాత పెళ్ళికీ తలపడాలి. దంపతులు కాగోరేవారికి ఈ విషయాన్ని తప్పకుండా తెలియ జెప్పాలి.
 ‘భావోద్వేగ పరమైన అవసరాలు (emotional needs) ప్రేమ ముసుగులో ఆవహించినప్పుడు అది ప్రేమ పరిథి దాటిపోయి, కేవలం అవసరం గడుపుకోవటంగా మారిపోతుంది. అవసరం లేదనిపించిన రోజు ప్రేమకు తాత్కాలికంగా తెరపడ్తుం దన్నమాట! పైన చెప్పుకున్న Emotional needs అనేవి ప్రేమకు ప్రాతిపదిక లైనప్పుడు మగాడు తన అవసరం తీర్చవలసిన బాధ్యత  తనను ప్రేమించే వ్యక్తిదే ననే భావిస్తాడు. “నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టైతే నన్ను ఆపకు... నేను చెప్పినట్టు చెయ్యి... నా చెప్పుకింద తేలులా పడి ఉండు...” అనే మాటలు మొదలౌతాయి. చివరికి ‘ప్రేమ స్వాతంత్ర్యం’ అనేది ప్రేమ బానిసత్వం అవుతుంది.
మానసిక శాస్త్రవేత్తలు దీన్ని, ఆధునిక సమాజపు పోకడలలో ఒక రుగ్మతగా భావిస్తారు. ఇందుకు తెలుగు నేల మినహాయింపు కాకపోవటమే ఆందోళన చెందాల్సిన విషయం. భావోద్వేగాల సమతుల్యత (emotional equilibrium) ఉన్నప్పుడే ప్రేమ బలంగా, స్థిరంగా ఉంటుంది. ‘ఇది కావాలి’ అనే కోరిక బలంగా ఉన్నప్పుడు ‘ఇది ఇవ్వాలనే’ కోరిక కూడా అంతే బలంగా అవతలి వ్యక్తిలో కూడా ఉన్నప్పుడే సమతుల్యత నిలబడుతుంది. లేకపోతే ఏకపక్షంగా మారిపోయి చివరికి  పురుషుడి ప్రేమ నియంతృత్వానికి స్త్రీలు లొంగి పోవాల్సి వస్తుంది. మళ్ళీ బానిసత్వానికే బలి కావాల్సి రావటంతో విడాకులకు సిద్ధపడటం తప్పనిసరి అవుతుంది. ‘నాఅవసరం ఒక్కటి కూడా తీరలేదు’ అనే అసంతృప్తి ఇద్దరిలో ఎవరికి వున్నా అందులో దాంపత్య శోభ కనిపించదు. ప్రేమికులం అని ఘనంగా చెప్పుకునేవారు ఇద్దరి ప్రేమలలో సమతుల్యత గురించి పెళ్ళికి ముందే ఆలోచించక పోతే దాంపత్యాలు మురిగి పోతాయి.
 “ప్రేమ - ఋజుమార్గాన (positively motivated) ఉన్నప్పుడు, love అనేది మిమ్మల్ని lovable చేస్తుంది” అంటుంది మానస శాస్త్రం. అనేక నెలలుగా ప్రేమించుకుని, పెద్దల్ని ఎదిరించి పోరాడి పెళ్ళి చేసుకుని మూడో నెలకే విడాకులో, పెటాకులో తప్పని పరిస్థితి ఎక్కువమందిలో వస్తున్నదంటే నిజమైన ప్రేమ విలువ తెలిసే స్థాయిలో వాళ్ల ప్రేమ సాగలేదనే అర్థం. ప్రజాస్వామ్యంలాగానే ప్రేమ స్వామ్యం కూడా వక్రమార్గాన పడితే అది ప్రేమ నియంతృత్వానికి దారి తీస్తుంది.

సాధారంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ నిజమైన ప్రేమ కాదనే భావిస్తారు. ప్రేమించే తత్వం ఉన్నవారు పిపీలకాది పర్యంతం సమస్తాన్ని ప్రేమించే గుణం కలిగి ఉండాలి. కేవలం ఫలానా అమ్మాయినో లేక ఫలానా అబ్బాయినో మాత్రమే ప్రేమించేట్టుగా ఉండరు. ప్రేమించే గుణం ఎంత ఉందనేది ప్రేమించటానికి అర్హతని నిర్ణయించే ఒక కొలబద్ద. ఎవరికి వారే ఆ కొలబద్దతో తమను తాము విశ్లేషణ చేసుకోవటం మొదట జరగాలి. అదే జరిగితే విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా కలిసి పడగ్గదికి వెళ్ళగలుగుతారు.